"జి-20 శిఖరాగ్ర సమావేశానికి విచ్చేస్తోన్న ప్రపంచ నాయకులను స్వాగతిస్తూ శుక్రవారం రాజధానీ నగరం వెలిగిపోతుండగా, దిల్లీకి ఒక వారగా నివసించేవారికి మాత్రం ప్రపంచం చీకటిగా మారింది: నిర్వాసిత రైతులు, ప్రస్తుత యమునా నది వరద బాధితులు కంటికి కనిపించకుండా పోయారు. వారిని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఉన్న తాత్కాలిక నివాసాలకు దూరంగా, నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతాలకు తరలించి, మరో మూడు రోజులపాటు కనిపించకుండా అక్కడే దాగివుండాలని చెప్పారు.

"మాలో కొంతమందిని పోలీసులు బలవంతంగా తరలించారు. 15 నిముషాల్లోగా ఖాళీ చేయకపోతే మమ్మల్ని అధికారబలంతో బలవంతంగా అక్కడినుండి తొలగిస్తామని మాతో చెప్పారు," అని హీరాలాల్ PARIతో అన్నారు.

ఆ అటవీ ప్రాంతంలో ఎత్తుగా పెరిగివున్న గడ్డిలో పాములు, తేళ్ళు వంటి ప్రమాదకరమైన విషజీవులు దాగివున్నాయి. "మా కుటుంబాలకు విద్యుత్తు గానీ, నీరు గానీ లేవు. ఎవరినైనా విషజీవులు కొరకటమో కాటేయటమో చేస్తే ఎటువంటి వైద్య సహాయం కూడా అందుబాటులో లేదు," అంటూ ఒకప్పుడు గౌరవనీయుడైన రైతుగా జీవించిన హీరాలాల్ పేర్కొన్నారు.

*****

తన కుటుంబానికి చెందిన వంట గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్ళడానికి హీరాలాల్(40) పరుగెత్తుకొచ్చారు. ఇంటిలోకి నల్లని పాముల్లాంటి నీళ్ళ ప్రవాహం ఉధృతంగా ముంచుకొస్తుండటంతో అయన ఎలాంటి అవకాశాలనూ తీసుకోదలచలేదు. ఆయన ఇల్లు దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు దగ్గరలో ఉన్న బేలా ఎస్టేట్‌లో ఉంది.

అది జులై 12, 2023 నాటి రాత్రి. రోజుల తరబడి కురిసిన వర్షాల వలన యమునా నది పొంగి పొరలటంతో, దిల్లీలోని ఆ నది ఒడ్డున నివసించే  హీరాలాల్ వంటివాళ్ళు ఉన్నపాటున అక్కడి నుంచి పరుగులుతీయాల్సివచ్చింది.

మయూర్ విహార్‌లోని యమునా పుస్తా ప్రాంతంలో 60 ఏళ్ళ చమేలీ (గీత అనే పేరు కూడా ఉంది) కొత్తగా తల్లి అయిన తన పొరుగింటి ఆమె నెల వయసు పాపాయి రింకీని హడావుడిగా ఎత్తుకున్నారు. భయపడిపోయిన మేకలను, జోగుతోన్న కుక్కలనూ తమ భుజాలపై మోసుకొని వెళ్తోన్న మనుషులు ఇంతలోనే ఇంకా ఎన్నిటినో కోల్పోయారు. ఉధృతంగా పారుతోన్న నీటిలో తమ వస్తువులన్నీ కొట్టుకుపోవడానికి ముందే ఆ అభాగ్యులు కొన్ని పాత్రలనూ బట్టలనూ రక్షించుకోగలిగారు.

"తెల్లారేసరికల్లా ఎక్కడ చూసినా నీళ్ళే. మమ్మల్ని రక్షించేందుకు పడవలు లేవు. జనం ఫ్లైఓవర్లవైపూ, ఎక్కడ పొడి నేల కనిపిస్తే అక్కడికి పరుగులు తీశారు," బేలా ఎస్టేట్‌లో హీరాలాల్ పొరుగింటివారైన శాంతి దేవి (55) అన్నారు. "మా మొదటి ఆలోచన, మా పిల్లల్ని సురక్షితంగా ఉంచటం; ఆ ప్రవహిస్తోన్న మురికి నీళ్ళలో చీకట్లో కనిపించని పాములూ, ప్రమాదకర జీవులూ ఉండివుండొచ్చు."

తమ ఆహారం, పిల్లల బడి పుస్తకాలూ నీటిపై తేలుతుండటాన్ని ఆమె నిస్సహాయంగా చూశారు. "25 కిలోల గోధుమలూ, బట్టలూ ప్రవాహంలో కొట్టుకుపోయాయి..."

ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత, నిరాశ్రయులై, గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఏర్పాటుచేసుకున్న తాత్కాలిక నివాసాలలో ఉంటోన్న వీరు PARIతో మాట్లాడారు. " ప్రశాసన్ నే సమయ్ సే పహలే జగహ్ ఖాలీ కర్నే కీ చేతావనీ నహీఁ దీ. కపడే పహలే సే బాంధ్ కే రఖే థే. గోద్ మే ఉఠా-ఉఠాకర్ బకరియాఁ నికలీఁ... హమ్నే నావ్ భీ మాంగీ జాన్వరోఁ కో బచానే కే లియె, పర్ కుఛ్ నహీ మిలా (ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం కూడా సకాలంలో హెచ్చరిక చేయలేదు. మా బట్టలను ముందే మూటకట్టుకున్నాం. సాధ్యమైనన్ని మేకల్ని రక్షించుకోగలిగాం, మా జంతువులను రక్షించుకునేందుకు పడవల కోసం అడిగాం కానీ సహాయమేమీ రాలేదు)," ఆగస్ట్ ప్రారంభంలో మాట్లాడుతూ అన్నారు హీరాలాల్.

Hiralal is a resident of Bela Estate who has been displaced by the recent flooding of the Yamuna in Delhi. He had to rush with his family when flood waters entered their home in July 2023. They are currently living under the Geeta Colony flyover near Raj Ghat (right) with whatever belongings they could save from their flooded homes
PHOTO • Shalini Singh
Hiralal is a resident of Bela Estate who has been displaced by the recent flooding of the Yamuna in Delhi. He had to rush with his family when flood waters entered their home in July 2023. They are currently living under the Geeta Colony flyover near Raj Ghat (right) with whatever belongings they could save from their flooded homes
PHOTO • Shalini Singh

ఇటీవల దిల్లీలోని యమునా నదికి వచ్చిన వరదల్లో నిరాశ్రయులైన బేలా ఎస్టేట్ నివాసి హీరాలాల్. జులై, 2023లో వరద నీరు తమ ఇంటిని ముంచెత్తడంతో ఆయన తన కుటుంబంతో సహా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సివచ్చింది. వరద నీటినుంచి రక్షించుకోగలిగిన కొద్దిపాటి వస్తువులతో వారిప్పుడు రాజ్ ఘాట్ (కుడి) దగ్గర ఉన్న గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద నివాసముంటున్నారు

Geeta (left), holding her neighbour’s one month old baby, Rinky, who she ran to rescue first when the Yamuna water rushed into their homes near Mayur Vihar metro station in July this year.
PHOTO • Shalini Singh
Shanti Devi (right) taking care of her grandsons while the family is away looking for daily work.
PHOTO • Shalini Singh

తన పొరుగువారి నెల వయసు పాపాయి రింకీని ఎత్తుకొని ఉన్న గీత (ఎడమ). ఈ ఏడాది జులై నెలలో మయూర్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గరలో తాము నివాసముంటోన్న ఇళ్ళను వరద నీరు ముంచెత్తినపుడు గీత పరుగెట్టి వెళ్ళి ఈ పాపను రక్షించారు. పని కోసం వెతుక్కుంటూ తన కుటుంబం బయటకు వెళ్ళినపుడు, మనవల సంరక్షణను చూసుకుంటోన్న శాంతి దేవి (కుడి)

ఇప్పటికి దాదాపు రెండు నెలల నుంచీ హీరాలాల్, శాంతి దేవిల కుటుంబాలు గీతా కాలనీ ఫ్లైఓవర్ క్రింద నివసిస్తున్నాయి. ఫ్లైఓవర్ కింద ఉన్న తమ తాత్కాలిక నివాసాలలో కనీస అవసరమైన విద్యుత్ కోసం - రాత్రివేళల్లో ఒక బల్బ్ వెలగటం కోసం - వాళ్ళు వీధి లైట్ల నుంచి విద్యుత్‌ను తీసుకోవాల్సివస్తోంది. అక్కడికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్యాగంజ్‌లోని ఒక వీధి కుళాయి నుంచి 20 లీటర్ల తాగునీటిని హీరాలాల్ ప్రతి రోజూ తన సైకిల్‌పై మోసుకొస్తున్నారు.

తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవడానికి అవసరమైన ఎటువంటి పరిహారం వారికి దక్కలేదు. ఒకప్పుడు యమునా నది ఒడ్డున పంటలు పండించిన గౌరవనీయుడైన రైతు హీరాలాల్, ప్రస్తుతం కట్టడాల వద్ద కూలీగా పనిచేస్తున్నారు. వారి పొరుగువారు, శాంతి దేవి భర్త అయిన రమేశ్ నిషాద్ (58) కూడా గతంలో రైతుపని చేసినవారే. ఇప్పుడాయన రద్దీగా ఉండే రహదారిపై కచోరీలు (ఒక చిరుతిండి) అమ్మేవారి పొడుగాటి వరుసలో నిలబడుతున్నారు.

కానీ జి-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం, దిల్లీ సన్నద్ధమవుతున్నందున వారి ఈ తక్షణ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. రానున్న రెండు నెలల వరకూ అక్కడినుంచి తొలగిపోవాలని హాకర్లను ఆదేశించారు. "కనిపించవద్దు," అని అధికారులు అంటున్నారు. "మేమెలా తింటాం?" అడిగారు శాంతి. "ప్రపంచానికి ప్రదర్శించే పేరుతో, మీరు మీ స్వంత ప్రజల ఇళ్ళనూ, వారి జీవనోపాధినీ నాశనం చేస్తున్నారు."

జులై 16న దిల్లీ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు రూ. 10,000ను సహాయంగా ప్రకటించింది. ఆ పరిహారం మొత్తాన్ని వినగానే హీరాలాల్ నమ్మలేకపోయారు. "ఇది ఏ రకమైన పరిహారం? దేన్ని ఆధారం చేసుకొని వారు ఈ అంకెకు వచ్చారు? మా జీవితాల విలువ కేవలం 10,000 రూపాయలేనా? ఒక మేక ఖరీదు 8,000-10,000 (రూపాయల) వరకూ ఉంటుంది. తాత్కాలికంగా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా 20,000-25,000 (రూపాయలు) వరకూ ఖర్చవుతుంది."

అనేకమంది లాగానే ఒకప్పుడు ఇక్కడ నివసించినవారు, ఇక్కడ భూమిని సాగుచేసినవారు ప్రస్తుతం మజ్దూరి (రోజువారీ కూలిపని), రిక్షాలు లాగటం చేస్తున్నారు; లేదంటే ఇళ్ళల్లో పనుల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. "ఎవరెంత నష్టపోయారో నిర్ణయించడానికి ఒక సర్వేలాంటిది ఏమైనా జరిగిందా?" అని వారు ప్రశ్నిస్తున్నారు.

Several families in Bela Estate, including Hiralal and Kamal Lal (third from right), have been protesting since April 2022 against their eviction from the land they cultivated and which local authorities are eyeing for a biodiversity park.
PHOTO • Shalini Singh

హీరాలాల్, కమల్ లాల్ (కుడి నుంచి మూడవవారు)లతో సహా బేలా ఎస్టేట్‌కు చెందిన అనేక కుటుంబాలు, తాము సాగుచేసిన భూముల నుండి తమను వెళ్ళగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ, 2022 ఏప్రిల్ నెల నుంచి నిరసన తెలియచేస్తున్నాయి. ఒక జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) పార్క్ నిర్మాణం కోసం ఆ భూములపై స్థానిక అధికారులు కన్నేశారు

Most children lost their books (left) and important school papers in the Yamuna flood. This will be an added cost as families try to rebuild their lives. The solar panels (right) cost around Rs. 6,000 and nearly every flood-affected family has had to purchase them if they want to light a bulb at night or charge their phones
PHOTO • Shalini Singh
Most children lost their books (left) and important school papers in the Yamuna flood. This will be an added cost as families try to rebuild their lives. The solar panels (right) cost around Rs. 6,000 and nearly every flood-affected family has had to purchase them if they want to light a bulb at night or charge their phones.
PHOTO • Shalini Singh

చాలామంది పిల్లలు తమ పుస్తకాలను (ఎడమ), పాఠశాలకు సంబంధించిన ముఖ్యమైన కాగితాలను యమున వరదలలో పోగొట్టుకున్నారు. తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవాలని ప్రయత్నిస్తోన్న వారి కుటుంబాలకు ఇది మరో అదనపు ఖర్చు. సుమారు రూ. 6,000 ఖరీదు చేసే సోలార్ ప్యానెళ్ళు (కుడి). దాదాపు ప్రతి వరద బాధిత కుటుంబం రాత్రిపూట ఒక బల్బ్ వెలిగించుకోవాలనుకున్నా, వారి ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవాలనుకున్నా వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది

ఆరు వారాల తర్వాత వరద నీరంతా వెనుకకు తీసింది, కానీ ప్రతి ఒక్కరికీ పరిహారం మాత్రం దక్కలేదు. ఇందుకు కారణాలుగా మితిమీరిన రాతపని, తిరుగుడు ప్రక్రియలను నివాసితులు నిందించారు: “మొదట వాళ్ళు మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ పేపర్లు, ఫోటోలు తెమ్మని చెప్పారు; ఆపైన వారు రేషన్ కార్డులు అడిగారు…” అని కమల్ లాల్ అన్నారు. ఆ ప్రాంతంలోని 150కి పైగా కుటుంబాలకు - తప్పించగలిగి ఉండి కూడా తప్పించని మానవ నిర్మిత విపత్తు బాధితులకు - చివరికి డబ్బు వస్తుందో లేదో కూడా అతనికి ఖచ్చితంగా తెలియదు.

ఇంతకుముందు రాష్ట్ర ప్రాజెక్టుల కోసం తమ వ్యవసాయ భూములను పోగొట్టుకొని ఇక్కడ జీవిస్తోన్న 700కు పైగా మాజీ రైతు కుటుంబాలకు పునరావాసం కల్పించడం కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగలేదు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ప్రయత్నించే అధికారులతో వారికి నిత్యం పోరాటమే. అది 'అభివృద్ధి' కావొచ్చు, స్థానభ్రంశం చెందించడం, విపత్తు లేదా ప్రదర్శన- ఏదైనా కావొచ్చు, అటువంటి విషయాలన్నిటిలో ఎప్పుడూ నష్టపోతున్నది ఈ రైతులే. పరిహారం కోసం అడుగుతోన్న బేలా ఎస్టేట్ మజ్దూర్ బస్తీ సమితిలో కమల్ (37) సభ్యులు. "మా నిరసనలను ఈ వరదలు ఆపేశాయి," ఆగస్టు మాసపు ఆర్ద్రతకు పడుతోన్న చెమటలను తుడుచుకుంటూ అన్నారతను.

*****

దిల్లీ 45 ఏళ్ళ తర్వాత మళ్ళీ మునిగిపోతున్నది. 1978లో యమున దాని అధికారిక భద్రతా స్థాయి కంటే 1.8 మీటర్లు పెరిగి 207.5 మీటర్లను తాకింది; ఈ సంవత్సరం జూలైలో ఇది 208.5 మీటర్లను దాటింది. ఇది ఆల్-టైమ్ రికార్డ్. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలోని ఆనకట్టలను సకాలంలో తెరవకపోవడంతో పొంగిపోయిన నది దిల్లీని ముంచెత్తింది. ఫలితంగా జీవితాలు, ఇళ్ళు, జీవనోపాధులు నాశనమయ్యాయి. పంటలు, ఇతర నీటి వనరులు కూడా అపారమైన నష్టాన్ని చవిచూశాయి.

1978లో వరదలు వచ్చిన  సమయంలో, దిల్లీలోని ఎన్‌సిటి ప్రభుత్వ నీటిపారుదల మరియు వరద నియంత్రణ విభాగం ఇలా పేర్కొంది: 'దాదాపు రూ. 10 కోట్లు నష్టం జరిగిందని అంచనా. 18 మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.’

Homes that were flooded near Pusta Road, Delhi in July 2023
PHOTO • Shalini Singh

జులై 2023లో దిల్లీలోని పుస్తా రోడ్ వద్ద వరదలో మునిగిపోయిన ఇళ్ళు

Flood waters entered homes under the flyover near Mayur Vihar metro station in New Delhi
PHOTO • Shalini Singh

కొత్త దిల్లీలోని మయూర్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గర ఫ్లైఓవర్ కింద ఉన్న ఇళ్ళను ముంచెత్తిన వరద నీరు

ఈ ఏడాది జులైలో, అనేక రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు వరదలుగా ముంచెత్తిన కారణంగా 25,000మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నష్టపోయినట్టు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్-PIL) పేర్కొంది. యమునా నది ప్రాజెక్ట్: కొత్త దిల్లీ పట్టణ ప్రాంత పర్యావరణం ప్రకారం, క్రమేపీ వరద మైదానాన్ని ఆక్రమిస్తుండటం తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది, "... వరద మైదానంలోని లోతట్టు ప్రాంతాలలో నిర్మించిన నిర్మాణాలను తుడిచివేస్తుంది, తూర్పు దిల్లీని నీటితో ముంచెత్తుతుంది."

యమునా నది ఒడ్డున సుమారు 24,000 ఎకరాల భూమి సాగులో ఉంది, ఒక శతాబ్ద కాలానికి పైగా రైతులు ఈ భూములను సాగుచేస్తున్నారు. వరద మైదానాల్లో గుడి, మెట్రో స్టేషన్, కామన్‌వెల్త్ గేమ్స్ (సిడబ్ల్యుజి) విలేజ్ వంటి కాంక్రీట్ కట్టడాల నిర్మాణం వలన వరద నీరు ఇంకిపోయేందుకు అవసరమైన నేల పూర్తిగా తగ్గిపోయింది. చదవండి: పెద్ద న‌గ‌రం, చిన్న‌రైతులు; ఎండిపోతున్న ఒక న‌ది

"మనం ఏం చేసినా, ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. ఇంతకుముందు వానల, వరదల కాలంలో నీరు అంతటా విస్తరించేది. కానీ ఇప్పుడు (వరదమైదానాల్లో) తక్కువ స్థలం ఉన్నందున అది బలవంతంగా పొంగి ప్రవహించాల్సివచ్చి, ఆ క్రమంలో మమ్మల్ని నాశనం చేస్తోంది," ఈ 2023 వరదల్లో అందుకు మూల్యం చెల్లిస్తోన్న బేలా ఎస్టేట్‌కు చెందిన కమల్ అన్నారు. " సాఫ్ కర్నీ థీ యమునా, లేకిన్ హమేఁ హీ సాఫ్ కర్ దియా (వాళ్ళు యమునను శుభ్రం చేయాల్సివుంది, కానీ బదులుగా యమునే మమ్మల్ని తుడిచిపెట్టేసింది)!"

యమునా కే కినారే వికాస్ నహీఁ కర్నా చాహియే. యే డూబ్ క్షేత్ర్ ఘోషిత్ హై. సిడబ్ల్యుజి, అక్షర్‌ధామ్, మెట్రో, యే సబ్ ప్రకృతి కే సాథ్ ఖిల్వాడ్ హై. ప్రకృతి కో జితనీ జగహ్ చాహియే, వహ్ తో లేగీ. పహలే పానీ ఫైల్‌కర్ జాతా థా ఔర్ అబ్ క్యోంకి జగహ్ కమ్ హై, తో ఉఠ్‌కర్ జా రహా హై, జిస్‌కీ వజహ్ సే నుక్సాన్ హమే హువా హై (యమునకు సమీపంలో ఉన్న వరదమైదాన ప్రాంతాన్ని అభివృద్ధి చేయరాదు. ఆ ప్రాంతం వరదలు వచ్చే ప్రాంతంగా ఇప్పటికే గుర్తింపుపొందింది. వరదమైదానాల్లో సిడబ్ల్యుజి, అక్షర్‌ధామ్, దేవాలయం, మెట్రో స్టేషన్ వంటివాటిని కట్టడమంటే, ప్రకృతితో ఆటలాడటంవంటిది. ఇంతకుముందు నీరు విస్తరిస్తూ వెళ్ళేది, ఇప్పుడు ఖాళీ స్థలం తక్కువగా ఉన్నందున నీటి మట్టం పెరిగిపోవడంతో అది పొంగి ప్రవహించింది. దీనివల్ల మేం నష్టపోయాం)," అంటారు కమల్.

దిల్లీ కో కిస్‌నే దుబాయా (దిల్లీని ముంచేసిందెవరు)? దిల్లీ ప్రభుత్వ నీటిపారుదల మరియు వరద నియంత్రణ విభాగం ప్రతి సంవత్సరం జూన్ 15-25 మధ్య సిద్ధపడి ఉండాల్సింది. వాళ్ళు ఆనకట్ట గేట్లను (సకాలంలో) తెరిచి ఉంటే, నీరు ఇలా వరదలుగా పారేదికాదు. పానీ న్యాయ్ మాంగ్‌నే సుప్రీమ్ కోర్ట్ గయా (నీరు న్యాయం అడిగేందుకు సుప్రీమ్ కోర్టును చేరుకుంది)," అని రాజేంద్ర సింగ్ అన్నారు. ఆయన ఈ మాటలను సరదాగా అనలేదు.

Small time cultivators, domestic help, daily wage earners and others had to move to government relief camps like this one near Mayur Vihar, close to the banks of Yamuna in Delhi.
PHOTO • Shalini Singh

సన్నకారు రైతులు, ఇళ్ళలో పనిచేసేవారు, రోజువారీ కూలీలు, ఇంకా కొంతమంది ఇతరులు దిల్లీలోని యమునా తీరానికి సమీపంలోని మయూర్ విహార్‌ దగ్గర ఉన్న ఇటువంటి ప్రభుత్వ సహాయ శిబిరాలకు తరలివెళ్లాల్సి వచ్చింది

Left: Relief camp in Delhi for flood affected families.
PHOTO • Shalini Singh
Right: Experts including Professor A.K. Gosain (at podium), Rajendra Singh (‘Waterman of India’) slammed the authorities for the Yamuna flood and the ensuing destruction, at a discussion organised by Yamuna Sansad.
PHOTO • Shalini Singh

ఎడమ: వరద బాధిత కుటుంబాల కోసం దిల్లీలో నెలకొల్పిన సహాయక శిబిరం. కుడి: యమునా నది వరదలు, వాటి ద్వారా సంభవించిన విధ్వంసంపై యమునా సంసద్ నిర్వహించిన చర్చాగోష్టిలో ప్రొఫెసర్ ఎ.కె. గోసాయీఁ (వేదికపైన), రాజేంద్ర సింగ్ ('వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా) వంటి నిపుణులు అధికారులను విమర్శించారు

అల్వర్‌కు చెందిన ఈ పర్యావరణవేత్త, 2023 జూలై 24న ‘దిల్లీ వరదలు: ఆక్రమణా లేదా అధికారమా?’ అనే బహిరంగ చర్చలో ప్రసంగిస్తూ, “ఇది ప్రకృతి విపత్తు కాదు. ఇటువంటి అనిశ్చిత వర్షపాతం ఇంతకుముందు కూడా కురిసింది," అని పేర్కొన్నారు. యమునా నదిని కాలుష్యం నుండి రక్షించడానికి ప్రజల చొరవతో ఏర్పడిన యమునా సంసద్ ఈ కార్యక్రమాన్ని దిల్లీలో నిర్వహించింది.

"ఈ సంవత్సరం యమునా నది వలన జరిగినదానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి," అని ఈ చర్చలో పాల్గొన్న డాక్టర్ అశ్వని కె. గోసాయీఁ అన్నారు. ఈయన 2018లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన యమునా మానిటరింగ్ కమిటీలో నిపుణులైన సభ్యులు.

“నీటికి వేగం కూడా ఉంటుంది. కరకట్టలు లేకపోతే నీరు ఎక్కడికి పోతుంది?" ఆనకట్టలకు బదులుగా రిజర్వాయర్లను నిర్మించాలని వాదించే గోసాయీఁ అడిగారు. దిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్‌లో గౌరవాచార్యుడైన ఈయన, 1,500 అనధికార కాలనీలు, వీధి స్థాయి డ్రెయిన్‌లు లేకపోవడం వల్ల మురుగు కాలువల్లోకి నీటిని పంపుతున్నాయనీ, “ఇది వ్యాధులను కూడా తెస్తుంది” అనీ పేర్కొన్నారు.

*****

బేలా ఎస్టేట్ రైతులు ఇప్పటికే వాతావరణ మార్పుల వలన, సాగు ఆగిపోవడం, పునరావాసం లేకపోవడం, తొలగింపుల బెదిరింపుల మధ్య అనిశ్చితితో జీవిస్తున్నారు. చదవండి: ‘ఇదీ రాజధానిలో రైతుల పట్ల వ్యవహరించే తీరు!’. ఇటీవలి వరదలు ఈ నష్టాల పరంపరలో తాజాది.

“4-5 మంది సభ్యులున్న కుటుంబం నివసించడానికి, 10 x 10 జుగ్గీ (తాత్కాలికంగా నిర్మించిన ఇల్లు)ని నిర్మించడానికి 20,000-25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నీరు లోపలికి ప్రవేశించకుండా పరిచే పట్టా ఒక్కదానికే 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటిని కట్టుకోవడానికి కూలీలను పెట్టుకుంటే, వారికి రోజుకు 500-700 (రూపాయలు) చెల్లించాలి. మనమే ఆ పని చేస్తే, మన రోజు కూలీని కోల్పోతాం,” తన భార్యతో పాటు 17, 15, 10, 8 సంవత్సరాల వయస్సు గల నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తోన్న హీరాలాల్ అన్నారు. వెదురు బొంగుల ధర కూడా ఒక్కొక్కటి రూ. 300 ఉందనీ, అటువంటివి తనకు కనీసం 20 అవసరమవుతాయనీ అతను చెప్పారు. తమకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో తెలియని సందిగ్ధంలో నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి.

Hiralal says the flood relief paperwork doesn’t end and moreover the relief sum of Rs. 10,000 for each affected family is paltry, given their losses of over Rs. 50,000.
PHOTO • Shalini Singh
Right: Shanti Devi recalls watching helplessly as 25 kilos of wheat, clothes and children’s school books were taken away by the Yamuna flood.
PHOTO • Shalini Singh

వరద సహాయానికి సంబంధించిన పేపర్ వర్క్ ఎప్పటికీ ముగియదని, పైగా తమకు జరిగిన నష్టం రూ. 50,000 కంటే ఎక్కువ ఉండగా, బాధిత కుటుంబాలకు సహాయంగా ప్రకటించిన రూ. 10,000 మొత్తం చాలా తక్కువగా ఉందనీ హీరాలాల్ చెప్పారు. కుడి: తన కళ్ళ ముందే 25 కిలోల గోధుమలు, బట్టలు, పిల్లల పాఠ్య పుస్తకాలు యమునా నది వరదలో కొట్టుకుపోతుండగా నిస్సహాయంగా చూసిన విషయాన్ని గుర్తుకుతెచ్చుకున్న శాంతి దేవి

The makeshift homes of the Bela Esate residents under the Geeta Colony flyover. Families keep goats for their domestic consumption and many were lost in the flood.
PHOTO • Shalini Singh

గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద బేలా ఎస్టేట్ నివాసితుల కోసం కట్టిన తాత్కాలిక నివాసాలు. తమ ఇంటి అవసరాల కోసం ఈ కుటుంబాలు మేకలను పెంచుకుంటాయి. ఈ వరదలలో వారు చాలా జీవాలను కోల్పోయారు

ఇప్పుడు వారు తమ పశుసంపదను తిరిగి కూడగట్టుకోవాల్సిన ఖర్చు ఉంది. వీరిలో చాలామంది తమ జంతువులను వరదలలో కోల్పోయారు. “ఒక గేదె ధర 70,000 (రూపాయలు) కంటే ఎక్కువగా ఉంటుంది. అది బతికి, పాలు ఇవ్వాలంటే దానికి బాగా తినిపించాలి. మా పిల్లలకు రోజువారీ పాల అవసరాల కోసం, మేం తాగే టీ కోసం పెంచుకునే మేకను కొనడానికి 8,000-10,000 రూపాయలు ఖర్చవుతుంది,” అని ఆయన చెప్పారు.

యమునా నది ఒడ్డున భూయజమానిగా, భూమిని సాగుచేసే వ్యక్తిగా గుర్తింపు సంపాదించడం కోసం చేసిన పోరాటంలో ఓడిపోయిన తర్వాత, తన భర్త సైకిల్‌పై కచోరీలను విక్రయిస్తున్నారని, అయితే రోజుకు రూ. 200-300 కూడా సంపాదించలేకపోతున్నారని హీరాలాల్ పొరుగున ఉండే శాంతి దేవి చెప్పారు. "మీరు అక్కడ మూడు రోజులు, లేదా 30 రోజులు నిలబడినా సరే, పోలీసులు ప్రతి నెలా ఒక్కో సైకిల్‌కు 1,500 రూపాయలు వసూలు చేస్తారు," అని ఆమె పేర్కొన్నారు.

వరద నీరు తగ్గిపోయినా ఇతర ప్రమాదాలు పొంచివున్నాయి: నీటి ద్వారా సంక్రమించే మలేరియా, డెంగ్యూ, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ముప్పును తెస్తున్నాయి. అయితే రోజుకు 100కి పైగా కంటి ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో సహాయక శిబిరాలను తొలగించారు. మేం తనని కలిసినప్పుడు హీరాలాల్ ఎర్రటి కన్నుతో ఉన్నారు. అసలు ధర కంటే అధిక ధర ఇచ్చి కొనుగోలు చేసిన ఒక జత సన్ గ్లాసెస్‌ని ఎత్తి పట్టుకుని: "వీటి అసలు విలువ రూ.50. కానీ డిమాండ్ కారణంగా 200 రూపాయలకు అమ్ముతున్నారు."

అరకొరగా ఉన్నా, ఆ వచ్చే నష్టపరిహారం కోసం ఎదురుచూసే కుటుంబాల తరఫున మాట్లాడుతూ అతను వంకర చిరునవ్వుతో ఇలా అన్నారు, "కథ కొత్తదేమీ కాదు, జనం ఎల్లప్పుడూ ఇతరుల బాధల నుండి లాభం పొందుతారు."

కథనం సెప్టెంబర్ 9, 2023 సవరించబడినది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Shalini Singh

ಶಾಲಿನಿ ಸಿಂಗ್ ಪರಿಯ ಪ್ರಕಟಣಾ ಸಂಸ್ಥೆಯಾದ ಕೌಂಟರ್ ಮೀಡಿಯಾ ಟ್ರಸ್ಟ್‌ನ ಸ್ಥಾಪಕ ಟ್ರಸ್ಟಿ. ದೆಹಲಿ ಮೂಲದ ಪತ್ರಕರ್ತರಾಗಿರುವ ಅವರು ಪರಿಸರ, ಲಿಂಗ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿಯ ಕುರಿತು ಬರೆಯುತ್ತಾರೆ ಮತ್ತು ಹಾರ್ವರ್ಡ್ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯವು ಪತ್ರಿಕೋದ್ಯಮಕ್ಕಾಗಿ ನೀಡುವ ನೀಮನ್ ಫೆಲೋ ಪುರಸ್ಕಾರವನ್ನು 2017-2018ರ ಸಾಲಿನಲ್ಲಿ ಪಡೆದಿರುತ್ತಾರೆ.

Other stories by Shalini Singh
Editor : Priti David

ಪ್ರೀತಿ ಡೇವಿಡ್ ಅವರು ಪರಿಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕರು. ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರಾದ ಅವರು ಪರಿ ಎಜುಕೇಷನ್ ವಿಭಾಗದ ಮುಖ್ಯಸ್ಥರೂ ಹೌದು. ಅಲ್ಲದೆ ಅವರು ಗ್ರಾಮೀಣ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತರಗತಿ ಮತ್ತು ಪಠ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಳವಡಿಸಲು ಶಾಲೆಗಳು ಮತ್ತು ಕಾಲೇಜುಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸುವ ಸಲುವಾಗಿ ಯುವಜನರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli