మన స్వాతంత్ర్యం కోసం మా నానమ్మ భవానీ మహాతో సాగించిన పోరాటం ఆమె దేశ్ [దేశాన్ని]ని ఆంగ్రేజ్ [ఆంగ్లేయులు] నుండి విముక్తి చేయడానికి చేసిన పోరాటంతో ప్రారంభమైంది. చివరకు మనం కోరుకున్న స్వేచ్ఛను సాధించుకున్నాం. అప్పటి నుండి మా ఠాకూమా భవానీ మహాతో (పై ఫోటోలో మధ్యలో కూర్చున్నారు) తాను కష్టపడి సాధించుకొన్న ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటున్నారు. (ఆమెకు కుడివైపున కూర్చున్నవా రు ఆమె సోదరి ఊర్మిళ మహాతో; ఎడమవైపున కూర్చున్నవారు ఆమె మనవడు పార్థ సారథి మహాతో.)
2024 సార్వత్రిక ఎన్నికలు కూడా ఆమెకు మినహాయింపేమీ కాదు. ఆమె వయస్సు దాదాపు 106 సంవత్సరాలు, ఆమె ఆరోగ్యం చాలా బలహీనంగా ఉంది, కానీ తన ఓటు హక్కు విషయానికి వస్తే మాత్రం ఆమె పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. ఆమె చక్కగా చూడగలరు, వినగలరు. అయితే ఆమె చేతులు మాత్రం తగినంత బలంగా లేవు. కాబట్టి తనకు సహాయం చేయమని ఆమె నన్ను కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లా మాన్‌బజార్ I బ్లాక్‌లోని మా గ్రామం చెపువా, మే 25న ఓటు వేయబోతోంది. అయితే 85 ఏళ్ళు పైబడిన వృద్ధులైన పౌరుల కోసం ఇంటి నుండే వోటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పించడంతో, ఆమె ఈ రోజు (మే 18, 2024) చెపువాలోని తన ఇంటి నుండే ఓటు వేశారు.
పోలింగ్ అధికారుల నుండి అనుమతి పొంది, నేను ఈ ప్రక్రియలో ఆమెకు సహాయం చేశాను. పోలింగ్ బృందంవారు వెళ్ళిపోగానే ఆమె తన పాత రోజులను నెమరువేసుకోవడం ప్రారంభించారు. ఆంగ్లేయుల పాలనలో పరిస్థితులు ఎలా ఉన్నాయోతో మొదలుపెట్టి, క్రమంగా ముందుకు సాగి నేటి పరిస్థితుల వద్దకు వచ్చి, తన నెమరువేతను ముగించారు.
ఈ కథంతా విన్నాక నేను మరోసారి మా ఠాకూమా (నాయనమ్మ) గురించి గర్వపడ్డాను.
విప్లవకారిణి భవానీ మహాతో గురించి మరింత తెలుసుకోవడానికి, పి. సాయినాథ్ రచించిన భవానీ మహాతో విప్లవాన్ని పోషించిన వేళ ను చదవండి.
ముఖ చిత్రం: ప్రణబ్ కుమార్ మహాతో
అనువాదం: సుధామయి సత్తెనపల్లి