"2020 లాక్‌డౌన్ సమయంలో కొంతమంది వ్యక్తులు మా 1.20 ఎకరాల భూమి చుట్టూ సరిహద్దు ఏర్పరచేందుకు వచ్చారు," అన్నారు ఫగువా ఉరాంవ్. ముప్పయ్యేళ్ళు దాటిన ఆదివాసీ రైతు ఫగువా, ఒక బయలు ప్రదేశం చుట్టూ ఉన్న ఇటుక గోడను చూపిస్తున్నారు. మేం ఖూంటీ జిల్లా, డుమారీ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎక్కువగా ఉరాంవ్ సముదాయంవారు నివసిస్తుంటారు. "వాళ్ళు 'ఈ భూమి వేరేవారికి చెందినది; మీది కాదు' అని చెప్తూ భూమిని కొలవటం మొదలుపెట్టారు. మేం దాన్ని వ్యతిరేకించాం.

"ఈ సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత, మేం మా గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖూంటీలోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళాం. వెళ్ళిన ప్రతిసారీ మాకు 200 రూపాయల కంటే ఎక్కువే ఖర్చయ్యాయి. అక్కడ మేమొక న్యాయవాది సహాయాన్ని తీసుకోవలసివచ్చింది. ఆయన ఇప్పటికే మా దగ్గర నుంచి 2,500 రూపాయలు తీసుకున్నాడు. కానీ పనేమీ జరగలేదు.

"అంతకంటే ముందు, మేం మా బ్లాక్‌లో ఉన్న జోనల్ కార్యాలయానికి వెళ్ళాం. ఈ విషయంపై ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్ళాం. మా భూమిపై హక్కును వదులుకోవాలని మాకు బెదిరింపులు వస్తున్నాయి. ఒక మితవాద తీవ్రవాద సంస్థకు చెందిన జిల్లా స్థాయి అధికారి మమ్మల్ని బెదిరించాడు. కానీ కోర్టులో మాత్రం ఎలాంటి విచారణ జరగలేదు. ఇప్పుడు మా భూమిలోకి ఈ గోడ వచ్చి నిలబడింది. ఔర్ హమ్ దో సాల్ సే ఇసీ తరహ్ దౌడ్-ధూప్ కర్ రహే హైఁ [గత రెండేళ్ళుగా మేమిలా దీని చుట్టూ పరుగులు తీస్తూనే ఉన్నాం].

"మా తాత లూసా ఉరాంవ్ ఈ భూమిని 1930లో భూస్వామి బాల్‌చంద్ సాహు దగ్గర కొన్నాడు. అదే భూమి మీద మేం వ్యవసాయం చేస్తూవస్తున్నాం. మా దగ్గర 1930 నుంచి 2015 వరకూ దీనికి సంబంధించిన పన్ను రసీదులు ఉన్నాయి. ఆ తర్వాత [2016లో] ఆన్‌లైన్ వ్యవస్థ మొదలయింది. అక్కడ ఆన్‌లైన్ రికార్డులలో మా భూమి మునుపటి భూస్వామి వారసుల పేరు మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదెలా జరిగిందో మాకు తెలియటంలేదు."

ఫగువా ఉరాంవ్, దేశవ్యాప్తంగా అన్ని భూ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి, దేశంలో వాటి కోసం కేంద్రం ద్వారా నిర్వహించే డేటాబేస్‌ను రూపొందించే కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా లాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ (DILRMP) కింద తన భూమిని పోగొట్టుకున్నారు. అటువంటి రికార్డులన్నింటినీ ఆధునికీకరించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరిలో జిల్లా వారీగా భూమికి సంబంధించిన సమాచారాన్ని జాబితా చేసే ఒక లాండ్ బ్యాంక్ పోర్టల్‌ ను ప్రారంభించింది."భూమి/ఆస్తి వివాదాల పరిధిని తగ్గించడం, భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థలలో పారదర్శకతను పెంపొదించడం" దీని లక్ష్యం.

ఫగువాకు, అతనివంటి అనేకమందికి ఇది వ్యతిరేకంగా పనిచేసింది.

"ఆన్‌లైన్‌లో భూమి స్థితిని తెలుసుకోవడానికి మేం ప్రజ్ఞా కేంద్రకు వెళ్ళాం. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకం కింద రూపొందించబడిన ఈ కేంద్ర, ఝార్ఖండ్‌లో సాధారణ సేవా కేంద్రాల విభిన్న సేవలను ఒకే చోట అందించే చోటు, ఇది కొంత రుసుము తీసుకొని గ్రామ పంచాయతీలో ప్రజా సేవలను అందిస్తుంది. "అక్కడున్న ఆన్‌లైన్ రికార్డుల ప్రకారం ఆ భూమి ప్రస్తుత సొంతదారుడు నాగేంద్ర సింగ్. అతని కంటే ముందరి సొంతదారుడైన సంజయ్ సింగ్ ఈ భూమిని బిందు దేవికి అమ్మగా, ఆమె తిరిగి ఈ భూమిని నాగేంద్ర సింగ్‌కు అమ్మింది.

"ఆ భూస్వామి వారసులు అదే భూమిని మాకు తెలియకుండా రెండు మూడు సార్లు అమ్మటం కొనటం చేసినట్టుగా కనిపిస్తోంది. కానీ మా దగ్గర 1930 నుంచి 2015 వరకూ పన్ను రసీదులు ఉన్నప్పుడు ఇదెలా సాధ్యమయింది? మేం ఇప్పటివరకూ 20,000 రూపాయలు ఖర్చుపెట్టాం, ఇప్పటికీ దీని చుట్టూనే తిరుగుతున్నాం. ఈ డబ్బుల కోసం మేం మా ఇంట్లోని తిండిగింజలను అమ్ముకోవాల్సివచ్చింది. ఇప్పుడు మా భూమిలో ఉన్న ఆ గోడను చూస్తుంటే, మాకున్నదంతా పోగొట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఈ పోరాటంలో మాకు ఎవరు సహాయం చేయగలరో మాకు తెలియటంలేదు."

PHOTO • Om Prakash Sanvasi
PHOTO • Jacinta Kerketta

గత కొన్నేళ్ళుగా జరిగిన భూ రికార్డుల డిజిటైజేషన్ నేపథ్యంలో తమ పూర్వీకులు కొన్న భూమిని పోగొట్టుకున్న ఝార్ఖండ్‌లోని ఖూంటీకి చెందిన అనేకమంది ఆదివాసులలో ఒకరైన ఫగువా ఉరాంవ్ (ఎడమ). ఆయన వద్ద 2015 వరకు తన 1.20 ఎకరాల భూమికి చెల్లించిన పన్ను రసీదులు (కుడి) ఉన్నప్పటికీ, తన భూమి కోసం పోరాడుతూ డబ్బునూ శక్తినీ ఖర్చు చేస్తున్నారు

*****

భూమి హక్కుల విషయంలో ఝార్ఖండ్‌కు ఒక దీర్ఘమైన, సంక్లిష్టమైన చరిత్ర ఉంది. ఆదివాసీ జనాభా ఎక్కువగా నివసించే, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ఈ భూమిలో విధానాలు, రాజకీయ పార్టీలు ఈ హక్కులను అమిత ఘోరంగా ఉల్లంఘించాయి. మొత్తం భారతదేశంలో ఉన్న ఖనిజ నిల్వలలో 40 శాతం ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి.

దేశీయ జనగణన 2011 ప్రకారం, ఈ రాష్ట్రంలో 23,721 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించివున్న 29.76 శాతం అటవీ ప్రాంతం ఉంది; రాష్ట్ర జనాభాలో నాలుగవ వంతు లేదా దాదాపు 26 శాతం షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరించిన 32 ఆదివాసీ సముదాయాలున్నాయి; 13 జిల్లాలు పూర్తిగానూ, మూడు జిల్లాలు పాక్షికంగానూ ఐదవ షెడ్యూల్ కిందకు వస్తాయి.

రాష్ట్రంలోని ఆదివాసీ సముదాయాలు వారి సంప్రదాయ సామాజిక-సాంస్కృతిక జీవన విధానాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్న తమ వనరులపై హక్కుల కోసం దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందునుండి పోరాడుతున్నాయి. 50 సంవత్సరాలకు పైగా వారు చేసిన సమష్టి పోరాటాల ఫలితంగా, 1833లో హక్కుల మొదటి రికార్డు హుకుక్-నామా ఏర్పడింది. ఇది భారత స్వాతంత్ర్యానికి ఒక శతాబ్దానికి ముందు ఆదివాసుల సమష్టి వ్యవసాయ హక్కులకు, స్థానిక స్వపరిపాలనకు అధికారిక గుర్తింపు.

అయితే ఐదవ షెడ్యూల్ ప్రాంతాలను రాజ్యాంగబద్ధంగా పునరుద్ధరించడానికి చాలాకాలం ముందే, 1908లోని చోటా నాగ్‌పూర్ కౌలుదారీ చట్టం (CNTA), సంతాల్ పరగణాల కౌలుదారీ చట్టం (SPTA) 1876, ఆ ప్రత్యేక ప్రాంతాలలోని ఆదివాసీ (ఎస్‌టిలు), మూలవాసీ (ఎస్‌సిలు, బిసిలు, ఇంకా ఇతరులు) ప్రజల భూస్వామ్య హక్కులను గుర్తించాయి.

*****

ఫగువా ఉరాంవ్, ఆయన కుటుంబం జీవనోపాధి కోసం తమ పూర్వీకులు ఒక జమీన్‌దార్ వద్ద కొన్న ఆ భూమిపైనే ఆధారపడ్డారు. ఆ భూమికి తోడు వారికి వారి ఉరాంవ్ పూర్వీకులకు చెందిన 1.50 ఎకరాల భుయీంహరీ భూమి కూడా ఉంది.

తమ పూర్వీకులు అడవులను నరికి, ఆ భూమిని వరి పండే పొలాలుగా మార్చుకొని, అక్కడ తమ నివాసాలను ఏర్పరచుకొన్న కుటుంబానికి చెందిన వారసులకు ఆ భూమిపై సమష్టి యాజమాన్యం ఉంటుంది. అటువంటి భూమిని ఉరాంవ్ ప్రాంతాలలో భుయీంహరీ అనీ, ముండా ప్రాంతాలలో ముండారీ ఖుంట్‌ఖట్టీ అనీ అంటారు.

"మేం ముగ్గురం అన్నదమ్ములం," ఫగువా చెప్పారు. "మా ముగ్గురికీ కుటుంబాలున్నాయి. పెద్దన్నకూ, నడిపి అన్నకూ ముగ్గురేసి పిల్లలున్నారు, నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబ సభ్యులు పొలాన్నీ, కొండ భూమినీ సాగుచేస్తారు. మేం అందులో వరి, చిరుధాన్యాలు, కూరగాయలు పండిస్తాం. వచ్చిన పంటలో సగం మా తిండికి ఉపయోగిస్తాం, మిగిలే సగాన్ని మాకు డబ్బు అవసరమైనప్పుడు అమ్ముకుంటాం. అదే మా జీవనం," అన్నారతను.

ఒకటే పంట పండే ఈ భూమిలో ఏడాదిలో ఒక్కసారి మాత్రమే సేద్యం జరుగుతుంది. మిగిలిన కాలమంతా వారు కర్రా బ్లాక్‌లోని తమ గ్రామంలోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలోనూ కూలి పనులు చేసుకొని బతకాలి.

డిజిటలైజేషన్, దానివల్ల వచ్చిన సమస్యలు ఇటువంటి కుటుంబ యాజమాన్యంలోని భూములను మించిపోయాయి.

PHOTO • Jacinta Kerketta

ఖుంటీ జిల్లాలోని కోసంబీ గ్రామంలో యునైటెడ్ పర్‌హా కమిటీ సభకు వచ్చిన ప్రజలు. 1932 నాటి భూమి సర్వే ఆధారంగా సాముదాయక, ప్రైవేట్ భూ ​​యాజమాన్య హక్కుల రికార్డు అయిన ఖతియాన్‌ను చూపించడం ద్వారా ఈ కమిటీ ఆదివాసులలో భూమిపై వారికి ఉన్న హక్కుల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది

సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోసంబీ గ్రామంలో, బంధు హోరో తమ సమష్టి భూమి గురించిన కథనాన్ని వివరిస్తున్నారు. "జూన్ 2022లో, కొంతమంది జనం వచ్చి మా భూమి చుట్టూ కంచె వేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు జెసిబి యంత్రంతో వచ్చారు, అప్పుడు గ్రామ ప్రజలంతా బయటకు వచ్చి వారిని అడ్డుకొన్నారు.

"గ్రామం నుంచి 20-25 మంది ఆదివాసీలు వచ్చి పొలాల్లో కూర్చున్నారు," అదే గ్రామానికి చెందిన 76 ఏళ్ళ ఫ్లోరా హోరో చెప్పారు. "జనం పొలాలను దున్నటం కూడా మొదలుపెట్టారు. భూమిని కొనటానికి వచ్చినవాళ్ళు పోలీసులను పిలిచారు. కానీ గ్రామస్థులు సాయంత్రం వరకూ అలాగే కూర్చొనివున్నారు. ఆ తర్వాత, సర్గుజా [వెర్రి నువ్వులు లేదా గుయిజోటియా ఎబిసినికా ] విత్తనాలను పొలాల్లో నాటారు," చెప్పారతను.

"కోసంబీ గ్రామంలో మఁఝిహస్ పేరుతో 83 ఎకరాల భూమి ఉంది," గ్రామ ప్రధాన్ , 36 ఏళ్ళ వికాస్ హోరో వివరించి చెప్పారు. "అది గ్రామంలో 'విశేషాధికారం' ఉన్న భూమి. దానిని ఆదివాసీ సముదాయం తమ భూస్వామికి చెందిన భూమిగా ఒక పక్కన ఉంచింది. గ్రామ ప్రజలు ఈ భూమిని ఉమ్మడిగా సాగుచేసి, పండిన పంటలో కొంత భాగాన్ని భూస్వామి కుటుంబానికి అప్పనంగా, అంటే సలామీ రూపంలో ఇస్తారు." రాష్ట్రంలో జమీన్‌దారీ వ్యవస్థను నిర్మూలించినప్పటికీ, ఈ సేవ మాత్రం ముగిసిపోలేదు. "ఈ రోజుకు కూడా, గ్రామాలలోని చాలామంది ఆదివాసులకు తమకున్న హక్కుల గురించి తెలియదు," అన్నారతను.

తన ముగ్గురు సోదరుల మాదిరిగానే జీవనాధారం కోసం ఉమ్మడిగా ఉన్న పది ఎకరాల భూమిపై ఆధారపడిన కుటుంబానికి చెందిన రైతు సెతెంగ్ హోరో (35)ది కూడా ఇదే కథ."జమీన్‌దారీ వ్యవస్థ ముగిసిపోవటంతో, ఆ మఁఝిహస్ భూమి దానిని ఉమ్మడిగా సాగుచేస్తున్న జనానికే తిరిగి చెందుతుందనే సంగతి ముందుగా మాకు తెలియదు. మాకు తెలియకపోవడం వలన, పంట చేతికి వచ్చాక అందులోంచి కొన్ని గింజలను పాత జమీన్‌దార్ వారసులకు ఇవ్వడాన్ని కొనసాగించాం. వాళ్ళు ఎప్పుడైతే చట్టవిరుద్ధంగా కొంత భూమిని అమ్మటం మొదలుపెట్టారో, అప్పుడు మేమంతా సంఘటితంగా మా సాగుభూమిని కాపాడుకోవటానికి బయటకు వచ్చాం," అన్నారతను.

"బిహార్ భూసంస్కరణల చట్టం 1950 నుంచి 1955 మధ్య అమలులోకి వచ్చింది," రాంచీకి చెందిన సీనియర్ న్యాయవాది రశ్మీ కాత్యాయన్ వివరించారు. “జమీన్‌దార్లకు భూమిపై ఉన్న అన్ని హక్కులు - సాగుచేయని భూమిని కౌలుకు ఇచ్చే హక్కు, కౌలు, పన్నులు వసూలు చేసే హక్కు, బంజరు భూములపై ​​కొత్త రైయతు లను స్థిరపరిచే హక్కు, గ్రామ సంతల నుండి, గ్రామ జాతరల నుండి పన్నులు వసూలు చేసే హక్కు మొదలైనవన్నీ, మాజీ భూస్వాములు స్వయంగా సాగు చేసుకుంటున్న భూములు తప్ప - ప్రభుత్వం కింద ఉండేవి.

"పూర్వ జమీన్‌దారులు అటువంటి భూములకు, తమకు 'విశేషాధికారం ద్వారా ప్రాప్తించిన’ మఁఝిహస్ భూములకు లెక్కలు దాఖలు చేయాల్సి ఉండేది. కానీ వారు ఆ భూములను తమ సొంతవిగా భావించి, వాటి గురించిన లెక్కలు ఎన్నడూ దాఖలు చేయలేదు. అదొక్కటే కాక, జమీన్‌దారీ వ్యవస్థను రద్దుచేసిన చాలాకాలం వరకూ గ్రామ ప్రజల నుంచి పంటలో సగభాగాన్ని తీసుకుంటూనే ఉన్నారు. గత ఐదేళ్ళలో డిజిటలైజేషన్ వలన భూ సంబంధిత సంఘర్షణలు పెరిగిపోయాయి," 72 ఏళ్ళ కాత్యాయన్ చెప్పారు.

ఖూంటీ జిల్లాలో మునుపటి జమీన్‌దారుల వారసులకు, ఆదివాసులకు మధ్య పెరిగిన సంఘర్షణలను గురించి చర్చిస్తూ న్యాయవాది అనుప్ మింజ్ (45) ఇలా అంటున్నారు, "ఈ భూస్వాముల వారసుల వద్ద పన్ను కట్టిన రసీదులు కానీ, అటువంటి భూములపై అధికారం కానీ లేవు. కానీ వారు ఆన్‌లైన్‌లో ఆ భూములను గుర్తించి ఎవరో ఒకరికి అమ్మేస్తున్నారు. ఛోటానాగ్‌పూర్ కౌలు చట్టం, 1908లోని అనువంశిక హక్కుల సెక్షన్ ప్రకారం, 12 సంవత్సరాలకు పైగా భూమిని సాగుచేస్తున్న వ్యక్తికి ఆ మఁఝిహస్ భూమిపై హక్కు దానంతట అదే సంక్రమిస్తుంది. అంటే, అలాంటి భూమిని సాగు చేసుకునే ఆదివాసులకు ఆ భూమిపై హక్కు ఉంటుంది."

PHOTO • Jacinta Kerketta

తామిప్పుడు ఉమ్మడిగా సాగుచేస్తోన్న భూమిని చూపిస్తోన్న కోసంబీ గ్రామ ప్రజలు. వారు సమష్టిగా సుదీర్ఘకాలం పోరాటం చేసి ఈ భూమిని మునుపటి జమీన్‌దారు వారసుల నుంచి రక్షించుకున్నారు

ఒక ఐక్య పర్‌హా కమిటీ గత కొన్నేళ్ళుగా ఈ భూములను సాగుచేస్తోన్న ప్రజలను సంఘటితంచేసి చురుగ్గా పనిచేస్తోంది. ఇది ఆదివాసీ స్వయంపరిపాలనకు చెందిన సంప్రదాయ ప్రజాస్వామ్య పర్‌హా వ్యవస్థ గొడుగునీడలో జరుగుతోంది. పర్‌హాలో సాధారణంగా 12 నుండి 22 గ్రామాల సమూహాలు ఉంటాయి

"ఈ పోరాటం ఖూంటీ జిల్లాలోని అనేక ప్రాంతాలలో సాగుతోంది," కమిటీకి చెందిన 45 ఏళ్ళ సామాజిక కార్యకర్త ఆల్ఫ్రెడ్ హోరో చెప్పారు. "భూస్వాముల వారసులు ఈ జిల్లాలోని తోర్పా బ్లాక్‌లో 300 ఎకరాల భూమిని, కర్రా బ్లాక్‌లోని తుయుగుతు (తియూ అని కూడా అంటారు) గ్రామంలో 23 ఎకరాలను, పర్గాఁవ్ గ్రామంలో 40 ఎకరాలను, కోసంబీ గ్రామంలో 83 ఎకరాలను, మధుగామ గ్రామంలో 45 ఎకరాలను, మేహన్ (మేహా అని కూడా అంటారు) గ్రామంలో 23 ఎకరాలను, ఛాతా గ్రామంలో 90 ఎకరాలను తిరిగి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఐక్య పర్‌హా కమిటీ దాదాపు 700 ఎకరాల ఆదివాసీ భూమిని ఆక్రమణ నుంచి కాపాడింది," అని చెప్పారాయన.

1932 నాటి భూమి సర్వే ఆధారంగా సాముదాయక, ప్రైవేట్ భూ యాజమాన్య హక్కుల రికార్డు అయిన ఖతియాన్‌ ను చూపించడం ద్వారా ఐక్య పర్‌హా కమిటీ ఆదివాసులలో భూమిపై వారికి ఉన్న హక్కుల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఎవరికి ఏ భూమిపై హక్కు ఉన్నది, భూమి ఏ రకానికి చెందినదీ వంటి వివరమైన సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఖతియాన్‌ ను చూసినప్పుడే గ్రామ ప్రజలు తాము ఉమ్మడిగా సాగుచేస్తోన్న భూమికి తమ పూర్వీకులే సొంతదారులనే విషయాన్ని తెలుసుకున్నారు. అది మునుపటి భూస్వాములకు చెందిన భూమి కాదనీ, జమీన్‌దారీ వ్యవస్థ ముగిసిపోయిందని కూడా తెలుసుకున్నారు.

"డిజిటల్ ఇండియా ద్వారా భూమి గురించిన మొత్తం సమాచారాన్ని చూడవచ్చు, అందుకనే ఈ సంఘర్షణలన్నీ మరింత ఎక్కువయ్యాయి," అని ఖూంటీలోని మేర్లే గ్రామానికి చెందిన ఇపీల్ హోరో అన్నారు. "కార్మికుల దినమైన మే 1, 2024 నాడు గ్రామానికి దగ్గరలో ఉన్న మఁఝిహస్ భూమి చుట్టూ సరిహద్దు ఏర్పాటు చేయటానికి కొంతమంది మనుషులు వచ్చారు. తాము ఆ భూమిని కొనుక్కున్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. గ్రామానికి చెందిన సుమారు 60 మంది స్త్రీపురుషులు అక్కడికి వచ్చి వారిని అడ్డుకున్నారు.

"మునుపటి భూస్వాముల వారసులు మఁఝిహస్ భూముల గురించి ఆన్‌లైన్‌లో చూడగలరు. వాళ్ళు ఆ భూములను ఇప్పటికీ తమకు 'విశేషాధికారం' గల భూములుగానే భావించి అన్యాయంగా వాటిని అమ్మేస్తున్నారు. మేం మా సమష్టి బలంతో వాళ్ళు మా భూమిని లాక్కోకుండా ప్రతిఘటిస్తున్నాం. ఈ ముండా గ్రామంలో ఉన్న 36 ఎకరాల మఁఝిహస్ భూమిలో గ్రామవాసులు తరతరాలుగా ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు.

"ఈ గ్రామ ప్రజలు అంతగా చదువుకున్నవారు కాదు," అంటారు 30 ఏళ్ళ వయసున్న భరోసీ హోరో. "ఈ దేశంలో ఎలాంటి నియమాలు తయారవుతాయో, ఏమి మార్పులు చోటుచేసుకుంటున్నాయో మాకు తెలియదు. చదువుకున్నవారికి చాలా విషయాలు తెలుస్తాయి. కానీ వాళ్ళు ఆ జ్ఞానంతో ఏమీ తెలియని ప్రజలను దోచుకుంటారు, వారిని వేధిస్తారు. అందుకనే ఆదివాసీలు ప్రతిఘటిస్తారు."

చాలా గొప్పగా అనుకునే 'డిజిటల్ విప్లవం' అడపాదడపా విద్యుత్ సరఫరా లభించే, అస్థిరమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది లబ్ధిదారులకు చేరలేదు. ఝార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతంలో కేవలం 32 శాతం గ్రామాలలోకి మాత్రమే ఇంటర్నెట్ చొచ్చుకుపోయింది. దీనికి తోడు దేశంలోని డిజిటల్ విభజన - ఇప్పటికే ఉన్న వర్గం, జెండర్, కులం, తెగల విభజనల ద్వారా మరింత తీవ్రమైంది.

నేషనల్ శాంపిల్ సర్వే (NSS 75వ రౌండ్ - జూలై 2017-జూన్ 2018) ఝార్ఖండ్‌లోని ఆదివాసీ ప్రదేశంలో కేవలం 11.3 శాతం మంది మాత్రమే తమ ఇంటిలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నారని, వారిలో గ్రామీణ ప్రాంతాల్లోని కేవలం 12 శాతం మంది పురుషులకు, 2 శాతం మంది మహిళలకు మాత్రమే ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసునని పేర్కొంది. ఈ సేవల కోసం గ్రామస్థులు ప్రజ్ఞా కేంద్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. వాటి లోపాలను గురించి ఇప్పటికే పది జిల్లాల సర్వే లో చర్చించారు.

PHOTO • Jacinta Kerketta

మాజీ భూస్వాముల వారసులు జెసిబి యంత్రాలను తీసుకొని వచ్చినపుడు గ్రామంలోని ఆదివాసులు తమ భూమి కోసం సమష్టిగా పోరాడారు. వాళ్ళు తమ భూముల్లో కూర్చొని, భూములను దున్ని, చాలాసేపు కాపలా కాస్తూ, చివరకు సర్గూజాను నాటారు

ఖూంటీ జిల్లా కర్రా డెవలప్‌మెమంట్ బ్లాక్ సర్కిల్ అధికారి (సిఒ) వందన భారతి ఈ విషయం గురించి మితంగా మాట్లాడారు. "మునుపటి భూస్వాముల వారసుల వద్ద భూమి పత్రాలు ఉన్నప్పటికీ, భూమి ఎవరి అధీనంలో ఉందో చూడాల్సివుంది," అన్నారామె. "భూమి ఆదివాసుల స్వాధీనంలో ఉంది, దాన్ని వారే సాగుచేస్తున్నారు. ఇప్పుడిది చిక్కులతో కూడుకొన్న విషయం. మేం సాధారణంగా ఇలాంటి కేసులను కోర్టుకు సూచిస్తాం. కొన్నిసార్లు మాజీ భూస్వాముల వారసులు, ఆదివాసులు తమలో తామే ఈ విషయాన్ని పరిష్కరించుకుంటారు."

ఝార్ఖండ్ స్థానిక నివాస విధానంపై 2023లో ఇకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రం ఇలా పేర్కొంది, “... ప్రతి డిజిటల్ ల్యాండ్ రికార్డ్ రెవెన్యూ భూమిని ప్రైవేట్ ఆస్తి శాసనంగా మారుస్తోందనీ, CNT చట్టం కింద ఇవ్వబడిన సాముదాయక భూ యాజమాన్య హక్కులను నమోదు చేసే సంప్రదాయ/ ఖతియానీ విధానాన్ని దాటవేస్తోందని కూడా ఇది చూపిస్తోంది.

ఖాతా లేదా ప్లాట్ నంబర్, విస్తీర్ణం, మార్పుచేసిన భూ యజమానుల పేర్లు, తెగలు/కులాల గురించి తప్పుగా నమోదు అయినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే మోసపూరితంగా విక్రయించిన భూమికి సంబంధించిన రికార్డులను ఆన్‌లైన్‌లో సరిచేయించడానికీ, నవీకరించడానికీ గ్రామస్థులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు ఆ భూమి మరొకరి పేరుతో ఉండడంతో వారు దానికి సంబంధించిన పన్నులు చెల్లించలేకపోతున్నారు.

"ఈ కార్యక్రమం ద్వారా నిజంగా లాభపడినవారెవరు?" అని భూమి హక్కుల ప్రజా ఉద్యమమైన ఏక్తా పరిషత్ దేశీయ సమన్వయకర్త రమేశ్ శర్మ ప్రశ్నించారు. "భూమి రికార్డులను డిజిటలైజ్ చేయటం ప్రజాస్వామిక ప్రక్రియేనా? నిస్సందేహంగా ఒకప్పటి భూస్వాములు, భూ మాఫియాలు, మధ్యవర్తులు లాగా రాజ్యం, శక్తివంతులైన కొద్దిమంది మాత్రమే దీనివల్ల భారీగా లాభపడ్డారు. స్థానిక పరిపాలనలు ఉద్దేశపూర్వకంగానే సంప్రదాయ భూములను, సరిహద్దులను అర్థం చేసుకోవడంలో, గుర్తించడంలో అసమర్థతను ప్రదర్శించాయని ఆయన నమ్ముతున్నారు. ఇది వాటిని అప్రజాస్వామికమైన, శక్తివంతుల పక్షంగా చేస్తుంది.

35 ఏళ్ళ బసంతీ దేవి స్పష్టంగా వ్యక్తీకరించినట్టుగా, ఆదివాసీ సముదాయాలలో భయం ఎవరూ ఊహించలేనంత విస్తృతంగా ఉంది. "ఈ గ్రామం చుట్టూ అన్ని వైపులా మఁఝిహస్ భూమి ఉంది," అని ఆమె అన్నారు. “ఇది 45 కుటుంబాలున్న గ్రామం. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. మేం ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల గ్రామం అలా నడుస్తోంది. ఇప్పుడు నలువైపులా ఉన్న భూమిని అక్రమంగా అమ్మితే, హద్దులు వేస్తే మా ఆవులు, ఎద్దులు, మేకలు ఎక్కడ మేస్తాయి? గ్రామం పూర్తిగా నిరుద్ధమైపోతుంది. మేం ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా భయానకంగా ఉంది."

అంతర్దృష్టితో కూడిన చర్చల ద్వారా తన రచనను సుసంపన్నం చేసినందుకు, చేసిన సహాయానికి సీనియర్ న్యాయవాది రశ్మీ కాత్యాయన్‌కు రచయిత కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jacinta Kerketta

ಒರಾನ್ ಆದಿವಾಸಿ ಸಮುದಾಯದವರಾದ ಜಸಿಂತಾ ಕೆರ್ಕೆಟ್ಟಾ ಅವರು ಜಾರ್ಖಂಡ್‌ನ ಗ್ರಾಮೀಣ ಪ್ರದೇಶದ ಸ್ವತಂತ್ರ ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ವರದಿಗಾರರು. ಜಸಿಂತಾ ಅವರು ಆದಿವಾಸಿ ಸಮುದಾಯಗಳ ಹೋರಾಟಗಳನ್ನು ವಿವರಿಸುವ ಮತ್ತು ಅವರು ಎದುರಿಸುತ್ತಿರುವ ಅನ್ಯಾಯಗಳ ಕುರಿತು ಗಮನ ಸೆಳೆಯುವ ಕವಿಯೂ ಹೌದು.

Other stories by Jacinta Kerketta
Editor : Pratishtha Pandya

ಪ್ರತಿಷ್ಠಾ ಪಾಂಡ್ಯ ಅವರು ಪರಿಯ ಹಿರಿಯ ಸಂಪಾದಕರು, ಇಲ್ಲಿ ಅವರು ಪರಿಯ ಸೃಜನಶೀಲ ಬರವಣಿಗೆ ವಿಭಾಗವನ್ನು ಮುನ್ನಡೆಸುತ್ತಾರೆ. ಅವರು ಪರಿಭಾಷಾ ತಂಡದ ಸದಸ್ಯರೂ ಹೌದು ಮತ್ತು ಗುಜರಾತಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಲೇಖನಗಳನ್ನು ಅನುವಾದಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಸಂಪಾದಿಸುತ್ತಾರೆ. ಪ್ರತಿಷ್ಠಾ ಗುಜರಾತಿ ಮತ್ತು ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಕವಿಯಾಗಿಯೂ ಗುರುತಿಸಿಕೊಂಡಿದ್ದು ಅವರ ಹಲವು ಕವಿತೆಗಳು ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಪ್ರಕಟವಾಗಿವೆ.

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli