ధడ్‌గావ్ ప్రాంతంలోని అక్రాని తాలూకాలో ఒక రోజు మధ్యాహ్నం పూట బాగా ఎండ కాసి ఉన్నప్పుడు తన తల మీద పైట కప్పుకుని ఉన్న శెవాంత తడ్వీ తన మేకల మంద వెనుక పరిగెడుతున్నారు. ఏదైనా మేక పిల్ల పొదల్లోకి లేక ఇతరుల పొలంలోకి దూరబోతే, ఆమె తన కర్రను నేలపై బాది ఆ మేక పిల్లను అదుపులోకి తెచ్చి తిరిగి మందలోకి తీసుకువస్తారు. “వాటిపై నేను ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉండాల్సిందే. మేక పిల్లలకు అల్లరి ఎక్కువ. అటు ఇటు పరిగెడుతూనే ఉంటాయి” అని ఆమె చిరునవ్వు నవ్వారు. “ఇప్పుడు అవే నా కన్నబిడ్డల్లాంటివి.”

నందర్బార్ జిల్లాలోని హరన్‌ఖూరీ గ్రామంలోని మహారాజపద అనే తండాలోని తన ఇంటి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరాన ఉన్న అడవి వద్దకు ఆమె నడిచి వచ్చారు. ఇక్కడ ఒంటరిగా తన మేకలు, కిలకిలమనే పక్షులు, గాలికి ఊగుతూ శబ్దం చేసే చెట్ల మధ్య ఆమె ఏకాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు. 12 ఏళ్ల ముందు తనకు పెళ్లి అయినప్పటి నుండి ఆమెను వాంజోతి (గొడ్రాలు), దాల్‌భద్రీ (శపించబడ్డది) మరియు దుష్ట్ (దుష్టమైనది) అనే పేర్లతో నిందించేవారు. ఆ మాటల నుండి ఈ అడవిలో ఆమెకు స్వేచ్ఛ లభించింది.

“పిల్లలు కనలేని మగవాళ్లకు మాత్రం అలాంటి నీచమైన పదం లేదెందుకు?” అని శెవాంత అడిగారు.

ఇప్పుడు 25 ఏళ్లున్న శెవాంతకు (నిజం పేరు కాదు) 14 ఏళ్ల వయసప్పుడే పెళ్లి చేశారు. ఆమె భర్త రవి (32) ఒక రైతు కూలీ. ఆయనకు పని దొరికినప్పుడు రోజుకు దాదాపు రూ. 150 సంపాదిస్తారు. ఆయన మద్యానికి బానిస కూడా. వారిద్దరూ, మహారాష్ట్రలో ప్రధానంగా ఆదివాసీలు నివసించే ఈ జిల్లాలో భీల్ అనే ఆదివాసీ వర్గానికి చెందిన వారు. అంతకు ముందు రోజు రవి (నిజం పేరు కాదు) ఆమెపై మళ్లీ చేయి చేసుకున్నారని శెవాంత చెప్పారు. “ఇదేమీ కొత్త కాదు” అని ఆమె నిట్టూర్చారు. “నేను ఆయనకు సంతానాన్ని ఇవ్వలేను. నా గర్భసంచిలో లోపం ఉండటం వల్ల నేను మళ్లీ గర్భం దాల్చలేనని డాక్టరు చెప్పారు.”

గర్భసంచిలో లోపం అని శెవాంత అని చెబుతోన్న వ్యాధి అసలు పేరు పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పి. సి. ఒ. ఎస్). 2010లో ధడ్‌గావ్ గ్రామీణ ఆసుపత్రిలో ఆమెకు గర్భ స్రావం అయినప్పుడు దీనిని నిర్ధారించారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 15 ఏళ్లే, అయినా మూడు నెలల గర్భవతిగా ఉన్నారు.

When Shevanta Tadvi is out grazing her 12 goats near the forest in Maharajapada hamlet, she is free from taunts of being 'barren'
PHOTO • Jyoti

మహారాజపద తండా దగ్గర ఉండే అడవి దగ్గరికి శెవాంత తడ్వీ తన 12 మేకలను మేత కోసం తీసుకెళ్లినప్పుడు, తాను ఒక గొడ్రాలు అనే సూటి పోటి మాటలను వినాల్సిన అగత్యం తప్పుతుంది

పి. సి. ఒ. యెస్. అనేది, పిల్లలను కనే వయస్సులో ఉండే మహిళలలో కొందరికి వచ్చే ఒక హార్మోనల్ డిజార్డర్. దీని వల్ల రుతుస్రావం క్రమం తప్పడం లేదా సుదీర్ఘ కాలం పాటు అవడం జరుగుతుంది. దీని వల్ల ఒంట్లోని యాండ్రోజెన్ అనే హార్మోన్ స్థాయి పెరిగి, ఓవరీల పరిమాణం పెరిగి, అండాల చుట్టూ ఫాలికిల్స్ ఏర్పడతాయి. ఈ డిజార్డర్ వల్ల, వంధ్యత్వం (పిల్లలు పుట్టకపోవడం), గర్భస్రావం కలగడం లేదా నెలలు నిండకముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

“పి. సి. ఒ. ఎస్. మాత్రమే కాక అనీమియా, సికిల్ సెల్, శుభ్రత పాటించకపోవడం, ఇంకా లైంగికంగా వ్యాపించే వ్యాధుల వల్ల కూడా మహిళలలో వంధ్యత్వం కలుగుతుంది” అని ముంబైకు చెందిన భారతీయ అబ్స్‌టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఫెడరేషన్ ఛెయిర్‌పర్సన్ అయిన డా. కోమల్ చవాన్ చెప్పారు.

2010 మే నెలలో తనకు గర్భ స్రావం అయ్యి పి. సి. ఒ. ఎస్. ఉందని నిర్ధారణ అయిన రోజును శెవాంత గుర్తు చేసుకున్నారు. ఆ రోజు మండుటెండలో ఆమె పొలాన్ని దున్నుతూ ఉన్నారు. “ఆ రోజు ఉదయం నుండి నాకు పొత్తి కడుపులో నొప్పి ఉండింది” అని ఆమె గుర్తుచేసుకున్నారు. “నాతో కలిసి డాక్టరు వద్దకు రావడానికి నా భర్త నిరాకరించారు. దాంతో నేను ఆ నొప్పిని విస్మరించి అలాగే పనిలోకి వెళ్లిపోయాను. మధ్యాహ్నం అయ్యే సరికి, ఆ నొప్పి భరించలేనంతగా పెరిగింది. నాకు రక్తస్రావం అవ్వసాగింది. నా చీర రక్తంతో తడిసిపోయింది. అసలేం జరుగుతోందో నాకు అర్థం కాలేదు,” అని ఆమె చెప్పారు. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో ఇతర వ్యవసాయ కార్మికులు ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధడ్‌గావ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

పి. సి. ఒ. ఎస్ నిర్ధారణ అయిన తర్వాత, ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.

ఆమెలోని శారీరిక సమస్య వల్ల పిల్లలు కనలేకపోతోందనే విషయాన్ని ఆమె భర్త ఒప్పుకోవట్లేదు. “అసలు ఆయన డాక్టరును కలిస్తే కదా, నాకు ఎందుకు పిల్లలు పుట్టడం లేదో అర్థమయ్యేది?” అని శెవాంత అడిగారు. దానికి బదులుగా, ఆయన ఆమెపై తరచుగా లైంగిక రక్షణ లేకుండానే సెక్స్‌లో పాల్గొంటాడు, కొన్ని సార్లు లైంగికంగా దాడి కూడా చేశాడు. “అంతగా ప్రయత్నించిన తర్వాత కూడా నాకు మళ్లీ పీరియడ్స్ వస్తే, ఆయన దౌర్జన్యం[సెక్స్ సమయంలో] ఇంకా పెరిగిపోతుంది,” అని శెవాంత చెప్పారు. “అది [సెక్స్] నాకు నచ్చదు,” అని ఆమె చెప్పారు. “చాలా నొప్పిగా ఉంటుంది, కొన్ని సార్లు మంట పుడుతుంది, దురదగా కూడా ఉంటుంది. ఇలాగే పదేళ్లుగా కొనసాగుతోంది. మొదట్లో నేను ఏడ్చే దానిని, ఆ తర్వాత ఏడవడం ఆపేశాను.”

తనకు పిల్లలు పుట్టకపోవడం, సమాజంలో అందరూ చిన్న చూపు చూడటం, తద్వారా కలిగే ఆత్మన్యూనత మరియు ఒంటరితనం, ఇవన్నీ తన తలరాతేనని ఆమె ఇప్పుడు నమ్ముతున్నారు. “పెళ్లి కాక ముందు నేను ఎంతో చలాకీగా గలగలా మాట్లాడేదానిని. నేను ఇక్కడికి వచ్చిన మొదట్లో ఇరుగు పొరుగు మహిళలంతా ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు. అయితే, పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత కూడా నాకు పిల్లలు పుట్టలేదని తెలిశాక, వాళ్లు నాకు దూరంగా ఉండటం మొదలు పెట్టారు. వాళ్లకు పుట్టిన పసికందుల దగ్గరికి నన్ను రానివ్వరు. నేను ఒక పాపిష్టి దానినని అంటారు.”

Utensils and the brick-lined stove in Shevanta's one-room home. She fears that her husband will marry again and then abandon her
PHOTO • Jyoti

ఒకే రూమ్ ఉన్న శెవాంత ఇంట్లో వంట పాత్రలు, ఇటుకలతో చేసిన పొయ్యి. తన భర్త మళ్లీ పెళ్లి చేసుకుని తనను వదిలేస్తాడేమోనని ఆమె భయపడుతున్నారు

ఒకే ఒక్క రూములో కొన్ని వంట పాత్రలు, ఇటుకల పొయ్యి మాత్రమే ఉన్న ఇంట్లో అలసిపోయి, ఒంటరితనంతో బాధపడుతోన్న శెవాంత, తన భర్త వేరొక పెళ్లి చేసుకుంటాడనే భయంతో సతమతమవుతున్నారు. “నాకు వేరే దారేదీ లేదు” అని ఆమె చెప్పారు. “నా తల్లిదండ్రులు పూరి గుడిసెలో బ్రతుకుతూ ఇతరుల పొలాల్లో పని చేసి రోజుకు రూ. 100 చొప్పున సంపాదిస్తారు. నాకున్న నలుగురు చెల్లెళ్లు తమ తమ జీవితాల్లో మునిగిపోయి ఉన్నారు. నా అత్త మామలు నా భర్తకు పెళ్లి సంబంధాల కోసం అమ్మాయిలను చూపిస్తున్నారు. ఆయన నన్ను వదిలేస్తే, నాకు దిక్కేది?”

శెవాంతకు సంవత్సరంలో దాదాపు 160 రోజుల పాటు, రోజుకు రూ. 100 చొప్పున రైతు కూలీగా పని దొరుకుతుంది. అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు ఒక నెలకు రూ. 1,000 - 1,500 లభిస్తుంది. అయినప్పటికీ ఈ మోస్తారు ఆదాయాన్ని ఖర్చు చేసే విషయంలో కూడా ఆమెకు నియంత్రణ ఉండదు. “నా దగ్గర రేషన్ కార్డు లేదు” అని ఆమె చెప్పారు. “బియ్యం, జొన్న పిండి, నూనె మరియు ఖారం పొడి కొనడానికి గాను నెలకు దాదాపు రూ. 500 ఖర్చు చేస్తాను. మిగిలిన డబ్బంతా నా భర్త తీసుకునేస్తాడు. నా వైద్య ఖర్చులకే కాదు, అసలు ఇంటి ఖర్చులకు తనను డబ్బు అడిగినా ఇవ్వడు, అడిగినందుకు కొడతాడు. తాను అప్పుడప్పుడు సంపాదించే డబ్బును మద్యంపై కాక ఇంకే దానిపై ఖర్చు పెడతాడో నాకు తెలియదు.”

ఒకప్పుడు తాను ఎంతో మమకారంతో పెంచుకునే మేకలు 20 ఉండేవి, కానీ తన భర్త ఒక్కొక్కటిగా వాటిని అమ్మేయడంతో, ఇప్పుడు కేవలం 12 మాత్రమే మిగిలాయి.

ఇటువంటి ఆర్థికపరమైన ఒత్తిడిలోనూ తన తండాకు 61 కిలోమీటర్ల దూరంలోని షహాదె పట్టణంలో ఒక ప్రైవేట్ డాక్టర్ వద్ద వంధ్యత్వానికి చికిత్స పొందడానికి శెవాంత కొంత డబ్బును ఆదా చేయగలిగారు. అండోత్పాదనను ప్రేరేపించేందుకు 2015లో మూడు నెలల పాటు, ఆ తర్వాత 2016లో మరో మూడు నెలల పాటు క్లోమిఫీన్ థెరపీపై రూ. 6,000 ఖర్చు చేశారు. “అప్పట్లో ధడ్‌గావ్ ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేవు, అందుకే మా అమ్మతో కలిసి షహాదెలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను,” అని ఆమె నాతో చెప్పారు.

2018లో అదే చికిత్సను ధడ్‌గావ్ గ్రామీణ ఆసుపత్రిలో ఉచితంగా పొందగలిగారు. అయితే మూడవసారి కూడా అది విఫలమైంది. “ఆ తర్వాత చికిత్స గురించి నేను ఆలోచించడం ఆపేశాను,” అని శెవాంత నిరాశతో చెప్పారు. “ఇక నా మేకలే నాకు పిల్లలు.”

Many Adivasi families live in the hilly region of Dhadgaon
PHOTO • Jyoti

ధడ్‌గావ్‌లోని పర్వత ప్రాంతాలలో ఎన్నో ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి

“చికిత్స ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది” అని ధడ్‌గావ్ గ్రామీణ ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ మరియు గ్రామీణ వైద్యాధికారి డా. సంతోష్ పర్మార్ చెప్పారు. 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రి, చుట్టుపక్కల 150 గ్రామాలకు చెందిన రోగులకు సేవలందిస్తూ, ప్రతి రోజు అవుట్-పేషెంట్ విభాగంలో దాదాపు 400 మంది రోగులకు చికిత్సనందిస్తోంది. “క్లోమిఫీన్ సిట్రేట్, గొనాడోట్రోపిన్స్ మరియు బ్రోమోక్రిప్టిన్ వంటి మందులు కొందరిపై పని చేస్తాయి. ఇతరులలో అధునాతనమైన ప్రత్యుత్పత్తి సహాయక టెక్నాలజీలు అవసరం అవుతాయి, ఉదా ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF), ఇంట్రాయుటెరిన్ ఇన్‌సెమినేషన్ (IUI) వంటివి.”

ధడ్‌గావ్ ఆసుపత్రిలో వీర్య కణాల విశ్లేషణ, స్పెర్మ్ కౌంట్, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, జననాంగాల పరిశీలన వంటి సాధారణ పరీక్షలకు మాత్రమే ఆస్కారం ఉంది అని పర్మార్ చెప్పారు. అంతకు మించి అధునాతనమైన వంధ్యత్వ నిరోధక చికిత్సలేవీ ఈ ఆసుపత్రిలోనే కాక నందర్బార్ సివిల్ ఆసుపత్రిలో కూడా అందుబాటులో లేవని చెప్పారు. “అందువల్ల, పిల్లలు కలగని వాళ్లు ప్రైవేట్ ఆసుపత్రుల మీదే ఆధారపడతారు, అక్కడ వేలల్లో ఖర్చు అవుతుంది” అని చెప్పారు. ఈ ఆసుపత్రిలో ఫ్యామిలీ ప్లానింగ్ సేవల నుండి మెటర్నల్ హెల్త్ మరియు నియోనేటల్ కేర్ వరకు పర్మార్ ఒక్కరే హ్యాండిల్ చేస్తున్నారు.

భారతదేశంలో వంధ్యత్వం ప్రాబల్యంపై ఉన్న డేటా “కొద్దిగా, ఇంకా అప్‌డేట్ అవ్వకుండా ఉంది” అని హెల్త్ పాలసీ అండ్ ప్లానింగ్ అనే జర్నల్‌లో 2009లోని ఒక పేపర్ పేర్కొనింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( NFHS-4 ; 2015-16) రికార్డుల ప్రకారం 40-44 మధ్య వయసు గల మహిళలలో 3.6 శాతం మంది తాము పిల్లలను కనలేదని లేదా తమకు పిల్లలు లేరని తెలియజేశారు. ప్రజా ఆరోగ్యంలోని వివిధ అంశాలలో జనాభా స్థిరీకరణ పైనే ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం వల్ల, వంధ్యత్వ నివారణ, సంబంధిత చికిత్సలపై అశ్రద్ధ ఏర్పడి అవి తక్కువ ప్రాధాన్యత గల అంశాలుగా మిగిలిపోయాయి.

“జనాభాను నియంత్రించడానికి కాండోమ్‌లను, గర్భ నిరోధక మందులను ప్రభుత్వం సరఫరా చేస్తోంది కదా, మరి వంధ్యత్వానికి కూడా ఉచితంగా చికిత్స ఇవ్వొచ్చు కదా?” అని ఈ విషయంపై శెవాంత సూటిగా ప్రశ్నిస్తున్నారు

ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్‌లో 12 రాష్ట్రాల వ్యాప్తంగా పరిశోధన చేసి ప్రచురించబడిన 2012-13 అధ్యయనం లో తెలిసిందేమిటంటే దాదాపు అన్ని జిల్లా స్థాయి ఆసుపత్రులలో వంధ్యత్వాన్ని నివారించడానికి, మేనేజ్ చేయడానికి కావాల్సిన ప్రాథమిక రోగ నిర్ధారణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, అయితే అధిక శాతం సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHCలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHCలు) మాత్రం ఆ సదుపాయాలు లేవు. 94% PHCలలో, అలాగే 79% CHCలలో వీర్యాన్ని పరీక్షించే సౌలభ్యం లేదు.జిల్లా ఆసుపత్రులలో అధునాతన ప్రయోగశాల సేవలు 42% ఉన్నా,CHCలలో కేవలం 8% మాత్రమే ఉన్నాయి. డయాగ్నోస్టిక్ ల్యాపరోస్కోపీ 42% జిల్లా ఆసుపత్రులలోను, పెద్దాపరేషన్ (హిస్టరెక్టమీ) చేసే సదుపాయం కేవలం 8% ఆసుపత్రులలో ఉంది. అండోత్పత్తిని ప్రేరేపించడానికి 83% జిల్లా ఆసుపత్రులలో క్లోమిఫీన్ ద్వారా చికిత్సను, 33% వాటిలో గొనాడోట్రోపిన్స్ ద్వారా చికిత్సను అందిస్తున్నారు. ఈ సర్వే ద్వారా తెలిసిన మరో విషయమేమిటంటే, వంధ్యత్వాన్ని మేనేజ్ చేయడంపై ఈ ఆరోగ్య కేంద్రాలలోని సిబ్బంది ఎవ్వరికీ ఎటువంటి ఇన్-సర్వీస్ శిక్షణ ఏదీ ఇవ్వలేదు.

“చికిత్స అందుబాటులో లేకపోవడం అనేది ఒక సమస్య అయితే, అంతకు మించి ముఖ్యమైనది గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో నిపుణులైన గైనకాలజిస్టుల కొరత” అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క నాసిక్ విభాగపు అధ్యక్షుడు డా. చంద్రకాంత్ సంక్లేచా చెప్పారు. “వంధ్యత్వానికి చికిత్స ఇవ్వడానికి, సరైన అర్హతలు కలిగి ఉండి, సరైన శిక్షణ పొందిన సిబ్బందితో పాటు, ఆధునిక సాంకేతిక సామాగ్రి కూడా అవసరం. ప్రసవం అయ్యాక బాలింతల ఆరోగ్యం, పసికందు ఆరోగ్యంపైనే ప్రభుత్వం ప్రాధాన్యతను చూపుతుంది కాబట్టి, PHC స్థాయిలో లేదా సివిల్ ఆసుపత్రి స్థాయిలో వంధ్యత్వానికి తక్కువ ఖర్చుకే చికిత్స అందించడానికి తగినంత నిధులు సమకూరడం కష్టతరంగా మారింది.”

Geeta Valavi spreading kidney beans on a charpoy; she cultivates one acre in Barispada without her husband's help. His harassment over the years has left her with backaches and chronic pains
PHOTO • Jyoti

గీతా వాలవి ఒక చాప మీద బీన్స్ గింజలను పరుస్తున్నారు; ఆమె తన భర్త సాయం లేకుండానే బరిస్పాదాలో ఒక ఎకరాలో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆమె భర్త ఆమెపై చేసిన వేధింపుల వల్ల ఆమెకు వెన్ను నొప్పి ఇంకా ఇతర తీవ్రమైన నొప్పులు కలుగుతున్నాయి

శెవాంత తండాకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బర్సిపాదాలో నివసించే గీతా వాలవి తన పూరి గుడిసె బయట ఒక చాప మీద బీన్స్ గింజలను పరుస్తున్నారు. గీత (30) గత పదిహేడేళ్లుగా సూరజ్ (45) అనే వ్యక్తితో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన అడపాదడపా రైతు కూలీగా పని చేస్తారు, మితిమీరి మద్యాన్ని సేవిస్తారు కూడా. వీరు కూడా భిల్ సామాజిక వర్గానికి చెందిన వారు. సూరజ్‌పై (నిజం పేరు కాదు) స్థానిక ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) కార్యకర్త ఎంతగానో ఒత్తిడి పెడితే, 2010లో ఆయన తన వీర్యాన్ని పరీక్ష చేయించుకోగా, అందులో స్పెర్మ్-కౌంట్ తక్కువగా ఉందని తేలింది. అంతకు కొన్నేళ్ల ముందు 2005లో ఈ భార్యాభర్తలు ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. అయినప్పటికీ, ఆమె పిల్లలను కనలేకపోయిందని గీత భర్త, అతని తల్లి వేధిస్తూనే ఉన్నారు. “నా భర్త లోపం వల్ల నాకు పిల్లలు పుట్టకపోయినా కూడా ఆయన నన్నే నిందిస్తారు. కానీ నేను ఆడదానిని కాబట్టి, ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేను,” అని గీత చెప్పారు.

2019లో గీత (నిజం పేరు కాదు) తన ఒక ఎకరం పొలంలో 20 కిలోల బీన్స్ గింజలను, ఒక క్వింటాల్ జొన్నలను సాగు చేశారు. “ఇది ఇంట్లో తినడం కోసం. నా భర్త, పొలం పనేదీ చేయడు. రైతు కూలీగా తాను ఎంత సంపాదించినదంతా మద్యం మీద, జూదం మీద ఖర్చు చేస్తాడు,” అని తన కోపాన్ని పంటి బిగువున దాచి ఉంచి గీత చెప్పారు. “ఫ్రీగా తిండి మాత్రం తింటాడు!”

“మద్యం సేవించి ఇంటికి వచ్చినప్పుడు నన్ను కాలితో తంతాడు, కొన్ని సార్లు కర్రతో బాదుతాడు. మత్తు దిగిన తర్వాత నాతో అసలు మాట్లాడడు” అని ఆమె చెప్పారు. ఏళ్ల తరబడి గృహ హింసకు గురైనందువల్ల ఆమెకు వెన్ను నొప్పితో పాటు భుజం మరియు మెడలో నిరంతరం నొప్పి వస్తూనే ఉంది.

“నా బావమరిది కూతురును మేము దత్తత తీసుకున్నాము, అయితే నా భర్తకు తన సొంత సంతానం కావాలి. అది కూడా ఒక కొడుకే కావాలి. ఆశా కార్యకర్త చెప్పినట్టు కాండోమ్ ధరించమంటే ససేమిరా అంటాడు, మద్యం సేవించడం కూడా ఆపడు” అని గీత చెప్పారు. గీతకు సంభోగం సమయంలో నొప్పి, పుండ్లు, మూత్ర విసర్జనలో నొప్పి, అసాధారణ తెల్ల బట్టతో పాటు పొత్తి కడుపులో నొప్పి వచ్చిందని ఆమె ఆశా  కార్యకర్తతో చెప్పడంతో ఆమెకు లైంగికంగా సంక్రమించే వ్యాధి గానీ పునరుత్పత్తి నాళంలో ఇన్‌ఫెక్షన్ గానీ ఏర్పడి ఉండవచ్చని ఆశా కార్యకర్త అనుమానించి గీత ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆమె ప్రతి వారం వచ్చి వాకబు చేసి గీత భర్తను కాండోమ్ ఉపయోగించమని సలహా ఇచ్చారు.

గీతను డాక్టర్ దగ్గరికి వెళ్లమని కూడా ఆశా కార్యకర్త సలహా ఇచ్చారు, కానీ ఆమె తన వ్యాధి లక్షణాలకు చికిత్స పొందడానికి నిరాకరించారు. “ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకున్నా ఏంటి ప్రయోజనం?” అని గీత అడిగారు. “మందులతో నా శరీరంలోని నొప్పి తగ్గవచ్చు కానీ నా భర్త తాగుడు మానేస్తాడా? నన్ను వేధించడం ఆపుతాడా?”

వంధ్యత్వంతో బాధపడుతూ నెలకు నాలుగు-ఐదు జంటలు తన వద్దకు వస్తారని డా. పర్మార్ చెప్పారు. మద్యానికి బానిసైన భర్తలకు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటమే వీళ్లలో ప్రధానంగా కనబడే సమస్య. “వంధ్యత్వంలో మగవాళ్ల పాత్ర గురించిన అజ్ఞానం వల్లే ఆడవాళ్లపై ఆకృత్యాలు జరుగుతాయి. మగవాళ్లు ఈ విషయం అర్థం చేసుకుని, కేవలం ఆడవాళ్లనే నిందించడం ఆపి, తమకు పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.”

PHOTO • Jyoti

ప్రజా ఆరోగ్యంలోని వివిధ అంశాలలో జనాభా స్థిరీకరణ పైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల, వంధ్యత్వ నివారణ, సంబంధిత చికిత్సలపై అశ్రద్ధ ఏర్పడి అవి తక్కువ ప్రాధాన్యత గల అంశాలుగా మిగిలిపోయాయి. వంధ్యత్వంలో మగవాళ్ల పాత్ర గురించిన అజ్ఞానం వల్లే ఆడవాళ్లపై ఆకృత్యాలు జరుగుతాయి

డా. రాణి బాంగ్, తూర్పు మహారాష్ట్రలోని గాడ్చిరోలి ట్రైబల్ బెల్ట్‌లో పునరుత్పత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలపై పని చేశారు. వంధ్యత్వం అనేది వైద్య సమస్య కంటే కూడా ఒక సామాజిక సమస్య అని ఆమె వివరించారు. “మగవాళ్లలో వంధ్యత్వం అనేది ఒక పెద్ద సమస్య, కానీ ఇది కేవలం మహిళలకు వచ్చే సమస్య అని భావిస్తారు. ఈ ఆలోచనా ధోరణి మారాలి.”

హెల్త్ పాలసీ అండ్ ప్లానింగ్‌లోని పేపర్‌లో “జనాభాలో కొద్ది శాతం మంది జంటలకు, మహిళలకు మాత్రమే వంధ్యత్వం కలుగుతుంది, అయినప్పటికీ ఇది ఎంతో ముఖ్యమైన పునరుత్పత్తి ఆరోగ్య హక్కులకు సంబంధించిన సమస్య” అని పేర్కొన్నారు. వంధ్యత్వంలో ప్రైమరీ మరియు సెకండరీ రకాలకు గల కారణాలు, పురుషులు, మహిళలు ఇద్దరికీ సంబంధించినవి అయినప్పటికీ, “వంధ్యత్వం అనగానే మహిళలు ఎంతగానో భయపడతారు. దీని వల్ల, వాళ్ల ఉనికి, సమాజంలో స్టేటస్ మరియు జీవిత భద్రత ప్రభావితమవుతాయి. తద్వారా, తమ కుటుంబంలో, సమాజంలో వెలివేత, ఒంటరితనానికి గురై తమ మాటకు విలువను, సాధికారతను కోల్పోతారు.”

గీత ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న తర్వాత, 2003లో కేవలం 13 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఆమె ఒకప్పుడు డిగ్రీ పట్టా పొందాలని కలలు కనేవారు. ఇప్పుడు తన కూతురు - 20 ఏళ్ల లత (నిజం పేరు కాదు) తన కలలను సాకారం చేస్తుందని ఆశిస్తున్నారు. లత ఇప్పుడు ధడ్‌గావ్‌లోని ఒక జూనియర్ కాలేజీలో 12వ తరగతి చదువుతోంది. “తను నా గర్భంలో నుండి పుట్టకపోతే ఏం; తన జీవితం నా లాగా నాశనం కానివ్వను,” అని గీత చెప్పారు.

ఒకానొకప్పుడు గీత ఎంతో ఇష్టంగా అందంగా అలంకరించుకునేవారు. “నా జుట్టుకు నూనె పెట్టుకుని, షీకాకాయతో తలస్నానం చేసి అద్దంలో చూసుకుని మురిసిపోయేదానిని.” ప్రత్యేక సందర్భం ఏదీ లేకపోయినా తన మొహానికి పౌడర్ పూసుకుని, జుట్టును అలంకరించుకుని, అందంగా చీర కట్టుకునేవారు. పెళ్లి అయ్యి రెండేళ్లయినా తాను గర్భం దాల్చకపోవడంతో, ఆమె అలంకరించుకోవడాన్ని చూసి ఆమె అత్తయ్య, భర్త ఆమెను “సిగ్గులేనిదానివి” అని అనేవాళ్లు. దాంతో గీత అలా అలంకరించుకోవడం తగ్గించేశారు. “నాకు సొంతంగా పిల్లలు లేకపోవడం వల్ల నాకేమీ బాధ లేదు. ఇప్పుడు నా సొంత పిల్లలు ఉండాలని నాకు అనిపించడం లేదు. అయితే అందంగా కనబడాలనుకోవడం తప్పా?” అని ఆమె అడిగారు.

చివరికి, బంధువులు ఆమెను పెళ్లిల్లకు, నామకరణాలకు, కుటుంబ ఫంక్షన్లకు పిలవడం ఆపేశారు, దాంతో సాంఘిక వెలివేత పూర్తయినట్టు అయ్యింది. “జనం నా భర్తను, ఆయన తరఫు కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానిస్తారు. నా భర్త వీర్యంలో లోపం ఉందని వాళ్లకు తెలియదు. వంధ్యత్వం ఉన్నది నాకు కాదు, ఆయనకు. ఆయన గురించి నిజం తెలిస్తే, ఆయనను కూడా ఆహ్వానించడం ఆపేస్తారా?” అని గీత ప్రశ్నించారు.

గ్రామీణ భారతదేశంలో యుక్త వయస్సులోని ఆడపిల్లలు మరియు యువ మహిళల మీద దేశవ్యాప్తంగా PARI మరియు  CounterMedia Trust సంయుక్తంగా ఈ రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. సాధారణ ప్రజల అనుభవాలను, వారి దృష్టి కోణాలను వెలికితీస్తూ, అణచివేతకు గురైన వర్గాల ప్రజల స్థితిగతులను అన్వేషించడానికి Population Foundation of India సపోర్ట్ చేసిన కార్యక్రమాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి.

ఈ ఆర్టికల్‌ను తిరిగి పబ్లిష్ చేయాలని అనుకుంటున్నారా? అయితే [email protected] అడ్రస్‌కు ఈమెయిల్ పంపండి, cc ఫీల్డ్‌లో [email protected] అడ్రస్‌ను చేర్చండి

అనువాదం : శ్రీ రఘునాథ్ జోషి

ಜ್ಯೋತಿ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಹಿರಿಯ ವರದಿಗಾರರು; ಅವರು ಈ ಹಿಂದೆ ‘ಮಿ ಮರಾಠಿ’ ಮತ್ತು ‘ಮಹಾರಾಷ್ಟ್ರ1’ನಂತಹ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ.

Other stories by Jyoti
Illustration : Priyanka Borar

ಕವರ್ ಇಲ್ಲಸ್ಟ್ರೇಷನ್: ಪ್ರಿಯಾಂಕಾ ಬೋರಾರ್ ಹೊಸ ಮಾಧ್ಯಮ ಕಲಾವಿದೆ. ಹೊಸ ಪ್ರಕಾರದ ಅರ್ಥ ಮತ್ತು ಅಭಿವ್ಯಕ್ತಿಯನ್ನು ಕಂಡುಹಿಡಿಯಲು ತಂತ್ರಜ್ಞಾನವನ್ನು ಪ್ರಯೋಗಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಅವರು ಕಲಿಕೆ ಮತ್ತು ಆಟಕ್ಕೆ ಎಕ್ಸ್‌ಪಿರಿಯೆನ್ಸ್ ವಿನ್ಯಾಸ‌ ಮಾಡುತ್ತಾರೆ. ಸಂವಾದಾತ್ಮಕ ಮಾಧ್ಯಮ ಇವರ ಮೆಚ್ಚಿನ ಕ್ಷೇತ್ರ. ಸಾಂಪ್ರದಾಯಿಕ ಪೆನ್ ಮತ್ತು ಕಾಗದ ಇವರಿಗೆ ಹೆಚ್ಚು ಆಪ್ತವಾದ ಕಲಾ ಮಾಧ್ಯಮ.

Other stories by Priyanka Borar
Editor : Hutokshi Doctor
Series Editor : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

Other stories by Sri Raghunath Joshi