బీటలు వారిన ఒక పొలంలో, చిన్న కంతలో, చనిపోయిన పీత ఒకటి కనబడింది. దాని కాళ్ళు శరీరం నుండి వేరు పడి ఉన్నాయి. తన ఐదెకరాల పొలంలో ఉన్న కంతలను చూపిస్తూ, పెరుగుతున్న వేడికి పీతలు చనిపోతున్నాయని దేవేంద్ర భోన్గాడే తెలిపారు.

"అదే వర్షాలు పడుంటే, ఈ పీతలు పొలంలోని నీళ్లలో గుంపులుగా తిరుగుతూ, గుడ్లు పొదుగుతూ కనబడుండేవి! ఇప్పుడిక నా పైర్లు బతకడం కష్టం," అని పసుపు-ఆకుపచ్చ రంగులోకి మారి, ఎండిపోతున్న తన వరి చేల మధ్యలో నిలబడ్డ ఆ 30 ఏళ్ల రైతు బాధపడ్డారు.

భోన్గాడే నివసించే 542 మంది జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) గల రావన్‌వాడి గ్రామంలో, వర్షాకాలం రాక ముందే, అంటే జూన్ మొదటి పక్షంలోనే, చిన్న ప్లాట్లుగా విభజించబడిన వ్యవసాయ భూమిలోని నారు మడుల్లో రైతులు విత్తనాలు చల్లుతారు. వర్షాలు ఆరంభమైన తర్వాత, కట్టలు సరిహద్దులుగా ఉన్న సాళ్లలో బురద నీరు పేరుకున్నప్పుడు, 3-4 వారాల వరకు పెరిగిన మొలకలను సేకరించి, తిరిగి ఆయా పొలాల్లో వాళ్ళు నాట్లు వేస్తారు.

అయితే, ఈ ఏడాది జూలై 20కి, ఋతుపవనాలు వచ్చి ఆరు వారాలు గడిచినా, రావన్‌వాడిలో వర్షం పడలేదు. రెండుసార్లు చినుకులు పడ్డాయి కానీ, అవి సేద్యానికి ఏ మాత్రం సరిపోవు. బావులు ఉన్న రైతులు వరి మొక్కలకు నీరందిస్తున్నారు. చాలా పొలాల్లో పనులు లేకపోవడంతో, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధిని వెతుక్కుంటూ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారని భోన్గాడే చెప్పారు.

*****

సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని గరడజంగ్లీ గ్రామానికి చెందిన లక్ష్మణ్ బంతే, కొంతకాలంగా ఈ వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నారు. జూన్-జులైలో వర్షాలు కురవకపోవడం ఇతర రైతులు కూడా గమనించారని, 2-3 సంవత్సరాలకు ఒకసారి వారు తమ ఖరీఫ్ పంటను దాదాపుగా మొత్తం కోల్పోతున్నామని ఆయన వివరించారు.

తన బాల్యంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని, నిలకడగా వర్షాలు కురివడంతో వరి బాగా పండేదని, యాభయ్యో పడిలో పడిన బంతే గుర్తు చేసుకున్నారు.

మారుతున్న వర్షపాత తీరుతెన్నుల ప్రభావంతో, 2019 వ సంవత్సరం కూడా వాళ్లకి తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. " ఖరీఫ్‌ పంట వేసే సమయానికి, బహుశా నా పొలం బీడుగా మారిపోతుందేమో," అని నారాయణ్ ఉయికే ( కవర్ ఫోటోలో నేలపై కూర్చొని ఉన్నారు ) భయపడ్డారు. 70 ఏళ్ల నారాయణ్ ఉయికే, ఐదు దశాబ్దాలకు పైగా 1.5 ఎకరాలలో వ్యవసాయం చేశారు. తన జీవితంలో ఎక్కువ భాగం వ్యవసాయ కూలీగా పని చేశారు. "2015 లో ఒకసారి, మళ్ళీ 2017 లో మరోసారి ఈ పొలం బీడు వారిపోయింది. అలాగే, గత ఏడాదిలో వర్షాలు ఆలస్యమవడంతో, విత్తనాలు నాటటడం ఆలస్యమైంది. ఆ కారణంగా పంట దిగుబడి, ఆదాయం తగ్గిపోయాయి," అని ఆయన చెప్పారు. విత్తనాలు నాటడానికి కూడా కూలీలను పెట్టుకోలేని పరిస్థితులు రైతులకు వచ్చినప్పుడు, వ్యవసాయ పనులు కరువైపోతాయి!

PHOTO • Jaideep Hardikar

రావన్‌వాడిలో తన బీడు వారిన పొలంలో ఎండిపోతున్న వరి పైరులను , పీతల కంతలను (కుడి వైపు ఎగువన) చూపిస్తున్న దేవేంద్ర భోన్గాడే (ఎడమ వైపు ఎగువన). నారాయణ్ ఉయికే (ఎడమ వైపు దిగువన) “వర్షాలు కురవకపోతే చేను ఎండిపోతుంది,” అని చెప్పారు. రైతు, గరడ జంగ్లీ మాజీ సర్పంచ్ అయిన లక్ష్మణ్ బంతే తన గ్రామంలో ఎండిపోయిన పొలాల వద్ద వేచి చూస్తున్నారు

గరడజంగ్లీ, భండారా (తాలూకా మరియు) జిల్లాలో 496 మంది జనాభా కలిగిన ఒక చిన్న గ్రామం; భండారా పట్టణం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావన్‌వాడిలో లాగా, ఇక్కడ చాలా మంది రైతులకు చిన్న చిన్న సాగు భూములు ఉన్నాయి – ఎకరం నుండి నాలుగు ఎకరాల వరకు; ఇక్కడంతా వర్షాధార వ్యవసాయం. వర్షాలు లేకపోతే, పొలాలు ఎండిపోతాయని ఆదివాసీ గోండు తెగకి చిందిన ఉయికే చెప్పారు.

ఈ ఏడాది జూలై 20 నాటికి, అతని గ్రామంలో ఉన్నదాదాపు అన్ని పొలాల్లో నాట్లు వేసే పని నిలిపివేయబడింది; దాంతో నర్సరీలలోని మొక్కలు ఎండిపోతున్నాయి.

అయితే, దుర్గాబాయి దిగోరే పొలంలో మాత్రం సగం పెరిగిన పైర్లను నాటే పని చెయ్యాలని కంగారు పడుతోంది. ఆమె కుటుంబానికి చెందిన భూమిలో బోరుబావి ఉంది. గరడలో నలుగురైదుగురు రైతులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. రెండేళ్ల క్రితం, తమ 80 అడుగుల బావి ఎండిపోవడంతో, అక్కడే 150 అడుగుల లోతులో ఒక బోరుబావిని త్రవ్వించారు దిగోరే కుటుంబ సభ్యలు. 2018లో, అది కూడా ఎండిపోయినప్పుడు, వారు కొత్త బోరుబావిని త్రవ్వించారు.

బోరుబావులు తమకు కొత్త విషయమని, కొన్నేళ్ల క్రితం వరకూ చుట్టు పక్కల ప్రాంతాల్లో వాటిని చూసి ఎరుగమని బంతే అన్నారు. "గతంలో బోరు (బావి) త్రవ్వాల్సిన అవసరం మాకు ఎప్పుడూ కలగలేదు. ఇప్పుడు నీళ్ల కొరత, వర్షాభావం వల్ల ప్రజలు వాటిపై (బోరుబావులు) ఆధార పడుతున్నారు."

గ్రామ శివార్లలో ఉన్న రెండు చిన్న మల్గుజారీ ట్యాంకులు (2 శతాబ్దాల క్రితం, తూర్పు విదర్భలో జమీందార్లుగా ఉన్న మల్గుజార్‌లచే త్రవ్వించబడిన చెరువులు) కూడా మార్చి 2019 నుండి ఎండిపోయాయి. సాధారణంగా, పొడి నెలల్లో కూడా అవి కొంత నీటిని నిల్వ చేసుకుంటాయి. కానీ, రోజురోజుకూ పెరుగుతున్న బోరుబావుల వినియోగం వల్ల ఈ చెరువులు, భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని ఆయన బాధపడ్డారు.

17వ శతాబ్దపు చివరి నుండి 18వ శతాబ్దపు మధ్యకాలంలో, స్థానిక రాజుల పర్యవేక్షణలో, తూర్పు విదర్భలోని వరి పండించే జిల్లాలలో ఈ ట్యాంకులు నిర్మించబడ్డాయి. మహారాష్ట్ర ఏర్పడిన తర్వాత, పెద్ద ట్యాంకుల నిర్మాణ మరియు నిర్వహణా బాధ్యతలను రాష్ట్ర నీటిపారుదల శాఖ చేపట్టగా, చిన్న ట్యాంకులను జిల్లా పరిషత్‌లు సంరక్షిస్తున్నాయి. ఈ నీటి వనరులు స్థానిక సంఘాలచే నిర్వహించబడుతూ, చేపల పెంపకం ఇంకా నీటిపారుదల పనుల కొరకు ఉపయోగించబడతాయి. భండారా, చంద్రాపూర్, గడ్చిరోలి, గోండియా, నాగ్‌పూర్ జిల్లాల్లో దాదాపు 7,000 ట్యాంకులు ఉన్నాయి. అయితే, కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవడం వల్ల, అవి  శిథిలావస్థకు చేరుకున్నాయి.

After their dug-well dried up (left), Durgabai Dighore’s family sank a borewell within the well two years ago. Borewells, people here say, are a new phenomenon in these parts.
PHOTO • Jaideep Hardikar
Durgabai Dighore’s farm where transplantation is being done on borewell water
PHOTO • Jaideep Hardikar

తమ బావి ఎండిపోవడంతో (ఎడమ వైపు) , దుర్గాబాయి దిగోరే కుటుంబం రెండేళ్ల క్రితం అక్కడ ఒక బోరుబావి త్రవ్వించారు. బోరుబావులు ఈ ప్రాంతాల్లో కొత్త విషయమని ఇక్కడి ప్రజలు అంటున్నారు. బోరు నీటి కారణంగా దిగోరేల పొలంలో (కుడి వైపు) కార్మికులు జూలైలో వరి నాట్లు వేశారు

చాలా మంది యువకులు - భండారా పట్టణం, నాగ్‌పూర్, ముంబై, పూణే, హైదరాబాద్, రాయ్‌పూర్, ఇంకా ఇతర ప్రాంతాలకు - ట్రక్కులలో క్లీనర్‌లుగా, సంచార కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా లేదా మరేదైనా పని చేయడానికి వలస వెళ్లిపోయారని బంతే చెప్పారు.

ఈ పెరుగుతున్న వలసలు జనాభా సంఖ్యలో ప్రతిబింబిస్తాయి: 2001 నుండి 2011 వరకు ఉన్న జనాభా లెక్కల ప్రకారం, మహారాష్ట్ర జనాభా 15.99 శాతం పెరిగింది. కానీ భండారాలో జనాభా కేవలం 5.66 శాతం మాత్రమే పెరిగింది. నిలకడలేని సేద్యం, తగ్గుతున్న వ్యవసాయ పనులు, పెరుగుతున్న ఇంటి ఖర్చులే ఈ వలసలకు ప్రధాన కారణాలని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

*****

భండారా జిల్లాలో ఎక్కువగా వరి పండుతుంది. ఇక్కడ పంట పొలాలు,  అడవులు అల్లుకుపోయి ఉంటాయి. సగటు వార్షిక వర్షపాతం 1,250 మిమీ నుండి 1,500 మిమీ వరకు ఉంటుంది (కేంద్ర భూగర్భ జల మండలి నివేదిక ప్రకారం). ఏడు తాలూకాలున్న ఈ జిల్లాలో, వైంగంగా అనే జీవనది ప్రవహిస్తుంది. ఇక్కడ వర్షాధార నదులు, ఇంకా దాదాపు 1,500 మల్గుజారీ ట్యాంకులు ఉన్నాయని విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థ పేర్కొంది. పశ్చిమ విదర్భలోని కొన్ని జిల్లాలలో లాగ రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదు కాకపోయినా, భండారాకు కాలానుగుణ వలసల యొక్క సుదీర్ఘ చరిత్ర మాత్రం వుంది.

కేవలం 19.48 శాతం పట్టణీకరణతో, చిన్న మరియు సన్నకారు రైతులు వుండే వ్యవసాయ జిల్లా ఇది. వారు తమ సొంత భూమి, ఇంకా వ్యవసాయ పనుల ద్వారా ఆదాయాన్ని పొందుతుంటారు. కానీ, బలమైన నీటిపారుదల వ్యవస్థలు లేకపోవడంతో, ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది. అక్టోబర్ తర్వాత, వర్షాకాలం ముగిసే సమయానికి, కొన్ని వ్యవసాయ భూములకు మాత్రమే ట్యాంక్ నీరు సరిపోతుంది.

భండారా ఉన్న మధ్య భారతదేశంలో, జూన్-సెప్టెంబర్లలో కొనసాగే నైరుతి ఋతుపవనాలు బలహీనపడడం, అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు పడడం వంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. 2009 లో, పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ చేసిన ఒక అధ్యయనం ఈ ధోరణినే వివరించింది. 2018 ప్రపంచ బ్యాంక్ అధ్యయనం లో, భారతదేశంలోని టాప్ 10 వాతావరణ హాట్‌స్పాట్‌లలో భండారా జిల్లా కూడా ఉన్నట్లు కనుగొంది. మిగిలిన తొమ్మిది హాట్‌స్పాట్‌లు విదర్భ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని జిల్లాలలో (అన్నీ మధ్య భారతదేశంలో) ఉన్నాయి. సగటు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావాలు ఎక్కడైతే నమోదవుతాయో, ఆ ప్రదేశాన్ని 'క్లైమేట్ హాట్‌స్పాట్' అంటారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే గనుక, ఈ హాట్‌స్పాట్‌లలోని ప్రజలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారని ఆ అధ్యయనం హెచ్చరించింది.

భారత వాతావరణ శాఖ (IMD) అందించిన సమాచారం ఆధారంగా, 2018 లో, రివైటలైజింగ్ రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ నెట్‌వర్క్ మహారాష్ట్రలోని వర్షాల తీరుతెన్నులపై ఒక ఫ్యాక్ట్‌షీట్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం, 2000-2017 మధ్య కాలంలో, విదర్భలోని దాదాపు అన్ని జిల్లాల్లో పొడి వాతావరణ నిడివి, తీవ్రత పెరిగాయి. అలాగే, వార్షిక సగటు వర్షపాతం దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ, వానలు పడే రోజుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అంటే, ఈ ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువ స్థాయిలో కురుస్తున్న వర్షాలు, ఇక్కడి పంటల ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయి.

Many of Bhandara’s farms, where paddy is usually transplanted by July, remained barren during that month this year
PHOTO • Jaideep Hardikar
Many of Bhandara’s farms, where paddy is usually transplanted by July, remained barren during that month this year
PHOTO • Jaideep Hardikar

సాధారణంగా జూలై నాటికి వరి నాట్లు వేయడం పూర్తయ్యి కళకళలాడే భండారాలోని పొలాలు , సారి బంజరు భూములుగా దర్శనమిస్తున్నాయి

"1901-2003 మధ్య కాలంలో, జూలైలో నమోదయ్యే ఋతుపవన వర్షపాతం (రాష్ట్రమంతటా) తగ్గుముఖం పట్టగా, ఆగస్టు వర్షపాతం పెరిగిందని IMD ఇచ్చిన సమాచారం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, సీజన్ మొదటి పక్షంలో (జూన్ మరియు జూలై), ఋతుపవన వర్షపాతానికి తోడు విపరీతంగా వానలు కురుస్తున్నాయి," అని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (TERI) 2014 లో చేసిన అధ్యయనం పేర్కొంది.

"మహారాష్ట్రలో వాతావరణ మార్పులు, అనుసరణ వ్యూహాల అంచనా: వాతావరణ మార్పులపై మహారాష్ట్ర రాష్ట్ర అనుసరణ కార్యాచరణ ప్రణాళిక," అనే అధ్యయనం, సుదీర్ఘ పొడి వాతావరణం, ఇటీవల వర్షపాత తీరుతెన్నులలో వచ్చిన మార్పులు, తగ్గిన (వర్షపాత) పరిమాణం వంటివి విదర్భ వాతావరణంలో గమనించిన ప్రధాన దుర్బలత్వాలుగా, ఈ అధ్యాయం నొక్కి వక్కాణించింది.

తీవ్ర వర్షపాతం 14-18 శాతం (బేస్‌లైన్‌కు సంబంధించి) నమోదైన జిల్లాలలో భండారా ఉందని, ఋతుపవనాల సమయంలో పొడి వాతావరణం కూడా పెరుగుతుందని ఈ ఆధ్యయనం అంచనా వేసింది. నాగ్‌పూర్ డివిజన్లో (భండారా ఉన్న ప్రదేశం) 1.18 నుండి 1.4 డిగ్రీలు (2030 నాటికి), 1.95 నుండి 2.2 డిగ్రీలు (2050 నాటికి), 2.88 నుండి 3.16 డిగ్రీల వరకు (2070 నాటికి) సగటు పెరుగుదల (వార్షిక సగటు ఉష్ణోగ్రత 27.19 డిగ్రీల కంటే) ఉంటుందని కూడా ఆ అధ్యయనం పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ఈ జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉండబోతుంది!

సాంప్రదాయ చెరువులు, నదులు మరియు తగినంత వర్షపాతం కారణంగా, భండారా జిల్లాను 'మెరుగైన నీటిపారుదల' ప్రాంతంగా ప్రభుత్వ రికార్డులు, జిల్లా ప్రణాళికలు ఇప్పటికీ గుర్తిస్తాయి. అయితే, అక్కడి వాతావరణంలో మొదలైన ఈ మార్పులను వ్యవసాయ శాఖ అధికారులు కూడా గమనించారు. "వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే స్థిరమైన ధోరణిని జిల్లాలో మేము గమనించాం. ఇది విత్తనాలు నాటే ప్రక్రియను, దిగుబడులను దెబ్బ తీస్తోంది," అని భండారాలోని డివిజనల్ సూపరింటెండింగ్ వ్యవసాయ అధికారి మిలింద్ లాడ్ తెలిపారు. “మాకు కనీసం 60-65 రోజులు వర్షాలు కురిసేవి. కానీ, గత దశాబ్ద కాలంలో, జూన్-సెప్టెంబర్ నెలల్లో కేవలం 40-45 రోజులే వానలు పడుతున్నాయి.” ఈ ఏడాది జూన్-జూలైలలో, ఇక్కడ కొన్ని సర్కిళ్లలో (20 రెవెన్యూ గ్రామాల క్లస్టర్‌లు) కేవలం 6-7 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయని ఆయన అన్నారు.

"ఋతుపవనాలు ఆలస్యం అయితే రైతులు నాణ్యమైన బియ్యాన్ని పండించలేరు. విత్తనాలు మొలకెత్తిన 21 రోజుల తర్వాత వరి నాట్లు వేయకపోతే, ఒక హెక్టారుకు రోజుకు 10 కిలోల చొప్పున ఉత్పత్తి పడిపోతుంది," అని లాడ్ వివరించారు.

సాంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేసే విధానం – నాట్లు వేయడం కాకుండా విత్తనాలు మట్టిలో చల్లే విధానం – క్రమంగా జిల్లాకు తిరిగి వస్తోంది. తక్కువ అంకురోత్పత్తి (విత్తనం నుండి మొక్క అభివృద్ధి) రేటు కారణంగా, ఈ పద్ధతిలో తక్కువ దిగుబడి వస్తుంది. కానీ, సమయానికి తొలకరి చినుకులు పడక పైర్లు పెరగకపోతే, మొత్తం పంటను కోల్పోయే పరిస్థితి వస్తుంది. దాని బదులు సాంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే, రైతులకు పాక్షికంగా మాత్రమే నష్టం జరుగుతుంది.

 Durgabai Dighore’s farm where transplantation is being done on borewell water.
PHOTO • Jaideep Hardikar

ఖరీఫ్ సీజన్‌లో భండారాలోని చాలా పొలాల్లో వరి సాగు చేస్తారు

"వరి విత్తనం మొలకెత్తడానికి, నాట్లు వేసుకోడానికి జూన్-జూలైలో మంచి వర్షాలు అవసరం," అని భండారా గ్రామీణ యువ ప్రగతిక్ మండల్ ఛైర్మన్ అవిల్ బోర్కర్ చెప్పారు. తూర్పు విదర్భలోని వరి రైతులతో స్థానిక విత్తనాల పరిరక్షణకై పని చేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ అది. ఋతుపవనాల కాలచక్రం తరచుగా మారుతోంది. చిన్న చిన్న మార్పులుంటే రైతులు ఎలాగొలా సర్దుబాటు చేసుకుంటారు. కానీ ఋతుపవనాల వైఫల్యాన్ని వాళ్ళు ఏ విధంగా నెట్టుకురాగలరని అతను ప్రశ్నించారు.

*****

జూలై నెలాఖరుకి భండారాలో వర్షాలు కురిశాయి. అయితే, అప్పటికే ఖరీఫ్‌ నాట్ల పని దెబ్బతిన్నదని, కేవలం 12 శాతం పొలాల్లో మాత్రమే నాట్లు వేశారని డివిజనల్ సూపరింటెండింగ్ వ్యవసాయ అధికారి మిలింద్ లాడ్ చెప్పారు. ఖరీఫ్‌ లో భండారా కు చెందిన 1.25 లక్షల హెక్టార్ల సాగు భూమిలో దాదాపు మొత్తంగా వరి మాత్రమే పండించబడుతుందని ఆయన చెప్పారు.

మత్స్యకార సంఘాలను ఆదుకునే అనేక మల్గుజారీ ట్యాంకులు కూడా ఎండిపోవడంతో, గ్రామస్థులు నీటి గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయమే ఏకైక ఉపాధి మార్గం. కానీ, వర్షాకాలం ప్రారంభమైన రెండు నెలల్లో, భూమి లేని వాళ్లకు భండారాలో ఎలాంటి పనీ దొరకలేదని, ఇప్పుడు వర్షాలు కురిసినా ఖరీఫ్‌ సాగు కోలుకోలేని విధంగా దెబ్బతిందని ఇక్కడి ప్రజలు అంటున్నారు.

ఇక్కడ ఎకరాలకు ఎకరాలలు, పంట వేయని పొలాలను చూడొచ్చు – గోధుమ వర్ణంలో దున్నిన నేల, వేడి వల్ల / తేమ లేకపోవడం వల్ల బీటలు వారిన భూమి, అక్కడక్కడా పసుపు-ఆకుపచ్చ రంగులో వాడిపోతున్న నర్సరీలలోని రెమ్మలతో కనిపిస్తుంది. ఆకుపచ్చగా కనిపించే కొన్ని నర్సరీలు బతకాలంటే మాత్రం నిర్విరామంగా ఎరువులు వేయాలి, అప్పుడు ఆ రెమ్మలు కాస్త పెరిగినట్లుగా కనిపిస్తాయి.

గరడ, రావన్‌వాడితో పాటు, భండారాలోని ధార్గాంవ్ సర్కిల్‌లోని దాదాపు 20 గ్రామాలలో, గత కొన్ని సంవత్సరాలకు మల్లే ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడలేదని లాడ్ తెలియజేశారు. IMD సమాచారం ప్రకారం, జూన్ నుండి ఆగస్టు 15, 2019 వరకు భండారాలో మొత్తం 20 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూలై 25 తర్వాత, (ఆ కాలానికి దీర్ఘకాలిక సగటు 852 మిమీలు కాగా) 736 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ విధంగా ఆగస్టు మొదటి పక్షంలో, భండారా జిల్లా పెద్ద లోటును అధిగమించింది.

అయితే, ఈ వర్షపాతం అసమానంగా ఉంది. ఉత్తరాన ఉన్న తుమ్సర్‌లో మంచి వర్షాలు కురిశాయి; మధ్య మహారాష్ట్రలో ఉన్న ధార్గాంవ్లో లోటు వర్షాలు కురిశాయి, ఇక దక్షిణాదిలో ఉన్న పౌనిలో ఓ మోస్తరు వానలు పడ్డాయని భారత వాతావరణ శాఖ యొక్క సర్కిల్-వారీ సమాచారం తెలియజేసింది.

Maroti and Nirmala Mhaske (left) speak of the changing monsoon trends in their village, Wakeshwar
PHOTO • Jaideep Hardikar
Maroti working on the plot where he has planted a nursery of indigenous rice varieties
PHOTO • Jaideep Hardikar

మరోటీ, నిర్మలా మస్కే (ఎడమ వైపు) వారి గ్రామమైన వాకేష్వర్లో మారుతున్న ఋతుపవనాల తీరుతెన్నుల గురించి మాట్లాడుతున్నారు. స్థానిక వరి రకాల నర్సరీని నాటిన తన ప్లాట్‌లో పనిచేస్తున్న మరోటి

ఏదేమైనప్పటికీ, వాతావరణ సమాచారం మన సూక్ష్మ పరిశీలనలను ప్రతిసారీ ప్రతిబింబించదు: వర్షాలు కురుస్తాయి కానీ ఒక్కోసారి చాలా తక్కువ వ్యవధిలో, అంటే కొన్ని నిమిషాల వ్యవధిలో కురుస్తాయి. రోజంతా కురిసే పూర్తి స్థాయి వర్షపాతం రెయిన్-గేజ్ స్టేషన్లో నమోదు చేస్తున్నప్పటికీ, సాపేక్ష ఉష్ణోగ్రత లేదా వేడి, తేమలపై గ్రామ-స్థాయి సమాచారం ఇంకా అందుబాటులో లేదు.

ఈ ఏడాది, 75 శాతం భూమిలో నాట్లు వేయని రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నరేష్ గీతే, ఆగస్టు 14న, బీమా కంపెనీని ఆదేశించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, 1.67 లక్షల మంది రైతులు 75,440 హెక్టార్ల విస్తీర్ణంలో నాట్లు వేయలేదు.

సెప్టెంబరు నాటికి, భండారాలో 1,237.4 మిమీ వర్షపాతం (జూన్ నుండి చూసినట్లయితే) నమోదైంది; లేదా, ఆ కాలానికి దాని దీర్ఘకాలిక వార్షిక సగటులో 96.7 శాతం (1,280.2 మిమీ) నమోదైంది. ఈ సారి వానలు ఆగస్టు-సెప్టెంబర్‌లో కురవడంతో, జూన్-జూలై వర్షాలపై ఆధారపడిన ఖరీఫ్ సాగు పనులు ఆగిపోయాయి. ఈ వర్షాలకు రావన్‌వాడి, గరడజంగ్లీ, వాకేష్వర్లో ఉన్న మల్గుజారీ ట్యాంకులన్నీ నిండిపోయాయి. అందుకే, చాలా మంది రైతులు ఆగస్టు మొదటి వారంలో మళ్ళీ విత్తనాలు చల్లడం మొదలుపెట్టారు; అందులో ముందుగా దిగుబడినిచ్చే విత్తన రకాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా, ఈ సారి దిగుబడి తగ్గవచ్చు; అలాగే కోతల సమయం ఒక మరో నెల ముందుకు, అంటే నవంబర్ చివరకు జరగవచ్చు.

*****

ఆలస్యంగా వచ్చిన ఋతుపవనాల వల్ల, 66 ఏళ్ల మరోటీ మస్కే మరియు 62 ఏళ్ల నిర్మలా మస్కే జూలైలో చాలా ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా కురుస్తున్న ఈ వర్షాలతో బతకడం కష్టమని వారు అంటున్నారు. 4-5 లేదా 7 రోజుల పాటు ఏకధాటిగా కురిసే వానలు ఇంక ఉనికిలో లేవు. ఇప్పుడు వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి – రెండు గంటల పాటు భారీ వర్షాలు పడితే, ఆ తరువాత సుదీర్ఘ పొడి వాతావరణం, వేడి ఉంటున్నాయని వారు వాపోయారు.

దాదాపు ఒక దశాబ్దం పాటు, మృగ నక్షత్ర లో (జూన్ ప్రారంభం నుండి జూలై ప్రారంభం వరకు) మంచి వర్షాలు పడలేదు. సాధారణంగా ఈ సమయంలో, మస్కే దంపతులు వరి విత్తనాలు చల్లి, 21 రోజుల మొలకలను నారు మడులలో నాటుతారు. అక్టోబర్ నెలాఖరు నాటికి వరి కోతకు సిద్ధమవుతుంది. కానీ ఈ మధ్య, దిగుబడి కోసం వాళ్ళు నవంబర్ లేదా డిసెంబర్ వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఆలస్యంగా వచ్చే వర్షాలు ఎకరా దిగుబడిని ప్రభావితం చేస్తాయి; దీర్ఘకాలిక వరి రకాల సాగును కూడా పరిమితం చేస్తాయి.

నేను వాకేష్వర్‌ గ్రామాన్ని సందర్శించినప్పుడు, "ఈ సమయానికి (జూలై చివరిలో), మేము నాట్లు వేయడం పూర్తి చేస్తాము," అని నిర్మల చెప్పారు. అనేక మంది రైతుల మాదిరిగానే, మస్కే దంపతులు తమ సాగు భూమిలో నాట్లు వేసేందుకు వాన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పొలంలో పని చేసే ఏడుగురు వ్యవసాయ కూలీలు రెండు నెలలుగా ఖాళీగా ఉన్నారు.

మస్కే దంపతులు నివసించే పాత ఇల్లు, కూరగాయలు, ఇంకా స్థానిక వరి రకాలను పండిస్తున్న వాళ్ళ రెండెకరాల పొలానికి ఎదురుగా ఉంది. వాళ్ళకి 15 ఎకరాల భూమి ఉంది. తన గ్రామంలో, ఖచ్చితమైన పంట ప్రణాళిక, ఇంకా అధిక దిగుబడికి మరోటీ ప్రసిద్ధి చెందారు. కానీ వర్షపాత తీరుతెన్నులలో వచ్చిన మార్పులు, అసాధారణంగా అసమానంగా పడుతున్న వానలు ఆయనను ఒక రకమైన అనిశ్చితికి గురి చేస్తున్నాయి. "ఎప్పుడు ఎంత వర్షం పడుతుందో తెలియనప్పుడు మీరు మీ పంట ప్రణాళిక వేయడం ఎలా సాధ్యం?" అని మరోటీ ప్రశ్నించారు.

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని, PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది .

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected] కి కాపీ చేయండి .

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Reporter : Jaideep Hardikar

ನಾಗಪುರ ಮೂಲದ ಪತ್ರಕರ್ತರೂ ಲೇಖಕರೂ ಆಗಿರುವ ಜೈದೀಪ್ ಹಾರ್ದಿಕರ್ ಪರಿಯ ಕೋರ್ ಸಮಿತಿಯ ಸದಸ್ಯರಾಗಿದ್ದಾರೆ.

Other stories by Jaideep Hardikar
Editor : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi