"నదిలో వ్యవసాయం చేయటం చాలా సులభం - పంట కోశాక దుబ్బులుగానీ మోళ్ళుగానీ ఇందులో నిలవవు, కలుపు కూడా ఇక్కడ పెరగదు.”

కుంతి పాణే మహాసముంద్ జిల్లా ఘొరారీ గ్రామానికి చెందినవారు. రాయపూర్ జిల్లా నగరి పట్టణానికి సమీపాన ఉన్న ఫరసియా గ్రామం నుంచి ప్రవహించే మహానది నదీతలంపై వ్యవసాయం చేసే 50-60 మంది రైతులలో ఈమె కూడా ఒకరు. "గత పదేళ్ళుగా నేనీ వ్యవసాయం చేస్తున్నాను. నేనూ నా భర్తా కలిసి బెండ, చిక్కుళ్ళు, కర్బూజా వంటి పంటలను ఇక్కడ పండిస్తున్నాం," అని కుంతి (57) చెప్పారు.

తాత్కాలిక అవసరం కోసం గడ్డితో కట్టిన గుడిసెలో కూర్చొని మాట్లాడుతున్నారామె. ఆ గుడిసె ఒక మనిషికు సరిపోయేట్టుగా ఉంది, వాన వస్తే తడవకుండా కాపాడగలిగేంత బలంగానూ ఉంది. అంతకంటే ముఖ్యంగా ఆవులూ, ఇతర జంతువులూ పంటలను తినిపోకుండా రాత్రివేళల్లో కాపలా కాసేందుకు అనువుగా ఉంది.

మహానదిపై నిర్మించిన వంతెన రాయ్‌పూర్ జిల్లాలోని పారాగాఁవ్, మహాసముంద్ జిల్లాలోని ఘొరారీ గ్రామాలను కలుపుతుంది. పైనుంచి చూస్తే వంతెన కిందుగా ప్రవహిస్తున్న పచ్చని ముక్కలు కనిపిస్తాయి. డిసెంబరు నుంచి మే నెలాఖరులో మొదటి వర్షాలు కురిసే వరకు సాగుచేయడం కోసం రెండు గ్రామాల రైతులు ఇసుకతో కూడిన నదీ తలాన్ని తమ మధ్యన పంచుకున్నారు.

Left : Farmers bathing in the river by their fields.
PHOTO • Prajjwal Thakur
Right: Kunti Pane sitting in front of her farm
PHOTO • Prajjwal Thakur

ఎడమ: తమ పొలాల పక్కనే ప్రవహిస్తోన్న నదిలో స్నానాలు చేస్తోన్న రైతులు. కుడి: తన పొలం ముందు కూర్చొని ఉన్న కుంతి పాణే

Watermelons (left) and cucumbers (right) grown here on the bed of the Mahanadi
PHOTO • Prajjwal Thakur
Watermelons (left) and cucumbers (right) grown here on the bed of the Mahanadi
PHOTO • Prajjwal Thakur

మహానది నదీతలంలో రైతులు పండించిన పుచ్చకాయలు (ఎడమ), కీర దోసకాయలు (కుడి)

"గ్రామంలో మాకొక ఎకరం సొంత పొలం ఉంది," మాతో చెప్పారు కుంతి. కానీ ఇక్కడ వ్యవసాయం చేయడానికే ఆమె మొగ్గు చూపిస్తున్నారు.

"మా ఒక్క ఎకరం పొలానికే ఎరువులు, విత్తనాలు, కూలీలు, రవాణా ఖర్చులన్నీ కలిపి దాదాపు 30,000-40,000 వరకూ అవుతాయి. ఈ ఖర్చులన్నీ పోను మాకు రూ. 50,000 మిగులుతాయి," అన్నారు కుంతి.

ఛత్తీస్‌గఢ్‌లో ఒబిసి జాబితాలో ఉన్న కుమ్‌హార్(కుమ్మరి) సముదాయానికి చెందిన ఈమె, మట్టితో కుండలను, దేవుని ప్రతిమలను చేయటం తమ సముదాయపు సంప్రదాయక వృత్తి అని చెప్పారు. దీపావళి, పోలా పండుగల సమయంలో కుంతి కుండలను చేస్తారు. "నాకు కుండలు చేయటమంటే చాలా ఇష్టం కానీ, ఏడాది పొడవునా చేయలేను," అన్నారామె. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలోని రైతులు పోలా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలలో ఎద్దులూ దున్నపోతులదే ముఖ్యస్థానం. వ్యవసాయంలో వాటి కీలక పాత్రను గురించి పండుగ చేస్తారు. ఈ పండుగ సాధారణంగా ఆగస్ట్ నెలలో వస్తుంది.

*****

జగదీశ్ చక్రధారి (29) రాయపూర్ జిల్లా, ఛురా బ్లాక్‌లోని పారాగాఁవ్‌కు చెందిన పట్టభద్రుడు. ఈయన రాతి క్వారీలలో పనిచేస్తాడు. ఆ సంపాదనకు సహాయంగా ఉండేందుకు గత నాలుగేళ్ళుగా జగదీశ్, నదీతలంలోని తమ కుటుంబానికి చెందిన భాగాన్ని కూడా సాగుచేస్తున్నాడు. తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండటం కోసం జగదీశ్, విద్యార్థిగా ఉన్నప్పటినించే క్వారీలో పనిచేస్తున్నాడు. ఇందులో అతని సంపాదన రోజుకు 250 రూపాయలు.

Left: Jagdish Chakradhari sitting in his hut beside his farm.
PHOTO • Prajjwal Thakur
Right: Indraman Chakradhari in front of his farm
PHOTO • Prajjwal Thakur

ఎడమ: తన పొలం పక్కనే ఉన్న గుడిసెలో కూర్చొని ఉన్న జగదీశ్ చక్రధారి. కుడి: తన పొలం ముందు నిల్చొని ఉన్న ఇంద్రమన్ చక్రధారి

Left: Indraman Chakradhari and Rameshwari Chakradhari standing on their field.
PHOTO • Prajjwal Thakur
Right: Muskmelon grown on the fields of Mahanadi river
PHOTO • Prajjwal Thakur

ఎడమ: తమ పొలంలో నిల్చొని ఉన్న ఇంద్రమన్ చక్రధారి, రామేశ్వరి చక్రధారి. కుడి: మహానది నదీతలంలో పండించిన కర్భూజాలు

జగదీశ్ తండ్రి శతృఘ్న చక్రధారి (55), తల్లి దులారీబాయి చక్రధారి (50), చెల్లెలు తేజశ్వరి (18) కూడా మహానది నదీతలంలోని పొలాలలో పనిచేస్తారు. చక్రధారి కుటుంబం కూడా కుమ్‌హర్ సముదాయానికే చెందినదైనప్పటికీ, వారు కుండలను తయారుచేయరు. "దానివలన నేను ఎక్కువ సంపాదించలేను," అంటాడు జగదీశ్.

పారాగాఁవ్ గ్రామానికే చెందిన ఇంద్రమన్ చక్రధారి (40) కూడా కుమ్‌హర్ సముదాయానికే చెందినవారు. పండుగల సమయాలలో ఆయన దుర్గ, గణేశ్ వంటి దేవతామూర్తుల విగ్రహాలను తయారుచేస్తారు. ఈ పనివలన తనకు ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు.

"నా కొడుకును నాలాగా రైతును చేయాలని అనుకోవటంలేదు. ఉద్యోగం కోసమో మరో పని కోసమో అతనేమైనా చేయనీ. ఇప్పుడతను 11వ తరగతి చదువుతున్నాడు, కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్నాడు. అతను కూడా పొలం పనుల్లో సాయపడతాడు కానీ, వ్యవసాయం వల్ల వచ్చే ఆదాయం కేవలం ఒక్కరి కడుపు నింపేందుకే సరిపోతుంది," అంటారు ఇంద్రమన్.

ఆయన భార్య రామేశ్వరి చక్రధారి పొలం పనులు చేయడంతో పాటు కుండలను, దేవతా మూర్తులను కూడా చేస్తారు. "మా పెళ్ళయిన తర్వాత నేను రోజుకూలీగా పనిచేసేదాన్ని. ఇప్పుడు నేను ఈ పని చేయడానికే ఇష్టపడతాను, ఎందుకంటే ఇది మా కోసం మేం చేసుకునే పనే గానీ, ఎవరికోసమో చేసేది కాదు కదా."

Left: Indraman Chakradhari carrying the beans he has harvested from his field to his hut to store.
PHOTO • Prajjwal Thakur
Right: Rameshwari Chakradhari working in her field
PHOTO • Prajjwal Thakur

ఎడమ: తన పొలంలో కోసిన చిక్కుళ్ళను నిలవచేయడానికి తన గుడిసెకు తీసుకువెళుతున్న ఇంద్రమన్ చక్రధారి. కుడి: తన పొలంలో పనిచేస్తోన్న రామేశ్వరి చక్రధారి


Left: Shatrughan Nishad in front of his farm.
PHOTO • Prajjwal Thakur
Right: Roadside shops selling fruits from the farms in Mahanadi river
PHOTO • Prajjwal Thakur

ఎడమ: తన పొలం ముందు నిల్చొన్న శతృఘ్న నిషాద్. కుడి: మహానది నదీతలంలోని పొలాలలో పండించిన పండ్లను అమ్ముతోన్న బాట పక్కనున్న దుకాణాలు

మహాసముంద్ జిల్లాలోని ఘొరారీ గ్రామానికి చెందిన శతృఘ్న నిషాద్ కుటుంబం మూడు తరాలుగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఈ 50 ఏళ్ళ రైతుకు కూడా నదీతలంలో ఒక చిన్న భూభాగముంది. "మహారాష్ట్రకు చెందిన ఒక రైతు ఇక్కడ కర్బూజాలనూ పుచ్చకాయలనూ పండించేవారు. మేం ఆయన పొలంలో కూలిపని చేసేవాళ్ళం. ఆ తర్వాత మేమే వీటిని సొంతంగా పండించటం మొదలెట్టాం," అన్నారతను.

"డిసెంబర్‌లో మేం భూమికి ఎరువును అందించి, విత్తనాలు నాటుతాం. ఫిబ్రవరిలో పంట కోతను మొదలుపెడతాం," నాలుగు నెలలపాటు ఇక్కడ వ్యవసాయం చేసే శతృఘ్న అన్నారు.

రాష్ట్ర రాజధాని రాయపూర్‌లోని కూరగాయల మార్కెట్ - మండీ - అక్కడికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్లాక్ ప్రధానకేంద్రమైన ఆరంగ్ అక్కడికి 4 కి.మీ. దూరంలో మాత్రమే ఉండటం వలన రైతులు దానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇక్కడకు రవాణా చేసే సరుకును వాటిని నింపే తొట్టెల లెక్కన చెల్లిస్తారు. రాయపూర్‌కు తీసుకువెళ్ళేందుకు ఒక్కో తొట్టెకు రూ. 30 చెల్లిస్తారు.

మీరు గనుక మహానదిపై ఉన్న వంతెన మీదుగా ప్రయాణం చేస్తున్నట్లయితే, టార్పాలిన్‌తోనూ చెక్క కర్రలతోనూ ఏర్పాటుచేసిన తాత్కాలిక దుకాణాలలో కూరగాయలను, పండ్లను విక్రయించే ఈ నదీతలపు రైతులను చాలామందిని చూడవచ్చు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Student Reporter : Prajjwal Thakur

ಪ್ರಜ್ವಲ್ ಠಾಕೂರ್ ಅಜೀಂ ಪ್ರೇಮ್‌ಜಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಪದವಿಪೂರ್ವ ವಿದ್ಯಾರ್ಥಿ.

Other stories by Prajjwal Thakur
Editor : Riya Behl

ರಿಯಾ ಬೆಹ್ಲ್ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾ (ಪರಿ) ದಲ್ಲಿ ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಛಾಯಾಗ್ರಾಹಕರಾಗಿದ್ದಾರೆ. ಪರಿ ಎಜುಕೇಶನ್ ವಿಭಾಗದಲ್ಲಿ ವಿಷಯ ಸಂಪಾದಕರಾಗಿ, ಅಂಚಿನಲ್ಲಿರುವ ಸಮುದಾಯಗಳ ಜನರ ಜೀವನವನ್ನು ದಾಖಲಿಸಲು ಅವರು ವಿದ್ಯಾರ್ಥಿಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Riya Behl
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli