చదర్ బాఁదినీ బొమ్మలాట మా పూర్వీకులతో చాలా లోతైన సంబంధాన్ని కలిగివుంది. "నేను దీన్ని ఆడేటప్పుడు... వారంతా నా చుట్టూరా ఉన్నారనే భావన కలుగుతుంటుంది," తపన్ ముర్ము చెప్పాడు.

అవి 2023 జనవరి నెల మొదటి రోజులు. పశ్చిమ బెంగాల్, బీర్‌భూమ్ జిల్లాలోని ఖంజన్‌పుర్ గ్రామంలోని సర్‌పుకూర్‌డాంగా పల్లెలో బాఁదనా పంటల పండుగ జరుగుతోంది. ముప్పయ్యేళ్ళ వయసుకు చేరువలో ఉన్న రైతు తపన్, తన సంతాల్ ఆదివాసీ సముదాయపు గొప్ప సంప్రదాయాల గురించి, ప్రత్యేకించి చదర్ బాఁదిని అనే ఆకట్టుకునే కొయ్యబొమ్మలాట ప్రదర్శన గురించీ గొప్పగా భావిస్తుంటారు.

తపన్, ఒక ఉజ్జ్వలమైన ఎరుపు రంగు వస్త్రం కప్పివున్న గుమ్మటంలా గుండ్రంగా ఉన్న పంజరాన్ని పట్టుకొని PARIతో మాట్లాడున్నాడు. అందులో కొయ్యతో చేసిన అనేక చిన్న చిన్న మనుషుల బొమ్మలున్నాయి. ఆ కొయ్యబొమ్మలు మీటలు, వెదురు కర్రలు, ఒక తాడును ఉపయోగించి చేసిన ఏర్పాటుతో ఆడుతుంటాయి.

"నేనెలా ఈ బొమ్మల్ని ఆడేలా చేస్తుంటానో, నా పాదాలవైపు చూడండి." మాతృభాష సంతాలీలో పాట పాడుతున్న ఆ రైతు మట్టి పాదాలు ఒక్కసారి మాయలాగా కదిలాయి.

Left: Chadar Badni is a traditional puppetry performance of the Santhal Adivasi community.
PHOTO • Smita Khator
Right: Tapan Murmu skillfully moves the puppets with his feet
PHOTO • Smita Khator

ఎడమ: సంతాలీ ఆదివాసీ సముదాయపు సంప్రదాయ బొమ్మలాట చదర్ బాఁదని. కుడి: తన పాదాలను నేర్పుగా కదిలిస్తూ ఆ బొమ్మలతో నాట్యం చేయిస్తోన్న తపన్ ముర్ము

Tapan Murmu, a Santhal Adivasi farmer from Sarpukurdanga hamlet, stands next to the red dome-shaped cage that has numerous small wooden puppets
PHOTO • Smita Khator

అనేక చిన్న చిన్న కొయ్య బొమ్మలున్న ఎర్రని గుమ్మటం ఆకృతిలో ఉన్న పంజరం పక్కనే నిల్చొని ఉన్న సంతాలీ ఆదివాసీ రైతు, తపన్ ముర్ము

"మీరిక్కడ చదర్ బాఁదినీలో చూస్తున్నది సంతాల్ నృత్య వేడుక. బాఁదన(పంటల పండుగ), పెళ్ళి వేడుకలు, దుర్గాపూజ సమయంలో దాశాయి(సంతాలీ ఆదివాసులు జరుపుకునే ఒక పండుగ) - వంటి మా వేడుకలలో ఈ బొమ్మలాట ఒక భాగం," అని తపన్ అన్నాడు.

"ఈ మధ్యలో ఉన్నది మోరొల్ (గ్రామ పెద్ద). అతను చేతితో చప్పట్లు కొడతాడు, బానాం (ఒకే తంతి ఉండే పురాతన కొయ్య వాయిద్యం), సంప్రదాయక మురళి వంటివి వాయిస్తాడు. ధంసా, మాదల్ (ఆదివాసీ డోళ్ళు) వాయిస్తోన్న పురుషులకు ఎదురుగా ఒకవైపున మహిళలు ఆడుతున్నారు." బొమ్మల వైపు చూపిస్తూ తపన్ వివరించాడు.

భీర్‌భూమ్ సంతాల్ ఆదివాసులకు బాఁదన (సొహరాయి అని కూడా అంటారు) అతి పెద్ద పంటల పండుగ. ఈ పండుగ సందర్భంగా వివిధ రకాల ప్రదర్శనలు, వేడుకలు జరుగుతాయి.

ఈ బొమ్మలాటలో ఉపయోగించే బొమ్మలను వెదురుతో గానీ, కొయ్యతో కానీ చేస్తారు. తొమ్మిది అంగుళాల పొడవుంటాయి. పైన పందిరి ఉన్న చిన్న వేదిక మీద వీటిని ఉంచుతారు. ఆ వేదిక కింద ఉన్న తాళ్ళు, మీటలు, కర్రలు కనిపించకుండా చదర్‌తో చుట్టివుంటాయి. బొమ్మలాటలాడించేవారు ఈ తాళ్ళను లాగి మీటను కదిలించడంతో, బొమ్మ కదులుతుంది.

బొమ్మలను పెట్టిన నిర్మాణం చుట్టూ ఒక చదర్ ( చాదర్/చాదొర్ - వస్త్రం) కడతారు ( బంధన్ ) కాబట్టి చదర్ బాఁదిని అనే పేరు వచ్చిందని సముదాయపు పెద్దలు చెప్పారు.

తపన్ ప్రదర్శించే బొమ్మలాట విలక్షణమైన సంతాలీ నృత్యాన్ని చిత్రీకరిస్తుంది. ఆ సాయంత్రం మేం ఆ ప్రదర్శన వెనుకనున్న ప్రేరణను చూస్తాం - నిజ జీవిత నృత్యం

వీడియో చూడండి: చదర్ బాఁదిని కొయ్యబొమ్మలతో జరుపుకొంటున్న బాఁదన పండుగ

ఈ పండుగలో పాడే పాటలు గ్రామంలోని కొద్దిమంది పెద్దవయసువారికి మాత్రమే తెలుసునని తపన్ చెప్పాడు. స్త్రీలు ఆ పాటలను తమ తమ గ్రామాలలోనే పాడతారు, పురుషులు చదర్ బాఁదినీ కొయ్యబొమ్మలతో పొరుగూర్లకు వెళ్ళి ప్రదర్శనలిస్తారు. "మేం ఒక ఏడెనిమిదిమందిమి ధంసా, మాదొల్ వంటి వాయిద్యాలను తీసుకొని ఈ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలగుండా ప్రయాణం చేస్తాం. ఈ బొమ్మలాటను ప్రదర్శించడానికి అనేక వాయిద్యాలు అవసరమవుతాయి."

పండుగ సమయంలో తమ సముదాయపు ప్రజల సంబరం ఎలా ఉంటుందో తపన్ ఒక చిత్రాన్ని కూడా చిత్రించారు. ఈ వేడుకలు జనవరి మొదట్లో ప్రారంభమై, జనవరి నెల మధ్యలో వచ్చే పౌష్ సంక్రాంతి వరకూ పది రోజులపాటు జరుగుతాయి.

"మా ఇళ్ళన్నీ తాజా వరిపంటతో నిండిపోయి ఉంటాయి- బాఁదనాను జరుపుకోవడానికిదే తగిన సమయం. ఈ ఉత్సవాలకు సంబంధించి అనేక ఆచారక్రియలు ఉంటాయి. అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు," చెప్పాడతను.

తమ పూర్వీకులకు ప్రతీకలుగా భావించే రాళ్ళకూ చెట్లకూ సంతాల్ ఆదివాసులు నైవేద్యాలు పెడతారు. "ప్రత్యేక వంటకాలు తయారవుతాయి; మా సంప్రదాయక మద్యమైన హాఁరియా ను కొత్త బియ్యంతో తయారుచేస్తాం; ఆచారం ప్రకారం వేటకు వెళ్తాం, మా ఇళ్ళను శుభ్రం చేసుకొని వాటిని అలంకరించుకుంటాం. మా వ్యవసాయ పనిముట్లను బాగుచేసుకొని వాటిని శుభ్రంగా కడుగుతాం. మా ఆవులనూ ఎద్దులనూ పూజిస్తాం."

ఈ పండుగ సమయంలో మొత్తం సముదాయమంతా ఒక చోటకు చేరి మంచి పంట వచ్చేలా ఆశీర్వదించాలని ప్రార్థనలు చేస్తారు. "మేం జీవించడానికి సహాయపడేవన్నీ మాకు పవిత్రమైనవే, అందుకే ఈ పరబ్ (పండుగ) సందర్భంగా వాటిని పూజిస్తాం," అంటాడు తపన్. సాయంత్రానికి ప్రజలంతా గ్రామం మధ్యలో ఉండే మాఝిర్ థాన్ (వారి పూర్వీకుల పవిత్ర ఆసనం) వద్దకు చేరతారు. "స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, చిన్న పిల్లలు, పెద్ద వయసువారు, అందరూ ఇందులో పాల్గొంటారు."

Residents decorate their homes (left) during the Bandna festival in Sarpukurdanga.
PHOTO • Smita Khator
Members of the community dance and sing together (right)
PHOTO • Smita Khator

ఎడమ: బాఁదన పండుగ సందర్భంగా తమ ఇళ్ళను అలంకరిస్తోన్న గ్రామస్థులు. కుడి: తపన్ గ్రామం సర్‌పుకూర్‌డాంగాలో జరుగుతోన్న పండుగ ఏర్పాట్లు. కలసిమెలసి ఆడుతూపాడుతోన్న సముదాయపు ప్రజలు

Left: Earthen jars used to brew their traditional liquor, Hanriya.
PHOTO • Smita Khator
Right: Tapan in front of the sacred altar where all the deities are placed, found in the centre of the village
PHOTO • Smita Khator

ఎడమ: సంప్రదాయ మద్యమైన హాఁరియాను తయారుచేసేందుకు మట్టి జాడీలను ఉపయోగిస్తారు. కుడి: గ్రామం మధ్యలో ఉన్న పవిత్ర పీఠమైన మాఝిర్ థాన్ ముందు నిల్చొని ఉన్న తపన్. దేవతలందరినీ (పవిత్రమైన రాళ్ళు) అక్కడే ప్రతిష్ఠిస్తారు

తపన్ ప్రదర్శించే విలక్షణమైన సంతాలీ నృత్యాన్ని వర్ణించే బొమ్మలాట ఆనాటి మొదటి ప్రదర్శన. ఆ ప్రదర్శన వెనుకనున్న ప్రేరణను - నిజ జీవిత నృత్యం - చూసేందుకు తపన్ ఆ సాయంత్రం మమ్మల్ని ఆహ్వానించాడు.

రంగురంగుల దుస్తులతో, అడవిపువ్వులతో తలలను అలంకరించిన కొయ్యబొమ్మల స్థానాన్ని సంతాలీ సంప్రదాయ దుస్తులలో ఉన్న సజీవులైన మానవులు ఆక్రమించారు. పురుషులు తమ తలలపై పగిడీలు (తలపాగాలు) ధరించగా, మహిళలు తమ జుట్టు ముడులను తాజా పువ్వులతో అలంకరించుకున్నారు. ధంసా, మాదొల్‌ ల లయకు ఆడుతున్నవారికి ధీటుగా సాయం సంధ్య నాట్యమాడింది.

కొయ్యబొమ్మలను గురించి తరతరాలుగా వస్తోన్న ఒక పురాణ గాథను సముదాయపు పెద్దలు మాతో పంచుకున్నారు. ఆ కథ ఇలా సాగింది: ఒకసారి ఒక నాట్యాచార్యుడు తనతో పాటు సమీప ప్రాంతాల్లో ప్రదర్శన ఇవ్వగల నృత్యకారులను పోగుచేయమని గ్రామ పెద్దని అడిగాడు. సంతాల్ వంశ పురుషులు తమ భార్యలనూ కుమార్తెలనూ అందుకు పంపడానికి ఒప్పుకోలేదు; వాయిద్యాలు వాయించడానికి ఒప్పుకున్నారు. చేసేదేమీ లేక ఆ గురువు స్త్రీల ముఖాలను గుర్తుపెట్టుకుని చదర్ బాఁదనీ బొమ్మలుగా చెక్కాడు.

"ఈ రోజుల్లో నా తరానికి చెందినవాళ్ళు మా జీవన విధానం గురించి ఏమాత్రం ఎరుకలేకుండా ఉన్నారు," అన్నాడు తపన్. "బొమ్మలాట గురించి వారికి అంతగా తెలియదు; వరి వంగడాలను, అలంకార కళను, కథలను, పాటలను, ఇంకా ఎన్నింటినో వాళ్ళు కోల్పోయారు."

ఆ పండుగ స్ఫూర్తి నీరుగారిపోయేలా మరింత చెప్పకుండా జాగ్రత్తపడుతూ, "అసలు సంగతేమిటంటే వీటన్నిటినీ (సంప్రదాయాలు) రక్షించుకోవాలి. నేను చేయగలిగింది నేను చేస్తున్నా." అన్నాడు తపన్.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Smita Khator

स्मिता खटोर, पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया (पारी) के भारतीय भाषा अनुभाग पारी'भाषा की 'चीफ़ ट्रांसलेशंस एडिटर' के तौर पर काम करती हैं. वह अनुवाद, भाषा व आर्काइव की दुनिया में लंबे समय से सक्रिय रही हैं. वह महिलाओं की समस्याओं व श्रम से जुड़े मुद्दों पर लिखती हैं.

की अन्य स्टोरी स्मिता खटोर
Editor : Vishaka George

विशाखा जॉर्ज, पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया की सीनियर एडिटर हैं. वह आजीविका और पर्यावरण से जुड़े मुद्दों पर लिखती हैं. इसके अलावा, विशाखा पारी की सोशल मीडिया हेड हैं और पारी एजुकेशन टीम के साथ मिलकर पारी की कहानियों को कक्षाओं में पढ़ाई का हिस्सा बनाने और छात्रों को तमाम मुद्दों पर लिखने में मदद करती है.

की अन्य स्टोरी विशाखा जॉर्ज
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli