ఉమా పాటిల్ రెండు గదుల ఇంటిలో ఉన్న చిన్న ఇనుప బీరువాలో ఒక మూలన ఒక దశాబ్దకాలం పాటు చేతితో రాసిన రికార్డులు - పెద్ద రిజిస్టర్లు, నోట్ పుస్తకాలు, డైరీలు, సర్వే ఫారాల ఫొటోకాపీలు ఉన్నాయి. అవన్నీ మందంగా ఉన్న పోలిథిన్ సంచులలో ఒకదానిపై మరొకటి పెట్టివున్నాయి.

పెరుగుతూపోతోన్న ఈ దొంతరలలోనే మహారాష్ట్రలోని అనేక గ్రామీణ ప్రాంతాల ఆరోగ్యం - పిల్లల జననం, రోగనిరోధకత, కౌమార పోషణ, గర్భనిరోధం, క్షయవ్యాధి, ఇంకా మరెంతో సమాచారం - అధికృత సామాజిక ఆరోగ్య కార్యకర్తల (ఆశా - ASHA) ద్వారా నమోదు చేయబడివుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మిరాజ్ తాలూకా లోని అరాగ్ గ్రామ ప్రజల కోసం ఉమ, 2009 నుండి ఈ భారీ పుస్తకాలను నిర్వహిస్తున్నారు. ఇంకా, ఆరోగ్య సమస్యల గురించి పదేపదే గ్రామానికి తెలియజేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు.

45 ఏళ్ళ వయసున్న ఉమ లాగే గ్రామీణ మహారాష్ట్ర వ్యాప్తంగా 55,000 మంది ఆశాలు తమ గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందేలా చూసేందుకు ప్రతిరోజూ గంటల తరబడి పనిచేస్తున్నారు. ఈ కార్మికశక్తి 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్ఎచ్ఎమ్)లో భాగంగా స్థాపించబడింది. అందరూ మహిళలే అయిన ఈ సామాజిక ఆరోగ్య కార్యకర్తలు 23 రోజుల శిక్షణ అనంతరం నియమితులయ్యారు. ఆదివాసీ గ్రామాలలో ప్రతి 1,000 మంది జనాభాకు ఒక ఆశాను (కనీసం 8వ తరగతి వరకు చదివినవారు), ఆదివాసీయేతర గ్రామాల్లో ప్రతి 1,500 మంది జనాభాకు ఒకరిని (కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులు) ఎన్ఆర్ఎచ్ఎమ్ తప్పనిసరి చేసింది.

దాదాపు 15,600 మంది జనాభా కలిగిన పెద్ద గ్రామమైన అరాగ్‌లో, ఉమతో పాటు మరో 15 మంది ఆశాలు ప్రతిరోజూ ఉదయం 10 గంటల సమయంలో వివిధ ప్రాంతాలకు బయలుదేరతారు. మిరాజ్ తాలూకాలోని బెడగ్, లింగనూర్, ఖాటవ్, శిందేవాడీ, లక్ష్మీవాడీ గ్రామాలకు అరాగ్ ప్రధాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా. దాదాపు 47,000 మంది జనాభాకు 41 మంది ఆశాలు ఉన్నారు.

ప్రతి ఆశా, తనకు కేటాయించిన ప్రతి ఇంటికి వెళ్తుంది. సాధారణంగా నిర్దేశించిన రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువ సమయాన్నే ఈ పనిలో గడుపుతుంది. “గ్రామంలోనే ఇళ్ళు ఉంటే, రెండు గంటల్లోనే 10-15 ఇళ్ళకు వెళ్ళవచ్చు. కానీ కొందరు గ్రామ సరిహద్దులలోనో లేదా పొలాల్లోనో ఉంటుంటారు. అప్పుడు నాలుగు ఇళ్ళకు వెళ్ళినా కూడా ఐదు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా మేం పొదలు, పొలాలు, బురద దారులగుండా కిలోమీటర్ల దూరం నడవాలి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది," అని ఉమ చెప్పారు.

Uma handling her record books
PHOTO • Jyoti
Uma filling in her record books
PHOTO • Jyoti

కాగితాలపై రాసే పని కూడా ఆశాల పనిలో భాగమే. స్టేషనరీ, ఫోటోకాపీలకు అయ్యే ఖర్చులను కూడా తామే భరిస్తామని సాంగ్లీ జిల్లాలోని అరాగ్ గ్రామానికి చెందిన ఉమా పాటిల్ చెప్పారు

ఆశాల గృహ సందర్శనలో - ఆరోగ్య సంరక్షణ, గర్భనిరోధం వంటివాటి గురించి కుటుంబాలతో మాట్లాడటం, దగ్గు, జ్వరాల వంటి చిన్న రోగాలకు ఉపశమనాన్ని అందించడం, గర్భిణీ స్త్రీలను ప్రసవం కోసం, బిడ్డకు పాలు ఇచ్చేందుకు సిద్ధం చేయడం, నవజాత శిశువులను (ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టినవారు, నెలలు నిండకుండానే పుట్టినవారు) పర్యవేక్షించడం, అతిసారం, రక్తహీనత, పోషకాహార లోపాలతో బాధపడుతున్న పిల్లల జాడ తీయడం, వారికి టీకాలన్నీ వేసేలా చూడటం, క్షయ, మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి లేదా చికిత్స అందించడానికి ప్రయత్నాలు చేయటం - వంటివన్నీ ఉంటాయి.

ఇది అంతేలేని పనుల జాబితా. “ఏదైనా (ఆరోగ్య) సర్వే లేదా ఆరోగ్య సదుపాయాన్ని ఒక్క ఇల్లు కూడా పోగొట్టుకోకుండా మేం చూసుకుంటాం- పనుల కాలాన్నిబట్టి వలస వచ్చినవారు, వారి కుటుంబాలతో సహా,” అని ఉమ చెప్పారు. ఆమె తన భర్త అశోక్‌తో కలిసి తమ ఎకరం పొలంలో బేబీ కార్న్‌ను కూడా పండిస్తున్నారు.

ప్రతిఫలంగా, ప్రభుత్వం 'ప్రోత్సాహకాలు' లేదా 'గౌరవ వేతనం' అని పిలిచే ఆశా నెలవారీ సంపాదన - చేసిన పనిని బట్టి - మహారాష్ట్రలో సగటున కేవలం రూ. 2,000 నుండి రూ. 3,000 వరకూ ఉంటుంది. ఉదాహరణకు, పంపిణీ చేసిన కండోమ్‌, నోటి మాత్రల ప్యాకెట్‌ ఒక్కింటికి ఆమెకు ఒక్క రూపాయిని చెల్లిస్తారు. ఆమె చేయించిన ప్రతి సంస్థాగత ప్రసవానికి రూ. 300, నవజాత శిశువును తనిఖీ చేయడానికి 42 సార్లు ఇళ్ళకు వెళ్తే రూ. 250 చెల్లిస్తారు.

Paper works
PHOTO • Jyoti
Paper Work
PHOTO • Jyoti
Paper Work
PHOTO • Jyoti

రాత పని అంతులేకుండానూ, విస్తారంగానూ ఉంటుంది: ఇవి ఆశాలు శ్రద్ధగా నిర్వహించే నోటు పుస్తకాలు, రిజిస్టర్లు, వివిధ సర్వే పత్రాలు

అదనంగా, ఎల్లప్పుడూ కుప్పలుగా పేరుకుపోతుండే నోట్‌పుస్తకాలలో ఆరోగ్య కార్యకర్తలు తమ గృహ సందర్శనల గురించి, పర్యవేక్షణ గురించి, సర్వేల గురించిన సమాచారాన్ని నమోదుచేస్తుండాలి. “నేను నెలకు రూ. 2,000 సంపాదిస్తాను. అందులోంచి సుమారు రూ. 800 నోట్‌బుక్‌లు, జిరాక్స్, ప్రయాణ ఖర్చులు, మొబైల్ రీఛార్జ్‌లపై ఖర్చుపెడతాను,” అని ఉమ చెప్పారు. “మేం ప్రతి ఒరిజినల్ పత్రానికి రెండు ఫోటోకాపీలను తీసుకోవాలి. ఒకటి మేం ఫెసిలిటేటర్‌కు ఇస్తాం, మరొకటి మాతోనే ఉంటుంది. రెండువైపులా [ఫోటోకాపీ] చేయడానికి రూ. 2 ఖర్చవుతుంది...”

ఈ పత్రాలు అసంఖ్యాకంగా ఉంటాయి - గృహ ఆధారిత నవజాత శిశు సంరక్షణ పత్రం, గర్భిణీ స్త్రీల కోసం జననీ సురక్ష యోజన పత్రం, మరుగుదొడ్లు, తాగునీటి వనరులపై కుటుంబ సర్వేలు, కుష్టు వ్యాధిపై డేటా - ఇదిలా కొనసాగుతుంది. ఆపై గ్రామ ఆరోగ్యం, పోషకాహార దినోత్సవం సర్వే ఉంటుంది. ఈ నెలవారీ ఈవెంట్‌కు ఎంతమంది హాజరయ్యారు, హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించటం, వ్యాధి నిరోధక పిల్లలు, పోషకాహార లోపం - ఇలా మొత్తం 40 వివరాలను కలిగి ఉంది.

ఉమ, ఇంకా ఇతర ఆశాలు సేకరించిన విస్తారమైన డేటాను ప్రతి నెలాఖరున రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఎచ్ఎమ్ సైట్‌ లోకి అప్‌లోడ్ చేస్తారు. నేను అరాగ్ పిఎచ్‌సికి వెళ్ళినప్పుడు అక్కడ ఫెసిలిటేటర్‌గా పనిచేస్తోన్న 28 ఏళ్ళ ప్రియాంక పూజారి, ఈ సైట్‌ను అప్‌డేట్ చేయడం కోసం కష్టపడుతూ కనిపించింది. ఆరోగ్య కేంద్రంలో మూడు ఒంటి అంతస్తు భవనాలు ఉన్నాయి. ఇందులో ఒక కంప్యూటర్, డాక్టర్ క్యాబిన్, సందర్శకులు కూర్చునే స్థలం, రక్త పరీక్షల కోసం ఒక ప్రయోగశాల, మందుల కోసం ఒక స్టోర్ రూమ్ ఉన్నాయి. సాధారణంగా, ఒక ‘ఫెసిలిటేటర్’ 10 మంది ఆశాల పనిని పర్యవేక్షిస్తారు. పిఎచ్‌సిలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తారు. పిఎచ్‌సిలో (కనీసం కాగితం మీదనైనా) ఒక నర్సు, ఒక విజిటింగ్ డాక్టర్, మెడికల్ టెక్నీషియన్‌లు కూడా ఉన్నారు.

Priyanka Pujari filling the data on ASHA website
PHOTO • Jyoti
Reviewing some paper works
PHOTO • Jyoti

అరాగ్‌లో ప్రియాంక పూజారి (ఎడమ), పిఎచ్‌సిలోని ఇతర 'ఫెసిలిటేటర్‌లు' రికార్డులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. వీరి పనులలో ఆశాలను పర్యవేక్షించడం, సమావేశాలు నిర్వహించడం వంటివి ఉన్నాయి

“ఏప్రిల్ నుండి ఆశా సైట్ డౌన్ అయింది, నవంబర్‌లో తిరిగి ప్రారంభమైంది. ఇంతకు ముందు నెలలలో పెండింగ్‌లో ఉన్న డేటాతో పాటు ప్రస్తుత నెల డేటాను కూడా అప్‌డేట్ చేస్తున్నాను. తరచుగా లోడ్-షెడ్డింగ్ [విద్యుత్ కోతలు], బలహీనమైన ఇంటర్నెట్ కనెక్షన్ కారణంగా పని ఆగిపోతుంటుంది,” అని ప్రియాంక చెప్పింది. ఆమె బిఎ, ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తిచేసిన తర్వాత మూడేళ్లుగా ఫెసిలిటేటర్‌గా పనిచేస్తోంది. ఆమె అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామమైన లింగనూర్ నుండి ఈ పిఎచ్‌సికి స్కూటీ మీదనో, లేదా రాష్ట్ర రవాణా బస్సులోనో వస్తుంటుంది. ఆమె పనులలో ఆశాల పనిని పర్యవేక్షించడం, నెలవారీ సమావేశాలు నిర్వహించడం, పిఎచ్‌సికి వచ్చే వ్యక్తులను కలుసుకోవటం వంటివి ఉన్నాయి.

ప్రియాంక నెలకు రూ. 8,375 సంపాదిస్తుంది. అయితే, ఆమె నవజాత శిశువులను చూసేందుకు, ప్రసవానంతర పరీక్షలు చేయించడం కోసం నెలలో కనీసం 20సార్లు ఇంటి సందర్శనలను పూర్తిచేసి, ఆశా సైట్‌ను అప్‌డేట్ చేయడానికి ఐదు రోజులు పనిచేసినప్పుడు మాత్రమే ఆమెకు ఆ జీతం వస్తుంది. “మేం నెలలో 25 రోజులు పనిచేయడంలో విఫలమైతే, మా జీతంలో కోత పడుతుంది. నెల వేతనాన్ని పొందాలంటే, ఆశా, ఫెసిలిటేటర్‌లిద్దరూ తప్పనిసరిగా తమ పనిని బ్లాక్ కమ్యూనిటీ మొబిలైజర్‌లకు [పై స్థాయి ఆరోగ్య అధికారులు] సమర్పించాలి."

పిఎచ్‌సిలో జరిగే నెలవారీ సమావేశాలలో ప్రియాంక, ఆరోగ్య కార్యకర్తలందరి ఉమ్మడి సమస్యలను గురించి కూడా మాట్లాడుతుంది. "కానీ ఏమీ జరగదు," అందామె. “ఈ మధ్యనే మాకు ఐదు 50 పేజీల నోట్‌ పుస్తకాలు, 10 పెన్నులు, ఒక పెన్సిల్ బాక్స్, 5 మి.లీ.ల జిగురు డబ్బా, ఒక రూలర్‌తో కూడిన ఈ స్టేషనరీ కిట్‌ను ఇచ్చారు. ఇవి ఎంతకాలం వస్తాయి?”

వైద్య సామాగ్రి కొరత, తరచుగా ఎదుర్కొనే మరొక సమస్య. “మాకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రల పెట్టెలు వచ్చి మూడు నెలలైంది. జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి వంటి వాటికి మందుల కోసం ఎవరైనా రాత్రిపూట మా వద్దకు వస్తే, ఇచ్చేందుకు అవి మా దగ్గర లేవు," అని 42 ఏళ్ళ ఛాయా చవాన్ చెప్పారు. ఈమె నెలకు సగటున రూ. 2,000 ‘గౌరవ వేతనం’గా పొందుతారు. సమీపంలోనే ఉన్న ఒక పంచదార కర్మాగారంలో గార్డుగా పనిచేస్తోన్న ఆమె భర్త రామ్‌దాస్ నెలకు రూ. 7,000 సంపాదిస్తారు.

Shirmabai Kore sitting on her bed
PHOTO • Jyoti
Chandrakant Naik with his daughter
PHOTO • Jyoti

ప్రభుత్వం ఆశాలను తక్కువగా చూస్తున్నప్పటికీ, శిర్మాబాయి కోరె (ఎడమ), చంద్రకాంత్ నాయక్ (కుడి) వంటి అనేకమంది గ్రామస్తులు వారి ప్రయత్నాలను అభినందిస్తున్నారు

ఇప్పటికీ, గ్రామీణ భారతదేశంలోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ఈ ఫీల్డ్ వర్కర్లపైనే ఆధారపడి ఉంది. వారు దేశ ఆరోగ్య సూచికలను మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడతారు. ఉదాహరణకు, 2015-16లో మహారాష్ట్ర శిశు మరణాల రేటు 1,000 సజీవ జననాలకు 24 మరణాలుగా ఉండగా, 2005-06లో అది 38 మరణాలుగా ఉందని; సంస్థాగత ప్రసవాలు 2005-06లో 64శాతం ఉండగా, అవి 2015-16 నాటికి 90.3 శాతానికి పెరిగాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 పేర్కొంది.

“ఆశా సమాజానికీ, ప్రజారోగ్య వ్యవస్థకూ మధ్య వారధిగా పనిచేస్తుంది. తల్లుల, నవజాత శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది. నిరంతరం ఆమె చేసే ఇంటి సందర్శనలు, అనారోగ్యాల గురించి క్రమం తప్పకుండా ప్రజలతో మాట్లాడుతుండటం వంటివి ముందుజాగ్రత్త చర్యలుగా పనిచేస్తాయి," అని ముంబైలోని ప్రజా లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్-ప్రసూతి వైద్యుడుగా పనిచేస్తోన్న డాక్టర్ నిరంజన్ చవాన్ చెప్పారు.

ఆరోగ్యానికి సంబంధించిన ఏ పరిస్థితిలోనైనా తరచుగా మొదటి రక్షణ రేఖగా ఉండేవారు ఆశాలే. “ఆరు నెలల క్రితం, లక్ష్మీవాడీలో [మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది] ఒక వ్యక్తికి స్వైన్ ఫ్లూ వచ్చింది. ఆ గ్రామానికి చెందిన ఆశా వెంటనే అరాగ్ పిఎచ్‌సికి సమాచారం అందించారు,” అని ఉమ గుర్తు చేసుకున్నారు. “డాక్టర్లు, సూపర్‌వైజర్ల బృందం అక్కడికి వెళ్ళి ఒక్క రోజులో మొత్తం 318 ఇళ్ళను సర్వే చేసింది. లక్షణాలు ఉన్నవారి రక్త నమూనాలను తీసుకున్నాం. అయితే మరో కేసు లేదు.”

అయితే, ఆశాల వలన వచ్చిన మార్పుని గ్రామస్తులు గుర్తిస్తున్నారు. "రెండేళ్ళ క్రితం నాకు కంటిశుక్లం ఆపరేషన్ చేసేవరకు నేను ఎప్పుడూ ఆసుపత్రిని చూడలేదు," వృద్ధురాలైన శిర్మాబాయి కోరే చెప్పారు. “ఉమ మమ్మల్ని నడిపించింది. నా కోడలు శాంతాబాయికి క్షయవ్యాధి వచ్చినప్పుడు [2011-12లో] ఆ రెండేళ్ళు కూడా ఆమె బాగోగులు ఉమే చూసుకుంది. ఈ యువతులు [ఆశాలు] నావంటి వృద్ధుల, యువకుల, పిల్లల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నారు. మా కాలంలో అలాంటిదేమీ లేదు. అప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు?” అన్నారు శిర్మాబాయి.

Yashodha (left), and her daughter, with Chandrakala
PHOTO • Jyoti
Chandrakala checking a baby at primary health centre
PHOTO • Jyoti
Chandrakala Gangurde
PHOTO • Jyoti

బిడ్డను ప్రసవించడంలో యశోద (ఎడమ)కు సహాయం చేసిన నాసిక్ జిల్లాకు చెందిన చంద్రకళ గంగుర్దే. ఒక ఆశాగా ఆమెకున్న అనేక పనులలో పిఎచ్‌సి (మధ్య) వద్ద కొత్తగా తల్లులైనవారిని పర్యవేక్షించడం కూడా ఉది. అయితే, తన స్వంత జీవితమే ఒక పోరాటంగా మిగిలిపోయిందని ఆమె (కుడి) కన్నీళ్ళతో చెప్పారు

అరాగ్‌కే చెందిన చంద్రకాంత్ నాయక్ అనే 40 ఏళ్ళ రైతు కూడా ఇటువంటి అనుభవాన్నే చెప్పారు. “మూడేళ్ళ క్రితం, నా నాలుగేళ్ళ మేనకోడలికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వచ్చినప్పుడు మాకు ఏంచేయాలో తోచలేదు. సహాయం కోసం ఉమ ఇంటికి పరిగెత్తాను. ఆమె అంబులెన్స్‌కి కాల్ చేసింది. మేం ఆ పాపను పిఎచ్‌సికి తీసుకెళ్ళాం..."

ఆశాలు అటువంటి అత్యవసర పరిస్థితులను నిభాయించడానికి అలవాటుపడ్డారు. సాధారణంగా తక్షణ ఖర్చుల కోసం వారు తమ స్వంత డబ్బునే ఖర్చు చేస్తారు. నాసిక్ జిల్లాలోని త్ర్యంబకేశ్వర్ తాలూకా లోని తల్వాడే త్ర్యంబక్ గ్రామానికి చెందిన ఆశా, 32 ఏళ్ళ చంద్రకళ గంగుర్దే 2015లో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు: “అది రాత్రి 8 గంటల సమయం. యశోదా సౌరే ప్రసవ వేదన పడుతోంది. మేం దాదాపు 45 నిమిషాల పాటు అంబులెన్స్ కోసం వేచి ఉన్నాం. ఆ తర్వాత పొరుగునే ఉన్న ఓ భవనపు యజమాని దగ్గర ఒక ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకున్నాను. మేం ఆమెను నాసిక్‌లోని [సుమారు 26 కిలోమీటర్ల దూరం] పౌర ఆసుపత్రికి తీసుకెళ్ళాం. రాత్రంతా నేను అక్కడే ఉన్నాను. ఆమె ఒక అమ్మాయిని ప్రసవించింది, ఆ పాపకు ఇప్పుడు మూడు సంవత్సరాలు."

“నేను చంద్రకళాతాయికి చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఆసుపత్రిగానీ, డాక్టర్ గానీ మాకు అందుబాటులో లేరు. కానీ తాయి సహాయం చేసింది," అంది 25 ఏళ్ళ యశోద. ఈ ‘సంస్థాగత ప్రసవం’ అయ్యేలా చూసినందుకు కేంద్ర ప్రభుత్వ జననీ సురక్ష యోజన (మాతా శిశు మరణాలను తగ్గించడం దీని లక్ష్యం) కింద చంద్రకళకు రూ. 300 గౌరవ వేతనంగా లభించింది. ఆమె వాహన యజమానికి రూ. 250 చెల్లించి, టీ బిస్కెట్ల కోసం రూ. 50ని ఖర్చుపెట్టారు.

అటువంటి పరిస్థితుల్లో, చంద్రకళ చేసినట్లుగానే, ఆశా కొన్నిసార్లు ఆసుపత్రిలో రాత్రిపూట ఉండవలసి వస్తుంది. అంటే దీని అర్థం ఆ పూటకు ఆ ఆశాకు ఆహారం ఉండదు, విశ్రాంతి తీసుకోవడానికి స్థలమూ ఉండదు. “అత్యవసర పరిస్థితుల్లో, ఆహారాన్ని మూటగట్టుకు పోవడానికి ఎవరికి సమయం ఉంటుంది? మన పిల్లలనీ, కుటుంబాన్నీ విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోవాలి. నేను ఆ రాత్రంతా మేల్కొని ఉన్నాను. మంచం పక్కనే నేల మీక ఒక షీట్ పరచుకొని ఊరికే పడుకున్నాను,” అని చంద్రకళ చెప్పారు. ఆమె తన భర్త సంతోష్‌తో కలిసి తమ ఎకరం పొలంలో గోధుమలు, లేదా వరిని కూడా పండిస్తారు. “మాకు ఆదివారం అంటూ ఏమీ ఉండదు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే. సహాయం కోసం ఎవరైనా ఎప్పుడైనా నాకు కాల్ చేయవచ్చు."

Protest

ప్రభుత్వం తమకిచ్చే చెల్లింపును పెంచాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా సంఘాలు, సంస్థలు అనేక ఆందోళనలు చేశాయి. ఇది 2018 ఆగస్టులో సాంగ్లీ కలెక్టర్ కార్యాలయం వెలుపల జరిగింది

అంబోలి పిఎచ్‌సి పరిధిలోని 10 మంది ఆశాలలో చంద్రకళ కూడా ఉన్నారు, ఆమె త్ర్యంబకేశ్వర్ తాలూకా లోని ఇతర గ్రామాల నుండి వచ్చే ఆరోగ్య కార్యకర్తలతో కలిసి నెలకు రెండుసార్లు సమావేశాలకు వెళుతుంటారు. “అందరు మాట్లాడేది ఇలాంటి అనుభవాల గురించే. ఆశాలు నిరుపేద కుటుంబాల నుంచే వస్తారు. ఆమె ఆర్థికంగా కష్టాలుపడుతున్నా కూడా గ్రామాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కష్టపడి పనిచేస్తుంది," అంటూ చంద్రకళ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

ఇతర ఆశాల మాదిరిగానే ఆమె కూడా తమకు చెల్లించే మొత్తాలను పెంచాలని కోరుతున్నారు. "ఇదేమీ పెద్ద డిమాండ్ కాదు. గౌరవ వేతనాన్ని రెట్టింపు చేయాలి, ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులను చెల్లించాలి. ఇతరుల ఆరోగ్యం కోసం మేం మా జీవితాన్నంతా ధారపోసినప్పుడు, కనీసం ఈ మాత్రమైనా డిమాండ్ చేయొచ్చు కదా," అని గద్గద స్వరంతో చెప్పారు చంద్రకళ.

ప్రభుత్వం తమకు చేసే చెల్లింపులను పెంచాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా సంఘాలు, సంస్థలు అనేక ఆందోళనలు చేశాయి. సెప్టెంబరు 2018లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని నిరంతరం చేయవలసిన పనులకిచ్చే చెల్లింపులలో పెరుగుదలను, లేదా 'ప్రోత్సాహకాలను' ప్రకటించారు; ఉదాహరణకు, గ్రామ ఆరోగ్య రిజిస్టర్ నిర్వహణకు ఇచ్చే రూ.100ను, రూ.300కు పెంచారు.

అయితే ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు ఈ ప్రతిపాదనను విమర్శించారు. “మేం పదే పదే, నిర్ణీత [కనీస] నెలవారీ జీతం రూ. 18,000 ఉండాలని, అలాగే బీమా రక్షణ, పింఛను, ఆశాలను శాశ్వత వర్కర్లుగా చేయడాన్ని [ఇతర ప్రయోజనాలతో పాటు] డిమాండ్ చేశాం. రొటీన్ ప్రోత్సాహకాన్ని పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదు," అని మహారాష్ట్ర ఆశాలు, మరియు ఆరోగ్య ఉద్యోగుల సంస్థ అధ్యక్షుడు, సాంగ్లీకి చెందిన శంకర్ పూజారి చెప్పారు.

ఇంతలో, అరాగ్ గ్రామ పిఎచ్‌సిలో ఉమ, ఇంకా ఇతరులు జనవరిలో ముంబైలో ఆశాలు చేయబోతున్న నిరసన గురించి మాట్లాడుతున్నారు. “ఇంకో ఆందోళన,” ఉమ నిట్టూర్చారు. "ఏం చేయాలి? ఆశాలు [‘ఆశా’ అనే పదానికి ఆశ అని అర్థం] కేవలం ఆశతో మాత్రమే మనుగడ సాగిస్తున్నారు."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

ಜ್ಯೋತಿ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಹಿರಿಯ ವರದಿಗಾರರು; ಅವರು ಈ ಹಿಂದೆ ‘ಮಿ ಮರಾಠಿ’ ಮತ್ತು ‘ಮಹಾರಾಷ್ಟ್ರ1’ನಂತಹ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ.

Other stories by Jyoti
Editor : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli