అనిల్ నార్కండే ప్రతిసారి మాదిరిగానే వివాహ వేదికను ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డారు. కానీ కథ ఎలా మలుపు తిరగబోతుందో ఆయన ఊహించలేకపోయారు!
భండారాలోని అలేసూర్ గ్రామానికి చెందిన 36 ఏళ్ళ ఈ రైతు పెళ్ళిళ్ళలో వేదికలను అలంకరించటం, సంగీతాన్ని అందించడం వంటి పనులను కూడా చేస్తారు. ఇప్పుడాయన పొరుగునే ఉన్న గ్రామంలో జరిగే ఒక పెళ్ళి కోసం పెద్ద పసుపురంగు షామియానా వేసి పదుల సంఖ్యలో ప్లాస్టిక్ పూలతో ఆ ప్రదేశాన్ని అలంకరించారు. అతిథుల కోసం కుర్చీలను; వధూవరులు కూర్చోవడం కోసం ముదురు ఎరుపు రంగులో ఉన్న ప్రత్యేకమైన సోఫాను, సంగీతం కోసం డిజె సామగ్రిని, వెలుగులు చిమ్మేందుకు లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
మట్టీ ఇటుకలతో కట్టిన వరుని సాధారణమైన ఇల్లు ఈ పెళ్ళి కోసం చక్కగా ముస్తాబయింది. వధువు మధ్యప్రదేశ్‌లోని సివనీ గ్రామం నుంచి సాత్పురా కొండల మీదుగా ప్రయాణమై వస్తోంది.
పెళ్ళి ముందురోజున పరిస్థితులన్నీ తల్లకిందులైపోయాయని, వస్తోన్న వేసవికాలపు పెళ్ళిళ్ళ సీజన్‌లో తన వ్యాపారం బ్రహ్మాండంగా ప్రారంభం కావటం కోసం ఎదురుచూస్తోన్న అనిల్ చెప్పారు. పెళ్ళి జరగటానికి ఒక రోజు ముందు, పని కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుండే 27 ఏళ్ళ వరుడు, పారిపోయాడు.
"పెళ్ళి ఆపకపోతే తాను విషం తాగి చనిపోతానని వరుడు తన తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పాడు," అనిల్ గుర్తుచేసుకున్నారు. "అతనికి ఇంకెవరి మీదనో మనసు ఉంది."
పెళ్ళిని నిలిచిపివేసే సమయానికి వధువు, ఆమె తరఫువారంతా వచ్చేసివున్నారు. సంతోషంతో నిండిపోవాల్సిన ఆ సందర్భం అబ్బాయి తల్లిదండ్రులకూ, ఆ ఊరికీ కూడా చాలా అవమానకరమైనదిగా ముగిసింది.
ఖిన్నుడైవున్న వరుని తండ్రి అనిల్‌కు చెల్లించాల్సిన డబ్బును ఇవ్వలేనని చెప్పారు.
"డబ్బుకోసం అడగటానికి నాకు మనసు రాలేదు," భండారాలోని అలేసూర్ గ్రామంలో ఉన్న తన ఇంటిలో కూర్చొని ఉన్న అనిల్ అన్నారు. ఈ గ్రామంలో ఎక్కువమంది చిన్న రైతులు, వ్యవసాయ కూలీలే ఉన్నారు. "వాళ్ళు భూమి లేని ధీవర్లు (జాలరి కులం); వరుడి తండ్రి అతని బంధువుల నుంచి డబ్బు అప్పుతీసుకోవాలి," అన్నారతను. తన పనివాళ్ళకు మాత్రం చెల్లించమని వరుడి తండ్రిని అడిగిన అనిల్, తన సొంత బిల్లులను వదిలేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ విచిత్రమైన ఘటనలో తనకు రూ. 15,000 నష్టం వచ్చిందని అనిల్ చెప్పారు. వెదురు దుంగలు, స్టేజి ఫ్రేమ్‌లు, భారీ స్పీకర్‌లు, డిజె పరికరాలు, రంగురంగుల పండాల్ గుడ్డలు, నూతన వధూవరుల కోసం ప్రత్యేక సోఫాలు, ఇంకా ఇతర వస్తువులున్న తన అలంకరణ వస్తువుల గిడ్డంగిని అనిల్ మాకు చూపించారు. వీటన్నిటినీ ఉంచటం కోసం సామాన్యమైన అతని సిమెంట్ ఇంటికి పక్కనే ఆయన ఒక విశాలమైన హాలు నిర్మించారు.
అలేసూర్ గ్రామం తుమ్సర్ తహసీల్ అటవీ ప్రాంతంలో, సాత్పురా కొండల పాదాలవద్ద ఉంది. ఒకే ఒక్క పంట పండే ఈ ప్రాంతంలో రైతులు తమకున్న కొద్దిపాటి భూముల్లో వరిని పండిస్తారు. వరి పంట కోతల తర్వాత, చాలామంది పనుల కోసం వెతుక్కుంటూ వలసపోతారు. ఎటువంటి పెద్ద పరిశ్రమ కానీ, ఉపాధి అవకాశాలను కల్పించే ఇతర ఉద్యోగవర్గం గానీ లేకపోవటంతో ఈ ప్రాంతంలోని పెద్ద సంఖ్యలో ఉన్న ఆదివాసులు, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు వేసవికాలంలో తమ జీవిక కోసం అడవిపై ఆధారపడుతుంటారు. ఎమ్ఎన్ఆర్ఇజిఎ పని విషయానికి వస్తే తుమ్సర్‌కు చాలా చెడ్డ గత చరిత్ర ఉంది.
కాబట్టి, అనిల్ వంటి చాలామంది తమ జీవనాన్ని మెరుగుపరచుకోవడం కోసం చిన్న వ్యాపారాలను నడుపుతున్నారు. ఇది కూడా ఎలాంటి ఎదుగుదల లేకుండా క్షీణిస్తోన్న వ్యవసాయ ఆదాయం వల్ల మరింత ప్రభావితమవుతోంది.
డిజెలు, అలంకరణలు గ్రామీణ ప్రాంతాలను కూడా చేరుకున్నాయి, కానీ కష్టకాలాల్లో ఈ వ్యాపారాన్ని నడపటం అంత సులభం కాదని అనిల్ అంటారు. "గ్రామస్తుల ఆర్థిక పరిస్థితి అపాయకరంగా ఉంది."
అనిల్ ఎల్లప్పుడూ బిజెపి వోటరుగానే ఉన్నారు. అతని గావ్లీ సముదాయం స్థానిక బిజెపి నాయకులతో సన్నిహితంగా మెలిగేది. అయితే అతను గ్రామస్తుల రాజకీయ ఎంపికలో మార్పును చూస్తున్నారు (భండారా-గోందియా లోక్‌సభ నియోజకవర్గం ఏప్రిల్ 19న జరిగిన మొదటి దశ సాధారణ ఎన్నికలలో ఓటు వేసింది). “ లోకాన్న కామ్ నహీ; త్రస్త ఆహెత్ [ప్రజలకు పని లేదు; వారు ఆందోళన చెందుతున్నారు]," అని ఆయన చెప్పారు. బిజెపి ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు సునీల్ మెంధే తన ఐదేళ్ళ పదవీకాలంలో ఒక్కసారి కూడా ప్రజలను కలవడానికి ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడం ఆయనపై ప్రజా వ్యతిరేకతను పెంచిందని PARI కలిసిన విభిన్న వర్గాల ప్రజలు అంటున్నారు.
ఇక్కడి మహిళలు ప్రతిరోజూ పెద్ద వ్యవసాయ క్షేత్రాలలోకి పనులకు వెళ్తారని అనిల్ చెప్పారు. మీరు మా ఊరికి వస్తే ఉదయంపూట వాళ్ళు మోటారు వాహనాల్లో పనికి వెళ్తుండటాన్ని, సాయంత్రంవేళ తిరిగి రావటాన్ని చూస్తారు. "యువకులు పరిశ్రమలలో, రోడ్లు లేదా కాలువల నిర్మాణ ప్రదేశాలలో, కష్టతరమైన పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తారు," అన్నారాయన .
తనకు మంచి ఆరోగ్యం ఉండివుంటే, తాను కూడా పని కోసం వలస వెళ్ళి ఉండేవాడ్నని, ఇద్దరు పిల్లలున్న అనిల్ చెప్పారు. పిల్లలిద్దరిలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ ఉంది. "నేను పదో తరగతి తప్పిన తర్వాత నాగ్‌పూర్ వెళ్ళి వెయిటర్‌గా పనిచేశాను." అయితే, అతను ఇంటికి తిరిగి వచ్చి, అప్పు తీసుకొని మహిళా కూలీలను పనికి తీసుకెళ్ళి తీసుకువచ్చే పని చేసేందుకు ఒక టెంపోను కొనుగోలు చేశాడు. ఆ పని సరిగ్గా నడవక సంకటంగా మారినప్పుడు, అతను తన వాహనాన్ని అమ్మేసి, ఐదు సంవత్సరాల క్రితం ఈ అలంకరణ వ్యాపారాన్ని మొదలుపెట్టాలనే ఆలోచనకు వచ్చాడు. ఈ ఈవెంట్‌ల కోసం కూడా, తాను ఎక్కువగా ఉధారి (అరువు) మీదనే పని చేస్తానని ఆయన చెప్పారు. "ప్రజలు నా సేవలను తీసుకుంటారు, అయితే నాకు తర్వాత డబ్బు చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు," అని అనిల్ చెప్పారు
"మరణానంతర ఆచారాల కోసం నన్ను ఒక పండాల్ ను ఏర్పాటు చేయమని అడిగితే నేను వారి నుండి డబ్బు తీసుకోను," అంటూ, “నేను వివాహాలకు 15-20,000 [రూపాయలు] మాత్రమే వసూలు చేస్తున్నాను, ఎందుకంటే ప్రజలు అంతకంటే భరించలేరు," చెప్పారాయన.
అనిల్ ఈ వ్యాపారంలో రూ. 12 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. ఆయనకు తనకున్న ఏడెకరాల భూమిని కుదువపెట్టి బ్యాంక్‌లో తీసుకున్న అప్పు ఉంది. దాన్ని ఆయన వాయిదా పద్ధతులలో చెల్లిస్తున్నారు.
“నా వ్యవసాయం, పాల వ్యాపారం ఏమంత ఆదాయాన్నివ్వటంలేదు," అన్నారతను. “ బిచాయత్ (అలంకరణ)లో నా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నా, కానీ ఈ వ్యాపారంలోకి చాలామంది వచ్చేస్తున్నారు.”
*****
ఇక్కడ నిశ్శబ్దంగా ప్రజల కోపాన్ని పెంచుతోన్న మరో విషాదం ఉంది: గ్రామాల నుండి పనికోసం దూరపు పని ప్రదేశాలకు వెళ్ళిన యువ వలస కూలీలు ప్రమాదాలలో మరణించటం. ఇలాంటి చాలా సందర్భాలలో, పరిశోధనలకు ముగింపూ ఉండదు, దానివల్ల వచ్చే సహాయమూ ఉండదు.
ఉదాహరణకు ఏప్రిల్ ప్రారంభంలో PARI సందర్శించిన రెండు కుటుంబాలను తీసుకుంటే: గోవారీ (షెడ్యూల్డ్ తెగ) సముదాయానికి చెందిన 27 ఏళ్ళ ఇంకా పెళ్ళికాని విజేశ్ కోవాళే, 2023 మే 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని సొన్నెగౌనిపల్లె గ్రామంలో ఒక భారీ ఆనకట్ట పనులు జరుగుతున్న ప్రదేశంలో భూగర్భ కాలువలో పనిచేస్తూ చనిపొయాడు.
"మా అబ్బాయి శవాన్ని అక్కడి నుండి మా గ్రామానికి రప్పించి అంత్యక్రియలు జరిపించడానికి మాకు రూ. 1.5 లక్షలు ఖర్చయింది," విజేశ్ తండ్రి రమేశ్ కోవాళే అన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం అతని అకాల మరణానికి స్పష్టమైన కారణం: "విద్యుదాఘాతం."
విజేశ్ మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ పనిప్రదేశంలో విద్యుత్ ప్రవహిస్తోన్న తీగెను తాకినట్లు ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్) పేర్కొంది. ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను అక్కడే మృతి చెందాడు.
"వాగ్దానం చేసినట్టుగా అతన్ని పనిలోకి తీసుకున్న కంపెనీ మాకు ఎలాంటి నష్టపరిహారాన్ని చెల్లించలేదు," అన్నారు కోవాళే. "నేను ఇప్పటికీ పోయిన ఏడాది మా బంధువుల దగ్గర తీసుకున్న చేబదుళ్ళను తీర్చాల్సే ఉంది." విజేశ్ అన్న రాజేశ్ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు పెళ్ళి కాబోతున్నది. విజేశ్ తమ్ముడు సతీశ్ స్థానికంగా పొలాల్లో పనిచేస్తుంటాడు.
"అతని శవాన్ని రోడ్డు మార్గంలో ఆంబులెన్స్‌లో ఇక్కడకు తీసుకురావడానికి మాకు రెండు రోజులు పట్టింది," అన్నారు రమేశ్.
గత ఏడాది కాలంలో, విజేశ్ వంటి నలుగురైదుగురు గ్రామీణ యువకులు ఇంటికి దూరంగా ఉన్న తమ పనిప్రదేశాల్లో ప్రమాదవశాత్తూ చనిపోయారని అనిల్ చెప్పారు. అయితే అది వేరే కథ.
చిఖలీ గ్రామంలో, సుఖ్‌దేవ్ ఉయికేకు చిన్నవాడైన తన ఏకైక కుమారుడు అతుల్ మరణం గురించి ఇంకా సందేహాలున్నాయి.
"అది అతని స్వంత బృందంలోనివారు చేసిన హత్యా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనేది మాకు తెలియదు," గ్రామానికి చెందిన చిన్న రైతు, కూలీగా కూడా పనిచేసే ఉయికే అన్నారు. "మేం అతని శవాన్ని కూడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మమ్మల్ని అడగకుండానే, మాకసలు ఏ సమాచారం ఇవ్వకుండానే అతని అంత్యక్రియలు కానిచ్చేశారు."
అతుల్ మరికొంతమంది వలసదారుల బృందంతో కలిసి 2022 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ప్రాంతంలో వరిపొలాలలో నూర్పిడి యంత్రం నడిపించే పనికోసం వెళ్ళాడు. 2023, మే 22న అతను తన తల్లిదండ్రులకు కాల్ చేసి, తాము ఇంటికి తిరిగివస్తున్నట్టుగా చెప్పాడు.
"అదే అతని చివరి కాల్," ఉయికే గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత అతుల్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అతనెన్నడూ ఇంటికి తిరిగిరాలేదని అతుల్ సోదరి షాలు మడావి చెప్పింది. "మేం అతని గురించి వాకబులు చేయటం ప్రారంభించి, అతనుండే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మాత్రమే, అతను చనిపోయిన దాదాపు వారం రోజులకు, మాకు ఆ విషయం తెలిసింది."
ఆ కుటుంబానికి కొన్ని వీడియో క్లిప్పులను చూపెట్టారు, అది వాళ్ళను మరింత సందేహంలో పడవేసింది. అతుల్ ఒక వైన్ బార్ దగ్గర రోడ్డు పక్కనే పడివున్నట్టు ఆ వీడియో క్లిప్‌లో ఉంది. "జనం అతన్ని తాగి పడిపోయాడని అనుకున్నారు," అంటారు అతుల్ తండ్రి. అతుల్ తల వెనుకభాగంలో లోతుగా గీచుకుపోయి ఉన్నట్టు పోస్ట్‌మార్టమ్ నివేదిక తెలియచేస్తోంది. "అతని అంత్యక్రియలు చేసిన ప్రదేశాన్ని పోలీసులు మాకు చూపించారు," ఆందోళనగా ఉన్న ఉయికే PARIకి ఎఫ్ఐఆర్‌ను, పోస్ట్‌మార్టమ్ నివేదికను చూపిస్తూ అన్నారు. "నా కొడుక్కి ఏమి జరిగిందో అంతా అగమ్యగోచరంగా ఉంది." అతుల్ మరణం గురించి, అతనితో కలిసి పనికోసం వెళ్ళినవాళ్ళెవ్వరూ పెదవి విప్పటంలేదు. వారిలో చాలామంది ఈ సీజన్‌లో కూడా పనికోసం గ్రామాన్ని విడచివెళ్ళారని ఆయన PARIతో చెప్పారు.
"వలసవెళ్ళిన కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోవడమనేది చాలా సాధారణమైపోయింది, కానీ ఇందులో మేం చేయగలిగిన సహాయం చాలా తక్కువ," భండారా పోలీసుల ద్వారా ఈ కేసును ముందుకు నడిపించాలని విఫల ప్రయత్నం చేసిన చిఖలీ సర్పంచ్ సులోచనా మెహర్ అన్నారు.
సాధారణ ఎన్నికలలో వోటు వేయటం కంటే తమ అతుల్ మరణం గురించిన సత్యమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తే ఉయికే కుటుంబంలో ఎక్కువగా ఉంది. "వీటివలన ఉపయోగమేమీ లేదు," ప్రజా ప్రతినిధుల గురించి మాట్లాడుతూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ మూలాలతో అనేకరకాలుగా సంబంధాలను కోల్పోయిన విషయాన్ని సుఖ్‌దేవ్ నొక్కిచెప్పారు.
తిరిగి అలేసూర్‌కు వెళ్తే, అనిల్‌కు దుఃఖంలో ఉన్న ఈ కుటుంబాలు - కోవాళేలు, ఉయికేలు - తెలుసు. వారి ఇళ్ళల్లో మరణానంతర ఆచారాల సమయంలో మండపం [పందిరి]ను ఉచితంగా ఏర్పాటు చేశానని అనిల్ చెప్పారు. "ఆదాయం అంతగా లేకపోయినా నా వ్యాపారం, వ్యవసాయాలతో నేను మెరుగ్గానే ఉన్నాను," అన్నారతను. "కనీసం, నేను బ్రతికే ఉన్నాను."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి