ఎగుడుదిగుడు గరుకు గోడకు అడ్డంగా చిరిగిన కాగితపు ముక్క ఒకటి గాలికి ఎగురుతోంది. ఆ లేత పసుపు రంగు కాగితంపై 'చట్టవిరుద్ధం', 'ఆక్రమణ' అనే పదాలు కనిపించీ కనిపించనట్లున్నాయి. 'తొలగింపు' హెచ్చరికపై బురద చిందివుంది. ఒక దేశ చరిత్రను దాని గోడల మధ్య పాతిపెట్టడం కుదిరేపని కాదు. అది సన్నని సరిహద్దు రేఖలను దాటి అణచివేత, ధైర్యం, విప్లవమనే చిహ్నాల మీదుగా, నలుదెసలా వ్యాపిస్తుంది.

ఆమె వీధిలో పడివున్న రాళ్ల, ఇటుకల కుప్పల వైపు చూస్తోంది. రాత్రివేళల్లో ఆమెకు ఇంటిగా మారిపోయే ఆ దుకాణం స్థానంలో అవే మిగిలాయి మరి! 16 సంవత్సరాలుగా ఆమె పగటివేళ అనేకమందికి చెప్పులు అమ్ముతూ, సాయంత్రంవేళల్లో చాయ్ తాగుతూ గడిపిన ప్రదేశమది. ఫుట్‌పాత్‌మీద నిరాడంబరంగా నిలిచివుండే ఆమె సింహాసనం ఇప్పుడు ముక్కలైపోయిన రేకుల పైకప్పు, పగిలిపోయిన సిమెంట్ పలకలు, వంగిపోయిన ఉక్కు కడ్డీల మధ్య ధ్వంసమైన సమాధి రాయిలా నిలిచివుంది.

ఒకప్పుడిక్కడ మరొక బేగం నివసించేది. ఆమే అవధ్ రాణి, బేగం హజ్రత్ మహల్. బ్రిటీష్ పాలన నుండి తన ఇంటిని విడిపించుకోవడానికి సాహసంతో పోరాడిన ఈ రాణి, నేపాల్‌లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. భారతదేశపు తొలి పోరాట యోధులలో ఒకరైన ఈ వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య సమరయోధ, చాలాకాలంగా విస్మృతికి గురైవుంది. ఆమె వారసత్వం కలుషితమై, తుడిచివేయబడింది. సరిహద్దుకు అవతలి వైపున ఉన్న ఖాట్మండూలో ఒక అనాథ శీతల శిలగా నిలిచివుంది.

భారత ఉపఖండంలో అటువంటి లెక్కలేనన్ని సమాధులు, ప్రతిఘటన అవశేషాలు  లోతుగా పాతిపెట్టబడి ఉన్నాయి. కానీ అజ్ఞానం, ద్వేషం అనే బురదను తొలగించడానికి మాత్రం బుల్డోజర్లు లేవు. ఈ మరగున పడిన ప్రతిఘటనా పిడికిళ్ళను తవ్వితీసే యంత్రాలు లేవు. వలసవాద చరిత్రను ధ్వంసం చేసి, ఆ స్థానాన్ని పీడిత వర్గాల గొంతుకలతో భర్తీ చేయగలిగిన బుల్‌డోజర్‌లు లేవు. అన్యాయానికి అడ్డుగా నిలిచేందుకు ఎటువంటి బుల్డోజర్, ఇప్పటికింకా లేదు.

జి . కె . గోకుల్ చదువుతోన్న కవితను వినండి

చక్రవర్తి పెంపుడు జంతువు

మా పొరుగింటి వాకిట్లో
పసుప్పచ్చ చర్మం కింద మాటువేసిన
కొత్త క్రూర మృగమొకటి కనబడింది
దాని పంజా మీదా, కోరల మీదా నిన్నటి తిండి
నెత్తురూ మాంసమూ ఇంకా అతుక్కునే ఉన్నాయి.
ఆ మెకం గాండ్రించింది, తల పైకెత్తింది
ఒక్క ఉదుటున మా పొరుగింటామె మీద దూకింది.
ఆమె పక్కటెముకలను చీల్చి
గుండెను చిదిపేసింది.
రాజుగారి పెంపుడు జంతువు
అడ్డూ ఆపూ లేకుండా
తుప్పుపట్టిన చేతులతో
ఆమె గుండెను బైటికి లాగింది.
అబ్బ, ఎంత తిరుగులేని మెకం అది!
కాని, ఆ మెకం బిత్తరపోయేలా
మా పొరుగింటామె ఛాతీ చీకటి గుయ్యారంలో
ఒక కొత్త హృదయం పుట్టుకొచ్చింది.
గాండ్రిస్తూ ఆ మెకం కొత్త గుండెనూ చీల్చివేసింది.
సరిగ్గా అప్పుడే దాని స్థానంలో మరొక గుండె వికసించింది.
మరొక ఎర్రని హృదయం,
జీవం తొణికిసలాడుతున్న హృదయం.
కొల్లగొట్టిన ప్రతి ఒక్క హృదయానికీ ప్రతిగా
మరొక కొత్తది పుట్టుకొచ్చింది
ఒక కొత్త హృదయం, ఒక కొత్త విత్తనం
ఒక కొత్త పువ్వు, ఒక కొత్త జీవితం
ఒక కొత్త ప్రపంచం.
మా పొరుగింటి వాకిట్లో
ఒక కొత్త మెకం కనబడింది
చేతుల నిండా కొల్లగొట్టిన హృదయాలతో
క్రూర మృగపు మృత కళేబరం

కవితానువాదం: ఎన్. వేణుగోపాల్
వచనానువాదం: సుధామయి సత్తెనపల్లి

Poem and Text : Gokul G.K.

ಗೋಕುಲ್ ಜಿ.ಕೆ. ಕೇರಳದ ತಿರುವನಂತಪುರಂ ಮೂಲದ ಸ್ವತಂತ್ರ ಪತ್ರಕರ್ತ.

Other stories by Gokul G.K.
Illustration : Labani Jangi

ಲಬಾನಿ ಜಂಗಿ 2020ರ ಪರಿ ಫೆಲೋ ಆಗಿದ್ದು, ಅವರು ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದ ನಾಡಿಯಾ ಜಿಲ್ಲೆ ಮೂಲದ ಅಭಿಜಾತ ಚಿತ್ರಕಲಾವಿದರು. ಅವರು ಕೋಲ್ಕತ್ತಾದ ಸಾಮಾಜಿಕ ವಿಜ್ಞಾನಗಳ ಅಧ್ಯಯನ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಕಾರ್ಮಿಕ ವಲಸೆಯ ಕುರಿತು ಸಂಶೋಧನಾ ಅಧ್ಯಯನ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ.

Other stories by Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli
Translator : N. Venugopal

N. Venugopal is an editor at Veekshanam, a Telugu monthly journal of political economy and society.

Other stories by N. Venugopal