ధనికులైనా పేదవారైనా, చిన్నవారైనా పెద్దవారైనా, అందరూ తమ పాదరక్షలు తీసి మహారాజు పాదాలను తాకాల్సిందే. అయితే, దుర్బలంగా కనిపిస్తోన్న ఒక యువకుడు మహారాజు కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిటారుగా నిలబడి, నమస్కరించడానికి నిరాకరించాడు. ఎలాంటి భిన్నాభిప్రాయాలనైనా నిర్దాక్షిణ్యంగా అణిచివేయడంలో పేరుగాంచిన మహారాజు ముందు ఆ ధిక్కార చర్య, పంజాబ్‌లోని జోగా గ్రామ పెద్దలను భయాందోళనలకు గురిచేసింది; నిరంకుశ రాచరికానికి కోపం తెప్పించింది.

ఆ యువకుడు జాగీర్ సింగ్ జోగా. బాలీవుడ్ సెలబ్రిటీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్‌ను, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టడానికి తొమ్మిది దశాబ్దాలకు ముందే జోగా ఈ సాహసోపేతమైన వ్యక్తిగత నిరసనను వెలిబుచ్చాడు. జోగా అసమ్మతి పటియాలా మహారాజా భూపిందర్ సింగ్‌ను, పేద రైతుల భూమిని లాక్కోవడానికి ప్రయత్నించిన అతని భూస్వామ్య దుండగులను ఉద్దేశించినది. అది జరిగింది 1930లలో. తర్వాత వెంటనే ఏమి జరిగిందో జానపదాలలో గాని, నిరూపించదగిన చరిత్రలో కానీ కానరాలేదు. కానీ జోగా మరొక రోజున పోరాడటానికి జీవించారు.

ఒక దశాబ్దం తరువాత జోగా, అప్పటి లాల్ పార్టీకి చెందిన అతని సహచరులు కిషన్‌గఢ్ (ప్రస్తుతం సంగ్రూర్ జిల్లాలో ఉంది) చుట్టుపక్కల యుగయుగాల పోరాటానికి నాయకత్వం వహించారు, భూపిందర్ సింగ్ కుమారుడి నుండి 784 గ్రామాలలో వేలాది ఎకరాల భూమిని లాక్కొని భూమిలేని వారికి పంచారు. ప్రస్తుత పటియాలా మాజీ రాజవంశీకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపిందర్ సింగ్ మనవడు.

ఆ భూపోరాటం, ఇతర పోరాటాలననుసరించి 1954లో నభా జైలులో ఉన్నప్పుడే ప్రజలు రాష్ట్ర అసెంబ్లీకి జోగాకు ఓటు వేశారు. 1962, 1967, 1972లలో కూడా ఆయనను తిరిగి శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు.

PHOTO • Jagtar Singh

ఎడమ: 1930లలో, జాగీర్ సింగ్ జోగా అసమ్మతి పటియాలా మహారాజా భూపిందర్ సింగ్‌పైనా, పేద రైతుల భూమిని లాక్కోవడానికి ప్రయత్నించిన అతని భూస్వామ్య దుండగుల పైనా ఎక్కుపెట్టినది. కుడి: జూన్ 2024లో కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్‌పై తన అసమ్మతిని ప్రదర్శించిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్

“పంజాబ్ గాలిలోనే నిరసన వర్ధిల్లుతోంది. పంజాబ్‌లో చెలరేగే వ్యక్తిగత - తరచుగా ఆకస్మిక - నిరసనల సుదీర్ఘ గొలుసులో తాజా లంకె కుల్విందర్ కౌర్. ఇది జోగాతో మొదలవలేదు, కుల్విందర్ కౌర్‌తో ముగియదు," అని జోగా జీవిత చరిత్ర రచయిత జగ్తార్ సింగ్ చెప్పారు. విశ్రాంత ఉపాధ్యాయుడైన జగ్తార్ సింగ్, ఇంక్విలాబీ యోధా: జాగీర్ సింగ్ జోగా (విప్లవ యోధుడు: జాగీర్ సింగ్ జోగా) పుస్తక రచయిత.

పంజాబ్‌లో జరిగిన ఈ వ్యక్తిగత, ఆకస్మిక నిరసనలు చాలా వరకు అణకువ కలిగిన లేదా నిరాడంబరమైన నేపథ్యం ఉన్న సాధారణ పౌరుల నుండి వచ్చాయి. సిఐఎసెఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కపూర్‌థలా జిల్లా మహీవాల్ గ్రామంలోని ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చారు. కంగనా రనౌత్ ఎగతాళి చేసి దూషించిందని కుల్విందర్ భావిస్తోన్న ఆమె తల్లి వీర్ కౌర్ ఇప్పటికీ రైతుగానే ఉన్నారు.

జోగా కంటే ముందు భగత్ సింగ్, అతని సహచరులకు వ్యతిరేకంగా లాహోర్ కుట్ర కేసు విచారణ (1929-30) జరుగుతోన్న సమయంలో వారి పోరాట సహచరుడు, ఆ తర్వాత అప్రూవర్‌గా మారిన జై గోపాల్‌పై కోర్టు లోపల చెప్పు విసిరిన ప్రేమదత్త వర్మ ఉన్నారు. “అది ప్రణాళికాబద్ధమైన వ్యూహం కాదు, వర్మ నిరసన ఆకస్మికంగా జరిగినది. విచారణ సమయంలో అతనితో సహా ఆ కేసులోని ఇతర నిందితులు చిత్రహింసలకు గురయ్యారు," అని ది భగత్ సింగ్ రీడర్ రచయిత ప్రొఫెసర్ చమన్ లాల్ చెప్పారు.

ఒక చవకబారు ప్రహసనం తర్వాత భగత్ సింగ్‌ను, అతని ఇద్దరు సహచరులను మార్చి 23, 1931న ఉరితీశారు. (వారిలో అతి పిన్న వయస్కుడైన వర్మకు ఐదేళ్ళ జైలు శిక్ష విధించారు). సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత, వారు అమరత్వం పొందిన రోజుని పురస్కరించుకుని, అమలులో ఉన్న కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను పూర్తిగా ధిక్కరిస్తూ, 16 ఏళ్ళ హరికిషన్ సింగ్ సుర్జీత్ హోషియార్‌పూర్‌ జిల్లా కోర్టు పైభాగంలో ఉన్న బ్రిటిష్ జెండాను చించివేసి, మూడురంగుల జెండాను ఎగురవేశాడు.

“వాస్తవానికి యూనియన్ జాక్‌ను దించాలని పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ వారు వెనకడుగు వేయడం ప్రారంభించడంతో, సుర్జీత్ తనంతట తానుగా ఆ పని చేశాడు. మిగిలినదంతా ఇప్పుడు చరిత్రలో భాగమయింది,” అని స్థానిక చరిత్రకారుడు అజ్మీర్ సిద్ధూ PARIకి తెలిపారు. చాలా దశాబ్దాల తర్వాత, జ్ఞాపకాల పుటలను తిరగేస్తూ, "ఆ రోజు నేను చేసిన పనికి నేను ఇప్పటికీ గర్వపడుతున్నాను," అని సుర్జీత్ చెప్పేవారు. జెండా ఎగురవేయడమనే రూపకం ముగిసిన దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత సుర్జీత్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కు ప్రధాన కార్యదర్శి అయ్యారు.

PHOTO • Daily Milap / courtesy Prof. Chaman Lal
PHOTO • Courtesy: Prof Chaman Lal

లాహోర్ కుట్ర కేసు గురించి 1930ల నాటి ది డైలీ మిలాప్ పోస్టర్ (ఎడమ). భగత్ సింగ్, అతని సహచరులకు వ్యతిరేకంగా విచారణ జరుగుతున్నప్పుడు వారి పోరాట సహచరుడు, ఆ తర్వాత అప్రూవర్‌గా మారిన జై గోపాల్‌పై కోర్టు లోపల చెప్పు విసిరిన ప్రేమదత్త వర్మ (కుడి)

PHOTO • Courtesy: Amarjit Chandan
PHOTO • P. Sainath

ఎడమ: 1932లో, 16 సంవత్సరాల వయస్సున్న హరికిషన్ సింగ్ సుర్జీత్, హోషియార్‌పూర్‌ జిల్లా కోర్టు పై నుండి బ్రిటిష్ జెండాను కూల్చివేసి, మువ్వన్నెల జెండాను ఎగురవేశాడు. ఇక్కడ కనిపిస్తున్నది, 1967 ఫిబ్రవరిలో పంజాబ్‌లోని ఫిల్లౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన తర్వాత. కుడి: రామ్‌ఘర్‌లోని తన ఇంటిలో ఝుగ్గియాఁతో కలసివున్న విప్లవకారుడు షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు ప్రొ. జగ్మోహన్ సింగ్ (నీలం రంగులో)

1932లో జెండా ఎగురవేసిన సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, సుర్జీత్ సహచరుడు, అతనికంటే చాలా చిన్నవాడైన భగత్ సింగ్ ఝుగ్గియాఁ, తన 11 సంవత్సరాల వయస్సులో, అత్యంత నాటకీయమైన వ్యక్తిగత నిరసనను ప్రదర్శించాడు. ఝుగ్గియాఁ 3వ తరగతిలో మొదటివాడిగా నిలిచిన బహుమతి పొందిన విద్యార్థి. బహుమతులను అందజేస్తున్న విద్యాశాఖ ప్రముఖుడు వేదికపై అతడిని అభినందించి, ‘బ్రిటానియా జిందాబాద్, హిట్లర్ ముర్దాబాద్’ అని అరవమని అడిగాడు. చిన్నవాడైన ఝుగ్గియాఁ ఆ వేడుకలో పాల్గొన్న ప్రేక్షకులకు ఎదురుగా నిలబడి, “బ్రిటానియా ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్,” అని అరిచాడు.

అతన్ని కొట్టారు, బయటకు నెట్టేశారు, ఇక ఆ బాలుడు ఎప్పటికీ బడికి వెళ్ళలేకపోయాడు. అయితే, తన జీవితపు చివరి రోజులవరకూ ఝుగ్గియాఁ తాను చేసిన పనికి గర్వపడుతూనే ఉన్నారు. సుమారు 95 ఏళ్ళ వయసులో 2022లో, తాను చనిపోవటానికి కేవలం ఒక ఏడాది ముందు, PARI వ్యవస్థాపక సంపాదకులు పి. సాయినాథ్‌తో ఝుగ్గియాఁ మాటలాడినప్పటి కథనాన్ని మీరిక్కడ చదవవచ్చు .

కుల్విందర్ కౌర్ సోదరుడు షేర్ సింగ్ మహివాల్ ఆరు ఎకరాల భూమి ఉన్న రైతు. ఆయన ఈ జూన్ నెల 12వ తేదీన మొహాలీలో తన సోదరిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో అదే భావోద్వేగం ప్రతిధ్వనించింది: “ఆమె చేసిన పనికి ఆమె గానీ, మేం గానీ చింతించటంలేదు. కాబట్టి, క్షమాపణ చెప్పటం అనే ప్రశ్న కూడా తలెత్తదు,” అని ఆయన నొక్కి చెప్పారు.

ఇటీవలి కాలంలో కూడా పంజాబ్‌లో ఇటువంటి తీవ్రమైన వ్యక్తిగత నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతుల ఆత్మహత్యలు, మాదకద్రవ్యాల వ్యసనం, విస్తృతమైన నిరుద్యోగం మధ్య, పంజాబ్‌లో పత్తి పండించే ప్రాంతమంతా 2014 ఒక కల్లోల సంవత్సరంగా మారింది. ఏ వైపు నుంచీ ఎటువంటి ఆశా కనిపించకపోవటంతో, విక్రమ్ సింగ్ ధనౌలా తన గ్రామం నుండి ఖన్నా పట్టణానికి 100 కి.మీ దూరం ప్రయాణించారు. అక్కడ అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఆగస్ట్ 15, 2014న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది.

PHOTO • Courtesy: Vikram Dhanaula
PHOTO • Shraddha Agarwal

నిరుద్యోగ యువత పట్ల, కష్టాల్లో ఉన్న రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌పై 2014లో పాదరక్షను విసిరేసిన విక్రమ్ సింగ్ ధనౌలా (ఎడమ). 2021 వ్యవసాయ నిరసనల్లో అగ్రభాగాన ఉన్న పంజాబ్‌ మహిళలు (కుడి)

అప్పుడే తన ప్రసంగాన్ని ప్రారంభించిన బాదల్‌పై, ధనౌలా తన పాదరక్షను విసిరారు. "నేను అతని ముఖంపై సులభంగా కొట్టగలను, కానీ కావాలనే పోడియం వైపుకు విసిరాను. నకిలీ విత్తనాలు, పురుగుమందుల అమ్మకాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ప్రతిధ్వనులను, నిరుద్యోగ యువత ఆక్రందనలను అతను వినేలా చేయాలనుకున్నాను.”

ఇప్పటికీ బర్నాలా జిల్లాలోని ధనౌలా గ్రామంలో నివసిస్తోన్న ధనౌలా 26 రోజుల జైలు శిక్ష అనుభవించారు. ఆయన చేసిన పనికి ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా? "మీకు ఎక్కడా ఆశ లేనప్పుడు మాత్రమే కుల్విందర్ కౌర్ చేసినట్టు, లేదా నేను 10 సంవత్సరాల క్రితం చేసినట్టు చేస్తారు," అని అతను PARIకి చెప్పారు. బ్రిటీష్ రాజ్ నుండి ప్రస్తుత బిజెపి ప్రభుత్వం వరకు, కాలక్రమేణా, ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రతిధ్వనితో, ఎదురయ్యే పరిణామాలతో సంబంధం లేకుండా కొన్ని ఏకాంత స్వరాలు వారి సాధనలో స్థిరంగా ఉంటూనే ఉన్నాయి.

పంజాబ్‌తో కంగనా రనౌత్ సంబంధం 2020లో పునర్నిర్వచించబడింది. కేంద్ర ప్రభుత్వం చివరకు నవంబర్ 19, 2021న రద్దు చేయాల్సివచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేసిన ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు, కంగన మహిళలపై అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించింది. “హ హ హ హ ఆమె టైమ్ మ్యాగజైన్‌లో అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా కనిపించిన అదే దాదీ [నాయనమ్మ]… ఆమె 100 రూపాయలకే అందుబాటులో ఉంది," అని కంగనా ట్వీట్ చేసింది

కంగనా మాటలను పంజాబ్ ప్రజలు మరిచిపోలేదని తెలుస్తోంది. జూన్ 6వ తేదీన కుల్విందర్ కౌర్ మాట్లాడుతూ, “100 లేదా 200 రూపాయలకు రైతులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారని ఆమె [కంగన] ఒక ప్రకటన చేసింది. ఆ సమయంలో, మా అమ్మ కూడా నిరసనకారులలో ఒకరు," అన్నారు. విచిత్రమేమిటంటే, కంగనాను కుల్విందర్ కొట్టిన చెంపదెబ్బకు సంబంధించిన ఫుటేజీని ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. అయితే ఏం జరిగినా అది జూన్ 6న మాత్రమే మొదలయినది కాదు.

వీడియోను చూడండి: కంగనా మాటలపై కలిగిన కోపానికి వెనుక ఉన్న కథ

పంజాబ్‌లో జరిగిన ఈ వ్యక్తిగత, ఆకస్మిక నిరసనలు చాలా వరకు అణకువ కలిగిన లేదా నిరాడంబరమైన నేపథ్యం ఉన్న సాధారణ పౌరుల నుండి వచ్చాయి

జూన్ 6న చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ‘స్లాప్‌గేట్’గా ఆపాదించబడిన గొడవకు చాలా ముందే, డిసెంబర్ 3, 2021న, కంగనా రనౌత్ మనాలీ నుండి తిరిగి వస్తున్నప్పుడు, ఆమె కారు పంజాబ్‌లోకి ప్రవేశించగానే మహిళా రైతులు ఆమెను ఆపారు. కంగనాకు అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. ఇప్పుడు కొనసాగుతున్న సంఘర్షణలో కూడా కుల్విందర్, ఆమె సోదరుడు షేర్ సింగ్ మహీవాల్, వారి బంధువులకు కుటుంబ ప్రతిష్ట, గౌరవానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు కూడా ఉన్నాయి.

"మేం అనేక తరాలుగా భద్రతా బలగాలలో సేవ చేస్తున్నాం," అని మహీవాల్ PARIతో అన్నారు. "కుల్విందర్ కంటే ముందు, మా తాత కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సైన్యంలో పనిచేశారు. మా తాతతో సహా, అతని ఐదుగురు కుమారులలో ముగ్గురు కూడా భారత సైన్యంలో పనిచేశారు. వారు దేశం కోసం 1965లో, 1971లో జరిగిన యుద్ధాలలో పోరాడారు. మమ్మల్ని ఉగ్రవాదులుగా పిలిచే కంగనా వంటి వ్యక్తి నుండి మా దేశభక్తి గురించిన సర్టిఫికేట్లు అవసరమని మీరు ఇంకా అనుకుంటున్నారా? అని షేర్ సింగ్ మహీవాల్ అడిగారు.

కుల్విందర్ కౌర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. 35 ఏళ్ళ కుల్విందర్ మరొక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు- ఐదు సంవత్సరాల అబ్బాయి, తొమ్మిదేళ్ళ వయస్సున్న అమ్మాయి. ఆమె తన సిఐఎస్ఎఫ్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, పంజాబ్ సంగతి తెలిసినవారు పేర్కొన్నట్లుగా, వ్యక్తిగతంగా నిరసన తెలియచేసినవారందరూ వారి చర్యల పర్యవసానాల బరువును వారే భరిస్తారు, కానీ వారి వ్యక్తిగత ధైర్యం తరచుగా కాంతివంతమైన రేపటికి విత్తనాలను నాటుతుంది. "జోగా, కౌర్‌లిద్దరూ మన కలలు ఇంకా సజీవంగా ఉన్నాయనటానికి ప్రతీకలు," అని ఆరు దశాబ్దాల క్రితం మొదట్లో జాగీర్ సింగ్ జోగాతో అనుబంధం కలిగివున్న సిపిఐ మాజీ ఎమ్మెల్యే హర్దేవ్ సింగ్ అర్శి చెప్పారు. అర్శిది జాగీర్ సింగ్ గ్రామమైన జోగా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాతేవస్ గ్రామం. ఈ రెండు గ్రామాలు నేటి మాన్సా జిల్లా కిందికి వస్తాయి.

నభా జైలులో ఉండగానే, జోగా 1954లో పంజాబ్ శాసనసభకు ఎన్నికయ్యారు. సుర్జీత్, భగత్ సింగ్ ఝుగ్గియాఁ, ప్రేమ్ దత్తా వర్మలు పంజాబ్ సుదీర్ఘ వ్యక్తిగత నిరసన, పోరాట జానపద కథలలో భాగమయ్యారు.

సంఘటన గురించి కుల్విందర్ సోదరుడు షేర్ సింగ్ మహీవాల్ మాట్లాడుతోన్న వీడియోను చూడండి

వ్యక్తిగతంగా నిరసన తెలియచేసినవారందరూ వారి చర్యల పర్యవసానాల బరువును వారే భరిస్తారు, కానీ వారి వ్యక్తిగత ధైర్యం తరచుగా కాంతివంతమైన రేపటికి విత్తనాలను నాటుతుంది

కుల్విందర్ కౌర్‌కు మద్దతుగా పంజాబ్, చండీగఢ్‌ల అంతటా ర్యాలీలు, ఊరేగింపులు జరుగుతూనే ఉన్నాయి. అత్యధికంగా ఈ ప్రదర్శనలు చెంపదెబ్బ గురించి సంబరాలు జరుపుకోవటం గానీ, ఇదే సరైన పని అని నొక్కిచెప్పటం గానీ చేయటంలేదు. ఇక్కడి ప్రజలు ఈ సంఘటనను పంజాబ్ రైతుల గౌరవం, సమగ్రతను రక్షించటానికి కేవలం ఒక కానిస్టేబుల్‌, ఒక శక్తివంతమైన సెలబ్రిటీ, పార్లమెంటు సభ్యురాలికి ఎదురు నిలిచినట్టుగా చూస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. సరళంగా చెప్పాలంటే: కుల్విందర్ చర్య పంజాబ్ సంప్రదాయమైన వ్యక్తిగత, ఆకస్మిక నిరసన కిందకు వస్తుందని వారు భావిస్తున్నారు.

ఈ మొత్తం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పద్యాలు, పాటలు, మీమ్స్, కార్టూన్‌ల పరంపరను రేపింది. ఈ రోజు PARI ఈ కథనంతో పాటు కవితలలో ఒకదాన్ని కూడా తీసుకువస్తోంది: కవి స్వరాజ్‌బీర్ సింగ్, ప్రసిద్ధ నాటక రచయిత, ది ట్రిబ్యూన్ (పంజాబీ) మాజీ సంపాదకులు.

ఆమెకు మద్దతుగా వెల్లువెత్తుతోన్న బహుమతులు, న్యాయ సహాయం, నిరసనల మధ్య కుల్విందర్ కౌర్ భద్రతా దళాలలో తన ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. కానీ జోగా విషయంలో జరిగినట్టే - ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు సమీపిస్తున్నందున - పంజాబ్ శాసనసభలో ఆమె కోసం చాలా పెద్ద ఉద్యోగమే వేచి ఉందేమో! పంజాబ్‌లో చాలామంది ఆమె ఎన్నికలలో పోటీ చేయగలరని ఆశిస్తున్నారు.

PHOTO • PARI Photos

ఎడమ: సంఘటన తర్వాత చండీగఢ్ విమానాశ్రయంలో కుల్విందర్ కౌర్. కుడి: కంగనాకు వ్యతిరేకంగా, కుల్విందర్‌కు మద్దతు తెలుపుతూ జూన్ 9, 2024న మొహాలీలో జరిగిన యాత్ర

___________________________________________________

చెప్పమ్మా, చెప్పు!

స్వరాజ్‌బీర్

చెప్పమ్మా, చెప్పు!
నా ప్రియమైన అమ్మా, నీ మనసులో ఏముందో నాకు చెప్పు.
నా మనసులో మాత్రం అగ్నిపర్వతాలు ఎగసెగసి పడుతున్నాయి.

రోజు రోజూ మనల్ని దెబ్బ కొడుతున్నదెవరో చెప్పమ్మా?
మన విలువలను ఉల్లంఘించేదెవరు,
తెరలపై ఘీంకరించేదెవరు?

ధనవంతులు బలవంతులు కొట్టే చెంపదెబ్బలను మనం భరిస్తున్నాం
భూమిపైనున్న దౌర్భాగ్యులే బాధనంతా భరించేది.
రాజ్యం చేసే వాగ్దానాలన్నీ బూటకమైనవే.

కానీ కొన్నిసమయాల్లో,
అవును, కొన్ని మరీ అరుదైన సమయాల్లో,
దెబ్బలుతినివున్న ఒక బికారి బాలిక తిరగబడుతుంది.
బలమైన భావోద్వేగాలు పోటెత్తుతోన్న హృదయంతో ఆమె,
తన చేతిని పైకి లేపి విసురుతుంది.
పాలక భూతాలను ఎదిరించే ధైర్యం చేస్తుంది.

ఈ ముష్టిఘాతం
ఈ చెంపపెట్టు కేవలం ఒక దెబ్బ కాదమ్మా.
ఇది ఒక కేక, ఒక అరుపు, పోటుపెడుతోన్న నా హృదయం చేసిన గర్జన.

కొంతమంది అది సరైనదేనంటారు,
కొంతమంది సరికాదంటారు.
అది సభ్యతో అసభ్యతో ఏమైనా అననీ
నా మనసు నీకోసం విలపిస్తోంది.

శక్తిమంతులు నిన్నూ నీ ప్రజలనూ బెదిరించారు.
శక్తిమంతులు నిన్ను సవాలు చేశారు.
అదే శక్తిమంతులు నా హృదయాన్ని నలగగొట్టారు

అది నా హృదయం అమ్మా,
రోదిస్తోన్న నా హృదయం.
అది సభ్యత అననీ, మొరటుతనం అననీ,
అది నీకోసం అంగలార్చుతోంది, రోదిస్తోంది.
కొంతమంది అది సరైనదేనంటారు,
కొంతమంది సరికాదంటారు.

కానీ ఇది నా హృదయం అమ్మా.
నీకోసం మాట్లాడుతోన్న ధిక్కారం పొంగిపొరలే నా చిన్నారి హృదయం!

(ఆంగ్లంలోకి అనువాదం: చరణ్‌జీత్ సోహాల్)

కవి స్వరాజ్‌బీర్ నాటక రచయిత, పాత్రికేయులు, ది ట్రిబ్యూన్ (పంజాబీ) మాజీ సంపాదకులు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Vishav Bharti

ವಿಶವ್ ಭಾರತಿ ಚಂಡೀಗಢ ಮೂಲದ ಪತ್ರಕರ್ತರಾಗಿದ್ದು, ಕಳೆದ ಎರಡು ದಶಕಗಳಿಂದ ಪಂಜಾಬಿನ ಕೃಷಿ ಬಿಕ್ಕಟ್ಟು ಮತ್ತು ಪ್ರತಿರೋಧ ಚಳವಳಿಗಳ ಕುರಿತು ವರದಿ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ.

Other stories by Vishav Bharti

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Illustration : Antara Raman

ಅಂತರಾ ರಾಮನ್‌ ಸಾಮಾಜಿಕ ಪ್ರಕ್ರಿಯೆಗಳು ಮತ್ತು ಪೌರಾಣಿಕ ಚಿತ್ರಣಗಳಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಹೊಂದಿರುವ ಇಲಸ್ಟ್ರೇಟರ್‌ ಮತ್ತು ವೆಬ್‌ಸೈಟ್‌ ಡಿಸೈನರ್‌ ಆಗಿದ್ದು . ಬೆಂಗಳೂರಿನ ಸೃಷ್ಟಿ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಆರ್ಟ್, ಡಿಸೈನ್ ಅಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿಯ ಪದವೀಧರೆ, ಕಥಾ ಜಗತ್ತು ಮತ್ತು ಚಿತ್ರವು ಜೊತೆಯಾಗಿ ಬದುಕುತ್ತವೆ ಎಂದು ಅವರು ನಂಬುತ್ತಾರೆ

Other stories by Antara Raman
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli