"మేము ఈ 58 ఒంటెలను జప్తు చేయలేదు," అని అమరావతి జిల్లాలోని తళేగావ్ దశాసర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అజయ్ ఆకరే చెప్పారు. "జంతువులపై క్రూరత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో నిర్దిష్ట మైన చట్టం లేదు కాబట్టి మాకు అలా చేసే అధికారం లేదు."

"ఈ ఒంటెలు నిర్బంధంలో ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

అలాగే ఈ ఒంటెల సంరక్షకులను కూడా అమరావతిలోని స్థానిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచేందుకు నిర్బంధంలో ఉంచారు. ఈ ఐదుగురు కాపలాదారులు పాక్షిక-సంచార పశుపోషకులు. ఇందులో నలుగురు రబారీ సముదాయానికి చెందినవారైతే ఒకరు మాత్రం గుజరాత్‌లోని కచ్ఛ్‌కు చెందిన ఫకీరానీ జాట్ సముదాయానికి చెందినవారు. ఈ రెండు సామాజిక సమూహాలు తరతరాలుగా, కొన్ని శతాబ్దాలుగా సంప్రదాయ ఒంటెల కాపరులుగా ఉన్నాయి. తమను తాము 'జంతు హక్కుల కార్యకర్తలు'గా చెప్పుకుంటోన్న కొందరి ఫిర్యాదుపై పోలీసులు వీరిని అరెస్టు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ఈ ఐదుగురికి తక్షణ, షరతులు లేని బెయిల్ మంజూరు చేశారు.

"నిందితుల వద్ద, ఒంటెల కొనుగోలు గురించి గానీ, వాటి స్వంతదారులని చెప్పడానికి గానీ, వారి స్వంత నివాసానికి సంబంధించిన చట్టపరమైన కాగితాలు గానీ లేవు," అని ఆకరే చెప్పారు. కాబట్టి, సంప్రదాయ పశువుల కాపరులు ఒంటెల గుర్తింపు కార్డులను, వాటి యాజమాన్య పత్రాలను కోర్టుకు సమర్పించాల్సిన ఆసక్తికరమైన పరిస్థితి వచ్చిపడింది. వాటిని ఈ కాపరుల బంధువులు, ఈ రెండు పాక్షిక-సంచార పశుపోషకుల సమూహాలకు చెందిన ఇతర సభ్యులు ఇక్కడకు పంపించారు.

తమ కాపరుల నుండి విడిపోయిన ఒంటెలు ఇప్పుడు ఒక గౌరక్షా కేంద్రంలో , అంటే ఒక గోశాలలో, వాటిని సంరక్షించడం గురించీ, వాటి పోషణ గురించీ ఏమి తెలియని వ్యక్తుల అదుపులో ఉన్నాయి. ఒంటెలు, ఆవులు చాలా భిన్నమైన ఆహారాన్ని తింటాయి. కేసు ఇంకా కొనసాగితే ఆ గోశాలలోని ఒంటెల పరిస్థితి వేగంగా క్షీణించే అవకాశం ఉంది.

Rabari pastoralists camping in Amravati to help secure the release of the detained camels and their herders
PHOTO • Jaideep Hardikar

నిర్బంధంలో ఉన్న ఒంటెలను, వాటి కాపరులను విడుదల చేయించేందుకు అమరావతిలో విడిదిచేసిన రబారీ పశుపోషకులు

*****

ఒంటె రాజస్థాన్ రాష్ట్ర జంతువు, అది ఇతర రాష్ట్రాల వాతావరణ పరిస్థితులకు అలవాటుపడలేదు.
జస్‌రాజ్ శ్రీశ్రీమల్, భారతీయ ప్రాణి మిత్ర సంఘం, హైదరాబాద్

ఇదంతా తీవ్ర అనుమానంతో మొదలైంది.

జనవరి 7, 2022న హైదరాబాద్‌కు చెందిన జంతు సంక్షేమ కార్యకర్త జస్‌రాజ్ శ్రీశ్రీమల్ (71), ఐదుగురు పశువుల కాపరులు హైదరాబాద్‌లోని కబేళాలకు ఒంటెలను అక్రమంగా తరలిస్తున్నారని తళేగావ్ దశాసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తులను, వారి ఒంటెలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, శ్రీశ్రీమల్‌కు ఈ పశువుల కాపరులు తారసపడింది హైదరాబాద్‌లో కాదు; మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో.

“నేను ఒక సహోద్యోగితో కలిసి అమరావతికి బయలుదేరి, నిమగహ్వాణ్ (చాందూర్ రైల్వే తహసీల్‌ ) గ్రామానికి చేరుకున్నాను. అక్కడ నలుగురైదుగురు వ్యక్తులు పొలంలో ఒంటెలతో విడిదిచేసివున్నారు. వాటిని లెక్కిస్తే మొత్తం 58 ఒంటెలు ఉన్నాయని తెలిసింది. వాటి మెడను, కాళ్ళను కట్టివేయడంతో అవి సరిగ్గా నడవలేకపోతున్నాయి. ఆ విధంగా వీరు వాటి పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వాటిలో కొన్నిటికి గాయాలైనాయి గానీ, ఈ పశువుల కాపరులు వాటికి ఎటువంటి మందులు పూయటంలేదు. ఒంటె రాజస్థాన్ రాష్ట్ర జంతువు, ఇతర రాష్ట్రాల వాతావరణ పరిస్థితులలో జీవించలేదు. ఆ కాపరుల వద్ద ఎటువంటి పత్రాలు లేవు. ఒంటెలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారు స్పష్టం చేయలేకపోయారు,” అని శ్రీశ్రీమల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాస్తవానికి, భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాలలో ఒంటెలు కనిపిస్తాయి. మనం వీటిని మరికొన్ని ప్రదేశాలలో కూడా చూడవచ్చు. అయితే, వీటి పెంపకం మాత్రం రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాలకే పరిమితమై ఉంది. 20వ పశు సంపద గణన - 2019 ప్రకారం దేశంలోని మొత్తం ఒంటెల సంఖ్య కేవలం 250,000 మాత్రమే. 2012లో జరిగిన పశు సంపద గణన నాటి సంఖ్యతో ఇప్పటి సంఖ్యను పోలిస్తే ఇది 37 శాతం తగ్గుదలను చూపిస్తోంది.

The camels, all male and between two and five years in age, are in the custody of a cow shelter in Amravati city
PHOTO • Jaideep Hardikar

రెండు నుంచి ఐదేళ్ళ వయసులోపు ఉన్న ఈ మగ ఒంటెలన్నీ అమరావతి నగరంలోని ఓ గోశాల అదుపులో ఉన్నాయి

ఈ ఐదుగురు పశువుల కాపరులు పెద్ద జంతువుల రవాణాలో నైపుణ్యం, అనుభవం ఉన్నవారు. వీరంతా కచ్ఛ్‌కు చెందినవారు. ఎన్నడూ హైదరాబాద్‌కు వెళ్ళలేదు.

"నాకు వారి నుండి స్పష్టమైన సమాధానాలు రాలేదు, దాంతో అనుమానం వచ్చింది," అని శ్రీశ్రీమల్ హైదరాబాద్ నుండి టెలిఫోన్ ద్వారా PARIకి చెప్పారు. "అక్రమంగా ఒంటెలను చంపేయటం గురించి కేసులు పెరుగుతున్నాయి," అని అతను చెప్పారు. తన సంస్థ - భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ - ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 600 ఒంటెలను రక్షించినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.

గుల్బర్గా, బెంగళూరు, అకోలా, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలలో ఇలాంటి రక్షణ కార్యక్రమాలు సఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అతని సంస్థ 'రక్షించబడిన' జంతువులను, రాజస్థాన్‌కు 'పంపించివేసింది'. హైదరాబాద్‌తో సహా భారతదేశంలోని కొన్ని ఇతర ప్రాంతాలలో ఒంటె మాంసానికి గిరాకీ పెరుగుతోందని ఆయన చెప్పారు. అయితే ముసలివైపోయిన మగ ఒంటెలను మాత్రమే వధకు విక్రయిస్తున్నారని పరిశోధకులు, వ్యాపారులు చెబుతున్నారు.

పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి మనేకా గాంధీతో శ్రీశ్రీమల్‌కు దగ్గరి సంబంధాలున్నాయి. “ఒక పెద్ద రాకెట్ ఉంది, ఈ సిండికేట్ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ నుండి నడుస్తోంది. ఒంటెలను బంగ్లాదేశ్‌కు కూడా తీసుకువెళతారు. ఇన్ని ఒంటెలు ఒకేచోట కలిసి ఉండే ప్రశ్నే లేదు.” అని గాంధీని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా లో వార్త వచ్చింది.

ప్రాథమిక విచారణ తర్వాత, జనవరి 8న పోలీసులు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐ ఆర్)ను సమర్పించారు. మహారాష్ట్రలో ఒంటెల సంరక్షణకు సంబంధించి నిర్దిష్ట చట్టం లేనందున, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 లోని సెక్షన్ 11 (1)(డి) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రభు రాణా, జగా హీరా, ముసాభాయి హమీద్ జాట్‌లపై - వీరంతా 40 ఏళ్ళు దాటినవారు; 50 ఏళ్ళు దాటిన విసాభాయి సరావుపై; 70 ఏళ్ళు దాటిన వెర్సిభాయి రాణా రబారీలపై అభియోగాలు నమోదు చేశారు.

Four of the traditional herders from Kachchh – Versibhai Rana Rabari, Prabhu Rana Rabari, Visabhai Saravu Rabari and Jaga Hira Rabari (from left to right) – who were arrested along with Musabhai Hamid Jat on January 14 and then released on bail
PHOTO • Jaideep Hardikar

కచ్ఛ్‌కు చెందిన నలుగురు సంప్రదాయ పశువుల కాపరులు - వెర్సిభాయి రాణా రబారీ, ప్రభు రాణా రబారీ, విసాభాయి సరావు రబారీ, జగా హీరా రబారీ (ఎడమ నుండి కుడికి) - వీరు జనవరి 14న ముసాభాయి హమీద్ జాట్‌తో పాటు అరెస్టయి, ఆపైన బెయిల్‌పై విడుదలయ్యారు

ఈ 58 ఒంటెలను పోషించడమే నిజమైన సవాలని ఇన్‌స్పెక్టర్ ఆకరే చెప్పారు. అమరావతిలోని పెద్ద కేంద్రాలను సంప్రదిస్తూనే, పోలీసులు సమీపంలోని చిన్న గౌరక్షా కేంద్రం సహాయాన్ని రెండు రాత్రులపాటు తీసుకున్నారు. అమరావతిలోని దస్తూర్ నగర్ ప్రాంతంలోని కేంద్రం స్వచ్ఛందంగా ముందుకు రావటంతో, అక్కడ ఒంటెలను ఉంచడానికి తగినంత స్థలం ఉన్నందున, చివరికి వాటిని అక్కడికి పంపించారు.

విచారించాల్సిన విషయం ఏమిటంటే, ఒంటెలను రవాణా చేసే బాధ్యత నిందితుల బంధువుల పైన, వారికి తెలిసినవారి పైనా పడింది. వారు తళేగావ్ దశాసర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి నగరానికి రెండు రోజుల పాటు ఆ జంతువులను నడిపించి తీసుకువెళ్ళారు.

పశువుల కాపరులకు మద్దతు వెల్లువెత్తుతోంది. కచ్ఛ్‌లోని కనీసం మూడు గ్రామ పంచాయతీలు ఒంటెలను బయలుభూముల్లో మేత మేయడం కోసం విడుదల చేయాలని అమరావతి పోలీసులకు, జిల్లా అధికారులకు విజ్ఞప్తులు పంపాయి. అలా చేయకపోతే అవి ఆకలితో అలమటిస్తాయి. నాగ్‌పూర్ జిల్లాలోని మకర్‌ధోకడా గ్రామ పంచాయితీ లో రబారీలకు పెద్ద డేరా (సెటిల్‌మెంట్) ఉంది. ఆ డేరా కూడా వీరు సంప్రదాయక పశువుల కాపరులనీ, ఒంటెలను హైదరాబాద్‌లోని కబేళాకు తరలించడం లేదనీ ధ్రువపరిచింది. దిగువ కోర్టు ఈ ఒంటెల సంరక్షణపై నిర్ణయం తీసుకుంటుంది: వాటిని ఇక్కడి వరకు తీసుకువచ్చిన నిందితులకు తిరిగి ఇవ్వాలా, లేదా తిరిగి కచ్ఛ్‌కు పంపించాలా అనే విషయాన్ని తేలుస్తుంది.

ఈ వ్యక్తులు ఒంటెలను సంప్రదాయంగా కాపాడుకునే వారేనని కోర్టు విశ్వసిస్తుందా లేదా అనే విషయం పైనే తుది ఫలితం ఆధారపడి ఉంటుంది.

*****

మన అజ్ఞానం ఈ సంప్రదాయ పశువుల కాపరులపై అనుమానానికి దారితీసింది, ఎందుకంటే వారు మనలా కనిపించరు, మనలా మాట్లాడరు కూడా.
సజల్ కులకర్ణి, పశుపోషక సముదాయాలపై పరిశోధకుడు, నాగపూర్

ఈ ఐదుగురు పశువుల కాపరులలో పెద్దవాడైన వెర్సీభాయి రాణా రబారీ, తన జీవితమంతా ఒంటెల, గొర్రెల మందలతో దేశంలోని అనేక ప్రాంతాలలో కాలినడకన తిరిగినవారు, కానీ జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడినట్లుగా ఇదివరకెన్నడూ ఆయనపై ఆరోపణలు లేవు.

"ఇదే మొదటిసారి," ముడతలు పడిన ముఖంతో ఉన్న ఆ వృద్ధుడు కచ్ఛీ భాషలో అన్నారు. ఆయన పోలీసు స్టేషన్‌ దగ్గర ఉన్న చెట్టు కింద ఆందోళనగా, ఇబ్బందిపడుతూ గొంతుక్కూర్చొని ఉన్నారు.

Rabaris from Chhattisgarh and other places have been camping in an open shed at the gauraksha kendra in Amravati while waiting for the camels to be freed
PHOTO • Jaideep Hardikar
Rabaris from Chhattisgarh and other places have been camping in an open shed at the gauraksha kendra in Amravati while waiting for the camels to be freed
PHOTO • Jaideep Hardikar

ఒంటెల విడుదల కోసం ఎదురుచూస్తూ అమరావతిలోని గౌరక్షా కేంద్రంలోని బయలుగా ఉన్న కొట్టాంలో విడిదిచేసివున్న ఛత్తీస్‌గఢ్‌తో సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రబారీలు

"మేం ఈ ఒంటెలను కచ్ఛ్ నుండి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో నివసిస్తోన్న మా బంధువులకు అందించడానికి తీసుకువచ్చాం," అని ఐదుగురు నిందితులలో ఒకరైన ప్రభు రాణా రబారీ, జనవరి 13న తళేగావ్ దశాసర్ పోలీస్ స్టేషన్‌లో మాకు చెప్పారు. అంటే, జనవరి 14న వారిని అధికారికంగా అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేయడానికి ఒక రోజు ముందు.

భుజ్ నుండి కచ్ఛ్ వరకూ గానీ, అమరావతికి వెళ్ళే మార్గంలో గానీ వారిని ఎవరూ ఆపలేదు. ఏదైనా నేరం చేసినట్టుగా వారిపై ఎవరికీ అనుమానం రాలేదు. ఈ అనూహ్యమైన మలుపుతో వారి మహా ప్రయాణం ఆకస్మికంగా నిలిచిపోయింది.

ఈ జంతువులను వర్ధా, నాగపూర్, భండారా (మహారాష్ట్రలో), ఛత్తీస్‌గఢ్‌లలోని రబారీల స్థావరాలకు కూడా పంపించవలసి ఉంది.

రబారీ అనేది ఒక పాక్షిక-సంచార పశుపోషకుల సముదాయం. కచ్ఛ్, ఇంకా రాజస్థాన్‌లోని రెండు మూడు ఇతర సమూహాలతో పాటు వీరు తమ జీవనోపాధి కోసం గొర్రెలను, మేకలను; వ్యవసాయ పనుల కోసం, రవాణాకు ఒంటెలను పెంచుకుంటారు. కచ్ఛ్ ఒంటెల పెంపకందారుల సంస్థ రూపొందించిన ' బయోకల్చరల్ కమ్యూనిటీ ప్రోటోకాల్ ' ప్రకారం వారు ఒంటెలను పెంచిపోషిస్తారు.

ఈ సముదాయంలోని ఢేబరియా రబారీ అనే ఒక విభాగం, ఏడాదిలో ఎక్కువకాలం నీరు-మేత సమృద్ధిగా ఉన్న ప్రదేశాలకు అనేక దూరాలు వలసపోతుంటుంది; ఇప్పుడు మధ్య భారతదేశం అంతటా అనేక కుటుంబాలు సంవత్సరంలో ఎక్కువ కాలం సెటిల్‌మెంట్లు లేదా డేరా లలో నివసిస్తున్నాయి. వారిలో కొందరు దీపావళి తర్వాత కాలానుగుణంగా కచ్ఛ్‌కు ఎంతో దూరంలో ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భ వంటి ప్రాంతాలకు కాలినడకన వలసపోతారు.

మధ్య భారతదేశంలో కనీసం 3,000 ఢేబరియా రబారీల నివాసాలు ఉన్నాయని నాగపూర్‌కు చెందిన పశుపోషకుల, సంప్రదాయ పశుసంరక్షకుల పరిశోధకుడు సజల్ కులకర్ణి చెప్పారు. రీవైటలైజింగ్ రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ నెట్‌వర్క్ (RRAN)లో ఫెలో అయిన కులకర్ణి, ఒక డేరా లో 5-10 కుటుంబాలు, వారి ఒంటెలు, రబారీలు మాంసం కోసం పెంచే గొర్రెల, మేకల పెద్ద పెద్ద మందలు ఉండవచ్చునని చెప్పారు.

Jakara Rabari and Parbat Rabari (first two from the left), expert herders from Umred in Nagpur district, with their kinsmen in Amravati.They rushed there when they heard about the Kachchhi camels being taken into custody
PHOTO • Jaideep Hardikar

అమరావతిలో తమ బంధువులతో, నాగ్‌పూర్ జిల్లాలోని ఉమరేడ్‌కు చెందిన నిపుణులైన పశువుల కాపరులు జకారా రబారీ, పర్బత్ రబారీ (ఎడమవైపు నుండి మొదటి ఇద్దరు). కచ్ఛ్ ఒంటెలను అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే వారు అక్కడికి చేరుకున్నారు

కులకర్ణి ఒక దశాబ్దానికి పైగా రబారీలు, వారి పశువులతో పాటు పశుపోషకుల సంస్కృతుల గురించి అధ్యయనం చేస్తున్నారు. "ఈ సంఘటన పశుపోషకుల గురించి అవగాహన లేకపోవడాన్ని సూచిస్తోంది. మన అజ్ఞానం ఈ సంప్రదాయ పశువుల కాపరులపై అనుమానాలు రావడానికి దారి తీస్తుంది. ఎందుకంటే వారు మనలా కనిపించరు, మనలా మాట్లాడరు.” అని వారిని అరెస్టు చేయటం, ఒంటెలను 'నిర్బంధం'లోకి తీసుకోవడం గురించి ఆయన చెప్పారు,

అయినప్పటికీ, రబారీలలోని కొన్ని సమూహాలు స్థిరపడుతున్నాయని కులకర్ణి చెప్పారు. గుజరాత్‌లో వారు తమ సంప్రదాయక వృత్తికి దూరంగా ఉన్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మహారాష్ట్రలోని కొన్ని కుటుంబాలకు ఇప్పుడిక్కడ భూములు కూడా ఉన్నాయి. వీరు స్థానిక రైతులతో కలిసిపోయి పనిచేస్తున్నారు.

"వారికీ రైతులకూ సహజీవుల సంబంధం ఉంది" అని కులకర్ణి చెప్పారు. ఉదాహరణకు, 'పెన్నింగ్' - వ్యవసాయం ఉండని కాలంలో రబారీలు వ్యవసాయ భూముల్లో తమ గొర్రెల, మేకల మందలను మేపుకునే ప్రక్రియ. ఇది సేంద్రీయ ఎరువుగా పనిచేసే జంతువుల పెంటలతో నేలలను సుసంపన్నం చేయడానికి సహాయపడుతుంది. "అటువంటి అనుబంధాన్ని పంచుకున్న రైతులకు వారి విలువ తెలుసు," అని ఆయన చెప్పారు.

ఈ 58 ఒంటెలను తీసుకోవాల్సిన రబారీలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఉన్నారు. వారు దాదాపు తమ జీవితమంతా ఈ రాష్ట్రాలలోని సెటిల్‌మెంట్లలో నివసిస్తున్నప్పటికీ, కచ్ఛ్‌లోని తమ బంధువులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు, ఫకీరానీ జాట్‌లు ఎక్కువ దూరాలు వలస వెళ్లరు, కానీ వీరు అద్భుతమైన ఒంటెల పెంపకందారులు, రబారీలతో సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటారు.

భుజ్‌లో పశుపాలన (Pastoralism) కేంద్రాన్ని నడుపుతోన్న ఎన్‌జిఒ సహజీవన్ ప్రకారం, రబారీ, సమా, జాట్‌లతో సహా కచ్‌లోని అన్ని పశుపోషక సముదాయాల నుండి దాదాపు 500 మంది ఒంటెల పెంపకందారులు ఉన్నారు.

"మేం పరిశీలించాం, ఇదంతా నిజమే. ఈ 58 యువ ఒంటెలను కచ్ఛ్ ఉంట్ ఉచ్చేరక్ మాల్‌దారీ సంఘటన్ (కచ్ఛ్ ఒంటెల పెంపకందారుల సంఘం)కు చెందిన 11 మంది పెంపకందారుల నుండి మధ్య భారతదేశంలోని తమ బంధువుల కోసం కొనుగోలు చేశారు," అని సహజీవన్ కార్యక్రమ సంచాలకులు రమేశ్ భట్టి, భుజ్ నుండి PARIతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.

ఈ ఐదుగురు కూడా చాలా నిష్ణాతులైన ఒంటెల శిక్షకులు. అందుకే ఈ సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణంలో జంతువులతో పాటు వెళ్ళేందుకు వారిని ఎంచుకున్నారని భట్టి మాకు చెప్పారు. వెర్సీభాయి బహుశా కచ్ఛ్‌లోనే మనుగడలో ఉన్న అత్యంత చురుకైన నిపుణులైన శిక్షకులలో పెద్దవయసువారు, రవాణాదారులలో ఒకరు.

Suja Rabari from Chandrapur district (left) and Sajan Rana Rabari from Gadchiroli district (right) were to receive two camels each
PHOTO • Jaideep Hardikar
Suja Rabari from Chandrapur district (left) and Sajan Rana Rabari from Gadchiroli district (right) were to receive two camels each
PHOTO • Jaideep Hardikar

చంద్రపూర్ జిల్లాకు చెందిన సుజా రబారీ (ఎడమ), గఢ్‌చిరోలి జిల్లాకు చెందిన సజన్ రాణా రబారీ. వీరిద్దరూ చెరొక రెండు ఒంటెలను అందుకోవలసి ఉంది

*****

మాది ఒక సంచార సముదాయం; చాలాసార్లు మా దగ్గర పత్రాలు ఉండవు...
మశ్రూభాయి రబారీ, వర్ధాకు చెందిన సముదాయపు నాయకుడు

కచ్ఛ్ నుండి ఎప్పుడు బయలుదేరారో ఖచ్చితమైన తేదీ వారికి గుర్తులేదు.

"మేం తొమ్మిదవ నెలలో (సెప్టెంబర్ 2021) వివిధ ప్రాంతాలలోని మా పెంపకందారుల నుండి జంతువులను సేకరించడం ప్రారంభించాం. దివాలీ (నవంబర్ ప్రారంభంలో) అయిపోగానే భచావు (కచ్ఛ్‌లోని ఒక తాలూకా ) నుండి మా నడకను ప్రారంభించాం," చెదిరిపోయి, కడగండ్లుపడివున్న ప్రభు రాణా రబారీ అన్నారు. "ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్యలో గానీ, చివరకు గానీ మేం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కి చేరుకోవలసివుంది. మేం వెళ్ళవలసింది అక్కడికే."

ఈ ఐదుగురు వ్యక్తులు నిర్బంధంలోకి వెళ్ళే సమయానికి తమ స్వస్థలమైన కచ్ఛ్ నుండి దాదాపు 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. భచావు నుండి వారు అహ్మదాబాద్ మీదుగా ప్రయాణించి, తర్వాత మహారాష్ట్రలోని నందుర్‌బార్, భుసావళ్, అకోలా, కారంజా మీదుగా తళేగావ్ దశాసర్ చేరుకున్నారు. వారు వర్ధా, నాగపూర్, భండారా (మహారాష్ట్రలోనే ఉంది) మీదుగా వెళ్ళి, ఆపై దుర్గ్, రాయ్‌పూర్‌ల తర్వాత బిలాస్‌పూర్ (ఈ మూడు ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నాయి) చేరుకునివుండేవారు. వీరు వాశిమ్ జిల్లాలోని కారంజా పట్టణం తర్వాత కొత్తగా నిర్మించిన సమృద్ధి హైవే వెంట కూడా నడిచారు.

"మేం రోజుకు 12-15 కిలోమీటర్లు నడిచాం, అయితే ఒక చిన్న ఒంటె 20 కిలోమీటర్లు సులభంగా నడవగలదు," అని ముసాభాయి హమీద్ జాట్ పేర్కొన్నారు. బహుశా ఈయనే ఆ ఐదుగురిలోకీ చిన్నవాడు. "మేం రాత్రిళ్ళు ఆగి, ఉదయాన్నే మళ్ళీ నడవడం మొదలుపెడతాం." వారు తమ కోసం వండుకు తిని, మధ్యాహ్నం కాస్త కునుకు తీసి, ఒంటెలకు కూడా విశ్రాంతి తీసుకోవడానికి సమయమిచ్చి, మళ్ళీ వారి యాత్రను ప్రారంభిస్తారు.

కేవలం ఒంటెలను మేపుతున్నందుకే అరెస్టు అయినందుకు వారు భయపడుతున్నారు.

"మేం మా ఆడ ఒంటెలను ఎప్పుడూ అమ్ముకోము. రవాణా కోసం మా మగ ఒంటెలను ఉపయోగిస్తాం," అని వర్ధా జిల్లాలో నివసించే ఈ సముదాయానికి చెందిన ప్రముఖ నాయకుడు మశ్రూభాయి రబారీ మాతో చెప్పారు. "ఒంటెలే మా పాదాలు." ఇప్పుడు 'నిర్బంధం'లో ఉన్న 58 ఒంటెలన్నీ మగవే.

Mashrubhai Rabari (right) has been coordinating between the lawyers, police and family members of the arrested Kachchhi herders. A  community leader from Wardha, Mashrubhai is a crucial link between the Rabari communities scattered across Vidarbha
PHOTO • Jaideep Hardikar
Mashrubhai Rabari (right) has been coordinating between the lawyers, police and family members of the arrested Kachchhi herders. A  community leader from Wardha, Mashrubhai is a crucial link between the Rabari communities scattered across Vidarbha
PHOTO • Jaideep Hardikar

అరెస్టయిన కచ్ఛ్ కాపరుల న్యాయవాదులు, పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం చేస్తోన్న మశ్రూభాయి రబారీ (కుడి). వర్ధాకు చెందిన ఈ సముదాయపు నాయకుడైన మశ్రూభాయి విదర్భలో చెల్లాచెదురుగా ఉన్న రబారీ సముదాయాల మధ్య కీలకమైన లంకె వంటివారు

‘మశ్రూ మామ’గా అందరితో ప్రేమగా పిలిపించుకునే ఈయన, ఈ ఐదుగురు పశువుల కాపరులను పోలీసులు పట్టుకున్న రోజు నుంచి వారితోనే ఉంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ, అమరావతిలో న్యాయవాదులను ఏర్పాటు చేస్తూ, పోలీసులకు అనువాదాల్లోనూ, కాపరుల వాంగ్మూలాలను నమోదు చేయడంలోనూ సహాయపడుతున్నారు. మరాఠీ, కచ్ఛీ భాషలలో మంచి పట్టు ఉన్న ఈయన, ఈ ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్న మొత్తం రబారీ సెటిల్‌మెంట్లను కలిపివుంచే ఒక కీలకమైన లంకె.

"ఈ ఒంటెలను విదర్భ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వివిధ డేరాల లో నివసిస్తున్న మా జనం 15-16 మందికి పంపిణీ చేయాల్సివుంది," అని మశ్రూభాయి చెప్పారు. "ప్రతి ఒక్కరికి 3-4 ఒంటెలను అందించాలి." ప్రయాణంలో ఉన్నప్పుడు, రబారీలు జంతువులతో పాటుగా వారి వస్తువులను, చిన్న పిల్లలను, కొన్నిసార్లు గొర్రె దూడలను - నిజం చెప్పాలంటే వారి ప్రపంచం మొత్తాన్నీ మోసుకొస్తారు. మహారాష్ట్రలోని గొర్రెల పెంపకం చేసే ధన్‌గర్ సముదాయంవారిలాగా వీరెప్పుడూ ఎద్దుల బండ్లను ఉపయోగించరు.

"మేం ఈ ఒంటెలను మాకు తెలిసిన పెంపకందారుల నుండి కొనుగోలు చేస్తాం," అని మశ్రూభాయి చెప్పారు. “ఇక్కడ 10-15 మందికి ముసలివైపోయిన జంతువుల స్థానాన్ని భర్తీ చేయడానికి చిన్నవయసు మగ ఒంటెలు అవసరం అయినప్పుడు, కచ్‌లోని మా బంధువులకు ఆర్డర్‌ పెడతాం. పెంపకందారులు వాటిని ఒక పెద్ద మొత్తంగా, శిక్షణ పొందినవారితో జతచేసి పంపుతారు. కొనుగోలుదారులు ఒంటెలను పంపిణీ చేసినందుకు వీరికి దూర ప్రయాణమైతే నెలకు 6,000 నుండి 7,000 రూపాయల వరకు వేతనంగా చెల్లిస్తారు." ఒక చిన్నవయసు ఒంటె ఖరీదు 10,000 నుండి 20,000 రూపాయల వరకు ఉంటుందని మశ్రూభాయి మాకు చెప్పారు. 3 సంవత్సరాల వయస్సులో పనిచేయడం ప్రారంభించే ఒంటె 20-22 సంవత్సరాల వరకు జీవిస్తుంది. "ఒక మగ ఒంటె పనిచేసే జీవితకాలం 15 సంవత్సరాలు," అని ఆయన చెప్పారు.

"ఈ వ్యక్తుల వద్ద ఎటువంటి పత్రాలు లేవన్నది నిజమే," అని మశ్రూభాయి ఒప్పుకున్నారు. "మాకు ఇంతకుముందు అలాంటివాటి అవసరం ఉండేది కాదు. అయితే ఇకముందు నుండి మేం జాగ్రత్తగా ఉండాల్సిందే. పరిస్థితులు మారుతున్నాయి."

ఈ ఫిర్యాదు, తమనీ తమ ఒంటెలనూ చాలా అనవసరమైన ఇబ్బందులకు గురిచేసిందని ఆయన చిరాకుపడ్డారు. " ఆమీ ఘుమంతు సమాజ్ ఆహే, ఆమ్‌చ్యా బర్యాచ్ లోకాయ్ కడ్ కధీ కధీ కాగద్ పత్ర నస్తే, " అని ఆయన మరాఠీలో చెప్పారు. “మాది సంచార సముదాయం; చాలాసార్లు మా వద్ద పత్రాలు ఉండవు (అదే ఇక్కడ జరిగింది)."

Separated from their herders, the animals now languish in the cow shelter, in the custody of people quite clueless when it comes to caring for and feeding them
PHOTO • Jaideep Hardikar
Separated from their herders, the animals now languish in the cow shelter, in the custody of people quite clueless when it comes to caring for and feeding them
PHOTO • Jaideep Hardikar

తమ కాపరుల నుండి వేరు చేయబడిన జంతువులు ఇప్పుడు ఒక గోశాలలో, తమను సంరక్షించడం, పోషించడం వంటి విషయాలలో ఎటువంటి అవగాహన లేని వ్యక్తుల అదుపులో ఉన్నాయి

*****

వాటి పట్ల క్రూరంగా ప్రవర్తించామనేది మాపై వచ్చిన అభియోగం. కానీ బయలులో మేత మేయటం అవసరమైన సమయంలో వాటిని ఇక్కడే నిర్బంధించి ఉంచడం కంటే గొప్ప క్రూరత్వం మరొకటి లేదు.
పర్బత్ రబారీ, నాగపూర్‌కు చెందిన అనుభవశాలి అయిన ఒంటెల సంరక్షకుడు

నిర్బంధంలో ఉన్న ఒంటెలన్నీ రెండు నుండి ఐదు సంవత్సరాల మధ్య వయస్సున్నవి. ఇవి కచ్ఛీ జాతికి చెందినవి, సాధారణంగా కచ్ఛ్‌లోని లోతట్టు భౌగోళిక పర్యావరణ వ్యవస్థలలో ఇవి కనిపిస్తాయి. నేడు కచ్ఛ్‌లో అలాంటి ఒంటెలు 8,000 వరకు ఉన్నాయని అంచనా .

ఈ జాతికి చెందిన మగ ఒంటెలు సాధారణంగా 400 నుండి 600 కిలోల బరువుంటాయి, ఆడ ఒంటెలు 300 నుండి 540 కిలోల బరువుంటాయి. సన్నటి ఛాతీ, ఒంటి మూపురం, పొడవుగా వంపుతిరిగిన మెడ; మూపురంపై భుజాలపై, గొంతుపై పొడవాటి వెంట్రుకలు ఈ ఒంటె ముఖ్యమైన లక్షణాలు అని ప్రపంచ ఆట్లస్ పేర్కొంది. ఈ ఒంటె చర్మపు రంగు కపిల వర్ణం నుండి నలుపు రంగు వరకు, కొన్నిసార్లు తెలుపుగా కూడా ఉంటుంది.

కపిల వర్ణంలో ఉండే ఈ కచ్ఛీ జాతి గిట్టలున్న ఒంటెలు బయళ్ళలో మేతమేయడాన్ని ఇష్టపడతాయి. ఇవి అనేక రకాల మొక్కలను, ఆకు జాతులను తింటాయి. అడవుల్లోని చెట్ల ఆకులను, పచ్చిక బయళ్లలో, బీడుగా ఉన్న వ్యవసాయ భూముల్లో ఉండే ఆకులను వీటికి ఆహారంగా ఇవ్వవొచ్చు.

రాజస్థాన్, గుజరాత్‌లలో ఒంటెల పెంపకం చాలా కష్టంగా మారిపోతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో, గత ఒకటి రెండు దశాబ్దాలుగా అడవులలోకి, మడ అడవుల్లోకి ప్రవేశించడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒంటెలకు, వాటి పెంపకందారులకు, వాటి యజమానులకు ఇప్పటికే ఉన్న సమస్యలకు ఆ ప్రాంతాలలో జరిగే అభివృద్ధి స్వభావం కూడా తోడైంది. ఇంతకుముందు సమృద్ధిగా, ఉచితంగా లభిస్తోన్న మేతను, ఈ జంతువులు ఇప్పుడు కోల్పోయాయి.

ఇప్పుడు బెయిల్‌పై ఉన్న ఆ ఐదుగురు వ్యక్తులు అమరావతిలోని గోశాలలో తమ బంధువులను చేరారు. అక్కడ వారి ఒంటెలను చుట్టూ కంచె వేసివున్న పెద్ద మైదానంలో ఉంచారు. వాటికి అలవాటైన పశుగ్రాసం దొరకడం లేదని రబారీలు ఆందోళన చెందుతున్నారు.

A narrow chest, single hump, and a long, curved neck, as well as long hairs on the hump, shoulders and throat are the characteristic features of the Kachchhi breed
PHOTO • Jaideep Hardikar
A narrow chest, single hump, and a long, curved neck, as well as long hairs on the hump, shoulders and throat are the characteristic features of the Kachchhi breed
PHOTO • Jaideep Hardikar

సన్నని ఛాతీ, ఒంటి మూపురం, పొడవుగా వంపుతిరిగిన మెడ; మూపురం, భుజాలు, గొంతుపై పొడవాటి వెంట్రుకలు ఈ కచ్ఛీ జాతి ఒంటెల లక్షణాలు

ఈ ఒంటెలు కచ్ఛ్ (లేదా రాజస్థాన్) నుండి దూరంగా ఉండే ప్రాంతాలకు అలవాటు పడలేవు, లేదా అక్కడ నివసించలేవు అనే మాటల్లో నిజం లేదని రబారీలు చెబుతారు. "అవి చాలాకాలంగా మాతోపాటే ఉంటూ, దేశం అంతటా తిరుగుతున్నాయి,” అని భండారా జిల్లా, పవనీ బ్లాక్‌లోని ఆస్‌గావ్‌లో నివసించే అనుభవజ్ఞుడైన రబారీ ఒంటెల సంరక్షకుడైన ఆసాభాయ్ జేసా అన్నారు.

"విచారించాల్సిన విషయమేమంటే, మేం వాటితో క్రూరంగా ప్రవర్తించామనేదే మాపై ఉన్న అభియోగం. కానీ వాటికి బయళ్ళలో మేత మేయడం అవసరమైన సమయంలో, వాటిని ఇక్కడ నిర్బంధించడం కంటే గొప్ప క్రూరత్వం మరొకటి లేదు," అన్నారు మరో అనుభవజ్ఞుడైన వలస పశువుల కాపరి, పర్బత్ రబారీ. ఈయన నాగపూర్‌లోని ఉమరేడ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో స్థిరపడ్డారు.

“ఆవులు మేసేవాటిని ఒంటెలు తినవు,” అన్నారు నాగ్‌పూర్ జిల్లా ఉమరేడ్ తాలూకాలోని సిర్సీ అనే గ్రామంలో నివసించే జకారా రబారీ. జకారాభాయ్ ఈ ఒంటెల మంద నుంచి మూడు ఒంటెలను అందుకోవలసి ఉంది.

కచ్ఛీ ఒంటెలు అనేక రకాల మొక్కలను, ఆకు జాతులను - నీమ్ (వేప), బాబుల్ (నల్ల తుమ్మ), పీపల్ (రావి), ఇతర రకాలు - తింటాయి. కచ్ఛ్‌ జిల్లాలోని పొడిగా ఉండే కొండ ప్రాంతాలకు చెందిన చెట్ల ఆకులు ఈ ఒంటెలకు ఆహారమవుతాయి. ఈ ఆకులు ఒంటెల పాలలో అసాధారణమైన అధిక పోషక విలువలు ఉండేలా దోహదం చేస్తాయి. ఈ జాతికి చెందిన ఆడ ఒంటె సాధారణంగా రోజుకు 3-4 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. కచ్ఛీ పశువుల కాపరులు రెండు రోజులకొకసారి తమ ఒంటెలను నీటి వద్దకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఈ జంతువులు వాటికి దాహం వేసినప్పుడు 15 నుండి 20 నిమిషాలలోపు ఒకేసారి 70-80 లీటర్ల నీటిని తాగేస్తాయి. అయితే, ఇవి నీరు లేకుండా ఎక్కువ కాలం ఉండగలవు.

గౌరక్షా కేంద్రం లో ఉన్న 58 ఒంటెలకు ఇప్పటిదాకా పరిమితమైన ప్రదేశంలో దొరికే ఆహారాన్ని దాణాగా ఉపయోగించలేదు. వయసుమళ్ళిన జంతువులు ఇక్కడ దొరికే వేరుశెనగ అవశేషాలను తింటాయి, చిన్నవి ఇంకా అలాంటి మేతకు అలవాటు పడలేదని పర్బత్ రబారీ చెప్పారు. అమరావతిలోని ఈ ప్రదేశానికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఉన్న చెట్ల ఆకులనో లేదా పొలాలలో ఉండే చెట్ల ఆకులనో ఈ ఒంటెలు తినేవని ఆయన చెప్పారు.

ఒక చిన్నవయసు మగ ఒంటె రోజుకు 30 కిలోల వరకు మేత తింటుందని పర్బత్ మాకు తెలియజేశారు.

Eating cattle fodder at the cow shelter.
PHOTO • Jaideep Hardikar
A Rabari climbs a neem tree on the premises to cut its branches for leaves, to feed the captive camels
PHOTO • Jaideep Hardikar

ఎడమ: గోశాలవద్ద పశువుల మేతను తింటూ. కుడి: బందీలుగా ఉన్న ఒంటెలకు ఆకులను ఆహారంగా అందించడం కోసం, ఆవరణలో ఉన్న వేప చెట్టును ఎక్కిన ఒక రబారీ

ఇక్కడ గోశాలలో ఉన్న పశువులకు అన్ని రకాల పంటల అవశేషాలను - సోయాచిక్కుళ్ళు, గోధుమలు, జొన్న , మొక్కజొన్న, చిన్నా పెద్దా చిరుధాన్యాలు, ఇంకా ఆకుపచ్చ గడ్డిని కూడా - ఆహారంగా అందిస్తారు. నిర్బంధించిన ఒంటెలకు కూడా ఇవే ఆహారంగా ఇస్తున్నారు.

అనేక దశాబ్దాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో స్థిరపడిన పర్బత్, జకారా, ఇంకా ఒక డజనుమంది ఇతర రబారీలు తమ మనుషులను, ఒంటెలను నిర్బంధించారని తెలియగానే అమరావతికి వెంటనే వచ్చేశారు. జంతువులకు ఏమవుతుందో అనే ఆందోళనతో వాటిపై ఒక కన్నువేసి ఉంచారు.

“ఒంటెలన్నిటినీ కట్టేయలేదు; కానీ వాటిలో కొన్నిటిని కట్టేసి ఉంచాలి. లేకుంటే అవి ఒకదాన్నొకటి కొరుక్కోవటమో, లేదా దారినపోయేవారిని ఇబ్బంది పెట్టడమో చేస్తాయి,” అని జకారా రబారీ చెప్పారు. ఈయన ప్రస్తుతం గౌరక్షా కేంద్రం లో బసచేసి, ఒంటెల కస్టడీపై కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. "ఈ చిన్నవయసులోని మగ ఒంటెలు మహా దూకుడుగా ఉంటాయి," అని ఆయన చెప్పారు.

ఒంటెలను బయలు ప్రదేశంలో మేయడానికి విడుదల చేయాలని రబారీలు పట్టుబట్టారు. గతంలో పోలీసులు ఒంటెలను నిర్బంధించిన కొన్ని సందర్భాలలో, నిర్బంధంలోనే ఒంటెలు మరణించిన సంఘటనలు ఉన్నాయి.

వీలైనంత త్వరగా రబారీలకు వారి ఒంటెలను తిరిగి అప్పగించాలని స్థానికంగా వారికోసం పనిచేస్తున్న న్యాయవాది మనోజ్ కల్లా దిగువ కోర్టులో కోరుతున్నారు. కచ్ఛ్‌లోని వారి బంధువులు, స్థానికంగా ఉన్న వారి సముదాయపు సభ్యులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చే కొనుగోలుదారులు - అందరూ ఈ కేసును ఎదుర్కోవడానికి, న్యాయవాదులకు చెల్లించడానికి, వారి స్వంత బస కోసం, ఒంటెలకు సరైన మేత కోసం తమ వనరులను సమకూర్చుకున్నారు.

ఈలోగా, ఒంటెలను గోశాల సంరక్షణలో ఉంచారు.

The 58 dromedaries have been kept in the open, in a large ground that's fenced all around. The Rabaris are worried about their well-being if the case drags on
PHOTO • Jaideep Hardikar
The 58 dromedaries have been kept in the open, in a large ground that's fenced all around. The Rabaris are worried about their well-being if the case drags on
PHOTO • Jaideep Hardikar

చుట్టూ కంచె వేసివున్న ఒక పెద్ద మైదానంలో ఈ 58 ఒంటెలను ఉంచారు. కేసు నత్తనడకన సాగితే వాటి బాగోగుల సంగతి ఏమిటని ఆందోళన చెందుతున్న రబారీలు

"మొదట్లో మేం వాటికి ఆహారాన్నందించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కానీ ఇప్పుడు వాటికి ఎటువంటి మేత, ఎంత మోతాదులో ఇవ్వాలో మాకు తెలుసు. ఈ విషయంలో రబారీలు కూడా మాకు సహాయం చేస్తున్నారు," అని పశువుల ఆశ్రయాన్ని నిర్వహిస్తోన్న అమరావతిలోని గౌరక్షణ సమితి కార్యదర్శి దీపక్ మంత్రి చెప్పారు. "మాకు ఇక్కడకు దగ్గరలోనే 300 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అక్కడి నుండి ఒంటెల కోసం పచ్చి, ఎండుటాకులను తీసుకువస్తున్నాం. వాటికి మేతకేమీ కొరత లేదు," అని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడే ఉండే పశువైద్యుల బృందం వచ్చి గాయాలైన కొన్ని ఒంటెలకు చికిత్సను అందించింది. "ఇక్కడ వాటికి చూసుకోవడంలో మాకు ఎటువంటి సమస్య లేదు," అని అతను నొక్కి చెప్పారు.

"ఒంటెలు సరిగ్గా తినడంలేదు," అని పర్బత్ రబారీ చెప్పారు. కోర్టు వాటి నిర్బంధాన్ని ముగించి, వాటిని తిరిగి వాటి యజమానులకు అప్పగిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. "ఇది వాటికి జైలు లాంటిది," అని ఆయన చెప్పారు.

ఇప్పుడు బెయిల్‌పై విడుదలైన వెర్సీభాయి, మిగిలిన నలుగురూ ఇంటికి వెళ్ళిపోవాలనే ఆత్రుతతో ఉన్నారు, కానీ వారి జంతువులను విడుదల చేసి, తిరిగి వారి వద్దకు పంపిస్తేనే వారు వెళ్ళగలరు. "జనవరి 21, శుక్రవారంనాడు ధామణ్‌గావ్ (దిగువ కోర్టు) జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆ 58 ఒంటెలపై తమ యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించమని ఐదుగురు పశువుల కాపరులను అడిగారు," అని రబారీల తరఫున వాదిస్తున్న న్యాయవాది మనోజ్ కల్లా PARIకి చెప్పారు. “జంతువులను కొనుగోలు చేసినట్లు చెప్తున్న వ్యక్తులు ఇచ్చిన రశీదులైనా సరిపోతాయి."

ఈలోగా, ఒంటెలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న రబారీలు కూడా తమ బంధువులతో, ఒంటెల కొనుగోలుదారులతో కలిసి అమరావతిలోని ఆ పశువుల ఆశ్రయంలోనే విడిది చేస్తున్నారు. అందరి దృష్టి ధామణ్‌గావ్ కోర్టుపైనే ఉంది.

ఒంటెలు తమకు ఏమాత్రం అర్థంకాని నిర్బంధంలోనే ఉన్నాయి.

అనువాదం: అపర్ణ తోట

Jaideep Hardikar

ನಾಗಪುರ ಮೂಲದ ಪತ್ರಕರ್ತರೂ ಲೇಖಕರೂ ಆಗಿರುವ ಜೈದೀಪ್ ಹಾರ್ದಿಕರ್ ಪರಿಯ ಕೋರ್ ಸಮಿತಿಯ ಸದಸ್ಯರಾಗಿದ್ದಾರೆ.

Other stories by Jaideep Hardikar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota