అతనికి బంగారాన్ని చూస్తేనే, దాని నాణ్యత తెలిసిపోతుంది. “మీ బంగారు నగని ఓసారి నా చేతిలో పెట్టి చూడండి, అది ఎన్ని క్యారెట్లు అనేది ఇట్టే చెప్పేస్తాను” అని సగర్వంగా చెప్పుకునే అతని పేరు రఫీక్ పాపాబాయి షేక్. “నేనొక జోహరీని ” (అతని ఉద్దేశ్యంలో నగలు తయారుచేసేవాడని) అని కూడా అతను చెప్పుకుంటారు. శిరూర్-సతారా రహదారి మీద ఉన్న పడవీ అనే గ్రామంలో మేమతణ్ణి కలిసి, కాసేపు ముచ్చటించినప్పుడు అతనీ మాటన్నారు. అతను త్వరలోనే తెరవబోయే ఒక హోటల్ రూపంలో బహుశా అతని చేతికి మరోసారి బంగారం చిక్కిందేమో అనిపించింది మాకు.
పుణే జిల్లా అంచున ఉన్న దౌండ్ తెహసిల్ మీదుగా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో మాకీ హోటల్ తారసపడింది. ప్రకాశవంతమైన రంగులతో తళతళలాడుతూ ఓ డబ్బా కొట్టులా ఉన్న దీని పైభాగాన ‘హోటల్ సెల్ఫీ’ అని ఆకుపచ్చ, ఎరుపు రంగులలో రాసివుంది. దీనినో సారి చూసి తీరాలి అనిపించి మేం వెంటనే వెనక్కి మళ్ళి, దాని వద్దకు చేరుకున్నాం.
“నిజానికి నా కొడుకు కోసమని నేనీ హోటల్ తెరిచాను. నేను జోహరీ గానే ఉండిపోతాను. కాని, నా కొడుకు కోసం, ఈ పనిలో కూడా ఎందుకు ఓ చేయ్యేసి చూడకూడదు అనిపించింది. ఈ రహదారి పొడవునా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. జనం చాయ్ తాగడానికో, ఏమైనా తినడానికో తరచూ ఇక్కడ ఆగుతుంటారు.” అని రఫీక్ వివరించారు. సాధారణంగా దుకాణాలు రహదారి అంచుకు ఆనుకుని ఉంటాయి. ఇతను మాత్రం అలాకాకుండా తన హోటల్‌ను రహదారి అంచునుండి, కొన్ని గజాల స్థలాన్ని ఖాళీ వదిలి, వెనక్కు కట్టారు. అక్కడ జనం తమ వాహనాలను నిలుపుకోవచ్చు- అచ్చం మేం నిలిపినట్టే.
సతారాలో జరిగే కొన్ని సభలకు హాజరవ్వడం కోసం త్వరత్వరగా వెళ్తున్న మమ్మల్ని, ‘సెల్ఫీ’ అనే అతని హోటల్ పేరు ఆకర్షించి, వెనక్కి తిరిగేలా చేసిందని మేం చెప్పినప్పుడు అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది. మా మాటకి పెద్దగా నవ్వుతూ, అలా నవ్విన ప్రతిసారీ, 'నేను నీకు ముందే చెప్పలేదా' అన్నట్టుగా తన కొడుకు వైపు చూశారాయన. ఎందుకంటే, ఆ హోటల్‌కు ఆ పేరు పెట్టింది స్వయంగా ఆయనే!
లేదు, ఈ బుల్లి హోటల్ ముందు నిలబడి మేమేమీ అతనితో సెల్ఫీలు దిగలేదు. ఇప్పటికే చాలామంది ఆ పని చేసుంటారు. ఆ పని, ఇలాంటి విశిష్టమైన పేరు పెట్టినవారిలో రఫీక్ ‘మొదటి’వారన్న విషయంపై మన ఆసక్తిని దూరంచేస్తుందేమోననిపించింది. ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట, తమ హోటల్‌కు ‘సెల్ఫీ’ అనే పేరు పెట్టక మానరు. ఇతను వారందరికంటే ముందే ఉన్నారు. కాకపోతే, మేం చూసిన వాటిల్లో ఈ పేరు గలది ఇదే మొదటిది అన్నది మాత్రం నిర్వివాదం. (గ్రామీణ భారతదేశంలోని అనేక చోట్ల రెస్టారెంట్లనూ, క్యాంటీన్లనూ, దాభాలనూ, ఆఖరికి చాయ్ దుకాణాలను కూడా ‘హోటళ్ళ’నే అంటారు).
ఇక ఈ హోటల్ ప్రారంభం కాగానే, అనేకానేక మంది ప్రయాణికులు, పర్యాటకులు తమ సెల్ఫీ-యిష్ ఆశలను తీర్చుకోడానికి ఇక్కడ ఖచ్చితంగా ఆగుతారు. బహుశా స్నాక్స్ తినడంకోసం కంటే సెల్ఫీలు దిగడానికే ఎక్కువగా ఆగుతారుకావచ్చు. ఇక్కడ తాగే ఛాయ్‌ని మరిచిపోవచ్చేమో కాని, ‘హోటల్ సెల్ఫీ’ని మాత్రం ఎల్లప్పుడూ వాళ్ళతోనే ఉంచుకుంటారు. ఆ గొప్ప ఈగల్స్ రాసిన ఒక పాత పాటలోని పంక్తులను ఈ రకంగా పాడుకోవచ్చు: మీకిష్టం వచ్చినప్పుడు మీరు ఖాళీచేసి వెళ్ళిపోవచ్చు. కాని మీరెప్పటికీ దీన్ని వదిలిపోలేరు.
రఫీక్ తెరవబోయే హోటల్ జనాలను తండోపతండాలుగా ఆకర్షిస్తుందనడంలో అణుమాత్రం అనుమానం పడాల్సిన పనిలేదు. ఆ సంగతిని రఫీక్ కూడా గ్రహించారు. బంగారాన్ని చూస్తేనే, అతనికి దాని నాణ్యత తెలిసిపోతుంది మరి.
అనువాదం: అజయ్ వర్మ అల్లూరి