ఒక సాధారణ కొలత కలిగిన పష్మీనా శాలువా తయారీకి అవసరమైన దారాన్ని వడకడానికి ఫహ్‌మీదా బానోకి నెల రోజుల సమయం పడుతుంది. ఛాంగ్‌తాంగ్ మేకల నుండి వచ్చే నాణ్యమైన, గాలిలో తేలిపోయేంత తేలికగా ఉండే ఉన్నిని వేరుచేసి, వడకటం అంటే అమిత కష్టమైన, అతి సున్నితమైన పని. నెలరోజుల పాటు చేసిన ఈ పనికి సుమారు వెయ్యి రూపాయలు వస్తాయని ఆశించొచ్చని ఈ 50 ఏళ్ళ నిపుణురాలైన కార్మికురాలు చెప్పారు. "నేను విరామం లేకుండా పనిచేసినట్లయితే, రోజుకు 60 రూపాయలు సంపాదించగలను," వివరించారామె.
వాటిపై సూదితో చేసే కుట్టుపని, సృష్టించే సూక్ష్మమైన ఆకృతుల అల్లికలను బట్టి 8 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకూ అమ్ముడుపోయే అతి ఖరీదైన ఈ శాలువాల ధరలతో పోలిస్తే, వీరికిచ్చే ఈ కూలీ అసలు లెక్కలోకి రాదు.
మహిళలు ఒకవైపు తమ ఇంటి పనులను చేసుకుంటూనే పష్మీనా దారాలను చేతితో వడికే పనిని సంప్రదాయంగా చేస్తుంటారు. ఈ దారాలను వడికే పనిచేసే ఫహ్‌మీదా వంటివారికి లభించే అతి తక్కువ కూలీ వలన ఈ పని చేయడానికి సిద్ధపడేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది.
పెళ్ళయి తన కుటుంబాన్నీ ఇంటినీ చూసుకోవడం మొదలెట్టకముందు శ్రీనగర్‌లో నివాసముండే ఫిర్‌దౌసా కూడా ఊలును వడికేవారు. "కుటుంబంలోని పెద్దవారు మమ్మల్ని ఈ వడికే పని చేయమని చెప్తుండేవారు. ఉత్తినే ఉబుసుపోని కబుర్లు చెప్పుకోవడం కంటే, ఈ పని చేస్తే మా మెదడుకు పని కల్పించినట్టవుతుందని అనేవారు," తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ చెప్పారామె. కౌమారపు వయసులో ఉన్న ఆమె కూతుళ్ళిద్దరూ ఈ పని చేయరు; తమ చదువూ ఇంటిపనుల మధ్య వారికి అందుకు సమయం దొరకదు.
వడకటం కశ్మీరీ సంస్కృతిలో ఒక భాగమని ఫిరదౌసా అంటారు. "ఇంతకుముందు మహిళలు తామర తూడులోంచి వచ్చే పీచు వంటి సన్నని దారం తీసేందుకు వడకటంలో ఒకరితో ఒకరు పోటీ పడేవారు," స్థానిక రుచియైన నదుర్ (తామర తూడు)ను వడకటంతో పోలుస్తూ చెప్పారామె.
వడకటంలా కాకుండా, పష్మీనాను నేయటం వలన ఎక్కువ సంపాదన ఉంటుంది. ఈ పనిని మధ్య మధ్య మరింత ఎక్కువ సంపాదన వచ్చే పనులను చేసుకుంటూ మగవాళ్ళే చేస్తారు. ఈరోజున జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నైపుణ్యం లేని కార్మికుని రోజువారీ వేతనం రూ. 311, కొంత నైపుణ్యం ఉన్నవారికి రూ. 400, నైపుణ్యం కలిగిన కార్మికులకు రూ. 480గా ఉందని వేతనాలపై 2022 జమ్ము కశ్మీర్ రాష్ట్ర ప్రకటన తెలియజేస్తోంది.
ఒక సాధారణ కొలత ఉన్న శాలువాలో 140 గ్రాముల పష్మీనా ఉన్ని ఉంటుంది. ఎంతో ఎత్తైన ప్రదేశాలలో నివసించే ఛాంగ్‌తాంగ్ మేక ( కాప్రా హిరెకస్ ) నుంచి లభించే 10 గ్రాముల ముడి పష్మీనా ఉన్నిని వడకడానికి ఫహ్‌మీదాకు రెండు రోజులు పడుతుంది.
చేతితో పష్మీనాను వడికే కళను ఫహ్‌మీదా తన అత్తగారైన ఖతీజా నుంచి నేర్చుకున్నారు. ఈ మహిళలు తమ కుటుంబాలతో కలిసి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని కోహ్-ఇ-మరన్‌లో ఒక ఒంటి అంతస్తు ఇంటిలో నివాసముంటున్నారు.
ఖతీజా తన ఇంటిలోని 10x10 అడుగుల వైశాల్యమున్న ఒక గదిలో తన యిందర్ (రాట్నం) పై పనిచేసుకుంటున్నారు. ఒక గది వంట గదిగానూ, మరో గదిని పష్మీనాను నేసే కర్మాగారంగానూ ఉపయోగిస్తారు. ఈ నేసే పనిని కుటుంబంలోని మగవాళ్ళు చేస్తారు; ఇక మిగిలినవన్నీ పడక గదులు.
వడకటంలో మంచి అనుభవం ఉన్న ఈ 70 ఏళ్ళ వృద్ధురాలు కొద్ది రోజుల క్రితం 10 గ్రాముల ఉన్నిని కొనుగోలు చేశారు. కానీ కంటిచూపు సరిగ్గా లేకపోవటం వలన ఇంకా ఆ ఉన్నిని అతిసన్నని దారంగా మలచలేకపోయారు. పదేళ్ళ క్రితం కంటిలో శుక్లాన్ని తీయించుకున్న ఆమె, ఈ సున్నితమైన పనిపై కేంద్రీకరించేందుకు కష్టపడుతున్నారు.
ఫహ్‌మీదా, ఖతీజా వంటి వడికేవారు ముందుగా ఉన్నిని ఏకడం - ఉన్ని పీచునంతా చిక్కులు లేకుండా సమంగా రావడానికి దానిని ఒక కొయ్య దువ్వెనలోకి పోనిచ్చి లాగుతారు - ద్వారా పష్మీనా ఉన్నిని శుభ్రంచేస్తారు. తరువాత దానిని ఎండుగడ్డిని మెలివేసి చేసిన కదురుపై వడుకుతారు.
దారాన్ని తయారుచేయడం చాలా సమయాన్ని తీసుకునే సున్నితమైన పని. "బలంగా ఉండటం కోసం రెండు దారాలను కలిపి ఒక దారంగా చేస్తారు. కదురును ఉపయోగించి ఆ రెండు దారాలనూ మెలివేసి చివర ముడివేస్తారు," అంటూ వివరించారు ఖలీదా బేగమ్. శ్రీనగర్‌లోని సఫా కదల్ ప్రాంతానికి చెందిన ఈమె పాతికేళ్ళుగా పష్మీనా ఉన్నిని వడకడంలో అనుభవాన్ని గడించినవారు.
"నేను ఒక పురి (10 గ్రాముల పష్మీనా) నుంచి 140-160 ముడులు వేయగలను," చెప్పారామె. అలా చేయడానికి అవసరపడే సమయం, నైపుణ్యం ఎంతయినా, ఒక్కో ముడికి ఖలీదా బేగమ్‌కు లభించేది ఒక్క రూపాయి మాత్రమే.
పష్మీనా నూలు ధర ఆ దారపు పరిమాణంపై ఆధారపడివుంటుంది- దారం ఎంత సన్నగా ఉంటే, అంత ఎక్కువ విలువ. సన్నని దారానికి ఎక్కువ ముడులు వేయవచ్చు, మందంగా ఉండే దారానికి తక్కువ ముడులు వస్తాయి.
"ప్రతి ముడిలోనూ 8-11 అంగుళాల పొడవు, లేదా 8 వేళ్ళ పొడవున్న 9-11 పష్మీనా దారాలుంటాయి. ఒక ముడి వేయడానికి కావాల్సిన దారం పరిమాణాన్ని మహిళలు ఇలాగే కొలుస్తారు," అంటారు ఇంతిజార్ అహ్మద్ బాబా. 55 ఏళ్ళ వయసున్న ఈయన తన బాల్యం నుంచీ పష్మీనా వ్యాపారంలోనే ఉన్నారు. వ్యాపారిని బట్టి, చేతితో వడికి వేసిన ప్రతి ముడికి ఆ వడికినవారికి ఒక రూపాయి నుంచి రూపాయిన్నర వరకూ వస్తుంది.
"మాకు ఇంట్లో చేయవలసిన పనులుంటాయి కాబట్టి ఒక మహిళ 10 గ్రాముల పష్మీనా ఉన్నిని మాత్రమే (దారంగా మార్చడం) చేయగలుగుతుంది. ఒక పురి ని ఒక్క రోజులో పూర్తిచేయటం దాదాపు అసాధ్యం," అంటారు రుక్సానా బానో. ఈమెకు ఒక్కో ముడికి రూపాయిన్నర చెల్లిస్తారు.
ఒక రోజులో ఈ పని ద్వారా తాను ఎక్కువలో ఎక్కువ 20 రూపాయలు సంపాదించగలనని 40 ఏళ్ళ రుక్సానా చెప్పారు. ఈమె నవా కదల్‌లోని ఆరాంపురా ప్రాంతంలో తన భర్త, కుమార్తె, భర్తను కోల్పోయిన వదినగారితో కలిసి జీవిస్తుంటారు. "మూడు రోజులలో పది గ్రాముల పష్మీనాను నేయటం వలన నాకు 120 రూపాయలు వస్తాయి. ఈ మూడు రోజులూ నేను కేవలం టీ తాగటానికి, భోజనం చేయటానికి మాత్రమే విరామం తీసుకుంటూ పొద్దున్నించీ సాయంత్రం వరకూ ఆపకుండా పనిచేస్తాను," చెప్పారామె. 10 గ్రాముల ఉన్ని పనిని పూర్తిచేయడానికి ఆమెకు 5-6 రోజులు పడుతుంది.
పష్మీనా నేత ఇంకెంత మాత్రం సరిపడినంత డబ్బును సంపాదించిపెట్టదని ఖతీజా అంటారు: "ఇప్పుడు నేను రోజుల తరబడి పనిచేస్తున్నా సంపాదించేదేం లేదు. యాబై ఏళ్ళ క్రితం రోజుకు 30 నుండి 50 రూపాయలు సంపాదిస్తే అది బానే ఉన్నట్టు," అన్నారామె.
*****
శాలువా కొనుగోలుదారులు ధర చెల్లించడానికి ఇష్టపడకపోవటంతో ఉన్నిని చేతితో వడికే పష్మీనా కార్మికులకు తక్కువ వేతనాలు ఉంటున్నాయి. నూర్-ఉల్-హుదా అనే పష్మీనా వ్యాపారి ఇలా అంటున్నారు, “యంత్రంతో వడికిన పష్మీనా శాలువ 5,000 రూపాయలకు దొరుకుతున్నప్పుడు, ఒక వినియోగదారుడు 8,000-9,000 రూపాయల విలువ చేసే చేతి తయారీ పష్మీనా శాలువను ఎందుకు కొంటాడు?"
"చేతి తయారీ దారంతో తయారుచేసిన పష్మీనా శాలువాలను కొనేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటున్నారు. ఒక వంద మందిలో (వినియోగదారులు) ఇద్దరు మాత్రమే ప్రామాణికమైన చేతి తయారీ పష్మీనా శాలువా కోసం అడుగుతారని నేను చెప్పగలను," అంటారు శ్రీనగర్‌లోని బాదమ్‌వారీ ప్రాంతంలో ఉన్న పష్మీనా షోరూమ్ అయిన చీనార్ హస్తకళల దుకాణం యజమాని, 50 ఏళ్ళ నూర్-ఉల్-హుదా.
కశ్మీర్ పష్మీనాకు 2005 నుండి భౌగోళిక గుర్తింపు (జిఐ) ఉంది. చేతితో వడికిన, యంత్రంతో నేసిన- ఈ రెండింటి నూలును ఉపయోగించి చేసే తుది నేతలు భౌగోళిక గుర్తింపుకు అర్హమైనవని, నమోదు చేసిన నైపుణ్య కళాకారుల బృందం తీసుకువచ్చిన ఒక నాణ్యతా కరదీపిక (manual) చెప్తోంది. అదేవిధంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కూడా ఉదహరించారు.
అబ్దుల్ మనన్ బాబా నగరంలో శతాబ్దం వయసున్న పష్మీనా వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఆయన వద్ద దాదాపు 250 భౌగోళిక గుర్తింపు ఉన్న వస్తువులున్నాయి - ఇది చాలా పెద్ద సంఖ్య. శాలువాపై ఉన్న రబ్బరు స్టాంపు ఆ శాలువా స్వచ్ఛమైనదనీ, చేతితో తయారుచేసినదనీ హామీ ఇస్తుంది. కానీ నేత కార్మికులు యంత్రంతో తయారుచేసిన నూలును ఇష్టపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. “చేతితో వడికిన దారంతో, దాని సున్నితమైన స్వభావం వలన, పష్మీనా శాలువను నేయడానికి నేత కార్మికులు సిద్ధపడరు. యంత్రంతో వడికిన దారం హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా ఉంటుంది కాబట్టి దానితో నేయడం వారికి సులువు."
చిల్లర వ్యాపారులు తరచుగా యంత్రంతో వడికిన దానిని చేతితో వడికినదానిగా చలామణీ చేసేస్తారు. “మాకు 1,000 పష్మీనా శాలువాలకు ఆర్డర్ వస్తే, 10 గ్రాముల పష్మీనాను వడకడానికి కనీసం 3-5 రోజులు పడుతున్నప్పుడు, ఆ ఆర్డర్‌ని పంపడం మాకు ఎలా సాధ్యమవుతుంది?" అని మనన్ అడుగుతారు.
చేతితో వడికే పష్మీనా తన ఆకర్షణను కోల్పోతోందని మనన్ తండ్రి, 60 ఏళ్ళ అబ్దుల్ హమీద్ బాబా అంటారు. ఈ వడికే కళ, సూఫీ సన్యాసి హజ్రత్ మీర్ సయ్యద్ అలీ హమ్దానీ, 600 సంవత్సరాల క్రితం కశ్మీర్‌కు తీసుకువచ్చిన బహుమతిగా ఆయన నమ్ముతారు.
తన తాతగారి కాలంలో ప్రజలు ముడి పష్మీనా ఉన్నిని కొనడానికి గుర్రాలపై పొరుగున ఉన్న లడఖ్‌కు ఎలా వెళ్ళేవారో హమీద్ గుర్తు చేసుకున్నారు. "అప్పుడంతా స్వచ్ఛంగా ఉండేది. 400-500 మంది మహిళలు మా కోసం పష్మీనా ఉన్నిని వడికేవారు. ఇప్పుడు 40 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వారు కూడా సంపాదించాలి కాబట్టి ఆ పని చేస్తున్నారు."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి