“మా అత్తమామలు తమకు తగిన వధువు కావాలని అతనికి డబ్బు చెల్లించారు. ఇది ఇక్కడ చాలా మామూలు పద్ధతి." అంటూ ఇరవై పైబడిన వయసులో ఉన్న రుమా ఖీచడ్, తన కథను నాతో పంచుకున్నారు. “దూరం నుండి వచ్చి ఇక్కడ [రాజస్థాన్] స్థిరపడడం అందరికీ సాధ్యం కాదు. నా జెఠాని [పెద్ద తోడికోడలు]...”
"పచాస్ హజార్ లగా కే ఉస్కో లాయే థే! ఫిర్ భీ, సాత్ సాల్ కి బచ్చీ హై, ఉస్కో భీ ఛోడ్ కే భాగ్ గయీ వో [మేం 50,000 రూపాయలు ఇచ్చి ఆమెను తెచ్చుకున్నాం. కానీ ఆమె ప్రస్తుతం ఏడేళ్ళ వయసున్న తన కూతురిని కూడా వదిలి పారిపోయింది]," కోడల్ని చెప్పనివ్వకుండా అడ్డుపడి తన కథనాన్ని నొక్కిచెప్పారు 67 ఏళ్ళ యశోద ఖీచడ్ (అసలు పేరు కాదు).
“ఆ మనిషి! ఆమె మూడు సంవత్సరాలు ఉంది." పంజాబ్‌కు చెందిన తన పెద్ద కోడలు పారిపోయిన సంగతి చెబుతోన్న యశోద ఇంకా ఆవేశంగానే ఉన్నారు. “ఆమెకెప్పుడూ భాష సమస్యగా ఉండేది. మా భాష నేర్చుకోలేదు. పెళ్ళయిన తర్వాత మొదటిసారి, ఒక రక్షా బంధన్ పండగ సమయంలో, వెళ్ళి తన సోదరుడిని, కుటుంబ సభ్యులను కలవాలనుకుంటున్నట్లు చెప్పింది. మేం ఆమెను వెళ్ళనిచ్చాం. ఆమె మరి తిరిగి రాలేదు. ఇప్పటికి ఆరు సంవత్సరాలయింది,” అన్నారామె.
యశోద రెండవ కోడలైన రుమా, వేరొక దళారి ద్వారా ఝుంఝునున్ (ఝుంఝును అని కూడా పిలుస్తారు)కి వచ్చింది.
ఆమెకు పెళ్ళి జరిగేటప్పటికి తన వయసెంతో తెలియదు. "నేనెప్పుడూ బడికి వెళ్ళలేదు కాబట్టి నేను ఏ సంవత్సరంలో పుట్టానో చెప్పలేను," బూడిద రంగులో ఉన్న అల్మారాలో తన ఆధార్ కార్డు కోసం వెతుకుతూ చెప్పిందామె.
ఐదేళ్ళ వయసున్న ఆమె కూతురు, ఆ గదిలో మంచం మీద ఆడుకోవడాన్ని నేను చూస్తున్నాను.
“బహుశా నా ఆధార్ నా భర్త వాలెట్‌లో ఉండివుంటుంది. నాకిప్పుడు 22 ఏళ్ళుండొచ్చని అనుకుంటున్నాను" చెప్పింది రుమా.










