నాలుగవ రోజున నేను వచ్చాను; నేనక్కడికి చేరేసరికి మధ్యాహ్నం కావొస్తోంది.

చెన్నై నుంచి వయనాడుకు చేసిన ప్రయాణంలో, స్వచ్ఛందసేవకులతో నిండిన ప్రాంతాలను దాటాను. ఎక్కడా బస్సులు లేవు, అపరిచితులను లిఫ్ట్ అడిగి వెళ్ళాల్సివచ్చింది.

లోపలికీ బయటకూ తిరుగుతోన్న ఆంబులెన్సులతో ఆ ప్రదేశం ఒక యుద్ధభూమిని తలపిస్తోంది. భారీ యంత్రాల సాయంతో జనం మృతదేహాలను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారు. సూరల్‌మల, అట్టమల, ముండక్కై పట్టణాలు శిథిలమైపోయాయి. ఎక్కడా నివాసయోగ్యమైన చోటు ఉన్న సంకేతాలు లేవు. అక్కడ నివసించేవారి జీవితాలు చితికిపోయి, వారు తమ ప్రియమైనవారి మృతదేహాలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు.

నదీతీరాలు శిథిలాలతోనూ, మృతదేహాల కుప్పలతోనూ నిండివున్నాయి. రక్షకులూ, కుటుంబ సభ్యులూ నది ఒడ్డున మృతదేహాల కోసం వెతుకుతూ, తాము ఇసుకలో కూరుకుపోకుండా ఉండేందుకు కర్రలను ఉపయోగిస్తున్నారు. నా కాలు ఇసుకలో ఇరుక్కుపోయింది. అక్కడ మృతదేహాలను గుర్తించడం అసాధ్యం, వాటి శకలాలు మాత్రమే చుట్టూ చెల్లాచెదురుగా పడివున్నాయి. నాకు ప్రకృతితో లోతైన సంబంధం ఉంది, అయినా ఈ అనుభవం నన్ను భయపెట్టింది.

భాషా అడ్డంకి కారణంగా, నేను ఆ వినాశనానికి సాక్షిగా మాత్రమే ఉండగలిగాను. వారికి అడ్డురాకుండా వెనకే ఉండిపోయాను. నేను ఇంతకుముందే ఇక్కడికి రావాలనుకున్నాను, కానీ నా అనారోగ్యం వలన రాలేకపోయాను.

నీటి ప్రవాహాన్ని అనుసరిస్తూ నేను సుమారు మూడు కిలోమీటర్లు నడిచాను. ఇళ్ళు భూమిలోకి పూడుకుపోయివున్నాయి, కొన్నయితే పూర్తిగా కనిపించటమేలేదు. అన్నిచోట్లా స్వచ్ఛందసేవకులు మృతదేహాల కోసం వెదుకుతుండటాన్ని చూశాను. సైన్యం కూడా గాలింపును చేపట్టింది. నేనక్కడ రెండు రోజులు ఉన్నాను, ఆ సమయంలో ఎక్కడా మృతదేహాలు కనిపించలేదు, కానీ వాటి కోసం గాలింపు మాత్రం నిర్విరామంగా సాగింది. అందరూ కలిసి పనిచేస్తూ, ఆహారాన్నీ తేనీటినీ పంచుకుంటూ, పట్టు వదలకుండా పనిచేస్తున్నారు. ఆ ఐక్యతా భావన నన్ను ఆశ్చర్యపరచింది.

PHOTO • M. Palani Kumar

సూరల్‌మల, అట్టమల గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. స్వచ్ఛంద సేవకులు తవ్వే యంత్రాలను ఉపయోగించాల్సి వస్తోంది, కొందరు సహాయంగా తమ సొంత యంత్రాలను తీసుకొచ్చారు

నేను కొంతమంది నివాసితులతో మాట్లాడినప్పుడు, పుదుమల సమీపంలో జరిగిన ఇటువంటి సంఘటన గురించే నాతో చెప్పారు. అక్కడ 2019 ఆగస్టు 8న దాదాపు 40 మంది మరణించగా, 2021లో దాదాపు 17 మంది మరణించారు. ఇది మూడోసారి ఇలా జరగటం. ఇందులో  దాదాపు 430 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మంది గల్లంతైనట్లు అంచనా.

నేను అక్కడినుంచి వచ్చేసిన చివరి రోజున, పుదుమల వద్ద ఎనిమిది మృతదేహాలను ఖననం చేసినట్టుగా సమాచారం అందింది. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు (హిందు, క్రైస్తవ, ముస్లిమ్, ఇంకా ఇతరులు) చెందిన స్వచ్ఛంద సేవకులు హాజరయ్యారు, అన్ని రకాల ఆచారాలను పాటించారు. ఆ ఎనిమిది మృతదేహాలు ఎవరికి చెందినవో ఎవరికీ తెలియదు, కానీ అందరూ కలిసి ప్రార్థనలు చేసి వారిని ఖననం చేశారు.

ఎక్కడా ఏడుపుల శబ్దం లేదు. వర్షం విడవకుండా పడుతూనే ఉంది.

ఇటువంటి దుర్ఘటనలు ఎందుకని ఇక్కడే పదే పదే జరుగుతున్నాయి? ఈ ప్రాంతం మొత్తం మట్టి, రాయి మిశ్రమంలా కనిపిస్తుంది, అదే ఇక్కడి అస్థిరతకు ఒక కారణం కావచ్చు. నేను ఫోటోలు తీసుకునేటప్పుడు, మొత్తం నాకు కనిపించింది ఈ మిశ్రమమే - సరిగ్గా అది పర్వతమూ కాదు, లేదా కేవలం రాయి కూడా కాదు.

నిరంతరాయంగా వర్షం పడటం ఈ ప్రాంతానికి కొంత అసాధారణమైనది. ఉదయం ఒంటి గంట నుండి ఐదు గంటల వరకు కురిసిన వర్షంతో గట్టిదనం లేని ఈ నేల విరిగిపడింది. రాత్రి సమయంలో మూడు కొండచరియలు విరిగిపడ్డాయి. నేను చూసిన ప్రతి భవనం, పాఠశాల నాకు ఈ విషయాన్ని గుర్తుచేసింది. వాలంటీర్లతో మాట్లాడుతూ, అందరూ అక్కడ చిక్కుకుపోయారని నేను గ్రహించాను, వెతుకులాటను కొనసాగిస్తున్నవారు కూడా ఎదో కోల్పోయినట్లుగా కనిపించారు. ఇక అక్కడ నివసించే వ్యక్తులు... వారు ఎప్పటికీ పూర్తిగా కోలుకోలేరు.

PHOTO • M. Palani Kumar

అసంఖ్యాక తేయాకు ఎస్టేటులున్న ప్రాంతంలో వయనాడు విషాదం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నవి తేయాకు ఎస్టేటుల్లో పనిచేసే శ్రామికుల ఇళ్ళు

PHOTO • M. Palani Kumar

ముండక్కై, సూరల్‌మల ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా కోతకు గురైన మట్టిని మోసుకెళుతూ గోధుమ రంగులోకి మారిన నీటితో వేగంగా ప్రవహిస్తోన్న నది

PHOTO • M. Palani Kumar

మట్టి, రాతి మిశ్రమమైన ఇక్కడి భూమి భారీ వర్షం వలన నానిపోయి అస్థిరంగా మారటం, విపత్తుకు గణనీయంగా తోడ్పడింది

PHOTO • M. Palani Kumar

అధిక వర్షం, ప్రవహిస్తోన్న నీరు మట్టి కోతకు దారితీయటంతో ఈ టీ ఎస్టేట్ పూర్తిగా కూలిపోయింది; ఎస్టేట్ శిథిలాల మధ్య మృతదేహాల కోసం వెతుకుతున్న వాలంటీర్లు

PHOTO • M. Palani Kumar

ప్రమాదం నుండి బయటపడిన చాలామంది పిల్లలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు

PHOTO • M. Palani Kumar

రాళ్ళూ, మట్టి అనేక ఇళ్ళను పూడ్చివేశాయి

PHOTO • M. Palani Kumar

ఘోరంగా దెబ్బతిన్న వయనాడులోని తేయాకు ఎస్టేటు శ్రామికుల ఇళ్ళు

PHOTO • M. Palani Kumar

వరద ధాటికి దొర్లిపడిన రాళ్ళ వలన పూర్తిగా దెబ్బతిన్న రెండంతస్తుల ఇల్లు

PHOTO • M. Palani Kumar

తీవ్రంగా దెబ్బతిన్న అనేక వాహనాలు ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండాపోయాయి

PHOTO • M. Palani Kumar

విశ్రాంతి కోసం కొద్ది నిముషాలు వీలు చేసుకొన్న వాలంటీర్లు

PHOTO • M. Palani Kumar

ఇళ్ళు కూలిపోవటంతో, కుటుంబాలు తమ సర్వస్వాన్నీ నష్టపోయాయి. వారి వస్తువులన్నీ తడి మట్టి కింద సమాధి అయ్యాయి

PHOTO • M. Palani Kumar

గాలింపు చర్యలలో స్వచ్ఛందసేవకులతో పాటు సైన్యం కూడా పనిచేస్తోంది

PHOTO • M. Palani Kumar

ఒక మసీదు పరిసరాలలో గాలింపు చర్యలు

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

మట్టిని తరలించడంలోనూ, వ్యక్తులను కనుగొనడంలోనూ సహాయపడుతోన్న యంత్రాలు (ఎడమ). నది వెంబడి మృతదేహాల కోసం వెతుకుతోన్న ఒక వాలంటీర్ (కుడి)

PHOTO • M. Palani Kumar

సహాయక చర్యల్లో కీలక పాత్రను పోషిస్తున్న వాలంటీర్లు

PHOTO • M. Palani Kumar

పూర్తిగా కూలిపోయిన బడి

PHOTO • M. Palani Kumar

తడి మట్టిలో నడిచేటప్పుడు లోపలికి కూరుకుపోకుండా కర్రలను ఉపయోగిస్తోన్న వాలంటీర్లు

PHOTO • M. Palani Kumar

మట్టిని తవ్వటానికీ, తొలగించటానికీ ఉపయోగిస్తోన్న తవ్వే యంత్రాలు

PHOTO • M. Palani Kumar

తిండి తినటం కోసం విరామం తీసుకుంటోన్న వయనాడులో స్వచ్ఛందసేవ చేస్తోన్న స్థానికులూ, ఇతరులూ

PHOTO • M. Palani Kumar

తీవ్రంగా ప్రభావితమైన గ్రామాలలో ఒకటైన పుదుమల 2019, 2021లలో కూడా ఇటువంటి విపత్తులనే ఎదుర్కొంది

PHOTO • M. Palani Kumar

రాత్రంతా పనిచేస్తూ, మృతదేహాల కోసం ఎదురుచూస్తోన్న వాలంటీర్లు

PHOTO • M. Palani Kumar

ఆంబులెన్సుల నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకోవటం కోసం ఎమర్జెన్సీ కిట్లతో సిద్ధంగా ఉన్న వాలంటీర్లు

PHOTO • M. Palani Kumar

ప్రార్థనా మందిరానికి చేర్చిన మృతదేహాలు. మరణించిన వారి కోసం ప్రార్థనలు చేయడానికి గుమిగూడిన అన్ని మతాలకు చెందిన ప్రజలు

PHOTO • M. Palani Kumar

చనిపోయినవారి దేహాలను తెల్లని బట్టలో చుట్టి తీసుకువెళ్తున్నారు

PHOTO • M. Palani Kumar

అనేక మృతదేహాలు గుర్తించడానికి వీలుగా లేవు

PHOTO • M. Palani Kumar

ప్రార్థనా సేవలు ముగిశాక ఖననాలు జరుగుతున్నాయి

PHOTO • M. Palani Kumar

రాత్రంతా పనిచేస్తోన్న వాలంటీర్లు

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

M. Palani Kumar

एम. पलनी कुमार पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया के स्टाफ़ फोटोग्राफर हैं. वह अपनी फ़ोटोग्राफ़ी के माध्यम से मेहनतकश महिलाओं और शोषित समुदायों के जीवन को रेखांकित करने में दिलचस्पी रखते हैं. पलनी को साल 2021 का एम्प्लीफ़ाई ग्रांट और 2020 का सम्यक दृष्टि तथा फ़ोटो साउथ एशिया ग्रांट मिल चुका है. साल 2022 में उन्हें पहले दयानिता सिंह-पारी डॉक्यूमेंट्री फ़ोटोग्राफी पुरस्कार से नवाज़ा गया था. पलनी फ़िल्म-निर्माता दिव्य भारती की तमिल डॉक्यूमेंट्री ‘ककूस (शौचालय)' के सिनेमेटोग्राफ़र भी थे. यह डॉक्यूमेंट्री तमिलनाडु में हाथ से मैला साफ़ करने की प्रथा को उजागर करने के उद्देश्य से बनाई गई थी.

की अन्य स्टोरी M. Palani Kumar
Editor : PARI Desk

पारी डेस्क हमारे संपादकीय कामकाज की धुरी है. यह टीम देश भर में सक्रिय पत्रकारों, शोधकर्ताओं, फ़ोटोग्राफ़रों, फ़िल्म निर्माताओं और अनुवादकों के साथ काम करती है. पारी पर प्रकाशित किए जाने वाले लेख, वीडियो, ऑडियो और शोध रपटों के उत्पादन और प्रकाशन का काम पारी डेस्क ही संभालता है.

की अन्य स्टोरी PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli