తొమ్మిదేళ్ళ చంద్రికా బెహెరా దాదాపు రెండేళ్లుగా పాఠశాలకు దూరమయింది. బారాబంకీ గ్రామంలో 1 నుండి 5వ తరగతి వరకు చదవడానికి బడికి వెళ్ళవలసిన 19 మంది విద్యార్థులలో ఈమె కూడా ఉంది. కానీ ఈ పిల్లలు 2020 నుండి సక్రమంగా బడికి వెళ్లడం లేదు. తన తల్లి తనను బడికి పంపటంలేదని చంద్రిక చెప్పింది.

బారాబంకీ గ్రామానికి 2007లో సొంత పాఠశాల వచ్చింది, కానీ ఒడిశా ప్రభుత్వం 2020లో దానిని మూసివేసింది. ప్రాథమిక పాఠశాల పిల్లలను, గ్రామానికి చెందిన చంద్రిక వంటి సంథాల్, ముండా ఆదివాసీ పిల్లలను దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాముపసి గ్రామంలోని పాఠశాలలో చేర్పించాలని అధికారులు చెప్పారు.

“పిల్లలు రోజూ అంతలేసి దూరాలు నడవలేరు. అదీగాక, అంత దూరం నడిచే క్రమంలో వాళ్ళంతా ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటున్నారు,” అని చంద్రిక తల్లి మామీ బెహెరా ఎత్తి చూపారు. “మేం పేద కూలీలం. మేం పనులే వెతుక్కోవాలా, లేదంటే పిల్లల వెంట రోజూ బడికి వెళ్ళి, వాళ్ళను తిరిగి తీసుకురావాలా? అధికారులు మా ఊరి బడిని తిరిగి తెరవాలి,” అని ఆమె అన్నారు.

అప్పటి వరకు తన చిన్న బిడ్డలాంటి 6 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలు చదువు లేకుండా ఉండాల్సిందేనని ఆమె నిస్సహాయంగా భుజాలు ఎగరేశారు. ఇక్కడ జాజ్‌పూర్ జిల్లాలోని దానగడి బ్లాక్‌లో ఉన్న అడవిలో పిల్లలను ఎత్తుకుపోయేవాళ్ళు ఉండవచ్చని కూడా 30ల వయసులో ఉన్న ఈ తల్లి భయపడుతున్నారు.

తన కొడుకు జోగి కోసం మామి ఒక ఉపయోగించిన సైకిల్‌ను ఏర్పాటు చేయగలిగారు. జోగి అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 7వ తరగతి చదువుతోన్న పెద్ద కూతురు మోనీ జముపసిలోని పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుంది. అందరిలోకీ చిన్నదైన చంద్రిక ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది.

"మా తరమంతా మా ఒళ్ళు గుల్లయ్యేవరకూ నడిచింది, ఎక్కింది, పని చేసింది. ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే జరగాలా?” అని మామి అడుగుతున్నారు.

After the school in their village, Barabanki shut down, Mami (standing in a saree) kept her nine-year-old daughter, Chandrika Behera (left) at home as the new school is in another village, 3.5 km away.
PHOTO • M. Palani Kumar
Many children in primary school have dropped out
PHOTO • M. Palani Kumar

ఎడమ: వారి గ్రామమైన బారాబంకీలోని పాఠశాలను మూసివేసిన తరువాత, కొత్త పాఠశాల 3.5 కి.మీ దూరంలో ఉన్న మరొక గ్రామంలో ఉన్నందున, మామి (చీర ధరించి నిలబడివున్నవారు) తన తొమ్మిదేళ్ల కుమార్తె చంద్రిక బెహెరా (ఎడమ)ను ఇంట్లోనే ఉంచేశారు. కుడి: ప్రాథమిక పాఠశాలలో చదివే చాలామంది పిల్లలు బడి మానేశారు

బారాబంకీలో ఉన్న 87 ఇళ్ళు ప్రధానంగా ఆదివాసీలకు చెందినవి. కొందరు కొద్దిపాటి భూమిని సాగు చేస్తారు, కానీ చాలామంది రోజువారీ కూలీలు. వీరు స్టీల్ ప్లాంట్ లేదా సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేయడానికి అక్కడకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుకింద వరకు వెళుతుంటారు. కొంతమంది పురుషులు స్పిన్నింగ్ మిల్లులో లేదా బీర్ డబ్బాల ప్యాకేజింగ్ యూనిట్‌లో పని చేయడానికి తమిళనాడుకు వలస వెళ్ళారు.

బారాబంకీలో బడిని మూసివేయడం, బడిలో లభించే మధ్యాహ్న భోజనం ఉంటుందో లేదోననే సందేహాన్ని కూడా రేకెత్తించింది. ఈ మధ్యాహ్న భోజనం నిరుపేదల కుటుంబ భోజన ప్రణాళికలో చాలా ముఖ్యమైన భాగం. “కనీసం ఏడు నెలలుగా నాకు వేడిగా వండిన బడి భోజనానికి బదులుగా వాగ్దానం చేసిన నగదుగానీ, బియ్యం గానీ రాలేదు," అంటారు కిశోర్ బెహెరా. కొన్ని కుటుంబాలకు భోజనానికి బదులుగా వారి ఖాతాల్లో డబ్బు పడింది; ఒక్కోసారి, 3.5 కి.మీ దూరంలో ఉన్న కొత్త పాఠశాల ప్రాంగణంలో పంపిణీ ఉంటుందని వారికి చెప్పారు.

*****

అది ఏప్రిల్ 2022 మొదటి వారం, మధ్యాహ్న సమయం. అదే బ్లాక్‌లోని పొరుగు గ్రామమైన పురుణామంతిర గ్రామం నుండి బయటికి వెళ్లే ఇరుకైన రహదారిపై సందడి నెలకొంది. వెనుకనున్న రోడ్డు ఉన్నట్టుండి మహిళలు, పురుషులు, ఒక అమ్మమ్మ, సైకిల్‌పై ఉన్న ఇద్దరు యువకులతో నిండిపోయింది. ఓపిక లేనందుకు సూచనగా ఎవరూ మాట్లాడటంలేదు; గమ్చాలను (తలగుడ్డగా కట్టుకునే తువ్వాలు), చీర కొంగులను 42 డిగ్రీల సెల్సియస్ వేడితో మండిస్తోన్న మధ్యాహ్న సూర్యుని నుండి రక్షణగా నుదుటిమీదుగా క్రిందికి లాక్కునివున్నారు.

ఆ వేడిమిని పట్టించుకోకుండా, పురుణామంతిర నివాసులు తమ చిన్నారి కొడుకులనూ కూతుళ్ళనూ అక్కడికి 1.5 కి.మీ. దూరంలో ఉన్న బడి నుండి ఇంటికి తీసుకురావడానికి నడవటం మొదలెట్టారు.

దీపక్ మలిక్ పురుణామంతిర నివాసి, సుకింద సిమెంట్ ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. సుకింద లోయ విస్తారమైన క్రోమైట్ నిల్వలకు ప్రసిద్ధి. అతనికిలాగే, షెడ్యూల్డ్ కులాల ప్రాబల్యం ఉన్న ఆ గ్రామంలోని ఇతరులకు కూడా మంచి అవకాశాల కోసం మంచి చదువే పిల్లలకు ప్రవేశపత్రంలాంటిదని బాగా తెలుసు. "మా గ్రామంలోని చాలామంది రాత్రి భోజనం చేయాలంటే పని చేయాల్సిందే," అని ఆయన చెప్పారు. "అందుకే 2013-2014లో జరిగిన పాఠశాల భవన నిర్మాణం మా అందరికీ చాలా పెద్ద పండుగలాంటిది."

2020లో కోవిడ్ విరుచుకుపడినప్పటి నుండి, పురుణామంతిరలో 1-5 తరగతులలో ఉండాల్సిన 14 మంది పిల్లలకు ప్రాథమిక పాఠశాల లేదని, 25 ఇళ్ళున్న ఆ గ్రామ నివాసి సుజాతా రాణి సమల్ చెప్పారు. అందువల్ల ఈ చిన్నారి ప్రాథమిక పాఠశాల పిల్లలు 1.5 కి.మీ దూరం ప్రయాణించి రద్దీగా ఉండే రైలు మార్గాన్ని దాటి, పొరుగు గ్రామమైన చకువాకు వెళ్లవలసివస్తోంది.

The school building in Puranamantira was shut down in 2020.
PHOTO • M. Palani Kumar
The construction of a school building in 2013-2014 was such a huge occasion for all of us,' says Deepak Malik (centre)
PHOTO • M. Palani Kumar

ఎడమ: 2020లో మూతపడిన పురుణామంతిరలోని పాఠశాల భవనం. కుడి: '2013-2014లో పాఠశాల భవనాన్ని కట్టడమనేది మాకందరికీ ఒక పండుగలాంటిది,' అంటోన్న దీపక్ మలిక్ (మధ్యలో)

Parents and older siblings walking to pick up children from their new school in Chakua – a distance of 1.5 km from their homes in Puranamantira.
PHOTO • M. Palani Kumar
They cross a busy railway line while returning home with the children (right)
PHOTO • M. Palani Kumar

పురుణామంతిరలోని వారి ఇళ్ళ నుండి 1.5 కి.మీ దూరంలో ఉన్న చకువాలోని కొత్త పాఠశాల నుండి పిల్లలను తీసుకురావడానికి నడిచిపోతున్న తల్లిదండ్రులు, పెద్దవారైన తోబుట్టువులు. పిల్లలతో ఇంటికి తిరిగివచ్చేటపుడు వారు రద్దీగా ఉండే రైలు మార్గాన్ని దాటాలి (కుడి)

రైలు మార్గాన్ని తప్పించడానికి, మోటారు బండ్లు నడిచే ఓవర్‌బ్రిడ్జిపై నున్న రహదారిని ఉపయోగించవచ్చు, కానీ అప్పుడు దూరం 5 కి.మీ.కు పెరుగుతుంది. పాత పాఠశాలను, గ్రామ శివారులో ఉన్న రెండు దేవాలయాలను దాటి, బ్రాహ్మణి రైల్వే స్టేషన్‌కు దారితీసే రైల్వే కట్ట వద్ద ముగిసే ఒక మెలికలు తిరిగిన దగ్గర దారి ఉంది.

ఒక గూడ్స్ రైలు అరుస్తూ వేగంగా వెళ్తోంది.

భారతీయ రైల్వేకు చెందిన హౌరా-చెన్నై ప్రధాన రైలుమార్గంలో గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు ప్రతి పది నిమిషాలకు ఒకసారి బ్రాహ్మణిని దాటుతాయి. కాబట్టి, పురుణామంతిరలోని ఏ కుటుంబమూ తమ బిడ్డలను పెద్దల తోడు లేకుండా పాఠశాలకు వెళ్లేందుకు అనుమతించదు.

తర్వాతి రైలు వచ్చేలోపు అందరూ రైలు పట్టాలను దాటుతున్న సమయానికి ఆ పట్టాలు ఇంకా కంపిస్తూనే ఉన్నాయి. కొంతమంది పిల్లలు జారుతూ, ఎగురుతూ, దుంకుతూ గట్టు దాటుతున్నారు; మరీ చిన్నపిల్లలను ఎత్తుకొని త్వరత్వరగా కట్ట పైకి ఎగబాకుతున్నారు. భయపడేవారిని కూడా తమవెంట తీసుకువెళ్తున్నారు. మురికి పాదాలు, కాయలుకాచిన పాదాలు, ఎండలో కాలిపోయిన పాదాలు, చెప్పులు లేని పాదాలు, ఎంతమాత్రం ఇంక నడవడానికి లేనంతగా అలసిపోయిన పాదాలు- ఈ పాదాలన్నిటికీ ఇది 25 నిమిషాల ప్రయాణం.

*****

ఒడిశాలో మూతపడ్డ దాదాపు 9,000 పాఠశాలలలో బరాబంకీ, పురుణామంతిరలోని ప్రాథమిక పాఠశాలలు కూడా ఉన్నాయి.  దీనికి అధికారిక పదం 'ఏకీకృతం' కావడం లేదా పొరుగు గ్రామంలోని పాఠశాలతో 'విలీనం' కావడం. విద్య, ఆరోగ్య రంగాలలో 'సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ (SATH)' అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇది జరిగింది.

ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో పాఠశాల విద్యను 'సంస్కరించడానికి' ఈ మూడు రాష్ట్రాలలో నవంబర్ 2017లో SATH-Eను ప్రారంభించారు. 2018 ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటన ప్రకారం, "మొత్తం ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను ప్రతి బిడ్డకు ప్రతిస్పందించే, ఆకాంక్షను కలిగించే, పరివర్తనాత్మకంగా చేయడమే" దీని లక్ష్యం.

గ్రామ పాఠశాలను మూసివేసిన బారాబంకీలో ఈ ‘పరివర్తన’ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. గ్రామంలో ఒక డిప్లొమా హోల్డర్ ఉన్నారు, కొంతమంది 12వ తరగతి పూర్తి చేసినవారు, అనేకమంది మెట్రిక్యులేషన్ పరీక్షలో తప్పినవారు ఉన్నారు. "ఇప్పుడిక మాకు అది కూడా ఉండకపోవచ్చు," అని ఇప్పుడు ఉనికిలో లేకుండాపోయిన పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు కిశోర్ బెహెరా చెప్పారు.

Children in class at the Chakua Upper Primary school.
PHOTO • M. Palani Kumar
Some of the older children in Barabanki, like Jhilli Dehuri (in blue), cycle 3.5 km to their new school in Jamupasi
PHOTO • M. Palani Kumar

ఎడమ: చకువా ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదిలో పిల్లలు. కుడి: బారాబంకీకి చెందిన ఝిల్లీ దేహురి (నీలిరంగు దుస్తుల్లో) వంటి పెద్ద పిల్లలు జముపసిలోని కొత్త బడికి 3-5 కి.మీ. దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారు

పక్క గ్రామంలోని ఎంపిక చేసిన పాఠశాలతో ప్రాథమిక పాఠశాలలను ‘విలీనం’ చేయడనేది ప్రాయోజిత కార్యక్రమం తప్ప మరేమీ కాదు. దీని అసలు ఉద్దేశ్యం, చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయడమే. SATH-Eపై నవంబర్ 2021లో వచ్చిన నివేదిక లో, అప్పటి నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అమితాబ్ కాంత్, విలీనాలను (లేదా పాఠశాలలను మూసివేయడాన్ని) "ధైర్యమైన, విప్లవాత్మక సంస్కరణ"గా అభివర్ణించారు.

పురుణామంతిర నుండి చకువాలోని తన కొత్త పాఠశాలకు ప్రతిరోజూ చాలా దూరం నడవడం వల్ల తన కాళ్ళు ఎంతలా నొప్పెడుతున్నాయో సిద్ధార్థ్ మలిక్ అనే విద్యార్థి అభివర్ణించాడు. ఈ కారణంగా చాలాసార్లు సిద్ధార్థ్ పాఠశాలకు వెళ్లడం మానేశాడని అతని తండ్రి దీపక్ చెబుతున్నారు.

భారతదేశంలో ఉన్న దాదాపు 11 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 4 లక్షల పాఠశాలల్లో 50 కంటే తక్కువ మంది విద్యార్థులున్నారు; 1.1 లక్షల పాఠశాలల్లో 20 కంటే తక్కువ మంది విద్యార్థులున్నారు. SATH-E నివేదిక వీటిని "ఉప-స్థాయి పాఠశాలలు"గా పేర్కొని, వాటి లోపాలను ఇలా జాబితా చేసింది: సబ్జెక్ట్‌కు సంబంధించిన నిర్దిష్ట నైపుణ్యం లేని ఉపాధ్యాయులు, అంకితభావం కలిగిన ప్రధానోపాధ్యాయులు లేకపోవడం, ఆట స్థలాలు, సరిహద్దు గోడలు, గ్రంథాలయాలు లేకపోవడం.

కానీ పురుణామంతిరలోని తల్లిదండ్రులు తమ పాఠశాలలో అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు

చకువాలోని పాఠశాలలో గ్రంథాలయం ఉందో లేదో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు; వారి పాత బడిలో లేని సరిహద్దు గోడ మాత్రం ఈ బడికి ఉంది.

ఒడిశాలో ప్రస్తుతం SATH-E ప్రాజెక్ట్ మూడవ దశ నడుస్తోంది. ఈ దశలో 'విలీనం' కోసం మొత్తం 15,000 పాఠశాలలను గుర్తించారు.

*****

It is 1 p.m. and Jhilli Dehuri, a Class 7 student and her schoolmate, are pushing their cycles home to Barabanki. She is often sick from the long and tiring journey, and so is not able to attend school regularly
PHOTO • M. Palani Kumar
It is 1 p.m. and Jhilli Dehuri, a Class 7 student and her schoolmate, are pushing their cycles home to Barabanki. She is often sick from the long and tiring journey, and so is not able to attend school regularly
PHOTO • M. Palani Kumar

మధ్యాహ్నం ఒంటి గంట సమయం. బారాబంకీలోని ఇంటికి తమ సైకిళ్లను నడిపిస్తూ తీసుకువెళుతున్న 7వ తరగతి విద్యార్థిని ఝిల్లీ దేహురి, ఆమె తోటి విద్యార్థి. సుదీర్ఘమైన, అలసటతో కూడిన ఆ ప్రయాణం వలన ఝిల్లీ తరచుగా అనారోగ్యంపాలవుతుంటుంది, అందువల్ల సక్రమంగా బడికి వెళ్ళలేకపోతోంది

ఝిల్లీ దేహురి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి తన సైకిల్‌ను పైకి నెట్టడానికి కష్టపడుతోంది. బారాబంకీలోని ఆమె గ్రామంలో, ఒక పెద్ద మామిడి చెట్టు నీడలో నారింజ రంగు టార్పాలిన్ పట్టా పరచివుంది. పాఠశాల సమస్యలపై చర్చించేందుకు తల్లిదండ్రులు ఇక్కడకు చేరుకున్నారు. ఝిల్లీ అలసిపోయి వచ్చింది.

బారాబంకీకి చెందిన ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులు, ఇంకా పెద్ద తరగతుల విద్యార్థులు (11 నుండి 16 సంవత్సరాల వయసువారు) అక్కడికి 3.5 కి.మీ దూరంలోని జముపసిలోని పాఠశాలకు హాజరవుతారు. మధ్యాహ్నపు ఎండలో నడవడం, సైకిల్ తొక్కడం రెండూ పిల్లలను అలవగొట్టేవేనని కిశోర్ బెహెరా చెప్పారు. కోవిడ్ విలయం తర్వాత 2022లో 5వ తరగతి చదవడం మొదలుపెట్టిన అతని సోదరుడి కుమార్తె అంతలేసి దూరపు నడకకు ఇంకా అలవాటు పడలేదు. క్రితం వారం ఆమె ఇంటికి నడిచి వెళుతూ స్పృహతప్పి పడిపోయింది. జముపసికి చెందిన కొందరు అపరిచితులు ఆమెను మోటర్‌బైక్‌పై ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది.

"మా పిల్లలకు మొబైల్ ఫోన్లు లేవు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తెలియచేయడానికి పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకునే అలవాటు పాఠశాలల్లో లేదు." అని కిశోర్ చెప్పారు.

జాజ్‌పూర్ జిల్లాలోని సుకింద, దానగడి బ్లాక్‌లలోని మారుమూల గ్రామాలకు చెందిన అనేకమంది తల్లిదండ్రులు, పిల్లలు బడికి వెళ్ళడానికి చాలా దూరం నడవడంలో ఎదురయ్యే ఈ ప్రమాదాల గురించి మాట్లాడారు: దట్టమైన అడవుల గుండా లేదా రద్దీగా ఉండే హైవేపై నడవటం, లేదా రైలు మార్గాన్ని దాటవలసిరావటం, నిటారుగా ఉన్న కొండ పై నుంచి కిందికి దిగటం, రుతుపవనాల ప్రవాహాలు ముంచెత్తిన కాలిబాటల మీదుగా నడవటం, గ్రామంలోని దారులలో తిరిగే క్రూరమైన అడవి కుక్కలు, పొలాల గుండా వెళ్ళే ఏనుగుల గుంపుల నుంచి వచ్చే ప్రమాదాలు.

మూసివేయాలని నిర్ణయించిన బడుల నుండి కాబోయే కొత్త పాఠశాలలకు మధ్య ఉన్న దూరాన్ని గుర్తించడానికి భౌగోళిక సమాచార వ్యవస్థ (జిఐఎస్) డేటా ఉపయోగించినట్టు SATH-E నివేదిక చెబుతోంది. అయితే, జిఐఎస్ ఆధారంగా ఈ దూరాల గురించి రూపొందించిన చక్కని గణిత గణనలు ఇక్కడి క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించవు.

Geeta Malik (in the foreground) and other mothers speak about the dangers their children must face while travelling to reach school in Chakua.
PHOTO • M. Palani Kumar
From their village in Puranamantira, this alternate motorable road (right) increases the distance to Chakua to 4.5 km
PHOTO • M. Palani Kumar

ఎడమ: చకువాలోని బడికి వెళ్ళడానికి చేసే ప్రయాణంలో తమ పిల్లలు ఎదుర్కొనే ప్రమాదాల గురించి మాట్లాడుతున్న గీతా మలిక్ (ముందు), ఇతర తల్లులు. పురుణామంతిరలోని వారి గ్రామం నుండి మరో మార్గమైన ఈ మోటారు దారిలో (కుడి) చకువాకు వెళ్ళాలంటే 4.5 కి.మీ. దూరం పెరుగుతుంది

తల్లులకు రైలు పట్టాలు దాటడం, దూరాలు నడవడం వంటివాటిని మించిన ఆందోళనలు ఉంటాయని పురుణామంతిర మాజీ పంచాయతీ వార్డు సభ్యురాలు గీతామలిక్ చెప్పారు. “ఇటీవలి సంవత్సరాలలో వాతావరణం అనూహ్యంగా ఉంటోంది. వర్షాకాలంలో, కొన్నిసార్లు ఉదయం పూట ఎండగా ఉంటుంది, బడి ముగిసే సమయానికి తుఫాను ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పిల్లలను వేరే ఊరికి ఎలా పంపాలి?”

గీతకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. 11 ఏళ్ళ పెద్దబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు, రెండోవాడు ఇప్పుడే బడికి వెళ్ళటం మొదలెట్టిన ఆరేళ్ల బాలుడు. ఆమె కుటుంబం భాగచాశీలు (కౌలుదారులు). తన పిల్లలు మెరుగ్గా ఉండాలనీ, బాగా సంపాదించి తమకంటూ స్వంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలనీ ఆమె కోరుకుంటున్నారు.

మామిడి చెట్టు కింద గుమిగూడిన తల్లిదండ్రులంతా తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మూతపడిన తర్వాత, తమ పిల్లలు పూర్తిగా బడికి వెళ్లడం మానేయడమో లేదంటే సక్రమంగా బడికి పోకపోవటమో జరిగిందని ఒప్పుకున్నారు. కొంతమంది పిల్లలు నెలలో 15 రోజుల వరకు బడికి వెళ్ళలేదు.

పురుణామంతిరలోని పాఠశాల మూతపడినప్పుడు, 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల కోసం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా పాఠశాల ఆవరణ నుండి దాదాపు 3 కి.మీ దూరానికి మార్చారు.

*****

చాలామందికి గ్రామ పాఠశాల అంటే అభివృద్ధికి గుర్తు; అవకాశాలకూ, నెరవేరిన ఆకాంక్షలకూ ఒక గౌరవ రూపం.

మాధవ్ మలిక్, 6వ తరగతి వరకు చదువుకున్న ఒక దినసరి కూలీ. పురుణామంతిర గ్రామంలోకి 2014లో ఒక పాఠశాల రావడం వలన అతని కుమారులు మనోజ్, దేబాశిష్‌లకు మంచి రోజులు వచ్చినట్లు అనిపించిందని అతను చెప్పారు. “మేం మా పాఠశాలను చాలా జాగ్రత్తగా చూసుకున్నాం, ఎందుకంటే అది మా ఆశకు చిహ్నం." అన్నారాయన.

ప్రస్తుతం మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదులు పరిశుభ్రంగా ఉన్నాయి. తెలుపు, నీలం రంగులు వేసివున్న గోడలకు ఒడియా వర్ణమాల, సంఖ్యలు, బొమ్మలను ప్రదర్శించే చార్టులు తగిలించి ఉన్నాయి. ఒక గోడపైన రాత కోసం నల్ల రంగు వేసివుంది. ఇప్పుడింక తరగతులను నిలిపివేయడంతో, గ్రామస్తులు ఆ బడిని సామాజిక ప్రార్థనలకు అందుబాటులో ఉన్న అత్యంత పవిత్రమైన స్థలంగా నిర్ణయించుకున్నారు. ఒక తరగతి గదిని ఇప్పుడు కీర్తనలు (భక్తి పాటలు) పాడటం కోసం అందరూ చేరే గదిగా మార్చారు. గోడపై అమర్చి ఉన్న ఒక దేవత చిత్రపటం పక్కనే ఇత్తడి సామానును అమర్చారు.

Students of Chakua Upper Primary School.
PHOTO • M. Palani Kumar
Madhav Malik returning home from school with his sons, Debashish and Manoj
PHOTO • M. Palani Kumar

ఎడమ: చకువా ప్రాథమికోన్నత పాఠశాల పిల్లలు. కుడి: తన కుమారులైన దేబాశిష్, మనోజ్‌లతో కలిసి బడి నుంచి తిరిగివస్తోన్న మాధవ్ మలిక్

పాఠశాలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, పురుణామంతిర నివాసులు తమ పిల్లలకు సరైన విద్య అందేలా చూసేందుకు కట్టుబడి ఉన్నారు. వారు గ్రామంలోని ప్రతి విద్యార్థికి ట్యూషన్ తరగతులు చెప్పిస్తున్నారు. అక్కడికి 2 కి.మీ దూరంలో ఉన్న మరొక గ్రామం నుండి సైకిల్‌పై వచ్చే ఉపాధ్యాయులు దీనిని నిర్వహిస్తున్నారు. వర్షపు రోజులలో ప్రధాన రహదారి తరచుగా నీటితో నిండిపోయినప్పుడు ట్యూషన్ తరగతులు తప్పిపోకుండా ఉండేందుకు తానుగానీ, మరొకరెవరైనాగానీ మోటర్‌బైక్‌పై ట్యూటర్‌ని తీసుకువస్తుంటామని దీపక్ చెప్పారు. ట్యూషన్ తరగతులు వారి పాత పాఠశాలలో జరుగుతాయి. ప్రతి కుటుంబం ట్యూటర్‌కు నెలకు రూ. 250 నుంచి రూ. 400 వరకూ చెల్లిస్తుంది.

"దాదాపు అన్నీ నేర్చుకునేది ఇక్కడే, ఈ ట్యూషన్ తరగతులలోనే జరుగుతుంది," అని దీపక్ చెప్పారు.

బయట, మండుతున్న ఎండకు చిన్న నీడనిస్తోన్న ఒక పలాశ (మోదుగ) చెట్టు నీడలో కూర్చొనివున్న ఆ గ్రామవాసులు పాఠశాలను ఎందుకు మూసివేశారోనని చర్చించుకుంటున్నారు. వర్షాకాలంలో బ్రాహ్మణికి వరదలు వచ్చినప్పుడు పురుణామంతిర గ్రామానికి రావడం సవాలుతో కూడుకున్నది. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేక, రోజంతా విద్యుత్ సరఫరా లేకుండా గడిచినప్పుడు అక్కడి ప్రజలు నిజమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

"పాఠశాలను మూసివేయడం అంటే మనం వెనక్కి జారిపోతున్నామనీ, పరిస్థితులు మరింత దిగజారిపోతాయనడానికీ సంకేతం అనిపిస్తుంది" అని మాధవ్ చెప్పారు.

SATH-E ప్రాజెక్ట్‌లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామి, గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ అయిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) దీనిని మెరుగైన అభ్యాస ఫలితాలను చూపే " మార్క్యూ ఎడ్యుకేషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ " అని పేర్కొంది.

కానీ జాజ్‌పూర్‌లోని ఈ రెండు బ్లాకుల్లోని గ్రామాలలోనే కాక ఒడిశాలోని ఇతర ప్రాంతాల్లో కూడా, పాఠశాలలను మూసివేయడం వల్ల విద్యను పొందడం ఒక సవాలుగా మారిందని తల్లిదండ్రులు అంటున్నారు.

Surjaprakash Naik and Om Dehuri (both in white shirts) are from Gunduchipasi where the school was shut in 2020. They now walk to the neighbouring village of Kharadi to attend primary school.
PHOTO • M. Palani Kumar
Students of Gunduchipasi outside their old school building
PHOTO • M. Palani Kumar

ఎడమ: ప్రాథమిక పాఠశాలకు హాజరయ్యేందుకు పక్క గ్రామమైన ఖరడీకి నడిచి వెళుతున్న గుండుచీపసీ గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్ నాయక్, ఓమ్ దేహురి (తెల్ల చొక్కాలు ధరించినవారు). అక్కడి పాఠశాలను 2020లో మూసివేశారు. కుడి: గుండుచీపసీలోని తమ పాత పాఠశాల భవనం వెలుపల నిల్చొన్నివున్న విద్యార్థులు

గుండుచీపసీ గ్రామంలో 1954 నాటికే ఒక పాఠశాల ఉంది. సుకింద బ్లాక్‌లోని ఖరడీ కొండ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో మొత్తం శబర్ లేదా సవర్ అని కూడా పిలిచే సబర్ సముదాయానికి చెందిన ఆదివాసులే నివాసముంటారు. రాష్ట్రంలో ఈ సబర్ సముదాయాన్ని షెడ్యూల్డ్ తెగగా జాబితా చేశారు.

స్థానికంగా గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూసివేయక ముందు వీరి పిల్లలు 32 మంది ఈ బడిలోనే చదువుతున్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగానే, పిల్లలు పక్క గ్రామమైన ఖరడీకి నడిచి వెళ్లాల్సి వచ్చింది. అడవి గుండా వెళితే అది కేవలం కిలోమీటరు దూరం మాత్రమే ఉంటుంది. ఇది కాకుండా, రద్దీగా ఉండే ప్రధాన రహదారి కూడా ఉంది కానీ ఇది చిన్నపిల్లలకు చాలా ప్రమాదకరమైనది.

ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల భద్రతకూ, మధ్యాహ్న భోజనానికీ మధ్య దేనిని ఎంచుకోవాలో ఆలోచించాల్సి వస్తుందని భావిస్తున్నారు.

తామిద్దరం కలిసి బడికి నడుచుకుంటూ వెళ్తున్నామని 2వ తరగతిలో ఉన్న ఓమ్ దేహురి, 1వ తరగతిలో ఉన్న సూర్యప్రకాశ్ నాయక్ చెప్పారు. వాళ్ళిద్దరూ ప్లాస్టిక్ బాటిళ్ళలో నీటిని తీసుకువెళతారు కానీ చిరుతిండి కానీ, దాన్ని కొనుక్కోవాలంటే డబ్బు కానీ వారివద్ద ఉండదు. 3వ తరగతిలో ఉన్న రాణి బారిక్, తనకు బడికి రావడానికి ఒక గంట సమయం పడుతుందని చెప్పింది. అయితే అది చాలావరకు తాను స్నేహితుల కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వృధా చేయడంవల్లనే అని ఆమె చెప్పింది.

ఆరు దశాబ్దాల నుంచి నడుస్తోన్న తమ పాఠశాలను మూసేయడం, పిల్లలను చదువు కోసం అడవి గుండా పక్క గ్రామానికి పంపడం ఎంతవరకు సమంజసమో అర్థంకావడం లేదని రాణి అమ్మమ్మ బకోటి బారిక్ చెప్పారు. "కుక్కలు, పాములు ఉంటాయి, కొన్నిసార్లు ఎలుగుబంట్లు కూడా. పాఠశాలకు వెళ్లడానికి ఇది సురక్షితమైన మార్గం అని మీ నగరంలోని తల్లిదండ్రులు నమ్ముతారా?" అని ఆమె అడుగుతారు.

7, 8 తరగతులు చదివే పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలను బడికి తీసుకువెళ్ళి అక్కడి నుండి తిరిగి తీసుకువచ్చే బాధ్యతను మోస్తున్నారు. 7వ తరగతి చదువుతోన్న శుభశ్రీ బెహెరాకు చిన్నవాళ్ళయిన తన ఇద్దరు బంధువులు భూమిక, ఓమ్ దేహురిలను నియంత్రించడం చాలా కష్టమవుతోంది. “వాళ్ళెప్పుడూ మన మాట వినరు. వాళ్ళు పరుగెత్తి పారిపోతే, ఒక్కొక్కరి వెంటపడటం అంత సులభమేమీ కాదు,” అని ఆమె చెప్పింది.

మామినా ప్రధాన్ పిల్లలు - 7వ తరగతి చదువుతున్న రాజేశ్, 5వ తరగతిలో ఉన్న లిజా - కొత్త పాఠశాలకు నడిచే వెళ్తారు. "పిల్లలు సుమారు గంటసేపు నడుస్తారు, కానీ మాకింకో అవకాశమేముంది?" ఇటుకలు, గడ్డితో కట్టి, పూరికప్పు వేసివున్న తన ఇంటిలో కూర్చునివున్న ఈ రోజువారీ కూలీ అంటారు. ఆమె, ఆమె భర్త మహంతో వ్యవసాయ పనుల కాలంలో ఇతరుల భూమిలో పనిచేస్తారు; ఆ పనులు లేనప్పుడు వ్యవసాయేతర పనుల కోసం చూస్తారు.

Mamina and Mahanto Pradhan in their home in Gunduchipasi. Their son Rajesh is in Class 7 and attends the school in Kharadi.
PHOTO • M. Palani Kumar
‘Our children [from Gunduchipasi] are made to sit at the back of the classroom [in the new school],’ says Golakchandra Pradhan, a retired teacher
PHOTO • M. Palani Kumar

ఎడమ: గుండుచీపసీలోని తమ ఇంటిలో మామినా, మహంతో ప్రధాన్. వారి కుమారుడు రాజేష్ ఖరడీలోని పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కుడి: 'మా పిల్లలను (గుండుచీపసీ నుండి వెళ్ళినవారు) తరగతి గది (కొత్త పాఠశాలలో) వెనుకవైపు కూర్చోబెట్టారు' అని విశ్రాంత ఉపాధ్యాయుడు గోలక్‌చంద్ర ప్రధాన్ చెప్పారు

Eleven-year-old Sachin (right) fell into a lake once and almost drowned on the way to school
PHOTO • M. Palani Kumar

11 ఏళ్ళ సచిన్(కుడి) బడికి వెళ్తూ ఒకసారి ఒక సరస్సులో పడి, దాదాపు మునిగిపోయాడు

తమ గుండుచీపసీ పాఠశాలలో విద్య నాణ్యత మెరుగ్గా ఉండేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. “ఇక్కడ మా పిల్లల గురించి ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకునేవారు. (కొత్త పాఠశాలలో) మా పిల్లలను తరగతి గదుల వెనుక కూర్చోబెట్టారు,” అని గ్రామ నాయకుడు 68 ఏళ్ళ గోలక్‌చంద్ర ప్రధాన్ చెప్పారు

సుకింద బ్లాక్‌లోనే సమీపంలో ఉండే సాంతరాపుర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను 2019లో మూసివేశారు. ఆ బడి పిల్లలు ఇప్పుడు జముపసిలోని పాఠశాలకు 1.5 కి.మీ దూరం నడిచిపోతున్నారు. తనను వెంబడిస్తున్న అడవి కుక్కనుంచి తప్పించుకునే క్రమంలో పదకొండేళ్ళ సచిన్ మలిక్ సరస్సులో పడిపోయాడు. "ఇది 2021 చివరలో జరిగింది," అని సచిన్ అన్నయ్య సౌరవ్(21) అన్నాడు. సౌరవ్ అక్కడికి 10 కి.మీ దూరంలో ఉన్న దుబురీలోని స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. అతనింకా ఇలా చెప్పాడు, "ఇద్దరు పెద్ద అబ్బాయిలు అతనిని నీటిలో మునిగిపోకుండా కాపాడారు. కాని ఆ రోజు అందరూ చాలా భయపడ్డారు, మరుసటి రోజు గ్రామంలోని చాలామంది పిల్లలు బడికి వెళ్ళలేదు."

సాంతరాపుర్-జముపసి మార్గంలో అడవి కుక్కలు పెద్దలపై కూడా దాడి చేశాయని జముపసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే వ్యక్తికి సహాయకురాలిగా పనిచేస్తున్న లావణ్యా మలిక్ అనే మహిళ చెప్పారు. “అది 15-20 కుక్కలున్న మంద. అవి ఒకసారి నన్ను వెంబడించినప్పుడు నేను బోర్లా పడిపోయాను. అవి నా మీదుగా దూకుతూ వెళ్ళాయి. ఒకటి నా కాలు కొరికింది” అని ఆమె చెప్పారు

సాంతరాపుర్‌లో ఉన్న 93 ఇళ్ళలో నివాసముండేవారు ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందినవారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మూతపడే సమయానికి 28 మంది పిల్లలు అందులో చదువుతున్నారు. ప్రస్తుతం కొత్త బడికి 8-10 మంది పిల్లలు మాత్రమే హాజరవుతున్నారు

జముపసిలో 6వ తరగతి చదువుతున్న సాంతరాపుర్‌కు చెందిన గంగా మలిక్ అటవీ మార్గం అంచున ఉన్న నీటిగుంటలో పడి పాఠశాలకు వెళ్లడం మానేసింది. దినసరి కూలీ అయిన ఆమె తండ్రి సుశాంత్ మలిక్ ఈ సంఘటనను గుర్తుచేసుకున్నారు: "ఆమె సరస్సు వద్ద ముఖం కడుక్కుంటుండగా అందులోకి జారిపడింది. రక్షించే సమయానికి ఆమె దాదాపు మునిగిపోయింది. ఆ తర్వాత ఆమె అనేకసార్లు బడి మానెయ్యడం మొదలుపెట్టింది."

నిజానికి, గంగ తన ఆఖరి పరీక్షల కోసం పాఠశాలకు హాజరయ్యే ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోయింది. కానీ "ఎలాగయితేనేం, నేను పై తరగతికి వెళ్ళాను," అని ఆమె చెప్పింది

ఈ కథనాన్ని అందించటంలో సహాయం చేసినందుకు ఆస్పైర్-ఇండియా సిబ్బందికి ఈ రిపోర్టర్ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Kavitha Iyer

ಕವಿತಾ ಅಯ್ಯರ್ 20 ವರ್ಷಗಳಿಂದ ಪತ್ರಕರ್ತರಾಗಿದ್ದಾರೆ. ಇವರು ‘ಲ್ಯಾಂಡ್‌ಸ್ಕೇಪ್ಸ್ ಆಫ್ ಲಾಸ್: ದಿ ಸ್ಟೋರಿ ಆಫ್ ಆನ್ ಇಂಡಿಯನ್ ಡ್ರಾಟ್’ (ಹಾರ್ಪರ್ ಕಾಲಿನ್ಸ್, 2021) ನ ಲೇಖಕಿ.

Other stories by Kavitha Iyer
Photographer : M. Palani Kumar

ಪಳನಿ ಕುಮಾರ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಟಾಫ್ ಫೋಟೋಗ್ರಾಫರ್. ದುಡಿಯುವ ವರ್ಗದ ಮಹಿಳೆಯರು ಮತ್ತು ಅಂಚಿನಲ್ಲಿರುವ ಜನರ ಬದುಕನ್ನು ದಾಖಲಿಸುವುದರಲ್ಲಿ ಅವರಿಗೆ ಆಸಕ್ತಿ. ಪಳನಿ 2021ರಲ್ಲಿ ಆಂಪ್ಲಿಫೈ ಅನುದಾನವನ್ನು ಮತ್ತು 2020ರಲ್ಲಿ ಸಮ್ಯಕ್ ದೃಷ್ಟಿ ಮತ್ತು ಫೋಟೋ ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾ ಅನುದಾನವನ್ನು ಪಡೆದಿದ್ದಾರೆ. ಅವರು 2022ರಲ್ಲಿ ಮೊದಲ ದಯನಿತಾ ಸಿಂಗ್-ಪರಿ ಡಾಕ್ಯುಮೆಂಟರಿ ಫೋಟೋಗ್ರಫಿ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಪಡೆದರು. ಪಳನಿ ತಮಿಳುನಾಡಿನ ಮ್ಯಾನ್ಯುವಲ್‌ ಸ್ಕ್ಯಾವೆಂಜಿಗ್‌ ಪದ್ಧತಿ ಕುರಿತು ಜಗತ್ತಿಗೆ ತಿಳಿಸಿ ಹೇಳಿದ "ಕಕ್ಕೂಸ್‌" ಎನ್ನುವ ತಮಿಳು ಸಾಕ್ಷ್ಯಚಿತ್ರಕ್ಕೆ ಛಾಯಾಗ್ರಾಹಕರಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ.

Other stories by M. Palani Kumar
Editor : Priti David

ಪ್ರೀತಿ ಡೇವಿಡ್ ಅವರು ಪರಿಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕರು. ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರಾದ ಅವರು ಪರಿ ಎಜುಕೇಷನ್ ವಿಭಾಗದ ಮುಖ್ಯಸ್ಥರೂ ಹೌದು. ಅಲ್ಲದೆ ಅವರು ಗ್ರಾಮೀಣ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತರಗತಿ ಮತ್ತು ಪಠ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಳವಡಿಸಲು ಶಾಲೆಗಳು ಮತ್ತು ಕಾಲೇಜುಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸುವ ಸಲುವಾಗಿ ಯುವಜನರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli