లక్షద్వీపాల ద్వీపసమూహాలన్నీ విస్తారమైన కొబ్బరి తోటలతో నిండివుంటాయి. కొబ్బరి కాయల నుంచి పీచును తీయటం ఇక్కడ ఒక ప్రధాన పరిశ్రమ.
చేపలు పట్టడం, కొబ్బరి పంటను సాగుచేయటంతో పాటు కొబ్బరిపీచును తాళ్ళుగా పేనడం ఇక్కడి ప్రధాన వృత్తులలో ఒకటి. లక్షద్వీప్‌లో ఏడు కొబ్బరి పీచును తీసే యూనిట్లు, ఆరు కొబ్బరి నారను ఉత్పత్తి చేసే కేంద్రాలు, ఏడు నారను పేనే యూనిట్లు (2011 జనాభా లెక్కలు) ఉన్నాయి.
ఈ రంగంలో దేశంలో ఏడు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 80 శాతం మంది మహిళలు . వీరు కొబ్బరి పీచును తీయడం, దానిని వడకి నారను తీయడం వంటి పనులలో నిమగ్నమై ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, మానవ శ్రమ నుంచి యంత్రాలకు మారినప్పటికీ కొబ్బరి ఉత్పత్తులను తయారుచేయడం ఇప్పటికీ అమిత శ్రమతో కూడుకున్న పనే.
లక్షద్వీప్‌లోని కవరత్తిలో ఉన్న పీచు ఉత్పత్తి, డెమాన్‌స్ట్రేషన్ కేంద్రంలో, 14 మంది మహిళల బృందం కొబ్బరికాయ నుంచి పీచును తీయడానికి, తాళ్లను తయారుచేయడానికి ఆరు యంత్రాలను నడుపుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు ఎనిమిది గంటలపాటు పనిచేస్తూ వీరు నెలకు దాదాపు రూ. 7,700 సంపాదిస్తారు. షిఫ్ట్‌లో మొదటి సగం తాళ్ళ తయారీకి, రెండవ సగం పరికరాలను శుభ్రం చేయడానికి అని 50 ఏళ్ల కార్మికురాలు రహ్మత్ బీగం బి. చెప్పారు. తాళ్ళను కేరళలోని కాయిర్ బోర్డుకు రూ. 35లకు ఒక కిలోగ్రాము చొప్పున అమ్ముతారు.
ఈ పీచును వేరుచేసే, తాళ్ళుగా పేనే యూనిట్‌లకు ముందు కొబ్బరి పీచును సంప్రదాయకంగా కొబ్బరి చిప్పల పొట్టు నుండి చేతితో సేకరించి, దారాలుగా వడకి, చాపలు, తాళ్ళు, వలలను తయారుచేయడానికి ఉపయోగించేవారు. "నెల రోజుల పాటు కొబ్బరికాయలను ఇసుకలో పాతిపెట్టడానికి మా తాతయ్యవాళ్ళు తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి, సముద్రానికి సమీపాన ఉన్న కవరత్తి ఉత్తరం వైపుకు వెళ్ళేవారు" అని ఫాతిమా చెప్పారు.
"అప్పుడు వాళ్ళు (కొబ్బరి) పీచును దంచి తాళ్ళుగా పేనేవారు, ఇలాగ..." అంటూ ఆ 38 ఏళ్ల మహిళ ఆ పద్ధతిని ప్రదర్శించి చూపించారు. “ఇప్పటి తాళ్ళు నాణ్యమైనవి కావు, చాలా తేలికగా ఉంటాయి” అని కవరత్తిలోని ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ఆమె చెప్పారు.
తానెలా చేతితో కొబ్బరి తాళ్ళను చేసేవారో లక్షద్వీప్‌లోని బిట్రా గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్ చెప్పారు. ఆ తాళ్ళను తాను తన పడవను కట్టేందుకు ఉపయోగించేవాడినని ఈ 63 ఏళ్ళ జాలరి తెలిపారు. చదవండి: లక్షద్వీప్ దీవుల తీరని దుఃఖం
అబ్దుల్ ఖాదర్, కవరత్తి కాయిర్ ఉత్పత్తి కేంద్రానికి చెందిన కార్మికులు - సంప్రదాయ పద్ధతిలోనూ, ఆధునిక పద్ధతిలోనూ - కొబ్బరి పీచుతో తాళ్లను తయారుచేస్తున్న దృశ్యాన్ని ఈ వీడియో చూపిస్తుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి