“రెండు ప్లస్ రెండు – ఎంత? ప్రతీక్, నువ్వు కూడికలు ఎలా చేసేవాడివో గుర్తుందా?”

ప్రతీక్ రావుత్ ఉపాధ్యాయుడైన మోహన్ తాలేకర్, ఒక పలకపై రాసిన సంఖ్యలను చూపిస్తూ, 14 ఏళ్ల ఆ పిల్లవాడిని వాటిని గుర్తించావా అని అడిగారు. పలక వైపు చూస్తూ ఉన్న పిల్లవాడి ముఖంలో వాటిని గుర్తించిన జాడలు లేవు.

అది జూన్ 15, 2022. మేం ప్రతీక్ చదువుకునే జ్ఞానప్రబోధన్ మతిమంద్ నివాసి విద్యాలయలో ఉన్నాం. ఇది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా, కర్మాలా తాలూకా లో ఉంది. ప్రతీక్ తన పాఠశాలకు రెండేళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చాడు. రెండేళ్ళంటే చాలా సుదీర్ఘమైన కాలం.

“ప్రతీక్ అంకెలను గుర్తుతెచ్చుకోలేకపోతున్నాడు. కోవిడ్‌కు ముందు అతను కూడికలు చేయగలిగేవాడు, మొత్తం మరాఠీ, ఆంగ్ల వర్ణమాలలను రాయగలిగేవాడు,” అని అతని గురువు చెప్పారు. "మేం ఇప్పుడతనికి ప్రతిదీ మొదటి నుండి నేర్పించాలి."

అక్టోబర్ 2020లో, ఈ విలేఖరి అహ్మద్‌నగర్ జిల్లాలోని రాశీన్ గ్రామంలో ప్రతీక్‌ని అతని ఇంటి దగ్గర కలిసినప్పుడు, అప్పటికి 13 సంవత్సరాల వయస్సున్న ప్రతీక్, వర్ణమాలలోని కొన్ని అక్షరాలను రాయగలిగేవాడు. డిసెంబర్ 2020 నాటికల్లా అతను రాయడం మానేశాడు.

ప్రతీక్ 2018లో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. తర్వాతి రెండేళ్లలో, నిలకడగా అభ్యాసం చేసి సంఖ్యలనూ, పదాలనూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. మార్చి 2020లో, అతను చదవడంలోనూ రాయడంలోనూ మరింత ముందుకువెళ్తున్న దశలో ఉండగానే, కోవిడ్-19 తాకింది. మేధోపరమైన వైకల్యాలు ఉన్న 6 నుండి 18 సంవత్సరాల వయస్సు గల 25 మంది విద్యార్థులలో ప్రతీక్ ఒకడు. వారి రెసిడెన్షియల్ పాఠశాలను రెండేళ్లపాటు మూసివేయటంతో ఆ పిల్లలందరినీ వారి వారి కుటుంబాల వద్దకు తిరిగి పంపించేశారు.

Prateek Raut on the porch of his home in Rashin village and writing in a notebook, in October 2020. He is learning the alphabet and numbers from the beginning at his school now
PHOTO • Jyoti
Prateek Raut on the porch of his home in Rashin village and writing in a notebook, in October 2020. He is learning the alphabet and numbers from the beginning at his school now
PHOTO • Jyoti

అక్టోబరు 2020లో, రాశీన్ గ్రామంలోని తన ఇంటి వరండాలో కూర్చొని నోట్‌బుక్‌లో రాసుకుంటున్న ప్రతీక్ రావుత్. అతనిప్పుడు తన పాఠశాలలో అక్షరాలనూ సంఖ్యలనూ మొదటి నుంచీ నేర్చుకుంటున్నాడు

“ఈ విద్యార్థుల పురోగతి కనీసం రెండు దశల వరకు మందగించింది. ఇప్పుడు ఒక్కో విద్యార్థి ఒక్కో భిన్నమైన సవాలును ఎదుర్కొంటున్నాడు,” అని పాఠశాల కార్యక్రమ సమన్వయకర్త రోహిత్ బాగడే చెప్పారు. ఠానేకి చెందిన శ్రామిక్ మహిళా మండల్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా విద్యనూ, వసతినీ అందిస్తారు.

విరుచుకుపడిన కోవిడ్ నేపథ్యంలో ప్రతీక్ పాఠశాలతో సహా అనేక ఇతర పాఠశాలలు కూడా మూతబడినందున, వారు తమ విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు అందుకున్నారు. స్టేట్ కమీషన్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ జూన్ 10, 2020న సామాజిక న్యాయం మరియు ప్రత్యేక సహాయ శాఖకు పంపిన లేఖ ఇలా పేర్కొంది: “ఠానే జిల్లా నవీ ముంబైలోని ఖార్‌ఘర్‌లో ఉన్న 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్లీ డిసేబుల్డ్ పర్సన్స్' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న బోధనా సామగ్రిని ఉపయోగించి పిల్లల తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు ప్రత్యేక విద్యను అందించాలి. దీనితో పాటు పిల్లల తల్లిదండ్రులకు అవసరమైన విద్యా సామగ్రిని కూడా సరఫరా చేయాలి."

చాలామంది పాఠశాలకు వెళ్లే పిల్లలకు ఆన్‌లైన్ విద్య ఒక సవాలుగా ఉన్నప్పటికీ, మేధో వైకల్యం ఉన్న పిల్లలకు ఇది ఎక్కువ అడ్డంకులు కలిగిస్తుంది. గ్రామీణ భారతదేశంలోని 5-19 ఏళ్ల వయస్సులో ఉన్న దాదాపు 400,000 మంది మేధోపరమైన వైకల్యం ఉన్న పిల్లలలో 185,086 మంది మాత్రమే ఏదో ఒక విద్యా సంస్థకు హాజరవుతున్నారు (జనగణన 2011). భారతదేశం మొత్తమ్మీద 500,000కు పైగా మేధోపరమైన వైకల్యం ఉన్న పిల్లలున్నారు.

ప్రభుత్వం సూచించినట్లుగా, ప్రతీక్ చదివే జ్ఞానప్రబోధన్ విద్యాలయ, అతని తల్లిదండ్రులకు బోధనా సామగ్రిని పంపించింది: వర్ణమాల, సంఖ్యలు, వస్తువుల బొమ్మలతో కూడిన చార్ట్‌లు; పద్యాలు, పాటలకు సంబంధించిన అభ్యాసాలు; ఇతర అభ్యాస ఉపకరణాలు. అభ్యాస ఉపకరణాలను ఉపయోగించడం గురించి మార్గనిర్దేశం చేసేందుకు పాఠశాల సిబ్బంది అతని తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడేవారు.

Left: Prateek with his mother, Sharada, in their kitchen.
PHOTO • Jyoti
Right: Prateek and Rohit Bagade, programme coordinator at Dnyanprabodhan Matimand Niwasi Vidyalaya
PHOTO • Jyoti

ఎడమ: వారి వంటగదిలో తల్లి శారదతో ప్రతీక్. కుడి: జ్ఞానప్రబోధన్ మతిమంద్ నివాసి విద్యాలయ కార్యక్రమ సమన్వయకర్త రోహిత్ బాగడేతో ప్రతీక్

"తల్లిదండ్రులు పిల్లవాడితో పాటు కూర్చోవాలి (అభ్యాస సామగ్రితో వారికి సహాయం చేయడానికి). కానీ పిల్లల కోసం ఇంటిపట్టున ఉండటం వారి రోజువారీ సంపాదన మీద ప్రభావం వేస్తుంది," అని బాగడే అభిప్రాయపడ్డారు. ప్రతీక్‌తో సహా మొత్తం 25 మంది విద్యార్థుల తల్లిదండ్రులంతా ఇటుక బట్టీ కార్మికులు, వ్యవసాయ కూలీలు లేదా సన్నకారు రైతులు.

ప్రతీక్ తల్లిదండ్రులైన శారద, దత్తాత్రేయ్ రావుత్‌లు తమ కుటుంబ వినియోగం కోసం ఖరీఫ్ సీజన్‌లో (జూన్ నుండి నవంబర్ వరకు) జొన్నలు, సజ్జలు సాగుచేస్తారు. "నవంబర్ నుండి మే వరకు, నెలలో 20-25 రోజులపాటు మేం ఇతరుల పొలాల్లో పని చేస్తాం," అని శారద చెప్పారు. వారి మొత్తం నెలవారీ ఆదాయం రూ. 6,000 కంటే మించదు. తల్లిదండ్రుల్లో ఎవరూ కూడా తమ కొడుకుకు సహాయంగా ఉండటానికి ఇంట్లో కూర్చోలేరు. అలా ఉండిపోతే ఇప్పటికే దిగజారివున్న వారి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి  మరింత పెరుగుతుంది.

"కాబట్టి ప్రతీక్‌కు, ఇంకా ఇతర పిల్లలకు ఏమీచేయకుండా కూర్చోవడం తప్ప వేరే మార్గం లేదు" అని బాగడే చెప్పారు. “(బడిలోని) రోజువారీ కార్యకలాపాలు, ఆటలు అటువంటి పిల్లలను తమపై తాము ఆధారపడేవారిగా మార్చాయి, వారిలో కలిగే చిరాకునూ దూకుడునూ నియంత్రించాయి. (కానీ) ఇటువంటి పిల్లలకు వ్యక్తిగత శ్రద్ధ అవసరం కాబట్టి అలాంటి కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం కష్టం.

పాఠశాలలో, నలుగురు ఉపాధ్యాయులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు, సోమవారం నుండి శుక్రవారం వరకు (శనివారం కొన్ని తక్కువ గంటలు) వారికి స్పీచ్ థెరపీ, శారీరక వ్యాయామం, స్వీయ సంరక్షణ, కాగితపు కళ, భాషా నైపుణ్యాలు, పదజాలం, సంఖ్యాశాస్త్రం, కళ వంటి ఇతర కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చారు. పాఠశాల మూతపడటం వారి జీవితాల నుండి వీటన్నింటినీ దూరం చేసింది.

Vaibhav Petkar and his mother, Sulakshana, who is seen cooking in the kitchen of their one-room house
PHOTO • Jyoti
This is the last year of school for 18-year-old Vaibhav
PHOTO • Jyoti

ఎడమ: వారి ఒంటిగది ఇంటి వంటగదిలో వైభవ్ పేట్కర్, అతని తల్లి సులక్షణ. సులక్షణ వంట చేస్తున్నారు. కుడి: 18 ఏళ్ల వైభవ్‌కు ఇది పాఠశాల చివరి సంవత్సరం

రెండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి పాఠశాలకు వస్తుండటంతో పిల్లలకు పాత రొటీన్‌కు మళ్ళీ అలవాటు కావడం కష్టంగా ఉంది. "వారి రోజువారీ పనులు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మానసిక ఏకాగ్రతలో గణనీయమైన క్షీణత ఉంది. వారి దినచర్యలో ఉన్నట్టుండి మళ్లీ మార్పు రావడంతో, కొంతమంది పిల్లలు మునుపటి కంటే దూకుడుగా, అసహనంగా, హింసాత్మకంగా మారారు. ఈ మార్పులకు కారణాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు.”

ప్రతీక్‌కు నేర్చుకోవడంలో తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నప్పటికీ, 18 ఏళ్ల వైభవ్ పేట్కర్‌కు ఇది పాఠశాలలో చివరి సంవత్సరం. వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ మరియు పూర్తి భాగస్వామ్యం) చట్టం, 1995 ప్రకారం 'ఏదైనా వైకల్యంతో జన్మించిన ప్రతి బిడ్డకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అనుకూల వాతావరణంలో ఉచిత విద్యను పొందే హక్కు ఉంటుంది'.

"ఆ తర్వాత, వృత్తి శిక్షణా సంస్థలకు తమ పిల్లలను పంపే స్తోమత వారి కుటుంబాలకు లేకపోవడం వలన ఏమీ చేయలేక పిల్లలు సాధారణంగా ఇంట్లోనే ఉంటుంటారు," అని బాగడే చెప్పారు.

తొమ్మిదేళ్ల వయసులో ‘తీవ్రమైన మానసిక వైకల్యం’తో బాధపడుతున్నట్టుగా గుర్తించిన వైభవ్ మాట్లాడలేడు. అంతేకాక, క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరమున్న మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. "7-8 సంవత్సరాల వయస్సు నుండే మొదలుపెట్టే ప్రత్యేక పాఠశాల విద్య పిల్లల అభివృద్ధిని, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో వారి సామర్థ్యాన్ని, రోజువారీ జీవిత పనితీరును, ప్రవర్తనా నియంత్రణను బలపరుస్తుంది," అని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, డెవలప్‌మెంటల్ డిజార్డర్ స్పెషలిస్ట్, ఉత్తర మధ్య ముంబైలోని సాయన్‌లో ఉన్న లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ మోనా గజరే వివరించారు.

Left: Vaibhav with his schoolteacher, Mohan Talekar.
PHOTO • Jyoti
With his family: (from left) sister Pratiksha, brother Prateek, Vaibhav, father Shivaji, and mother Sulakshana
PHOTO • Jyoti

ఎడమ: తన పాఠశాల ఉపాధ్యాయుడు మోహన్ తలేకర్‌తో వైభవ్. కుడి: తన కుటుంబంతో: (ఎడమ నుండి) సోదరి ప్రతీక్ష, సోదరుడు ప్రతీక్, వైభవ్, తండ్రి శివాజీ, తల్లి సులక్షణ

వైభవ్ 2017లో 13 సంవత్సరాల వయస్సులో పాఠశాల విద్యను ప్రారంభించాడు. దాదాపు మూడు సంవత్సరాల అభ్యాసం, శిక్షణలతో అతను స్వీయ-సంరక్షణ అలవాట్లు, మెరుగైన ప్రవర్తనా నియంత్రణ, ఇంకా రంగులు వేయడం వంటి కొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నాడు. "ఆక్యుపేషనల్ థెరపీతో అతను చాలా మెరుగుపడ్డాడు," అని బాగడే చెప్పారు. “అతను పెయింట్ చేసేవాడు. ఒకప్పుడు ఎవ్వరితోనూ కలిసేవాడు కాదు. ఇప్పుడతను ఇతర పిల్లల కంటే ముందే సిద్ధంగా ఉంటాడు,” అని అతను గుర్తుచేసుకున్నారు. మార్చి 2020లో అతన్ని ఇంటికి తిరిగి పంపే సమయంలో కూడా వైభవ్ దూకుడుగా ప్రవర్తించలేదు.

వైభవ్ తల్లిదండ్రులైన శివాజీ, సులక్షణలు అతని తాతకు చెందిన రెండు ఎకరాల భూమిలో ఏడాది పొడవునా పనిచేస్తారు. వారు ఖరీఫ్ పంటకాలంలో ఈ భూమిలో మొక్కజొన్న, జొన్నలు, కొన్నిసార్లు ఉల్లిపాయలను పండిస్తారు. రబీ పంటకాలంలో డిసెంబర్‌ నుంచి మే వరకు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. అహ్మద్‌నగర్ జిల్లా కరజత్ తాలూకా లోని కోరెగాఁవ్‌లోని వారి ఒంటిగది ఇంట్లో ఒంటరిగా కూర్చునే వైభవ్‌ కోసం కేటాయించేందుకు వారికి సమయం ఉండదు.

“రెండేళ్ళుగా పాఠశాల మూతపడటంతో అతను దూకుడుగా, మొండిగా తయారయాడు; నిద్రలేమితో బాధపడుతున్నాడు. చుట్టుపక్కల వ్యక్తులను చూడటంలో అతని అశాంతి మళ్ళీ పెరిగింది,” అని బాగడే చెప్పారు. "అతను ఇకపై రంగులను గుర్తించలేడు." రెండేళ్లు ఇంట్లోనే ఉండి, డమ్మీ స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకోవడం వైభవ్‌ని చాలా దెబ్బతీసింది.

జ్ఞాన్‌ప్రబోధన్ మతిమంద్ నివాసి విద్యాలయలోని ఉపాధ్యాయులు ఇప్పుడు మళ్ళీ ప్రతిదానినీ బోధించడం ప్రారంభించాల్సి రావచ్చుననే వాస్తవంతో రాజీపడ్డారు. "ఇప్పుడు మా ప్రాధాన్యమంతా పిల్లలను పాఠశాల వాతావరణంతో, దినచర్యతో సౌకర్యంగా ఉండేలా చేయడమే," అని బగాడే చెప్పారు.

ప్రతీక్, వైభవ్‌లు కోవిడ్‌కు ముందు వారు సాధించిన నైపుణ్యాలనూ, జ్ఞానాన్నీ తిరిగి నేర్చుకోవాలి. కోవిడ్-19 ప్రారంభమైన వెంటనే వారిని ఇంటికి పంపినందున, దానితో కలిసి జీవించడం వారి కొత్త అభ్యాసంలో ముఖ్యమైన భాగం.

Left: Rohit Bagade says children are finding it difficult to readjust to their old routine after the two-year break.
PHOTO • Jyoti
Right: Dnyanprabodhan Matimand Niwasi Vidyalaya, in Karmala taluka of Maharashtra’s Solapur district, where Bagade is the programme coordinator
PHOTO • Jyoti

ఎడమ: రెండేళ్ల విరామం తర్వాత పిల్లలకు తమ పాత రొటీన్‌కి తిరిగి అలవాటు పడటం కష్టంగా ఉందని రోహిత్ బాగడే చెప్పారు. కుడి: బాగడే కార్యక్రమ సమన్వయకర్తగా పనిచేస్తోన్న మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా తాలూకాలోని జ్ఞానప్రబోధన్ మతిమంద్ నివాసి విద్యాలయ

రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, జూన్ 15, 2022 నాటికి మహారాష్ట్రలో 4,024 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ముందటి రోజుతో పోలిస్తే 36 శాతం పెరిగింది. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున, వైరస్ నుండి పిల్లలను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

“మా పాఠశాల సిబ్బంది మొత్తం పూర్తిగా టీకాలు తీసుకున్నారు. మా పిల్లలకు ఇప్పటికే అనారోగ్య పరిస్థితులు ఉన్నందున మా సహాయకుల కోసం, ఉపాధ్యాయుల కోసం మాస్క్‌లు, పిపిఇ కిట్‌లు ఉన్నాయి,” అని బాగడే చెప్పారు. "మాస్క్‌లు పిల్లల కమ్యూనికేషన్‌ను కష్టతరం చేస్తాయి. ఎందుకంటే పిల్లలు ఎదుటివారి ముఖ కవళికలను బట్టి వారిని బాగా అర్థం చేసుకుంటారు." మాస్క్ ఎందుకు ధరించాలి, దానిని ధరించే సరైన పద్ధతి ఏమిటి, దానిని ఎందుకు ముట్టుకోకూడదు, అనే విషయాలను పిల్లలకు నేర్పించడం ఒక సవాలుగా ఉంటుందని ఆయన చెప్పారు.

"మేధోపరమైన వైకల్యం ఉన్న పిల్లలకు ఏదైనా కొత్త విషయాన్ని బోధించే విషయానికి వస్తే, మేం చాలా ఓపికగా ప్రతి విషయాన్ని దశలవారీగా బోధిస్తాం. వాళ్ళు వాటిని సులభంగా గుర్తుంచుకోవడం కోసం పదేపదే ప్రదర్శిస్తాం," అని డాక్టర్ గజరే వివరించారు.

జ్ఞానప్రబోధన్ మతిమంద్ నివాసి విద్యాలయలోని విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత నేర్చుకున్న మొదటి విషయాలలో ఒకటి- చేతులు కడుక్కోవడం.

వైభవ్ పదే పదే, “ఖాయేలా...ఖాయేలా...జేవణ్... (తింటానికి...తింటానికి...అన్నం).” అని అడుగుతుంటాడు, తినడానికి ఏదైనా కావాలని. "మా పిల్లలలో చాలామందికి చేతులు కడుక్కోవడం అంటే అది భోజన సమయమని అర్థం,” అని బాగడే అంటున్నారు. "కాబట్టి, (ఈ కోవిడ్ సమయంలో) తరచుగా చేతులు కడుక్కోవడం ఎందుకో మనం వారికి అర్థం చేయించాలి."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

ಜ್ಯೋತಿ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಹಿರಿಯ ವರದಿಗಾರರು; ಅವರು ಈ ಹಿಂದೆ ‘ಮಿ ಮರಾಠಿ’ ಮತ್ತು ‘ಮಹಾರಾಷ್ಟ್ರ1’ನಂತಹ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ.

Other stories by Jyoti
Editor : Sangeeta Menon

ಸಂಗೀತಾ ಮೆನನ್ ಮುಂಬೈ ಮೂಲದ ಬರಹಗಾರು, ಸಂಪಾದಕರು ಮತ್ತು ಸಂವಹನ ಸಲಹೆಗಾರರು.

Other stories by Sangeeta Menon
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli