"చెత్తను తయారుచేసేది మీరైనప్పుడు, మేం ఎలా ‘ కచ్రేవాలీ ' (చెత్తమహిళ) అవుతాం? వాస్తవానికి ఈ నగరాన్ని పరిశుభ్రం చేస్తున్నది మేమే. పౌరులు ‘ కచ్రేవాలే’ (చెత్తమనుషులు) కాదా?" వ్యర్థాలను సేకరించే సుమన్ మోరే సూటిగా ప్రశ్నించారు. సుమన్ పుణేకు చెందినవారు.
కాగద్ కాజ్ పత్ర కష్టకరి పంచాయత్ కింద 1993లో సంఘటితమైన 800 మంది వ్యర్థాలను సేకరించేవారిలో సుమన్ కూడా ఒకరు; ఇప్పుడు ఆ సంఘంలో మహిళల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది. తమ పనిని క్రమబద్ధీకరించే అధికారిక గుర్తింపు కార్డుల కోసం వారు పుణే మునిసిపల్ కార్పొరేషన్‌ను (పిఎమ్‌సి) డిమాండ్ చేశారు. 1996లో వాటిని పొందారు కూడా.
ఈ మహిళలు ప్రస్తుతం పిఎమ్‌సితో కలిసి ప్రజల ఇళ్ళ నుంచి వ్యర్థాలను సేకరించే పనిని చేస్తున్నారు. వీరంతా మహారాష్ట్రలో షెడ్యూల్డ్ కులాల జాబితా కింద నమోదై ఉన్న మహార్, మాతంగ సముదాయాలకు చెందినవారు. "మేం తడి చెత్తనూ, పొడి చెత్తనూ వేరుచేసి తడి వ్యర్థాలను చెత్తను తీసుకువెళ్ళే వాహనానికి ఇస్తాం. పొడి వ్యర్థాల నుంచి మాకు కావలసినవేవో తీసుకొని, ఆ మిగిలిన చెత్తను కూడా ఇచ్చేస్తాం," అన్నారు సుమన్.
తాము చేస్తోన్న పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు పిఎమ్‌సి అప్పగిస్తుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు - "మా పనిని మా నుండి ఎవరినీ తీసుకోనివ్వం," అని ఆశా కాంబ్‌ళే చెప్పారు.
మోల్ (విలువ) అనే ఈ చిత్రం, పుణేలోని వ్యర్థాలను సేకరించే మహిళల ఉద్యమ చరిత్రను వారి స్వంత గొంతుల ద్వారా ఆవిష్కరిస్తోంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి