ఆకలే జలాల్ అలీకి  చేపలు పట్టే వెదురు మావులను ఎలా తయారుచేయాలో నేర్చుకునేలా చేసింది.

ఆయన యువకునిగా ఉన్న రోజుల్లో కూలీ పని చేసుకుని బతికేవారు, కానీ వర్షాకాలంలో ఏ పనీ దొరికేది కాదు. ‘‘వర్షాకాలం అంటే వరి నాట్లు వేసే కొన్ని రోజులు తప్ప వేరే పని ఉండదు," అని ఆయన చెప్పారు.

కానీ అవే రుతుపవనాలు ఆయన నివసించే దరంగ్ జిల్లా, మౌసితా-బాలాబారీలోని కాలువలు, చిత్తడి నేలల్లోకి చేపలను తీసుకొస్తాయి. అందువల్ల చేపలు పట్టే వెదురు మావులకు చాలా ఎక్కువ గిరాకీ ఉంటుంది. “నేను చేపలు పట్టే వెదురు మావులను ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాను, ఆ రకంగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నీకు ఆకలిగా ఉన్నప్పుడు, కడుపులోకి ఇంత ఆహారాన్ని పంపే సులభమైన దారి కోసం ఆలోచిస్తావు,” నవ్వుకుంటూ అన్నారు ఆ 60 ఏళ్ళ వృద్ధుడు..

ఈ రోజున జలాల్, నీళ్ళున్న చోట రకరకాల చేపలను పట్టే సెపా, బాయిర్, బొస్న లాంటి దేశవాళీ వెదురు మావులను తయారుచేయడంలో చేయితిరిగిన వ్యక్తి. ఆయన అస్సామ్‌లోని మౌసితా-బాలాబారీ చిత్తడి నేలల వెంట ఉన్న పుబ్-పదోఖాత్ గ్రామంలోని తన ఇంటిలోనే వాటిని తయారుచేస్తారు.

"కేవలం రెండు దశాబ్దాల క్రితం, మా గ్రామంతోపాటు సమీప గ్రామాల్లోని దాదాపు ప్రతి ఇంటివాళ్ళూ చేపలు పట్టేందుకు [వెదురు] మావులను ఉపయోగించేవాళ్ళు. అప్పట్లో వెదురు మావులు, లేదా చేతితో తయారుచేసిన శివ్ జాల్‌ తోనే చేపలు పట్టేవాళ్ళు." ఆయన స్థానికంగా టోంగీ జాల్ లేదా ఝెత్కా జాల్ అని కూడా పిలిచే వలల గురించి చెబుతున్నారు. అవి నాలుగు మూలలను వెదురు కర్రలతో లేదా తీగలతో జోడించిన చతురస్రాకారపు వలలు.

స్థానికంగా చేపలు పట్టే వెదురు మావులకు వాటి ఆకారం ప్రకారం పేరు పెడతారు: “ సెపా దీర్ఘచతురస్రాకారంలోని డోలులా ఉంటుంది. బాయిర్ కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది, అయితే ఇది ఇంకా ఎక్కువ పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. డార్కి ఒక దీర్ఘచతురస్రాకార పెట్టెలా ఉంటుంది,” అని జలాల్ వివరించారు. దుయెర్ , దియర్ , బొయి ష్ణో మావులను పారే నీళ్ళలో అమరుస్తారు. వీటిని ఎక్కువగా నీరు నిలిచే వరి, జనపనార పొలాల్లో, చిన్న కాలువలు, బురద నేలలు, చిత్తడి నేలలు లేదా నదీ సంగమాలలో అమరుస్తారు.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: అస్సామ్‌లోని మౌసితా-బాలాబారీ చిత్తడి నేలల వెంట పుబ్-పదోఖాత్ గ్రామంలోని తన ఇంటి ప్రాంగణంలో చేపలు పట్టే మావులను పరిశీలిస్తున్న జలాల్. దీర్ఘచతురస్రాకారంలో ఉండే మావుని సెపా అంటారు. ఆయన చేతుల్లోని మావుని బాయిర్ అంటారు. కుడి: చేపలు మావులోకి ప్రవేశించడానికి వీలుగా చిక్కగా ముడులువేసిన ప్రవేశమార్గాన్ని చూపుతోన్న జలాల్. సంప్రదాయంగా చేపలు పట్టే వెదురు మావులలో ప్రవేశ మార్గాన్ని పారా లేదా ఫారా అంటారు

అస్సామ్‌లోని బ్రహ్మపుత్ర లోయ - తూర్పున శదియా నుంచి పశ్చిమాన ధుబురి వరకు - నదులు, కాలువలు, చిత్తడి నేలలను నదులతో కలిపే కయ్యలు, వరద మైదాన సరస్సులు, సహజంగా ఏర్పడిన అసంఖ్యాకమైన చెరువులతో నిండి ఉంటుంది. ఈ నీటి వనరులలో స్థానిక ప్రజలు చేపలను పట్టి జీవనోపాధిని పొందుతున్నారు. అస్సామ్‌లోని మత్స్య పరిశ్రమ ద్వారా 35 లక్షలకు పైగా ప్రజలు ఉపాధి పొందుతున్నారని హ్యాండ్‌బుక్ ఆన్ ఫిషరీస్ స్టాటిస్టిక్స్ 2022 పేర్కొంది.

మొసురి జాల్ (చిన్న జాలీ వల), యంత్రంతో నడిచే విసురు వలల వంటి వాణిజ్యసంబంధమైన చేపల వలలు ఖరీదైనవి; ఇవి అతిచిన్న చేపలను కూడా పట్టుకుని, ప్లాస్టిక్ వ్యర్థాలను నీళ్ళలో వదులుతాయి కాబట్టి, జలచరాలకు ప్రమాదకరమని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. దానికి భిన్నంగా స్థానికంగా లభించే వెదురు, పేము, జనపనారతో తయారుచేసే దేశవాళీ మావులు సుస్థిరమైనవి, స్థానిక పర్యావరణ వ్యవస్థకు అనుగుణమైనవి - అవి నిర్దిష్ట పరిమాణంలోని చేపలను మాత్రమే పట్టుకుంటాయి కాబట్టి వృధా అనేది ఉండదు.

వాణిజ్యసంబంధమైన వలలతో అతిగా చేపలను పట్టడం వల్ల పర్యావరణ వ్యవస్థ విధ్వంసం జరుగుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఐసిఎఆర్-సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌-కు చెందిన ఒక నిపుణుడు తెలిపారు.

వరదలు వచ్చినప్పుడు ఒండ్రుమట్టి కొట్టుకుపోవడంతో సహజమైన చిత్తడి నేలల, బురద నేలల పరిమాణం తగ్గిపోతోంది- ఇప్పుడు వాటిలో నీరు తక్కువగా ఉండటం వలన తక్కువ చేపలు పడుతున్నాయని అతను చెప్పారు. "గతంలో, నా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మపుత్రలోకి నీరు ప్రవహించడాన్ని మీరు చూడగలిగేవారు. అప్పుడు నేను నీట మునిగిన పొలాల్లోని సందుల వెంబడి మట్టి పోసి, మట్టమైన ప్రవాహాలను సృష్టించి, చేపలు పట్టే మావులను అమర్చేవాణ్ని," మత్స్యకారుడు ముక్సెద్ అలీ చాలా బాధతో అన్నారు. ఆధునిక వలలు కొనే స్తోమత లేకపోవడంతో బాయిర్ల పై ఆధారపడినట్టు 60 ఏళ్ళు నిండిన ఆ వృద్ధుడు చెప్పారు.

"ఆరేడు సంవత్సరాల క్రితం మాకు చాలా చేపలు పడేవి. కానీ ఇప్పుడు నా నాలుగు బాయిర్ల లో కలిపి అరకిలో చేపలు కూడా పడడం లేదు," అని తన భార్యతో కలిసి దరంగ్ జిల్లాలోని నెం.4 ఆరిమారి గ్రామంలో నివసిస్తోన్న ముక్సెద్ అలీ చెప్పారు.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: నెం. 4 ఆరిమారి గ్రామంలోని తన ఇంటి వద్ద డర్కీలను చూపుతున్న ముక్సెద్ అలీ. ఆయన చేపలను అమ్ముతూ, సమీపంలోని పాఠశాలను శుభ్రంచేసే పనిలో ఉన్న భార్యకు సహాయపడతారు. కుడి: ముందురోజు రాత్రి తాను ఏర్పాటు చేసిన వెదురు మావులలో ఒకదాన్ని తనిఖీ చేస్తున్న ముక్సెద్ అలీ. గత మూడు సంవత్సరాల నుంచి వలల్లో పడే చేపలు తగ్గిపోయాయి. కొన్నిసార్లు ఆయనకు తన నాలుగు మావులలో కలిపి కేవలం అర కిలో చేపలు మాత్రమే దొరుకుతాయి

*****

అస్సామ్‌లో విస్తారంగా - బ్రహ్మపుత్ర లోయలో 166 సెం.మీ., బరాక్ లోయలో 183 సెం.మీ. - వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు ఏప్రిల్ చివరలో ప్రారంభమై అక్టోబర్ వరకు కొనసాగుతాయి. జలాల్ ఈ కాలానికి అనుగుణంగా పనిచేస్తారు. “నేను జొష్టి మాస్‌ [మే మధ్య]లో చేపల మావులను తయారుచేయడం ప్రారంభిస్తాను, ప్రజలు ఆషాఢ్ మాస్ [జూన్ మధ్యలో] నుంచి బాయిర్‌ల ను కొనడం ప్రారంభిస్తారు. కానీ గత మూడు సంవత్సరాలుగా, తక్కువ వర్షపాతం కారణంగా ప్రజలు మామూలుగా ఈ సమయంలో కొన్నట్టు కొనడం లేదు." అని ఆయన తెలిపారు.

అస్సామ్‌లో ఉష్ణోగ్రతలు పెరగుతాయనీ, వార్షిక వర్షపాతం తగ్గడం కారణంగా విపరీతమైన వరదలు సంభవిస్తాయనీ 2023లో ప్రపంచ బ్యాంకు ప్రచురించిన ఒక నివేదిక చెప్తోంది. వాతావరణ మార్పు నీటి వనరులలో అవక్షేపణను కూడా పెంచుతుంది. దీని వల్ల నీటి మట్టం తగ్గిపోయి అందులో ఉండే చేపల సంఖ్య కూడా తగ్గిపోతోంది.

1990 నుంచి 2019 వరకు, వార్షిక సగటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 0.049, 0.013 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. రోజువారీ సగటు ఉష్ణోగ్రత శ్రేణి 0.037 డిగ్రీల సెల్సియస్ పెరిగింది, ఈ కాలంలో ప్రతి సంవత్సరం 10 మిల్లీమీటర్లకు పైగా తక్కువ వర్షపాతం కురిసింది.

"గతంలో ఎప్పుడు వర్షం పడుతుందో మాకు ముందే తెలిసేది. అయితే ఇప్పుడు వాతావరణం తీరు పూర్తిగా మారిపోయింది. కొన్నిసార్లు తక్కువ సమయంలో చాలా ఎక్కువ వర్షం పడుతుంది, కొన్నిసార్లు అసలు పడనే పడదు,” అని జలాల్ పేర్కొన్నారు. మూడేళ్ళ క్రితం, తనలాంటి చేతివృత్తులవారు వర్షాకాలంలో రూ.20,000 నుంచి 30,000 వరకూ సంపాదించగలమని ఆశించేవారని ఆయన చెప్పారు.

చేపలు పట్టే వెదురు మావులను తయారుచేస్తోన్న జలాల్ అలీని ఈ వీడియోలో చూడండి

గత సంవత్సరం, ఆయన దాదాపు 15 బాయిర్ల ను విక్రయించగలిగారు, కానీ ఈ సంవత్సరం ఆయన జూన్ మధ్య నుంచి జూలై మధ్య వరకు ఐదు బాయిర్లు మాత్రమే అమ్మగలిగారు. సాధారణంగా ప్రజలు దేశవాళీ వెదురు మావులను కొనే సమయం ఇదే అని నిపుణుడైన ఆ చేతిపనివాడు చెప్పారు.

ఆదాయాలు పడిపోయిన చేతిపనివాడు ఆయన ఒక్కరే కాదు. ఉదాల్‌గురి జిల్లాలో 79 ఏళ్ళ జోబ్లా దైమారీ కూడా సెపాలు తయారుచేస్తారు. "చెట్ల మీద చాలా కొద్ది పనసకాయలే ఉన్నాయి, వేడి అమితంగా పెరిగింది, ఇప్పటివరకు వర్షాలు లేవు. ఈ సంవత్సరం ఏం జరుగుతుందో ఊహించడానికి లేదు, అందుకే నాకు ఆర్డర్లు వస్తే తప్ప నేను ఎలాంటి పనీ మొదలుపెట్టను," అని ఆయన అన్నారు. దైమారీ ఒక సెపా కి తుది మెరుగులు దిద్దుతూ PARIతో మాట్లాడారు. వాటిని కొనేవాళ్ళు దాదాపు ఎవరూ తన ఇంటికి రావడం లేదని, అందుకే కేవలం ఐదు మావులను మాత్రమే తాను తయారుచేశానని, మే 2024లో మేం ఆయనను కలిసినప్పుడు మాతో చెప్పారాయన.

అస్సామ్‌లోని అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటైన బాలుగాఁవ్ వారపు మార్కెట్‌లో సుర్హాబ్ అలీ దశాబ్దాలుగా వెదురు వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. "ఇది జూలై మొదటి వారం, అయినా నేను ఈ సంవత్సరం ఒక్క బాయిర్ కూడా అమ్మలేదు," అని అతను చెప్పారు.

తన కళ నెమ్మదిగా కనుమరుగు కావడాన్ని జలాల్ చూస్తున్నారు: “ఈ ప్రక్రియను నేర్చుకోవడానికి ఎవరూ నా దగ్గరకు రావడం లేదు. చేపలు లేనప్పుడు, ఈ కళను నేర్చుకుని మాత్రం ప్రయోజనం ఏమిటి?" అని ఆయన తన డర్కీ ని పూర్తిచేయడానికి ఇంటి పెరట్లోకి వెళుతూ అడిగారు. నిజానికి ఆ ఇంటి పెరడు మౌసితా-బాలాబారీలో ఉన్న ఒక జాబితా చేయని బీల్ (విశాలమైన బాడవ) వెంట ఉన్న మట్టిరోడ్డు.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: తన ఇంటి ప్రాంగణంలో సెపాలను తయారు చేస్తున్న జోబ్లా దైమారీ. ఉదాల్‌గురి జిల్లాకు చెందిన 79 ఏళ్ళ ఆ వృద్ధుడు ఇలా అన్నారు: 'వేడి అమితంగా పెరిగింది, ఇప్పటివరకు వర్షాలు లేవు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఊహించడానికి లేదు, అందుకే నాకు ఆర్డర్లు వస్తే తప్ప నేను ఎలాంటి పనీ మొదలుపెట్టను’

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: బాలుగాఁవ్ వారపు మార్కెట్‌లో వెదురు ఉత్పత్తులను విక్రయిస్తున్న సుర్హాబ్ అలీ. కొనేవాళ్ళెవరూ కనిపించటంలేదని అతను అంటున్నారు. కుడి: సుర్హాబ్ అలీ దుకాణంలో ప్రదర్శనకు పెట్టిన దేశవాళీ వెదురు మావు. ఫోటోలో కనిపిస్తున్నది, మావు లోపల నుంచి చేపలను బయటకు తీయడానికి ఉపయోగించే కవాటం

*****

"మీరు ఈ మావులను తయారుచేయాలనుకుంటే, మీ విసుగుదలను మరచిపోవాల్సివుంటుంది, అదే సమయంలో మీకు చాలా ఏకాగ్రత కూడా ఉండాలి," అంటూ జలాల్ తన పనికి పూర్తి కేంద్రీకరణ ఎంత అవసరమో చెప్పారు. "వేరే ఎవరైనా మాట్లాడుతుంటే వినొచ్చు, కానీ మీరూ మాట్లాడాలనుకుంటే, మీరు బాయిర్‌ మీద పని చేయడాన్ని ఆపాలి." ఆయన విరామం లేకుండా పనిచేస్తే, రెండు రోజుల్లో ఆ మావు పూర్తి అవుతుంది. "నేను మధ్యమధ్యలో పని ఆపేస్తే, అది పూర్తికావడానికి నాలుగు నుంచి ఐదు రోజులు పట్టవచ్చు," అని ఆయన వివరించారు.

ఈ మావుల తయారీ ప్రక్రియ వెదురును ఎంచుకోవడంతో ప్రారంభమవుతుంది. చేపల మావులను తయారుచేయడానికి, చేతిపనివాళ్ళు కణుపుల మధ్య పొడవు ఎక్కువగా ఉన్న వెదురును ఉపయోగిస్తారు. బాయిర్ , సెపా లు మూడు లేదా మూడున్నర అడుగుల పొడవుంటాయి. వాటి సాగే గుణం కారణంగా తొల్లా బాఁస్ లేదా జాతి బాహ్ ( Bambusa tulda )లకు ప్రాధాన్యం ఇస్తారు..

"సాధారణంగా మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసున్న, పూర్తిగా పెరిగిన వెదురు చాలా ముఖ్యం. లేకుంటే వెదురు మావు ఎక్కువ కాలం ఉండదు. కణుపుల మధ్య పొడవు కనీసం 18-27 అంగుళాలు ఉండాలి. వెదురును సేకరించేటప్పుడు నా కళ్ళు వాటిని సరిగ్గా కొలవాలి," అని ఆయన చెప్పారు. "నేను వాటిని ఒక కణుపు నుంచి మరొక కణుపు వరకు ముక్కలుగా కత్తిరిస్తాను," సన్నని చతురస్రాకార వెదురు కర్రలను తన చేతితో కొలుస్తూ అన్నారు జలాల్.

వెదురును ముక్కలుగా నరికిన తర్వాత, జలాల్ చేపల మావు ప్రక్క భాగాలను అల్లడానికి వాటిని సన్నని చతురస్రాకార బద్దలుగా చేస్తారు. "గతంలో నేను కాఠి [సన్నని వెదురు బద్దలు]ని అల్లడానికి జనపనారను ఉపయోగించేవాణ్ని, కాని ఇప్పుడు మా ప్రాంతంలో జనపనార సాగు చేయడం లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ దారాలను ఉపయోగిస్తున్నాను."

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: వెదురును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత, జలాల్ నిర్దిష్ట పొడవుతో, అంటే రెండు కణుపుల మధ్య 18 నుంచి 28 అంగుళాల పొడవు ఉన్నవాటిని జాగ్రత్తగా ఎంచుకుంటారు. దీని వల్ల ఆయనకు నున్నని ఉపరితలంతో సన్నని, చతురస్రాకారపు బద్దలను చీల్చి, మావుని అల్లే ప్రక్రియ సులభతరం అవుతుంది. అలాగే అది వెదురు మావుకు చక్కని సౌష్టవమైన రూపాన్నిస్తుంది. కుడి: 'నేను నా వేళ్ళనుపయోగించి ఒక్కొక్క కాఠీని లెక్కిస్తాను. పొడవుగా ఉండే వైపున 280 వెదురు బద్దలు ఉండాలి. అరచేయంత [6 నుంచి 9 అంగుళాలు] ఉండే డార్కీ వెడల్పు కోసం నేను 15 నుంచి 20 మందమైన దీర్ఘచతురస్రాకార బద్దలను ఉపయోగిస్తాను, అప్పుడే అది నేల ఒత్తిడిని తట్టుకోగలదు,' అని జలాల్ చెప్పారు

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: 'పక్క గోడలను తొలీతో కట్టిన తర్వాత, నేను పక్క గోడలతో చాల్‌ను కట్టడం ప్రారంభిస్తాను,' అని జలాల్ చెప్పారు. 'ఆ తర్వాత నేను పారాలను [చేపలు మావులోకి ప్రవేశించే కవాటాలు] తయారుచేయాలి. డార్కీలకు సాధారణంగా మూడు పారాలు ఉంటాయి, సెపాకు రెండు ఉంటాయి. కుడి: ఒక డర్కీ 36 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు, 18 అంగుళాల ఎత్తు ఉంటే బాగుంటుంది. సెపా మధ్య భాగంలో 12 నుంచి 18 అంగుళాల ఎత్తు ఉంటుంది

జలాల్ 18 అంగుళాలు, లేదా 27 అంగుళాల ఎత్తులో ఉండే చదరపు ఆకారంలోని 480 వెదురు బద్దలను తయారుచేయాలి. "ఇది చాలా శ్రమతో కూడిన పని," అని ఆయన చెప్పారు. " కాఠీలు పరిమాణం, ఆకృతిలో సమానంగా ఉండాలి, నునుపుగా ఉండాలి, లేకపోతే అల్లిన పక్క గోడలు ఒకే రకంగా ఉండవు." ఈ పని చేయడానికి ఆయనకు సగం రోజు పడుతుంది.

చేపలు లోపలికి ప్రవేశించి, పట్టుబడే కవాటాలను తయారుచేయడం అత్యంత క్లిష్టమైన భాగం. "నేను ఒక వెదురు గడ నుంచి నాలుగు బాయిర్ల ను తయారుచేస్తాను. దాని ధర దాదాపు 80 రూపాయలు, ప్లాస్టిక్ తీగ ధర దాదాపు 30 రూపాయలు," తాను తయారుచేస్తున్న డార్కీ పై చివరలను ముడి వేయడానికి, తన దంతాల మధ్య అల్యూమినియం తీగను పట్టుకుని ఉన్న జలాల్ అన్నారు.

వెదురు బద్దలను అల్లి, ముడులు వేయడానికి నాలుగు రోజుల పాటు తీవ్రంగా శ్రమించాలి. "మీరు తీగ నుంచి, వెదురు బద్దల నుంచి కళ్ళు తిప్పటానికి ఉండదు. ఒక కడ్డీని అల్లడం తప్పిపోతే, రెండు వెదురు బద్దలు ఒకే ముడిలోకి ప్రవేశించొచ్చు. అప్పుడు మీరు తిరిగి దాన్ని విప్పి, మళ్ళీ అల్లాల్సిందే,” అని ఆయన వివరించారు. “ఇక్కడ బలం ముఖ్యం కాదు. కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల వద్ద చాలా సున్నితంగా అల్లి, ముడులు వేయడం. మీరు పనిలో లీనం కావడం వల్ల మీ తల నుంచి కాలివేలి వరకు చెమట కారిపోతూ ఉంటుంది."

వర్షపాతం తగ్గిపోవడం, తగ్గిపోతున్న చేపలతో, జలాల్ తన చేతిపని భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. "చాలా ఓర్పు, పట్టుదల అవసరమయ్యే ఈ నైపుణ్యాన్ని ఎవరు శ్రద్ధగా చూసి, నేర్చుకోవాలనుకుంటారు?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ సహకారం అందించింది.

అనువాదం: రవి కృష్ణ

Mahibul Hoque

ಮಹಿಬುಲ್ ಹಕ್ ಅಸ್ಸಾಂ ಮೂಲದ ಮಲ್ಟಿಮೀಡಿಯಾ ಪತ್ರಕರ್ತ ಮತ್ತು ಸಂಶೋಧಕ. ಅವರು 2023ರ ಸಾಲಿನ ಪರಿ-ಎಂಎಂಎಫ್ ಫೆಲೋ.

Other stories by Mahibul Hoque
Editor : Priti David

ಪ್ರೀತಿ ಡೇವಿಡ್ ಅವರು ಪರಿಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕರು. ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರಾದ ಅವರು ಪರಿ ಎಜುಕೇಷನ್ ವಿಭಾಗದ ಮುಖ್ಯಸ್ಥರೂ ಹೌದು. ಅಲ್ಲದೆ ಅವರು ಗ್ರಾಮೀಣ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತರಗತಿ ಮತ್ತು ಪಠ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಳವಡಿಸಲು ಶಾಲೆಗಳು ಮತ್ತು ಕಾಲೇಜುಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸುವ ಸಲುವಾಗಿ ಯುವಜನರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Priti David
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna