"నేనొక చిత్రకారిణినని నాకు అనిపించదు. చిత్రకారులకు ఉండే లక్షణాలు నాకు లేవు. అయితే నా దగ్గర కథలున్నాయి. నా కుంచెతో కథలను రాసే ప్రయత్నం చేస్తాను. నా గీతలన్నీ పరిపూర్ణమైనవని నేను చెప్పుకోను. గత రెండుమూడేళ్ళుగా మాత్రమే నేను అనేకమంది చిత్రకారుల కృషిని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాను. లేకుంటే, నాకెటువంటి జ్ఞానమూ లేదు. ఒక కథను చెప్పటానికి నేను చిత్రాలు గీశాను. కథ చెప్పగలిగినందుకు నేను ఆనందపడతాను. నేనొక కథన రచన చేస్తున్నట్టుగా చిత్ర రచన చేస్తాను.“

లావణి పశ్చిమ బెంగాల్‌ నదియా జిల్లాలోని ధుబూలియాకు చెందిన ఒక కళాకారిణి, చిత్రకారిణి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ గ్రామంలో ఒక విమానాశ్రయంతో కూడిన సైనిక శిబిరం ఉండేది. బ్రిటిష్‌వారు ఆ శిబిరాన్ని స్థాపించినప్పుడు ఎక్కువగా ముస్లిములు నివాసముండే ఈ గ్రామం చాలా వ్యవసాయ భూమిని కోల్పోయింది. ఆ తరువాత దేశవిభజన జరిగినప్పుడు గ్రామానికి చెందిన చాలామంది సరిహద్దుకు అవతలి వైపుకు వెళ్ళిపోయారు. "కానీ మేం వెళ్ళలేదు," లావణి చెప్పారు. "మా పెద్దలు వెళ్ళిపోవాలనుకోలేదు. మా పూర్వీకులు ఈ భూమిలోనే సమాధి అయ్యారు. మేం జీవించి, చనిపోవాలనుకుంటున్నది ఇక్కడే.” భూమితో ఉన్న ఆ అనుబంధం, ఆ భూమి పేరు మీద జరిగేవన్నీ చిన్నప్పటి నుంచీ ఈ కళాకారిణిలోని సున్నితత్వానికి రూపునిచ్చాయి.

చిత్రలేఖనంపై ప్రోత్సాహం ఆమెకు ఆమె తండ్రి నుండి వచ్చింది. ఆయన ఆమెను చిన్నతనంలో కొన్ని సంవత్సరాలపాటు ఒక ట్యూటర్ వద్దకు తీసుకెళ్ళారు. తన 10 మంది తోబుట్టువులలో ఆమె తండ్రి ఒక్కరే మొదటి తరం అభ్యాసకుడు. అట్టడుగు స్థాయిలో పనిచేసే న్యాయవాది అయిన ఆయన రైతులు, కూలీల కోసం సహకార సంఘాలను ప్రారంభించారు, కానీ పెద్దగా డబ్బు సంపాదించలేదు. "ఆయన ఏమాత్రం డబ్బు సంపాదించినా, దాన్లోంచి నాకొక పుస్తకం కొనేవాడు," అని లావణి చెప్పారు. “మాస్కో ప్రెస్, రాదుగ పబ్లిషర్స్ నుండి చాలా పిల్లల పుస్తకాలు బంగ్లా అనువాదాల రూపంలో మా ఇంటికి వచ్చేవి. ఈ పుస్తకాల్లోని బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. నేను బొమ్మలు వేయడానికి తొలి ప్రేరణ అక్కడి నుంచే వచ్చింది.”

చిన్న వయస్సులోనే తండ్రి ఆమెకు పరిచయం చేసిన చిత్రలేఖనంలో శిక్షణ ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ 2016లో భాష ఆమెను విడిచిపెట్టడం ప్రారంభించినప్పుడు, లావణికి చిత్రలేఖనం పట్ల ప్రేమ తిరిగి వచ్చింది. రాజ్యం ఉదాసీనవైఖరి వలన మైనారిటీలను ఉద్దేశపూర్వకంగా హింసించడం, అటువంటి ద్వేషపూరిత నేరాల పట్ల జనబాహుళ్యం పెడముఖం పెడుతున్న నేపథ్యంలో దేశంలో మూక హత్యలు పెరిగిపోయాయి. అప్పుడే కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పూర్తి చేసిన లావణి ఈ దేశపు వాస్తవికతలను చూసి చాలా కలతపడ్డారు, అయినా దాని గురించి రాయలేకపోయారు.

"చాలా తీవ్రమైన అసౌకర్య భావన ఉండేది," ఆమె చెప్పారు. “నాకు అప్పటి వరకు రాయడమంటే చాలా ఇష్టంగా ఉండేది, బంగ్లాలో కొన్ని వ్యాసాలు రాసి ప్రచురించాను. కానీ అకస్మాత్తుగా భాష పూర్తిగా సరిపోదని అనిపించింది. నేనప్పుడు అన్నిటి నుంచీ పారిపోవాలనుకున్నాను. అప్పుడే బొమ్మలు వేయడం మొదలుపెట్టాను. దొరికిన ప్రతి చిన్న కాగితంపై సముద్రాన్ని, దాని అన్ని అవస్థలలో, నీటి రంగులలో చిత్రించేదాన్ని. అప్పట్లో[2016-17] ఒకదాని తర్వాత ఒకటిగా సముద్రం మీద చాలా బొమ్మలు వేశాను. అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచంలో శాంతిని వెదుక్కోవడానికి బొమ్మలు వేయడమే నా మార్గంగా ఉండేది.”

ఈనాటికీ లావణి స్వయంబోధిత కళాకారిణిగానే ఉన్నారు.

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

లావణి తన తండ్రి తనకు పరిచయం చేసిన ట్యూటర్ ద్వారా చిత్రలేఖనంలో ప్రారంభ శిక్షణ పొందారు, కానీ అది కొద్దికాలమే సాగింది

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

2016, 2017ల మధ్య దేశం పెరిగిపోతోన్న మత విద్వేషాల గుప్పెట్లో ఉన్నప్పుడు ఈ స్వయంబోధిత కళాకారిణి మళ్ళీ చిత్రలేఖనం వైపుకు మళ్ళారు. లోపలా బయటా చెలరేగుతోన్న గందరగోళాన్ని ఎదుర్కోవటానికి ఈ 25 ఏళ్ళ కళాకారిణి ఎంచుకున్న మార్గమిది

మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక యుజిసి-మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (2016–20) పొందిన తర్వాత లావణి, 2017లో జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌, కలకత్తాలో డాక్టొరల్ ప్రోగ్రామ్‌లో చేరారు. ఇంతకుమునుపే తాను ప్రారంభించిన వలస కార్మికులపై తన పనిని ఆమె కొనసాగించారు. అయితే, ఈసారి తన విశాల పరిశోధనా ప్రాజెక్ట్ అయిన 'బెంగాలీ వలస కార్మికుల జీవితాలు, ప్రపంచం'లో భాగంగా వారి జీవిత వాస్తవాలను మరింత లోతుగా అర్థం చేసుకున్నారు.

తన గ్రామం నుండి అనేకమంది జనం నిర్మాణ పనుల కోసం కేరళకు వెళ్లడమో, లేదా హోటళ్ళలో పని చేయడానికి ముంబైకి వెళ్లడమో లావణి చూశారు. "నా తండ్రి సోదరులు, వారి కుటుంబ సభ్యులలో మహిళలు కాకుండా పురుషులు, ఇప్పటికీ బెంగాల్‌కు బయట వలస కార్మికులుగా పనిచేస్తున్నారు," అని ఆమె చెప్పారు. విషయం ఆమె హృదయానికి చాలా దగ్గరదే అయినప్పటికీ, అందుకు చాలా ఫీల్డ్ వర్క్ అవసరం. "కానీ అప్పుడే కోవిడ్ దెబ్బకొట్టింది," అని ఆమె గుర్తుచేసుకున్నారు. “దీనివలన అత్యధికంగా దెబ్బతిన్నది వలస కార్మికులు. అప్పుడిక నా పరిశోధనలో పని చేయాలని నాకు అనిపించలేదు. ఇంటికి చేరుకోవడానికి, ఆరోగ్య సంరక్షణను పొందడానికి, శ్మశానాల్లోనూ శ్మశాన వాటికల్లోనూ చోటు కోసం వారు క ష్టాలుపడుతున్నప్పుడు నేను వెళ్ళి నా విద్యాసంబంధమైన పని గురించిన ప్రశ్నలను ఎలా అడగగలను? వారి పరిస్థితుల నుండి ప్రయోజనం పొందడం సరికాదనిపించింది. ఫీల్డ్ వర్క్‌ను సకాలంలో పూర్తి చేయలేకపోవటంతో నా పిఎచ్‌డి అలా సాగుతూపోయింది.”

ఈసారి లావణి తన కుంచెను పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) పేజీలలో వలస కార్మికుల జీవితాలను డాక్యుమెంట్ చేయడానికి ఉపయోగించారు. “సాయినాథ్ వ్యాసాలు కొన్ని బెంగాలీ దినపత్రిక గణశక్తి సంపాదకీయ పేజీలలో ప్రచురించబడేవి. స్మితా దీ నన్ను మొదట ఒక వ్యాసం కోసం, ఆ తరువాత ఒక కవిత కోసం కొన్ని బొమ్మలు వేయమని కోరేనాటికే పి. సాయినాథ్ పని గురించి నాకు పరిచయం ఉంది." (స్మితా ఖటోర్ PARI ప్రధాన అనువాదాల సంపాదకురాలు). 2020 PARI ఫెలోగా ఉన్న లావణి జంగి, ఆ సంవత్సరమంతా తన థీసిస్‌లోని సబ్జెక్ట్‌లతో పాటు కోవిడ్, లాక్‌డౌన్‌లలో బతుకుతున్న రైతుల, గ్రామీణ మహిళల జీవితాలను చిత్రించారు.

PARI తో నా పని వ్యవస్థాగతమైన సవాళ్ళు, గ్రామీణ జీవిత శాశ్వత స్ఫూర్తి - ఈ రెండింటిపై కేంద్రీకరిస్తుంది. ఈ కథనాలను నా కళలో జోడించడం ద్వారా, వారి జీవితాల సంక్లిష్టతలలో ప్రతిధ్వనించే దృశ్య వ్యక్తీకరణలకు రూపుకట్టడానికి నేను ప్రయత్నిస్తాను. నా చిత్రాలు గ్రామీణ భారతదేశంలోని సాంస్కృతిక, సామాజిక వాస్తవాల గొప్ప వైవిధ్యాలను సంరక్షించడానికి, పంచుకోవడానికి దోహదపడే మాధ్యమంగా పనిచేస్తాయి.”

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

రైతుల నిరసనల సమయంలోనూ, కోవిడ్ సమయంలో వలసల సంక్షోభ సమయంలోనూ PARI కోసం ఆమె గీసిన చిత్రాలు మా రిపోర్టింగ్‌కు  ఆవశ్యకతనూ, దృక్పథాన్నీ జోడించాయి

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

2020 PARI ఫెలోగా లావణి ఉజ్జ్వలమైన తన రేఖలతోనూ, రంగులతోనూ కథల శ్రేణిని సుసంపన్నం చేశారు

లావణి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినవారు కాదు, కానీ ఆమె తన కళను రాజకీయంగా చూస్తారు. “నేను చదువుకోవడానికి జాదవ్‌పూర్ వచ్చిన తర్వాత చాలామంది చిత్రకారులతో పాటు రాజకీయ పోస్టర్లను చూశాను. మన చుట్టూ జరిగే ప్రతిదాని గురించి నేను వేసే చిత్రాలు, నేను వీటికి ప్రభావితం కావడం నుండి, నాదైన కళాస్పందన నుండి వచ్చాయి." ద్వేషం మామూలు విషయంగా మారిపోతోన్న సమాజంలో, ఒక ముస్లిమ్ మహిళగా రోజువారీ వాస్తవాల నుండి ఆమె ప్రేరణ పొందారు. కాగా, ప్రభుత్వ-ప్రాయోజిత హింస ఈనాటి కఠిన వాస్తవం.

"ప్రపంచం మమ్మల్ని, మా నైపుణ్యాలను, మా ప్రతిభను, మా కృషిని గుర్తించడానికి ఇష్టపడదు," అన్నారు లావణి. "ఈ చెరిపివేతలో మా గుర్తింపు చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది. ఇది ఈనాటికీ కొనసాగుతోంది. మా పని, ప్రత్యేకించి ఒక ముస్లిమ్ మహిళా కళాకారిణి పని, చాలామంది వ్యక్తులకు అసలు ఉనికిలో ఉన్నట్టు కూడా కాదు." ఆమె అదృష్టవంతురాలై, ఆమె కళకు సరైన పోషకులు దొరికే వరకూ మాత్రం ఖచ్చితంగా కాదు. "విమర్శించడానికి కూడా దానికి తావివ్వరు, శ్రద్ధ పెట్టరు కూడా. అందుకే దాన్ని నేను చెరిపివేత అంటాను. ఆ మాటకొస్తే ఈ ప్రక్రియ కళ, సాహిత్యం, ఇంకా అనేక ఇతర రంగాల చరిత్రలో వ్యక్తమవుతుంది,” అని ఆమె జతచేశారు. అయితే లావణి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి డిజిటల్ వేదికల గోడలపై తన చిత్రాలను, తన కృషిని ఉంచడం ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

ఫేస్‌బుక్ ద్వారానే ఛట్టోగ్రామ్‌లోని చిత్రభాషా ఆర్ట్ గ్యాలరీ ఆమెను సంప్రదించి, డిసెంబర్ 2022లో బీబీర్ దర్గాస్ (బీబీల దర్గాలు) అనే తన మొట్టమొదటి సోలో ఎగ్జిబిషన్ కోసం బంగ్లాదేశ్‌కు ఆహ్వానించింది.

PHOTO • Courtesy: Labani Jangi
PHOTO • Courtesy: Labani Jangi

ఛట్టోగ్రామ్‌లోని చిత్రభాషా ఆర్ట్ గ్యాలరీలో 2022లో జరిగిన లావణి సోలో ప్రదర్శన

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

మహిళా పీర్లను గౌరవించే పాత కాలపు దర్గాలు కనుమరుగై ఉండవచ్చు, కానీ తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళల్లో వాటి స్ఫూర్తి ఈనాటికీ నిలిచి ఉంది. లావణి కళ అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది

బీబీర్ దర్గాస్ ప్రదర్శన ఆలోచన ఆమె చిన్నతనం నుండి వచ్చింది, అలాగే బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల నుండి కూడా. ఇక్కడ మరోసారి సంప్రదాయవాద ఇస్లామ్ పెరుగుదలను చూస్తున్నానని ఆమె చెప్పారు. బీబీ కా దర్గా అనేది మహిళా పీర్ల (ఆధ్యాత్మిక మార్గదర్శకులు) స్మారకంగా ఉండే దర్గాల ను సూచిస్తుంది. “నేను పెరుగుతోన్న వయసులో మా గ్రామంలో మహిళల కోసం రెండు దర్గాలు ఉండేవి. మన్నత్ [కోరిక లేదా మొక్కు] కోసం ఒక దారం కట్టడంలో మాకు సాంస్కృతిక పద్ధతులు, నమ్మకాలు ఉండేవి; మా కోరికలు తీరినప్పుడు మేమంతా కలిసి విందు భోజనం వండుకునేవాళ్ళం. ఆ ప్రదేశం చుట్టూ మొత్తంగా సర్వపక్ష సంప్రదాయాలు ఉండేవి.

"కానీ అవన్నీ నా కళ్ళ ముందే మాయమవడాన్ని చూశాను. ఆ తర్వాత వాటి స్థానంలో ఒక మక్తాబ్ (గ్రంథాలయం) వచ్చింది. మజార్ల ను [సమాధులు లేదా గోరీలు], లేదా సూఫీ దర్గాల ను విశ్వసించని సంప్రదాయవాద ఇస్లామిక్ ప్రజలు - వీరి ప్రయత్నమంతా వీటిని నేలమట్టం చేయడం లేదా వాటి స్థానంలో మసీదు నిర్మించడం. ఇప్పటికీ కొన్ని దర్గాలు మిగిలి ఉన్నాయి, కానీ అవన్నీ మగ పీర్ల కోసం. బీబీ కా దర్గాలు ఏవీ మిగిలి లేవు, వాటి పేర్లను మా సాంస్కృతిక జ్ఞాపకాల నుండి తొలగించారు.”

కానీ అటువంటి విధ్వంసం నమూనా విస్తృతంగా ఉన్నప్పటికీ, లావణి ఎత్తిచూపే మరో సమాంతర నమూనా కూడా ఉంది. అది జ్ఞాపకాలను ఉద్దేశ్యపూర్వకంగా, హింసాత్మకంగా చెరిపివేయడానికి వ్యతిరేకంగా నిలిచేది. “బంగ్లాదేశ్‌లో ఒక ప్రదర్శన నిర్వహించే సమయం వచ్చినప్పుడు, ఒకవైపు మజార్‌ లను నాశనం చేయడం గురించీ, మరోవైపు తాము కోల్పోయిన భూమి కోసం, హక్కుల కోసం ఈనాటికి కూడా పోరాడుతున్న మహిళల మొక్కవోని పోరాట పటిమ గురించీ ఆలోచించాను. ఈ ప్రతిఘటన, పోరాట పటిమలు ఆ నిర్మాణాలు ధ్వంసమైన తర్వాత కూడా జీవించివుండే మజార్ ఆత్మ. దీనినే నేను ఈ సోలో ప్రదర్శనలో పట్టుకోవడానికి ప్రయత్నించాను." ఆ ప్రదర్శన ముగిసిన చాలా కాలం తర్వాత కూడా ఆమె అదే ఇతివృత్తంపై పని చేస్తూనే ఉన్నారు.

లావణి చిత్రాలు ప్రజల గొంతులను విపులీకరించాయి, అనేక కవితలకు, వ్యాసాలకు, పుస్తకాలకు రెండవ జీవితాన్నిచ్చాయి. “కళాకారులు కావొచ్చు, రచయితలు కావొచ్చు, మేమందరం ఒకరితో ఒకరం అనుసంధానమై ఉంటాం. నేను షాహిర్‌ను ఆయన ఊహించిన విధంగానే ఎలా చిత్రించానో కేశవ్ భావు [ అంబేద్కర్ స్ఫూర్తితో: ఆత్మారామ్ సాల్వే విముక్తి గీతం ] నాతో చెప్పినది నాకు గుర్తుంది. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు, ఎందుకంటే మన వ్యక్తిగత, సామాజిక, సాంస్కృతిక గుర్తింపులు వేరు వేరు అయినప్పటికీ, మన ఊహలను, మన సామూహిక జ్ఞాపకాలను, మన సాధారణ కథల ఆత్మను మనం పంచుకుంటాం,” అని లావణి చెప్పారు.

PHOTO • Courtesy: Labani Jangi
PHOTO • Courtesy: Labani Jangi
PHOTO • Courtesy: Labani Jangi
PHOTO • Courtesy: Labani Jangi

లావణి చిత్రాలు భారతదేశంలోనూ, వెలుపలా ప్రచురితమైన సృజనాత్మక రచన, విద్యాసంబంధ రీసెర్చ్ వర్క్‌ల వంటి అనేక పుస్తకాల ముఖపత్రాలపై స్థానం సంపాదించాయి

PHOTO • Courtesy: Labani Jangi
PHOTO • Labani Jangi

ఎడమ: అహ్మదాబాద్‌లోని గాంధీనగర్ ఐఐటి 2024 మార్చిలో నిర్వహించిన కామిక్స్ కాన్‌క్లేవ్ 2.0లో లావణి తన కళను ప్రదర్శించారు. కుడి: ఆమె తన చిత్రాలను భారతదేశం, వెనిజులా, పాలస్తీనా, లెబనాన్ నుండి వచ్చిన ఇతర కవులు, కళాకారులతో కలిసి ఆగస్ట్ 2022లో మల్లికా సారాభాయ్ క్యూరేట్ చేసిన థియేటర్ ఫ్రమ్ ద స్ట్రీట్స్ నిర్వహించిన ప్రాజెక్ట్‌లో ప్రదర్శించారు

లావణి చిత్రాలలోని ఉజ్వలమైన రంగులు, బలమైన రేఖలు, మానవ జీవితాల వాస్తవిక వర్ణనలు, సాంస్కృతిక సజాతీయకరణకు వ్యతిరేకంగా ప్రతిఘటించే కథలు, సాముదాయక స్మరణకు సంబంధించిన కథలు, గుర్తింపుల, సంస్కృతుల కథలు, విభజనల మధ్యనే సంబంధాలను నెలకొల్పడం వంటివాటి గురించిన కథలను చెప్తాయి. "అత్యవసరమైన ఒక ఆదర్శ జగత్తు నన్ను నడిపిస్తోందని నాకనిపిస్తోంది. చుట్టుముడుతున్న హింసకు ప్రతిస్పందనగా ఒక కొత్త సమాజాన్ని ఊహించడం తప్పనిసరి అవుతుంది,” అంటారు లావణి. "రాజకీయ ఉపన్యాసాలు తరచుగా విధ్వంసంతో కూడుకుని ఉండే ఒక ప్రపంచంలో, నా చిత్రాలు ప్రతిఘటన, స్థితిస్థాపకతలు మృదువైన, కానీ అంతే శక్తివంతమైన భాషను మాట్లాడతాయి."

అది ఆమె తన జీవితంలోని మొదటి పదేళ్ళలో తాను కలిసి జీవించిన అమ్మమ్మ నుండి నేర్చుకున్న భాష. "మా ఇద్దరినీ, నన్నూ నా సోదరుడినీ, చూసుకోవడం మా అమ్మకు చాలా కష్టంగా ఉండేది," అని లావణి చెప్పారు. “మా ఇల్లు కూడా చిన్నది. దాంతో మా అమ్మ నన్ను మా నానీ [అమ్మమ్మ] ఇంటికి పంపించింది. అక్కడ మా అమ్మమ్మ, ఖాలా [పిన్ని] ఒక దశాబ్దం పాటు నన్ను పెంచారు. అమ్మమ్మ ఇంటికి దగ్గరలోనే ఒక చెరువు ఉండేది, అక్కడ మేం ప్రతి మధ్యాహ్నం కాఁథా [ఎంబ్రాయిడరీ] పని చేస్తూ గడిపేవాళ్ళం. ఆమె అమ్మమ్మ రంగురంగుల దారాల కుట్టుపనిని ఉపయోగించి సరళమైన కాడ కుట్టుతో సంక్లిష్టమైన కథలను అల్లేవారు. సంక్లిష్టమైన కథలను సరళమైన రేఖలలో చెప్పే కళ లావణికి బహుశా తన అమ్మమ్మ నుండే అలవడి ఉండవచ్చు. కానీ నిరాశ, ఆశల మధ్య వెసులుబాటును కలగచేసుకునే ఆమె అలవాటు మాత్రం ఆమె తల్లి సృష్టించినదే.

PHOTO • Courtesy: Labani Jangi
PHOTO • Courtesy: Labani Jangi

ఎడమ: అబ్బా (తండ్రి), మా (అమ్మ) లావణి జీవితంలోని ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు. వారు ఆమె పోరాట స్ఫూర్తిని తీర్చిదిద్దారు. కుడి: తన జీవితంలో మొదటి పదేళ్ళు తనను పెంచిన నానీ (అమ్మమ్మ) నుంచి లావణి కాఁథా కుట్టుపనితో పాటు కథలు చెప్పే కళలోనూ చాలా విషయాలు నేర్చుకున్నారు

PHOTO • Courtesy: Labani Jangi
PHOTO • Courtesy: Labani Jangi

ఎడమ: అనేకమంది ఇతర కళాకారులతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని గిరిరాజ్‌పూర్ గ్రామంలో పిల్లల కోసం, యువత కోసం ఖండేరా ఆర్ట్ స్పేస్‌ అనే సాముదాయక ఆర్ట్ స్పేస్‌ను లావణి ప్రారంభించారు. కుడి: పంజేరి కళాకారుల సంఘంలో లావణి సభ్యురాలు

“నా చిన్నతనంలో నేను చదువులో చాలా వెనుకబడి ఉండేదాన్ని. నాకు గణితంలోనూ, కొన్నిసార్లు సైన్స్‌లో కూడా సున్నా మార్కులు వచ్చేవి,” ఆమె చెప్పారు. “అయితే, ఎందుకో నాకు తెలియదు కానీ నా గురించి బాబా కి సందేహాలు ఉన్నా మా మాత్రం నన్ను నమ్ముతూనే ఉండేది. తర్వాతిసారికి నేను బాగా చదువుతానని ఆమె నాకు భరోసా ఇచ్చేది. అమ్మ లేకుండా నేను ఇంత దూరం చేరుకోగలిగేదాన్ని కాదు. అలాగే, మా కు ఎంతో కోరిక ఉన్నప్పటికీ ఆమె కళాశాలలో చేరలేకపోయింది. ఆమెకు పెళ్ళి చేసేశారు. దాంతో, ఆమె నా ద్వారా తాను కోరుకున్న తన జీవితాన్ని జీవిస్తోంది. నేను కొల్‌కతా నుండి ఇంటికి తిరిగి రాగానే, ఆమె వచ్చి నా పక్కనే కూర్చొని, తన ఇంటి బయటి ప్రపంచంలోని కథలను ఆత్రంగా ఆకళింపు చేసుకుంటుంది. ఆమె నా కళ్ళ ద్వారా ఆ ప్రపంచాన్ని చూస్తుంది.”

కానీ ప్రపంచం ఒక భయానక ప్రదేశం, కళ చాలా వేగంగా వ్యాపారమైపోతోన్న ప్రపంచం కూడా. "నేను నా భావోద్వేగ సారాన్ని కోల్పోతానేమోనని భయపడుతుంటాను. పెద్ద కళాకారిణిని కావాలనే కోరికతో నేను భావోద్వేగపరంగా విస్థాపన చెందాలని, నా ప్రజల నుండి, నా కళను నిలబెట్టే విలువల నుండి దూరం కావాలని కోరుకోను. నేను డబ్బు గురించి, సమయం గురించి చాలా కష్టపడుతున్నాను, కానీ నా ఆత్మను అమ్ముకోకుండా ఈ ప్రపంచంలో జీవించడం కోసం నేను చేసేదే నా అతిపెద్ద పోరాటం."

PHOTO • Courtesy: Labani Jangi
PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

పంజేరి కళాకారుల సంఘం సభ్యురాలిగా లావణి, సహకార సాంస్కృతిక, మేధో సంవాదంలో గాఢంగా నిమగ్నమై ఉన్నారు, భారతదేశమంతటా నాలుగు సమూహ ప్రదర్శనలు చేశారు

PHOTO • Ritayan Mukherjee

బహుమతి పొందిన ఈ కళాకారిణి అతిపెద్ద పోరాటం, 'నా ఆత్మను మార్కెట్‌కు అమ్ముకోకుండా ఈ ప్రపంచంలో జీవించడమే' అని ఆమె అంటారు

ముఖ చిత్రం: జయంతి బురుదా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या, पारी में बतौर वरिष्ठ संपादक कार्यरत हैं, और पारी के रचनात्मक लेखन अनुभाग का नेतृत्व करती हैं. वह पारी’भाषा टीम की सदस्य हैं और गुजराती में कहानियों का अनुवाद व संपादन करती हैं. प्रतिष्ठा गुजराती और अंग्रेज़ी भाषा की कवि भी हैं.

की अन्य स्टोरी Pratishtha Pandya
Editor : P. Sainath

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli