అది ఆదివారం ఉదయం, కానీ జ్యోతిరింద్ర నారాయణ్ లాహిరి(50) తీరికలేకుండా ఉన్నారు. హూగ్లీ జిల్లాలో ఉన్న తన అపార్ట్‌మెంట్ లోపలి ఒక మూల గదిలో ఆయన 1778లో మేజర్ జేమ్స్ రెన్నెల్ సుందరవనాలపై రూపొందించిన మొదటి పటాన్ని(map) చూస్తున్నారు

"ఆంగ్లేయుల సర్వేపై ఆధారపడి సుందరవనాలపై రూపొందించిన మొదటి ప్రామాణికమైన పటం ఇది. కొల్‌కతా వరకు విస్తరించివున్న మడ అడవులను ఈ పటం చూపిస్తోంది. అప్పటినుంచి చాలా మారిపోయింది," తన వేళ్ళను పటంపై కదుపుతూ అన్నారు లాహిరి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి, ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులైన ఈ సుందరవనాలు, వాటి అపారమైన జీవవైవిధ్యానికీ, ఇంకా రాయల్ బెంగాల్ పులులకూ ( పాంథెరా టైగ్రిస్ ) ప్రసిద్ధి చెందినవి.

ఆయన గది గోడలకున్న పుస్తకాల అరలలో సుందరవనాలకు సంబంధించిన ప్రతి విషయం గురించి వందలాది శీర్షికలతో పుస్తకాలు నిండి ఉన్నాయి - వృక్షసంపద, జంతుజాలం, రోజువారీ జీవితం, పటాలు, అట్లాసులు, ఆంగ్ల, బంగ్లా భాషలలో పిల్లల పుస్తకాలు. 2009లో ఐలా తుఫాను ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన తర్వాత ఆయన సుందరవనాల గురించి ప్రారంభించిన త్రైమాసిక ప్రచురణ 'శుధు సుందర్‌బన్ చర్చ' లోని విషయాలను ఆయన ఈ పుస్తకాల నుంచే పరిశోధించి, రూపొందిస్తారు.

"ఆ ప్రాంతంలోని పరిస్థితులను చూడటానికి నేను పదే పదే అక్కడికి వెళ్ళేవాడిని. అది చాలా భయానకంగా ఉండేది," అని ఆయన గుర్తుచేసుకున్నారు. "పిల్లలకు బడులు లేవు, జనానికి నివాసాలు లేవు, అనేకమంది మగవాళ్ళు వలసపోయారు, అన్నీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆడవారిపై పడింది. నదుల కరకట్టలు నిలుస్తాయా కూలిపోతాయా అనేదానిపైనే ప్రజల గతి ఆధారపడివుంది."

విపత్తుపై మీడియా ఇచ్చే నివేదికలు పైపైవిగానూ, సారహీనంగానూ లాహిరికి అనిపించేవి. "మీడియా సుందరవనాల గురించి ఇదివరకటి మూస కథనాలనే మళ్ళీ మళ్ళీ చెప్తుంటుంది. సాధారణంగా మీరు పులి దాడుల గురించో, వర్షాల గురించో వార్తలనే చూస్తారు. వర్షాలు, వరదలు లేనప్పుడు సుందరవనాలు చాలా అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి," అన్నారతను. "విపత్తు, వన్యప్రాణులు, పర్యాటకం - ఇవే మీడియాకు ఆసక్తి కలిగించే విషయాలు."

Lahiri holds the first map of the Sundarbans (left) prepared by Major James Rennel in 1778. In his collection (right) are many books on the region
PHOTO • Urvashi Sarkar
Lahiri holds the first map of the Sundarbans (left) prepared by Major James Rennel in 1778. In his collection (right) are many books on the region
PHOTO • Urvashi Sarkar

ఎడమ: ఆంగ్లేయుల సర్వేపై ఆధారపడి సుందరవనాలపై 1778లో రూపొందించిన మొదటి పటాన్ని పట్టుకునివున్న లాహిరి. కుడి: లాహిరి వద్ద ఉన్న పుస్తకాలలో సుందరవనాలకు సంబంధించిన వందలాది పుస్తకాలున్నాయి

Lahiri has been collecting news (left) about the Sundarbans for many years. 'When it isn’t raining or flooded, the Sundarbans is rarely in the news,' he says. He holds up issues of Sudhu Sundarban Charcha (right), a magazine he founded in 2010 to counter this and provide local Indian and Bangladeshi perspectives on the region
PHOTO • Urvashi Sarkar
Lahiri has been collecting news (left) about the Sundarbans for many years. 'When it isn’t raining or flooded, the Sundarbans is rarely in the news,' he says. He holds up issues of Sudhu Sundarban Charcha (right), a magazine he founded in 2010 to counter this and provide local Indian and Bangladeshi perspectives on the region
PHOTO • Urvashi Sarkar

లాహిరి చాలా సంవత్సరాలుగా సుందరవనాల గురించి వార్తలను (ఎడమ) సేకరిస్తున్నారు. 'వర్షాలు, వరదలు లేనప్పుడు, సుందర్‌బన్స్ వార్తల్లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటుంది' అని ఆయన చెప్పారు. దీనిని ఎదుర్కోవడానికి, ఈ ప్రాంతంపై స్థానిక భారతీయ, బంగ్లాదేశ్‌ల దృక్కోణాలను అందించడానికి తాను 2010లో స్థాపించిన పత్రిక శుధు సుందర్బన్ చర్చ (కుడి) సంచికలతో లాహిరి

భారతదేశం, బంగ్లాదేశ్‌ల దృక్కోణంలో ఈ ప్రాంతపు విషయాలను సమగ్రంగా నివేదించడానికి ఆయన శుధు సుందర్బన్ చర్చ (కేవలం సుందరవనాల గురించి చర్చ)ను స్థాపించారు. 2010 నుండి ఆయన ఈ పత్రిక 49 సంచికలను ప్రచురించారు, 50వ సంచిక నవంబర్ 2023లో ప్రచురణకు సిద్ధమవుతోంది. "తమలపాకు ఎలా పెరుగుతుంది దగ్గరనుంచి సుందరవనాల పటాల వరకూ, బాలికల జీవితాలు, గ్రామాల గురించిన రూప చిత్రణలు, పైరసీ, వర్షపాతం- ఈ విషయాలన్నిటిపైనా పాత సంచికలు కేంద్రీకరించాయి," అన్నారాయన. సుందరవనాలను మీడియా ఎలా చూపిస్తోందో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లకు చెందిన జర్నలిస్టుల దృష్టికోణాలను చర్చిస్తూ ఒక సంచిక కూడా వెలువడింది.

ఏప్రిల్ 2023లో ప్రచురితమైన సంచికను - 49వ సంచిక - మడ అడవులకూ పులులకూ అంకితం చేశారు. "సుందరవనాలు బహుశా ప్రపంచంలో పులులు నివసించే ఏకైక మడ అడవులు. అందుకనే మేం ఈ విషయంపైనే ఈ సంచికను రూపొందించాం," అన్నారాయన. వాతావరణ మార్పులు, పెరుగుతున్న సముద్ర మట్టాలు సుందరవనాలను ఎలా ప్రభావితం చేస్తాయో విస్తృతంగా పరిశోధించిన ఒక విశ్రాంత విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పనిపై దృష్టి సారించే 50వ సంచికను రూపొందించే ప్రణాళిక కూడా ప్రారంభమైంది.

"మా పాఠకులు సాధారణంగా విద్యార్థులు, నిర్దిష్ట డేటాను లేదా సమాచారాన్ని కోరుకునే విశ్వవిద్యాలయ పరిశోధకులు, ఇంకా ఈ ప్రాంతంపై నిజమైన ఆసక్తి ఉన్న వ్యక్తులు. మా సంచికలను అక్షరం వదలకుండా చదివే 80 ఏళ్ళ వయసున్న పాఠకులు కూడా మాకు ఉన్నారు,” అని లాహిరి చెప్పారు.

ప్రతి మూడు నెలలకు ఈ పత్రిక సుమారు 1000 కాపీలు ముద్రితమవుతుంది. "పశ్చిమ బెంగాల్‌లో మాకు ఎక్కువగా, 520-530 మందివరకూ సాధారణ చందాదారులు ఉన్నారు. వీరికి పత్రికను కొరియర్‌లో పంపిస్తాం. ఒక 50 కాపీలు బంగ్లాదేశ్‌కు వెళ్తాయి. అయితే కొరియర్ ద్వారా పంపించడం చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి మేం వాటిని నేరుగా కొరియర్ ద్వారా పంపించం," లాహిరి వివరించారు. అందుకు బదులుగా బంగ్లాదేశ్‌కు చెందిన పుస్తకాల అమ్మకందారులు కొల్‌కతాలోని ప్రసిద్ధ పుస్తకాల మార్కెట్ అయిన కాలేజ్ స్ట్రీట్‌లో ఈ పత్రికలను కొనుక్కొని తమ దేశానికి తీసుకువెళ్తారు. "మేం బంగ్లాదేశ్ రచయితల రచనలను, ఫొటోగ్రాఫర్ల ఫొటోలను కూడా ప్రచురిస్తాం," అన్నారు లాహిరి.

Left: An issue of Sudhu Sundarban Charcha that focuses on women in the Sundarbans
PHOTO • Urvashi Sarkar
Right: Forty nine issues have been published so far
PHOTO • Urvashi Sarkar

ఎడమ: సుందరవనాలలోని మహిళలపై రూపొందిన శుధు సుందర్బన్స్ చర్చ ప్రత్యేక సంచిక. కుడి: ఇప్పటివరకు నలభై తొమ్మిది సంచికలు వెలువడ్డాయి

Jyotirindra Narayan Lahiri with his wife Srijani Sadhukhan. She along with their two children, Ritaja and Archisman help in running the magazine
PHOTO • Urvashi Sarkar

తన భార్య సృజని సాధుఖాఁతో జ్యోతిరింద్ర నారాయణ్ లాహిరి. ఆమె, తమ ఇద్దరు పిల్లలైన రితజ, అర్చిస్మాన్‌లతో కలిసి పత్రికను నడపడంలో సహాయం చేస్తారు

ప్రతి ముద్రణను నిగనిగలాడే కాగితంపై నలుపు, తెలుపు అక్షరాలతో ముద్రించే ముందు రచనలను టైప్ చేయించడం వలన పత్రికను తీసుకురావడం ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. "ఆపైన సిరా, కాగితం, రవాణా ఖర్చులుంటాయి. అయితే, మేమే అన్నీ చేసుకుంటాం కాబట్టి మా సంపాదకీయ ఖర్చులు పెద్దగా ఉండవు," అంటారు లాహిరి. ఆయనకు ఈ పత్రిక నడిపే పనిలో భార్య సృజని సాధుఖాఁ (48), కుమార్తె రితజ (22), కొడుకు అర్చిస్మాన్ సహాయపడుతుంటారు. సంపాదక బృందంలో 15-16 మంది సభ్యులుంటారు. వారు తమ సమయాన్నీ, కృషినీ ఉచితంగా అందిస్తారు. "ప్రజలను ఉద్యోగాల్లో పెట్టుకునేంత స్తోమత మాకు లేదు. మేం పత్రికలో లేవనెత్తే విషయాల పట్ల ఉన్న శ్రద్ధ వలన వారు తమ సమయాన్నీ శ్రమనూ ఉచితంగా అందిస్తారు," అన్నారు లాహిరి.

పత్రిక కాపీ ధర రూ. 150. మాకు ఖర్చయేది రూ. 80 అయినప్పటికీ, మేం ప్రతి కాపీని రూ. 150కి అమ్మాల్సిందే. ఎందుకంటే మేం స్టాండ్ యజమానులకు 35 శాతం కమిషన్ ఇవ్వాల్సివుంటుంది," అంటూ లాహిరి ప్రచురణలో ఉండే ఆర్థిక విషయాలను గురించి చెప్పారు.

దాదాపు ప్రతిరోజూ లాహిరి, ఆయన కుటుంబం ఈ ప్రాంతంలోని వార్తల కోసం ఆరు బెంగాలీ, మూడు ఆంగ్ల వార్తాపత్రికలను పరిశీలిస్తారు. అతను ఆ ప్రాంతంలో గుర్తింపు పొందిన వ్యక్తి కాబట్టి, పులి దాడుల వార్తలు తరచుగా ఆయనకు నేరుగా చేరతాయి. లాహిరి వార్తాపత్రికల సంపాదకులకు పాఠకులు రాసిన లేఖలను కూడా సేకరిస్తారు. "పాఠకులు ధనవంతులో లేదా శక్తివంతులో కాకపోవచ్చు, కానీ వారికి విషయాలు తెలుసు కాబట్టి సంబంధిత ప్రశ్నలు అడుగుతారు" అని ఆయన చెప్పారు.

పత్రిక నడిపించటం ఒక్కటే ఆయన బాధ్యత కాదు. ఆయన ప్రతిరోజూ ఒక ప్రభుత్వ పాఠశాలలో 6-12వ తరగతి పిల్లలకు భూగోళశాస్త్రాన్ని బోధించేందుకు పక్కనే ఉన్న తూర్పు బర్ధమాన్ జిల్లాకు 180 కి.మీ. దూరం ప్రయాణిస్తారు. "నేను ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు ఇల్లు విడచి వెళ్ళి మళ్ళీ రాత్రి 8 గంటలకు ఇల్లు చేరతాను. ప్రింటింగ్ ప్రెస్ బర్ధమాన్ నగరంలోనే ఉంది. అంచేత అక్కడ చేయాల్సిన పని ఉంటే నేను ప్రెస్ దగ్గర ఆగి, సాయంత్రం బాగా ఆలస్యంగా ఇల్లు చేరుకుంటాను," గత 26 ఏళ్ళుగా బడిలో పాఠాలు చెప్తోన్న లాహిరి అన్నారు. "పత్రిక లాగే బోధన కూడా నాకెంతో ఇష్టమైన అభిరుచి," అంటారు లాహిరి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Urvashi Sarkar

उर्वशी सरकार, स्वतंत्र पत्रकार हैं और साल 2016 की पारी फ़ेलो हैं.

की अन्य स्टोरी उर्वशी सरकार
Editor : Sangeeta Menon

संगीता मेनन, मुंबई स्थित लेखक, संपादक और कम्युनिकेशन कंसल्टेंट हैं.

की अन्य स्टोरी Sangeeta Menon
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli