జైపూర్‌లోని రాజస్థాన్ పోలో క్లబ్‌లో ఫిబ్రవరి నెల మండే ఎండల్లో ఓ రోజు సాయంత్రం 4 గంటల సమయం.

నలుగురు క్రీడాకారిణులతో కూడిన రెండు జట్లూ ఆడడానికి సిద్ధంగా ఉన్నాయి.

భారతీయ మహిళల పిడికెఎఫ్ జట్టు, పోలోఫ్యాక్టరీ ఇంటర్నేషనల్‌ జట్టుతో ఆడడానికి సిద్ధంగా ఉంది – ఇది భారతదేశంలో జరుగుతోన్న మొట్టమొదటి మహిళల అంతర్జాతీయ పోలో మ్యాచ్.

ప్రతి క్రీడాకారిణి చేతిలోనూ ఆట ప్రారంభించడానికి సిద్ధంగా ఒక కొయ్యతో చేసిన పోలో కర్ర ఉంటుంది. అశోక్ శర్మకు ఈ సీజన్‌లో ఇదే తొలి ఆట. అయితే అతను ఈ ఆటకు కొత్తవారేమీ కాదు.

మూడవ తరం చేతివృత్తి నిపుణుడైన అశోక్‌కి పోలో ఆట సామగ్రికి అవసరమైన పేము కర్రలు తయారుచేయడంలో 55 సంవత్సరాల అనుభవం ఉంది. "నేను పోలో కర్రలు తయారుచేయడంలో నైపుణ్యం కలిగిన కుటుంబంలో పుట్టాను," అంటూ తన కుటుంబానికి గల వందేళ్ళ వారసత్వం గురించి ఆయన ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. గుర్రపు సవారీ చేస్తూ ఆడే పోలో ఆట, ప్రపంచంలోని పురాతన అశ్వ (ఈక్వెస్ట్రియన్) క్రీడలలో ఒకటి.

Ashok Sharma outside the Jaipur Polo House where he and his family – his wife Meena and her nephew Jitendra Jangid craft different kinds of polo mallets
PHOTO • Shruti Sharma
Ashok Sharma outside the Jaipur Polo House where he and his family – his wife Meena and her nephew Jitendra Jangid craft different kinds of polo mallets
PHOTO • Shruti Sharma

జైపూర్ పోలో హౌస్ బయట అశోక్ శర్మ (ఎడమ). ఇక్కడే ఆయన, ఆయన కుటుంబం - అతని భార్య మీనా, ఆమె మేనల్లుడు జితేంద్ర జాంగిడ్ (కుడి) - వివిధ రకాల పోలో కర్రలను తయారుచేస్తారు

అతను జైపూర్ పోలో హౌస్‌ను నడుపుతున్నారు. ఇది నగరంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన వర్క్‌షాప్. ఇదే అతని ఇల్లు కూడా. ఇక్కడ అతను తన భార్య మీనా, 'జీతూ' అని ముద్దుగా పిలుచుకునే ఆమె మేనల్లుడు 37 ఏళ్ల జితేంద్ర జాంగిడ్‌తో కలిసి వివిధ రకాల పోలో కర్రలను తయారుచేస్తారు. వీరు రాజస్థాన్‌లో ఇతర వెనుకబడిన తరగతిగా జాబితా చేసిన జాంగిడ్ సముదాయానికి చెందినవాళ్ళు.

ఎదురెదురు వరుసల్లో నిలబడి ఉన్న జట్ల మధ్యకి అంపైర్ బంతిని దొర్లిస్తారు; ఆట మొదలవుతోందనగా, డెబ్బై రెండేళ్ళ వయస్సున్న అశోక్ గతంలోకి జారుకుంటారు. "నేను ఆట మైదానానికి సైకిల్‌ మీద వెళ్లేవాడిని, ఆ తర్వాత స్కూటర్ కొన్నాను." కానీ 2018లో మెదడులో మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఆయన ఆటమైదానానికి రావడం తగ్గిపోయింది.

ఇంతలో నమస్తే “పాలీజీ,” అంటూ ఇద్దరు ఆటగాళ్ళు వచ్చారు. అశోక్‌కు ఈ పేరు అతని నానీ (అమ్మమ్మ) పెట్టారు. ఆయనను ఆ పేరుతోనే జైపూర్ పోలో వర్గాలు గుర్తిస్తాయి. "నేను ఇలాంటి రోజుల్లోనే ఇక్కడకు ఎక్కువగా రావాలనుకుంటుంటాను. అలా వస్తే నేనింకా పని చేస్తున్నాననే సంగతి ఎక్కువమంది ఆటగాళ్ళకి తెలుస్తుంది. తమ పోలో కర్రలను బాగుచేయించుకోవటం కోసం వాళ్ళు వాటిని నా దగ్గరకి పంపుతారు," అంటారతను.

సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకూ అశోక్ కార్ఖానా కు వచ్చినవారికి కార్ఖానా గోడలకి వరసగా పేర్చి, పైకప్పు నుండి వేలాడుతూ పోలో కర్రలు స్వాగతం పలికేవి. గోడలకు వేసివున్న మీగడ రంగు జాడ కూడా కనిపించనంత ఒత్తుగా పోలో కర్రలు వరుసగా పేర్చి ఉండేవని ఆయన తెలిపారు. "పెద్ద పెద్ద ఆటగాళ్ళు వచ్చి వాళ్లకి నచ్చిన కర్రను ఎంచుకుని, నాతో కాసేపు కూర్చుని, టీ తాగి వెళ్ళిపోయేవారు."

ఆట ప్రారంభమైంది. రాజస్థాన్ పోలో క్లబ్ మాజీ కార్యదర్శి వేద్ అహుజా మా పక్కనే కూర్చున్నారు. "ఇక్కడ ఆడుతున్న ఆటగాళ్లందరూ తమ పోలో కర్రలను పాలీతో మాత్రమే తయారు చేయించుకుంటారు," అతను నవ్వుతూ చెప్పారు. "వెదురు వేరుతో తయారుచేసిన బంతులను కూడా పాలీ మా క్లబ్బుకు సరఫరా చేసేవాడు," అని అహుజా గుర్తుచేసుకున్నారు..

Ashok with international polo-players who would visit in the 1990s for fittings, repairs and purchase of sticks
PHOTO • Courtesy: Ashok Sharma
The glass showcases that were once filled with mallets are now empty.
PHOTO • Shruti Sharma

ఎడమ: 1990లలో ఫిట్టింగులు, మరమ్మతులు, పోలో కర్రల కొనుగోలు కోసం వచ్చిన అంతర్జాతీయ పోలో క్రీడాకారులతో అశోక్ (మధ్యలో). కుడి: ఒకప్పుడు పోలో కర్రలతో నిండి ఉండి, ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోన్న గాజు షోకేసులు

పోలో ఆడగలిగే స్తోమత బాగా ధనవంతులకు లేదా మిలిటరీ సభ్యులకు మాత్రమే ఉంటుందని అశోక్ అన్నారు. 1892లో స్థాపించిన ఇండియన్ పోలో అసోసియేషన్ (ఐపిఎ)లో 2023 నాటికి కేవలం 386 మంది ఆటగాళ్ళు మాత్రమే నమోదు చేసుకున్నారు. "ఒక పోటీలో పాల్గొనాలంటే ఆ వ్యక్తికి కనీసం ఐదు నుంచి ఆరు సొంత గుర్రాలు ఉండాలి," అని అశోక్ చెప్పారు. ఎందుకంటే, ఆటను నాలుగు నుండి ఆరు చక్కర్లు (చుట్లు)గా విభజిస్తారు. ప్రతి ఆటగాడు చుట్టు చుట్టుకూ వేరు వేరు గుర్రాలపై స్వారీ చేయాల్సి ఉంటుంది.

మాజీ రాజ కుటుంబీకులు, ప్రత్యేకించి రాజస్థాన్‌కు చెందినవారు ఈ క్రీడకు పోషకులుగా ఉండేవారు. "1920లలో జోధ్‌పూర్, జైపూర్ పాలకుల కోసం మా పెదనాన్న కేశూరామ్ పోలో కర్రలు తయారుచేసేవారు," అని ఆయన చెప్పారు.

గత మూడు దశాబ్దాలుగా అర్జెంటీనా పోలో ఆటలోనూ, ఉత్పత్తిలోనూ, క్రమబద్ధీకరణలోనూ పోలో ప్రపంచాన్ని శాసిస్తూ వస్తోంది. "వాళ్ల పోలో గుర్రాలూ, అలాగే వాళ్ల పోలో కర్రలు, ఫైబర్ గ్లాస్ బంతులు భారతదేశంలో మంచి విజయాన్ని సాధించాయి. ఆటగాళ్ళు అర్జెంటీనాలో శిక్షణ పొందటానికి కూడా వెళతారు,” అని అశోక్ చెప్పారు.

"అర్జెంటీనా పోలో కర్రల కారణంగా నా పని ఆగిపోయివుండేది, కానీ అదృష్టవశాత్తూ నేను ముప్పై-నలభై సంవత్సరాలుగా సైకిల్ పోలో కర్రలను తయారుచేయడం ప్రారంభించాను. కాబట్టి నాకింకా పని వస్తూనే ఉంది," అని అతను చెప్పారు.

సైకిల్ పోలో ఆటని ఒక సాధారణ సైకిల్‌తో - ఏ పరిమాణంలో ఉన్నా, ఏ రకమైన తయారీ అయినా - ఆడవచ్చు. గుర్రపుస్వారీ చేస్తూ ఆడేవారిలా కాకుండా "ఈ ఆట సామాన్యుల కోసం" రూపొందించినదని అశోక్ చెప్పారు. అతని వార్షిక ఆదాయమైన దాదాపు రూ. 2.5 లక్షలు, సైకిల్ పోలో కర్రలను తయారుచేయడం నుంచే వచ్చింది.

Ashok says that years of trial and error at the local timber market have made him rely on imported steam beech and maple wood for the mallet heads.
PHOTO • Shruti Sharma
Jeetu begins the process of turning this cane into a mallet. He marks one cane to between 50 to 53 inches for horseback polo and 32 to 36 inches for cycle polo
PHOTO • Shruti Sharma

ఎడమ: స్థానిక కలప మార్కెట్‌లో సంవత్సరాల తరబడి చేసిన వివిధ ప్రయోగాల తర్వాత దిగుమతి చేసుకున్న ఆవిరిపట్టిన బీచ్, మేపల్ కొయ్యలను పోలో కర్రల తలభాగం చేయటం కోసం ఉపయోగిస్తున్నామని చెప్పారు అశోక్. కుడి: పేముని పోలో కర్రగా మార్చే ప్రక్రియను ప్రారంభించిన జీతూ. గుర్రపుసవారీ పోలో కోసం 50 నుంచి 53 అంగుళాల వరకూ, సైకిల్ పోలో కోసం 32 నుంచి 36 అంగుళాల వరకూ పేము కర్రపై గుర్తులు పెట్టారు

అశోక్‌కు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన సాధారణ, సైనిక జట్టుల నుండి ఏడాదికి 100కి పైగా సైకిల్ పోలో కర్రల కోసం ఆర్డర్లు వస్తాయి. అతను విక్రయించే ప్రతి పోలో కర్ర మీదా కేవలం 100 రూపాయలు మాత్రమే ఎందుకు సంపాదిస్తున్నారో వివరిస్తూ, "ఈ ఆటగాడు సహజంగానే పేదవాడైవుంటాడు, కాబట్టి నేనామాత్రం వెసులుబాటు ఇవ్వాలి," అని చెప్పారు అశోక్. కేమెల్ పోలో(ఒంటెపై కూర్చొని ఆడే పోలో), ఎలిఫెంట్ పోలో(ఏనుగుపై కూర్చొని ఆడే పోలో)ల కోసం; బహుమతులుగా ఇచ్చేందుకు సూక్ష్మ రూపంలో ఉండే పోలో కర్రల సెట్ల కోసం కూడా అశోక్‌కు అప్పుడప్పుడూ ఆర్డర్లు వస్తుంటాయి..

"ఈ రోజుల్లో ప్రేక్షకులెక్కడా కనిపించడం లేదు," మేమంతా మైదానం నుండి బయటికి వస్తున్నప్పుడు అశోక్ అన్నారు.

ఒకసారి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఆటను చూడటానికి 40,000 మందికి పైగా జనం హాజరైన సంగతిని ఆయన గుర్తుచేసుకున్నారు. చాలామంది చెట్లపై కూర్చుని కూడా ఆ ఆటను చూశారు. అలాంటి జ్ఞాపకాలు కాలానుగుణంగా అతనికి స్ఫూర్తినిస్తాయి, పోలో కర్రలను తయారు చేయడంలో అతని కుటుంబానికి గల సుదీర్ఘ వారసత్వాన్ని కొనసాగించేలా చేస్తాయి.

*****

“ఈ పనిలో ఏదైనా నైపుణ్యం ఉందా? అని ప్రజలు నన్ను అడుగుతుంటారు. ఇది కేవలం పేము కర్రే కదా! అంటుంటారు."

పోలో కర్రను తయారుచేయడం అంటే, “అపూర్వమైన ఆట అనుభవాన్ని అందించేందుకు సహజమైన వివిధ ముడి పదార్థాలను నైపుణ్యంతో కలపడం. ఈ భావన సమతుల్యత, వంగే గుణం, బలం, తేలికదనం అన్నీ కలిసిన మేలు కలయిక. పైగా అది అసలు ఆషామాషీగా ఉండకూడదు.”

అతని ఇంటి మూడవ అంతస్తులో ఉన్న వర్క్‌షాప్‌కి మసక వెలుతురుగా ఉన్న ఇరుకు మెట్లవరుసలో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వెళ్లాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అలా ఎక్కడం తనకు కష్టంగా మారిందని అతనన్నారు. కానీ అతను మానసికంగా గట్టి నిశ్చయం ఉన్నవారు. గుర్రపుసవారీ పోలో కర్రల మరమ్మతు పనులు ఏడాది పొడవునా జరుగుతుంటాయి. అయితే సైకిల్ పోలో కర్రల తయారీ మాత్రం సెప్టెంబర్ నుండి మార్చి వరకు మాత్రమే ముమ్మరంగా జరుగుతుంది.

Meena undertakes the most time consuming aspects of making mallets – strengthening the shaft and binding the grip
PHOTO • Shruti Sharma
in addition to doing the household work and taking care of Naina, their seven-year old granddaughter
PHOTO • Shruti Sharma

మీనా (ఎడమ) ఇంటి పని చేయడం, తమ ఏడేళ్ల మనవరాలు నైనా(కుడి)ని చూసుకోవడంతో పాటు - పోలో కర్రల తయారీలో ఎక్కువ సమయం తీసుకునే పనులైన కర్రను పటిష్టంగా చేయడం, గట్టి పట్టు ఉండేలా బిగించడం వంటి పనులను చేస్తారు

అశోక్ మాట్లాడుతూ, “కష్టతరమైన పనులన్నీ జీతూ మేడమీద చేస్తాడు. మేడమ్, నేనూ మా గదిలో మిగతా పని పూర్తి చేస్తాం," అంటూ చెప్పుకొచ్చారు. అశోక్ తన పక్కనే కూర్చునివున్న తన భార్య మీనాను 'మేడమ్' అని సంబోధిస్తున్నారు. అరవై దాటిన తనను, భర్త 'బాస్' అని పిలుస్తున్నప్పుడల్లా మీనా చిన్నగా నవ్వుకుంటున్నారు; అదే సమయంలో ఓ వైపు ఫోన్ ద్వారా కొనుగోలుదారులకు సూక్ష్మరూపంలోని పోలో కర్రల సెట్ల నమూనాల ఫొటోల్ని పంపుతూ, మరో ప్రక్క మా సంభాషణను కూడా సగం సగం వింటూన్నారు.

ఆ పని పూర్తి కాగానే ఆమె మేం తినటం కోసం కచోరీలు చేసేందుకు వంటగదిలోకి వెళ్ళారు. "నేను ఇప్పటికి 15 సంవత్సరాలుగా పోలో కర్రల పని చేస్తున్నాను," అని మీనా చెప్పారు.

అశోక్ గోడ మీంచి ఒక పాత పోలో కర్రను తీసి, అందులోని మూడు ప్రధాన భాగాలను వివరించారు: ఒక పేము కర్ర, ఒక కొయ్య తలభాగం, పట్టు కుదిరేందుకు రబ్బరు లేదా రెక్సిన్‌తో చుట్టిన హ్యాండిల్ (చేతితో పట్టుకునే) భాగం. దానికి నూలుబట్టతో చేసిన జోలె (sling). ఈ పోలో కర్రలోని ప్రతి భాగాన్నీ ఆయన కుటుంబంలోని వేర్వేరు వ్యక్తులు తయారుచేస్తారు.

ఈ ప్రక్రియ ఇంటి మూడో అంతస్తులో పనిచేస్తున్న జీతూతో మొదలవుతుంది. పేము కర్రని కోయడానికి తానే స్వయంగా తయారుచేసిన ఒక మెకానికల్ కట్టర్‌ని ఉపయోగిస్తారు జీతూ. ఈ పేము కర్రని ఒక వైపు సన్నగా చేయడానికి రందే (చిత్రిక)ను ఉపయోగిస్తారు. ఇది కర్రను అటూ ఇటూ వంగేందుకు అనువుగా చేసి, ఆట ఆడేటప్పుడు అర్ధచంద్రాకారంలో వంపుతిరిగేలా చేస్తుంది..

"మేం పేము కర్ర దిగువభాగాన మేకులు వేయం, అది గుర్రాల్ని గాయపరిచే అవకాశం ఉంది," అంటూ అశోక్ ఇంకా చెప్పుకొచ్చారు, " మానో అగర్ ఘోడా లంగ్డా హోగయా తో ఆప్కే లాఖోం రూపయే బేకార్ (గుర్రం కుంటిదైపోతే మీకు లక్షల రూపాయలు వృధా అయిపోతాయి.)”

Jeetu tapers the cane into a shaft for it to arc when in play. He makes a small slit at the end of this shaft
PHOTO • Shruti Sharma
He makes a small slit at the end of this shaft and then places it through the mallet’s head.
PHOTO • Shruti Sharma

ఆట ఆడేటప్పుడు పేము కర్ర వంపు తిరిగేందుకు వీలుగా జీతూ దాని చివర భాగంలో (ఎడమ) సన్నగా చెక్కి, ఆపైన దానిని పోలో కర్ర తల భాగంలోంచి (కుడి) వెళ్ళేలా చేస్తారు

"నా పని ఎప్పుడూ సాంకేతికంగానే ఉంటుంది" చెప్పారు జీతూ. అతను ఇంతకు ముందు ఫర్నిచర్ తయారుచేసేవారు. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వ సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలోని 'జైపూర్ ఫుట్' విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటు ధరల్లో కృత్రిమ అవయవాలను తయారుచేయడానికి జీతూ వంటి నిపుణులైన పనివారిపై ఆధారపడుతుంది.

జీతూ పోలో కర్ర పిడి భాగం లోంచి పేము కర్రని దూర్చేందుకు డ్రిల్లింగ్ మెషీన్‌తో పిడికి ఛేద్ (రంధ్రం) చేయడాన్ని చూపించారు. ఆ తర్వాత మిగిలిన పని చేయడానికి వాటిని మీనాకు అప్పగిస్తారు.

వంట గది, వారి రెండు పడక గదులతో పాటు కింది అంతస్తులో ఉంటుంది. మీనా అవసరాన్ని బట్టి ఈ గదుల మధ్య తిరుగుతూ పనులన్నీ చేస్తుంటారు. సాధారణంగా ఆమె వంట చేయక ముందు, చేసిన తర్వాత - మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకూ - పోలో కర్రల తయారీ పని చేస్తుంటారు. కానీ తక్కువ వ్యవధిలో ఆర్డర్లు పూర్తి చేయాల్సివచ్చినపుడు, ఆమె రోజులో మరింత సమయాన్ని ఆ పనికి వెచ్చించాల్సి వస్తుంది.

మీనా పోలో కర్రల్ని తయారుచేయడంలో ఎక్కువ సమయం తీసుకునే అంశాలైన కర్రని బలంగా, పట్టు జారకుండా ఉండేలా చేయడం వంటి పనులు చేస్తారు. పేము కర్ర సన్నని చివరి భాగాన్ని ఫెవికాల్ జిగురులో ముంచిన నూలు ముక్కలతో చాలా నైపుణ్యంగా చుట్టాల్సి ఉంటుంది. అదయ్యాక, 24 గంటల పాటు కర్రని కదపకుండా, దాని ఆకృతి చెడకుండా ఉండేలా  నేల మీద సమంగా పరచి ఆరనివ్వాలి.

ఆమె పోలో కర్రను పట్టుకునే భాగాన్ని(హ్యాండిల్‌) రబ్బరు లేదా రెక్సిన్‌తో చుట్టి కట్టేస్తారు. జిగురును, మేకులనూ ఉపయోగించి మందంగా ఉండే హ్యాండిల్‌పై నూలు తాడుని జోలె(sling)లా బిగిస్తారు. ఈ పట్టుకునే భాగం చూడడానికి చాలా చక్కగా కనిపించాలి, నూలు జోలె బలంగా ఉండాలి. అలా ఉంటేనే పోలో కర్ర ఆడేవారి మణికట్టు నుండి జారిపోకుండా ఉంటుంది.

Meena binds rubber or rexine grips and fastens cotton slings onto the thicker handles using glue and nails. This grip must be visibly neat, and the sling strong, so that the stick does not slip out of the player’s grasp
PHOTO • Shruti Sharma
Meena binds rubber or rexine grips and fastens cotton slings onto the thicker handles using glue and nails. This grip must be visibly neat, and the sling strong, so that the stick does not slip out of the player’s grasp
PHOTO • Shruti Sharma

పోలో కర్రల హ్యాండిల్‌ను పట్టు సరిగ్గా ఉండేందుకు రబ్బరు లేదా రెక్సిన్‌తో చుట్టి, మందంగా ఉండే హ్యాండిల్‌పై జిగురు, మేకులను ఉపయోగించి నూలు జోలెలను(slings) బిగిస్తున్న మీనా. ఈ పట్టుకునే భాగం చూడడానికి చాలా చక్కగా కనిపించాలి, జోలె బలంగా ఉండాలి, అలా ఉంటేనే పోలో కర్ర ఆడేవారి మణికట్టు నుండి జారిపోకుండా ఉంటుంది

ఈ దంపతుల 36 ఏళ్ళ కుమారుడు సత్యం, గతంలో తానే ఈ పనులన్నీ చూసుకునేవారు. కానీ ఒక రోడ్డు ప్రమాదం వల్ల అతని కాలికి మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ తర్వాత నుంచీ అతడు నేలపై కూర్చోలేకపోతున్నారు. కొన్ని సాయంత్రాలు అతను రాత్రి భోజనం కోసం సబ్జీ (కూర) వండడం, లేదా ధాబా స్టయిల్లో దాల్ (పప్పు)లో తడ్కా (పోపు) పెట్టడం వంటి పనులు చేస్తూ వంటగదిలో సహాయం చేస్తుంటారు..

అతని భార్య రాఖీ వారంలో ఏడు రోజులూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వారి ఇంటికి నడిచివెళ్ళే దూరంలో ఉన్న పిజ్జా హట్‌లో పనిచేస్తారు. ఖాళీ సమయంలో జాకెట్లు, కుర్తాలు వంటి మహిళల దుస్తులను కుట్టడం, కుమార్తె నైనాతో కాలం గడపడం చేస్తుంటారు. సత్యం ఆధ్వర్యంలో ఆ ఏడేళ్ల పాప తన బడిలో ఇచ్చే హోమ్‌వర్క్‌ను పూర్తిచేసేస్తుంది.

నైనా 9 అంగుళాలున్న సూక్ష్మరూపంలోని పోలో కర్రతో ఆడుతోంది. అది పెళుసుగా ఉన్నందువల్ల విరిగిపోతుందేమోనని వాళ్ళు దాన్ని ఆమెనుంచి తీసేసుకుంటారు. రెండు సూక్ష్మరూపంలోని పోలో కర్రలు, ఒక చెక్కపై బంతి రూపంగా అమర్చిన కృత్రిమ ముత్యం- ఈ సెట్ ధర రూ. 600. ఆడటానికి ఉపయోగించే పెద్ద పోలో కర్రల కంటే బహుమతిగా ఇవ్వడానికి తయారుచేసే సూక్ష్మరూప పోలో కర్రలను చేయడానికి ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుందని చెప్తూ మీనా, "అవి తయారుచేయడం మరింత కష్టం," అన్నారు.

పోలో కర్రల తయారీలో రెండు విభిన్నమైన ముక్కలను - తల భాగం, పేము కర్ర - ఒక దానిలో ఒకటి చొప్పించడాన్ని అసలైన నైపుణ్యంతో కూడిన పనిగా పరిగణిస్తారు. ఈ దశ కర్ర సమతుల్యతను సర్దుబాటు చేస్తుంది. "ఇలా సమతుల్యంగా ఉండేలా చేయటం అందరికీ కుదరని పని" అని మీనా చెప్పారు. అది ఆ సాధన సామగ్రిలో అతి సూక్ష్మంగా దాగి ఉండే లక్షణం. "నేను చేసే పని అదే," అన్నారు అశోక్ యథాలాపంగా.

నేల మీద పరచివున్న ఎర్రటి గద్దీ (మెత్త) మీద కూర్చుని, తన ఎడమ కాలు చాచి, పోలో కర్ర తలభాగాన్ని తొలిచి చేసిన ఛేద్ (రంధ్రం) చుట్టూ జిగురు పూస్తారు అశోక్. ఆ సమయంలో పేము కర్ర అతని కాలి బొటనవేలుకీ, పక్కవేలుకీ మధ్య నిలిచి ఉంటుంది. గత ఐదున్నర దశాబ్దాల్లో ఎన్నిసార్లు ఆ పేము కర్రని అతని కాలి వేళ్ళ మధ్య ఉంచుకోవలసి వచ్చిందో చెప్పమని అడిగితే, "అలాంటి లేక్కేమీ లేదు," అని అశోక్ మెల్లగా నవ్వుతూ జవాబిచ్చారు.

This photo from 1985 shows Ashok setting the balance of the mallet, a job only he does. He must wedge a piece of cane onto the shaft to fix it onto the mallet’s head and hammer it delicately to prevent the shaft from splitting completely.
PHOTO • Courtesy: Ashok Sharma
Mo hammad Shafi does varnishing and calligraphy
PHOTO • Jitendra Jangid

1985 నాటి ఈ ఫోటోలో (ఎడమ) అశోక్ పోలో కర్ర సమతుల్యతను సర్దుబాటు చేస్తున్న దృశ్యం, ఇది ఆయన మాత్రమే చేసే పని. అతను పేము కర్ర పక్కనే ఒక చిన్న పేము ముక్కను దిగగొట్టి దానిని తలభాగంపై అమర్చాలి. కర్ర పూర్తిగా చీలిపోకుండా ఉండేందుకు దానిని సున్నితంగా సుత్తితో కొట్టాలి. వార్నిష్ పూసి, కాలిగ్రఫీ చేసే మొహమ్మద్ షఫీ (కుడి)

" యహ్ చూడీ హో జాయేగీ , ఫిక్స్ జాయేగీ , ఫిర్ బాహర్ నహీ నికలేగీ ( ఇది గాజుని పోలివుంటుంది. ఈ గాజు అంచుపై చక్కగా సర్దుకునేలా అమరుతుంది. అప్పుడిక ఊడిపోకుండా ఉంటుంది ),” అని జీతూ వివరించారు. నిర్విరామంగా బంతి కొట్టే దెబ్బల్ని తట్టుకునేలా పేమునీ, కొయ్యనీ బలంగా జతచేస్తారు .

ఒక నెలలో దాదాపు 100 పోలో కర్రలు తయారవుతాయి. అశోక్‌తో గత 40 ఏళ్ళుగా కలిసి పనిచేస్తోన్న మొహమ్మద్ షఫీ వాటికి వార్నిష్ వేస్తారు. వార్నిష్ వాటికి మెరుపునిస్తుంది, తేమ, ధూళి నుండి రక్షిస్తుంది. షఫీ పోలో కర్రకు ఒకవైపు నిలువుగా రంగులతో కాలిగ్రాఫ్ చేయడం పూర్తి చేస్తారు. ఆ తర్వాత అశోక్, మీనా, జీతూ చేతి పిడికి దిగువన 'జైపూర్ పోలో హౌస్' అనే లేబుల్‌ని అతికిస్తారు.

ఒక్క పోలో కర్ర తయారుచేసేందుకు కావలసిన ముడి పదార్థాల ధర రూ. 1000. వాటి అమ్మకాల్లో తనకు ఆ ధరలో సగం మొత్తం కూడా తిరిగి రాదని అశోక్ చెప్పారు. అతను ఒక పోలో కర్రను రూ. 1,600కి అమ్మాలని ప్రయత్నిస్తారు కానీ, అది అన్నిసార్లూ సాధ్యపడదు. “ఆటగాళ్ళు సరిగా డబ్బులివ్వరు. వాళ్ళు వెయ్యి, పన్నెండు వందలు (రూపాయలు) మాత్రమే ఇస్తామంటారు,” అని అతను చెప్పారు.

పోలో కర్రలోని ప్రతి భాగాన్నీ తయారుచేసేందుకు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో వివరిస్తూ, అందుకు తగినట్టుగా రాబడి ఉండదని దిగులుగా అన్నారు. "కేవలం అస్సామ్, రంగూన్‌ల నుంచి మాత్రమే పేము కొల్‌కతాకు వస్తుంది," అన్నారు అశోక్. ఆ వచ్చిన పేము కూడా సరైన తేమ శాతం, కావలసిన విధంగా వంగే సౌలభ్యం, సాంద్రత, మందం - ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలి.

"కొల్‌కతాలోని సరఫరాదారుల వద్ద మందపాటి పేము ఉంటుంది. అది పోలీసు సిబ్బందికి అవసరమైన లాఠీలు, వృద్ధుల కోసం చేతి కర్రలు తయారుచేయడానికి పనికొస్తుంది. అలాంటి వెయ్యి కర్రల్లో నా అవసరాలను తీర్చగలిగేవి ఓ వంద మాత్రమే ఉంటాయి," అని అశోక్ చెప్పారు. అతనికి సరఫరాదారులు పంపే చాలా పేము కర్రలు పోలో కర్రల తయారీకి బాగా మందమైపోతాయి, కాబట్టి కరోనా దాడిచేయక ముందు అతను ప్రతి సంవత్సరం కొల్‌కతాకు వెళ్ళి, తనకు అవసరమైన పేము కర్రల్ని వేరుచేసి ఎంచుకొని, సరైన పేముని తెచ్చుకునేవారు. "ఇప్పుడైతే నా జేబులో లక్ష రూపాయలు ఉంటేనే తప్ప నేను కొల్‌కతా వెళ్ళలేను," అన్నారు అశోక్.

Mallets for different polo sports vary in size and in the amount of wood required to make them. The wood for a horseback polo mallet head (on the far right) must weigh 200 grams for the length of 9.25 inches.
PHOTO • Shruti Sharma
The tools of the craft from left to right: nola , jamura (plier), chorsi (chisel), bhasola (chipping hammer), scissors, hammer, three hole cleaners, two rettis ( flat and round hand files) and two aaris (hand saws)
PHOTO • Shruti Sharma

ఎడమ: వివిధ పోలో క్రీడలకి వాడే పోలో కర్రలు, వాటి పరిమాణంలోనూ, వాటిని తయారుచేయడానికి అవసరమైన కలప పరిమాణాన్ని బట్టీ మారుతుంటాయి. గుర్రపుసవారీ పోలో కర్ర తలభాగం (కుడి వైపు చివరన) 9.25 అంగుళాల పొడవుంటే, 200 గ్రాముల బరువుండాలి. కుడి: ఈ పనికి ఉపయోగించే ఉపకరణాలు ఎడమ నుండి కుడికి: నోలా, జమురా (శ్రావణం), చోర్సి (ఉలి), భసోల (చివ్వే సుత్తె), కత్తెర, సుత్తె, రంధ్రాలను శుభ్రం చేసేవి మూడు, రెండు రేతీలు (చదునుగానూ, గుండ్రంగానూ ఉండే చేతి ఆకురాళ్ళు)  రెండు ఆరీలు (చేతి రంపాలు)

సంవత్సరాల తరబడి స్థానిక కలప మార్కెట్‌లో ప్రయోగాలు చేసి చూసిన తర్వాత పోలో కర్రల తలభాగం కోసం దిగుమతి చేసుకున్న ఆవిరిపెట్టిన బీచ్, మేపుల్ కలపపై ఆధారపడుతున్నట్టు అశోక్ చెప్పారు.

తాను కొనుగోలు చేస్తున్న కలపతో తానేం తయారుచేస్తున్నాడో కలప విక్రేతలకు ఎన్నడూ వెల్లడించలేదనీ, “నువ్వు ' బడా కామ్ ' (చాలా విలువైన పని) చేస్తున్నావంటూ ధర పెంచుతార!"నీ అతను చెప్పుకొచ్చారు.

తనకు కలప సరఫరా చేసేవారికి, తాను బల్లలకు కాళ్ళు తయారుచేస్తానని చెబుతారాయన. "కొంతమంది నేను అప్పడాల కర్రలు తయారు చేస్తున్నానా అని అడుగుతారు. దానికి కూడా నేను "అవును!" అనే సమాధానమిస్తాను," అంటారు నవ్వుతూ.

"నా దగ్గర 15-20 లక్షల రూపాయలు గానీ ఉంటే, నన్నెవ్వరూ ఆపలేరు," అంటారతను. అర్జెంటీనాలో పోలో కర్రల తల భాగాన్ని తయారుచేయడానికి తిపువానాతిపు అనే చెట్టు నుంచి వచ్చే తీపా కలపను వాడతారనీ, ఈ కలప చాలా నాణ్యమైనదనీ ఆయన చెప్పారు. "ఇది చాలా తేలికగా ఉంటుంది, పైగా విరిగిపోదు, కేవలం దీని పై పొర మాత్రమే ఊడిపోతుందంతే," అని చెప్పారతను.

అర్జెంటీనాలో తయారైన పోలో కర్రలు కనీసం రూ. 10,000 -12,000 వరకూ ఉంటాయి. "పెద్ద పెద్ద ఆటగాళ్లు అర్జెంటీనా నుండి వాటిని తెప్పించుకుంటారు."

Ashok’s paternal uncle, Keshu Ram with the Jaipur team in England, standing ready with mallets for matches between the 1930s and 1950s
PHOTO • Courtesy: Ashok Sharma
PHOTO • Courtesy: Ashok Sharma

ఇంగ్లండ్‌లో 1930లలో, 1950లలో జైపూర్ జట్టు పాల్గొన్న పోటీలలో పోలో కర్రలతో సిద్ధంగా ఉన్న అశోక్ పెదనాన్న కేశూరామ్ (ఎడమ), తండ్రి కల్యాణ్ (కుడి)

ప్రస్తుతం అశోక్ ఆర్డర్లు వచ్చినపుడు గుర్రపుసవారీ పోలో కర్రలను తయారు చేయడం, విదేశీ తయారీ పోలో కర్రలకు మరమ్మత్తులు చేయడం చేస్తున్నారు. జైపూర్ జిల్లాలో భారతదేశంలోనే అత్యధికంగా పోలో క్లబ్బులు ఉన్నప్పటికీ, నగరంలోని క్రీడా సామగ్రిని చిల్లరగా అమ్మే దుకాణాలలో పోలో కర్రలు అమ్మరు..

"ఎవరైనా పోలో కర్రల కోసం అడిగితే, మేం వాళ్ళని పోలో విక్టరీకి ఎదురుగా ఉన్న జైపూర్ పోలో హౌస్‌కు పంపుతుంటాం," అంటూ లిబర్టీ స్పోర్ట్స్ (1957)కు చెందిన అనిల్ ఛాబ్రియా నాకు అశోక్ బిజినెస్‌ కార్డును అందజేశారు.

1933లో ఇంగ్లండ్ పర్యటనలో జైపూర్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాలకు గుర్తుగా పోలో విక్టరీ సినిమా (ప్రస్తుతం అది ఒక హోటల్)ని అశోక్ పెదనాన్న కేశూరామ్ నిర్మించారు. ఆ జట్టుతో కలిసి పర్యటనకు వెళ్ళిన పోలో కర్రల తయారీ నిపుణుడు కేశూరామ్ మాత్రమే.

ప్రస్తుతం, వార్షిక పోలో టోర్నమెంట్లు చారిత్రక జైపూర్ జట్టులోని రెండవ మాన్ సింగ్, హనూట్ సింగ్, పృథీ సింగ్‌ అనే ముగ్గురు సభ్యుల పేరున జైపూర్‌లోనూ, ఢిల్లీలోనూ జరుగుతాయి. ఈ ఉపఖండపు పోలో చరిత్రలో అశోక్, అతని కుటుంబం అందించిన దోహదం గురించి చాలా తక్కువ గుర్తింపు ఉంది.

" జబ్ తక్ కేన్ కి స్టిక్స్ సే ఖేలేంగే , తబ్ తక్ ప్లేయర్స్ కో మేరే పాస్ ఆనా హీ పడేగా (పేముతో చేసిన కర్రలతో ఆడుతున్నంత కాలం, ఈ క్రీడాకారులు నాపై ఆధారపడవలసే ఉంటుంది)," అంటారు అశోక్.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) వారి ఫెలోషిప్ మద్దతు ఉంది

అనువాదం: ఎమ్ఎస్‌బిపిఎన్‌వి రమాసుందరి

Reporter : Shruti Sharma

ಶ್ರುತಿ ಶರ್ಮಾ MMF-PARI ಫೆಲೋ (2022-23). ಅವರು ಕಲ್ಕತ್ತಾದ ಸಮಾಜಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಭಾರತದಲ್ಲಿ ಕ್ರೀಡಾ ಸರಕುಗಳ ಉತ್ಪಾದನೆಯ ಸಾಮಾಜಿಕ ಇತಿಹಾಸದ ಕುರಿತು ಪಿಎಚ್‌ಡಿ ಮಾಡಲು ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ.

Other stories by Shruti Sharma
Editor : Riya Behl

ರಿಯಾ ಬೆಹ್ಲ್ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾ (ಪರಿ) ದಲ್ಲಿ ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಛಾಯಾಗ್ರಾಹಕರಾಗಿದ್ದಾರೆ. ಪರಿ ಎಜುಕೇಶನ್ ವಿಭಾಗದಲ್ಲಿ ವಿಷಯ ಸಂಪಾದಕರಾಗಿ, ಅಂಚಿನಲ್ಲಿರುವ ಸಮುದಾಯಗಳ ಜನರ ಜೀವನವನ್ನು ದಾಖಲಿಸಲು ಅವರು ವಿದ್ಯಾರ್ಥಿಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Riya Behl
Translator : MSBPNV Ramasundari

MSBPNV Ramasundari is a school assistant Hindi in ZP High School, Vadapalli, Andhra Pradesh. She is an experienced translator who has translated over 1000 works - novels, stories, articles and film and TV scripts.

Other stories by MSBPNV Ramasundari