"మా గ్రామంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల తర్వాత వారు ఇల్లు విడచి బయటకు రారు," అంటారు శుక్లా ఘోష్. ఆమె ఇక్కడ పశ్చిమ మేదినీపూర్‌లోని కువాపూర్ గ్రామం గురించి చెప్తున్నారు. "అమ్మాయిలు బెదిరిపోయారు. కానీ దీనిని ప్రతిఘటించి నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు."

కొల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆసుపత్రిలో శిక్షణలో ఉన్న ఒక యువ మెడికల్ వైద్యురాలిపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యకు నిరసనగా గత వారం పశ్చిమ బెంగాల్‌లోని గ్రామాల నుండి, చిన్న పట్టణాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వేలాదిమంది రైతులు, రైతు కూలీలు, కార్మికులలో కువాపూర్‌కు చెందిన ఘోష్, బాలికలు కూడా ఉన్నారు.

సెప్టెంబర్ 21, 2024న జరిగిన ఈ నిరసన ప్రదర్శన మధ్య కొల్‌కతాలోని కాలేజ్ స్ట్రీట్ దగ్గర ప్రారంభమై శ్యామ్‌బజార్ వైపుగా సుమారు 3.5 కిలోమీటర్ల దూరం సాగింది.

సత్వరమే న్యాయం జరగాలని, దోషులకు గుణపాఠం నేర్పేలా శిక్షపడాలని, కొల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని (వైద్యులు చేసిన ఈ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించింది), నిరసనకారులు డిమాండ్ చేశారు. అంతేకాక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; గృహ, పర్వత వ్యవహారాల మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

ఎడమ: తన గ్రామంలోని ఆడపిల్లలు తమకు రక్షణ లేదని భావిస్తున్నారని పశ్చిమ మేదినీపూర్ ఐసిడిఎస్ జిల్లా కార్యదర్శి శుక్లా ఘోష్ చెప్పారు. కుడి: హుగ్లీలోని నకుందా నుంచి ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన రైతు కూలీ మీతా రాయ్

" తిలోత్తమా తొమార్ నామ్, జుడ్‌ఛే శొహొర్ జుడ్‌ఛే గ్రామ్ [తిలోత్తమా, నీ పేరు మీద నగరాలూ గ్రామాలూ ఒకటవుతున్నాయి]!" అనేది ఈ ప్రదర్శన నినాదం. మరణించిన 31 ఏళ్ళ వైద్యురాలికి నగరం పెట్టుకొన్న పేరు 'తిలోత్తమ’. ఇది దుర్గాదేవికి మరొక పేరు. ఉత్తమమైన అణువులతో కూర్చినదని ఆ పేరుకు అర్థం. ఇది కొల్‌కతా నగర సారాంశం కూడా.

"మహిళలు తాము సురక్షితంగా ఉన్నట్టు భావించేలా చేయాల్సిన బాధ్యత పోలీసులదీ అధికారులదీ," తన మాటలను కొనసాగిస్తూ అన్నారు శుక్లా. "నిందితులను కాపాడటానికి చేస్తోన్న ప్రయత్నాలను చూశాక, అమ్మాయిలు తాము సురక్షితంగా ఉన్నామని ఎలా అనుకుంటారు?" పశ్చిమ మేదినీపూర్‌లో ఐసిడిఎస్ ఉద్యోగులకు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తోన్న శుక్లా అడిగారు.

"మా రైతు కూలీల రక్షణ కోసం వాళ్ళు [రాజ్యం] ఏం చేశారు?" నిరసనకారిణి మీతా రాయ్ అడిగారు. "గ్రామాల్లో బాలికలు రాత్రివేళల్లో బయటకు వెళ్ళటానికి భయపడుతున్నారు. అందుకే నేనిక్కడికి వచ్చాను. మహిళల, బాలికల రక్షణ కోసం మనం పోరాడాలి." రాయ్, హూగ్లీ (హుగ్లీ అని కూడా అంటారు) జిల్లాలోని నకుందా గ్రామానికి చెందిన రైతు కూలీ.

మలవిసర్జన కోసం బహిరంగ మైదానాల్లోకి వెళ్ళటం కంటే తనకు పక్కా మరుగుదొడ్డి ఉంటే బాగుంటుందని 45 ఏళ్ళ మీతా చెప్పారు. మీతా సొంతానికి రెండు బీఘాల భూమి ఉంది, అందులో ఆమె బంగాళా దుంపలు, ధాన్యం, నువ్వులు పండిస్తారు. కానీ ఈ మధ్య వచ్చిన వరదలు పంటలన్నిటినీ నాశనం చేసేశాయి. "మాకు ఎలాంటి పరిహారం అందలేదు," వ్యవసాయ కూలీగా రోజూ 14 గంటల పాటు పనిచేసి రూ. 250 సంపాదించే మీతా చెప్పారు. ఆమె తన భుజం మీద భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) జెండాను మోస్తున్నారు. భర్తను కోల్పోయిన ఆమెకు వితంతు పింఛను రావటంలేదు. తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వ పతాక కార్యక్రమమైన లక్ష్మీర్ భండార్ ద్వారా ఆమెకు రూ. 1,000 వస్తున్నప్పటికీ, తన కుటుంబాన్ని పోషించడానికి ఇది సరిపోదని ఆమె చెప్పారు.

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

కొల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గోడల మీద రాతలు

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

'రాజ్యం అత్యాచారం చేసినవారిని కాపాడుతున్నప్పుడు, రాజ్యమే అత్యాచారం చేసినట్టు,' అని నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గోడల మీద రాసిన రాత చెప్తోంది. కుడి: 'పితృస్వామ్యం నశించాలి’

*****

"నేను మహిళను కాబట్టే నేనిక్కడకు వచ్చాను."

మాల్దా జిల్లా, చాఁచల్ గ్రామం నుంచి వచ్చిన వ్యవసాయ కూలీ బాను బేవా తన జీవితమంతా కష్టపడుతూనే ఉన్నారు. తన జిల్లాకు చెందిన మహిళలతో కలిసి నిల్చొని ఉన్న ఈ 63 ఏళ్ళ మహిళ శ్రామిక మహిళల హక్కుల కోసం పోరాడాలని దృఢంగా నిశ్చయించుకున్నారు.

"మహిళలు రాత్రివేళల్లో కూడా పనిచేయగలగాలి," రాత్రిపూట అసుపత్రులలో మహిళలకు నైట్ డ్యూటీలు వేయరాదనే ప్రభుత్వ ఆదేశాల గురించి ప్రస్తావిస్తూ అన్నారు నమిత మహతో. ఈ కేసును మొదటినుంచీ పరిశీలిస్తోన్న సుప్రీమ్ కోర్ట్ బెంచ్ కూడా ఈ ఆదేశాలను విమర్శించింది.

యాభైల వయసులో ఉన్న నమిత, పురూలియా (పురులియా అని కూడా అంటారు) జిల్లా నుంచి వచ్చిన మహిళా బృందంతో కలిసి కాలేజ్ స్క్వేర్ గేటుల ముందు నిల్చొని ఉన్నారు. మూడు విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, అనేక పుస్తకాల దుకాణాలు, దుకాణాలు, ఇండియన్ కాఫీ హౌస్‌తో నిండి ఉన్న ఆ ప్రాంతం రద్దీగా ఉంది.

గౌరాంగ్‌దీ గ్రామం నుంచి వచ్చిన నమిత (రాష్ట్రంలో ఇతర వెనుకబడిన వర్గాలలో జాబితా అయివున్న) కుర్మీ సముదాయానికి చెందినవారు. ఒక కాంట్రాక్టర్ వద్ద రంగ్ మిస్తిరి (రంగులు వేసే పని)గా పనిచేసే నమితకు రోజుకు రూ. 300-350 వరకు వేతనాన్ని చెల్లిస్తారు. "నేను ఇళ్ళలోని కిటికీలకు, తలుపులకు, ఇనుప తడికలకు (గ్రిల్స్) రంగులు వేస్తాను," అన్నారామె. భర్త మరణించటంతో ప్రభుత్వం ఇచ్చే వితంతు పింఛను ఆమెకు అందుకుంటున్నారు.

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

ఎడమ: 'నేను మహిళను కాబట్టే ఇక్కడకు వచ్చాను,' అంటోన్న మాల్దా నుంచి వచ్చిన రైతు కూలీ బాను బేవా (పచ్చ చీర). కుడి: తాను పనిచేసే చోటును సురక్షితంగా ఉంచే బాధ్యత ఆ కంట్రాక్టర్‌దేనని పురూలియా నుంచి వచ్చిన రోజు కూలీ నమిత మహతో చెప్పారు

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

ఎడమ: న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాటలు పాడుతోన్న ఒక నిరసనకారుడు. కుడి: 'ఆర్.జి. కర్ సంఘటనపై వెల్లువెత్తిన నిరసనలు శ్రామికవర్గ మహిళల రోజువారీ పోరాటాలను కూడా ఎత్తిపట్టాలి,' అంటోన్న పశ్చిమ బెంగాల్ వ్యవసాయ కూలీల సంఘం అధ్యక్షుడు తుషార్ ఘోష్

నమిత ఒక ఇనుప కర్మాగారంలో పనిచేసే తన కొడుకుతోనూ, తన కోడలు, మనవరాలితోనూ కలిసి జీవిస్తున్నారు. ఆమె కుమార్తెకు వివాహమయింది. "మీకు తెలుసా, ఆమె అన్ని పరీక్షలలోనూ ఇంటర్వ్యూలలోనూ ఉత్తీర్ణురాలయింది, కానీ ఆమెకు ఉద్యోగ ఉత్తర్వులు మాత్రం ఎన్నడూ రాలేదు," అని నమిత ఫిర్యాదు చేశారు. "ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలివ్వటంలేదు." ఈ కుటుంబం తమకున్న ఒక్క బీఘా భూమిలో ఏడాదికి ఒకసారి ధాన్యం పండిస్తారు. పంటలు పండించేందుకు వీరు వర్షంపై ఆధారపడతారు.

*****

పని ప్రదేశంలో దాడికీ, హత్యకూ గురైన ఆర్.జి. కర్ యువ వైద్యురాలి ఉదంతం శ్రామికవర్గ మహిళల కష్టాలను అందరి దృష్టికి వచ్చేలా చేసింది. మత్స్యకార మహిళలకు, ఇటుక బట్టీల వద్ద పనిచేసేవారికి, MNREGA కార్మికులకు మరుగుదొడ్లు లేకపోవడం, క్రెష్‌లు లేకపోవడం, వేతనాలలో జెండర్ వ్యత్యాసం లాంటివి కేవలం కొన్ని సమస్యలు మాత్రమే అని పశ్చిమ బెంగాల్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు తుషార్ ఘోష్ ఎత్తి చూపారు. "ఆర్.జి. కర్ సంఘటనపై వెల్లువెత్తిన నిరసనలు శ్రామికవర్గ మహిళల రోజువారీ పోరాటాలను కూడా ఎత్తిపట్టాలి," అన్నారాయన.

ఆగస్ట్ 9, 2024న సంఘటన జరిగినప్పటి నుండి, పశ్చిమ బెంగాల్ నిరసనలతో చెలరేగిపోతోంది. నగరాల నుండి పట్టణాల నుండి గ్రామాల వరకు సాధారణ ప్రజలు, వారిలో గణనీయమైన సంఖ్యలో మహిళలు, రాత్రివేళల్లో బహిరంగ ప్రదేశాలలో తిరగగలిగే స్వేచ్ఛను తిరిగి సాధించేందుకు వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జరుగుతోన్న అవినీతి, అధికార దుర్వినియోగం, బెదిరింపు సంస్కృతిని రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ నిరసనల ద్వారా ప్రముఖంగా ఎత్తిచూపారు. ఇప్పుడు, ఆ ఘటన జరిగి నెల రోజులు దాటినా, నిరసనలు తగ్గుముఖం పట్టే సూచనలు మాత్రం కనిపించడం లేదు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sarbajaya Bhattacharya

ಸರ್ಬಜಯ ಭಟ್ಟಾಚಾರ್ಯ ಅವರು ಪರಿಯ ಹಿರಿಯ ಸಹಾಯಕ ಸಂಪಾದಕರು. ಅವರು ಅನುಭವಿ ಬಾಂಗ್ಲಾ ಅನುವಾದಕರು. ಕೊಲ್ಕತ್ತಾ ಮೂಲದ ಅವರು ನಗರದ ಇತಿಹಾಸ ಮತ್ತು ಪ್ರಯಾಣ ಸಾಹಿತ್ಯದಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಹೊಂದಿದ್ದಾರೆ.

Other stories by Sarbajaya Bhattacharya
Editor : Priti David

ಪ್ರೀತಿ ಡೇವಿಡ್ ಅವರು ಪರಿಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕರು. ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರಾದ ಅವರು ಪರಿ ಎಜುಕೇಷನ್ ವಿಭಾಗದ ಮುಖ್ಯಸ್ಥರೂ ಹೌದು. ಅಲ್ಲದೆ ಅವರು ಗ್ರಾಮೀಣ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತರಗತಿ ಮತ್ತು ಪಠ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಳವಡಿಸಲು ಶಾಲೆಗಳು ಮತ್ತು ಕಾಲೇಜುಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸುವ ಸಲುವಾಗಿ ಯುವಜನರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli