అంజలి ఎప్పుడూ తులసిని తన అమ్మ గా పిలుస్తుంది. ఉంగరాల జుట్టును ముడిగా చుట్టి, చక్కని గులాబీ రంగు చీర కట్టుతో ఉన్న అంజలి తల్లి ఈ సంగతిని సగర్వంగా నవ్వుతూ మాతో చెప్పారు. తొమ్మిదేళ్ళ ఆ పాపకు తల్లి అయిన తులసి ఒక ట్రాన్స్ మహిళ.

తులసి యుక్తవయస్సులో ఉండగా, తనను తాను 'కార్తీక'గా చెప్పుకోవడం ప్రారంభించింది. తరువాత, ఒక అధికారి ఆమె రేషన్ కార్డులో పొరపాటున తమిళంలో ‘తులసి’ - స్త్రీ పురుషులిద్దరూ పెట్టుకునే పేరు - అని రాశారు. ఆ పేరును సంతోషంగా స్వీకరించిన ఆమె, ఆ రెండు పేర్లలో ఏ పేరుతో పిలిచినా జవాబిచ్చేది.

తమిళనాడులోని తిరుప్పోరూర్ తాలూకా లోని ఇరుల కుగ్రామమైన దర్గాస్‌లో ఆమె తన కుమార్తె అంజలితో కలిసి గడ్డి పైకప్పు ఉన్న చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. తులసి భార్య అంజలి పసితనంలో ఉన్నప్పుడు తులసి నుండి విడిపోయారు. దాంతో ఆమె అంజలిని ఒంటరి తల్లిగా పెంచుతున్నారు. 2016లో వచ్చిన వరదా తుఫాను కారణంగా ఆ దంపతులు తమ తొమ్మిదేళ్ళ మొదటి బిడ్డను కోల్పోయారు

ఇప్పుడు నలభై ఏళ్ళు దాటిన తులసి చాలా సంవత్సరాలుగా తిరునంగై (తమిళ భాషలో ట్రాన్స్ మహిళ) సమూహంలో భాగంగా ఉన్నారు. తన ఒడిలో కూర్చునివున్న అంజలి వైపు ఆప్యాయంగా చూస్తూ, “నేను మా [ తిరునంగై ] సమావేశాలకు ఈమెను చేతిలో పాల సీసాతో సహా తీసుకెళ్ళేదాన్ని,” చెప్పారామె.

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: తమిళనాడులోని తిరుప్పోరూర్ తాలూకా, ఇరుల కుగ్రామమైన దర్గాస్‌లో ఉన్న తమ ఇంటిలో తన కుమార్తె అంజలితో తులసి. కుడి: చిన్నపాపగా ఉన్న అంజలిని తులసి ఎత్తుకొనివున్న ఫొటో

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: ముమ్మరమైన కోవిడ్ సమయంలో తెన్‌మొళి (నీలం రంగు చీర) చనిపోవడానికి ముందు ఆమెతో కలిసి పాడుతోన్న తులసి

అంజలికి దాదాపు నాలుగేళ్ళ వయసున్నప్పుడు, అంజలి తననే తల్లిగా గుర్తించాలని కోరుకున్న తులసి వేష్టి (పురుషులు ధరించే వస్త్రం)ని ధరించడం మానేసి కేవలం చీరలు మాత్రమే ధరించడం చేశారు. తాను తన ఆయా (అమ్మమ్మ)గా భావించే కుముధి అనే 50 ఏళ్ళ తిరునంగై సలహా మేరకే ఈ పని చేశానని తులసి చెప్పారు.

ఆమె స్త్రీగా తన జెండర్ గుర్తింపును నొక్కి చెప్పడం ప్రారంభించిన సమయాన్ని ప్రస్తావిస్తూ, “ విళంబరమావే వందుటే [నేను బహిరంగంగా బయటకు వచ్చాను]” అని చెప్పారామె.

ఈ మార్పునకు గుర్తుగా, తిరువళ్ళూరు జిల్లాలోని విడైయూర్‌కు చెందిన 40 ఏళ్ళ బంధువు రవిని తులసి వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని ట్రాన్స్ మహిళలలో సాధారణంగా ఉన్న ఈ ఆచారంలో వివాహమనేది కేవలం ప్రతీకాత్మకమైనది. రవి కుటుంబం - అతని భార్య గీత, ఇద్దరు యుక్తవయసు కుమార్తెలు - తులసిని తమ కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా స్వీకరించారు. “నా భర్తతో సహా మేమంతా ఆమెను ‘ అమ్మా ’ అని పిలుస్తాం. ఆమె మాకు దేవుడితో సమానం," అని గీత చెప్పారు.

తులసి దర్గాస్‌లోనే నివాసముంటూ ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే కొత్తగా ఏర్పడిన తన కుటుంబాన్ని కలుస్తుంటారు.

ఆమె చీరలు ధరించటం ప్రారంభించిన సమయంలోనే, ఆమె ఏడుగురు తోబుట్టువులు ఆమెను ' అమ్మా ' లేదా ' శక్తి ' (దేవత) అని పిలవటం మొదలుపెట్టారు. ఆమెలో ఈ మార్పు దేవత దయ ( అమ్మన్ అరుళ్ ) వల్లనే జరిగిందని వారు నమ్ముతారు.

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: ప్రతిరోజూ చీర కట్టుకోవడాన్ని ఆమె పరివర్తనకు గుర్తుగా తులసి, రవిలు ఒక ఆచార వివాహాన్ని చేసుకున్నారు. కుడి: రవి భార్య గీత తులసి జుట్టులో పూలు పెడుతుండగా చూస్తోన్న అంజలి, రవి, రవి కూతురు

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

అంజలి(ఎడమ)తో తులసి, రవి. తులసి కుటుంబం ఆమెను ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. 'ఇది అమ్మన్ (దేవత) మా ఇంటికి రావటంలాంటిదే," అని తులసి తల్లి సెందామరై బ్రతికివుండగా అనేవారు

ఇరుల సముదాయంలోని ప్రతి ఒక్కరికి ఆమె జెండర్ గురించి తెలుసు కాబట్టి దానిని దాచాల్సిన అవసరం లేదని తులసి చెప్పారు. “పెళ్ళి కాకముందే నా భార్యకు కూడా నా గురించి పూర్తిగా తెలుసు,” అంటారు తులసి. "నేను కుడుమి [చిన్న జుట్టు ముడి] ధరించినప్పుడు, లేదా చీర కట్టుకోవడం ప్రారంభించినప్పుడు కూడా, నేను ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తించకూడదని గానీ, దుస్తులు ధరించకూడదని గానీ ఎవరూ చెప్పలేదు," అన్నారామె.

తులసి 'అమ్మాయిలా' ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని తులసి స్నేహితుడైన పుంగావనంను అతని స్నేహితులు అడిగేవారు. "మా గ్రామమే మా ప్రపంచం. ఆయన (తులసి) లాంటి వారిని మేం చూడలేదు. అయితే, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారని భావించి మేం అంగీకరించాం,” అంటూ ఆయన, తులసిని గానీ అంజలిని గానీ ఎవరైనా ఎప్పుడైనా అగౌరవపరచటమో లేదా ఆటపట్టించటమో చేసివుంటారనే ఆలోచనను తోసిపుచ్చారు.

ఎనభై ఏళ్ళకు చేరువగా ఉన్న ఆమె తల్లిదండ్రులైన సెందామరై, గోపాల్‌లు కూడా ఆమెను ఆమెలాగే అంగీకరించారు. చిన్నతనంలో తులసి సున్నిత స్వభావాన్ని చూసి, “ అవన్ మనసపున్ పడుత్త కూడాదు [అతని మనసును మనం నొప్పించకూడదు]” అని నిర్ణయించుకున్నారు.

“ఇది మంచి విషయం [తులసి చీరలు కట్టుకోవడం]. అమ్మన్ ఇంటికి వచ్చినట్లుగా ఉంది,” తులసి సాక్షాత్తూ తమ దేవతకు ప్రతిరూపం అనే తమ కుటుంబ మనోభావాన్ని ప్రతిధ్వనిస్తూ, సెందామరై చేతులు జోడించి, కళ్ళు మూసుకుని మనసులో ప్రార్థన చేస్తూ అన్నారు. సెందామరై 2023 చివరలో మరణించారు.

ప్రతి నెలా తులసి తన తిరునంగై సముదాయంతో కలిసి 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విలుప్పురం జిల్లాలోని ఆలయ పట్టణమైన మేల్‌మలయనూర్‌ని సందర్శించి భక్తులను ఆశీర్వదిస్తారు. “ తిరునంగై మాట నిజమవుతుందని ప్రజలు నమ్ముతారు. నేనెప్పుడూ ప్రజలను శపించను, వారిని ఆశీర్వదిస్తాను, వారు ఇచ్చినవాటిని స్వీకరిస్తాను,” అని ఆమె చెప్పారు. ప్రతిరోజూ చీరలు ధరించాలని తాను తీసుకున్న నిర్ణయం వలన తన ఆశీర్వాద బలం మరింత ప్రభావవంతంగా మారిందని ఆమె నమ్ముతారు. ఒక కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆమె కేరళకు కూడా వెళ్ళారు.

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: మేల్‌మలయనూర్ ఆలయ ఉత్సవానికి వెళ్ళేందుకు తయారైన తులసి. కుడి: వేడుక కోసం సిద్ధమైన తులసి తిరునంగై కుటుంబానికి చెందిన బుట్టలు. ప్రజలను ఆశీర్వదించడానికి ఆలయం ముందు గుమిగూడిన ట్రాన్స్ మహిళలు

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: ఫిబ్రవరి 2023లో మేల్‌మలయనూర్ ఆలయ ఉత్సవంలో తన తిరునంగై కుటుంబంతో పాటు రవితో సహా తన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసివున్న తులసి. కుడి: ప్రార్థన చేసి ఒక భక్తుడిని ఆశీర్వదిస్తోన్న తులసి. 'నేనెప్పుడూ ప్రజలను శపించను, వారిని ఆశీర్వదిస్తాను, వారు ఇచ్చినవాటిని స్వీకరిస్తాను,' అన్నారామె

సాధారణ జబ్బులకు పనిచేసే మూలికా ఔషధాల గురించి ఆమెకున్న జ్ఞానం కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేది, కానీ గత కొన్ని సంవత్సరాలుగా అది తగ్గిపోతూవుంది. “నేను చాలామందికి నయం చేశాను. కానీ ఇప్పుడు వారంతా తమ మొబైల్‌ని చూసి స్వంత వైద్యం చేసుకుంటున్నారు. నేను 50,000 [రూపాయలు] కూడా సంపాదించిన రోజులున్నాయి. అది క్రమంగా రూ. 40,000, ఆపైన రూ. 30,000 అయింది. ఇప్పుడు నేను సంవత్సరానికి రూ. 20,000 సంపాదించడం కూడా చాలా కష్టమవుతోంది,” ఆమె నిట్టూర్చారు. అన్నిటికంటే కోవిడ్ సంవత్సరాలు ఆమెకు అత్యంత కష్ట మైనవిగా గడిచాయి.

ఇరులర్‌ల దేవత కన్నియమ్మ కోసం ఆలయాన్ని నిర్వహించటంతో పాటు తులసి ఐదు సంవత్సరాల నుంచి నూర్ నాళ్ వేలై (MGNREGA) పనులు చేస్తున్నారు. ఆమె దర్గాస్‌లోని ఇతర మహిళలతో కలిసి పొలాల్లో పనిచేస్తూ రోజుకు సుమారు రూ. 240 వరకూ సంపాదిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, గ్రామీణ కుటుంబాలకు సంవత్సరంలో 100 రోజుల ఉపాధికి హామీనిస్తోంది

అంజలి కాంచీపురం జిల్లా సమీపంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చేరింది. అంజలి చదువుకే ప్రాధాన్యమిస్తానని తులసి అన్నారు. “ఆమెకు చదువు చెప్పించేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. కోవిడ్ సమయంలో దూరంగా హాస్టల్‌లో ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. అందుకే ఆమెను నా దగ్గరే ఉంచుకున్నాను. కానీ [ఆమెకు] చదువు చెప్పడానికి ఇక్కడెవరూ లేరు,” అన్నారామె. రెండవ తరగతి వరకు చదివిన తులసి 2023 ప్రారంభంలో అంజలిని పాఠశాలలో చేర్పించడానికి వెళ్ళినప్పుడు, ఆమెను మొదటి ట్రాన్స్‌జెండర్ తల్లిగా గౌరవించారు.

తులసి తిరునంగై స్నేహితులు కొందరు జెండర్ స్థిరీకరణ శస్త్రచికిత్సలు చేయించుకోవాలనుకున్నారు, కానీ “అందరూ నన్ను నాలాగే అంగీకరిస్తున్నారు, ఈ వయసులో శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏముంది?” అని ఆమె అన్నారు.

దుష్ప్రభావాల భయాలు ఉన్నప్పటికీ, సమూహంలో ఈ అంశంపై నిరంతరం నడిచే కబుర్లు ఆమెను పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి: “శస్త్రచికిత్స చేయించుకోవడానికి వేసవికాలమే తగిన సమయమనుకుంటా. చురుగ్గా నయమవుతుంది.”

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: తులసి మూలికా వైద్యురాలు కూడా. మిశ్రణ ఔషధాల్లో ఉపయోగించేందుకు ఔషధ మొక్కల కోసం దర్గాస్‌లోని తన ఇంటి చుట్టూ వెతుకుతోన్న తులసి. కుడి: మేల్‌మలయనూర్ ఆలయం వద్ద తులసి, అంజలి

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

'నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను!' ఆలయ ఉత్సవాల్లో నృత్యం చేస్తూ నవ్వుతూ చెప్పారు తులసి

శస్త్రచికిత్సకయ్యే ఖర్చు చిన్న మొత్తమేమీ కాదు - ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉండి శస్త్రచికిత్స చేయించుకోవడానికి దాదాపు రూ. 50,000 ఖర్చవుతుంది. ట్రాన్స్ వ్యక్తులకు ఉచిత జెండర్ స్థిరీకరణ శస్త్రచికిత్సల కోసం తమిళనాడు ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాన్ని గురించి వెతకాలని, అందుకు తనకు రాష్ట్ర మద్దతు లభిస్తుందో లేదో చూడాలని ఆమె కోరుకుంటున్నారు.

ఫిబ్రవరి 2023లో, తులసి సెందామరై, అంజలితో కలిసి మసాన కొల్లై ( మయాన కొల్లై అని కూడా పిలుస్తారు) అనే ప్రసిద్ధ పండుగను జరుపుకోవడానికి మేల్‌మలయనూర్ ఆలయాన్ని సందర్శించారు.

తన తల్లి చేతులు పట్టుకుని అంజలి గెంతుకుంటూ రద్దీగా ఉన్న ఆలయ వీధుల్లో తన పాత స్నేహితులను కలుసుకుంది. రవి, గీత కుటుంబ సమేతంగా వచ్చారు. తులసి తిరునంగై కుటుంబానికి చెందిన - ఆమె గురువు, అక్కచెల్లెళ్ళు - అనేకమంది వారితో చేరారు.

నుదుటిపై పెద్ద ఎర్రటి కుంకుమ బొట్టుతో, పొడవాటి జడగా అల్లిన విగ్గుతో ఉన్న తులసి, అందరితో కబుర్లు చెబుతూ కలివిడిగా తిరుగుతున్నారు. "నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను!" నవ్వుతూ, మధ్యమధ్యలో నాట్యం చేస్తూ చెప్పారామె.

"అంజలికి ఎంతమంది అమ్మలున్నారని మీరు అడగండి," అని తులసి ఒక కుటుంబ వేడుకలో పాల్గొన్న నాతో చెప్పారు.

అలాగే నేను అంజలిని అడిగాను. వెంటనే "ఇద్దరు" అని నవ్వుతూ బదులిచ్చింది, తులసినీ గీతనూ చూపిస్తూ.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Smitha Tumuluru

स्मिता तुमुलुरु, बेंगलुरु की डॉक्यूमेंट्री फ़ोटोग्राफ़र हैं. उन्होंने पूर्व में तमिलनाडु में विकास परियोजनाओं पर लेखन किया है. वह ग्रामीण जीवन की रिपोर्टिंग और उनका दस्तावेज़ीकरण करती हैं.

की अन्य स्टोरी Smitha Tumuluru
Editor : Sanviti Iyer

संविति अय्यर, पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया में बतौर कंटेंट कोऑर्डिनेटर कार्यरत हैं. वह छात्रों के साथ भी काम करती हैं, और ग्रामीण भारत की समस्याओं को दर्ज करने में उनकी मदद करती हैं.

की अन्य स्टोरी Sanviti Iyer
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli