ఆ చిన్న గడ్డ గట్టిపడింది.  “ఎముక లాగా” అంది ప్రీతి యాదవ్.

జులై 2020 కు ఆమె తన రొమ్ములో పల్లికాయంత గడ్డని ఆమె కనిపెట్టి సంవత్సరం పైనే అయింది. పట్నా నగరంలోని కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆంకాలజిస్టులు, ఆ రొమ్ములోని గడ్డ ని బయాప్సీ చేయాలని, ఆపరేషన్ ద్వారా దానిని తొలగించాలని చెప్పి కూడా సంవత్సరమయింది.

కానీ ప్రీతి మళ్లీ ఆసుపత్రికి రాలేదు.

“చేయిద్దాము”,విశాలమైన తన ఇంటి ఆవరణలో పూలపొదల మధ్య, బండలు వేసిన వరండాలో ఒక గోధుమ రంగు ప్లాస్టిక్ కుర్చీ మీద కూర్చుని అన్నది ఆమె.

ఆమె మెత్తగా మాట్లాడింది కానీ ఆ మాటలలో అలసట తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె దగ్గర బంధువులలో కనీసం నలుగురు కాన్సర్ వలన చనిపోయారు. బీహార్ లోని సరన్ జిల్లా, సోనేపూర్ బ్లాక్ లో ఉన్న ఆమె గ్రామంలో,  కోవిడ్ 19 మహారోగం మార్చ్ 2020లో మొదలుకాక ముందే, చాలా  కాన్సర్ కేసులు బయటపడ్డాయి. (ఆమె అభ్యర్ధన మేరకు ఆమె ఊరి పేరు, అసలు పేరు ఇక్కడ  ప్రస్తావించడం లేదు)

తన రొమ్ములో పెరిగే గడ్డను ఇప్పుడే తీయించుకోకపోవడం ప్రీతి నిర్ణయం మాత్రమే కాదు. ఆమె కుటుంబం ఆమె కోసం ఒక పెళ్ళికొడుకుని వెతికే పనిలో ఉన్నారు, బహుశా పక్క ఊరిలో ఆర్మీ లో పనిచేసే యువకుడే పెళ్ళికొడుకు కావచ్చు. “నా పెళ్లయ్యాక కూడా  ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా? పైగా డాక్టర్ నాకు పిల్లలు పుడితే ఆ గడ్డ దానంతట అదే తగ్గిపోతుంది, అన్నారు,” ఆమె చెప్పింది.

మరి వారు పెళ్ళికొడుకు కుటుంబానికి ఈ గడ్డ లేచిన విషయం, దానికి అవసరమైన ఆపరేషన్, వారి ఇంట్లో కాన్సర్ వలన కలిగిన చావుల గురించి చెబుతారా? “అదే అర్థం కావడం లేదు,” అన్నదామె. ఆమె ఆపరేషన్ ఆమె పెళ్లితో ముడిబడింది.

Preeti Kumari: it’s been over a year since she discovered the growth in her breast, but she has not returned to the hospital
PHOTO • Kavitha Iyer

ప్రీతి కుమారి : ఆమె రొమ్ములో గడ్డను కనిపెట్టి సంవత్సరమైంది కానీ ఆమె  ఆసుపత్రికి మళ్లీ వెళ్ళలేదు

జియాలజీ లో బిఎస్సి డిగ్రీ చేసిన ప్రీతికి, రొమ్ములో గడ్డ వచ్చినప్పటి నుంచి ఒంటరితనం పెరిగిపోయింది. ఆమె తండ్రి నవంబర్ 2016 లో చనిపోయాడు. చనిపోయే కొన్ని నెలల ముందే ఆయనకు రెక్టల్ కాన్సర్ ఉందని తెలిసింది. దానికి ముందు జనవరిలో ఆమె తల్లి గుండె పోటుతో చనిపోయింది. దానికి ముందు 2013 నుంచి ఎన్నో ఆసుపత్రులలో ఉన్న ప్రత్యేక గుండెజబ్బు విభాగాల నుంచి చికిత్స తీసుకుంటూనే ఉంది. వారిద్దరూ 50ల్లో ఉంటారు. “నేను పూర్తిగా ఒంటరినైపోయాను. మా అమ్మ ఉంది ఉంటే నా కష్టాన్ని అర్ధం చేసుకునేది.” అంది ప్రీతి.

ఆమె చనిపోయే ముందే, అల్ ఇండియా మెడికల్ సైన్స్, న్యూ ఢిల్లీలో వారి కుటుంబంలో క్యాన్సర్లకి కారణం వారు తాగే నీరు కారణం అని కనిపెట్టారు. “ఆ డాక్టర్లు అక్కడ అమ్మకి ఉన్న మానసిక ఒత్తిడుల గురించి అడిగారు. నేను మా ఇంట్లో జరిగిన చావుల గురించి చెప్పాను, వాళ్ళు మేము తాగే నీటి గురించి చాలా ప్రశ్నలు అడిగారు. చాలా  సంవత్సరాలుగా మా ఇంటి చేతి పంపు నుండి నీళ్లు పట్టాక, అవి పసుపుపచ్చగా మారిపోయేవి.” అన్నది ప్రీతి.

భారత దేశం లో ఉన్న ఏడు రాష్టాలలో (మిగిలిన రాష్ట్రాలు అస్సాం, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్)కెల్లా  బీహార్లోనే భూగర్భజలాలు  అత్యంత ఘోరంగా ఆర్సినిక్ తో భద్రతా ప్రమాణాలు దాటి కలుషితమై ఉన్నాయి. బీహార్ లో ప్రీతి ఉంటున్న సరన్ తో కలిపి 18 జిల్లాలలో ఉన్న 57 బ్లాకులలో  అత్యంత అధికమైన పరిమాణంలో ఆర్సినిక్ భూగర్భ జలాల్లో ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు( 2010లో రెండు నివేదికలలో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల  కనుగొన్న సమాచారం ప్రకారం చెప్పిబడింది). అనుమతించబడిన పరిమితి 10 మైక్రో గ్రాములు.

*****

ప్రీతికి రెండు మూడేళ్లుండగానే తన అక్కను కోల్పోయింది. “ఆమెకు ఎప్పుడూ చాలా కడుపు నొప్పి ఉండేది. నాన్న ఆమెను చాలా ఆసుపత్రులకు తీసుకెళ్లాడు, కాని కాపాడలేకపోయాడు.” అన్నదామె. అప్పటి నుంచి ఆమె తల్లి చాలా ఒత్తిడిలో ఉండేది.

ఆ తరవాత ఆమె చిన్నాన్న(తండ్రి సోదరుడు) 2009లో, ఆమె పిన్ని(అతని భార్య) 2012లో చనిపోయారు. వారంతా ఒకే పెద్ద ఇంట్లో ఉండేవారు. వారిద్దరూ బ్లడ్  కాన్సర్ తో చనిపోయారని ఆలస్యంగా చికిత్స తీసుకోవడానికి వచ్చారని డాక్టర్లు చెప్పారు.

2013లో అదే చిన్నాన్న కొడుకు, ప్రీతి 36 ఏళ్ళ అన్న, వైశాలి జిల్లాలో హాజీపూర్ పట్టణం లో చికిత్స తీసుకున్నా కూడా,  బ్లడ్ కాన్సర్ తో చనిపోయాడు.

అనారోగ్యం, మరణాల వలన వారి కుటుంబం కకావికలమైంది. ప్రీతి ఇంటి బాధ్యతను మీద వేసుకుంది. “నేను పదో తరగతి లో ఉన్నప్పటినుంచి, ముందు మా అమ్మా తరవాత మా నాన్నా రోగగ్రస్తులైనప్పుడు నేను ఇంటిని సంబాళించవలసి వచ్చింది. ఒక సమయంలో ప్రతి సంవత్సరం ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయేవారు, లేదా ఎవరోకరు తీవ్రంగా జబ్బుపడేవాళ్లు.”

Coping with cancer in Bihar's Saran district
PHOTO • Kavitha Iyer

కాన్సర్ తో  కష్టపడుతున్న బీహార్ రాష్ట్రం లోని సరన్ జిల్లా

మరి వారు పెళ్ళికొడుకు కుటుంబానికి ఈ గడ్డ లేచిన విషయం, దానికి అవసరమైన ఆపరేషన్, వారి ఇంట్లో కాన్సర్ వలన కలిగిన చావుల  గురించి చెబుతారా? “అదే అర్థం కావడం లేదు,” అన్నదామె. ఆమె ఆపరేషన్ ఆమె పెళ్లితో ముడిబడింది

సేద్య భూమి కలిగిన కుటుంబమూ, ఆ కుటుంబపు బాధ్యతల మధ్య ఆమె చదువు  వెనుకబడిపోయింది. ఆమె ఇద్దరు అన్నలలో ఒకరికి పెళ్లి అయింది, అతని భార్య రావడం వలన ఆమె వంట పని, ఇల్లు శుభ్రం చేసే పని, ఇంట్లో జబ్బు పడేవాళ్ళని చూసుకునే పని కాస్త తేలికైంది. ఈ కుటుంబ ఒత్తిడిని మరికాస్త పెంచడానికి ఆమె చినాన్న కొడుకు  భార్యను పాము కాటేసి ఆమె చనిపోయే పరిస్థితికి వెళ్ళింది. ఆ తరవాత 2019 లో ప్రీతి అన్నలలో ఒకరికి పొలం పనులలో చిన్న పొరపాటు వలన కంటికి గాయం అయి, మళ్లీ ఒక రెండు నెలలు అత్యంత సంరక్షణ అవసరమైంది.

ఆమె తల్లిదండ్రులు చనిపోయాక ప్రీతి జీవితం లో ఆశ అంతరించిపోసాగింది. “ఒకలాంటి నిర్వేదం ఉండేది, చాలా టెన్షన్ పడేదాన్ని”, ఆమె నెమ్మదిగా ఆ మనోవేదన నుండి బయటపడుతున్న సమయంలో, ఆమె రొమ్ములో గడ్డ బయటపడింది.

వారి ఊరిలో అందరి లాగానే, ఈ కుటుంబం కూడా బోరు పంపు నుండి నీళ్లు తెచ్చుకుని దానిని ఫిల్టర్ చేయడం గాని కాగబెట్టడం కానీ చేయకుండా తాగేవాళ్ళు. రెండు దశాబ్దాల వయసు, 120-150 అడుగుల లోతు ఉన్న ఆ బోర్ బావి లో నీరు - బట్టలు ఉతకడానికి, స్నానానికి, తాగడానికి, వంట చేయడానికి ఇలా  వారి అన్ని అవసరాలకు ఉన్న పరిష్కారం. “నాన్న తర్వాత, మేము తాగడానికి, వంట చేయడానికి RO ఫిల్టర్ నీటినే వాడుతున్నాము” అన్నది ప్రీతి. అప్పటికే చాలా పరిశోధనలు, ఆర్సెనిక్ భూగర్భ జలాలని విషపూరితం చేయడం పై వచ్చాయి. జిల్లలో ఉన్నవారు ఈ  నీటిని తాగడం వలన వచ్చే ఇబ్బందులను ప్రమాదాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. RO ప్యూరిఫికేషన్ సిస్టం, పకడ్బందీగా వాడితే, కొంత వరకు తాగునీటిలో ఆర్సినిక్ ని తొలిగించగలదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, 1958 నుండి, ఆర్సెనిక్ ద్వారా కలుషితమైన నీటి ని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల ఆర్సెనిక్ పాయిజన్ లేదా ఆర్సెనికోసిస్, చర్మం, మూత్రాశయం, మూత్రపిండాలు లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు, వ్యాధులకు కూడా దారితీస్తుందని,  చర్మం రంగు పాలిపోవడం, అరచేతులు, అరికాళ్ళపై గట్టి మచ్చలు ఏర్పడడం జరుగుతుందని చెప్పింది. కలుషితమైన నీరు వలన మధుమేహం, రక్తపోటు, పునరుత్పత్తి రుగ్మతల మధ్య సంభావ్య సంబంధాలకు ఆధారాలను నివేదికలు సూచిస్తున్నాయని కూడా WHO తెలిపింది.

2017 మరియు 2019 మధ్య, ఒక ప్రైవేట్ ఛారిటబుల్ ట్రస్ట్ అయిన, పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ పరిశోధన కేంద్రం, దాని ఔట్-పేషెంట్స్ విభాగంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 2,000 మంది క్యాన్సర్ రోగుల రక్త నమూనాలను సేకరించింది. ఇందులో కార్సినోమా రోగులలో రక్త ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. జియోస్పేషియల్ మ్యాప్ బ్లడ్ ఆర్సెనిక్‌ను గంగానది మైదానంలోని క్యాన్సర్ రకాలు, జనాభాతో సంబంధం కలిగి ఉంది.

"అధిక బ్లడ్ ఆర్సెనిక్ గాఢత కలిగిన క్యాన్సర్ రోగులలో ఎక్కువ మంది గంగా నదికి సమీపంలో ఉన్న జిల్లాలలో [సరన్ సహా] ఉన్నారు. వారి పెరిగిన బ్లడ్ ఆర్సెనిక్ గాఢత క్యాన్సర్‌తో ఆర్సెనిక్ కు, ప్రత్యేకించి కార్సినోమాకు బలమైన సంబంధం ఉంది " అని ఈ పరిశోధనపై బహుళ పత్రాలను సహ రచయిత, ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.

'Even if I leave for a few days, people will know, it’s a small village. If I go away to Patna for surgery, even for a few days, everybody is going to find out'

'నేను కొన్ని రోజులు ఈ ఊరిని వదిలి వెళ్లినా జనాలకు తెలుస్తుంది. ఇది చిన్న ఊరు కదా. నేను గనుక పాట్నా కు కొద్ద్ధిరోజులకైనా ఆపరేషన్ కోసం వెళ్తే, వాళ్లు కనిపెట్టేస్తారు'

“ఈ ఏడాది 2019లో, మా ఇన్స్టిట్యూట్ లో 15000 కన్నా ఎక్కువ కాన్సర్ కేసులు వచ్చాయి” - అని జనవరి 2021 నివేదిక లో ఉంది. “"ఎపిడెమియోలాజికల్ డేటా ప్రకారం, గంగా నదికి సమీపంలో ఉన్న నగరాలు లేదా పట్టణాల నుండి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నివేదించబడ్డాయి. బక్సర్, భోజ్‌పూర్, సరన్, పాట్నా, వైశాలి, సమస్తిపూర్, ముంగేర్, బెగుసరాయ్ భాగల్పూర్ జిల్లాల నుండి ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.”

ప్రీతి కుటుంబం, సరన్ జిల్లా లోని  ఆమె గ్రామంలో చాలామంది కాన్సర్ వలన చనిపోయారు, కానీ ఆంకాలజిస్టులను సంప్రదించడం వలన యువతులు చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. ముఖ్యంగా అమ్మాయిలు కాన్సర్ వలన చాలా  వివక్షను ఎదుర్కొంటారు. ప్రీతి సోదరులలో ఒకరు చెప్పినట్లుగా” ఊరిలో మనుషులు మాట్లాడుకుంటారు, కాబట్టి కుటుంబాలన్నీ జాగ్రత్తగా ఉండాలి.”

“నేను కొన్ని రోజులు ఈ ఊరిని వదిలి వెళ్లినా జనాలకు తెలుస్తుంది. ఇది చిన్న ఊరు కదా. నేను గనుక పాట్నా కు కొద్దీ రోజులకైనా ఆపరేషన్ కోసం వెళ్తే, అందరు కనిపెట్టేస్తారు.” అని  ప్రీతి చెప్పింది. “నాకు ఈ నీళ్లలో కాన్సర్ ఉంటుందని ముందే తెలిసి ఉంటే బావుండేది.”

ఆమెతనకు  ప్రేమించే భర్త దొరుకుతాడనే ఆశతోనే ఉంది -  ఆ ఆనందానికి రొమ్ములోని గడ్డ ఏమన్నాఅడ్డు వస్తుందేమో అన్న ఆందోళన కూడా ఉంది.

*****

“ఆమె తన పుట్టబోయే బిడ్డకు పాలు ఇవ్వగలుగుతుందా?”

రాముని దేవి యాదవ్ లో ఈ ప్రశ్న, వార్డులోనే తన పడకకు నాలుగు పడకల అవతల ఉన్న 20 ఏళ్ళ అమ్మాయి గురించి ఉంది. అది 2015 వేసవి. “కనీసం నా రొమ్ము ఆపరేషన్ పెద్ద వయసులో జరిగింది. నా కొడుకులు బాగా పెద్దయ్యాకే నాకు రొమ్ము కాన్సర్ వచ్చింది. మరి చిన్న వయసులో అమ్మాయిల సంగతేంటి?” అన్నది 58 ఏళ్ళ రామునిదేవి.

ప్రీతి వాళ్ల ఊరికి 140 కిలోమీటర్ల దూరంలో, బక్సర్ జిల్లా, సిమ్రీ బ్లాక్ లో, బేడ్కరాజపూర్ గ్రామంలో, యాదవులకు 50 భీగాల భూమి ఉంది. వీరికి రాజకీయ బలమెక్కువ. రాయపూర్ కళ్యాణ్ పంచాయత్ లో(అందులోనే ఆమె గ్రామం ఉంది) ఒకవేళ కోవిడ్ వలన జరిగిన ఒక ఏడాది ఆలస్యం తీరితే, ఆరేళ్ళు కాన్సర్ తో పోరాడిన రాముని దేవి ఎలెక్షన్లలో ముఖీయాగా పోటీ చెయ్యాలని అనుకుంటోంది.

Ramuni Devi Yadav: 'When a mother gets cancer, every single thing [at home] is affected, nor just the mother’s health'
PHOTO • Kavitha Iyer

రాముని దేవి యాదవ్ : ఇంట్లో తల్లికి కాన్సర్ వస్తే తల్లి మీద మాత్రమే కాక ఇంట్లో ఉన్న అన్నిటి పై ప్రభావం పడుతుంది

రాముని భోజపురి మాత్రము మాట్లాడగలదు. కానీ ఆమె కొడుకులు, భర్త ఉమా శంకర్ యాదవ్ వెంటనే తర్జుమా చేసి ఆమెకు చెప్పగలరు. బడ్కా రాజపూర్ లో కాన్సర్ కేసులు చాలా ఉన్నాయి అని చెప్పారు ఉమా శంకర్. ఈ 18 జిల్లాల్లో 57 బ్లాకుల్లో భూగర్భ జలాల్లో అధిక ఆర్సెనిక్ ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రిపోర్ట్ లో ఉంది. ఇందులో బక్సర్ జిల్లా కూడా ఉంది.

అప్పుడే వచ్చిన పంట- ఒక ట్రక్ లోడ్ పనసకాయలు, మాల్దా మామిడికాయల సంచుల మధ్య నడుస్తూ, రాముని దేవి ఆమె కుటుంబం ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉందొ ఆమెకు ముందు తెలియజేయలేదన్నది. ఈ మధ్య జరిగిన ఆపరేషన్ తర్వాత ఆమె  ఇప్పుడు రేడియేషన్ చికిత్స తీసుకుంటున్నది.

“మొదట్లో మాకు ఇదేంటో తెలీదు. అలా తెలియకపోవడం చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టింది.” అన్నదామె ఉత్తరప్రదేశ్ పక్కన ఉన్న బనారస్ లో (యాదవులు అక్కడే ఉండేవారు)  ఆమె మొదటి ఆపరేషన్ అయినప్పుడు ఆమె రొమ్ములో గడ్డను తీసివేశారు కానీ అది మళ్లీ పెరగడం మొదలైంది, బాగా నొప్పి కలిగేది. వారు అదే సంవత్సరం, 2014లో, బెనారస్ కు వెళ్లారు. అక్కడే ఆమెకు మొదటి ఆపరేషన్ అయింది.

“కానీ ఇక్కడున్న డాక్టర్ వద్ద మేము బ్యాండేజ్ మార్పించుకోడానికి వెళ్తే గాయం చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పారు,” అన్నాడు ఉమా శంకర్. యాదవులు ఇంకో రెండు ఆసుపత్రులు తిరిగాక అప్పుడు పాట్నా లోని మహావీర్ కాన్సర్ సంస్థాన్ కి 2015 సంవత్సరం మధ్యలో వెళ్లారు.

ఉన్న ఊరు నుండి నెలల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరగడం వలన కుదురుగా సాగే మామూలు కుటుంబ జీవితాన్ని, తన జబ్బు ఒక క్రమం లేకుండా మార్చేసింది అన్నది రాముని. “ఒక తల్లికి కాన్సర్ వస్తే, ఆమె ఆరోగ్యం పైనే కాక,  ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విషయం మీద దాని ప్రభావం  ఉంటుంది. ఆ సమయంలో నాకు ఒక్క కోడలు మాత్రమే ఉంది, మిగిలిన ముగ్గురు అబ్బాయిలకు తరవాతే పెళ్లయింది. అన్ని పనులు ఆ ఒక్క కోడలే చెయ్యలేకపోయేది.”

ఆమె కొడుకులకు ఉండుండి చర్మ వ్యాధులు వచ్చేవి, ఇప్పుడు వాటికి కారణం చేతి పంప్ ద్వారా వచ్చే నీటి ద్వారానే అని చెబుతారు. వారి బోర్ బావికి 25 ఏళ్ళ వయస్సుంది, ఇది 100-150 అడుగుల లోతున ఉంది. ప్రతిసారి రాముని కెమోథెరపీలకు, ఆపరేషన్లకు, రేడియేషన్ థెరపీలకు వెళ్ళినప్పుడు ఇంట్లో గందరగోళం అయ్యేది. ఒక కొడుకు బాక్సర్ నుండి వస్తు పోతూ ఉండేవాడు అతను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోస్టింగ్ నుండి అప్పుడే వచ్చాడు, ఇంకో కొడుకు పక్క ఊరిలో టీచర్ ఉద్యోగం చేసేవాడు, అది అతనిని రోజంతా ఖాళీ లేకుండా ఉంచేది, ఇది గాక మళ్లీ పొలం పనులు చూసుకోవాల్సి వచ్చేది.

“పోయినసారి అయిన  ఆపరేషన్ తరవాత నేను ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయిని నా ఆసుపత్రి వార్డ్ లో  చూసాను. నేను ఆమె దగ్గరకు వెళ్లి నా ఆపరేషన్ మచ్చని చూపించి, కంగారు పడవద్దని చెప్పాను. ఆమెకి కూడా నాలాగా రొమ్ము కాన్సర్ ఉంది, వాళ్ళ పెళ్ళయ్యి కొన్ని నెలలే అయినాయి, అయినా ఆమె భర్త ఆమెని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఆ తరవాత ఆమె తన బిడ్డ కు పాలు ఇవ్వగలదని డాక్టరు నాకు చెప్పాడు. అది విని నాకు చాలా సంతోషమైంది.” రాముని అన్నది.

Ramuni Devi and Umashankar Yadav at the filtration plant on their farmland; shops selling RO-purified water have also sprung up
PHOTO • Kavitha Iyer

రాముని దేవి, ఉమా శంకర్ యాదవ్ వారి సేద్య భూమిలోని ఫిల్టరేషన్ ప్లాంట్ లో, RO ప్యూరిఫైడ్ నీళ్లు కూడా షాపుల్లో లభిస్తున్నాయి

ఆమె కొడుకు శివాజిత్ బడ్కా  రాజపూర్ లో భూగర్భజలాలు విపరీతంగా కలుషితమైపోయాయి అని చెప్పాడు. “మేము ఆరోగ్యానికి, తాగే నీటికి మధ్య సంబంధాన్ని మా అమ్మ ఆరోగ్యం పాడయ్యే వరకు అర్థం చేసుకోలేదు. కానీ ఇక్కడి నీరు విచిత్రమైన రంగులో ఉంటుంది. 2007 వరకు అంతా బాగానే ఉంది, కానీ ఆ తరవాత నీరు పసుపు రంగులోకి మారుతోందని గమనించాము. ఇప్పుడు మేము భూగర్భ నీరు బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికే వాడతాము.” అన్నాడు.

వండడానికి తాగడానికి వాళ్లు, కొన్నిసంఘాలు కలిసి స్థాపించిన  ఫిల్టరేషన్ ప్లాంట్ లోవి తెచ్చుకుంటున్నారు. ఈ ప్లాంట్ లోని నీటిని 250 కుటుంబాలు ఉపయోగించుకుంటున్నాయి. కానీ దీనిని ఏర్పరిచింది మాత్రం యాదవ్ వాళ్ళ భూమిలోనే. సెప్టెంబర్ 2020 లోనే ఇది వచ్చింది. నివేదికల ప్రకారం చూస్తే నీరు 1999 నుండే కలుషితమైంది.

ఆ ఫిల్టరేషన్ ప్లాంట్ పెద్దగా విజయవంతమవలేదు. వేసవికాలంలో నీళ్లు చాలా వేడిగా ఉంటాయని ఊరిలో వారు చెబుతారు. చుట్టుపక్క ఊర్ల  షాపుల్లో 20-30 రూపాయలకు RO ప్యూరిఫైడ్ నీళ్లు 20 లీటర్ల క్యానుల్లో దొరుకుతాయి, అన్నాడు శివాజిత్, కానీ ఈ నీళ్లు నిజంగా ఆర్సెనిక్ లేకుండా ఉన్నావా లేదా ఎవరికీ తెలీదన్నాడు.

ఉత్తర మరియు తూర్పు భారతదేశంలోని ఆర్సెనిక్ ప్రభావిత నదీ మైదానాలు హిమాలయాలలో ఉద్భవించే నదీ మార్గాలను చుట్టుముట్టాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గంగానది మైదానాలలో ఇలా నీళ్లు విషపూరితం, కలుషితం అవడానికి భౌగోళిక కారణాలున్నాయి - నిస్సారమైన జలాశయాలలో ఆక్సీకరణ కారణంగా ఆర్సెనిక్ వంటి హానికరమైన ఖనిజాల నుండి ఆర్సెనిక్ విడుదల అవుతుంది. నీటిపారుదల కోసం భూగర్భజలాలను అధికంగా వినియోగించడం వల్ల భూగర్భాన నీటిని తగ్గించడం కూడా కొన్ని గ్రామాల్లో పెరుగుతున్న కాలుష్యానికి కారణం కావచ్చు.

"రాజమహల్ బేసిన్‌లో గోండ్వానా బొగ్గు సీమ్‌లతో సహా అవక్షేపణ ఆర్సెనిక్ యొక్క అనేక వనరులు ఉన్నాయని మేము అనుకుంటున్నాము, ఇందులో ఆర్సెనిక్, మిలియన్ (ppm) కు 200 భాగాలు ఉంది; డార్జిలింగ్ హిమాలయాలలో సల్ఫైడ్‌ల వివిక్త అవుట్‌క్రాప్స్ లో 0.8% ఆర్సెనిక్ ఉంటుంది; గంగా నది వ్యవస్థ ఎగువ భాగంలో ఉన్న ఇతర వనరులు, ”అని ఎస్‌కె ఆచార్య, గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతరులు 1999 లో నేచర్ మ్యాగజైన్‌లో ఒక పేపర్‌ లో రాశారు.

నిస్సారమైన చాలా లోతైన బావులు తక్కువ ఆర్సెనిక్ కాలుష్యాన్ని కలిగి ఉన్నాయని అధ్యయనాలు గమనించాయి- కలుషితమైన బావులు 80 నుండి 200 అడుగుల లోతు పరిధిలో ఉంటాయి. తన ఇనిస్టిట్యూట్ విస్తృత అధ్యయనం కోసం నీటి నమూనాలను పరీక్షిస్తున్న  డాక్టర్ కుమార్,  తన గమనింపులు గ్రామాల్లోని ప్రజల అనుభవాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు - వర్షపు నీరు, నిస్సారమైన తవ్విన బావులు తక్కువ ఆర్సెనిక్ కాలుష్యాన్ని చూపుతాయి, అయితే చాలా ఇళ్లలో వేసవి నెలల్లో బోర్‌వెల్ నీరు రంగు మారినట్లు తెలుస్తోంది.

*****

Kiran Devi, who lost her husband in 2016, has hardened and discoloured spots on her palms, a sign of arsenic poisoning. 'I know it’s the water...' she says
PHOTO • Kavitha Iyer
Kiran Devi, who lost her husband in 2016, has hardened and discoloured spots on her palms, a sign of arsenic poisoning. 'I know it’s the water...' she says
PHOTO • Kavitha Iyer

2016లో తన భర్తను కోల్పోయిన కిరణ్ దేవి తన చేతి మీద ఉన్న తెల్లమచ్చల్ని చూపించింది. ఇది ఆర్సినిక్ వలన జరిగిన విషపూరిత పరిణామం. “నాకు ఇది నీటివలనే వచ్చిందని తెలుసు,” అన్నది

బాడ్కా రాజపూర్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో తిలక్ రాయ్ కా హత్థా అనే ఊరులో 340 ఇల్లు ఉన్నాయి, ఇది బక్సర్ జిల్లాలో ఉంది. ఇందులో భూమిలేని వారే ఎక్కువ. ఇక్కడ కొందరి ఇళ్లలో ఉన్న చేతి పంపుల నుంచి మురుగు నీరు బయటకు వస్తుంది.

2013-14 లో మహావీర్ కాన్సర్ సంస్థాన్ వారు చేసిన పరిశోధనలో భూగర్జ్ జలాల్లో  ఆర్సినిక్ గాఢత చాలా ఎక్కువగా ఉందని తెలిసింది. ఇది పశ్చిమ భాగాలైన తిలక్ రాయి కా హత్థా కి లో ఇంకా ఘోరంగా ఉంది, అన్నారు ఈ పరిశోధన యొక్క ముఖ్యమైన పరిశోధకుడు, డా. కుమార్. ఆర్సెనికోసిస్ సాధారణ లక్షణాలు ఈ ఊరిలో బాగా కనపడ్డాయి అని  చెప్పారు. 28 శాతం మందికి హైపర్ కెరటోసిస్(మచ్చలు) వారి చేతుల మీద పాదాల పైన, 31 శాతానికి చర్మ పిజిమెంటేషన్ లేదా మెలనోసిస్, 57 శాతం మందికి లివర్ కి సంబంధించిన సమస్యలు, 86 మందికి గాస్త్రైటిస్, 9 శాతం ఆడవారికి రుతుక్రమం సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలున్నాయని తేల్చారు.

కిరణ్ దేవి భర్త ఈ గ్రామంలో బిచ్చు కా డేరా అనే ప్రదేశంలోని మట్టి ఇళ్ల మధ్యలో ఉండేవాడు.  “ఆయన 2016 లో  చాలా కడుపు నొప్పిని అనుభవించి చనిపోయాడు.” అన్నది ఆమె. ఆయన కుటుంబం సిమ్రీలో, బాక్సర్లో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే రకరకాల  అభిప్రాయలు చెప్పారు. “అది టి బి కానీ, లివర్ కాన్సర్ కానీ అయుండొచ్చు అన్నారు,” అన్నది 50 ఏళ్ళ కిరణ్. వాళ్ళకి ఒక చిన్న భూమి చెక్క ఉంది, కానీ ఆమె భర్త రోజు కూలీ సంపాదన పైనే ఎక్కువగా ఆధారపడేవాడు.

కిరణ్ దేవి 2018 లో ఆమె అరచేతుల మీద తెల్లమచ్చలను చూసింది, ఆర్సినిక్ వలన శరీరం విషపూరితం అయిందని తెలిపే లక్షణం ఇది. “ఇది నీళ్ల వలన జరిగినదని నాకు తెలుసు, కానీ నా చేతి పంపు వాడకుండా ఎక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకోను?”, ఆమె ఇంటి బయట, ఒక చిన్న ఇరుకు సందులో, ఎద్దు తన మేతను తీరికగా నెమరువేసే చోట దాటగానే, ఆమె చేతి పంపు ఉంది.

నీటి నాణ్యత, వర్షాకాలం కాని సమయంలో(నవంబర్ నుండి మే వరకు) ఇంకా ఘోరంగా ఉంటుందని, కప్పులో నీళ్ల టీ లాగా ఉంటుంది అని చెప్పింది. “మేము తిండి కోసం ఇంకా గిజగిజ లాడుతున్నాము. పాట్నా వరకు వెళ్ళి డాక్టర్లకు చూపించుకుని  టెస్టులు ఎలా చేయించుకోగలము?” అని అడిగింది.  ఆమె అరచేతులు విపరీతంగా దురద వేస్తున్నాయి, ఆమె బట్టల సబ్బు ముట్టుకున్నా, పేడ ఎత్తినా, అవి విపరీతంగా మంటపెడతాయి.

“ఆడవారికి, నీటికి దగ్గర సంబంధముంది.” రాముని చెప్పింది. “ఎందుకంటే ఇల్లు నడిచేది వీటితోనే”, కాబట్టి నీరు కలుషితమైతే, ఆడవారి పైనే ఎక్కువ ప్రభావముండేది.” పైగా కాన్సర్ పేషెంట్ల పై ఉండే చిన్నచూపు వలన చికిత్స కోసం వెళ్ళడానికి కూడా ఇక్కడి ఆడవారు బాగా ఆలస్యం చేస్తారు, అని చేప్పారు ఉమాశంకర్.

రామునికి రొమ్ము కాన్సర్ రాగానే, ఆ గ్రామ ఆంగవాడి నీటి నాణ్యతను గురించి అవగాహన సదస్సుని ఏర్పాటుచేసామని చెప్పారు. ఆమెని ముఖియాగా ఎన్నుకుంటే, ఆమె ఇంకా చాలా కార్యాలు చేసే ఉద్దేశ్యంలో ఉంది. “అందరూ వారి ఇళ్లలో RO నీటిని కొనుక్కోలేరు”, అన్నదామె.  “అందరు ఆడవారు అంత  తేలికగా ఆసుపత్రికి వెళ్ళలేరు. వీటి పరిష్కారానికి వేరే మార్గాలు వెతకాలి.”

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని మళ్లీ ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి మెయిల్ చేసి అందులోనే [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: అపర్ణ తోట

Kavitha Iyer

ಕವಿತಾ ಅಯ್ಯರ್ 20 ವರ್ಷಗಳಿಂದ ಪತ್ರಕರ್ತರಾಗಿದ್ದಾರೆ. ಇವರು ‘ಲ್ಯಾಂಡ್‌ಸ್ಕೇಪ್ಸ್ ಆಫ್ ಲಾಸ್: ದಿ ಸ್ಟೋರಿ ಆಫ್ ಆನ್ ಇಂಡಿಯನ್ ಡ್ರಾಟ್’ (ಹಾರ್ಪರ್ ಕಾಲಿನ್ಸ್, 2021) ನ ಲೇಖಕಿ.

Other stories by Kavitha Iyer
Illustration : Priyanka Borar

ಕವರ್ ಇಲ್ಲಸ್ಟ್ರೇಷನ್: ಪ್ರಿಯಾಂಕಾ ಬೋರಾರ್ ಹೊಸ ಮಾಧ್ಯಮ ಕಲಾವಿದೆ. ಹೊಸ ಪ್ರಕಾರದ ಅರ್ಥ ಮತ್ತು ಅಭಿವ್ಯಕ್ತಿಯನ್ನು ಕಂಡುಹಿಡಿಯಲು ತಂತ್ರಜ್ಞಾನವನ್ನು ಪ್ರಯೋಗಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಅವರು ಕಲಿಕೆ ಮತ್ತು ಆಟಕ್ಕೆ ಎಕ್ಸ್‌ಪಿರಿಯೆನ್ಸ್ ವಿನ್ಯಾಸ‌ ಮಾಡುತ್ತಾರೆ. ಸಂವಾದಾತ್ಮಕ ಮಾಧ್ಯಮ ಇವರ ಮೆಚ್ಚಿನ ಕ್ಷೇತ್ರ. ಸಾಂಪ್ರದಾಯಿಕ ಪೆನ್ ಮತ್ತು ಕಾಗದ ಇವರಿಗೆ ಹೆಚ್ಚು ಆಪ್ತವಾದ ಕಲಾ ಮಾಧ್ಯಮ.

Other stories by Priyanka Borar
Editor and Series Editor : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota