"సిమెంట్ చే జంగలాచ్ ఝాలేలే ఆహే (ఇది మొత్తానికి దాదాపు ఒక సిమెంట్ అడవిలా తయారైపోయింది)," కొల్హాపుర్ జిల్లాలోని ఉచగాఁవ్ గ్రామానికి చెందిన రైతు సంజయ్ చవాన్ అన్నారు. గత దశాబ్దకాలంలో ఉచగాఁవ్లో కర్మాగారాలు, పరిశ్రమలు బాగా పెరిగిపోయాయి, అదే సమయంలో భూగర్భజలాల మట్టం తగ్గిపోయింది.
"ప్రస్తుతం మా బావులలో ఎక్కడా నీళ్ళు లేవు," అంటారు 48 ఏళ్ళ వయసున్నఈ రైతు.
గ్రౌండ్ వాటర్ యియర్ బుక్ ఆఫ్ మహారాష్ట్ర (2019) ప్రకారం, మహారాష్ట్రలోని కొల్హాపుర్, సాంగిలి, సాతారాతో సహా కొన్ని ప్రాంతాలలో సుమారు 14 శాతం బావులలో నీటి మట్టం బాగా తగ్గిపోయింది. గత రెండు దశాబ్దాల్లో సగటు బావి లోతు 30 అడుగుల నుంచి 60 అడుగులకు చేరుకుందని డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ రతన్ రాథోడ్ చెప్పారు.
ఉచగాఁవ్లోని ప్రతి ఇంటికి ఇప్పుడు బోరుబావులున్నాయని, వీటివల్లనే పెద్దమొత్తంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని సంజయ్ చెప్పారు. “ఇరవై ఏళ్ల క్రితం ఉచగాఁవ్లో 15-20 బోరుబావులుండేవి. ఈ రోజు 700-800 వరకూ ఉన్నాయి,” అని ఉచగాఁవ్ మాజీ ఉప సర్పంచ్ మధుకర్ చవాన్ చెప్పారు.
ఉచగాఁవ్లో రోజువారీ నీటి అవసరం 25 నుండి 30 లక్షల లీటర్ల మధ్య ఉంటుంది. అయితే "[...] గ్రామంలో రోజు విడచి రోజుకు 10-12 లక్షల లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంటోంది," అని మధుకర్ చెప్పారు. గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి నెలకొందని ఆయన అంటున్నారు
కొల్హాపుర్లో భూగర్భ జలాల మట్టం క్షీణించిపోవడంతో నష్టపోయిన రైతులను ఈ లఘు చిత్రం చూపిస్తోంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి