తన కొడుకు మరణానికి కారణమేమిటో తనకు తెలుసునని శోభా సాహ్ని అనుకునేవారు. కానీ అది జరిగిన ఏడు నెలల తర్వాత, ఆ కారణం గురించి ఆమెకు అంత ఖచ్చితంగా తెలియటంలేదు.

ఫిబ్రవరిలో ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం వేళ, బ్రహ్మసరి గ్రామంలోని తన ఒక గది ఇంటి గుమ్మం వద్ద కూర్చొని ఉన్న శోభ (30), ఆరేళ్ల ఆయుష్ అనారోగ్యంతో ఎలా బాధపడ్డాడో గుర్తుచేసుకున్నారు. "వాడికి జ్వరం వచ్చింది, ఆపైన కడుపులో నొప్పిగా ఉందన్నాడు," అని ఆమె చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌, గోరఖ్‌పూర్ జిల్లాలోని వారి గ్రామాన్ని వర్షాలు ముంచెత్తిన తర్వాత, 2021 జూలై చివరలో ఇది జరిగింది. ఇలా వరదలు ముంచెత్తడం అసాధారణమేమీ కాదు. "ఇది ప్రతి యేటా జరుగుతూనే ఉంటుంది. నీరు బయటికి పోయే మార్గం లేదు" అని ఆమె చెప్పారు.

వర్షం కురిసిన ప్రతిసారీ బ్రహ్మసరి నీటిలో మునిగిపోతుంది. ఆవు పేడ, మానవ మలమూత్రాలు - బహిరంగ మలవిసర్జన కారణంగా - గ్రామమంతటా చెల్లాచెదురుగా పడవేసే చెత్త ఆ నీటిలో కలిసిపోతుంది. “నీటిలో చచ్చిన పురుగులు వుంటాయి, దోమలుంటాయి. మేం వంట చేసుకునే ప్రదేశాలలోకి మురికి నీరు చేరుతోంది," అని శోభ తెలిపారు. “మనం ఎంత ఆపాలని ప్రయత్నించినా మా పిల్లలు ఆ నీళ్లలో ఆడుకుంటారు. ఇక్కడి జనం ఎక్కువగా వర్షాకాలంలోనే అనారోగ్యాల పాలవుతుంటారు."

గత ఏడాది ఇది ఆమె కొడుకు వంతయింది. "మేము మొదట పిల్లవాడికి బరహల్‌గంజ్, సిక్రిగంజ్‌లలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించే ప్రయత్నం చేశాం, కానీ లాభాంలేకపోయింది" అని శోభ చెప్పారు.

జ్వరం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత, శోభ ఆయుష్‌ను అక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేల్‌ఘాట్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్ - సిఎచ్‌సి)కి తీసుకువెళ్ళారు. అక్కడ ఆయుష్‌ని గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ వైద్య కళాశాల (బిఆర్‌డి మెడికల్ కాలేజ్)కు తీసుకువెళ్ళమని సూచించారు. ఇది బ్రహ్మసరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

PHOTO • Parth M.N.

గోరఖ్ పూర్ జిల్లా బ్రహ్మసరి గ్రామంలో నీటి కోసం తన ఇంటి బయట ఉన్న చేతి పంపును ఉపయోగిస్తోన్న శోభా సాహ్ని

బిఆర్‌డి మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఈ ప్రాంతంలో ఉన్న సంరక్షణా సౌకర్యాలలో ఇది కేవలం మూడవది. ఇది తూర్పు ఉత్తరప్రదేశ్, పొరుగు రాష్ట్రమైన బిహార్, ఇంకా నేపాల్ నుండి కూడా వచ్చే రోగులకు సేవలు అందిస్తోంది. తాము 5 కోట్ల జనాభాకు సేవలందిస్తున్నట్లుగా ఈ ఆసుపత్రి పేర్కొంటోంది. ఈ ఆసుపత్రి తరచుగా రోగులతో కిటకిటలాడిపోతుంటుంది; ఆరోగ్య కార్యకర్తలు అధిక పని వత్తిడితో ఉంటారు.

గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆయుష్‌కు మూర్ఛలు మొదలయ్యాయి. "పిల్లవాడికి మెదడువాపు వ్యాధి వచ్చిందని వైద్యులు మాకు చెప్పారు" అని శోభ గుర్తుచేసుకున్నారు. దాదాపు ఐదు రోజుల తర్వాత, ఆగస్టు 4, 2021న ఆయుష్ చనిపోయాడు. "నా పిల్లాడికి ఇలా జరగకూడదు. వాడు చాలా మంచి పిల్లాడు,” అంటూ శోభ కన్నీళ్లు పెట్టుకున్నారు.

జపనీస్ ఎన్‌కెఫలైటిస్ (జెఇ) 1978లో మొదటిసారిగా వ్యాపించినప్పటి నుండి గోరఖ్‌పూర్ జిల్లాను మెదడువాపు వ్యాధి పట్టి పీడిస్తూనే ఉంది. నాలుగు దశాబ్దాలుగా, అక్యూట్ ఎన్‌కెఫలైటిస్ సిండ్రోమ్ (AES- ఎఇఎస్) పదే పదే వ్యాప్తిచెంది ఈ ప్రాంతంలో వేలాది మంది ప్రాణాలను బలిగొంది.

మెదడు వాపుతో సంబంధం ఉన్న లక్షణాలను స్థూలంగా చెప్పే పదమైన ఎఇఎస్, భారతదేశంలో ఉన్న ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య . దోమల ద్వారా సంక్రమించే వైరస్ అయిన జపనీస్ ఎన్‌కెఫలైటిస్ వైరస్ (జెఇవి) ఎఇఎస్ వ్యాధికి ప్రధాన కారణం. అయితే, వ్యాధికి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం (ఇటియాలజీ) ప్రకారం వివిధ రకాల వైరస్‌లతో పాటుగా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వ్యాధిని సంక్రమింపచేయని (నాన్-ఇన్‌ఫెక్షియస్) ఏజెంట్లు కూడా ఇందుకు కారణాలు.

తీవ్రమైన జ్వరం, మానసిక స్థితిలో మార్పు (మానసిక గందరగోళం, దిక్కుతోచని స్థితి, మతిమరుపు లేదా కోమా), మూర్ఛలు రావడం వంటివి ఈ అనారోగ్యం లక్షణాలు. ఎఇఎస్ సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఇది సాధారణంగా 15 ఏళ్లలోపు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. తద్వారా తీవ్రమైన అనారోగ్యం, వైకల్యం, చివరకు మరణానికి కూడా దారితీస్తుంది. వర్షాకాలంలో, రుతుపవనాలు వచ్చివెళ్ళిన తర్వాతి కాలంలో ఈ అనారోగ్యానికి సంబంధించిన కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.

పరిశుభ్రత, పారిశుద్ధ్యం, శుభ్రమైన నీరు లోపించిన ప్రాంతాలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతాయి.

పైన చెప్పిన వ్యాధికారక పరిస్థితులన్నీ బ్రహ్మసరిలో ఉన్నాయి.

PHOTO • Parth M.N.

వరదల ద్వారా కొట్టుకువచ్చి పేరుకుపోయిన చెత్త , బురదల వల్ల బ్రహ్మసరి గ్రామం మెదడువాపు వ్యాధికి కారణమయ్యే ఇన్ఫెక్షన్ బారినపడుతోంది

ఆయుష్‌కు మెదడువాపు వ్యాధి ఉందని నిర్ధారించుకోవడానికి, బిఆర్‌డి మెడికల్ కాలేజీ ఇచ్చిన అతని మరణ ధృవీకరణ పత్రాన్ని చూపించాలని మేం అడిగాం. “అది మా మరిది దగ్గర ఉంది” అన్నారు శోభ. "ఆయన నంబర్ తీసుకుని వాట్సాప్‌లో పంపమని అడగండి."

మేం అలాగే చేశాం. కొన్ని నిమిషాల తర్వాత ఫోన్ బీప్‌మంది. ఆయుష్ తీవ్రమైన మెనింజైటిస్‌తో బాధపడుతున్నాడని, కార్డియోపల్మోనరీ అరెస్ట్‌తో మరణించాడనీ ఆ పత్రంలో ఉంది. "కానీ ఆయుష్ మెదడువాపు వ్యాధికి చికిత్స పొందుతున్నాడని డాక్టర్లు నాకు చెప్పారు" అని శోభ ఆశ్చర్యంగా అన్నారు. "వాళ్ళు నాకు ఒక విషయం చెప్పి మరణ ధృవీకరణ పత్రంలో మరొకటి ఎట్లా రాస్తారు!?"

*****

బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజ్ ఆగస్ట్ 2017లో ఒకసారి వార్తల ముఖ్యాంశాలలోకి వచ్చింది. ఆసుపత్రిలో పైపుల ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్ అయిపోవడంతో (ఆగస్టు 10న) రెండు రోజుల వ్యవధిలోనే 30 మంది పిల్లలు మరణించారు. ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందనడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కొట్టిపారేసింది. మెదడువాపుతో సహా సహజ కారణాల వల్లనే ఈ మరణాలు సంభవించాయనీ, ఆగస్టు 7 నుండి 9 మధ్య కూడా ఇంతే సంఖ్యలో పిల్లలు మరణించారనీ పేర్కొంది.

ఈ ఆసుపత్రిలో మరణాల సంఖ్య అత్యధికంగా ఉండటం అసాధారణమేమీ కాదు.

బి ఆర్‌డి మెడికల్ కాలేజీలో 2012 నుండి ఆగస్టు 2017 నాటి సంఘటన వరకు 3,000 మందికి పైగా పిల్లలు మరణించారు. ఆగస్టు 2017 నాటి విషాదానికి ముందరి మూడు దశాబ్దాలలో అక్కడ మరణించిన 50,000 మంది పిల్లలలో - వారిలో ఎక్కువ మంది జెఇ లేదా ఎఇఎస్ కారణంగా - ఈ పిల్లలు కూడా ఉన్నారు. 2017లో జరిగిన మరణాలు- గోరఖ్‌పూర్‌నూ, దాదాపు అన్ని ప్రాంతాలలోని ఎఇఎస్ కేసులను సంబాళించే, అత్యంత రద్దీగా ఉండే ఈ ఆసుపత్రినీ వేధిస్తున్న సమస్యను- మళ్లీ రగిలించాయి.

గోరఖ్‌పూర్‌ సొంతగడ్డ అయిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇది ఒక పుండులా సలిపే సమస్య. ముఖ్యమంత్రి కాకముందు, 1998 నుండి వరుసగా ఐదు సార్లు గోరఖ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇతను ప్రాతినిధ్యం వహించాడు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పినదాని ప్రకారం, 2017 సంఘటన తర్వాత మెదడువాపు వ్యాధిని నియంత్రించడంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఆసక్తిని కనబరిచాడు. గోరఖ్‌పూర్ ప్రధాన వైద్యాధికారి (సిఎమ్ఒ) డాక్టర్ అశుతోష్ దూబే మాట్లాడుతూ, "ఎక్కువగా హాని కలిగించే ప్రాంతాలలో దోమలు వృద్ధి చెందకుండా నిరోధించడానికి మేము ముందుగానే (పురుగుమందు) చల్లించాము. మేము ఏప్రిల్లోనే (జెఇని నియంత్రించడానికి) టీకాలు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇంతకుముందు ఈ కార్యక్రమం చాలా ఆలస్యంగా జూన్ లేదా జూలైలో జరిగేది. సాధారణంగా వర్షాకాలంలో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి." అన్నారు.

PHOTO • Parth M.N.

గోరఖ్ పూర్ జిల్లాలో అంటువ్యాధులు అత్యధికంగా రావడానికి మానవ మలం , ఆవు పేడ , చెత్త ద్వారా కలుషితమైన భూగర్భ జలాలే కారణం

రాష్ట్రంలో ఎఇఎస్‌ను తమ ప్రభుత్వం నియంత్రించిందని గత కొన్నేళ్లుగా సీఎం ఆదిత్యనాథ్ చెప్పుకొస్తున్నాడు. డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (దేశస్థాయిలో వాహకం ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించే కార్యక్రమం యొక్క సంచాలక కార్యాలయం) ద్వారా ప్రచురించబడిన సమాచారం (డేటా) ముఖ్యమంత్రి మాటలకు మద్దతునిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో నివేదించబడుతోన్న ఎఇఎస్, జెఇ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 2017లో 4,742 ఎఇఎస్‌ కేసులు నమోదయ్యాయి, వాటిలో 693 జెఇ కేసులు.  మొత్తం మరణాల సంఖ్య 654 కాగా, జెఇ కారణంగా 93.

రాష్ట్రంలో 2020లో 1,646 ఎఇఎస్ కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. ఇది 2021లో మరింత మెరుగ్గా ఉంది- 1,657 కేసులలో 58 మరణాలను నమోదు చేసింది. ఇందులో జెఇ కారణమైన మరణాలు కేవలం నాలుగు మాత్రమే.

2017 నుండి 2021 వరకు ఎఇఎస్, జెఇ మరణాలలో తగ్గుదల వరుసగా 91, 95 శాతం.

ఇటీవలి శాసన సభ ఎన్నికలలో విజయం సాధించిన ఒక నెల లోపే- ఏప్రిల్ 2, 2022న, రాష్ట్రంలో " మెదడువాపు వ్యాధిని నిర్మూలించడం "లో తన ప్రభుత్వం విజయం సాధించిందని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చాడు.

అయితే, ఆయుష్ విషయంలో లాగానే, మరణ ధృవీకరణ పత్రాలలో పొంతన లేకుండా మరణ కారణాలను నమోదు చేయడం, సంఖ్యను తప్పుగా నివేదించడాన్ని సూచిస్తున్నాయి.

ఆయుష్ మెదడువాపు వ్యాధితో చనిపోలేదని బేల్‌ఘాట్ బ్లాక్‌లోని సిఎచ్‌సి ఇన్‌ఛార్జ్ అధికారి డాక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. బ్రహ్మసరి గ్రామం ఈ బ్లాక్‌లోనే ఉంది. "మీరు మాట్లాడుతున్న కేసు గురించి నాకు బాగా తెలుసు. ఇది ఎఇఎస్ మరణం కాదు. నా ప్రాంతం నుండి ఒక ఎఇఎస్ రోగిని చేర్చుకుని ఉంటే, ఆ విషయాన్ని వైద్య కళాశాల నాకు తెలియజేసివుండేది." అని అతను చెప్పారు.

బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గణేశ్ కుమార్‌ను PARI ఫిబ్రవరిలో కలిసినప్పుడు, బేల్‌ఘాట్ సిఎచ్‌సి ఇన్‌ఛార్జ్‌ మాటలతో ఆయన విభేదించారు. "సాంకేతికంగా మెనింజైటిస్ కూడా ఎఇఎస్ కిందకు వస్తుంది. ఆసుపత్రిలో చేరిన తర్వాత రోగికి ఎఇఎస్ నంబర్ కేటాయించబడుతుంది." అని అతను చెప్పారు.

మేము మెనింజైటిస్‌ను మరణ కారణంగా పేర్కొన్న ఆయుష్ మరణ ధృవీకరణ పత్రాన్ని అతనికి చూపించాము. “ఇక్కడ ఎఇఎస్ నంబర్ ఒకటి ఉండాలి, కానీ లేదు!” అన్నారు గణేశ్ కుమార్, తన వైద్య కళాశాల ఆసుపత్రిలోనే జారీ చేసిన పత్రాన్ని అయోమయంగా చూస్తూ.

PHOTO • Parth M.N.

'మేం ఎంత ఆపాలని ప్రయత్నించినా మా పిల్లలు మురికి నీటిలో ఆడుకుంటూనే ఉంటారు,' అని శోభ చెప్పారు

ఎఇఎస్ రోగిని గుర్తించడం కష్టం కాదని డాక్టర్ కఫీల్ ఖాన్ అన్నారు. “ఎఇఎస్ అనేది ఒక ప్రాథమిక రోగనిర్ధారణ. రోగికి 15 రోజుల కంటే తక్కువ వ్యవధిలో జ్వరం వస్తూ ఉంటే, ఏదైనా మార్పు (మూర్ఛలు వంటివి) కనిపిస్తే, మీరు వారికి ఎఇఎస్ నంబర్‌ను కేటాయించవచ్చు. అందుకు మీరు ఎలాంటి పరీక్షలు చేయవలసిన అవసరం లేదు. ఆగస్టు 2017 ఘటన జరిగేవరకు మేం అలాగే పనిచేశాం." అని ఆయన వివరించారు.

ఆగస్టు 10, 2017న బిఆర్‌డి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 23 మంది చిన్నారులు మరణించిన రోజున ఖాన్ డ్యూటీలో ఉన్నారు. ఈ ఘటన తర్వాత, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ యూపీ ప్రభుత్వం ఆయనని సస్పెండ్ చేసింది. వైద్యపరమైన నిర్లక్ష్యంతో పాటు ఇతర ఆరోపణలతో ఆయన అరెస్టయ్యారు. ఏప్రిల్ 2018లో బెయిల్‌పై విడుదలయ్యే వరకు ఏడు నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు.

2017 విషాదం తర్వాత తనను బలిపశువుగా మార్చారని ఆయన నమ్ముతున్నారు. "ఆసుపత్రి డేటాను తారుమారు చేసింది. అందువలన నాకు ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు," అని అతను చెప్పారు. నవంబర్ 2021లో బిఆర్‌డిలో పీడియాట్రిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయన సేవలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన ఈ ప్రభుత్వ చర్యను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు.

అనుకూలమైన అంకెలను చూపించడానికి ఎఇఎస్ కేసులను అక్యూట్ ఫీబ్రైల్ ఇల్‌నెస్ (ఎఎఫ్ఐ - తీవ్రమైన జ్వరసంబంధ వ్యాధి)గా జాబితా చేస్తున్నట్లు ఖాన్ చెప్పారు. “కానీ ఎఎఫ్ఐకి మెదడు ప్రమేయం ఉండదు. ఇది తీవ్రమైన జ్వరం మాత్రమే.”

జిల్లా సిఎమ్ఒ అశుతోష్ దూబే ఎటువంటి తప్పుడు నివేదికలనైనా ఖండించారు. "కొన్ని ఎఎఫ్ఐ కేసులు ఎఇఎస్ కేసులు కావచ్చు," అని అతను చెప్పారు. “అందుకే కేసులను మొదట పరిశీలన చేసి, ఆపైన తదనుగుణంగా వర్గీకరిస్తారు. కానీ అన్ని ఎఎఫ్ఐ కేసులు ఎఇఎస్ కేసులు కావు."

తీవ్రమైన జ్వరసంబంధ వ్యాధి, అక్యూట్ ఎన్‌కెఫలైటిస్ సిండ్రోమ్‌గా మారవచ్చు . రెండు అనారోగ్యాలు స్క్రబ్ టైఫస్ అనబడే బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో సహా కొంత ఇటియాలజీని పంచుకుంటాయి. గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఎఇఎస్ వ్యాప్తికి ఈ ఇన్‌ఫెక్షన్ ప్రధాన కారణంగా గుర్తించబడింది. 2015, 2016లలో చేసిన అధ్యయనాలు 60 శాతం ఎఇఎస్ కేసులకు స్క్రబ్ టైఫస్ కారణమని అంచనా వేశాయి.

ఇటీవలనే, 2019లో బిఆర్‌డి మెడికల్ కాలేజ్ తీవ్రమైన జ్వరసంబంధ అనారోగ్యాన్ని ప్రత్యేక అనారోగ్య వర్గంగా గుర్తించడం ప్రారంభించింది. కానీ దూబే వద్ద గానీ గణేశ్ కుమార్ వద్ద గానీ, వీటి సంఖ్యకు సంబంధించిన సమాచారం సిద్ధంగా లేదు

PHOTO • Parth M.N.

శోభ కుమారుడు ఆయుష్ , మెదడువాపు వ్యాధికి చికిత్స పొందుతున్నాడని ఆమెతో చెప్పారు . అయితే అతని మరణ ధృవీకరణ పత్రంలో మరణానికి కారణంగా ఇతర అనారోగ్యాలను పేర్కొన్నారు

తీవ్రమైన జ్వరం, మానసిక స్థితిలో మార్పు, మూర్ఛలు రావడం ద్వారా ఎఇఎస్ వర్గీకరించబడుతుంది. సంవత్సరంలో ఏ సమయంలోనైనా, ఏ వయస్సు వ్యక్తికైనా ఈ అనారోగ్యం కలగవచ్చు. అయితే ఇది సాధారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలకు వస్తుంది

ఎలాగైతేనేం, ఆ సంవత్సరం వైద్య కళాశాలలో చికిత్స పొందినవారి జాబితాను PARI సంపాదించగలిగింది. ఎఇఎస్, జెఇలు వచ్చినప్పటి మాదిరిగానే వర్షాకాలంలో ఈ సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. (ఎఎఫ్ఐకి దారితీసే ఇన్ఫెక్షన్‌లలో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా ఉన్నాయి.) బిఆర్‌డి మెడికల్ కాలేజీలో 2019లో మొత్తం నమోదైన 1,711 ఎఎఫ్ఐ కేసులలో, 240 కేసులు ఆగస్టు 2019లో నమోదయ్యాయి; సెప్టెంబర్, అక్టోబర్‌ నెలలలో వరుసగా 683, 476 కేసులు నమోదయ్యాయి. కానీ ఆ ఏడాది మొదటి ఆరు నెలల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఈ డేటాలో కొంత భాగాన్ని జర్నలిస్టు మనోజ్ సింగ్, 2019 చివరలో తన వెబ్ సైట్ ‌ అయిన గోరఖ్ పూర్ న్యూస్ లైన్ లో ప్రచురించారు. చాలాకాలంగా బి ఆర్‌డి మెడికల్ కాలేజీలో మెదడువాపు వ్యాధి కేసుల గురించి నివేదికలు అందిస్తోన్న సింగ్, “ఆసుపత్రివారికి దాచవలసిన సమాచారం ఏమీ లేకపోతే, వారు మునుపటిలాగా సంఖ్యను ఎందుకు విడుదల చేయడం లేదు?" అని ప్రశ్నిస్తున్నారు. ఎఎఫ్ఐ రోగులలో జాబితా చేయబడిన జెఇ కేసులను- 2019లో నమోదైన 1,711 కేసులలో జెఇ కేసుల సంఖ్య 288 - కూడా అతను ఎత్తి చూపారు.

అయితే, ఆ ఏడాది ఉత్తరప్రదేశ్ మొత్తంగా 235 జెఇ కేసులు మాత్రమే నమోదయ్యాయి.

"బిఆర్‌డి వద్ద ఉన్న 288 మంది రోగులలో కొందరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కాకపోవచ్చు. ఎందుకంటే ఈ వైద్య కళాశాల పశ్చిమ బిహార్, నేపాల్‌ల నుండి వచ్చిన రోగులను కూడా చేర్చుకుంటుంది" అని సింగ్ చెప్పారు. “కానీ ఎక్కువ కేసులు రాష్ట్రం (యుపి) నుండే వచ్చాయి కాబట్టి, సంఖ్యలు సందేహాలను లేవనెత్తుతాయి."

బి ఆర్‌డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గణేశ్ కుమార్ ఇలా అన్నారు: "బిహార్, నేపాల్‌ల నుండి వచ్చిన కేసుల సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. కానీ అవి సాధారణంగా "10 శాతానికి మించవు".

ఇది ఎఇఎస్ కేసులను తప్పుగా నివేదించడం, తక్కువగా లెక్కించడం గురించి ఆందోళనలను పెంచుతుంది.

*****

PHOTO • Parth M.N.

తన చిన్న కొడుకు కునాల్ తో శోభ . వర్షాకాలంలో తన కుమారులకు మెదడువాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఆమె భయపడుతున్నారు

ఎఇఎస్ కేసును ఎఎఫ్ఐగా పరిగణించడం వల్ల కలిగే పరిణామాలు చాలా విస్తృతమైనవి. "ఎఇఎస్ చికిత్సకూ, ఎఎఫ్ఐ చికిత్సకూ మధ్య ప్రధాన వ్యత్యాసం మేనిటోల్ అనే ఔషధం. ఇది మెదడు వాపును ఆపుతుంది. ఈ ఔషధాన్ని ఉపయోగించిన పక్షంలో, ఆ కేసును ఎఇఎస్‌గా వర్గీకరించాలి,” అని కఫీల్ ఖాన్ అన్నారు. “ఎఇఎస్ రోగిని ఎఎఫ్ఐ కేసుగా పరిగణించడం అంటే మేనిటోల్‌ని ఉపయోగించకూడదని అర్థం. మీరు దానిని ఉపయోగించకపోతే, పిల్లలు [ఎఇఎస్ ఉన్న] ప్రాణాలతో ఉన్నప్పటికీ, జీవితాంతం వికలాంగులుగా మారతారు.”

మెదడువాపు వ్యాధి సోకిన రోగి కుటుంబం, ఆ కేసుకు కేటాయించిన ఎఇఎస్ నంబర్ లేకుండా ప్రభుత్వ పరిహారం కోసం దరఖాస్తు చేయడానికి వీలులేదు. రోగి మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి రాష్ట్రం నుండి రూ. 50,000, ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి రూ. 1 లక్ష నష్టపరిహారం వస్తుంది. మెదడువాపు వ్యాధి నుంచి బ్రతికి బయటపడిన చాలామంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో పోరాడుతున్నారు.

ఎఇఎస్ ప్రధానంగా పేదలు, అట్టడుగున ఉన్నవారి కుటుంబాలపైననే దాడిచేస్తుంది. ఈ నష్టపరిహారం కూడా వీరికే చాలా అవసరం

అలాంటివారిలో శోభ కూదా ఒకరు

ఆయుష్‌ను బిఆర్‌డి మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళడానికి ముందు, రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించినందుకు ఆమెకు మొత్తం లక్ష రూపాయలు ఖర్చయ్యాయి. "మేం మా బంధువుల నుండి డబ్బు అప్పు తీసుకున్నాం" అని శోభ అన్నారు. శోభ, యుపిలోని ఇతర వెనుకబడిన తరగతుల జాబితా క్రిందికి వచ్చే నిషాద్ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె భర్త రవి, వారి గ్రామానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆజంగఢ్ జిల్లాలోని ముబారక్‌పూర్ పట్టణంలో చిన్న బట్టల దుకాణాన్ని నడుపుతున్నారు. అతను నెలకు దాదాపు రూ. 4,000 సంపాదిస్తారు.

ఆయుష్‌కు ఎఇఎస్‌ నంబర్‌ కేటాయించి ఉంటే, శోభ కనీసం తన మరిదికి అప్పు తిరిగి చెల్లించగలిగి ఉండేవారు. “మా మరిది తన చదువు కోసం రూ. 50,000 కూడబెట్టుకున్నాడు. మేం దానిని కూడా ఖర్చుచేయాల్సి వచ్చింది."

ఈ కుటుంబానికి ఒక ఎకరం కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉంది. అందులో వారు తమ ఇంటి వాడకం కోసం గోధుమలను పండిస్తారు. "వర్షాకాలంలో మా భూమి ముంపునకు గురవుతుంది కాబట్టి, మేం సంవత్సరానికి ఒక పంటను మాత్రమే తీయగలం" అని బ్రహ్మసరిలోని తన ఇంటి వెలుపల ఉన్న చేతి నీటి పంపు నుండి నీళ్ళు కొడుతూ చెప్పారు శోభ.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

బేల్ ఘాట్ గ్రామ పంచాయితీలోని తన ఇంటి బయట కరమ్ బీర్ బేల్దార్ . గత ఏడాది అతని ఐదేళ్ల మేనకోడలు రియా , మెదడువాపు వ్యాధి లక్షణాలతో మరణించింది . ' మరణ ధృవీకరణ పత్రంలో మెదడువాపు వ్యాధి గురించి ఏమీ ప్రస్తావించకపోవచ్చు , కానీ ప్రతి సంవత్సరం పిల్లలు చనిపోతూనేవున్నారు'

గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేల్‌ఘాట్ గ్రామ పంచాయతీలో, 26 ఏళ్ల కరమ్‌బీర్ బేల్దార్ తన మేనకోడలు ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకోవడానికి బి ఆర్‌డి కళాశాల ఆసుపత్రిలోని వైద్యులను తానెలా అడిగేవారో గుర్తు చేసుకున్నారు. కానీ ఎవరూ అతనికి సమాధానం చెప్పలేదు- చివరకు ఆమె చనిపోయిన తర్వాత కూడా.

అతని ఐదేళ్ల మేనకోడలు రియాకు ఆగస్టు 2021లో జ్వరం వచ్చింది. ఆపైన ఆమెకు మూర్ఛలు కూడా వచ్చేవి. "ఆ లక్షణాలు ఎ ఇ ఎస్‌కు మాదిరిగానే ఉన్నాయి," అని అతను చెప్పారు. “అది వర్షాకాలం. మా ఇంటి చుట్టూ కలుషితమైన నీరు నిండిపోయి ఉంది. మేం ఆమెను వెంటనే సిఎచ్‌సికి తీసుకెళ్లాం. అక్కడ వాళ్ళు మమ్మల్ని బిఆర్‌డికి తీసుకువెళ్ళమని సూచించారు."

రియాను ఆసుపత్రిలోని అమిత చెడ్డ పేరున్న పిల్లల వార్డులో చేర్చారు. "ఆమెకు ఏమయిందని మేం వైద్యులను అడిగాం, కానీ వారు మాకేమీ చెప్పలేదు," అని బేల్దార్ అన్నారు. “మేం ప్రశ్నలు అడిగినప్పుడల్లా వాళ్ళు మమ్మల్ని వార్డు నుండి బయటకు పంపేసేవాళ్ళు. నువ్వేమైనా ఆమెకు చికిత్స చేయబోతున్నావా? అని అక్కడ పనిచేసేవారిలో ఒకరు నన్ను అడిగారు."

ఆసుపత్రిలో చేరిన ఒక రోజు తర్వాత రియా మరణించింది. ఆమె మరణ ధృవీకరణ పత్రంలో మరణానికి కారణంగా 'సెప్టిక్ షాక్ క్రష్ వైఫల్యం' అని పేర్కొన్నారు. "దీని అర్థం ఏమిటో కూడా నాకు తెలియదు," అని బేల్దార్ అన్నారు. “ఇంత గోప్యతను పాటించడానికి కారణం ఏమిటి? మరణ ధృవీకరణ పత్రంలో మెదడువాపు వ్యాధిని గురించి ఏమీ పేర్కొనకపోవచ్చు, కానీ  ప్రతి సంవత్సరం పిల్లలు చనిపోతూనేవున్నారు."

శోభ కూడా అందుకే భయపడుతున్నారు.

ఆయుష్ వెళ్ళిపోయాడు, కానీ ఆమె తన చిన్న కొడుకులు రాజ్‌వీర్(5), కునాల్(3)ల గురించి ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులేమీ పెద్దగా మారలేదు. ఈ సంవత్సరం వర్షాకాలంలో కూడా వారి గ్రామం ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. నీరు కలుషితమవుతుంది; ఆమె చేతి పంపు ద్వారా తీసిన మురికి భూగర్భ జలాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఆయుష్ ప్రాణాలు తీసిన పరిస్థితులే అతని తమ్ముళ్లకు కూడా ముప్పుగా మిగిలాయి. వాటి పరిణామాలు ఎలా ఉంటాయో అందరికంటే శోభకే బాగా తెలుసు.

పార్థ్ ఎమ్.ఎన్. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం, పౌర హక్కులపై నివేదికలు సమర్పిస్తారు. ఈ నివేదికలోని విషయాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఎలాంటి సంపాదకీయ నియంత్రణను పాటించలేదు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Reporter : Parth M.N.

2017 ರ 'ಪರಿ' ಫೆಲೋ ಆಗಿರುವ ಪಾರ್ಥ್ ಎಮ್. ಎನ್. ರವರು ವಿವಿಧ ಆನ್ಲೈನ್ ಪೋರ್ಟಲ್ ಗಳಲ್ಲಿ ಫ್ರೀಲಾನ್ಸರ್ ಆಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಕ್ರಿಕೆಟ್ ಮತ್ತು ಪ್ರವಾಸ ಇವರ ಇತರ ಆಸಕ್ತಿಯ ಕ್ಷೇತ್ರಗಳು.

Other stories by Parth M.N.
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli