"గులామ్ నబీ, నీ కళ్ళు పాడవుతాయి. ఏం చేస్తున్నావు? నిద్రపో!"

చాలా రాత్రివరకూ నేను కొయ్యపై ఆకృతులను చెక్కడాన్ని చూసినప్పుడల్లా మా అమ్మ ఇలాగే అనేది. ఆవిడలా తిట్టినా కూడా నేను ఎప్పుడో తప్ప నా పని ఆపేవాడ్ని కాదు. నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే నా కళను నేను 60 ఏళ్ళకు పైగా సాధన చేస్తూ ఉండటమే కారణం. నాపేరు గులామ్ నబీ దార్. నేను కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన దారుశిల్పిని.

నేనెప్పుడు పుట్టానో నాకు తెలియదు కానీ నా వయసిప్పుడు 70కి పైబడింది. నా జీవితమంతా నేనీ నగరంలోని మాలిక్ సాహిబ్ సఫాకాదిల్ ప్రాంతంలోనే జీవించాను. నేనిక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివాను, కానీ నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన మూడవ తరగతిలోనే బడి మానేశాను. మా నాన్నగారైన అలీ ముహమ్మద్ దార్, ఈ పొరుగునే ఉన్న అనంత్‌నాగ్ జిల్లాలో పనిచేసేవారు, అయితే నాకు పదేళ్ళ వయసప్పుడు ఆయన శ్రీనగర్‌కు తిరిగివచ్చేశారు.

మమ్మల్ని - ఆయన కుటుంబ సభ్యులైన మా అమ్మ, అజ్జి, 12 మంది పిల్లలు - పోషించేందుకు ఆయన నగరంలో కూరగాయలను, పొగాకును అమ్మడం మొదలెట్టారు. అందరిలోకీ పెద్దవాడినైన నేను మా నాన్నకు సాయంచేసేవాడిని, అలాగే నా తమ్ముడైన బషీర్ అహమద్ దార్ కూడా. మాకు పని ఎక్కువగా లేనప్పుడు, అన్నదమ్ములమిద్దరం అక్కడికీ ఇక్కడికీ తిరుగుతుండటం చూసిన మా మామూ (మేనమామ) మా తిరుగుళ్ళ గురించి మా నాన్నకు ఫిర్యాదు చేశారు. దారుశిల్పం పనిని నేర్చుకోమని మాకు చెప్పింది మా మామూ యే.

Ghulam Nabi Dar carves a jewelry box (right) in his workshop at home
PHOTO • Moosa Akbar
Ghulam Nabi Dar carves a jewelry box (right) in his workshop at home
PHOTO • Moosa Akbar

ఇంట్లోనే ఉన్న తన కర్మాగారంలో ఒక నగల పెట్టెను చెక్కుతోన్న గులామ్‌ నబీ దార్

He draws his designs on butter paper before carving them on the wood. These papers are safely stored for future use
PHOTO • Moosa Akbar
He draws his designs on butter paper before carving them on the wood. These papers are safely stored for future use
PHOTO • Moosa Akbar

కొయ్య మీద చెక్కడానికి ముందు ఆయన తన డిజైన్లను ఒక బట్టర్ పేపర్ మీద గీసుకుంటారు. ముందు ముందు ఉపయోగం కోసం ఈ పేపర్లను భద్రంగా దాచిపెడతారు

ఆ విధంగా మా అన్నదమ్ములం ఇద్దరం ఇద్దరు వేర్వేరు నిపుణుల వద్ద మెరుగుపెట్టిన అక్రోటు కొయ్యల చెక్కడంపని చేయటం మొదలుపెట్టాం. మమ్మల్ని పనిలో పెట్టుకున్న మొదటి వ్యక్తి ఒక్కొక్కరికి దాదాపు రెండున్నర రూపాయలు జీతంగా చెల్లించాడు. అది కూడా మేం అతనితో రెండేళ్ళపాటు పనిచేసిన తర్వాత.

మా రెండవ గురువు మా పొరుగింటి అబ్దుల్ అజీజ్ భట్. ఆయన అప్పట్లో కశ్మీర్‌లో అంతర్జాతీయంగా కొనుగోలుదారులున్న ఒక పెద్ద హస్తకళల వ్యాపారసంస్థ కోసం పనిచేసేవారు. శ్రీనగర్‌లోని రైనావారీ ప్రాంతంలో ఉన్న మా కర్మాగారం ఇతర కళలలో నైపుణ్యం ఉన్న అనేకమందితో నిండిపోయి ఉండేది. నేనూ, బషీర్ ఇక్కడ ఐదేళ్ళపాటు పనిచేశాం. ప్రతిరోజూ మా పని ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం పొద్దుగుంకిన తర్వాతవరకూ కొనసాగేది. మేం కొయ్యతో నగల పెట్టెలను, కాఫీ బల్లలను, దీపాలను, ఇంకా చాలావాటిని చెక్కేవాళ్ళం. నేను ఇంటికి వచ్చాక చిన్న చిన్న కొయ్య ముక్కలమీద సాధన చేసేవాడిని.

తయారైన కళాకృతులను ఉంచేందుకు ఆ కర్మాగారంలో ఒక గది ఉండేది, అది ఎప్పుడూ ఎవరూ వెళ్ళి చూడకుండా తాళంపెట్టి ఉండేది. ఒకరోజు నేను దొంగచాటుగా అందులోకి ప్రవేశించాను. ఆ గదిలో ప్రతి మూలలోనూ ఉన్న చెట్లు, పక్షులు, ఇంకా మరెన్నో చెక్కివున్న కళాకృతులను చూస్తూవుంటే నా కళ్ళకు అది ఒక స్వర్గంలా కనిపించింది. ఇక ఈ కళలో ప్రావీణ్యం సాధించడమే నా జీవితాశయంగా చేసుకొని, అప్పటి నుంచీ దొంగచాటుగా అనేకసార్లు ఆ గదిలోకి వెళ్ళి అక్కడున్న వివిధ ఆకృతులను పరిశీలించి, వాటిని బయట సాధన చేసేవాడ్ని. అక్కడ పనిచేస్తున్న మరో కార్మికుడు నన్ను చూసి, దొంగతనం చేయడానికి వచ్చానని నాపై నిందారోపణ చేశాడు. కానీ ఆ తర్వాత ఆ కళ పట్ల నాకున్న అంకితభావాన్ని చూసిన అతను నన్ను వదిలేశాడు.

నేను ఆ గదిలో చూసినవాటిని నా పరిశీలనతో నేర్చుకున్నానే తప్ప నాకు ఎవరూ ఎప్పుడూ నేర్పించలేదు.

Left: Ghulam carves wooden jewellery boxes, coffee tables, lamps and more. This piece will be fixed onto a door.
PHOTO • Moosa Akbar
Right: Ghulam has drawn the design and carved it. Now he will polish the surface to bring out a smooth final look
PHOTO • Moosa Akbar

ఎడమ: గులామ్ కొయ్యతో నగల పెట్టెలు, కాఫీ బల్లలు, దీపాలు వంటి ఎన్నో ఆకృతులను రూపొందిస్తారు. ఈ కళాఖండాన్ని తలుపులో తాపడం చేస్తారు. కుడి: గులామ్ ముందుగా డిజైన్ గీసుకొని ఆ తర్వాత దానిని చెక్కారు. ఇప్పుడు చక్కని మృదువైన తుదిరూపాన్ని ఇచ్చేందుకు ఆ ఆకృతి పైభాగానికి మెరుగుపెడతారు

Ghulam says his designs are inspired by Kashmir's flora, fauna and landscape
PHOTO • Moosa Akbar
On the right, he shows his drawing of the Hari Parbat Fort, built in the 18th century, and Makhdoom Sahib shrine on the west of Dal Lake in Srinagar city
PHOTO • Moosa Akbar

కశ్మీర్‌లోని వృక్ష, జంతు జాలంతో పాటు రమణీయమైన ప్రకృతియే తన కళాకృతులకు స్ఫూర్తి అని గులామ్ అంటారు. కుడివైపున, 18వ శతాబ్దంలో కట్టిన హరి పర్బత్ కోట చిత్రాన్నీ, శ్రీనగర్ నగరంలోని డాల్ సరస్సు పశ్చిమభాగాన ఉన్న మఖ్దూం సాహిబ్ ప్రార్థనా స్థలాన్నీ చూపుతోన్న గులామ్

ఇంతకుముందు, చినార్ వృక్షం ( ప్లాటానస్ ఓరియేంటలిస్ ), ద్రాక్షలు, కైంద్‌పూష్ (రోజా పూలు), పామ్‌పూష్ (తామర పువ్వు), వంటి మరెన్నో ఆకృతులను చెక్కేవారు. ఇప్పుడు జనం కైంద్‌పూష్ డిజైన్‌ను చెక్కటం మర్చిపోయి, సులభమైన చెక్కడం పనిని ఎంచుకొంటున్నారు. నేను ఆ పాత ఆకృతులను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించాను. కనీసం ఒక డజను అసలుసిసలైన ఆకృతులను సృష్టించాను. వాటిల్లో రెండు అమ్ముడయ్యాయి. అందులో ఒకటి ఒక బల్లపై చెక్కిన బాతు; రెండోది ఒక తీగ జాతి మొక్క.

జమ్మూ కశ్మీర్ హస్తకళల సంచాలక కార్యాలయం ఇచ్చే రాష్ట్ర అవార్డుల కోసం 1984లో నేను రెండు డిజైన్‌లను సమర్పించాను. ఆ రెండిటికీ బహుమతి గెల్చుకున్నాను. అందులో ఒకటి, కశ్మీర్‌లోని ఒక గ్రామం వెలుపల జరుగుతోన్న ఒక పంచాయతీ సభ దృశ్యం ఆధారంగా తీసుకున్నది. ఇందులో సిక్ఖులు, ముస్లిమ్‌లు, పండితుల వంటి వివిధ సముదాయాలకు చెందిన మనుషులు ఒక బల్ల చుట్టూ కూర్చొని ఉంటారు. అక్కడే పిల్లలూ కోళ్ళూ కూడా ఉంటారు. చాయ్ (తేనీరు) తో నిండివున్న ఒక సమవార్ (పాత్ర), కప్పులు, హుక్కా, పొగాకు కూడా ఆ బల్లపై ఉంటాయి. ఆ బల్ల చుట్టూ పిల్లలూ కోళ్ళూ ఉంటారు.

ఇక్కడ బహుమతి గెల్చుకున్నాక, 1995లో దేశీయ బహుమతి కోసం నా పనిని సమర్పించాలనే ఉత్సాహం కలిగింది. ఈసారి నేను ఒక పెట్టెమీద చెక్కాను. ప్రతి మూలలోనూ ఒక విభిన్నమైన ముఖ కవళిక, భావోద్వేగం ఉంటుంది: నవ్వు ద్వారా సంతోషాన్ని, కన్నీళ్ళ ద్వారా ఏడుపును చూపించడం, ఇంకా కోపాన్నీ భయాన్నీ కూడా. ఈ ఆకృతుల మధ్యన, 3డి పూలను చెక్కాను. మొదటి ప్రయత్నంలోనే నేను ఈ బహుమతిని కూడా గెల్చుకున్నాను. డెవలప్‌మెంట్ కమిషనర్ (హస్త కళలు), డెవలప్‌మెంట్ కమిషనర్ (చేనేతలు), జౌళి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం - వీరందరి తరఫున భారత రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ నాకు ఈ బహుమతిని ప్రదానం చేశారు. "భారతదేశ హస్తకళల ప్రాచీన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచటం"లో నేను చేస్తున్న కృషికి ఇది గుర్తింపు.

దీని తర్వాత, ఒక్కో పని కోసం నాకు వెయ్యి రూపాయలు ఇచ్చే జనం కాస్తా రూ. 10,000 ఇవ్వటం మొదలుపెట్టారు. నా మొదటి భార్య మెహబూబా ఈ సమయంలోనే కాలం చేసింది. మాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో, మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని నా తల్లిదండ్రులు నాకు నొక్కిచెప్పారు. నా కొడుకు, కూతురూ 12వ తరగతి వరకూ చదువుకున్నారు, నా చిన్న కూతురు 5వ తరగతి వరకూ చదివింది. పిల్లలందరిలోకీ పెద్దవాడైన ఆబిద్ వయసు ఇప్పుడు 34 ఏళ్ళు. ఆబిద్ ఇప్పుడు నాతోనే పనిచేస్తాడు. అతను కూడా 2012లో తన మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర బహుమతిని గెల్చుకున్నాడు.

'Over the years, some important teachers changed my life. Noor Din Bhat was one of them,' says Ghulam. He has carefully preserved his teacher's 40-year-old designs
PHOTO • Moosa Akbar
'Over the years, some important teachers changed my life. Noor Din Bhat was one of them,' says Ghulam. He has carefully preserved his teacher's 40-year-old designs
PHOTO • Moosa Akbar

'కొన్ని సంవత్సరాలుగా, కొంతమంది ముఖ్యులైన గురువులు నా జీవితాన్ని మార్చేశారు. వారిలో నూర్ దిన్ భట్ ఒకరు.' అంటారు గులామ్. తన గురువుగారి 40 ఏళ్ళ నాటి డిజైన్లను గులామ్ ఎంతో జాగ్రత్తగా భద్రంచేసి ఉంచారు

Left: Ghulam's son Abid won the State Award, given by the Directorate of Handicrafts, Jammu and Kashmir, in 2012.
PHOTO • Moosa Akbar
Right: Ghulam with some of his awards
PHOTO • Moosa Akbar

ఎడమ: 2012లో జమ్మూ కశ్మీర్ హస్తకళల సంచాలక కార్యాలయం ద్వారా రాష్ట్ర బహుమతిని అందుకొన్న గులామ్ కుమారుడు, ఆబిద్. కుడి: తాను గెల్చుకున్న కొన్ని బహుమతులతో గులామ్

కొన్ని సంవత్సరాలుగా, కొంతమంది ముఖ్యులైన గురువులు నా జీవితాన్ని మార్చేశారు. వారిలో నూర్-రోర్-తొఇక్‌గా శ్రీనగర్ నర్వారా (ప్రాంతం)లో ప్రసిద్ధి చెందిన నూర్ దిన్ భట్ ఒకరు. నాకెంతో ఇష్టమైనవారిలో ఆయన ఒకరు.

ఆయన శరీరంలో కుడివైపున మొత్తం చచ్చుబడిపోయి, మంచం పట్టివున్న స్థితిలో నేను ఆయన్ని కలిశాను. అప్పటికి నా వయసు 40 ఏళ్ళ పైబడింది. జనం ఆయన దగ్గరకు కర్మాగారాల నుంచో, కాఫీ బల్లల నుంచో కొయ్య పలకల్ని తీసుకోచ్చేవారు, వాటిని ఆయన తన మంచం మీది నుంచే చెక్కేవారు. ఆయన ఈ రకంగా సంపాదించిన దాంతోనే తన భార్యనూ, కొడుకునూ పోషించేవారు. నావంటి, నా తమ్ముడి వంటి యువకులకు ఈ కళను నేర్పించేవారు. ఈ కళను నాకు నేర్పిస్తారా అని నేనాయనను అడిగినప్పుడు, "నువ్వు కొద్దిగా ఆలస్యం చేశావు," అన్నారాయన నాతో హాస్యంగా.

ఆ ఉపకరణాలను, శాండ్‌పేపర్‌ను ఉపయోగించడమెలాగో, ఆకృతులను సృష్టించడం ఎలాగో నా గురువు నాకు బోధించారు. ఆయన చనిపోవడానికి ముందు, నేనెప్పుడైనా విసుగుచెంది, సృజనాత్మకతను కోల్పోయి నిలిచిపోతే, ఏదైనా తోటకు వెళ్ళి అక్కడి పూలను గమనించమని నా గురువు నాకు సూచనలు ఇచ్చారు. "అల్లా సృష్టిలోని వంపులనూ గీతలనూ చూసి నేర్చుకో" అని చెప్పారు. ఈ కళను ఇతరులకు నేర్పించడం ద్వారా వారసత్వాన్ని కొనసాగించేలా ఆయన నాకు బోధించారు.

ఇంతకుముందు నా చెయ్యి చాలా వేగంగా కదులుతుండేది; ఒక యంత్రం లాగా పనిచేయగలిగేవాడిని. నేనిప్పుడు ముసలివాడినయ్యాను, చేతులు మునుపటిలా వేగంగా కదలడంలేదు. కానీ నేనెల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Student Reporter : Moosa Akbar

ಮೂಸಾ ಅಕ್ಬರ್ ಇತ್ತೀಚೆಗೆ ಕಾಶ್ಮೀರದ ಶ್ರೀನಗರದ ಶ್ರೀ ಪ್ರತಾಪ್ ಹೈಯರ್ ಸೆಕೆಂಡರಿ ಶಾಲೆಯಲ್ಲಿ 12ನೇ ತರಗತಿಯನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸಿದರು. ಅವರು 2021-2022ರ ಪರಿಯೊಂದಿಗಿನ ಇಂಟರ್ನ್‌ ಶಿಪ್ ಸಮಯದಲ್ಲಿ ಈ ಕಥೆಯನ್ನು ವರದಿ ಮಾಡಿದ್ದಾರೆ.‌

Other stories by Moosa Akbar
Editor : Riya Behl

ರಿಯಾ ಬೆಹ್ಲ್‌ ಅವರು ಲಿಂಗತ್ವ ಮತ್ತು ಶಿಕ್ಷಣದ ಕುರಿತಾಗಿ ಬರೆಯುವ ಮಲ್ಟಿಮೀಡಿಯಾ ಪತ್ರಕರ್ತರು. ಈ ಹಿಂದೆ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ (ಪರಿ) ಹಿರಿಯ ಸಹಾಯಕ ಸಂಪಾದಕರಾಗಿದ್ದ ರಿಯಾ, ಪರಿಯ ಕೆಲಸಗಳನ್ನು ತರಗತಿಗಳಿಗೆ ತಲುಪಿಸುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಮತ್ತು ಶಿಕ್ಷಣ ತಜ್ಞರೊಂದಿಗೆ ನಿಕಟವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದರು.

Other stories by Riya Behl
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli