సాత్‌జేలియాలో ఉన్న ఏకైక తపాలా కార్యాలయం మీ కన్నుగప్పి జారిపోతే ఆశ్చర్యమేమీ లేదు. ఒక చిన్న మట్టి ఇంటి బయట వేలాడుతుండే లోహపు ఎరుపు ఉత్తరాల పెట్టె ఒక్కటే దానికి గుర్తు.

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉండే 80 ఏళ్ళ వయసున్న ఈ ఉప-తపాలా కార్యాలయం ఏడు గ్రామ పంచాయతీలకు తన సేవలను అందిస్తోంది. సుందరబన్స్‌లో విధ్వంసాన్ని సృష్టించిన ఆలియా, ఆంఫన్ వంటి భీకర తూఫానుల ధాటిని కూడా ఈ మట్టి గుడిసె తట్టుకొని నిలిచింది. ఇక్కడ పొదుపు ఖాతా ఉన్న గ్రామస్థులకు ఈ కార్యాలయమే ఒక జీవనరేఖ; వివిధ రకాల గుర్తింపు కార్డుల వంటి ప్రభుత్వ పత్రాలన్నీ ఈ పోస్టాఫీసు ద్వారానే వారికి వస్తాయి.

గోసాబా బ్లాక్‌ను మూడు నదులు చుట్టుముట్టి ఉన్నాయి - వాయువ్యాన గోమతి నది, దక్షిణాన దత్తా నది, తూర్పున గాఁదాల్ నది. "ఈ ద్వీప ప్రాంతంలో [ప్రభుత్వ పత్రాలను పొందడానికి] మా ఏకైక ఆశ ఈ పోస్టాఫీసు మాత్రమే," అని లక్సబాగాన్ గ్రామ నివాసి జయంత్ మండల్ చెప్పారు.

ప్రస్తుత పోస్ట్‌మాస్టర్ నిరంజన్ మండల్ గత 40 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఈయనకంటే ముందు ఈయన తండ్రి పోస్ట్‌మాస్టర్‌గా ఉండేవారు. ప్రతి ఉదయం ఆయన తన ఇంటి నుంచి బయలుదేరి కొద్దిదూరంలోనే ఉన్న ఈ కార్యాలయానికి నడిచి వస్తారు. ఈ తపాలా కార్యాలయం సమీపంలోనే ఉన్న స్థానిక టీ దుకాణానికి జనం రోజంతా వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఈ పోస్టాఫీసుకు ఎప్పుడూ జనం వస్తూనే ఉంటారు.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: తపాలా కార్యాలయం దగ్గరలోనే ఉన్న నదీతీరం. కుడి: ఒక చిన్న మట్టి ఇంటి నుండి పనిచేసే ఈ తపాలా కార్యాలయం గోసాబా బ్లాక్‌లోని ఏడు గ్రామ పంచాయతీలకు తన సేవలనందిస్తోంది

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: పోస్ట్‌మాస్టర్ నిరంజన్ మండల్, ఆయన సహాయకుడు బాబు. కుడి: పొదుపు ఖాతాలు ఉన్నవారికి ఈ తపాలా కార్యాలయం ఒక జీవనరేఖ వంటిది. వారి ప్రభుత్వ పత్రాలన్నీ ఇక్కడినుండే తపాలా ద్వారా వారిని చేరతాయి

ఈ 59 ఏళ్ళ పోస్ట్‌మాస్టర్ పని ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఈ తపాలా కార్యాలయంలోకి సౌర ఫలకాల (solar pannels) ద్వారా వెలుతురు వస్తుంది, కానీ వర్షాకాలంలో అంత ప్రభావవంతంగా ఉండదు. ఈ ఫలకాలు ఛార్జి కానప్పుడు, ఇక్కడి ఉద్యోగులు కిరోసిన్ దీపాలను ఉపయోగిస్తారు. వాటి నిర్వహణ కోసం వారికి నెలకు రూ. 100 వస్తాయి. అందులో అద్దెకు రూ. 50 పోగా, మిగిలినవి ఇతర సామగ్రి కోసం అని నిరంజన్ చెప్పారు.

నిరంజన్‌తో పాటు బాబు అనే బంట్రోతు కూడా ఇక్కడ పనిచేస్తారు. గ్రామ పంచాయతీలలోని ఇళ్ళకు ఉత్తరాలు అందించడం ఈయన పని. ఇందుకోసం ఆయన తన సైకిల్‌ను ఉపయోగిస్తారు.

సుమారు అర్ధ శతాబ్దం పాటు ఈ తపాలా కార్యాలయంలో సేవలందించిన నిరంజన్ బాబు కొన్నేళ్ళలో ఉద్యోగ విరమణ చేయనున్నాను. అంతకంటే ముందు "ఒక పక్కా భవన నిర్మాణం ప్రారంభం కావాలన్నదే నాకున్న ఒకానొక కల," అని ఆయన అన్నారు.

ఈ కథన రచనలో సహాయాన్నందించినందుకు ఊర్ణా రౌత్‌కు రిపోర్టర్ ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ritayan Mukherjee

रितायन मुखर्जी, कोलकाता के फ़ोटोग्राफर हैं और पारी के सीनियर फेलो हैं. वह भारत में चरवाहों और ख़ानाबदोश समुदायों के जीवन के दस्तावेज़ीकरण के लिए एक दीर्घकालिक परियोजना पर कार्य कर रहे हैं.

की अन्य स्टोरी Ritayan Mukherjee
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli