వీడియో చూడండి: బంగాళాదుంపకొక భావగీతం

"ఆంగ్లం" అని చెప్పారు ఆ తరగతిలోని పిల్లలు. మేం వాళ్ళను ఇప్పుడే మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏమిటి అని అడిగాం. భారతదేశపు ఒక తరగతి గదిలో అడగాల్సినంత తెలివైన ప్రశ్నేమీ కాదు. మొదటి ఇద్దరు పిల్లలు "ఆంగ్లం" అని చెప్తే, తరగతిలోని ప్రతి అల్లరి పిడుగు అదే సమాధానం చెప్తుంది. మొదటి ఇద్దరు బాధితులు శిక్షకు గురికాకుండా సమాధానం ఇవ్వడం చూసినప్పుడు, ఇదే మార్గం అని మిగతావారికి తెలుస్తుంది కదా!

అయితే ఇది కేవలం అన్ని ప్రదేశాల వంటి ప్రదేశం కాదు. ఇది ఇడలిప్పారా గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏకోపాధ్యాయ పాఠశాల. ఇది కేరళలోని మారుమూల ప్రాంతంలోని ఏకైక ఆదివాసీ పంచాయతీ ఇడమలక్కుడిలో ఉంది. ఈ బడికి వెలుపల ఎక్కడా మీరు ఆంగ్లంలో మాట్లాడటాన్ని వినలేరు. ఆ భాషలో రాసిన బోర్డులు కానీ, పోస్టర్లు కానీ, చివరకు సంకేతాలు కానీ మనకు కనిపించవు. అయినాకూడా పిల్లలు ఆంగ్లమే తమకిష్టమైన సబ్జెక్ట్ అని చెపుతారు. అనేక ఇతర బడుల్లోలాగే ఇడుక్కి జిల్లాలోని ఈ బడిలో కూడా 1-4 తరగతులను కలిపి ఒక ఒంటిగదిలో నడిపిస్తున్నారు. చాలా తక్కువ జీతం, చాలా ఎక్కువ పని, అసాధ్యమైన పనిపరిస్థితులతో పోరాడుతున్నప్పటికీ, తన సమూహానికే అంకితమైన ఒక నిజంగా అధ్బుతమైన  ఉపాధ్యాయిని నేతృత్వంలో ఈ బడి నడుస్తోంది.

ఇక్కడే ఒక భిన్నాభిప్రాయం కూడా ఉంది. "గణితం" అన్నాడు ఒక చిన్ని ధైర్యవంతుడు లేచి నిలబడుతూ. ఏదీ, మీ లెక్కల ప్రావీణ్యమేమిటో చూపించండి చూద్దాం, అని మేం డిమాండ్ చేశాం. తన చిన్న ఛాతీని పొంగించి, ఊపిరి తీసుకోవటానికి గానీ, ప్రశంసలు అందుకోవటానికి గానీ ఆగకుండా ఒక్క బిగిన 1-12 వరకూ గడగడా ఎక్కాలు అప్పచెప్పేశాడు. మేం అతన్ని ఆపేసరికి అతను ఎక్కాలు అప్పచెప్పటంలో రెండో రౌండ్‌లో ఉన్నాడనిపించింది.

The singing quintet – also clearly the ‘intellectual elite’ of classes 1-4
PHOTO • P. Sainath

గాయక పంచకం - స్పష్టంగా 1-4 తరగతుల 'మేధో శ్రేష్ఠులు’ కూడా

మేం టీచరుకు దగ్గరగా తరగతిలోని మేధో శ్రేష్ఠులైన ఐదుగురు అమ్మాయిలు కూర్చొనివున్న ప్రత్యేక బల్ల వైపుకు తిరిగాం. వారలా ప్రత్యేకంగా కూర్చున్న ఏర్పాటు చాలా చెప్పింది. వారిలో పెద్ద అమ్మాయికి 11 ఏళ్ళు ఉండవచ్చు. మిగిలినవారి వయస్సు తొమ్మిది సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ. బాలుడు తనకిష్టమైన గణితాన్ని తన నోటి ద్వారా చెప్పేశాడు, ఇప్పుడు ఆంగ్లం తమకు ఇష్టమైన సబ్జెక్ట్ అనే వాదనను బలపరచుకోవటం వీరి వంతు. అయితే, కొంత ఆంగ్ల భాషను విందాం అమ్మాయిలూ.

తమ తరగతి గదికి ఎనిమిదిమంది వింతగా కనిపించే, పరిచయం లేని వ్యక్తులు వచ్చారని తెలుసుకున్నప్పుడు, అందరూ చేసేటట్టే వారంతా కూడా కొద్దిగా సిగ్గుపడుతున్నారు. అప్పుడు టీచర్ ఎస్. విజయలక్ష్మి ఇలా అన్నారు: "అమ్మాయిలూ, వారి కోసం ఒక పాట పాడండి." వాళ్ళు పాడారు. ఆదివాసీలు పాడగలరని మనందరికీ తెలుసు. ఈ ఐదుగురు ముతవన్ అమ్మాయిలు కూడా చాలా చక్కగా పాడారు. పూర్తి శ్రుతిబద్ధంగా. ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా. అయినా వారింకా సిగ్గుపడుతూనే ఉన్నారు. చిన్నారి వైదేహి తల దించుకుని తన ప్రేక్షకుల వైపు కాకుండా తన మేజా వైపు చూసింది. కానీ వాళ్ళు చాలా అద్భుతంగా పాడారు. అయితే సాహిత్యం మాత్రం విలక్షణంగా ఉంది.

అది బంగాళాదుంపపై ఒక భావగీతం

వారు ఇడుక్కి కొండలలో ఎక్కడో ఒక చోట పెండలాన్ని పెంచుతారు. కానీ ఇడలిప్పారా నుండి వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా బంగాళాదుంప పండుతుందేమో నాకు ఖచ్చితంగా తెలియదు.

ఏదేమైనా, ఈ పాటను మీరే వినండి. పాట ఇలా సాగుతుంది:

బంగాళాదుంపా, బంగాళాదుంపా
ఓ, నా ప్రియమైన బంగాళాదుంపా
బంగాళాదుంపంటే నాకిష్టం
బంగాళాదుంపంటే నీకిష్టం
బంగాళాదుంపంటే మనకిష్టం
బంగాళాదుంపా, బంగాళాదుంపా, బంగాళాదుంపా

ఒక మామూలు దుంపను గొప్ప చేస్తూ చాలా చక్కగా పాడారు. అసలు దాన్ని వాళ్ళెప్పుడైనా తిన్నారో లేదో మాకు తెలియదు (బహుశా మేమే తప్పై ఉండవచ్చు. మున్నార్ సమీపంలోని రెండు గ్రామాలు బంగాళాదుంప సాగును ప్రారంభించినట్లు చెబుతారు. అవి ఇక్కడికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి). కానీ ఆ గీతం మాతోనే ఉండిపోయింది. కొన్ని వారాలు గడచిన తర్వాత కూడా మాలో చాలామంది ఇప్పటికీ ఆ పాటను కూనిరాగం తీస్తారు. ఎందుకంటే, మేం ఎనిమిదిమందిమి ఆ ఉత్తమమైన బంగాళాదుంప ప్రేమికులం అయినందువలన కాదు, కానీ వారు గంభీరంగా అందించిన ఆ సాహిత్యంతో మమ్మల్ని మంత్రముగ్ధులను చేశారని నేను అనుకుంటున్నాను. అది కూడా పూర్తి మనోహరమైన ప్రదర్శనతో.

S. Vijaylaxmi – teacher extraordinary
PHOTO • P. Sainath
The students and teacher Vijaylaxmi just outside their single-classroom school
PHOTO • P. Sainath

ఎడమ: అసామాన్య ఉపాధ్యాయిని ఎస్. విజయలక్ష్మి. కుడి: తమ ఒంటి తరగతి పాఠశాల బయట విద్యార్థులు, వారి ఉపాధ్యాయిని

అయితే, తిరిగి తరగతి గదికి వెళ్ళాం. అనేక ప్రశంసల తర్వాత, వీడియో కెమెరాల కోసం పాటను మరోసారి పాడమని వారిని ఒప్పించిన తర్వాత, మేం అబ్బాయిలవైపు తిరిగాం. వారు అమ్మాయిల ప్రదర్శనతో సరితూగగలరా? వారు సవాలును ఎదుర్కొన్నారు. వారిది పాడటం అనేకంటే చదవటం అనవచ్చు. చాలా బాగున్నప్పటికీ, చక్కటి ప్రదర్శననివ్వటంలో వారు అమ్మాయిలతో సరితూగలేదు. కానీ వారి మాటలు చాలా విలక్షణంగా ఉన్నాయి.

ఇది 'డాక్టర్‌కి ఒక ప్రార్థన'. భారతదేశంలో మాత్రమే రాయడం, చదవడం లేదా పాడడం సాధ్యమయ్యే రకం. మీకు ఆ పదాలన్నీ చెప్పి మిమ్మల్ని పాడుచేయను, లేదా వారి డాక్టర్ వీడియోను ఇక్కడ ఉంచను. అదేమంత మంచి విషయం కాదు. ఈ కథనం మహత్తరమైన ఈ ఐదుగురి కోసం: అన్షిలా దేవి, ఉమాదేవి, కల్పన, వైదేహి, జాస్మిన్. అయితే, డాక్టర్‌కి ఒక ప్రార్థనలో “నా కడుపు నొప్పి పెడుతోంది డాక్టర్. నాకు ఆపరేషన్ కావాలి డాక్టర్. ఆపరేషన్, ఆపరేషన్, ఆపరేషన్” వంటి భారతదేశానికి మాత్రమే చెందిన ఉత్తమశ్రేణి పంక్తులు ఉన్నాయని మాత్రం వెల్లడిచేయగలను.

కానీ అది మరో పాట. ఆ వీడియో మరోరోజు కోసం.

ఇప్పటికి మాత్రం, మీ బంగాళాదుంప పాటను పాడుకోండి.

కథనం ముందుగా లో 2014, జూన్ 26న P.Sainath.orgలో వెలువడింది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli