“ఈ భట్టీ (కొలిమి) వెలిగించిన ప్రతిసారీ నాకు ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది.”
సల్మా లోహార్ వేలి కణుపులు అన్నిటి మీదా మానిన గాయాల మచ్చలు కనిపిస్తున్నాయి. ఎడమచేతి కణుపులు రెండింటి మీద గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అవి త్వరగా మానిపోవటానికి కొలిమి నుంచి గుప్పెడు బూడిదను తీసి ఆమె వాటి మీద రుద్దారు.
సోనీపత్‌లోని బహాల్‌గఢ్ మార్కెట్లో వరుస ఝుగ్గీ (గుడిసె)లను తమ ఇళ్ళుగా పిలుచుకుంటూ బతుకుతుండే ఆరు లోహార్ కుటుంబాలలో 41 ఏళ్ళ సల్మా కుటుంబం కూడా ఒకటి. ఒక పక్క రద్దీగా ఉండే మార్కెట్ వీధి, ఇంకొక పక్క మునిసిపాలిటీ చెత్త కుప్ప. దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ మరుగు దొడ్డి, నీళ్ళ టాంకర్ సౌకర్యాలపైనే సల్మా, ఆమె కుటుంబం పూర్తిగా ఆధారపడుతుంది.
ఈ ఝుగ్గీల కు కరెంటు అనే మాటేలేదు. పైగా, నాలుగైదు గంటలు వాన పడితే ఆ ప్రాంతం మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది, గత అక్టోబర్‌లో (2023) పడ్డట్టు. అలా జరిగినప్పుడు కాళ్ళు పైకి మడచుకుని మంచాల మీద కూర్చుని, రెండు మూడు రోజులైనా సరే, ఆ నీళ్ళు పోయేదాకా ఎదురు చూడటం తప్ప వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. “ఆ రోజుల్లో చాలా కంపు కొడుతుంది,” అని గుర్తుచేసుకున్నాడు సల్మా కొడుకు దిల్షాద్.
“కానీ ఎక్కడికి పోతాం?” అడిగారు సల్మా. “చెత్త కుప్పల పక్కన ఉండటం వల్ల రోగాలు వస్తాయని మాకూ తెలుసు. అక్కడ మూగే ఈగలు వచ్చి మా తిండి మీద వాలతాయి. కానీ, ఇంకెక్కడికి పోగలం?”
గడియా లేదా గడులియా పేర్లతో పిలిచే లోహార్లు రాజస్థాన్‌లో సంచార తెగ (NT) గానూ, వెనకబడిన తరగతి గానూ జాబితా చేయబడ్డారు. ఈ సమూహానికి చెందినవారు ఢిల్లీలోనూ, హరియాణాలో కూడా నివసిస్తున్నారు. అయితే, ఢిల్లీలో వీరిని సంచార తెగగానే గుర్తించినా, హరియాణా లో మాత్రం వెనకబడిన తరగతిగా గుర్తించారు.
వాళ్ళు నివాసం ఉండే మార్కెట్ పదకొండవ రాష్ట్ర రహదారి పక్కనే ఉంది. కూరగాయలు, మిఠాయిలు, మసాలా దినుసులు, విద్యుత్ పరికరాలు, ఇంకా చాలా వస్తువులు అమ్ముకునేవాళ్ళు మార్కెట్లో అమ్ముకోవటం కోసం అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడ తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని, మార్కెట్ అయిపోగానే తిరిగి వెళ్ళిపోతారు.
“పొద్దున్నే ఆరింటికి లేస్తాను. పొద్దు పొడిచేసరికి కొలిమి వెలిగించి, అందరి కోసం వంటచేసి, అప్పుడు పని మొదలు పెడతాను,” అంటారు 41 ఏళ్ళ సల్మా. తన భర్త విజయ్‌తో కలిసి ఆమె రోజుకి రెండు దఫాలుగా కొలిమి దగ్గర చాలాసేపు పనిచేస్తారు. వాళ్ళు ఇనుప రద్దీని కరిగించి, సుత్తితో మోది, పాత్రలను ఇతర సామాగ్రిని తయారుచేస్తారు. ఇలా రోజుకి నాలుగైదు పాత్రలు చేయగలుగుతారు.
సల్మాకు మధ్యాహ్నం పూట కొద్దిగా విశ్రాంతి దొరుకుతుంది. పదహారేళ్ళ కూతురు తనూ ఒక వైపు, పద్నాలుగేళ్ళ చిన్నకొడుకు దిల్షాద్ ఒక వైపూ కూర్చుంటే, మధ్యలో మంచం మీద కూర్చుని ఆమె ఒక కప్పు వేడి టీ తాగుతారు. ఈ రోజు ఆమె తోడికోడలు పిల్లలు శివాని, కాజల్, చిడియా కూడా అక్కడే ఉన్నారు. వారిలో తొమ్మిదేళ్ళ చిడియా మాత్రమే బడికి పోతోంది.
“ఇదంతా వాట్సాప్‌లో పెడతావా?” అడిగారు సల్మా. “ముందు నా పని గురించి రాయి!”
ఆమె వృత్తికి సంబంధించిన పనిముట్లు, పూర్తి చేసిన వస్తువులు - జల్లెడలు, సుత్తెలు, పారలు, గొడ్డలి తలలు, ఉలులు, కఢాయిలు , మచ్చు కత్తులు, ఇంకా మరెన్నో - మధ్యాహ్నం ఎండలో మెరుస్తున్నాయి..
“మా పనిముట్లే ఈ ఝుగ్గీ లో అన్నిటికన్నా విలువైనవి,” ఒక పెద్ద ఇనుప పాత్ర ముందు కూర్చుంటూ అన్నారు సల్మా. ఆమె విరామ సమయం పూర్తయిపోయి, చేతిలోకి టీ కప్పు స్థానంలో సుత్తె, ఉలి వచ్చాయి. రెండు దెబ్బలకి ఒకసారి ఉలి దిశను మారుస్తూ ఆ పాత్ర అడుగున రంధ్రాలు చేస్తున్నారు. ఆమె పని చేస్తున్న సులువు చూస్తే ఆమెకి ఈ పని ఎంత అలవాటో తెలుస్తోంది. “ఈ జల్లెడ వంటగది కోసం కాదు. రైతులు గింజలు జల్లించడానికి దీన్ని వాడతారు.”
లోపల, వాళ్ళు రోజుకు రెండుసార్లు - ఉదయం, సాయంత్రం - వెలిగించే కొలిమి ముందు విజయ్ ఉన్నారు. అతను ఆకారాన్నిస్తోన్న ఇనుప కడ్డీ ఎర్రగా వెలుగుతుంది కానీ ఆ వేడిమి వల్ల అతనేమీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపించటం లేదు. కొలిమిని సిద్ధం చేయడానికి ఎంతసేపు పడుతుందని అడిగితే అతను పెద్దగా నవ్వి, “లోపలివైపు బాగా వెలుగుతున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. గాలి తేమగా ఉంటే ఎక్కువసేపు పడుతుంది. మనం వాడే బొగ్గు మీద ఆధారపడి మామూలుగా ఒకటి రెండు గంటలు పడుతుంది.”
కిలో బొగ్గు, దాని నాణ్యతను బట్టి, 15 నుండీ 70 రూపాయల ఖరీదు చేస్తుంది. సల్మా, విజయ్‌లు ఉత్తరప్రదేశ్‌లోని ఇటుకబట్టీలకి వెళ్ళి అక్కడి నుంచి పెద్ద మొత్తంలో బొగ్గును కొని తెచ్చుకుంటారు.
దాగలి పైన ఎర్రగా వెలుగుతున్న ఇనుప కడ్డీ చివరను సుత్తెతో కొడుతూ చదును చేస్తున్నారు విజయ్. ఆ చిన్న కొలిమి ఇనుముని కావలసినంతగా కరిగించే శక్తి లేనిది కావటంతో, ఆయన బాగా బలంగా కొట్టాల్సి వస్తోంది.
రాజస్థాన్‌లో 16వ శతాబ్దం నాటి ఆయుధాలు తయారుచేసే సముదాయాన్ని తమ పూర్వీకులుగా లోహార్లు చెప్పుకుంటారు. మొఘలులు చిత్తోర్‌గఢ్‌ను చేజిక్కించుకున్నప్పుడు ఈ సముదాయం ఉత్తర భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వలసపోయింది. “వాళ్ళే మా పూర్వీకులు. ఇప్పుడు మా జీవితాలు చాలా మారిపోయాయి,” నవ్వుతూ అన్నారు విజయ్. “అయితే వాళ్ళు నేర్పిన పనితనాన్నే మేం ఇప్పటికీ అనుసరిస్తున్నాం. వాళ్ళలాగే మేం కూడా చేతులకి ఈ కఢాయిలు (మందపాటి కంకణాలు) వేసుకుంటాం.”
ఇప్పుడాయన తన పనిని తన పిల్లలకు నేర్పిస్తున్నారు. “దిల్షాద్ అందరికన్నా బాగా పని చేస్తాడు,” అంటారతను. సల్మా, విజయ్‌ల చిన్నకొడుకు దిల్షాద్ పనిముట్లను చూపిస్తూ వాటి గురించి చెబుతున్నాడు: “ఇవి హథోడాలు (సుత్తులు). పెద్ద వాటిని ఘన్ అంటారు. బాపు (నాన్న) వేడి లోహాన్ని ఈ చిమటా (పట్టకారు)తో పట్టుకుని, కైంచి (కత్తెర)తో వంపు తిప్పుతాడు.”
కొలిమి వేడిని నియంత్రించటానికి చేతితో తిప్పే ఫ్యాన్ పిడిని చిడియా తిప్పడం మొదలుపెట్టింది. అక్కడంతా ఎగురుతున్న బూడిదని చూసి ఆమె ముసిముసిగా నవ్వుకుంటోంది.
ఇంతలో కత్తి కొనటానికి ఒకామె వచ్చింది. సల్మా దాని ధర వంద రూపాయలని చెప్పారు. “దీనికి వంద రూపాయలు ఎందుకు? ప్లాస్టిక్ కత్తి కొనుక్కుంటే ఇంకా చౌకగా వస్తుంది గదా!” అన్నది ఆమె. కొద్దిసేపు బేరం ఆడి 50 రూపాయలకి కత్తి తీసుకువెళ్ళింది.
వెళుతున్న ఆమెని చూస్తూ సల్మా నిట్టూర్చారు. కుటుంబం గడవటానికి సరిపోయే సంపాదన ఇనప సామాను అమ్మటంలో రావటంలేదు. ప్లాస్టిక్ వస్తువుల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. సల్మావాళ్ళు చేసే వస్తువులు ప్లాస్టిక్ వస్తువులంత వేగంగా కానీ, అంత చవకగా కానీ తయారయ్యేవికావు.
“మేం కూడా ఇప్పుడు ప్లాస్టిక్ అమ్మటం మొదలుపెట్టాం,” అన్నారామె. “మా మరిది తన ఝుగ్గీ ముందే ఒక ప్లాస్టిక్ దుకాణం పెట్టాడు. మా అన్న ఢిల్లీ సమీపంలోని టిక్రీ సరిహద్దు వద్ద ప్లాస్టిక్ సామాను అమ్ముతున్నాడు.” మార్కెట్లో ఇతర వర్తకుల నుంచి వారు ప్లాస్టిక్ సామాను కొని అమ్ముతుంటారు కానీ ఆ వ్యాపారంలో ఇప్పటికయితే లాభాలేమీ రావటంలేదు.
ఢిల్లీలో తన మామయ్యలు ఎక్కువ సంపాదిస్తారని తనూ చెప్తోంది. “నగరంలో జనం ఇలాంటి చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు పెడతారు. పది రూపాయలంటే వాళ్ళకి పెద్ద విషయం కాదు. ఊరి జనాలకు పది రూపాయలంటే చాలా ఎక్కువ, ఉన్న కొంచెం డబ్బులను మా మీద ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకే మా మామయ్యల దగ్గర మాకన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది.”
*****
“మా పిల్లలు చదువుకోవాలి,” 2023లో నేను ఆమెని మొదటిసారి కలిసినప్పుడు సల్మా అన్నారు. అప్పట్లో నేను దగ్గరలో ఉన్న ఒక యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నాను. “వాళ్ళు జీవితాల్లో ఏదో ఒకటి సాధించాలి.” సరైన గుర్తింపు పత్రాలు లేకపోవటం వల్ల వాళ్ళ పెద్దబ్బాయి మాధ్యమిక పాఠశాల చదువు మానేయవలసిరావటంతో ఆమెకి ఈ కోరిక ఇంకా బలపడింది. అతనికిప్పుడు ఇరవై ఏళ్ళు.
“సర్పంచ్ దగ్గరి నుంచీ జిల్లా కేంద్రం వరకూ వాళ్ళు అడిగిన అన్ని పత్రాలు – ఆధార్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రాలు - పట్టుకుని ఎంతో తిరిగాను. వాళ్ళు చెప్పిన చోటల్లా వేలి ముద్రలు వేశాను. అయితే పని మాత్రం జరగలేదు.
దిల్షాద్ కూడా పోయిన సంవత్సరం ఆరో తరగతిలో చదువు మానేశాడు. “ప్రభుత్వ బడుల్లో వాళ్ళు చెప్పేదాంట్లో నేర్చుకునేందుకేమీ ఉండదు. కానీ మా అక్క తనూకి చాలా విషయాలు తెలుసు. ఆమె పఢీ-లిఖీ (చదువుకున్నది),” అంటాడతను. తనూ ఎనిమిదవ తరగతి వరకూ చదువుకుంది కానీ ఆమెకింక చదువు కొనసాగించాలని లేదు. దగ్గరలో ఉన్న బడిలో పదవ తరగతి లేదు. మూడు కిలోమీటర్ల దూరంలోని ఖెవారాలో ఉన్న బడికి పోవాలంటే ఆమె దాదాపు గంటసేపు నడవాల్సివుంటుంది..
“అందరూ నా వైపు అదోలా చూస్తారు,” అన్నది తనూ. “వాళ్ళు చాలా చెడ్డ మాటలు అంటారు. వాటిని మళ్ళీ చెప్పటం కూడా నాకు ఇష్టముండదు.” అందుకని తనూ ఇప్పుడు ఇంట్లోనే ఉండి, అమ్మా నాన్నలకు సహాయపడుతోంది.
ఆ కుటుంబం నీళ్ళ టాంక్ దగ్గర ఆరుబయట స్నానం చేయాల్సిందే. “అక్కడ బయట స్నానం చేస్తున్నప్పుడు మేం అందరికీ కనిపిస్తుంటాం,” చిన్న గొంతుతో అన్నది తనూ. కానీ ఒక్కసారి ప్రభుత్వ మరుగుదొడ్డికి పోవాలంటే ఒక్కరికి పది రూపాయలు అవుతుంది. ఇక కుటుంబం మొత్తం పోవాలంటే చాలా ఖర్చు. వాళ్ళ సంపాదనతో ఒక మరుగుదొడ్డి ఉన్న ఇల్లు అద్దెకి తీసుకోలేరు. దాంతో వాళ్ళు అలా రోడ్డు పక్కన ఉండాల్సివస్తోంది..
ఆ కుటుంబంలో ఎవరూ కోవిడ్-19 టీకా వేయించుకోలేదు. జబ్బు చేస్తే బఢ్ ఖల్సాలోనో, సేవలీలోనో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళతారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఖర్చు ఎక్కువ కాబట్టి, మరీ తప్పనిసరైతే తప్ప వాటికి వెళ్ళరు.
డబ్బు ఖర్చుచేసే విషయంలో సల్మా చాలా జాగ్రత్తగా ఉంటారు. “మరీ డబ్బుకు కటకటగా ఉన్నప్పుడు పాత బట్టలు ఏరుకునే వాళ్ళ దగ్గరకు పోతాం," అన్నారామె. "అక్కడ రెండు వందలకే మాకు బట్టలు వచ్చేస్తాయి."
అప్పుడప్పుడూ కుటుంబం సోనీపత్‌లోని ఇతర మార్కెట్లకి వెళ్తుంటారు. “నవరాత్రి సమయంలో ఈ దగ్గరలోనే నిర్వహించే రామ్‌లీలకు వెళతాం. డబ్బులు ఉంటే, బయట తింటాం కూడా,” చెప్పింది తను.
“నా పేరు ముసల్మానుల పేరులా ఉంది కానీ, నేను హిందువునే,” అన్నారు సల్మా. “మేం అందరినీ - హనుమంతుడు, శివుడు, వినాయకుడు - పూజిస్తాం.”
“మా పని ద్వారా మేం మా పూర్వీకులను కూడా పూజిస్తాం!” వెంటనే అన్నాడు దిల్షాద్, వాళ్ళమ్మకు నవ్వుతెప్పిస్తూ.
*****
మార్కెట్లో అమ్మకాలు తక్కువగా ఉన్నప్పుడు సల్మా, విజయ్‌లు చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి తమ సామాను అమ్ముతారు. నెలలో ఒకటి రెండు సార్లు ఇలా జరుగుతుంది. ఆ ఊళ్ళలో మామూలుగా ఎవరూ ఏదీ కొనరు. ఎవరైనా కొన్నరోజు కూడా మహా అయితే నాలుగైదు వందలు వస్తాయి. “ఒక్కోసారి తిరిగీ తిరిగీ కాళ్ళు పడిపోతాయి,” అన్నారు సల్మా.
అప్పుడప్పుడు ఊరివాళ్ళు చిన్న చిన్న దూడలని, పాలిచ్చే తల్లి పశువుల నుంచి దూరం చేయటానికి, వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆ కుటుంబ సంపాదన సరైన ఇల్లు అద్దెకి తీసుకుని ఉండటానికి సరిపోదు కాబట్టి వాళ్ళు అలా రోడ్డు పక్కనే ఉంటారు.
రాత్రిపూట అటు వచ్చే తాగుబోతులని తరమటం గురించి నవ్వుతూ కొట్టిపారేస్తుంది తనూ. “వాళ్ళని కొట్టి, అరిచి తరిమితే గానీ పోరు. మా అమ్మలు, అక్కచెల్లెళ్ళు ఇక్కడే పడుకుంటారు కదా,” అంటాడు దిల్షాద్.
ఈ మధ్య కొంతమంది నగర్ నిగమ్ (సోనీపత్ మున్సిపల్ కార్పొరేషన్) నుంచీ వచ్చామని చెప్తూ, వాళ్ళని ఆ జాగా ఖాళీ చేయమని అంటున్నారు. వాళ్ళ ఝుగ్గీల వెనక ఉన్న మునిసిపాలిటీ చెత్తకుప్పల స్థలానికి గేటు కట్టాలని, అందుకు వాళ్ళు ఉంటోన్న ప్రభుత్వ స్థలం అవసరమని ఆ వచ్చినవాళ్ళు అంటున్నారు.
ఆ వచ్చే అధికారులు ఈ కుటుంబాల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కుటుంబ కార్డుల వివరాలు తీసుకుని వెళతారు కానీ, వాళ్ళు అక్కడకు వచ్చినట్టుగా ఏ అధికారిక రుజువులను వదలటంలేదు. దాంతో ఇక్కడ ఎవరికీ ఆ వచ్చినవాళ్ళు ఎవరో స్పష్టంగా తెలియదు. వాళ్ళు మాత్రం ప్రతి రెండు నెలలకు ఒకసారి వస్తున్నారు..
“మాకు ఒక స్థలం వస్తుందని వాళ్ళు చెప్తారు,” అన్నది తను. “ఎటువంటి స్థలం? ఎక్కడ? మార్కెట్ నుంచీ దగ్గరా, దూరమా? ఇలాంటి వివరాలేమీ మాకు చెప్పరు.”
ఒకప్పుడు వాళ్ళు నెలకి 50,000 రూపాయలు సంపాదించేవారని వారి కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం చూపిస్తోంది. ఇప్పుడు వారు సుమారు 10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. వారికి డబ్బు అవసరమైనప్పుడు, బంధువుల దగ్గర అప్పు తీసుకుంటారు. ఎంత దగ్గర బంధువులైతే అంత తక్కువ వడ్డీ. అమ్మకాలు బాగున్నప్పుడు అప్పు తీరుస్తారు, కానీ కోవిడ్ తర్వాత వారి సంపాదన బాగా తగ్గిపోయింది.
“కోవిడ్ రోజులు మాకు బాగుండేవి,” అన్నది తను. “మార్కెట్ అంతా ప్రశాంతంగా ఉండేది. ప్రభుత్వ ట్రక్కులు వచ్చి తిండి సామాను ఇచ్చేవాళ్ళు. జనం వచ్చి మాకు మాస్కులు కూడా పంచేవారు.”
“కోవిడ్ తర్వాత అందరూ మమ్మల్ని మరింత అనుమానంగా చూస్తున్నారు. వాళ్ళ చూపుల్లో ద్వేషం కనబడుతోంది,” సాలోచనగా అన్నారు సల్మా. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడల్లా కొంతమంది స్థానికులు వారి కులం పేరు పెట్టి దూషిస్తూ ఉంటారు.
“వాళ్ళ ఊళ్ళల్లో మమ్మల్ని ఉండనివ్వరు. మా కులాన్ని ఎందుకు అంతలా తిడతారో నాకు అర్థంకాదు.” ప్రపంచం తమను సమదృష్టితో చూడాలని సల్మా కోరిక. “ రోటీ అనేది మాకైనా వాళ్ళకైనా ఒకటే కదా – అందరం తినేది అదే ఆహారం. మాకూ, డబ్బున్నవాళ్ళకీ ఏమిటి తేడా?”
అనువాదం: వేణు జివిజికె రాజు