మీనా యాదవ్ ఒకవైపు తన వద్ద మొక్కజొన్న పొత్తులను కొనడానికి వచ్చేవారితో మాట్లాడుతుంటారు. మరోవైపు తన స్నేహితులతోనూ, ఇంకోవైపు దక్షిణ కొల్‌కతాలోని బహుళ సంస్కృతులకు కేంద్రమైన ఆ లేక్ మార్కెట్‌లో దారుల గురించి వాకబుచేసే అపరిచితులతోనూ మాట్లాడుతుంటారు. ఈ అందరితోనూ ఆమె భోజ్‌పురి, బంగ్లా, హిందీ భాషలలో మాట్లాడతారు.  "కొల్‌కతాలో ఇది (భాష) సమస్య కాదు," అంటూ ఆమె వలసదారుగా తన దైనందిన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతారు.

యే సిర్ఫ్ కెహ్నే కా బాత్ హైఁ కి బిహారీ లోగ్ బిహార్ మే రహేగా (బిహారీ ప్రజలు బిహార్‌లోనే ఉంటారని చెప్పడం చాలా సులభం). వాస్తవం ఏమిటంటే కఠినమైన శారీరక శ్రమ అంతా మేమే చేస్తాం. బరువులెత్తే కూలీలు, నీటి రవాణా చేసేవారు, కూలిపనులు చేసేవారందరూ బిహారీలే. ఈ పనులు చేయటం బెంగాలీల వల్ల కాదు. మీరు న్యూ మార్కెట్, హౌరా, శియాల్‌దాహ్‌లకు వెళ్ళి చూడండి... భారీ బరువులను మోస్తున్న బిహారీలే మీకు కనిపిస్తారు. కానీ ఇంత కష్టపడి పనిచేస్తున్నా వారికి గౌరవం లభించడం లేదు. బిహారీలు అందరినీ బాబూ అని పిలుస్తుంటారు...కానీ అందరూ వారిని నీచంగానే చూస్తారు. మామిడి పండు బెంగాలీ బాబుల కోసం, ఆ పండులోని టెంక మాత్రమే మాకు మిగిలేది," అని ఆమె గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చారు.

మీనా యాదవ్ భాషకూ, గుర్తింపు రాజకీయాలకూ మధ్య నేర్పుగా మాటలను కలుపుతారు

"చెన్నైలో మేం (భాషాపరమైన) అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాం," ఆమె కొనసాగించారు. “వాళ్ళు హిందీ లేదా భోజ్‌పురి మాట్లాడితే ప్రతిస్పందించరు. మాకు తెలియని వారి సొంత భాషలోనే మాట్లాడతారు. కానీ ఇక్కడలా కాదు,” అన్నారు మీనా. “చూడండి, బిహారీ అనేది ఒక్క భాష కాదు. ఇంట్లో మేం 3-4 భాషల్లో మాట్లాడతాం. కొన్నిసార్లు భోజ్‌పురి, కొన్నిసార్లు హిందీ, కొన్నిసార్లు దర్భంగియా (మైథిలి), కొన్నిసార్లు బంగ్లా మాట్లాడుతాం. కానీ మాకు దర్భంగియాలో మాట్లాడటమే చాలా తేలిక,” అని బిహార్‌లోని ఛప్రాకు చెందిన 45 ఏళ్ళ మీనా చెప్పారు.

"మేం ఆరా, ఛప్రా బోలి(పలుకుబడి)ని కూడా వాడతాం. ఎలాంటి సమస్య లేదు. మేం ఏ భాషలో మాట్లాడాలనుకున్నా మాట్లాడుతాం,” ఆమె బహుభాషలు తెలిసినవారికుండే ఒక ఆశ్చర్యకరమైన సౌలభ్యంతో చెప్పారు. ఇంకా, ఈ భాషలన్నింటిలో తనకున్న జ్ఞానానికీ, తన అసాధారణ నైపుణ్యాలకూ ఏదైనా సంబంధం ఉండవచ్చనే ఆలోచనతో ఆమె తనను తాను మోసం చేసుకోవాలనుకోలేదు.

PHOTO • Smita Khator

బీహార్ నుండి వలస వచ్చిన మీనా యాదవ్, దక్షిణ కొల్‌కతాలోని లేక్ మార్కెట్ ప్రాంతంలో మొక్కజొన్న పొత్తులను విక్రయిస్తారు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఆమె భోజ్‌పురి, బంగ్లా, మైథిలి, హిందీ భాషలకు సులభంగా మారిపోయి మాట్లాడుతుంటారు. ఆమె ఆరా, ఛప్రా బోలిలో కూడా సంభాషించగలరు

'ప్రపంచాన్ని దాని బహుళత్వంలో వ్యక్తీకరించే మార్గాలను ఉత్సవంగా జరుపుకోవడం' అనే చర్చ తప్పనిసరిగా యునెస్కో (అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది) డైరెక్టర్ జనరల్ కోసం కేటాయించాలి. మీనా విషయానికొస్తే, ఇది చాలా ముక్కుసూటి విషయం. ఆమె తన యజమానుల, కొనుగోలుదారుల, తన తక్షణ సముదాయపు భాషను నేర్చుకొని ఉండాల్సిన అవసరం ఉంది. "చాలా భాషలను తెలుసుకొనివుండటం మంచిదే కావచ్చు, కానీ మా బ్రతుకుతెరువు కోసం అవసరం కాబట్టి వాటిని మేం నేర్చుకున్నాం" అని ఆమె చెపుతారు.

ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా  PARI మీనా వంటి వ్యక్తులతో - పేద వలసదారులు, తమ స్వంత దేశంలోనే తరచుగా బయటి వ్యక్తులుగా పరిగణించబడేవారు, తాము పుట్టిన భాష నుండి విడిపోయినవారు - మాట్లాడింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న వారంతా నివసించే, సంరక్షించే, సృష్టించే భాషా విశ్వంలోకి ప్రవేశించడానికి మేం ప్రయత్నించాం.

పుణెలోని వలస కార్మికుడు శంకర్ దాస్ అస్సా మ్‌లోని కాఛార్ జిల్లా  బొర్‌ఖోలా బ్లాక్‌లోని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన సవాలును ఎదుర్కొన్నారు. స్వగ్రామమైన జారాయల్‌తొలాలో పెరుగుతున్నప్పుడు, అతని చుట్టుపక్కల నివసించేవారంతా బంగ్లా మాట్లాడేవారే. దాంతో అతను రాష్ట్ర అధికార భాష అయిన అస్సామీని ఎన్నడూ నేర్చుకోలేదు. ఇరవై ఏళ్ళ వయసులో తన ఇంటిని విడిచిపెట్టిన శంకర్, పుణేలో గడిపిన దశాబ్దంన్నర కాలంలో తన హిందీని మెరుగుపరచుకోవడంతోపాటు స్థానిక మరాఠీ భాషను కూడా నేర్చుకున్నారు.

"నాకు మరాఠీ చాలా బాగా వచ్చు. పుణే అంతటా విస్తృతంగా తిరిగాను. కానీ నేను అస్సామీ మాట్లాడలేను. అర్థమవుతుంది కానీ మాట్లాడలేను," అన్నారు 40 ఏళ్ళ శంకర్. కోవిడ్ విజృంభించిన సమయంలో పుణేలోని ఒక ఎటిఎమ్ వద్ద తాను చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం పోవటంతో ఆయన పనికోసం వెతుక్కుంటూ తిరిగి అస్సామ్ రావాల్సివచ్చింది. తన గ్రామమైన జారాయల్‌తలాలో పనులేమీ దొరకకపోవటంతో గువాహాటీకి వెళ్ళిన శంకర్‌కు అస్సామీ భాష రాకపోవడం వలన అక్కడా పని దొరకలేదు.

మీనా విషయానికొస్తే, ఇది చాలా ముక్కుసూటి విషయం. 'చాలా భాషలను తెలుసుకొనివుండటం మంచిదే కావచ్చు, కానీ మా బ్రతుకుతెరువు కోసం అవసరం కాబట్టి వాటిని మేం నేర్చుకున్నాం,' అని ఆమె చెపుతారు

వీడియో చూడండి: బిహార్ నుంచి మీనా యాదవ్, ఝార్ఖండ్ నుంచి ప్రఫుల్ సురిన్ తమ అనుభవాలను వివరిస్తున్నారు

"ఉద్యోగం ఇచ్చేవారితో మాట్లాడటం అటుంచి, ఇక్కడ బస్సు ఎక్కడం కూడా కష్టంగా ఉంది," అని ఆయన చెప్పారు. “నేను పుణేకి తిరిగి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను. అక్కడైతే నాకు పని దొరుకుతుంది, భాషకు కూడా అంత సమస్య ఉండదు." ఇప్పుడతని మనసు తాను పుట్టిన ప్రదేశంపై లేదు.

గువాహాటీకి రెండు వేల కిలోమీటర్ల దూరంలో, దేశ రాజధానిలో ఉన్న పదమూడేళ్ళ ప్రఫుల్ సురిన్ బడిలో చదువును కొనసాగించడం కోసం హిందీ నేర్చుకోవడానికి కష్టపడుతున్నాడు. ప్రఫుల్ తండ్రి ప్రమాదంలో మరణించడంతో, ఝార్ఖండ్‌ రాష్ట్రం, గుమ్లాలోని పహన్‌టోలీ కుగ్రామంలో ఉన్న తన ఇంటికి 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూఢిల్లీలోని మునిర్కా గ్రామానికి రావాల్సి వచ్చింది అక్కడ అతని బువా (తండ్రి సోదరి- అత్త) ఉంటుంది. "నేనిక్కడకు వచ్చినప్పుడు చాలా ఒంటరినైనట్టు అనిపించేది," అని ప్రఫుల్ చెప్పాడు. “ఇక్కడ ముండారీ భాష ఎవరికీ తెలియదు. ఇక్కడంతా హిందీ మాట్లాడతారు."

ప్రఫుల్ ఈ నగరానికి రావడానికి ముందు తన గ్రామంలో ఉన్న బడిలో హిందీ, ఆంగ్ల భాషలలోని కొన్ని వర్ణమాలలను నేర్చుకున్నాడు. కానీ అవి భాషను అర్థం చేసుకోవడానికి గానీ, వ్యక్తీకరించడానికి గానీ సరిపోలేదు. ఢిల్లీలో రెండు సంవత్సరాల చదువు, బువా ఏర్పాటుచేసిన కొన్ని ప్రత్యేక ట్యూషన్ తరగతుల తర్వాత, తానిప్పుడు "బడిలో ఉన్నప్పుడు, లేదా స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు కొంచెం హిందీ మాట్లాడగలుగుతున్నా," అని ప్రఫుల్ చెప్పాడు. “అయితే ఇంట్లో నేను మా బువా తో ముండారిలోనే మాట్లాడతాను. అదే నా మాతృభాష.”

ఢిల్లీకి మరో 1,100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పదేళ్ళ వయసున్న ప్రీతి తాను చేరిన పాఠశాలలో కొనసాగాలని కోరుకోవటంలేదు. ఆమె తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది, కానీ తాను సౌకర్యంగా భావించే తన మాతృభాషకు దూరమైపోయింది.

లతా భోయీ (40), ఆమె భర్త సురేంద్ర భోయీ (60) మలువా కోందు ఆదివాసీ తెగకు చెందినవారు. ఒడిశా రాష్ట్రం కలాహాండీలోని కెందుపారా గ్రామం నుంచి రాయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్‌ ఫామ్‌హౌస్‌లో కేర్‌టేకర్లుగా పని చేసేందుకు వచ్చారు. వారికి తమ పని గురించి మాట్లాడటానికి అవసరమైనంత ఛత్తీస్‌గఢీ పరిజ్ఞానం ఉండటంతో ఆ పొలంలో పనిచేసే ఇతర కూలీలతో మాట్లాడగలిగేవారు.. "మేం 20 సంవత్సరాల క్రితం రోజీ రోటీ (జీవనోపాధి) కోసం ఇక్కడికి వచ్చాం" అని లత చెప్పారు. "నా కుటుంబ సభ్యులంతా ఒడిశాలోనే ఉంటున్నారు. అందరూ ఒడియా మాట్లాడతారు. కానీ నా పిల్లలకు మాత్రం మా భాషలో చదవడం, రాయడం రాదు. వారు మాట్లాడగలరంతే. ఇంట్లో మేమందరం మాట్లాడతాం. నాకు కూడా ఒడియా చదవడం, రాయడం రాదు. మాట్లాడటం ఒక్కటే తెలుసు.” వారి చిన్న కుమార్తె ప్రీతి హిందీ కవితలను ఇష్టపడుతుంది, కానీ బడికి వెళ్ళటాన్ని మాత్రం ద్వేషిస్తుంది.

PHOTO • Pankaj Das
PHOTO • Nirmal Kumar Sahu
PHOTO • Nirmal Kumar Sahu

శంకర్ దాస్ (ఎడమ). పుణేలో దశాబ్దంన్నర కాలంపాటు నివాసమున్న తర్వాత ఈయన మరాఠీ మాట్లాడగలరు కానీ మాతృభాష అస్సామీ తెలియకపోవటం వలన తన సొంత రాష్ట్రంలో ఉద్యోగాన్ని పొందలేరు. లతా భోయీ (కుడి) కుమార్తె ప్రీతి భోయీ (మధ్య). వీరు ఒరిస్సా నుండి వలస వచ్చి ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తున్నవారు. తన తరగతి పిల్లలు ఆటపట్టిస్తుండడంతో ప్రీతికి ప్రస్తుతం చదువుతున్న బడిలో కొనసాగడం ఇష్టంగాలేదు

“నేను నా తరగతి పిల్లలతో ఛత్తీస్‌గఢీలో మాట్లాడగలుగుతున్నాను. కానీ ఇకపై ఇక్కడ చదువుకోవడం మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నా బడి స్నేహితులు నన్ను ' ఒడియా - ఢోడియా ' అని పిలిచి ఆటపట్టిస్తారు," అని ఆమె చెప్పింది. ఛత్తీస్‌గఢీలో ఢోడియా అంటే విషం లేని పాముల జాతికి చెందినది, ఇది చాలా పిరికి స్వభావం కలిగి ఉంటుంది. షెడ్యూల్డ్ జాతుల కోటా కింద ప్రీతిని ఒడిశాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించాలని ఆమె తల్లిదండ్రులు అనుకుంటున్నారు.

తల్లిదండ్రుల నుంచి, భూమి నుంచి, భాష నుంచి అమిత చిన్నవయసులోనే వేరుపడటమనేది దాదాపు ప్రతి వలసదారుడి కథగానూ ఉంది.

నాగేంద్ర సింగ్(21), కేవలం 8 సంవత్సరాల వయస్సులోనే రోజ్ గార్ (పని)ను వెతుక్కుంటూ ఇంటి నుండి బయటకువచ్చి ఒక క్రేన్ ఆపరేటింగ్ సర్వీస్‌లో క్లీనర్‌గా చేరాడు. అతని ఇల్లు ఉత్తరప్రదేశ్‌లోని కుశీనగర్ జిల్లా జగదీశ్‌పూర్ గ్రామంలో ఉంది. అక్కడ వారు భోజ్‌పురి మాట్లాడేవారు. "ఇది హిందీకి చాలా భిన్నంగా ఉంటుంది," అని అతను వివరించాడు. "మేం భోజ్‌పురిలో మాట్లాడటం ప్రారంభిస్తే మీకది అర్థం కాదు." అతను 'మేం' అని చెప్తున్నది తన ముగ్గురు రూమ్‌మేట్స్ గురించి. వీరు ఉత్తర బెంగుళూరులోని ఒక నిర్మాణ ప్రదేశంలో సహోద్యోగులు, పెయింటర్లు. అలీ(26), మనీశ్(18), నాగేంద్రలు వారి వారి వయస్సు, గ్రామం, మతం, కులం ద్వారా మాత్రమే వేరు కానీ అందరి మాతృభాష భోజ్‌పురి కావటం వలన ఏకమయ్యారు.

యుక్తవయస్సులో ఉండగానే వీరంతా గ్రామాలలోని తమ ఇళ్లను, భాషను విడిచిపెట్టారు. "మీకే పనుల్లోనైనా నైపుణ్యాలు ఉంటే మీకు సమస్యే ఉండదు," అని అలీ చెప్పాడు. "నేను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాను. కావాలంటే మీకు నా పాస్‌పోర్ట్ కూడా చూపించగలను. నేను అక్కడే నా ఆంగ్లాన్నీ, హిందీనీ మెరుగుపరచుకున్నాను." ఇది చాలా సులభంగా జరిగిపోతుంది- వివరించేందుకు నాగేంద్ర సంభాషణలో చేరాడు. “మేం ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తాం. గాఁవ్ కా కోయి లడ్కా బులా లేతా హై , హమ్ జాతే హై (ఊరికి చెందిన అబ్బాయెవరైనా మమ్మల్ని పిలుస్తాడు, మేం వెళ్తాం)," అని అతను చెప్పాడు.

"ఈ అంకుల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు" అంటూ నాగేంద్ర మదురైకి చెందిన 57 ఏళ్ల సుబ్రమణ్యం అనే సహోద్యోగి వైపు చూపించాడు. అతనికి తమిళం మాత్రమే తెలుసు. “మేం సంకేత భాషను ఉపయోగిస్తాం. మేం ఆయనతో ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు, ఇక్కడున్న వడ్రంగితో చెప్తాం. అతను దానిని అంకుల్‌కు తెలియజేస్తాడు. కానీ మాలో మేం మాత్రం భోజ్‌పురి మాట్లాడుకుంటాం. నేను సాయంత్రం గదికి వెళ్ళాక, వంట చేసుకుంటూ భోజ్‌పురి పాటలు వింటాను,” అతను తనకు ఇష్టమైన పాటనొకదాన్ని మాకు వినిపించడం కోసం తన మొబైల్‌ని బయటకు తీస్తూ చెప్పాడు.

PHOTO • Pratishtha Pandya
PHOTO • Pratishtha Pandya

ఉత్తర బెంగుళూరులోని నిర్మాణ ప్రదేశంలో పెయింటర్లుగా పనిచేసే నాగేంద్ర సింగ్ (ఎడమ), అబ్బాస్ అలీ (కుడి). వయస్సు, గ్రామం, మతం ద్వారా వీళ్ళు వేరు వేరు కావచ్చు కానీ వారు మాట్లాడే భోజ్‌పురి భాష వలన ఐక్యంగా ఉంటారు

PHOTO • Pratishtha Pandya
PHOTO • Pratishtha Pandya

ఎడమ: తమిళనాడుకు చెందిన సుబ్రమణియం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీశ్‌లు కలిసి నిర్మాణ స్థలంలో పెయింటర్లుగా పనిచేస్తున్నారు. వారు సంభాషించుకోవడానికి సంకేత భాషను ఉపయోగిస్తారు. కుడి: నాగేంద్ర సింగ్ స్వయంగా తయారుచేసుకున్న ఆహారాన్ని తింటున్నాడు. కానీ అందులో అతనికి తన పల్లెటూరి రుచి దొరకటంలేదు

అలవాటైన ఆహారం, శ్రావ్యమైన పాటలు, పండుగలు, మన సంస్కృతితో ముడిపడి ఉన్న అస్పష్టమైన నమ్మకాలు మనకు తరచుగా భాషా అనుభవాలుగా కలుగుతాయి. అందువలన, వారి మాతృభాష గురించి అడిగినప్పుడు, PARI మాట్లాడిన చాలామంది వ్యక్తులు సంస్కృతికి సంబంధించిన సంభాషణల్లోకి జారిపోయారు.

ముంబైలో గృహ సహాయకుడిగా పనిచేయడానికి బిహార్‌లోని తన స్వగ్రామమైన పర్తాపూర్‌ను విడిచిపెట్టి రెండు దశాబ్దాలకు పైబడినా, 39 ఏళ్ల బసంత్ ముఖియా వద్ద మైథిలి గురించి ప్రస్తావన రావడంతోనే, ఆయన మనసు ఇంటి ఆహారం, మైథిలి భాషలోని పాటల జ్ఞాపకాలతో నిండిపోయింది. "నాకు సత్తు (వేయించిన సెనగపప్పుతో చేసిన పిండి) అంటే చాలా ఇష్టం. చురా లేదా పోహా (అటుకులు) అంటే కూడా," అన్నారతను.  వాటిలో కొన్ని ఆయనకు ముంబైలో దొరుకుతాయి. కానీ "వాటికి నా గ్రామంలో ఉండే రుచి లేదు," అంటూ బసంత్, “మా దగ్గర ప్రతి శనివారం మధ్యాహ్న భోజనంలో ఖిచిడీ , సాయంత్రపు చిరుతిండిగా భూజా తింటాం. భూజా అంటే అటుకులు, వేయించిన వేరుశెనగలు, వేయించిన మినపపప్పులకు ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఆవ నూనె, ఇతర మసాలాలు కలిపి తయారుచేస్తారు. ఇక్కడ ముంబైలో శనివారం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో కూడా నాకు తెలియదు,” ఆశాభంగం నిండిన చిరునవ్వుతో చెప్పారు.

అతనికి జ్ఞాపకానికి వచ్చే మరో విషయం ఏమిటంటే, తమ గ్రామంలో హోలీ ఆడే విధానం. “ఆ రోజు హెచ్చరికలేమీ లేకుండా ఒక స్నేహితుల బృందం మీ ఇంట్లోకి దూసుకొస్తుంది. మేం రంగులతో ఆడుకుంటాం. ఆపైన దిగమింగడానికి మాల్పువా (రవ్వ, మైదా, పంచదార, పాలు ఉపయోగించి హోలీ రోజున చేసే ప్రత్యేక మిఠాయి) ఉంటుంది. హోలీకి సంబంధించిన ఫగువా పాటలు పాడతాం” అని బసంత్ చెప్పారు. తన మాతృభాష కాని భాషలో ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన సొంత ఊరికి చెందిన చిత్రాలు స్పష్టంగా సజీవంగా నిలిచాయి.

"మీ స్వంత ఊరి నుండి వచ్చినవారితో, మీ భాష మాట్లాడేవారితో కలిసి పండుగ జరుపుకోవడంలో ఉన్న ఆనందాన్ని మించింది మరొకటి లేదు," అంటూ ఆయన దుఃఖపడ్డారు.

రాజు అనే పిలుపుకు ఆనందించే అలహాబాద్‌లోని అమిలౌటీ గ్రామానికి చెందిన రాజు దీనికి అంగీకరించారు. అతను గత 30 సంవత్సరాలుగా పంజాబ్‌లో జీవనోపాధిని పొందుతున్నారు. అహిర్ సముదాయానికి చెందిన ఈయన, తన ఇంట్లో అవధిలో మాట్లాడేవారు. అమృత్‌సర్‌కు మొదటిసారి వచ్చినప్పుడు ఈయన చాలా కష్టపడ్డారు. "కానీ ఈ రోజు నేను పంజాబీలో అనర్గళంగా మాట్లాడుతున్నాను, అందరూ నన్ను ప్రేమిస్తారు," అని అతను సంతోషంగా చెప్పారు.

PHOTO • Swarn Kanta
PHOTO • Swarn Kanta

ముంబైలో రెండు దశాబ్దాలకు పైగా గృహ సహాయకునిగా పనిచేస్తున్న బసంత్ ముఖియా, తన గ్రామానికి సంబంధించిన మాటలనూ పాటలనూ కోల్పోయారు. తన మాతృభాష మైథిలి గురించి ప్రస్తావించగానే అతని మనసు ఇంటి తిండి జ్ఞాపకాలతో నిండిపోతుంది

PHOTO • Kamaljit Kaur
PHOTO • Kamaljit Kaur

పంజాబ్‌లోని పాఁటీ పట్టణంలో పండ్లు అమ్ముతుండే అలహాబాద్‌లోని అమిలౌటీకి చెందిన రాజు. పంజాబీని అనర్గళంగా మాట్లాడే రాజు, తన గ్రామంలో వారు జరుపుకునే పండుగల సంబరాలను కోల్పోయారు

అయినప్పటికీ, పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలోని పాఁటీ పట్టణంలో పండ్లను విక్రయించే రాజు తన పండుగల సంబరాలను కోల్పోయారు. పనిభారం అతన్ని తరచుగా తన గ్రామానికి వెళ్ళనీయకుండా ఆపుతోంది. "ఇక్కడ మా స్వంత పండుగలను జరుపుకోవడం అసాధ్యం," అని అతను చెప్పారు. "100 మంది వ్యక్తులు జరుపుకునే పండుగలో ఒకరు పాల్గొనగలరు, కానీ కేవలం ఇద్దరో నలుగురో మాత్రమే జరుపుకునే పండుగలో ఎవరు చేరతారు చెప్పండి?"

దేశానికి మరొక చివరన, రాజస్థాన్ నుండి తన భర్తతో కలిసి పని వెతుక్కుంటూ కేరళకు వచ్చిన షబానా షేక్ (38) అదే ప్రశ్న అడుగుతున్నారు. “మేం మా గ్రామంలో మా పండుగలు జరుపుకుంటాం, అలా జరుపుకోవడంలో సిగ్గుపడేదేమీ లేదు. అయితే కేరళలో వాటిని మేం ఎలా జరుపుకోవాలి?" అని ఆమె అడుగుతారు. "దీపావళి పండుగకు కేరళలో అంతగా వెలుతురు ఉండదు. కానీ రాజస్థాన్‌లో ఈ పండుగ సమయంలో మేం మట్టి దీపాలను వెలిగిస్తాం. అదంతా చాలా అందంగా కనిపిస్తుంది,” అని ఆమె చెప్పారు. పండుగ జ్ఞాపకాలతో ఆమె కళ్ళు వెలిగిపోయాయి.

మేం మాట్లాడిన ప్రతి వలసదారుల భాష, సంస్కృతి, జ్ఞాపకశక్తి మధ్య సంబంధం చక్కగా ముడిపడి ఉంది. కానీ ఇంటి నుండి దూరంగా మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న వారు, ఆ సంబంధాలను సజీవంగా ఉంచడానికి తమ తమ స్వంత మార్గాలను కూడా కనుగొన్నారు.

60ల వయస్సులో ఉన్న మషారు రబారీకి నాగ్‌పూర్, వార్ధా, చందరాపూర్ లేదా యవత్‌మాళ్‌లోని ఏదో ఒక మైదానంలో తప్ప శాశ్వత చిరునామా లేదు. మధ్య విదర్భకు చెందిన ఈ పశుపోషకుడు, గుజరాత్‌లోని కచ్ నుండి వచ్చారు. "ఒక రకంగా చెప్పాలంటే నేనే వర్హాడీని," అంటారు, సాధారణ రబారీ వేషధారణ అయిన కుచ్చులుపోసిన పై వస్త్రం, ధోవతి, తెల్లటి తలపాగా ధరించి ఉన్న ఈయన. విదర్భకు చెందిన స్థానిక సంస్కృతిలో స్థిరపడిపోయిన ఈయన అవసరమైనప్పుడు స్థానిక పాదపూరణాలను, యాసలను కూడా విరివిగా వదులుతుంటారు! అయినప్పటికీ, తన నేలకు చెందిన సంప్రదాయాలతో, సంస్కృతితో తన సంబంధాలను చెక్కుచెదరకుండా ఉంచుకున్నారు. ఒక మైదానం నుండి మరో మైదానానికి ప్రయాణించే ఒంటెల మూపులపై పేర్చిన అతని వస్తువులతో పాటు ఆయనకు చెందిన జానపద కథలు, వారసత్వంగా వచ్చిన జ్ఞానం, పాటలు, జంతు ప్రపంచం గురించిన సంప్రదాయ జ్ఞానం, జీవావరణ శాస్త్రం, ఇంకా మరెన్నో ప్రయాణిస్తుంటాయి.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Rajeeve Chelanat

ఎడమ: విదర్భలోని పత్తి పొలాల్లో నివసిస్తున్న కచ్‌కు చెందిన మషరు రబారీ. ఈయన తనను తాను వర్హాడీగా పిలుచుకుంటారు. కుడి: రాజస్థాన్‌కు చెందిన షబానా షేక్ (ఎడమ చివర). ఈమె తన భర్త మహమ్మద్ అల్వార్ (కుడి), కుమార్తె సానియా షేక్ (మధ్యలో)తో కలిసి కేరళలో  నివసిస్తున్నారు. తన గ్రామంలోని దీపావళి వెలుగులను ఆమె ఎంతగానో కోల్పోతున్నారు

ఝార్ఖండ్‌కు చెందిన తవ్వకాల యంత్రాన్ని నడిపించే షానఉల్లా ఆలమ్ (25) ప్రస్తుతం కర్ణాటకలోని ఉడుపిలో నివసిస్తున్నాడు. పని ప్రదేశంలో హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగేవాడు ఇతనొక్కడే. అతని స్వంత మనుషులతోనూ, భాషలోనూ మాట్లాడేందుకు అతనికున్న ఏకైక సాధనం అతని మొబైల్ ఫోన్ మాత్రమే. ఝార్ఖండ్‌లోని ఉత్తర చోటానాగ్‌పూర్, సంతాల్ పరగణాలలో మాట్లాడే హిందీ లేదా ఖోర్తాలో అతను తన కుటుంబంతోనూ, స్నేహితులతోనూ మాట్లాడుతుంటారు

ఝార్ఖండ్‌కు చెందిన మరో యువ వలసదారుడైన 23 ఏళ్ల సొబిన్ యాదవ్ కూడా తనకు పరిచయమున్న పరిసరాలతో సన్నిహితంగా ఉండటానికి తన మొబైల్‌పైనే ఆధారపడుతుంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతను 'క్రికెటర్ ధోని ఇంటికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో' ఉన్న మఝ్‌గాఁవ్ గ్రామం నుండి చెన్నైకి మారాడు. చెన్నైలోని ఓ తినుబండారాలశాలలో పనిచేస్తున్న అతనికి హిందీ మాట్లాడే అవకాశం ఎప్పటికోగాని రాదు. ప్రతిరోజూ సాయంత్రం భార్యతో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు మాత్రమే అతను తన మాతృభాషను ఉపయోగిస్తాడు. “నేను నా మొబైల్ ఫోన్‌లో హిందీలోకి డబ్ చేసిన తమిళ చిత్రాలను కూడా చూస్తుంటాను. సూర్య నాకు ఇష్టమైన నటుడు," అని అతను తమిళంలో చెప్పాడు.

"హిందీ, ఉర్దూ, భోజ్‌పురి... ఏ భాషా ఇక్కడ పని చేయదు. చివరకు ఆంగ్లం కూడా. హృదయ భాష మాత్రమే పని చేస్తుంది," అంటారు వినోద్ కుమార్. బిహార్‌లోని మోతిహారీ గ్రామానికి చెందిన ఈ 53 ఏళ్ల తాపీ మేస్త్రీ, కశ్మీర్‌లోని బారామూలా జిల్లా, పత్తన్ బ్లాక్‌లోని సాజిద్ గనీకి చెందిన వంటగదిలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. సాజిద్ స్థానికంగా అతని యజమాని. "ఒక కూలీ పక్కనే కూర్చుని తింటున్న ఇంటి యజమాని - మీరు దీన్ని ఎక్కడైనా చూశారా?" సాజిద్ వైపు చూపిస్తూ వినోద్ మమ్మల్ని అడిగారు. “అతనికి నా కులం కూడా తెలియదని నేననుకోను. అక్కడ నేను ముట్టుకుంటే జనం నీళ్ళు కూడా తాగరు. ఇక్కడితను నాకు తన వంటగదిలో తిండిపెట్టి, నా పక్కనే కూర్చుని తింటున్నాడు!"

వినోద్ పని కోసం కశ్మీర్‌కు వచ్చి ఇప్పటికి 30 ఏళ్లు. "1993లో నేను మొదటిసారిగా కశ్మీర్‌కు కూలీగా వచ్చాను. నాకు కశ్మీర్ గురించి పెద్దగా అవగాహన లేదు. అప్పట్లో మీడియా ఇప్పట్లా ఉండేది కాదు. వార్తాపత్రికలు కొంత సమాచారం అందించినా, నాకెలా తెలుస్తుంది? నాకు చదవడం, రాయడం రాదు. మాకు ఠేకేదార్ నుండి పిలుపు రాగానే, మేం మా రొట్టెను సంపాదించుకోవడానికి వెళ్ళేవాళ్ళం,” అని అతను వివరించారు.

PHOTO • Shankar N. Kenchanuru
PHOTO • Rajasangeethan

ఎడమ: కర్ణాటకలోని ఉడుపిలో తవ్వకాల యంత్రం ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఝార్ఖండ్‌కు చెందిన షానఉల్లా ఆలమ్. అతను తన కుటుంబంతోనూ, స్నేహితులతోనూ ఫోన్‌లో హిందీ లేదా ఖోర్తాలో మాట్లాడతాడు. కుడి: ఝార్ఖండ్‌కే చెందిన సొబిన్ యాదవ్ తన భార్యతో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు హిందీలోనూ; చెన్నైలో తాను పనిచేసే తినుబండారాలశాలలో తమిళంలోనూ మాట్లాడతారు

"అప్పుడు నేను అనంతనాగ్ జిల్లాలో ఉద్యోగం చేశాను," అంటూ ఆయన తన ప్రారంభ దినాలను గుర్తుచేసుకున్నారు. “అంతా మూసుకుపోయిన రోజొకటి వచ్చింది. నా జేబులో పైసా లేదు, చాలా రోజులు ఉద్యోగం లేకుండా ఉన్నాను. కానీ ఇక్కడి గ్రామస్థులు నాకు, మా అందరికీ కూడా సహాయం చేశారు. మేం 12 మందిమి కలిసి ఉన్నాం. వాళ్ళు మాకు తిండిపెట్టారు. ఈ భూమిపై ఎవరైనా ఎలాంటి దురుద్దేశం లేకుండా ఇలా సహాయం చేస్తారా చెప్పు?" అని అడిగారు. వినోద్ మాట్లాడుతుండగా, అతని మర్యాదపూర్వకమైన అభ్యంతరాలను పట్టించుకోకుండా సాజిద్, ఆయన పళ్ళెంలో అదనపు చికెన్ ముక్కను జార్చడానికి ప్రయత్నిస్తున్నారు.

"నాకు కశ్మీరీ పదం ఒక్కటి కూడా అర్థం కాదు," వినోద్ కొనసాగించారు. “కానీ ఇక్కడ అందరికీ హిందీ అర్థమవుతుంది. అదే ఇప్పటివరకూ బాగా పనిచేసింది."

"భోజ్‌పురి (అతని మాతృభాష)సంగతేమిటి?" మేమతన్ని అడిగాం.

"దాని గురించి ఏముంటుంది?" అతను ఎదురు ప్రశ్నించారు. "నా తోటి గ్రామస్థులు వచ్చినప్పుడు, మేం భోజ్‌పురిలో మాట్లాడుకుంటాం. అయితే నేనిక్కడ భోజ్‌పురిలో ఎవరితో మాట్లాడేది? మీరే చెప్పండి ..." అని అడుగుతారు. ఆపైన అతను నవ్వి, "నేను సాజిద్ భాయ్‌కి నా మాతృభాషని కొంచెం నేర్పించాను . కా హో సాజిద్ భాయ్ ? కైసన్ బనీ ? (ఏంటి సాజిద్‌భాయ్? ఎలా ఉన్నావు?)" అన్నారు.

" ఠీక్ బా (నేను బాగున్నాను)" సాజిద్ జవాబిచ్చారు.

"అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరుగుతాయి. అయితే ఈసారి రండి, మా భాయ్ మీ కోసం రితేశ్ (భోజ్‌పురి నటుడు) పాటొకటి పాడతారు!"

ఈ కథనాన్ని ఢిల్లీ నుంచి మొహమ్మద్ కమర్ తర్బేజ్; పశ్చిమ బెంగాల్ నుంచి స్మితా ఖటోర్; కర్ణాటక నుంచి ప్రతిస్ఠ పాండ్యా, శంకర్ ఎన్. కెంచానుర్; కశ్మీర్ నుంచి దేవేశ్; తమిళనాడు నుంచి రాజాసంగీతన్, ఛత్తీస్‌గఢ్ నుంచి నిర్మల్ కుమార్ సాహు, అస్సామ్ నుంచి పంకజ్ దాస్; కేరళ నుంచి రాజీవ్ చేలనత్; మహారాష్ట్ర నుంచి జైదీప్ హర్దీకర్, స్వర్ణకాంత; పంజాబ్ నుంచి కమల్‌జిత్ కౌర్. మేధా కాలే, స్మితా ఖటోర్, జాషువా బోధినేత్ర, సన్వితి అయ్యర్‌ల సంపాదకీయ మద్దతుతో ప్రతిష్ఠ పాండ్యా సంపాదకత్వం వహించారు. బినయ్‌ఫర్ భరూచా ఫోటో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్: శ్రేయా కాత్యాయని.

ముఖపత్ర చిత్రణ: లావణి జంగి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

PARI Team

ಪರಿ ತಂಡ

Other stories by PARI Team
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli