నేను పెరిగిన మ్హస్‌వడ్‌లో రోజూ నీటి కోసం జరిగే పోరాటాన్ని ప్రత్యక్షంగా చూశాను.
శతాబ్దాలుగా సంచార తెగలకు చెందిన ధన్‌గర్ పశువుల కాపరులు తిరుగాడిన మాణ్ దేశ్ అనే ఈ ప్రాంతం మహారాష్ట్రకు కేంద్రభాగంలో ఉంది. దక్కను పీఠభూమిలోని ఈ నిర్జల భూభాగంలో నీటి వనరులను కనుక్కోవటం పైనే వారి మనుగడ ఆధారపడి ఉంది.
ఏళ్ళ తరబడి, ఇక్కడి మహిళలు తమ కుండలను నింపుకోవడానికి వరుసకట్టి నిలబడివుండటాన్ని నేను చూశాను. రాష్త్ర ప్రభుత్వం ప్రతి 12 రోజులకొకసారి ఒక గంట పాటు మాత్రమే నీటిని సరఫరా చేస్తుంది. వారపు సంతలలో రైతులు తమ నీటి కష్టాల గురించి, ఎంత లోతుగా బావులు తవ్వినప్పనటికీ దొరకని నీటి జాడలను గురించీ మాట్లాడుకుంటారు. వాళ్ళకు నీరు దొరికినా అది తరచుగా కలుషితమై, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం వంటి రోగాలకు దారితేసేదిగా ఉంటోంది.
ఇటువంటి దారుణ పరిస్థితులలో వ్యవసాయం ఇంక ఎంతమాత్రం ఒక ఎంపిక కాదు. ఈ గ్రామాలలోని యువత ముంబై వంటి పెద్ద నగరాలకు వలసపోతున్నారు.
కర్ఖేళ్‌కు చెందిన గైక్వాడ్ అనే రైతు తన పశువులన్నింటినీ అమ్మేసి ఇప్పుడు మేకలను మాత్రమే పెంచుతున్నారు. ఆయన పొలాలు ఎండిపోయాయి, ఆయన కొడుకులు కూలి పనుల కోసం ముంబైకి వలస వెళ్ళారు. తన భార్య, మనవసంతానంతో కలిసి నివసిస్తోన్న అరవైల వయసులో ఉన్న గైక్వాడ్, తాను చనిపోయేలోపు నీరు వస్తుందని ఆశపడుతున్నారు. వారి కుటుంబం మొత్తం తాము స్నానం చేసిన నీటినే పాత్రలను కడగటానికి, బట్టలు ఉతుక్కోవటం కోసం ఉపయోగిస్తారు. అదే నీటిని తమ ఇంటి ముందున్న మామిడి చెట్టుకు కూడా అందిస్తారు.
సాతారా జిల్లాలోని మాణ్ మీదుగా ప్రయాణిస్తూ, తీవ్రమైన నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల కథలనూ, వారికి నీటిని సరఫరా చేసేవారి కథలనూ నీటి కోసం అన్వేషణ అందిస్తోంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి