"ఇప్పుడు మేం పనిచేయటం ఆపేస్తే, మొత్తం దేశమంతా విచారపడుతుంది."
బాబూ లాల్ చేసిన ఈ ప్రకటన, ఆ తర్వాత అతను మాట్లాడిన మాటలు వింటే మరింత బాగా అర్థమవుతుంది, “ క్రికెట్ ఖేల్నే కో నహీఁ మిలేగా కిసీకో భీ (ఎవరూ ఇంక క్రికెట్ ఆడలేరు).”
బ్యాటింగ్ చేసేవారు, బౌలర్లు కూడా ప్రేమించడంతో పాటు భయపడే ఆ ఎరుపు తెలుపుల క్రికెట్ బంతి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, మీరట్‌లోని శోభాపుర్ అనే మురికివాడలో ఉండే చర్మశుద్ధి కర్మాగారాల నుంచి వచ్చిన తోలుతో తయారైనది. చర్మకారులు ముడి చర్మాన్ని పటికతో రుద్ది శుద్ధిచేసి క్రికెట్ బంతి తయారీ పరిశ్రమకు అవసరమైన ముడిపదార్థంగా అందించేది నగరంలోని ఈ ఒక్క ప్రదేశం నుంచే. 'టానింగ్ ' అంటే ముడి చర్మాన్ని మెరుగుపెట్టిన తోలుగా మార్చే ప్రక్రియ.
"కేవలం పటికతో చేసే చర్మశుద్ధి మాత్రమే చర్మపు పొరలలోని కణాలను తెరచుకునేలా చేసి రంగ్ (రంగు)ను దాని గుండా సులభంగా వెళ్ళేలా చేస్తుంది," అని బాబూ లాల్ చెప్పారు. అతని ఈ అభిప్రాయాన్ని 1960లలో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన ఒక అధ్యయనం ధృవీకరించింది. పటికతో చర్మశుద్ధి చేయడం వల్ల బౌలర్ చేతి చెమ్మ వల్లనో లేదా చెమట/లాలాజలంతో క్రికెట్ బాల్‌ను మెరుపు కోసం రుద్దడం వల్లనో బంతి దెబ్బతినదు, బౌలర్ ఆటను పాడుచేయకుండా చేస్తుంది.
అరవై రెండేళ్ళ వయసున్న బాబూ లాల్ శోభాపుర్‌లో తనకున్న చర్మశుద్ధి కర్మాగారంలో ఒక మూలన ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చునివున్నారు; సున్నం తెలుపుదనంతో నేల మెరుస్తోంది. "మా పూర్వీకులు ఇక్కడ 200 సంవత్సరాలుగా తోలును తయారుచేస్తున్నారు," అని ఆయన చెప్పారు.
మేం మాట్లాడుకుంటూ ఉండగా మరో చర్మకారుడు భారత్ భూషణ్ అక్కడికి వచ్చారు. 43 ఏళ్ళ వయసున్న ఈయన తనకు 13 ఏళ్ళ వయసప్పటినుంచీ ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు " జై భీమ్! (అంబేద్కర్‌కు వందనం)" అంటూ అభివాదం చేసుకున్నారు.
భారత్ ఒక కుర్చీ లాక్కొని కూర్చొంటూ మాతో కలిశారు." గంద్ నహీ ఆ రహీ (కంపు కొట్టడంలేదా)?" కొద్దిగా అయిష్టంతో బాబూ లాల్ నన్ను మృదువుగా అడిగారు. మా చుట్టూ గుంటల్లో నానబెట్టి ఉన్న చర్మాల నుంచి వచ్చే ఘాటైన వాసన గురించి ఆయనలా అడిగారు. తోళ్ళతో పనిచేసేవారిపై కురిపించే చురకలను, దూకుడును గురించి ప్రస్తావిస్తూ భారత్, “వాస్తవానికి, కొంతమందికి మిగిలినవారి కంటే పొడవాటి ముక్కులుంటాయి - వాళ్ళు చాలా దూరం నుంచే తోళ్ళపని వాసనను పసిగడతారు” అన్నారు.
భారత్ చేసిన ఎత్తిపొడుపు వ్యాఖ్యను బలపరుస్తూ, "గత ఐదు నుండి ఏడు సంవత్సరాలలో మా వృత్తి కారణంగా మేం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం" అన్నారు బాబూ లాల్. 50 ఏళ్ళుగా మీరట్, జలంధర్‌లలోని అతిపెద్ద క్రికెట్ కంపెనీలకు ప్రధాన సరఫరాదారులుగా ఉంటున్నప్పటికీ, వారి జీవితాలు మతపరమైన ఉద్రిక్తతల వలన ప్రమాదంలో పడ్డాయి, వారి జీవనోపాధి కుదించుకుపోయింది. “కష్ట సమయాల్లో ఎవరూ మాకు అండగా ఉండరు. హమేఁ అకేలే హీ సంభాల్‌నా పడ్తా హై (మేం ఒంటరి పోరాటాలు పోరాడాల్సి వస్తోంది)," అని అతను చెప్పారు.
తోలు పరిశ్రమ భారతదేశంలోని అతి పురాతన పరిశ్రమలలో ఒకటి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే తోలు ఎగుమతుల మండలి (Council for Leather Exports) చెప్పిన ప్రకారం , 2021-2022 నాటికి తోలు పరిశ్రమ నాలుగు మిలియన్లమందికి పైగా ప్రజలకు ఉద్యోగాలు కల్పించింది; ప్రపంచ తోలు ఉత్పత్తిలో సుమారు 13 శాతం తోలును ఉత్పత్తి చేస్తోంది.
శోభాపుర్‌లోని దాదాపు అన్ని చర్మశుద్ధి కర్మాగారాల యజమానులు, వాటిలో పనిచేసే కార్మికులు జాటవ (ఉత్తర్ ప్రదేశ్‌లో షేడ్యూల్డ్ కులాల జాబితాలో ఉంది) సముదాయానికి చెందినవారే. ఈ ప్రాంతంలో 3000 జాటవ కుటుంబాలు ఉంటాయనీ, వారిలో సుమారు "100 కుటుంబాలు ఈ పనిలో ఉన్నారు," అనీ భారత్ అంచనా. శోభాపుర్ 12వ వార్డు కిందకు వస్తుంది. 16,931 మంది జనాభా ఉన్న ఈ వార్డులో నివసించేవారిలో దాదాపు సగంమంది ఎస్‌సి సముదాయాలకు చెందినవారు (2011 జనగణన).
మీరట్ నగరానికి దక్షిణం వైపున ఉన్న శోభాపుర్ మురికివాడలో ఉన్న ఎనిమిది చర్మశుద్ధి కర్మాగారాలలో బాబూ లాల్ సొంత కర్మాగారం కూడా ఒకటి. "మేం తయారు చేసే తుది ఉత్పత్తిని సఫేద్ కా పుట్ఠా (నల్లగా ఉండే చర్మం వెనుక భాగాన్ని తెల్లగా మార్చినది) అంటారు. దీన్ని తోలు క్రికెట్ బంతుల వెలుపలి భాగాన్ని తయారుచేసేందుకు ఉపయోగిస్తారు," భారత్ చెప్పారు. స్థానికంగా ఫిట్‌కరీ అని పిలిచే పొటాసియం అల్యూమినియం సల్ఫేట్‌ను ఈ చర్మాలను శుద్ధిచేసే ప్రక్రియలో వాడతారు.
విభజన జరిగిన తర్వాత మాత్రమే క్రీడా వస్తువుల తయారీ పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ నుంచి మీరట్‌కు మారింది. క్రీడా వస్తువుల పరిశ్రమకు సహాయంగా ఉండేందుకు జిల్లా పరిశ్రమల విభాగం 1950లలో ప్రారంభించిన ఒక చర్మ శుద్ధి శిక్షణా కేంద్రాన్ని బాబూ లాల్ చూపించారు. అది హైవేకు అవతలి వైపున ఉంది.
కొంతమంది చర్మకారులు కలిసి, "21మంది సభ్యులతో శోభాపుర్ టానర్స్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పరచారు. మాకు ప్రైవేట్ యూనిట్లను నడిపే స్తోమత లేదు కాబట్టి కేంద్రాన్ని ఉపయోగించుకునేవాళ్ళం, నడపడానికి అయ్యే ఖర్చును అందరం కలిసి భరించేవాళ్ళం," అని భారత్ చెప్పారు.
*****
తన వ్యాపారానికి అవసరమైన ముడి పదార్థాలను కొనేందుకు భారత్ తెల్లవారుఝామునే నిద్ర లేస్తారు. ఒక షేర్ ఆటో ఎక్కి అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరట్ స్టేషన్‌కు వెళ్ళి, హాపుర్ వెళ్ళేందుకు ఉదయం ఐదున్నరకు బయలుదేరే ఖుర్జా జంక్షన్ ఎక్స్‌ప్రెస్ రైలును పట్టుకుంటారు. “మేం హాపుర్‌లోని చమ్రా పైంఠ్ (ముడి చర్మాల సంత) నుండి చర్మాలను కొంటాం. ఆదివారంనాడు దేశం నలుమూలల నుండి అన్ని రకాల చర్మాలు ఇక్కడికి వస్తుంటాయి," చెప్పారాయన.
హాపుర్ జిల్లాలో జరిగే ఈ వారపు సంత శోభాపుర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్చ్ 2023 నాటికి ఒక ఆవు చర్మం ధర, దాని నాణ్యతపై ఆధారపడి, రూ. 500 నుండి రూ. 1200 మధ్య ఉంటుంది.
ఈ చర్మాల నాణ్యత ఆ పశుగణం తీసుకునే ఆహారం, వాటికి వచ్చే జబ్బులు, ఇంకా కొన్ని ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుందని బాబూ లాల్ పేర్కొన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చే చర్మాలపై కీకర్ (తుమ్మ) చెట్టు ముళ్ళు గుచ్చుకున్న గుర్తులుంటాయి. హరియాణా నుంచి వచ్చే చర్మాలపై గోమారుల గుర్తులుంటాయి. ఇవి రెండవ రకానికి చెందిన చర్మాలు."
2022-23లో చర్మాలపై గడ్డలు వచ్చి 1.84 లక్షలకు పైగా పశువులు చనిపోయాయి; ఉన్నట్టుండి చర్మాలు విరివిగా లభిస్తుంటాయి. "ఆ చర్మాలపై పెద్ద పెద్ద మచ్చలుండటం వలన మేం వాటిని కొనలేం. క్రికెట్ బంతుల తయారీదార్లు వాటిని ఉపయోగించరు" చెప్పారు భారత్.
మార్చ్ 2017లో చట్టవిరుద్ధంగా నడుస్తోన్న వధ్యశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తమను గట్టి దెబ్బ కొట్టాయని తోలు పరిశ్రమలో పనిచేసే కార్మికులు చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే జంతువధ కోసం పశువుల సంతలో పశువులను కొనడాన్నీ అమ్మడాన్నీ నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఫలితంగా, "ఈ సంత అంతకు ముందున్న దాంట్లో సగానికి తగ్గిపోయింది. ఒకోసారి ఆదివారాలు కూడా ఈ సంత జరగలేదు," అన్నారు భారత్.
పశువులనూ, వాటి చర్మాలనూ రవాణా చేసేందుకు జనం భయపడేలా చేశారు గోరక్షకులు. "రిజిస్టర్ చేసుకొనివున్న అంతర్రాష్ట్ర రవాణాదారులు కూడా ఈ రోజుల్లో ముడి పదార్థాలను తీసుకెళ్లడానికి భయపడుతున్నారు. పరిస్థితి అలా తయారైంది" అంటున్నారు బాబూ లాల్.
గోసంరక్షకుల దాడులపై హ్యూమన్ రైట్స్ వాచ్ 2019లో వెలువరించిన భారతదేశంలో హింసాత్మక గోసంరక్షణ అనే నివేదిక, “మే 2015 నుంచి డిసెంబర్ 2018 మధ్య 12 భారతీయ రాష్ట్రాల్లో కనీసం 44 మంది - వారిలో 36 మంది ముస్లిమ్‌లు - హత్యకు గురయ్యారు. అదే సమయంలో, దేశంలోని 20 రాష్ట్రాలవ్యాప్తంగా 100కి పైగా జరిగిన వేరువేరు సంఘటనల్లో 280 మంది గాయపడ్డారు," అని పేర్కొంది.
"నా వ్యాపారం పూర్తిగా చట్టబద్ధమైనది, అన్నిటికీ రశీదుల ఆధారంగా నడుస్తుంటుంది. అయినా కూడా వాళ్ళకు కష్టంగానే ఉంది," అన్నారు బాబూ లాల్.
జనవరి 2020లో శోభాపుర్‌కు చెందిన చర్మకారులు మరోక గూగ్లీ దెబ్బతిన్నారు - కాలుష్యానికి పాల్పడుతున్నారంటూ వారికి వ్యతిరేకంగా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్- PIL) దాఖలయింది. "హైవే నుంచి కనిపించేలా, చర్మాన్ని శుద్ధి చేసే ఎటువంటి పనులూ ఉండకూడదని వాళ్ళు మరో షరతు పెట్టారు," అని భారత్ చెప్పారు. పిల్‌లో పేర్కొన్న విధంగా ప్రభుత్వం కల్పించిన పునరావాసానికి తరలించడానికి బదులుగా చర్మకారులందరికీ స్థానిక పోలీసుల ద్వారా మూసివేత నోటీసులు అందాయి.
" సర్కార్ హమేఁ వ్యవస్థా బనాకే దే అగర్ దిక్కత్ హై తో. జైసే డుంగర్ మేఁ బనాయీ హై 2003-04 మేఁ (ఏమైనా సమస్య ఉంటే, 2003-04లో ప్రభుత్వం డుంగర్ గ్రామంలో ఒక చర్మశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు మాకు కూడా చేయొచ్చు కదా)?" బాబూ లాల్ అన్నారు.
"మునిసిపల్ కార్పొరేషన్ మురుగు కాలువల నిర్మాణాన్ని పూర్తిచేయకపోవడం మాకు ఆందోళనను కలిగిస్తోంది," అని భారత్ చెప్పారు. ఈ ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చి 30 ఏళ్ళు పూర్తయ్యాయి. "వర్షాకాలంలో, నీరు సహజంగానే ఎగుడు దిగుడుగా ఉండే నివాస ప్రాంతాల వైపుకు వచ్చి నిలిచిపోతుంటుంది."
*****
శోభాపుర్‌లో ఉన్న ఎనిమిది చర్మశుద్ధి కర్మాగారాలు క్రికెట్ బంతుల తయారీలో ఉపయోగించే వందలాది తెల్లటి చర్మాలను సరఫరా చేస్తాయి. చర్మశుద్ధి కార్మికులు మొదట చర్మాలను కడిగి, మురికినీ దుమ్మునూ మట్టినీ తొలగిస్తారు. చర్మాన్ని శుభ్రం చేసి తోలుగా మార్చినందుకు ఒక్కో చర్మానికి వారికి రూ. 300 వరకూ లభిస్తాయి.
"చర్మాలను శుభ్రం చేసి, తిరిగి వాటిని సార్ద్రం చేసిన తర్వాత, వాటి నాణ్యత, ముఖ్యంగా వాటి మందం, ఆధారంగా మేం వాటిని వేరు చేస్తాం," అని బాబూ లాల్ చెప్పారు. మందంగా ఉన్న చర్మాలను పటికతో శుద్ధి చేయడానికి 15 రోజులు పడుతుంది. పలుచగా ఉన్న చర్మాలను మొక్కల నుంచి వచ్చే ద్రావణాలను ఉపయోగించి శుద్ధి చేస్తారు. ఇందుకు 24 రోజులు పడుతుంది."అనేక చర్మాలను ఒకేసారి శుద్ది చెస్తారు, కాబట్టి ప్రతిరోజూ ఒక కట్ట తోలు సిద్ధంగా ఉంటుంది."
చర్మాలను సున్నం, సోడియం సల్ఫైడ్ కలిపిన నీటి గుంటలో మూడు రోజులపాటు నానబెడతారు. ఆ తర్వాత చర్మాన్ని చదునుగా ఉన్న నేలపైన పరచి, దానిపైనున్న వెంట్రుకలను ఒక మొరటుగా ఉన్న ఇనుప పరికరం ఉపయోగించి తొలగిస్తారు. ఈ ప్రక్రియను సుతాయీ అంటారు. "చర్మకణాలు నాని ఉబ్బటం వలన, పైనున్న వెంట్రుకలు సులభంగా తొలగిపోతాయి," భారత్ చెప్పారు. చర్మాలను స్థూలంగా చేసేందుకు వాటిని తిరిగి నానబెడతారు.
బాబూ లాల్ వద్ద పనిచేసే నిపుణుడైన కారీగర్ (కార్మికుడు), 44 ఏళ్ళ తారాచంద్, రాఫా లేదా కత్తిని ఉపయోగించి చాలా శ్రమపడి, ఎంతో సున్నితంగా చర్మం లోపలివైపు భాగంలో ఉండే మాంసాన్ని తొలగిస్తారు. సున్నం అవశేషాలను తొలగించడానికి చర్మాలను మామూలు నీటిలో మూడు రోజులు నానబెట్టి, ఆపైన ఒక రాత్రంతా నీటిలో, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో నానబెడతారు. ఇలా చేయటం క్రిములను చంపడానికి, చర్మాన్ని తెల్లగా చేయడానికని బాబూ లాల్ చెప్పారు. " ఏక్ ఏక్ కర్‌కే సారీ గంద్-గందగీ నికలీ జాతీ హై (ఒక క్రమపద్ధతిలో అన్ని రకాల దుర్వాసనలను, మలినాలను తొలగిస్తారు)," అని ఆయన చెప్పారు.
"బంతులు తయారుచేసేవారి వద్దకు అతి శుభ్రమైన ఉత్పత్తి చేరుతుంది," అన్నారు భారత్.
మొత్తంగా శుభ్రం చేసిన చర్మాన్ని క్రికెట్ బంతుల తయారీదారులకు ఒక్కోటి రూ 1700కు అమ్ముతారు. చర్మం దిగువ భాగాన్ని చూపిస్తూ బారత్, "చర్మంలో ఇదే అమిత బలమైన భాగం కావడం వల్ల ఇక్కడి చర్మాన్నుంచి 18-24 వరకూ మొదటి రకం నాణ్యత కలిగిన క్రికెట్ బంతులను తయారుచేస్తారు. ఈ బంతులను విలాయతీ గేంద్ (విదేశీ బంతులు) అంటారు. ఈ బంతులు రిటైల్ మార్కెట్‌లో ఒక్కోటీ రూ. 2500కు పైగా అమ్ముడవుతాయి," అంటూ వివరించారు.
"ఇతర భాగాలు అంత బలంగా ఉండవు, పలుచగా కూడా ఉంటాయి కాబట్టి ఈ భాగాల నుండి తయారుచేసిన బంతులు చౌకగా ఉంటాయి. అవి వేగంగా తమ ఆకారాన్ని కోల్పోతాయి కాబట్టి తక్కువ ఓవర్లు ఆడతారు" అని బాబూ లాల్ చెప్పారు. “ఒక పూర్తి పుట్ఠా నుండి రకరకాల నాణ్యత కలిగిన మొత్తం 100 బంతులు వస్తాయి. ఒక్కో బంతిని రూ. 150కి అమ్మినా, ఒక బంతుల తయారీదారు ఒక పుట్ఠా కు కనీసం రూ. 15,000 సంపాదిస్తాడు,” త్వరత్వరగా లెక్కలువేస్తూ చెప్పారు భారత్.
"కానీ వాటి నుంచి మాకు వచ్చేదెంత?" భారత్ బాబూ లాల్ వైపు చూశారు. ఒక తోలు అమ్మితే వారికి రూ. 150 వస్తాయి. " కారిగర్ల కు (కార్మికులు) వేతనం ఇవ్వడానికి, ముడి పదార్థాల కోసం వారానికి రూ. 700 ఖర్చవుతాయి," అన్నారు భారత్. "ఈ క్రికెట్ బంతుల తయారీకి వాడే తోలును మేం మా చేతులనూ కాళ్ళనూ ఉపయోగించి తయారుచేస్తాం. అయితే, బడా కంపెనీల పేర్లతో పాటు ఆ బంతిపై ఇంకా ఏం రాసివుంటుందో మీకు తెలుసా? ‘ఆలమ్-టాన్డ్ హైడ్’ (పటికతో శుద్ధిచేసిన చర్మం). దాని అర్థం ఏమిటో ఆటగాళ్ళకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు,” అన్నారు భారత్
*****
"(పరిశ్రమలో) కాలుష్యం, వాసన, బహిరంగంగా కనిపిస్తూ ఉండటం లాంటివి సమస్యలని మీరు నిజంగా అనుకుంటున్నారా?"
పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఈ ప్రాంతంలో, చెరకు తోటల వెనుకగా దిగంతంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. చర్మశుద్ధి కర్మాగారపు కార్మికులు తమ పని ప్రదేశంలోనే కాస్త ఒళ్ళు కడుక్కొని, పని దుస్తులను వదిలేసి మామూలు దుస్తుల్లోకి మారిపోయి, ఇళ్ళకు బయలుదేరుతున్నారు.
"నేను తయారుచేసిన తోలుపై నా కొడుకు పేరులోని మొదటి అక్షరాల ఆధారంగా 'ఎబి(AB)'గా ఆనవాలు వేస్తాను," అని భరత్ చెప్పారు. "నేను అతనిని ఈ తోలు పనిని చేయనివ్వను. తర్వాతి తరం చదువుకుంటోంది. వారు అభివృద్ధిలోకి వస్తారు, ఈ తోలు పని ముగిసిపోతుంది."
మేం హైవే వైపు నడుస్తుండగా, భరత్ ఇలా అన్నారు, “ఒకరికి క్రికెట్ ఆడడం పట్ల మక్కువ ఉన్నట్టుగా, మాకు ఈ తోలు పని మీద మక్కువేమీ లేదు. (ఈ పని) మా జీవనోపాధిని నిలబెడుతుంది; మాకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి దీన్ని చేస్తున్నాం."
ఈ కథనాన్ని నివేదించడంలోని అన్ని దశలలో తమ విలువైన సమయాన్ని వెచ్చించినందుకూ, సహాయం చేసినందుకూ ప్రవీణ్ కుమార్, భరత్ భూషణ్‌లకు రిపోర్టర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) నుండి ఒక ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి