అంజన్ గ్రామ శివారులలో ఉన్న ఒక చిన్నగుట్ట కాషాయం, తెలుపు రంగుల జెండాలతో నిండి ఉంది. తెల్ల జెండాలు ప్రకృతిని ఆరాధించే సర్నా ఆదివాసీ సముదాయానికి - ఇక్కడ ఉరాంవ్ ఆదివాసులు - చెందినవి కాగా, కాషాయ జెండాలు ఝార్ఖండ్ రాష్ట్రం, గుమ్లా జిలాలో ఉన్న ఈ కొండపై 1985లో హిందువులు నిర్మించిన హనుమాన్ గుడికి చెందినవి. ఇది తమ దేవుడి జన్మస్థలంగా హిందువులు చెప్పుకుంటారు.

అక్కడి వెదురు గేటుకు రెండు కమిటీల పేర్లు ఉన్న పెద్ద బ్యానర్లు కట్టివున్నాయి. అటవీ శాఖ, అంజన్ గ్రామ నివాసులు (సంయుక్త్ గ్రామ్ వన ప్రబంధన్ సమితి కింద కలిసి పనిచేస్తారు) గుమ్లా వన్ ప్రబంధన్ మండల్ కింద సంయుక్తంగా 2016 నుంచి ఈ తీర్థయాత్రను నిర్వహిస్తున్నారు. 2019లో హిందువులు ఏర్పాటుచేసిన అంజన్ మందిర్ వికాస్ సమితి ఇక్కడి గుడిని నిర్వహిస్తుంటుంది.

స్వాగతం పలుకుతోన్న వెదురు గేటును దాటుకుని లోపలికి వెళ్ళగానే, రెండు వేర్వేరు ఆరాధనా స్థలాలకు దారితీసే రెండు వేర్వేరు మెట్ల వరస మాకు కనిపించింది. ఒక మెట్ల వరుస మిమ్మల్ని తిన్నగా కొండపైనున్న హనుమాన్ గుడికి తీసుకువెళ్తుంది. రెండో మెట్లవరుస ఆదివాసీ పాహణ్‌లు ఈ హిందువుల గుడి ఉనికిలోకి రాకముందు కొన్ని శతాబ్దాల క్రితం నుంచి పూజలు నిర్వహిస్తోన్న రెండు గుహలకు దారితీస్తుంది.

రెండు వేర్వేరు బృందాలు నిర్వహిస్తోన్న రెండు వేర్వేరు పూజాస్థలాలకు సంబంధించిన రెండు వేర్వేరు చందాల పెట్టెలు - ఒకటి గుహల దగ్గర, మరొకటి గుడి లోపల - పెట్టివున్నాయి. భజరంగ్ దళ్‌కు చెందిన మరో(మూడో) చందాల పెట్టె ఆవరణలో పెట్టివుంది. ఈ పెట్టెలో పోగుపడిన డబ్బును సాధు సన్యాసులకు చేసే మంగళవారపు భండారా విందుకు ఖర్చుచేస్తారు. కొండ దిగువన గ్రామానికి దగ్గరగా ఉన్న మరో పెట్టెలో పోగుపడిన డబ్బు ఆదివాసులు పూజ కు అవసరమైన వస్తువులను, నైవేద్యాలను కొనేందుకు ఉపయోగపడుతుంది.

"ఈ ప్రాంతం మొత్తంగా ఆదివాసీ ప్రాంతం. అంజన్‌లో ఇంతకుముందు పండితులు (పూజారులు) ఉండేవారు కాదు," ఈ మతసంబంధమైన ప్రదేశంలో కొత్తగా ఉన్న పూజలు చేసే ఏర్పాట్ల గురించి నా కుతూహలాన్ని చూసి, ఇంతకుముందు గ్రామానికి పెద్దగా పనిచేసిన రంజయ్ ఉరాంన్ (42) చెప్పారు. "ఇటీవలి కాలంలోనే వారణాసి నుంచి పండితులు ఈ ప్రాంతానికి వచ్చారు. ఉరాంన్ ఆదివాసులు ప్రకృతి దేవత అయిన అంజనిని ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పూజిస్తున్నారు. కానీ అంజనికీ హనుమంతుడికీ సంబంధం ఉందని మాకు ఎన్నడూ తెలియదు," అన్నారాయన.

"ఈ పండితులు వచ్చాక అంజని హనుమాన్ల తల్లి అనే ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చారు," చెప్పారు రంజయ్. "హనుమాన్లు పుట్టిన పవిత్ర స్థలంగా అంజన్‌ను ప్రకటించారు. ఎవరైనా ఏదైనా అర్థంచేసుకునేలోపే కొండ మీద హనుమంతుడి గుడి వెలసింది, ఆ ప్రదేశానికి అంజన్ ధామ్ అనే పేరును కూడా ప్రకటించారు."

Left: The main entrance of Anjan Dham from where two staircases, one on the right and the other on the left, lead one to two different worship places up the mountain.
PHOTO • Jacinta Kerketta
Right: White flags on the mountain belong to the nature worshipping Sarna tribals. The saffron flag represents the Hindus, who also have a temple on the top of the hill
PHOTO • Jacinta Kerketta

ఎడమ: ఒకటి కుడి వైపున, మరొకటి ఎడమ వైపునా రెండు మెట్ల వరుసలతో ఉన్న అంజన్ ధామ్ ప్రధాన ద్వారం. ఇది కొండపైనున్న రెండు వేర్వేరు ప్రార్థనా స్థలాలకు దారితీస్తుంది. కుడి: పర్వతంపై ఉన్న తెల్లటి జెండాలు ప్రకృతిని ఆరాధించే సర్నా ఆదివాసులకు చెందినవి. కాషాయ రంగు జెండాలు హిందువులకు చెందినవి. వీరికి కూడా కొండపైన దేవాలయం ఉంది

ఆదివాసులు ఆలయం కోసం అడగలేదని అతను నాతో చెప్పారు; అది అధికారంలో ఉన్న ఒక సబ్-డివిజనల్ అధికారి చొరవతో ఏర్పడింది. ఝార్ఖండ్ అప్పుడు బిహార్‌లో భాగంగా ఉండేది.

అంజన్‌లోని గుడి నిర్మాణం గురించి హనుమాన్ గుడి పండిత్ అయిన కేదార్‌నాథ్ పాండే వద్ద ఒక ఆసక్తికరమైన కథ ఉంది. "మా తాతగారైన మణికాంత్ పాండేకు కలలో ఒక దర్శనం కలిగింది. ఈ కొండలో ఉన్న ఒక గుహలో హనుమంతుడు పుట్టడాన్ని ఆయన చూశారు," అని ఈ 46 ఏళ్ళ వయసున్న పండిత్ చెప్పారు. ఈ గుడి వ్యవహారాలు చూసేందుకు గ్రామంలో ఉన్న ఇద్దరే ఇద్దరు పండితుల కుటుంబాలలో ఈయన కుటుంబం కూడా ఒకటి.

అప్పటినుంచీ అతని తాతగారు కొండపైకి వెళ్ళి, ప్రార్థనలు చేసి, రామాయణాన్ని చదివేవారని కేదార్‌నాథ్ చెప్పారు. 'అంజన గౌతముడనే ముని, అహల్య దంపతుల కుమార్తె," అంటూ ఆయన తన తాత దగ్గర విన్న కథను మాతో చెప్పారు. "ఆమెకు శాపం తగిలి, ఈ గుర్తుతెలియని కొండపైకి వచ్చింది. ఈ కొండకు అంజనా పర్వతం అనే పేరు ఆమే పేరునుండే వచ్చింది. ఆమె శివ భక్తురాలు. ఒక రోజు శివుడు ఒక యాచకుని రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమై, శాపం నుంచి ఆమెను విముక్తి చేయడానికి ఆమె చెవిలో ఒక మంత్రం ఊదాడు. ఆ మంత్రం ప్రభావం వల్లనే హనుమంతుడు ఆమె కడుపులో నుంచి కాకుండా ఆమె తొడలలోనుంచి పుట్టాడు.

"ఆ రోజుల్లో గుమ్లా ఎస్‌డిఒగా ఉన్న రఘునాథ్ సింగ్ మా నాన్నకు చాలా దగ్గరి స్నేహితుడు. ఆ కొండమీద ఒక హనుమంతుడి గుడి ఉండాలని వాళ్ళిద్దరూ గట్టిగా సంకల్పించారు. మొదట్లో ఆదివాసులు నిరసన వ్యక్తం చేసి ఒక మేకను బలిచ్చారు. కానీ ఆ తర్వాత గుడిని కట్టి, ఈ ప్రదేశాన్ని అంజన్ ధామ్‌గా ప్రకటించారు." అని అతను ఉదాసీనంగా చెప్పారు.

అంజన్ గ్రామానికి ఆ పేరు అంజనీ మా - ఒక ఆదివాసీ దేవత,  గ్రామం చుట్టూ ఉన్న కొండలలో నివసిస్తుందని గ్రామస్థులు నమ్ముతుండే ఒక ప్రకృతి శక్తి - నుండి వచ్చింది. ఆదివాసులు వందల సంవత్సరాలుగా గుహలలో ఉన్న ఈ దేవతకు ఉత్సవ ప్రార్థనలు చేస్తూవస్తున్నారు.

"అనేక సంవత్సరాల పాటు ప్రజలు కొండపై ఉన్న రాళ్ళను పూజిస్తూ ఉండేవారు," అని 50 ఏళ్ళ గ్రామస్థుడు మహేశ్వర్ ఉరాంవ్ చెప్పారు. "ఇది ప్రకృతి ఆరాధన. ఈ కొండలపై హనుమాన్‌జీ కథ ఆ తర్వాత చాలా ఏళ్ళకు ప్రాచుర్యంలోకి వచ్చింది."

The cave on the mountain where pahans, traditional priests of the Adivasis, from Anjan village perform puja
PHOTO • Jacinta Kerketta

సంప్రదాయక ఆదివాసీ పూజారులైన పాహణ్‌లు పూజలు చేసే కొండపైన ఉన్న గుహ

The Hanuman temple on the mountain that is now called Anjan Dham
PHOTO • Jacinta Kerketta

ప్రస్తుతం అంజన్ ధామ్‌గా పిలుస్తోన్న కొండపై ఉన్న హనుమాన్ గుడి

బీర్సా ఉరాంవ్ ఈ గ్రామ పెద్ద. అరవై ఏళ్ళు పైబడిన ఈయన తన జీవితకాలంలోనే అంజన్‌లో హనుమాన్ గుడి రావడాన్ని చూశారు. "ఆదివాసులు హిందువులు కారు," అని ఆయన స్పష్టంగా చెప్తారు. "అంజన్ గ్రామంలో అధిక సంఖ్యాకులైన ఉరాంవ్ ఆదివాసులు సర్నా ధర్మాన్ని పాటిస్తారు. సర్నా ధర్మంలో చెట్లను, పర్వతాలను, నదులను, నీటి ఊటలను- ఇలా ప్రకృతికి సంబంధించినవాటిని పూజిస్తారు. ప్రకృతిలో మేం జీవించేందుకు సహాయపడే ప్రతిదాన్నీ మేం పూజిస్తాం."

స్వచ్ఛమైన ప్రకృతి ఆరాధన అయిన సర్నాను మొదటినుండీ గ్రామ ప్రజలు అనుసరిస్తున్నారని రమణీ ఉరాంవ్ చెప్పారు. “మా ప్రజలు ఇప్పటికీ సరహుల్ (వసంతోత్సవం), కరమ్ (పంటల పండుగ) వంటి ప్రకృతికి సంబంధించిన పండుగలను చాలా కోలాహలంగా జరుపుకుంటారు. ఈ గుడి కట్టక ముందు హనుమంతుని గురించి మాకు తెలియదు. మేం పర్వతాలను పూజించాం. లోపల కొన్ని రాళ్ళతో కూడిన ఒక గుహ ఉంది. మేం వాటిని పూజించాం,” అని అదే గ్రామానికి చెందిన ఈ 32 ఏళ్ళ మహిళ పేర్కొన్నారు. “ఆ తరువాత, హనుమంతుడు ప్రాచుర్యం పొందాడు, ఈ గుడి వచ్చింది, ప్రతిచోటా ప్రజలు ప్రార్థనలు చేయడానికి రావడం ప్రారంభించారు. అప్పుడే కొంతమంది ఆదివాసీలు హనుమంతుడిని పూజించడం కూడా మొదలయింది,” అని ఆమె చెప్పారు.

అంజన్‌లోని ఆదివాసీ ప్రార్థనా స్థలాన్ని ఒక హిందూ దేవాలయం ఆక్రమించడం అనే కథ కొత్తదీ కాదు, ఆశ్చర్యం కలిగించే విషయం కూడా కాదు అని రణేంద్ర కుమార్ చెప్పారు. ఝార్ఖండ్‌కు చెందిన ప్రసిద్ధ నవలా రచయిత, కథకుడు అయిన 63 ఏళ్ళ రణేంద్ర ఇలా పేర్కొన్నారు, “చాలామంది ఆదివాసీ దేవతలను వైదిక సమాజంలో ఒక భాగంగా చేసేశారు.”

“మొదట బౌద్ధులు ఆదివాసీల నుండి దేవతలను స్వాధీనం చేసుకున్నారు, తరువాత ఆ దేవతలందరూ హిందూ మతంలో భాగమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తార, వజ్ర డాకిని, దంతేశ్వరి వంటి దేవతలంతా ఆదివాసీ దేవతలే,” అని ఆయన వాదించారు. "తప్పుడు సారూప్యతలను ప్రచారం చేయడం వలన ఆదివాసులు ఇప్పుడు హిందూ మతంలో కలిసిపోతున్నారు."

ఝార్ఖండ్‌లో కురుఖ్ భాషా ప్రొఫెసర్ అయిన డాక్టర్ నారాయణ్ ఉరాంవ్, ప్రస్తుత కాలంలో బలవంతంగా కలుపుకోవడం, లేదా సాంస్కృతికంగా ఉపయోగించుకునే ప్రక్రియ ఎలా కొనసాగుతున్నదో వివరిస్తున్నారు. "చిన్న మట్టి విగ్రహాలు, మతపరమైన ఉత్సవాలు జరుపుకునే బహిరంగ ప్రదేశాలైన మడై వంటివి హిందువుల దేవాలయాలుగానూ, వారి కోసం దేవీ మండపాలు గానూ మారిపోయాయి." ఈ గుడి కట్టిన తర్వాత భక్తులు గుంపులు గుంపులుగా రావడం మొదలై, ఆదివాసీలు తమ మతపరమైన ఆచారాలను కొనసాగించడం అసాధ్యమైపోయింది.

"రాంచీ లోని పహాడీ మందిర్, హర్ము మందిర్, అర్గోడా మందిర్, కాకే మందిర్, మొర్హాబాదీ మందిర్ దీనికి ఉదాహరణలు" అని ఆయన చెప్పారు. "ఈ ఆలయాల పక్కన నేటికీ ఆదివాసుల ఆరాధనా అవశేషాలు కనిపిస్తాయి. ఆదివాసులు సామాజిక వేడుకలు, ప్రార్థనలు చేసే మైదానాలను ఇప్పుడు దుర్గా పూజ కోసమో లేదా వాణిజ్య మార్కెట్‌ల కోసమో ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, రాంచీలోని అర్గోడా సమీపంలోని మైదానం. ఇక్కడ ఉరాంవ్-ముండా ప్రజలు తమ ఆరాధనలనూ, పండుగలనూ జరుపుకున్నారు.

గుంజల్ ఇకిర్ ముండా రాంచీకి సమీపంలోని బుండూలో ఉన్న దేవ్‌రీ మందిర్ గురించి మాతో చెప్తూ, ఇంతకు ముందు ఇక్కడ ఈ ఆలయం లేదనీ, అయితే ఆయన బంధువులు చాలాకాలం పాటు ఆదివాసులకు పూజలు చేసేవారనీ అన్నారు. “ఇక్కడ కేవలం ఒక రాయి ఉండేది, కొన్నేళ్ళుగా ముండా ఆదివాసీలు ఇక్కడ ప్రార్థనలు చేస్తూండేవారు. గుడిని కట్టిన తర్వాత, పెద్ద సంఖ్యలో హిందువులు పూజలు చేయడానికి రావడం మొదలై, ఆ స్థలం తమకు చెందినదని చెప్పుకోవడం ప్రారంభమైంది. ఈ సమస్య కోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ఒకే చోట రెండు రకాల పూజా పద్దతులను నిర్వహిస్తున్నారు. వారంలో కొన్ని రోజులు ఆదివాసుల కోసం పాహణ్ పూజ చేస్తారు; ఇతర రోజుల్లో పండితులు హిందువుల పూజలు చేస్తారు.

PHOTO • Manita Kumari Oraon


ఈ పర్వతాల మీద రెండు రకాల ఆరాధనా స్థలాలు ఉన్నాయి. రెండు గుహలలో ఆదివాసీ పాహణ్‌లు తమ ఆచార క్రియలను నిర్వర్తిస్తారు, పైన ఉన్న హనుమాన్ గుడిలో పండితులు పూజ నిర్వహిస్తారు

ఇక్కడ కంటికి కనిపించనిది ఇంకా చాలా ఉంది.

మోసపూరితమైన పద్ధతులలో ఆదివాసులను ప్రధాన హిందూమతంలోకి తీసుకురావటం జరిగింది. తన లోకాయత పుస్తకంలో దేవీప్రసాద్ ఛట్టోపాధ్యాయ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతారు - 1874లో మొత్తం జనాభాలో వైదిక మతాన్ని అవలంబించే జనాభా కేవలం 10 శాతంగా ఉన్నప్పుడు, ఈ దేశంలో హిందువులు అధికసంఖ్యాక హోదాను ఎలా పొందుతున్నారు? దీనికి సమాధానం జనాభా లెక్కలలో ఉండివుండవచ్చు.

1871 నుండి 1941 మధ్య జరిగిన భారతదేశ జనాభా జనగణన ఆదివాసుల ధర్మాన్ని వివిధ శీర్షికల కింద గుర్తించింది. ఉదాహరణకు: ఆదిమవాసులు (aboriginals), మూలవాసులు (indigenous), గిరిజనులు (tribals), సర్వాత్మవాదులు (animists - ప్రకృతి సిద్ధంగా ఉన్న ప్రతి దానిలోనూ ఆత్మ ఉన్నదని వాదన చేసేవారు). అయితే 1951లో స్వతంత్ర భారతదేశంలో జరిగిన మొదటి జనాభా జనగణన ఈ విభిన్న సంప్రదాయాలన్నిటినీ ఒకే గిరిజన మతంగా మిళితంచేసింది. 1961లో దానిని కూడా తీసివేసి ఆ స్థానంలో హిందూ, క్రైస్తవ, జైన, సిఖ్ఖు, ముస్లిమ్, బౌద్ధ మతాల సరసన 'ఇతరులు'గా చేశారు.

ఫలితంగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 0.7 శాతం మంది భారతీయులు తమను తాము "ఇతర మతాలు, విశ్వాసాల" కింద ఉన్నవారిగా ప్రకటించుకున్నారు. ఇది దేశంలో అధికారికంగా వర్గీకరించివున్న షెడ్యూల్డ్ తెగల జనాభా నిష్పత్తి, 8.6 శాతం కంటే చాలా తక్కువ.

ఎప్పుడో 1931 నాటి జనగణన నివేదిక లో, భారతదేశ జనగణన కమిషనర్ జె.ఎచ్. హట్టన్, గిరిజన మతాల గురించి నమోదైవున్న గణాంకాల గురించి తన ఆందోళనను వెలిబుచ్చారు. "ఒక స్వతంత్ర వ్యక్తి ఏదైనా గుర్తింపు పొందిన మతంలో సభ్యత్వాన్ని నిరాకరించినప్పుడల్లా తదుపరి విచారణ ఏమీ లేకుండా అతన్ని 'హిందూ'గా నమోదు చేసే ధోరణి ఉంది," అని ఆయన రాశారు. "ఆ ఆలోచనా ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది: ఈ భూమిని హిందుస్తాన్ అని పిలుస్తారు, ఇది హిందువుల దేశం. కాబట్టి ఈ దేశంలో నివసించేవారంతా, తాము ఒక గుర్తింపు పొందిన మతానికి చెందినవారమని ఖచ్చితంగా ప్రకటిస్తే తప్ప, తప్పనిసరిగా హిందువులే అవుతారు.

*****

One of the caves called ' Chand gufa'. In the caves sacred stones are being worshipped by the Adivasis for centuries before the temple came into existence
PHOTO • Jacinta Kerketta

ఈ గుహలలో ఒకదాన్ని చాంద్ గుఫా అని పిలుస్తారు. హిందువుల గుడి రావడానికి కొన్ని శతాబ్దాల ముందునుంచే ఆదివాసులు గుహలలో ఉన్న పవిత్రమైన రాళ్ళను కొలిచేవారు

"ఆదివాసులమైన మేం జనగణనలో మా మతాన్ని ఎక్కడ నమోదు చేసుకోవాలి?"

ఈ ప్రశ్నను అంజన్ గ్రామానికి చెందిన ప్రమోద్ ఉరాంవ్ అడుగుతున్నారు. "ఆ విభాగం(column) పోయింది," ఆయన వివరిస్తారు. "మాలో చాలామంది తెలియక హిందువుల విభాగం కింద తమని నమోదు చేసుకుంటారు. కానీ మేం హిందువులం కాము. హిందూమతంలో కుల వ్యవస్థ కేంద్రంగా ఉంటుంది, మేం అందులో ఇమడలేం."

"మేం ప్రకృతి ఆరాధకులం. మా ప్రాపంచిక దృక్పథం మరింత ఉదారంగా, స్వీకరించే గుణాన్ని కలిగివుంటుంది. అందులో మతమౌఢ్యానికి చోటులేదు. అందువల్లనే మాలో కొందరు హిందూ మతంలోకో, ఇస్లామ్‌లోకో, క్రైస్తవ మతంలోకో మారిపోయినా, మేం మతం పేరుతో ఎన్నడూ హత్యలు చేయం. మా ప్రజలు కొండపైకి వెళ్ళి హనుమంతుడిని పూజించినా, మేం వారిని హిందువులుగా పిలవం."

అంజన్‌కి చెందిన బిర్సా ఉరాంవ్ మాట్లాడుతూ “ఆదివాసులు చాలా సరళంగా, దేనినైనా స్వీకరించగలిగేవారిగా ఉంటారు. ఎవరైనా వారి నమ్మకాలను, వారి తత్వశాస్త్రాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోనివ్వండి. వారితో ఎవరైనా కలవాలనుకుంటే వారికి పట్టింపేమీ ఉండదు. వారు వారిని మాత్రమే గౌరవిస్తారు. ఇప్పుడు చాలామంది హిందువులు హనుమంతుడిని పూజించడానికి అంజన్ ధామ్‌కి వస్తారు, ముస్లింలు కూడా ధామ్‌ను చూడటానికి వస్తారు, అందరికీ తలుపులు తెరిచే ఉంటాయి. చాలామంది ఆదివాసులు ఇప్పుడు పర్వతం మీద ఉన్న గుహనూ, ఆలయంలోని హనుమంతుని చిత్రాన్నీ కూడా ప్రార్థిస్తున్నారు. అయినా వారు ఇప్పటికీ తమను ఆదివాసులుగానే పరిగణిస్తుంటారు తప్ప హిందువులుగా కాదు.

హనుమాన్‌ను పూజించే సమస్య సంక్లిష్టమైనది.

"ఆదివాసులు ఇక్కడ రాముడినీ లక్ష్మణుడినీ పూజించరు," గ్రామానికి చెందిన మహేశ్వర్ ఉరాంవ్ వివరించారు. "కానీ హనుమాన్ సవర్ణ సముదాయానికి చెందినవాడు కాదని ప్రజలు నమ్ముతారు. అతను ఆదివాసీ సముదాయానికి చెందినవాడు. అతనికి ఒకవిధమైన మానవ ముఖాన్ని ఇవ్వడం, అయితే ఆయన్ని ఒక జంతువులా కనిపించేలా చేయడం ద్వారా సవర్ణులు ఆదివాసులనూ, హనుమంతుడినీ కూడా ఎగతాళి చేస్తున్నారు."

Left: Hills near Anjan village where people believe Anjani Ma, an Adivasi goddess, resides.
PHOTO • Jacinta Kerketta
Right: After the Hanuman temple came up the place was declared Anjan Dham
PHOTO • Jacinta Kerketta

ఎడమ: ఆదివాసీ దేవత అయిన అంజనీ మాత నివాసముంటుందని ప్రజలు నమ్మే అంజన్ గ్రామానికి దగ్గరగా ఉన్న కొండలు. కుడి: హనుమంతుడి గుడి వచ్చాక ఆ ప్రదేశాన్ని అంజన్ ధామ్ అని ప్రకటించారు

ప్రజలు పండితుల వాదనను నమ్మడానికి కారణం, ఆదివాసులు హనుమంతుడిని సవర్ణ సమాజానికి చెందినవాడు కాదని నమ్మడమే అని రంజయ్ ఉరాంవ్ అంటారు. "అతను వారిలో ఒకడైతే, అతనికి తోక ఉండేది కాదు," అన్నారు రంజయ్. "ఆయన ఆదివాసీ కావడం వల్లనే స్పష్టంగా జంతువులా చిత్రించారు. అందుకనే అంజనీ మాతను హనుమంతుని తల్లిగా వాళ్ళు చెప్పుకుంటుంటే ఆ ప్రాంతంలోని ప్రజలు దానిని నిజమేనని ఒప్పుకుంటారు."

వార్షిక పూజ కోసం గ్రామం గ్రామమంతా కొండపైకి వెళ్ళటం గురించి ఆ గ్రామ ముఖియా , 38 ఏళ్ళ కర్మీ ఉరాంవ్ గుర్తుచేసుకున్నారు. "ఆ సమయంలో అక్కడ కేవలం గుహలు మాత్రమే ఉండేవి. ప్రజలు అక్కడికి వెళ్ళి వానలు పడాలని ప్రార్థనలు చేసేవారు. ఈ రోజుకు కూడా మేం అదే సంప్రదాయాన్ని పాటిస్తాం. చూడండి, మేమా పూజలు చేయటం వల్లనే ఈ ప్రాంతంలో ఎప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి."

"ప్రస్తుతం ఆ కొండపైన గుడి కూడా ఉండటం వలన ప్రజలు పరిక్రమ కూడా చేస్తున్నారు. కొంతమంది ఆదివాసులు గుడి లోపలికి కూడా వెళ్ళి పూజలు చేస్తారు. ఎక్కడ శాంతి దొరికితే అక్కడికి ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు," అని ఆమె అన్నారు.

ఆ గ్రామంలోని ఇతర మహిళలు కూడా తమని తాము హిందువులుగా భావించమని చెప్పారు. కానీ వారిలో కొంతమంది ఆ గుడిలో ఉన్న దేవుడిని పూజిస్తారు. "కొండమీద గుడి ఉన్నదంటే అది కూడా ఆ కొండలోని భాగమే. హనుమాన్‌ని పట్టించుకోకుండా జనం కొండను ఎలా పూజించగలరు? ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు కలిసి మాకు మంచి వానలు పడేలా చేస్తే నష్టమేముంది?"

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jacinta Kerketta

उरांव आदिवासी समुदाय से ताल्लुक़ रखने वाली जसिंता केरकेट्टा, झारखंड के ग्रामीण इलाक़े की स्वतंत्र लेखक व रिपोर्टर हैं. वह आदिवासी समुदायों के संघर्षों को बयान करने वाली कवि भी हैं और आदिवासियों के ख़िलाफ़ होने वाले अन्यायों के विरोध में आवाज़ उठाती हैं.

की अन्य स्टोरी Jacinta Kerketta
Illustration : Manita Kumari Oraon

मनीता कुमारी उरांव, झारखंड की कलाकार हैं और आदिवासी समुदायों से जुड़े सामाजिक व सांस्कृतिक महत्व के मुद्दों पर मूर्तियां और पेंटिंग बनाती हैं.

की अन्य स्टोरी Manita Kumari Oraon
Editor : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या, पारी में बतौर वरिष्ठ संपादक कार्यरत हैं, और पारी के रचनात्मक लेखन अनुभाग का नेतृत्व करती हैं. वह पारी’भाषा टीम की सदस्य हैं और गुजराती में कहानियों का अनुवाद व संपादन करती हैं. प्रतिष्ठा गुजराती और अंग्रेज़ी भाषा की कवि भी हैं.

की अन्य स्टोरी Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli