తన చనిపోయిన కొడుకు జ్ఞాపకాలుగా మిగిలిన ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను ఎలా పెంచాలో తెలియక ఆ పిల్లల నాన్నమ్మ ఆందోళన చెందుతున్నారు; పిల్లలందరిలోకి చిన్నది – ఆరేళ్ళ జానకి. “నేను వాళ్ళందర్నీ ఎలా పెంచబోతున్నానో నాకు తెలియదు,” ఒడిశా బాలాంగీర్ జిల్లాలోని హియాల్ గ్రామంలో నివసించే 70 ఏళ్ళ గోండు ఆదివాసి, బూటే మాఝీ అన్నారు.

రెండు సంవత్సరాల క్రితం, 50 ఏళ్ళ వయసున్న ఆమె కొడుకు నృపా మాఝీ మరణించారు. ఆయన మూత్రపిండాలు విఫలం కావడం వల్ల చనిపోయారని కుటుంబం భావిస్తోంది. వలస కార్మికుడైన నృపా మాఝీ, ఆయన భార్య 47 ఏళ్ళ నామనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో ఉన్న ఇటుక బట్టీలలో పనిచేయడానికి వెళ్ళేవారు.

“నవంబర్ 2019లో, చెన్నైలోని ఒక ఇటుక బట్టీలో పని చేయడానికి వెళ్ళాం,” నామని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబానికి చెందిన 10 మంది అక్కడికి వెళ్ళామని – తన భర్త నృపా(50), వారి పెద్ద కొడుకు జుదిష్ఠిర్ (24), అతని భార్య పర్మిల (21), 19 ఏళ్ళ పూర్ణమి, 16 ఏళ్ళ సజని, 15 ఏళ్ళ కుమారి, ఆమె భర్త దినేష్ (21) - ఆమె చెప్పారు. వారితో పాటు పదేళ్ళ సావిత్రి, ఆరేళ్ళ జానకి కూడా వెళ్ళారు. కానీ ఆ ఇద్దరికీ కూలి ఉండదు.

జూన్ 2020 నాటి కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో, వాళ్ళందరూ తమ గ్రామానికి తిరిగి వచ్చారు. అలా తిరిగి వచ్చిన వలసదారుల కోసం పాఠశాలల్లో, కమ్యూనిటీ సెంటర్లలో తాత్కాలిక వైద్య సంరక్షణ, క్వారంటైన్ కేంద్రాలను ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. “మా ఊరి బడిలో మేం 14 రోజులు ఉన్నాం. అక్కడ ఉన్నందుకుగాను నాకూ నా భర్తకూ చెరొక రూ. 2,000 (ఒడిశా ప్రభుత్వం) ఇచ్చారు,” అని నామని తెలిపారు.

Namani Majhi sitting with her children in front of their house in Hial village in Balangir district.
PHOTO • Anil Sharma
Her mother-in-law, Bute Majhi
PHOTO • Anil Sharma

బాలాంగీర్ జిల్లా హియాల్ గ్రామంలోని తమ ఇంటి ముందు తన పిల్లలతో కూర్చున్న నామని మాఝీ. ఆమె అత్తగారు బూటే మాఝీ

కానీ త్వరలోనే చిక్కులు మొదలయ్యాయి. “అతను (భర్త నృపా) చెన్నైలోనే అనారోగ్యానికి గురయ్యాడు. సేఠ్ (స్థానిక కాంట్రాక్టర్) అతనికి గ్లూకోజ్ నీళ్ళు, కొన్ని మందులు ఇచ్చేవాడు. మేం మా గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతని ఆరోగ్య సమస్యలు కొనసాగాయి,” నామని గుర్తుచేసుకున్నారు. చికిత్స నిమిత్తం అతనిని కాంటాబాంజీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారావిడ. “నా కొడుక్కి రక్త ఝాడా (రక్తపు విరేచనాలు) మొదలయ్యాయి,” అంటూ నృపా తల్లి బూటే మాట కలిపారు.

కుటుంబ సభ్యులు అతన్ని సింధెకేలా, రామ్‌పుర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్ళారు. చివరకు తిరిగి కాంటాబాంజీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతనికి కమ్‌జోరీ (బలహీనత) ఉందని అక్కడి వైద్యుడు తెలిపారు. “మా దగ్గర డబ్బు లేకపోవడంతో తిరిగి వచ్చేసి, డబ్బు సమకూర్చుకునే పనిలో పడ్డాం. మేం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు అతని (నృపా) మూత్రపిండాలు పనిచేయడంలేదని చెప్పారు.”

దాంతో, ఇతర అవకాశాలను ప్రయత్నించాలని నిశ్చయించుకున్న నామని, ప్రత్యామ్నాయ వైద్యానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. “ఆయుర్వేద చికిత్స కోసం అతన్ని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధెకేలాకు తీసుకెళ్ళమని నా తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. అతనక్కడ ఒక నెలకు పైగా మందులు తీసుకున్నాడు కానీ కోలుకోలేదు,” అని ఆమె తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, వారతనిని 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నాఘర్ సమీపంలోని రామ్‌పూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

మార్చి 2021లో నృపా మరణించారు; అతనికి ఎనిమిది మంది పిల్లలు. అందరిలోకీ చిన్నపిల్లకి ఆరేళ్ళు మాత్రమే.

Namani holding her eight-month-old granddaughter, Dhartiri.
PHOTO • Anil Sharma
While being photographed, Janaki tries to hide behind her mother Namani
PHOTO • Anil Sharma

తన ఎనిమిది నెలల మనవరాలు ధర్తిరీని ఎత్తుకున్న నామని. ఫోటో తీస్తున్నప్పుడు, తన తల్లి నామని వెనుక దాక్కోవడానికి ప్రయత్నిస్తోన్న జానకి

మళ్ళీ వలసపోవడంపై నామని ఇప్పటికీ అయోమయంలో ఉండడంతో, నృపా వైద్య బిల్లులు చెల్లించడానికి, కొంతకాలంపాటు ఇల్లు నడవడానికి, పరిహారం కోసం ప్రయత్నించవచ్చని కుటుంబం ఆశించింది. “నా భర్త చికిత్స కోసం చేసిన అప్పులను తిరిగి చెల్లించడానికి మేం మళ్ళీ వలస వెళ్ళవలసిరావచ్చు. ప్రభుత్వం నుంచి కొంత సాయం అందితే మాత్రం మేం వెళ్ళం.”

2018లో, సంక్షేమ బోర్డులో లబ్ధిదారుగా నమోదు చేసుకున్న కొద్దిశాతం ఒడియా కార్మికులలో మరణించిన నృపా కూడా ఉన్నారు. అయితే, అతని కుటుంబానికి దానివల్ల ఎటువంటి నిధులూ అందలేదు. నామని సూచిస్తున్న రూ. 2 లక్షల 'సహాయం'- మరణించిన తన భర్తకు 'ఒడిశా భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు'లో సభ్యత్వం ఉన్నందున, అందాల్సినది. అయితే, “మూడు సంవత్సరాలుగా మేం రుసుము (పునరుద్ధరణ) చెల్లించనందున మాకు డబ్బు రాదని వాళ్ళు (కార్మిక శాఖ అధికారులు) చెప్పారు,” అన్నారామె.

రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆధీనంలో నిధులున్నాయని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఎజి) తన రాష్ట్ర ఆర్థిక నివేదికలో పేర్కొంది. “2020-21లో, కార్మిక సుంకం (సెస్) రూపంలో సేకరించిన రూ.406.49 కోట్లు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా, ‘ప్రభుత్వ ఖాతా’కు సంబంధం లేకుండా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ప్రభుత్వ ఖజానా శాఖలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఫ్లెక్సీ పొదుపు ఖాతాల రూపంలో ఉన్నాయని” కూడా ఆ నివేదిక తెలిపింది.

“నృపా అనారోగ్యం పాలైనప్పుడు, డబ్బు సహాయం కోసం తన సోదరి ఊమే (అతని ఏకైక తోబుట్టువు) దగ్గరికి వెళ్ళాడు,” అని బూటే తెలిపారు. వివాహిత అయిన ఊమే సమీపంలోని మాల్‌పాడా (మాల్‌పారా అని కూడా అంటారు) గ్రామంలో నివసిస్తున్నారు. “ఆమె తన నగలను అతనికి ఇచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరంటే మరొకరు అంత ఆప్యాయతతో ఉండేవారు.” తన చికిత్స కోసం కొన్ని వేల రూపాయలకు ఆ నగలను తాకట్టుపెట్టారు నృపా.

Left: The two kachha houses in which the family of late Nrupa Majhi live.
PHOTO • Anil Sharma
Right: These stones were purchased by Bute and her husband Gopi Majhi to construct their house under Indira Awaas Yojna, but Gopi's demise has paused that work
PHOTO • Anil Sharma

ఎడమ: మరణించిన నృపా మాఝీ కుటుంబం నివసించే రెండు కచ్చా ఇళ్ళు. కుడి: ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటిని నిర్మించుకోవడం కోసం ఈ రాళ్ళను బూటే, ఆమె భర్త గోపీ మాఝీలు కొనుగోలు చేశారు. కానీ గోపీ మరణించడంతో ఆ పని ఆగిపోయింది

బూటే, మరణించిన ఆమె భర్త గోపీ మాఝీల కుటుంబానికి 2013లో ప్రభుత్వం ఒక ఇంటిని కేటాయించింది. గోపీ మాఝీ 2014లో మరణించారు. “గోపీ బతికున్నప్పుడు మాకు మూడు విడతల్లో రూ. 40,000 నగదు సహాయం అందింది – రూ.10,000 ఒకసారి, రూ.15,000 ఒకసారి, రూ.15,000, ఇంకోసారి,” బూటే వివరించారు. ఇంటి నిర్మాణం కోసం రాళ్ళను, ఇసుకను కొనుగోలు చేసింది ఆ కుటుంబం. కానీ గోపీ మాఝీ మరణించడంతో, ఇంటి నిర్మాణం ఆగిపోయింది.

“ఏదో ఈ కచ్చా ఇంటిలో ఇలా ఉంటున్నాం,” ఉపయోగించడం కోసం ఎదురుచూస్తోన్న రాళ్ళ వరుస వైపు చూపిస్తూ అన్నారు బూటే.

తన కొడుకు, కోడల్లాగా ఎప్పుడూ వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళి పని చేయలేదు బూటే. “మేం జీవనోపాధి కోసం మా కుటుంబానికి చెందిన భూమిని సాగు చేసుకునేవాళ్ళం. పని కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళడాన్ని నృపాయే మొదలుపెట్టాడు,” అని ఆమె తెలిపారు. తమ భూమిని తనఖా పెట్టి, ఆ గ్రామ గౌఁటియా (వడ్డీ వ్యాపారి) దగ్గర రూ.1 లక్ష అప్పు చేసింది ఆ కుటుంబం.

“జుదిష్ఠిర్ (నృపా కొడుకు) పనికి వెళ్తే కానీ ఆ భూమిని విడిపించుకోలేం,” అంటూ బూటే నిట్టూర్చారు.

*****

పెళ్ళి కాకముందు నామని, బతుకుతెరువు కోసం ఒడిశాను వదిలి ఎన్నడూ వలస వెళ్ళలేదు. ఆమె పెళ్ళయ్యాక మొదటిసారిగా వలసవెళ్ళింది ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌కు. వారి పెద్ద కొడుకు జుదిష్ఠిర్ అప్పుడు మూడో తరగతి చదువుతున్నాడు. “ఆ పనికి బయానా(అడ్వాన్స్)గా చాలా తక్కువ డబ్బు- రూ.8,000 మాత్రమే ఇచ్చారు. అది ఏ సంవత్సరమో నాకు గుర్తులేదు, కానీ సజనీ (కూతురు) నెలల పిల్ల కావడంతో మేం తనని కూడా మాతో పాటు తీసుకువెళ్ళాం.” అప్పటి నుండి – 17 సంవత్సరాల క్రితం – ప్రతి ఏడాదీ పని కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్తూనేవున్నామని నామని చెప్పారు.

Left: Bute standing in front of her mud house along with her grandchildren and great grandchildren .
PHOTO • Anil Sharma
Right: Namani's eldest son Judhisthir holding his daughter Dhartiri
PHOTO • Anil Sharma

ఎడమ: మనవడు, మనవరాలు, మునిమనవరాలితో కలిసి తన మట్టి ఇంటి ముందు నిలుచునివున్న బూటే. కుడి: తన కూతురు ధర్తిరీతో నామని పెద్ద కొడుకు జుదిష్ఠిర్

అలా మొదలైన తర్వాత, ఆ కుటుంబం ప్రతి సంవత్సరం వలస వెళ్ళింది. “రెండేళ్ళపాటు మేం మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కే వలస వెళ్ళాం. అప్పుడు మాకు సుమారు రూ.9,500 బయానాగా ఇచ్చారు,” అని ఆమె గుర్తుచేసుకున్నారు. తరువాత నాలుగేళ్ళూ వారు అక్కడికే వలసవెళ్ళడంతో వారికిచ్చే బయానా క్రమంగా రూ.15,000కు పెరిగింది.

2019లో చెన్నై వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ డబ్బు – రూ.25,000 - బయానాగా  వచ్చింది. చెన్నైలో ప్రతి 1,000 ఇటుకలకు ఒక్కో కార్మికుల బృందానికి దాదాపు రూ.350 ఇచ్చేవారు. ఆ లెక్కన నలుగురు కార్మికులున్న బృందంలో, ఒక్కొక్కరికి వారానికి రూ.1,000-1,500 వచ్చేది.

వారానికోసారి చెల్లించే ఆ డబ్బుతో వాళ్ళు తిండి సరుకులు, సబ్బులు, షాంపూలు, ఇంకా అవసరమైనవి కొనుక్కునేవారు. “బయానాగా మాకిచ్చిన డబ్బును చెల్లబెట్టుకోవడానికి మాకొచ్చే కూలీలోంచి కొంత మినహాయించుకొని, మిగిలిన డబ్బును సూపర్‌వైజర్ మాకు ఇచ్చేవాడు,” అని నామని వివరించారు. వారికిచ్చిన బయానా పూర్తిగా చెల్లిపోయేవరకూ కూలి డబ్బులు ఇలాగే ఇస్తారు.

చాలామంది కూలిగా రూ.100 కంటే తక్కువే సంపాదిస్తారు. ఇది నిర్మాణ రంగంలో నైపుణ్యంలేని కార్మికులకు ఇచ్చే కనీస వేతనం లో సగం కంటే తక్కువ. చెన్నై వంటి పట్టణ ప్రాంతాల్లో చేతి తయారీ (ఛాంబర్) ఇటుకలను తయారుచేసే కార్మికులకు రోజుకు రూ.610 (1,000 ఇటుకలకు) చెల్లించాలని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రధాన లేబర్ కమిషనర్ కార్యాలయం నిర్దేశించింది.

నృపా, అతని కుటుంబానికి చెల్లించిన వేతనాలు ఈ కార్మిక చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించాయి.

Namani holding a labour card issued by the Balangir district labour office. It has been more than a year since her husband died and Namani is struggling to get the death benefits that his family are entitled to under the Odisha Building and other Construction Workers Act, 1996
PHOTO • Anil Sharma
It has been more than a year since her husband died and Namani is struggling to get the death benefits that his family are entitled to under the Odisha Building and other Construction Workers Act, 1996
PHOTO • Anil Sharma

బాలాంగీర్ జిల్లా లేబర్ కార్యాలయం జారీ చేసిన లేబర్ కార్డును పట్టుకొనివున్న నామని. ఆమె భర్త చనిపోయి ఏడాదికి పైగా గడచినప్పటికీ, ఒడిశా భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం, 1996 ప్రకారం తన కుటుంబానికి దక్కాల్సిన నష్ట పరిహారం కోసం నామని ఇంకా పోరాడుతూనే ఉన్నారు

ఒడిశా భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం, 1996 కింద ప్రభుత్వం అందించే భద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాల కోసం భవననిర్మాణం, ఇతర నిర్మాణాల పనుల్లో ఉండే ఒడియా అంతర్రాష్ట్ర వలస కార్మికులు చాలామంది తమ పేర్లను నమోదు చేసుకోలేదు.

నృపా తన పేరును నమోదు చేసుకున్నప్పటికీ, ఒక చిన్న లొసుగు వల్ల ఇప్పుడతని కుటుంబం మూల్యం చెల్లించాల్సివస్తోంది. నమోదు చేసుకున్న కార్మికుడు సదరు పథకం ద్వారా లబ్ధి పొందాలంటే, ఆ కార్మికుడు ఏడాదికి రూ.50 చొప్పున వరుసగా మూడు సంవత్సరాల పాటు రుసుమును చెల్లించాలి. ఆ చెల్లింపు కూడా వారి గ్రామమైన హియాల్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాంగీర్‌లోని కార్మిక శాఖ జిల్లా కార్యాలయంలో చేయాలి.

మే 1, 2022 తర్వాత, ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌ చేశారు. చెన్నైకి వెళ్ళడానికి కొంచెం ముందుగా నృపాకు లేబర్ కార్డు వచ్చింది. అయితే, లాక్‌డౌన్ విధించినందువల్లా, తన అనారోగ్యం వల్ల కూడా ఆయన తన వార్షిక రుసుమును చెల్లించడానికి జిల్లా కార్యాలయానికి వెళ్ళలేకపోయారు. దాంతో, ఆ కుటుంబం ఇప్పుడు తమకు రావాల్సిన నష్ట పరిహారం పొందలేక ఇబ్బందులు పడుతోంది.

ఒడిశా భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం ప్రకారం నామనికీ, ఆమె కుటుంబానికీ తగిన నష్ట పరిహారం అందించాలని అభ్యర్థిస్తూ, బాలాంగీర్ జిల్లా మేజిస్ట్రేట్-కలెక్టర్‌కు ఈ విలేఖరి లేఖ రాయటంతో పాటు అధికారిక వాట్సాప్ నంబర్‌లో కూడా సంప్రదించారు. ఈ కథనం ప్రచురించబడే సమయానికి వారి వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Anil Sharma

ಅನಿಲ್ ಶರ್ಮಾ ಒಡಿಶಾದ ಕಾಂತಾಬಂಜಿ ಪಟ್ಟಣದ ವಕೀಲರು ಮತ್ತು ಭಾರತ ಸರ್ಕಾರದ ಗ್ರಾಮೀಣಾಭಿವೃದ್ಧಿ ಸಚಿವಾಲಯದ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ರೂರಲ್‌ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಫೆಲೋಸ್ ಯೋಜನೆಯ ಮಾಝಿ ಫೆಲೋ.

Other stories by Anil Sharma
Editor : S. Senthalir

ಸೆಂದಳಿರ್ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಸಹಾಯಕ ಸಂಪಾದಕರು. ಅವರು ಲಿಂಗ, ಜಾತಿ ಮತ್ತು ಶ್ರಮದ ವಿಭಜನೆಯ ಬಗ್ಗೆ ವರದಿ ಮಾಡುತ್ತಾರೆ. ಅವರು 2020ರ ಪರಿ ಫೆಲೋ ಆಗಿದ್ದರು

Other stories by S. Senthalir
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi