"నా వీపు ఈ ఎండకి కమిలిపోయింది. ఈ మధ్య కాలంలో ఇక్కడ వేడి బాగా పెరిగింది. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది," అని తను పండించిన బాజ్రా (సజ్జలు) దిబ్బల వైపు దీనంగా చూస్తూ బజ్రంగ్ గోస్వామి బాధపడ్డారు. రాజస్థాన్‌ చూరూ జిల్లా తారానగర్ తహసీల్‌ లోని (తాలూకా) గాజువాస్ గ్రామం వెలుపల ఉన్న ఖేజ్రీ (జమ్మి) చెట్ల నీడలో అతను సేద తీరుతూ కనబడ్డారు. ఆ పక్కనే బజ్రంగ్ గోస్వామి, అతని భార్య రాజ్కౌర్ వాటాదారులుగా సాగు చేస్తున్న 22 బిఘా ల (దాదాపు 6.6 లక్షల చదరపు గజాలు) భూమిలో ఒక ఒంటె ఎండు గడ్డి తింటూ కనబడింది.

"ఒక పక్క నడినెత్తిపై సూర్యుడు మండుతుంటే, మరో పక్క పాదాల కింద ఇసుక కాలుతోంది," అని తారానగర్‌కు దక్షిణంగా ఉన్న సుజన్‌గఢ్ తహసీల్‌ కు చెందిన గీతాదేవి నాయక్ విస్తుపోయారు. “ గర్మీ హీ గర్మి పడే హై ఆజ్ కల్ (ఈ మధ్య కాలం లో వేడి చాలా ముదిరిపోయింది),” అన్నది భగ్వాని దేవి. గూడవారి గ్రామంలో భగ్వానీదేవి చౌదరి కుటుంబానికి చెందిన భూమిలో, వితంతువైన గీతాదేవి వ్యవసాయ కూలిగా పని చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల కల్లా అక్కడ తమ పని పూర్తి చేసుకుని, ఇద్దరు మహిళలూ తిరిగి ఇంటికి వెళ్తారు.

ఉత్తర రాజస్థాన్‌లోని చూరూ జిల్లాలో, వేసవి కాలంలో ఇసుక నేల సెగలు కక్కుతుంటే, మే-జూన్‌లలో గాలి నిప్పుల కొలిమిలా మారుతుంది. మండుతున్న ఎండలు, పెరుగుతున్న తాపం గురించి చర్చించుకోవడం ఇక్కడ ప్రజలకు పరిపాటి. ఆ రెండు నెలలూ ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా ఉంటుంది. గత నెల మే 26 (2020)న, అది ఏకంగా 50 డిగ్రీలకు చేరుకుంది. ఇదొక ప్రపంచ రికార్డు అని వార్తా కధనాలు కూడా వచ్చాయి.

గత సంవత్సరం (2019) జూన్ ప్రారంభంలో, చూరూలో 51 డిగ్రీల సెల్సియస్ (నీరు మరిగే ఉష్ణోగ్రతకి సగం కంటే కొంచెం ఎక్కువ) నమోదైనప్పుడు, చాలా మందికి ఇదేమంత ప్రాముఖ్యమైన విషయంగా అనిపించలేదు. "ఎందుకంటే సుమారు 30 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంది," అని రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడే కాక భూయజమాని కూడా అయిన 75 ఏళ్ల హర్దయాల్జీ సింగ్,, గాజువాస్ గ్రామంలో తన విశాలమైన ఇంటి ఆవరణలో వున్న నవారు మంచంపై విశ్రాంతి తీసుకుంటూ గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే, దేశంలో ప్రధాన మైదాన ప్రాంతాలలో ఒకటైన చూరూలో, డిసెంబర్-జనవరి నెలల్లో సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఫిబ్రవరి 2020 లో ఇక్కడ 4.1 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

Geeta Devi and Bhagwani Devi of of Sujangarh tehsil, Churu: ' Garmi hee garmi pade aaj kal' ('It’s heat and more heat nowadays')
PHOTO • Sharmila Joshi

చూరూలోని సుజన్‌గఢ్ తహసీల్‌కి చెందిన గీతాదేవి మరియు భగ్వానీదేవి, ' గర్మీ హీ గర్మి పడే హై ఆజ్ కల్ (ఈ మధ్య కాలం లో వేడి చాలా ముదిరిపోయింది)'

కానీ ఇక్కడి ప్రజలు, మైనస్ 1 నుండి 51 డిగ్రీల సెల్సియస్ వరకు వున్నఈ విస్తృత ఉష్ణోగ్రత క్రమాను (ఆర్క్) గురించో, జూన్ 2019 లో నమోదైన 51 డిగ్రీల ఉష్ణోగ్రత గురించో లేదా గత నెల నమోదైన 50 డిగ్రీల సెల్సియస్ గురించో చర్చించుకోరు. ప్రతి ఏడూ తమని పలకరిస్తున్న సుదీర్ఘ వేసవి కాలం గురించి, నిడివి తగ్గుతున్న చలి-వర్షా కాలాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు.

"గతంలో ఈ విపరీతమైన వేడి ఒకటి లేదా రెండు రోజులు ఉండేది. కానీ ,ఇప్పుడు చాలా రోజుల వరకు కొనసాగుతోంది. వేసవి కూడా విస్తరిస్తోంది," అని చూరూ నివాసి, సికార్ జిల్లాలో వున్నSK ప్రభుత్వ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అయిన ప్రొఫెసర్ HR ఇస్రాన్ చెప్పారు. అతనిని చాలా మంది తమ గురువుగా భావిస్తారు.

"జూన్ 2019 లో, మా చెప్పులు తారు రోడ్డుకు అంటుకుపోవడంతో, మధ్యాహ్న సమయంలో మేము రోడ్డుపై నడవలేకపోయాము," అని అమృత చౌదరి గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ, ఇతరుల మాదిరిగానే, సుజన్‌గఢ్ పట్టణంలో టై-అండ్-డై వస్త్రాలను ఉత్పత్తి చేసే దిశా షేఖావతి అనే సంస్థను నడుపుతున్న అమృత చౌదరి, ఎండల తీవ్రత గురించి మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ ఎండలు పెరుగుతున్నాయి. వేసవి ముందుగానే ప్రారంభమవుతోందని ఆమె వాపోయారు.

"వేసవి కాలపు నిడివి ఇప్పుడు ఒకటిన్నర నెలలు పెరిగింది," అని గూడవారి గ్రామస్తురాలైన భగ్వానీదేవి అంచనా వేశారు. ఆమెలాగే చూరూ జిల్లాలోని గ్రామాలలో నివసించే ప్రజలు తారుమారవుతున్న ఋతువుల కాలపరిమాణం, ఠారెత్తిస్తున్నఎండలు, తగ్గుతున్న శీతాకాలం - వర్షాకాలాల నిడివి గురించే మాట్లాడుకుంటున్నారు.

ఒక్క వారంలో నమోదైన 51 డిగ్రీల ఉష్ణోగ్రతో లేదా గత నెలలో కొన్ని రోజులు నమోదైన 50 డిగ్రీలో కాక వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ పెను మార్పులే వీరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

****

2019 లో, జూన్ 1 మరియు సెప్టెంబర్ 30 మధ్య, చూరూలో 369 మి.మీల వర్షం కురిసింది. ఇది సాధారణ సగటు 314 మి.మీల కంటే కొంచెం ఎక్కువ. అయితే, భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం (10.4 శాతం వైశాల్యంలో విస్తరించిన), శుష్క (arid) మరియు పాక్షిక శుష్క (semi-arid) ప్రాంతమైన రాజస్థాన్లో, వార్షిక సగటు వర్షపాతం దాదాపు 574 మి.మీలు అని అధికారిక సమాచారం.

In the fields that Bajrang Goswami and his wife Raj Kaur cultivate as sharecroppers outside Gajuvas village in Taranagar tehsil
PHOTO • Sharmila Joshi
In the fields that Bajrang Goswami and his wife Raj Kaur cultivate as sharecroppers outside Gajuvas village in Taranagar tehsil
PHOTO • Sharmila Joshi
In the fields that Bajrang Goswami and his wife Raj Kaur cultivate as sharecroppers outside Gajuvas village in Taranagar tehsil
PHOTO • Sharmila Joshi

తారానగర్ తహసీల్‌లోని గాజువాస్ గ్రామం వెలుపల బజ్రంగ్ గోస్వామి, అతని భార్య రాజ్కౌర్ వాటాదారులుగా సాగుచేసే పొలాలు

రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 7 కోట్ల జనాభాలో 75 శాతం మందికి వ్యవసాయమూ పశువుల పెంపకమే ప్రధాన వృత్తులు. చూరూ జిల్లాలోని దాదాపు 25 లక్షల జనాభాలో, 72 శాతం మంది గ్రామీణ ప్రాంతవాసులే. ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా వర్షాల మీదే ఆధారపడి ఉంటుంది.

కాలక్రమేణా చాలా మంది వర్షాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోడానికి ప్రయత్నించారు. "ఇందులో భాగంగానే, 1990ల నుండి, 500-600 అడుగుల లోతు వరకు బోరు బావులు త్రవ్వే ప్రయత్నాలు ఇక్కడ చాలా జరిగాయి. అయితే భూగర్భ జలాల లవణీయత కారణంగా, ఆ ప్రక్రియ అంతగా విజయవంతం కాలేదు," అని ప్రొఫెసర్ ఇస్రాన్ వివరించారు. జిల్లాలోని ఆరు తహసీల్‌లలోని 899 గ్రామాలలో కొంతకాలం వరకు, కొంతమంది రైతులు బోరు నీటిని ఉపయోగించి వేరుశెనగ వంటి రెండవ పంటను పండించారు. "కానీ, ఇప్పుడు భూమి ఎండిపోయింది; కొన్ని గ్రామాలలో మినహా చాలా చోట్ల బోరు బావులు మూతబడ్డాయి."

రాజస్థాన్ నికర విత్తన విస్తీర్ణంలో దాదాపు 38 శాతం (లేదా 62,94,000 హెక్టార్లు) సాగునీటిని అందిస్తోందని రాజస్థాన్ స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ ( RSAPCC 2010) ముసాయిదా పేర్కొంది. చూరూలో ఇది కేవలం 8 శాతం మాత్రమే! కొన్ని గ్రామాలు మరియు పొలాలకు చౌదరి కుంభారం లిఫ్ట్ కెనాల్ నీటిని అందజేస్తోంటే, చూరూలోని వ్యవసాయంలో దాని నాలుగు ప్రధాన ఖరీఫ్ పంటలైన బాజ్రా, మూంగ్ (పెసలు), మోత్ బీన్స్ (చిమ్మట పప్పు), గవర్ బీన్స్ (గోరు చిక్కుడు) మాత్రం ఎక్కువగా వర్షపాతంపై ఆధారపడి ఉన్నాయి.

అయితే, గత 20 ఏళ్లుగా వర్షపాతం తీరు మారింది. దాంతో, ఋతుపవనాల నెలల్లో వచ్చిన మార్పుల గురించి, కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా కురుస్తున్న వర్షం గురించి చూరూ ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు.

"ఆషాఢ మాసంలో (జూన్-జూలై) వచ్చే మెరుపులను చూసి, మేము వర్షం కురుస్తుందని గ్రహించి, త్వరత్వరగా పొలాల్లో రోటీ లను తయారు చేసుకొని, మా గుడిసెలలోకి వెళ్లేవాళ్ళం. ఇప్పుడు తరచుగా మెరుపులు వస్తున్నాయి కానీ వర్షం రావడం లేదు," అని 59 ఏళ్ల గోవర్ధన్ సహారన్ అనే రైతు, ఒకప్పుడు కురిసే విస్తారమైన వర్షాలను గుర్తు చేసుకున్నారు. గాజువాస్ గ్రామంలో అతనికి 180 బిఘాల (సుమారు 120 ఎకరాలు) భూమి ఉంది. జాట్ కమ్యూనిటీకి చెందిన ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టారు. చూరూలో నివసించే రైతులు ఎక్కువగా జాట్‌లు, చౌదరీలు; అంటే OBC వర్గాలకు చెందినవారు.

Bajrang Goswami and Raj Kaur (left) say their 'back has burnt with the heat', while older farmers like Govardhan Saharan (right) speak of the first rains of a different past
PHOTO • Sharmila Joshi
Bajrang Goswami and Raj Kaur (left) say their 'back has burnt with the heat', while older farmers like Govardhan Saharan (right) speak of the first rains of a different past
PHOTO • Sharmila Joshi

బజ్రంగ్ గోస్వామి, రాజ్కౌర్ (ఎడమ) తమ వీపు ఎండ వేడికి కాలిపోయిందని చెప్తున్నారు; గోవర్ధన్ సహారన్ (కుడి) వంటి పెద్ద రైతులు తమ గతంలో కురిసిన వర్షాలను గుర్తు చేసుకుంటున్నారు

"నేను పాఠశాలకు వెళ్ళే రోజుల్లో, ఉత్తరాన కారు మేఘాలు కమ్ముకోవడం చూసి ఒక అరగంటలో వర్షం పడుతుందని గ్రహించేవాళ్ళం," అని పొరుగున ఉన్న సికార్ జిల్లాలోని సదిన్సర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల నరైన్ ప్రసాద్ చెప్పారు. ఇప్పుడేమో మబ్బులు పట్టినా, వాన కురవక ముందే తేలిపోతున్నాయని, తన పొలంలో వున్న మంచంపై కూర్చొని బాధపడ్డారు. తన 13 బిఘా ల వ్యవసాయ భూమిలో (సుమారు 8 ఎకరాలు) వర్షపు నీటిని సేకరించేందుకు ప్రసాద్ ఒక భారీ కాంక్రీట్ ట్యాంక్‌ను నిర్మించారు. (నేను అతనిని నవంబర్ 2019 లో కలిసినప్పుడు అది ఖాళీగా ఉంది.)

ఇప్పుడు జూన్ నెలాఖరుకి కాకుండా, సాధారణ వర్షపాతం నమోదయ్యే సమయం దాటిన తరువాత లేదా బాజ్రా విత్తనాలు నాటేటప్పుడు వానలు పడుతున్నాయి. కొన్నిసార్లు ఆగస్టు చివరి నాటికి లేదా ఒక నెల ముందుగానే ఆగిపోతున్నాయని ఇక్కడి రైతులు అంటున్నారు.

దీనివలన విత్తనాలు నాటే ప్రణాళికలు, కాలపట్టికలు ప్రభావితమవుతున్నాయి. "మా నానా ల(తాతల) కాలంలో వుండే రైతులకు గాలులు, నక్షత్రాల స్థానం, పక్షుల రాగాలు లాంటి విషయాలు బాగా తెలుసు. వాటి ఆధారంగా, వ్యవసాయ సంబంధిత నిర్ణయాలు తీసుకునేవారు," అని అమృత చౌదరి వివరించారు.

"ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నమైంది," అని రచయిత-రైతు దులారామ్ సహారన్ చెప్పారు. తరంగర్ బ్లాక్‌లోని భరంగ్ గ్రామంలో దులారామ్ ఉమ్మడి కుటుంబం దాదాపు 200 బిఘా ల భూమిని సాగు చేస్తోంది.

వార్షిక సగటు చాలా స్థిరంగా ఉన్నప్పటికీ, ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, త్వరగా తిరుగుముఖం పట్టడం లాంటి సమస్యలకు తోడు, ఇప్పుడు వర్షాల తీవ్రత బాగా తగ్గింది. గాజువాస్‌లో 12 బిఘా లను పండించే ధరంపాల్ సహారన్ మాట్లాడుతూ, "ఇప్పుడు వర్షాపాతం అస్థిరంగా ఉంది. అసలు ఎప్పుడు పడతాయో, పడవో ఎవరికీ అర్ధం కావడం లేదు! పైగా, వానలు చాలా తక్కువగా కురుస్తున్నాయి. ఒక్కోసారి పొలంలో ఒక చోట వర్షం పడుతుంది, మరొక చోట పడదు," అని అమృత ఆశ్చర్యపోయారు.

Left: Dharampal Saharan of Gajuvas village says, 'I am not sowing chana because there is no rain after September'. Right: Farmers in Sadinsar village speak of the changing weather – Raghubir Bagadiya (also a retired army captain), Narain Prasad (former high school lecturer) and Shishupal Narsara (retired school principal)
PHOTO • Sharmila Joshi
Left: Dharampal Saharan of Gajuvas village says, 'I am not sowing chana because there is no rain after September'. Right: Farmers in Sadinsar village speak of the changing weather – Raghubir Bagadiya (also a retired army captain), Narain Prasad (former high school lecturer) and Shishupal Narsara (retired school principal)
PHOTO • Sharmila Joshi

ఎడమ వైపు: సెప్టెంబర్‌ తర్వాత వర్షాలు లేకపోవడంతో నాట్లు వేయడం లేదని గాజువాస్‌ గ్రామానికి చెందిన ధరంపాల్‌ సహరన్‌ చెప్పారు. కుడి వైపు: సదిన్సర్ గ్రామానికి చెందిన రఘుబీర్ బగాడియా (రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్), నరేన్ ప్రసాద్ (మాజీ హైస్కూల్ టీచర్), శిశుపాల్ నర్సరా (రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్) మారుతున్న వాతావరణం గురించి మాట్లాడుతున్నారు

1951 నుండి 2007 వరకు విపరీతమైన వర్షపాతం యొక్క సందర్భాలను గుర్తించిన RSAPCC, కొన్ని అధ్యయనాలను ఉటంకిస్తూ, రాష్ట్రంలో మొత్తం వర్షపాతం తగ్గుతుందని; వాతావరణ మార్పుల కారణంగా బాష్పీభవనం (evapo-transpiration) పెరుగుతుందని అంచనా వేసింది.

ఋతుపవనాలు తిరోగమించాక, అక్టోబర్ మరియు జనవరి-ఫిబ్రవరిలో పడే చిరు జల్లులపై చూరూ రైతులు ఎంతో కాలంగా ఆధారపడి వున్నారు. వేరుశెనగ, బార్లీ వంటి రబీ పంటలను ఈ జల్లులే కాపాడతాయి. "యూరప్, అమెరికాల మధ్య సముద్రాల నుండి పాకిస్తాన్ మీదుగా వచ్చే ఈ చినుకులనే చక్రావత్ వర్షం అంటారు. కానీ, అది ఇప్పుడు అదృశ్యమయ్యింది," అని హర్దయాల్జీ చెప్పారు.

ఆ వర్షం శనగల పంటకు (శనగపప్పు) కూడా నీరందించేది. అందుకే, తారానగర్‌ను భారతదేశపు ‘ చనె కా కటోరా' (శనగల గిన్నె) అని పిలుస్తారు. “పంట బాగా పండేది కాబట్టి పెరట్లో కుప్పలు కుప్పలుగా చేను పోసేవాళ్ళం.” ఇది ఇక్కడి రైతులకు గర్వకారణమని దూలారామ్ చెప్పారు. ఆ గిన్నె ఇప్పుడు దాదాపు ఖాళీగా ఉంది. "2007 సెప్టెంబరు తర్వాత, వర్షాభావం వల్ల నేను శనగల పంట వేయడం లేదు," అని ధరంపాల్ బాధపడ్డారు.

నవంబర్ నాటికి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాక, చూరూలో శనగల పంట బాగా మొలకెత్తుతుంది. అయితే, కొన్నేళ్లుగా ఇక్కడ చలికాలం కూడా మారిపోయింది.

****

భారతదేశంలో జమ్మూ-కాశ్మీర్ తర్వాత చలిగాలుల ప్రభావం అత్యధికంగా వుండే రాష్ట్రం రాజస్థాన్‌ అని RSAPCC నివేదిక ఒకటి తెలిపింది. 1901 నుండి 1999 వరకు, అంటే దాదాపు ఒక శతాబ్ద కాలంలో, 195 సార్లు ఈ రాష్ట్రం తీవ్ర చలిగాలుల ప్రభావానికి లోనైంది (1999 తర్వాత దీనికి సంబంధించిన డేటా లేదు). ఒక పక్క గరిష్ట ఉష్ణోగ్రతల ట్రెండ్‌ నడుస్తున్న క్రమంలో, ఫిబ్రవరి 2020 లో, చూరూ 4.1 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతను చూసింది.

చూరూలో చాలా మందికి శీతాకాలం మునుపటిలా అనిపించడం లేదు. "నా చిన్నతనంలో (సుమారు 50 సంవత్సరాల క్రితం), నవంబర్ ప్రారంభంలో రజాయి (బొంత) ఉపయోగించాల్సి వచ్చేది. నేను ఉదయం 4 గంటలకు లేచి, మందపాటి దుప్పటి ఒకటి చుట్టుకొని పొలానికి వెళ్ళేవాడిని," అని గోవర్ధన్ సహారన్ చెప్పారు. గాజువాస్ గ్రామంలో అతను జమ్మి చెట్ల మధ్య పండించిన బాజ్రా పొలంలో కూర్చుని, "ఇప్పుడు నేను బనియన్ ధరించాను కదా. ఇప్పుడు నవంబర్ నెల వచ్చినా నాకు వెచ్చగా అనిపిస్తోంది," అని దానిని తడుముకున్నారు.

Prof. Isran (left) of Churu town says: 'The entire summer has expanded'. Amrita Choudhary (right) of the Disha Shekhawati organisation in Sujangarh says, 'Even in this hot region, the heat is increasing'
PHOTO • Sharmila Joshi
Prof. Isran (left) of Churu town says: 'The entire summer has expanded'. Amrita Choudhary (right) of the Disha Shekhawati organisation in Sujangarh says, 'Even in this hot region, the heat is increasing'
PHOTO • Sharmila Joshi

చూరూ పట్టణానికి చెందిన ప్రొఫెసర్ ఇస్రాన్ (ఎడమ వైపు) వేసవి కాలపు నిడివి పెరిగిందని అన్నారు. సుజన్‌గఢ్ లోని దిశా షేఖావతి సంస్థకు చెందిన అమృత చౌదరి (కుడి వైపు) ఈ మధ్య ఎండలు ముదురుతున్నాయని చెప్పారు

"గతంలో, మార్చి నెలలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నా సంస్థలో ఏర్పాటు చేసినప్పుడు, మేము స్వెటర్లు ధరించేవాళ్ళం. ఇప్పుడు మేము ఫ్యాన్స్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఈ అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఏ ఏడాదికి ఆ ఏడాది మారిపోతున్నాయి," అని అమృత చౌదరి తెలిపారు.

సుజన్‌గఢ్ పట్టణం అంగన్‌వాడీ వర్కర్ గా పని చేస్తున్న సుశీల పురోహిత్ 3-5 సంవత్సరాలు వున్న పిల్లల సమూహాన్ని చూపిస్తూ, వీళ్ళందరూ ఉన్నిదుస్తులు ధరించారు కానీ, నవంబర్‌ నెల వచ్చినా ఇంకా వేడిగా ఉంది. వీళ్ళను ఎలాంటి బట్టలు వేసుకు రమ్మనాలో అర్ధం కావడంలేదంటూ ఆలోచనలో పడ్డారు.

“కంబల్ కా జమానా చాలా గయా”. నవంబర్‌లో దుప్పట్లు కప్పుకునే, కోట్లు వేసుకునే రోజులు పోయాయని చూరూలో ప్రసిద్ధ కాలమిస్ట్ మరియు రచయితగా పేరొందిన 83 ఏళ్ల మాధవ్ శర్మ తేల్చి చెప్పారు.

****

"ఎందుకంటే, కంబళ్లు, కోట్ల అవసరం వున్న రోజులను ఈ విస్తరిస్తున్న వేసవి మింగేసింది! గతంలో మనకు వసంత ఋతువును కలుపుకొని నాలుగు ఋతువులు ఉండేవి. ఇప్పుడు ఒక ప్రధాన మౌసమ్ (ఋతువు) మాత్రమే ఉంది – వేసవి. అదే ఎనిమిది నెలల పాటు కొనసాగుతోంది! ఇదొక దీర్ఘకాలిక మార్పు," అని మాధవ్‌జీ వివరించారు.

గతంలో మార్చిలో కూడా చలిగా ఉండేది. ఇప్పుడు ఫిబ్రవరి చివరి నాటికే వేడి మొదలవుతోంది. ఇది ఆగస్టు, ఒక్కోసారి అక్టోబర్ లేదా అంతకు మించి కొనసాగుతోందని తరంగర్‌లోని వ్యవసాయ కార్యకర్త నిర్మల్ ప్రజాపతి చెప్పారు.

ఈ వేసవి కాలానికి అనుగుణంగా, చూరూలోని రైతులు, కార్మికులు తమ పని వేళలను మార్చుకున్నారు. సాపేక్షంగా చల్లగా వుండే తెల్లవారుజామున, సాయంత్ర వేళల్లో పని చేయడం ద్వారా వేడిని అధిగమించడానికి రైతులు ప్రయత్నిస్తున్నారని ప్రజాపతి తెలియజేశారు.

ఆ అలుపెరుగని వేడికి తోడు, ఒకప్పుడు దాదాపు ప్రతి వారం, ఇసుక తుఫానొకటి చూరూ గ్రామాలలో ఈలలు వేస్తూ తిరుగుతూ, ప్రతిచోటా ఇసుకను వదిలి వెళ్ళేది. రైలు పట్టాలను ఇసుక కప్పేసేది. ఇసుక దిబ్బలు ఒక చోటి నుండి మరొక చోటికి మారిపోయేవి. ఒకసారి ఆరుబయట నిద్రిస్తున్న ఒక రైతును కూడా ఇసుక కప్పేసింది! "ఆ తుఫాను మా ఇంటి పైకప్పంతా ఇసుకతో నింపింది. పశ్చిమ దిశ నుండి వీచే గాలులు ఇలాంటి ఇసుక తుఫానులు తీసుకువస్తాయి. ఇప్పుడు అలాంటి తుఫానులు రావడం లేదు," అని రిటైర్డ్ స్కూల్ టీచర్ హర్దయాల్జీ గుర్తు చేసుకున్నారు.

Left: The Chakravat drizzles have mostly disappeared, says Hardayalji Singh, retired teacher and landowner. Centre: Sushila Purohit, anganwadi worker in Sujangarh, says 'It is still hot in November. Right: Nirmal Prajapati, farm activist in Taranagar, says work hours have altered to adapt to the magnifying summer
PHOTO • Sharmila Joshi
Left: The Chakravat drizzles have mostly disappeared, says Hardayalji Singh, retired teacher and landowner. Centre: Sushila Purohit, anganwadi worker in Sujangarh, says 'It is still hot in November. Right: Nirmal Prajapati, farm activist in Taranagar, says work hours have altered to adapt to the magnifying summer
PHOTO • Sharmila Joshi
Left: The Chakravat drizzles have mostly disappeared, says Hardayalji Singh, retired teacher and landowner. Centre: Sushila Purohit, anganwadi worker in Sujangarh, says 'It is still hot in November. Right: Nirmal Prajapati, farm activist in Taranagar, says work hours have altered to adapt to the magnifying summer
PHOTO • Sharmila Joshi

ఎడమ వైపు: చక్రావత్ చినుకులు చాలా వరకు అదృశ్యమయ్యాయని రిటైర్డ్ ఉపాధ్యాయుడు మరియు భూ యజమాని హర్దయాల్జీ సింగ్ చెప్పారు. సెంటర్: సుజన్‌ఘర్‌లోని అంగన్‌వాడీ వర్కర్ సుశీల పురోహిత్ నవంబర్‌లో ఇంకా వేడిగా ఉంటుందన్నారు. కుడి వైపు: తారానగర్‌లోని వ్యవసాయ కార్యకర్త నిర్మల్ ప్రజాపతి వేసవికి అనుగుణంగా పని గంటలు మార్చబడ్డాయని తెలియజేశారు

ఈ దుమ్ము తుఫానులు తరచుగా " లూ " గాలుల (పొడి మరియు వేడితో కూడిన గాలి) కారణంగా విస్తరించబడతాయి. ఇవి సాధారణంగా, మే మరియు జూన్ (గరిష్ట వేసవి) నెలల్లో కొన్నిగంటలపాటు కొనసాగుతాయి. ఈ ఇసుక తుఫానులు, లూ గాలులు రెండూ, దాదాపు 30 సంవత్సరాల క్రితం సాధారణ సంఘటనలుగా ఉన్నప్పుడే, చూరూలో ఉష్ణోగ్రతలు తగ్గించడంలో సహాయపడ్డాయి. తుఫానులు వచ్చిన ప్రతిసారి, అవి సన్నటి ధూళిని నిక్షిప్తం చేయడం ద్వారా నేలను మరింత సారవంతం చేసేవని నిర్మల్ వివరించారు. "ఇప్పుడు వేడి బంధించబడి ఉంటోంది. పాదరసం అత్యధికంగా 40లలో స్థిరంగా ఉంటోంది. దాదాపు 5-7 సంవత్సరాల తర్వాత, ఏప్రిల్ 2019లో, అలాంటి తుఫానొకటి మళ్ళీ వచ్చింది," అని అతను గుర్తు చేసుకున్నారు.

ఆ వేడి వేసవి కాలాన్ని పొడిగిస్తుంది. ఎండలను మరింత తీవ్రతరం చేస్తుంది. "రాజస్థాన్‌లో మేము మండే వేసవికి అలవాటు పడ్డాము. కానీ మొదటిసారిగా, ఇక్కడి రైతు వేడికి భయపడుతున్నాడు," అని తరంగర్‌లోని వ్యవసాయ కార్యకర్త, హర్దయాల్జీ కుమారుడైన ఉమ్రావ్ సింగ్ చెప్పారు.

****

జూన్ 2019 లో, రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా కనిపించడం మొదటిసారి కాదు. జూన్ 1993 లో, చూరూలో గరిష్ట ఉష్ణోగ్రత 49.8 డిగ్రీలకు చేరుకుందని జైపూర్‌లోని వాతావరణ కేంద్ర రికార్డులు తెలుపుతున్నాయి. మే 1995 లో, ఈ మైలురాయిని బార్మర్ 0.1 డిగ్రీలతో అధిగమించింది. అయితే, జూన్ 1934 లో గంగానగర్ (50 డిగ్రీలు), మే 1956 లో అల్వార్ (50.6 డిగ్రీలు) రికార్డులు సృష్టించాయి.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) 2019 నివేదిక ప్రకారం, ఆ ఏడాది జూన్ ప్రారంభంలో, భూమి మీద అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా చూరూను పేర్కొన్నప్పటికీ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో (అరబ్ దేశాలలో ఉన్న వాటితో సహా) కూడా 50 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, భూగోళ/ప్రపంచ కవోష్ణత (గ్లోబల్ వార్మింగ్) నమూనాలను ఆధారంగా తీసుకుంటే, 2025 నుండి 2085 వరకు భారతదేశంలో 1.1 మరియు 3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత పెరగవచ్చని " వర్కింగ్ ఆన్ ఎ వార్మర్ ప్లానెట్ " ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది.

ఇదిలా ఉండగా, పశ్చిమ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతం (19.61 మిలియన్ హెక్టార్లు) అంతటా పగటిపూట అత్యంత వేడిగా, ఇంకా రాత్రుళ్ళు వెచ్చగా వుంటాయని, 21వ శతాబ్దం చివరి నాటికి వర్షపాతం తగ్గుతుందని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంకా ఇతర సమాచార సంస్థలు అంచనా వేశాయి.

"సుమారు 48 డిగ్రీల సెల్సియస్ తర్వాత పెరిగే ప్రతి డిగ్రీ మనుషుల పై చాలా ప్రభావం చూపిస్తుంది," అని చూరూ జిల్లా పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్ జండూ చెప్పారు. 48-ప్లస్ డిగ్రీల ప్రభావం మనుషుల్లో అలసట, నిర్జలీకరణం (డీహైడ్రేషన్), మూత్రపిండాల్లో రాళ్లు (దీర్ఘకాలిక నిర్జలీకరణం కారణంగా), వికారం, మైకం ఇంకా వడదెబ్బలాగా బయట పడుతుంది. అయితే, 2019 మే-జూన్‌ నెలల్లో ఇలాంటి కేసులు పెరగలేదని, వడదెబ్బ మరణాలు కూడా నమోదైనట్టు తాను గమనించలేదని ఆయన తెలిపారు.

వాతావరణ మార్పుల వల్ల భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తద్వారా జనించే అధిక వేడి, వడగాల్పుల బారిన పడితే, ప్రజలకు వడదెబ్బ తగులుతుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చని ILO నివేదిక ఒకటి పేర్కొంది.

Writer-farmer Dularam saharan (left) of Bharang village at the house of well-known veteran columnist Madhavji Sharma, in Churu town: 'Kambal and coat ka jamaana chala gaya'
PHOTO • Sharmila Joshi

చూరూ పట్టణంలోని సుప్రసిద్ధ కాలమిస్ట్ మాధవ్‌జీ శర్మఇంట్లో భరంగ్ గ్రామానికి చెందిన రచయిత-రైతు దులారం సహారన్ (ఎడమ వైపు) చలి కాలంలో దుప్పట్లు కప్పుకుని, కోట్లు ధరించే రోజులు పోయాయని విస్తుపోయారు

కాలక్రమేణా, ఈ అధిక ఉష్ణోగ్రతలకు దక్షిణాసియా దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని, అలా ప్రభావితమైన దేశాల్లో సాధారణంగా పేదరికం, అనధికారిక ఉపాధి (సురక్షితమైన ఉద్యోగ ఒప్పందాలు, కార్మికుల ప్రయోజనాలు, సామాజిక రక్షణ లేదా కార్మికుల ప్రాతినిధ్యం లేని ఉద్యోగాలు) జీవనాధార వ్యవసాయం (వాణిజ్యానికి అవకాశం లేకుండా, కేవలం ఒకరి స్వంత ఉపయోగం కోసమే సరిపోయే పంటలను పండించడం, పశువులను పెంచడం) అధిక శాతంలో ఉంటాయని కూడా ఆ నివేదిక చెప్పింది.

కానీ అన్ని హానికరమైన ప్రభావాలు అంత త్వరగా, అంత సులభంగా కనిపించవు.

"ఈ అధిక వేడి, తదితర ప్రభావాలు గ్రామీణ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్లేలా వ్యవసాయ కార్మికులను నిస్సహాయుల్ని చేస్తుంది… (మరియు) 2005-15 మధ్య కాలంలో అతి పెద్ద వలస ప్రవాహాలకు ఇది దారి తీసింది (ఒక దశాబ్ద కాలం ముందర గమనించని ధోరణి ఇది). కుటుంబాలు తమ వలస నిర్ణయాలలో వాతావరణ మార్పులను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నాయనడానికి ఇది ఒక సంకేతం కావచ్చు ," అని ఆ ILO రిపోర్ట్ గట్టిగా స్పష్టం చేసింది.

అస్థిరమైన ఋతుపవనాల కారణంగా చూరూలో దిగుబడులు పడిపోయి, ఆదాయాలు తగ్గిపోయి, వలసలు ఎక్కువయ్యాయి. "గతంలో మా భూమి నుండి 100 మన్ల (సుమారు 3,750 కిలోలు) బాజ్రా చేతికి వచ్చేది. ఇప్పుడు అది గరిష్టంగా 20-30 మన్ల కు పడిపోయింది. మా భరాంగ్‌ గ్రామంలో ఇప్పుడు 50 శాతం మంది మాత్రమే సాగు చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు వలస వెళ్లిపోయారు," అని దులారామ్ సహారన్ బాధపడ్డారు.

గాజువాస్ నివాసి అయిన ధరంపాల్ సహారన్ కూడా తన పంట దిగుబడి బాగా పడిపోయిందని, అందుకే ఏడాదిలో 3-4 నెలలు జైపూర్ పట్టణం లేదా గుజరాత్‌లోని వివిధ నగరాలలో టెంపో డ్రైవర్‌గా పని చేస్తున్నానని తెలియజేశారు.

పడిపోతున్న తమ వ్యవసాయ ఆదాయాన్ని పూడ్చుకోవడానికి, చూరూ జిల్లా వాసులు ఎంతో మంది గల్ఫ్ దేశాలకు, లేదా కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలలోని వివిధ నగరాలకు వలస వెళ్లి, అక్కడ ఫ్యాక్టరీలలో పని చేస్తున్నారని ప్రొఫెసర్ ఇస్రాన్ పేర్కొన్నారు. (ప్రభుత్వ విధివిధానాల వల్ల పశువుల వ్యాపారం నాశనమవడం కూడా ఈ వలసలకు కారణం - అయితే అది మరొక కథ.)

రాబోయే 10 సంవత్సరాల్లో, అధిక ఉష్ణోగ్రతల కారణంగా, 80 మిలియన్ల ఫుల్-టైం ఉద్యోగాలకు సమానమైన ఉత్పాదకత నష్టాన్ని ప్రపంచం చూడగలదని ILO నివేదిక చెబుతోంది (ఇరవై ఒకటవ శతాబ్దం చివరి నాటికి, ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రస్తుత అంచనాల ప్రకారం 1.5 డిగ్రీ సెల్సియస్లకు పెరిగితే గనుక).

****

చూరూలో వాతావరణం ఎందుకు ఇలా మారుతోంది?

మాధవ్ శర్మ చెప్పినట్లే, ప్రొఫెసర్ ఇస్రాన్ కూడా పర్యావరణ కాలుష్యమే దీనికి కారణమని అన్నారు. అది వేడిని బంధిస్తుంది, వాతావరణ నమూనాలను మారుస్తుంది. "గ్లోబల్ వార్మింగ్, భవన నిర్మాణ పనుల కారణంగా వేడి ఎక్కువౌతోంది. దీనికి తోడు అడవులు నశించిపోతుంటే, వాహనాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది," అని తరంగర్ తహసీల్‌ భలేరి గ్రామంలోని రైతు, మాజీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన రామ్‌స్వరూప్ సహారన్ వివరించారు.

'After around 48 degrees Celsius,” says Dr. Sunil Jandu (left) in Churu town, even to people used to very high heat, 'every rise by a degree matters a lot'. Ramswaroop Saharan of Bhaleri village attributes the growing heat to global warming
PHOTO • Sharmila Joshi
'After around 48 degrees Celsius,” says Dr. Sunil Jandu (left) in Churu town, even to people used to very high heat, 'every rise by a degree matters a lot'. Ramswaroop Saharan of Bhaleri village attributes the growing heat to global warming
PHOTO • Sharmila Joshi

"సుమారు 48 డిగ్రీల సెల్సియస్ తర్వాత పెరిగే ప్రతి డిగ్రీ ప్రజలపై చాలా ప్రభావం చూపిస్తుంది," అని చూరూ పట్టణంలో పని చేసే డాక్టర్ సునీల్ జండూ (ఎడమ వైపు) అన్నారు. భలేరి గ్రామానికి చెందిన రాంస్వరూప్ సహారన్ పెరుగుతున్న వేడికి గ్లోబల్ వార్మింగ్ కారణమని తెలిపారు

"పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయి, ఎయిర్ కండీషనర్ల వినియోగం పెరిగింది, కార్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో, పర్యావరణం అంతా కలుషితమైపోయింది. ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తున్నాయి," అని జైపూర్‌లో నివసించే సీనియర్ జర్నలిస్ట్ నారాయణ్ బరేత్ చెప్పారు.

కొన్ని సందర్భాలలో చూరూని 'థార్ ఎడారికి గేట్‌వే' గా అభివర్ణిస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల గొలుసులో ఒక చిన్న లంకె మాత్రమే. 1970 తర్వాత, ప్రపంచవ్యాప్తంగా కనిపించిన గ్రీన్‌హౌస్ వాయు (GHG) ఉద్గారాల పెరుగుదలను, తద్వారా వచ్చిన వాతావరణ మార్పులను రాజస్థాన్ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక చర్చించింది. రాజస్థాన్‌ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలౌతున్న గ్రీన్‌హౌస్ వాయువులు తీసుకువచ్చిన మార్పులపై కూడా ఆ ప్రణాళిక దృష్టి పెట్టింది. ఈ వాయువులు చాలా వరకు, ఇంధన రంగంలో అధిక కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వినియోగం, వ్యవసాయ రంగంలో ఉద్గారాలు, పెరుగుతున్న పారిశ్రామిక ప్రక్రియలు మరియు 'భూ వినియోగం, భూ వినియోగం మార్పు, అటవీ నిర్వహణ' కారణంగా ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ వాతావరణ మార్పుల సంక్లిష్ట సాలీగూడులో ఎప్పటికప్పుడు మారుతున్న దారాల వంటివి .

చూరూ గ్రామాల ప్రజలకు గ్రీన్‌హౌస్ వాయువుల గురించి తెలియకపోవచ్చు కానీ, వాటి వల్ల కలిగుతున్న ప్రతికూల ప్రభావాలను మాత్రం వారు రోజూ ఎదుర్కొంటున్నారు. "గతంలో, ఫ్యాన్లు, కూలర్లు లేకుండా, మేము వేడిని తట్టుకోగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు అవి లేకుండా జీవించలేక పోతున్నాం," అని హర్దయాల్జీ చెప్పారు.

“పేద కుటుంబాలు ఫ్యాన్లు, కూలర్లను కొనుగోలు చేయలేవు. భరించలేని వేడి అతిసారం, వాంతులు, ఇతర రుగ్మతలను కలగజేస్తుంది. దాంతో, వైద్యుడి దగ్గరికి వెళ్లడం వారికి భారీ ఖర్చులతో కూడిన పనిగా మారుతుంది,” అని అమృత తెలిపారు.

"ఇంత వేడిలో పని చేయడం కష్టం. ఒక్కోసారి మాకు వికారంగా, తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మేము చెట్టు నీడలో కొంత సేపు విశ్రాంతి తీసుకుంటాం. కొంచెం నిమ్మకాయ నీరు తాగి మళ్ళీ పనికి తిరిగి వస్తాం," అని సుజన్‌గఢ్‌లో పొలం పనులు పూర్తయిన తరువాత, తన ఇంటికి వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తున్న భగ్వానీదేవి చెప్పారు.

ఈ కథనం రాసేందుకు వారి ఉదారమైన సహాయాన్ని, మార్గదర్శకత్వాన్నిఅందించిన నారాయణ్ బరేత్ (జైపూర్‌), నిర్మల్ ప్రజాపతి, ఉమ్రావ్ సింగ్ (తారానగర్‌), అమృత చౌదరి (సుజన్‌గఢ్), దలీప్ సరవాగ్లకు (చూరూ పట్టణం), రచయిత తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected] కి కాపీ చేయండి.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Reporter : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi