కుర్ర ఒంటె ఖమ్రీ నిర్బంధం తాలూకు దిగ్భ్రాంతి నుంచి ఇంకా కోలుకోలేదు.
"తిరిగి పూర్తి ఆరోగ్యవంతుడవడానికి కొంత కాలం పడుతుంది," అన్నారు కమ్మాభాయ్ లఖాభాయ్ రబారీ.
ఈ పశువుల కాపరి తన మందలోని ఒక చిన్న మగ ఒంటె గురించి మాట్లాడుతున్నారు.
జనవరి 2022లో మహారాష్ట్రలోని అమరావతిలో 58 ఒంటెలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంవంటి అసాధారణ సంఘటనల నేపథ్యంలో అతని గొంతులోని ఆశాభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక నెల తర్వాత, ఫిబ్రవరిలో, ఒంటెలను విడిచిపెట్టినప్పటికీ అవన్నీ అనారోగ్యం పాలయ్యాయి.
పోలీసుల అదుపులో వున్నప్పుడు ఆ ఒంటెలకు అవి రోజూ తినే తిండి దొరకలేదని ఒంటెల కాపరులు చెప్పారు. వాటిని ఉంచిన గౌరక్షణ కేంద్రం' కేవలం ఆవుల సంరక్షణకు ఉద్దేశించినది, అక్కడ ఆవుల మేత మాత్రమే ఉంది. "అవి (ఒంటెలు) ఆరుబయట మేస్తాయి. పెద్ద పెద్ద చెట్ల ఆకులను తింటాయి. ఒంటెలు ఆవుల మేత తినవు," అన్నారు కమ్మాభాయ్
ఒక నెలరోజులకు పైగా, వాటికి బలవంతంగా సోయా చిక్కుళ్ళ అవశేషాలను ఆహారంగా ఇవ్వడం వలన వాటి ఆరోగ్యం క్షీణించింది. ఫిబ్రవరి, 2022లో ఆందోళనతో ఉన్న తమ యజమానుల దగ్గరకి చేరుకునేటప్పటికే ఆ ఒంటెలు చనిపోవడం మొదలయ్యింది. జులై నెలకల్లా 24 ఒంటెలు చనిపోయాయి.
తమ నుండి ఒంటెలను ఆకస్మికంగా విడదీసి, నిర్బంధించటమే దీనికి కారణమని ఒంటెల పెంపకందారులు ఆరోపిస్తున్నారు. ఈ ఒంటెల యజమానులలో కమ్మాభాయ్ లాంటి నలుగురు రబారీ సముదాయానికి చెందినవారు; ఒకరు ఫకీరానీ జాట్. వీరంతా గుజరాత్‌లోని కచ్ఛ్-భుజ్ జిల్లాకు చెందిన సంప్రదాయ ఒంటెల కాపరులు.
ఈ సంఘటనలో క్రూరమైన మలుపు ఏమిటంటే నిస్సహాయులైన ఈ ఒంటెల కాపరులు ఒక్కో ఒంటె తిండిఖర్చుల కోసం రోజుకి 350 రూపాయలు ఇవ్వాల్సిరావడం. అదికూడా ఈ కేంద్రం పెట్టే ఒంటెలకు సరిపడని ఆహరం కోసం. గౌరక్షణ సంస్థ లెక్కల ప్రకారం, ఈ మొత్తం బిల్లు 4 లక్షలు అయ్యింది. ఆ సంస్థ తనను తాను స్వచ్ఛంద సంస్థగా చెప్పుకుంటుంది, కానీ అది ఒంటెల సంరక్షణ, పోషణల కోసం రబారీల నుంచి డబ్బు తీసుకుంది.
"విదర్భలో వున్న మా వాళ్ళందరి దగ్గర నుంచి అంత డబ్బు సమకూర్చుకోవడానికి మాకు రెండు రోజులు పట్టింది," అని అనుభవజ్ఞుడైన ఒంటెల కాపరి జకారా రబారీ చెప్పారు. ఆయన తన ఒంటెల్ని వస్తువుల రవాణాకు ఉపయోగిస్తారు. నాగపూర్ జిల్లాలోని సిర్సి గ్రామంలో మరో 20 కుటుంబాలతో కలసి ఒక డేరా (సెటిల్మెంట్)లో నివసిస్తారు. నిర్బంధించిన ఒంటెల్లో ఆయనకు రావాల్సిన ఒంటెలు కూడా ఉన్నాయి.
*****
ఒక సంవత్సరం క్రితం జంతు హక్కుల సంరక్షకుడిగా చెప్పుకొనే హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ అయిదుగురు ఒంటెల కాపరులపై తళేగావ్ దశాసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వాళ్ళపై హైదరాబాద్‌లోని కబేళాలకు ఒంటెలను తరలిస్తున్నారని అభియోగం మోపారు. ఆ సమయంలో రబారీలు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో విడిది చేసి వున్నారు. అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే నిమగహ్వాణ్ అనే గ్రామంలో పోలీసులు అయిదుగురు ఒంటెల కాపరులను అరెస్టు చేశారు. ఒంటెల యజమానుల మీద సెక్షన్ 11(1)(డి) జంతువులపై క్రూరత్వ నిరోధకచట్టం, 1960 ప్రకారం కేసు పెట్టారు. వారి ఒంటెలని నిర్బంధించి అమరావతిలోని ఒక గౌసంరక్షణ కేంద్రానికి తరలించారు. (చదవండి: పోలీసుల అదుపులో కచ్ఛ్ ఎడారి ఓడలు )..
స్థానిక కోర్టు ఒంటెల యజమానులకు వెంటనే బెయిలు ఇచ్చినప్పటికీ, జంతువుల కోసం వాళ్ళ పోరాటం మాత్రం జిల్లా కోర్టుదాకా సాగింది. జనవరి 25, 2022న ఒంటెల సంరక్షణ హక్కుల కోసం గౌరక్షణ సంస్థ పెట్టుకున్న పిటీషన్‌తో సహా, మొత్తంగా మూడు జంతుసంరక్షణ సంస్థలు పెట్టిన పిటీషన్లను అమరావతి కోర్టు మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఒంటెలకోసం రబారీ కాపరులు పెట్టుకున్న పిటీషన్‌ను కొన్ని షరతులతో కోర్టు ఆమోదించింది.
ఒంటెలను సంరక్షించినందుకు గౌరక్షణ్ సంస్థ నిర్ధారించిన 'తగినంత రుసుము'ను చెల్లించాలని ఒంటెల కాపరులకు కోర్టు చెప్పింది. ఫిబ్రవరి 2022లో అమరావతి జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఆ రుసుమును రోజుకు ఒక జంతువుకు 200 రూపాయలు మించకూడదని చెప్పింది.
రబారీలకు అది పెద్ద ఊరట. అప్పటికే చాలా ఎక్కువ డబ్బు కట్టి ఉండటంతో, వాళ్ళింక అదనంగా డబ్బు కోసం వెతుక్కోనవసరంలేదు.
"కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజు, అరెస్టయిన అయిదుగురు కాపరుల సంరక్షణ కోసం మేం 10 లక్షల వరకూ ఖర్చుపెట్టాం," అన్నారు జకారా రబారీ.
చివరకు 2022 ఫిబ్రవరి నెల మధ్యలో ఒంటెల్ని వాటి యజమానులకి అప్పగించారు. అవి పోషకాహార లోపం వలన బలహీనంగా, అనారోగ్యంతో ఉన్నట్టు యజమానులు గమనించారు. విడుదలయిన కొద్ది గంటల్లోనే రెండు ఒంటెలు అమరావతి పట్టణ పొలిమేరల్లో చనిపోయాయి.
ఇంకో 3, 4 నెలల్లో మిగతావి కూడా నశించిపోతాయి. "వాటి అనారోగ్యం వల్ల మార్చ్ నుండి ఏప్రిల్ నెల వరకూ మేం ఎక్కువ దూరాలు నడవలేకపొయ్యాం," ఛత్తీస్‌గఢ్, బలౌదా బజార్ జిల్లాలోని తమ శిబిరం నుంచి PARIతో ఫోన్‌లో మాట్లాడుతూ అన్నారు సాజన్ రబారీ. "వేసవిలో మా డేరాల దగ్గరకు వచ్చే దారిలో ఒంటెలకు పచ్చి ఆకుల మేత లభించలేదు. దాంతో వానాకాలం వచ్చేసరికి అవి బాగా బలహీనపడి అనారోగ్యంతో ఒకటి తర్వాత ఒకటి చనిపోయాయి." అన్నారాయన. ఆ ఒంటెల బృందంలో ఆయన భాగంగా వచ్చిన నాలుగు ఒంటెల్లో రెండు చనిపోయాయి.
వాస్తవానికి ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రబారీ సముదాయాల కోసం వచ్చిన ఒంటెల్లో చాలావరకు దారిలోనో లేక వారి నివాస శిబిరాలకు చేరుకున్నాకనో చనిపోయాయి.
బతికిన 34 ఒంటెలు నిర్బంధం వల్ల ఏర్పడిన దిగ్భ్రాంతి నుండి ఇంకా కోలుకోలేదు.
*****
అదృష్టవశాత్తూ ఖమ్రీ బతికింది.
ఆ రెండేళ్ళ ఒంటెను పూర్తిగా కోలుకునేదాకా వస్తువుల రవాణాకు వినియోగించబోనని కమ్మాభాయ్ అన్నారు.
జనవరి 2023లో కమ్మాభాయ్ ఖాళీ అయిన పత్తి పొలాల్లో ఏర్పాటు చేసుకున్న నివాస శిబిరానికి కూతవేటు దూరంలో మిగిలిన ఒంటెలతో పాటు ఖమ్రీ కూడా ఒక చెట్టుకు కట్టేసి వుంది. ఖమ్రీకి బేర్ (రేగు) చెట్టు ఆకులంటే చాలా ఇష్టం; ఈ సీజన్లో వచ్చే రేగు పండ్లని కూడా ఇష్టంగా తింటుంది.
మహారాష్ట్ర, వర్ధా జిల్లాలోని హింగణ్‌ఘాట్ పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో నాగ్‌పూర్-ఆదిలాబాద్ హైవేకి దూరంగా ఉన్న చిన్న కుగ్రామమైన వణీ సమీపంలో ఈ రబారీ పశువుల కాపరి, ఆయన జంతువులు విడిది చేసివున్నారు. రబారీలు పశ్చిమ, మధ్యభారతం మీదుగా తమ మేకల, గొర్రెల, ఒంటెల మందలతో సంచరిస్తున్నారు.
2022 విషమపరీక్ష నుండి బయటపడిన ఒంటెలు వాటి యజమానుల పర్యవేక్షణ, సంరక్షణలో ఉన్నాయి. అవి వాటి పూర్తి జీవితాన్ని - దాదాపు 18 ఏళ్ళు - గడుపుతాయని కమ్మాభాయ్ ఆశిస్తున్నారు.
"ఈ సంఘటన మాకు అంతులేని బాధను కలిగించింది," కమ్మాభాయ్ అన్న, విదర్భలో తమ సముదాయం తరఫున న్యాయపోరాటాన్ని సమన్వయ పరిచిన రబారీ నాయకుడూ మశ్రూ రబారీ అన్నారు. “ హమ్‌కో పరేషాన్ కర్‌కే ఇన్‌కో క్యా మిలా [మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వలన ఫిర్యాదీలకు కలిగిన లాభం ఏమిటి]?" అంటూ ఆయన ఆశ్చర్యపోయారు
పరిహారం కోసం హై కోర్టులో దావా వెయ్యాలా వద్దా అనే విషయం తామింకా చర్చిస్తున్నామని ఆయన అన్నారు.
ఇంతలో పోలీసులు అమరావతి సెషన్స్ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు, కానీ కేసు ఇంకా విచారణకు రాలేదు. "మేం ఈ కేసును ఎదుర్కొంటాం," అన్నారు మశ్రూ రబారీ.
"మా ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది."
అనువాదం: వి. రాహుల్జీ