శేరింగ్ దోర్జీ భూటియా తన ఆదాయం కోసం విల్లుల తయారీ మీద ఎన్నడూ ఆధారపడలేదనే సంగతి ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిన కాసేపటికి కానీ అర్థం కాలేదు. ఎందుకంటే, పాక్‌యోంగ్ జిల్లాలోని కార్తోక్ గ్రామంలోని తన జీవితం అంతా ఈ హస్తకళా నైపుణ్యంలోనే గడిచిపోయిందన్న విషయాన్ని ఈ 83 ఏళ్ల వృద్ధుడు పలుమార్లు నొక్కి చెప్పారు. 60 ఏళ్ల పాటు ఆయన చెక్కపని ద్వారా -ప్రధానంగా ఫర్నీచర్ మరమ్మత్తుల ద్వారా - ఆదాయం గడించారు. అయితే ఆయనకు స్ఫూర్తినిచ్చింది మాత్రం తన స్వస్థలం అయిన సిక్కిం రాష్ట్ర సంస్కృతిలో ఇమిడి ఉన్న విలువిద్య మాత్రమేనని ఆయన చెప్పారు.

ఆయనకు ఎన్నో దశాబ్దాలుగా చెక్కపనిలో నైపుణ్యం ఉన్నా, దానిపై ఆయనకు అంతగా ఆసక్తి లేదు. దానికి బదులుగా పాక్‌యోంగ్ విల్లు తయారీ నిపుణుడిగా పేరొందడమే ఆయన ఆకాంక్ష.

“నాకు 10 - 12 ఏళ్లు ఉన్నప్పటి నుండే చెక్కతో వివిధ వస్తువులను తయారు చేసేవాడిని. నెమ్మదిగా అవి విల్లు ఆకారాన్ని సంతరించుకొన్నాయి, జనం వాటిని కొనడం ప్రారంభించారు. అలా నాలో విల్లు తయారీదారు జన్మించాడు,” అని శేరింగ్ PARIతో చెప్పారు.

“గతంలో, ఈ విల్లును వేరే విధంగా తయారు చేసేవారు,” అని తాను తయారు చేసిన వాటిలో కొన్నింటిని మాకు చూపిస్తూ వివరించసాగారు. “ఇది పాత రకానికి చెందినది, దీనిని [నేపాలీ భాషలో] తబ్జూ అని పిలుస్తారు. ఇందులో రెండు కర్ర ముక్కలను చేర్చి కట్టి, పైన చమడా (తోలు)తో చుట్టేవారు. ఈరోజుల్లో మేము చేస్తున్నదాన్ని ‘బోట్ డిజైన్’ అని పిలుస్తారు. ఒక విల్లును తయారు చేయడానికి కనీసం మూడు రోజులు పడుతుంది. యువకులకు ఆ మాత్రం సమయం సరిపోతుంది. ముసలివాళ్లకు ఇంకొన్ని రోజులు పడుతుంది,” అని శేరింగ్ అల్లరిగా నవ్వుతూ చెప్పారు.

Left: Tshering Dorjee with pieces of the stick that are joined to make the traditional tabjoo bow. Right: His elder son, Sangay Tshering (right), shows a finished tabjoo
PHOTO • Jigyasa Mishra
Left: Tshering Dorjee with pieces of the stick that are joined to make the traditional tabjoo bow. Right: His elder son, Sangay Tshering (right), shows a finished tabjoo
PHOTO • Jigyasa Mishra

ఎడమ : దేశవాళీ తబ్జూ విల్లును తయారు చేయడానికి జోడించే కర్ర ముక్కలతో శేరింగ్ దోర్జీ. కుడి : ఆయన పెద్ద కుమారుడు, సాంగే శేరింగ్ (కుడి వైపు) పూర్తయిన తబ్జూను చూపిస్తున్నారు

శేరింగ్, గంగ్‌టోక్ నుండి సుమారు  30 కిలోమీటర్ల దూరంలోని తన స్వస్థలంలో ఆరు దశాబ్దాలకు పైగా విల్లులను, బాణాలను తయారు చేస్తూ వస్తున్నారు. కార్తోక్ అనే ఈ ఊరు, ఇక్కడి బౌద్ధారామానికి ప్రసిద్ధి. ఇది సిక్కింలో అత్యంత ప్రాచీనమైన బౌద్ధారామాలలో 6వ స్థానంలో నిలిచింది. కార్తోక్‌లో ఇంతకు ముందు ఎందరో విల్లు తయారీదారులు ఉండేవారని,  కానీ ఇప్పుడు వారిలో శేరింగ్ మాత్రమే మిగిలారని, స్థానికులు చెప్పారు .

చాలా ప్రత్యేకమైన రీతిలో, కార్తోక్ ప్రభావం శేరింగ్ ఇంట్లో కూడా కనిపిస్తుంది. మీరు రంగురంగుల పూలతో మెరిసిపోయే తోటను దాటిన తర్వాత మాత్రమే ఆయన ఇంటి వరండాకు చేరుకుంటారు. ఈ తోటలో దాదాపు 500 రకాల పూలు, మొక్కలు ఉన్నాయి. వారి ఇంటి వెనుక గ్రీన్‌హౌస్, నర్సరీ కూడా ఉన్నాయి. వాటిలో మూలికలు, అలంకరణకు వాడే మొక్కలు, బోన్సాయ్ మొక్కలతో పాటు దాదాపు 800 ఆర్చిడ్‌లు కూడా ఉన్నాయి. దీని వెనుక ఆయన పెద్ద కుమారుడు, ఎంతో నైపుణ్యం కలిగిన హార్టీకల్చరిస్ట్ అయిన సాంగే శేరింగ్ భూటియా (39) శ్రమ దాగి ఉంది. సాంగే పలు రకాల తోటలను డిజైన్ చేయడం, మొక్కలను విక్రయించడంతో పాటు హార్టీకల్చర్‌ను ఇతరులకు నేర్పి, వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.

“ఇక్కడ మేము ఆరుగురం కలిసి ఉంటాం,” అని శేరింగ్ మాతో చెప్పారు. ‘ఇక్కడ’ అని ఆయన చెబుతోన్నది కార్తోక్‌లోని ఆయన చిన్న ఇంటి గురించి. “నేను, నా భార్య దావతి భూటియా (64), నా కుమారుడు సాంగే శేరింగ్, కోడలు తాశీ డోర్మా షెర్పా (36). మా మనవలు చ్యంపా హేసల్ భూటియా, రంగ్‌సేల్ భూటియా.” ఈ ఇంట్లో ఇంకొకరు కూడా నివసిస్తారు: ఈ కుటుంబానికి ప్రియమైన కుక్క డాలీ. అది సాధారణంగా మూడేళ్ల చ్యంపాతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. రంగ్‌సేల్ వయసు రెండేళ్ల లోపే.

శేరింగ్ రెండవ కుమారుడు సోనమ్ పలజోర్ భూటియా (33) ఢిల్లీలో ఉన్న సిక్కింకు చెందిన ఇండియా రిజర్వ్ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. అక్కడ తన భార్య, కుమారుడితో కలిసి ఉంటారు. పండగలకు, సెలవులకు కార్తోక్‌లోని తన తండ్రి ఇంటికి సోనమ్ వస్తూ ఉంటారు. శేరింగ్ తొలి సంతానం అయిన కూతురు శేరింగ్ లహాము భూటియా (43) వివాహితురాలు, ఆమె గంగ్‌టోక్‌లో నివసిస్తారు. అదే నగరంలో శేరింగ్ చివరి సంతానం అయిన సాంగే గ్యాంపో (31) నివసిస్తారు. ఆయన రీసెర్చ్ స్కాలర్‌గా పిఎచ్‌డి చేస్తున్నారు. ఈ కుటుంబం బౌద్ధ మతానికి చెందిన లామా సామాజిక వర్గానికి చెందినది, వీరు భూటియా అనే పేరు గల, సిక్కింలోని ఒక ప్రధానమైన షెడ్యూల్‌డ్ తెగకు చెందినవారు.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఎడమ : ఎన్నో రకాల పూలు, మొక్కలు ఉన్న శేరింగ్ తోట. కుడి : హార్టీకల్చరిస్ట్ అయిన సాంగే శేరింగ్ తన సమయంలో అధిక శాతం ఈ తోటపని మీదే వెచ్చిస్తారు. 'ఇది నాకు కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, నా జీవితాశయం'

శేరింగ్ తయారు చేసిన విల్లులను ఎలా ఉపయోగించాలో మేము తెలుసుకుంటూ ఉండగా, సాంగే శేరింగ్ ముందుకొచ్చి మాట్లాడసాగారు. బ్రౌన్, మట్టి, జేగురు రంగులు కలిసిన రంగులోఉన్న ఒక విల్లును చూపిస్తూ “ఇది నాకోసం నాన్న చేసి ఇచ్చారు,” అని చెప్పారు. “నేను దీంతో మాత్రమే విలువిద్యను అభ్యసిస్తాను.” అంటూ తన ఎడమ చేతిని చాచి విల్లును వాడే టెక్నిక్‌ను మాకు చూపించారు.

విలువిద్య అనేది సిక్కిం సంప్రదాయాలతో లోతుగా పెనవేసుకుని ఉన్నది. ఇక్కడివారికి ఇది ఒక క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతిలో ఒక భాగం. సాధారణంగా పొలాల్లో కోత పూర్తయిన తర్వాత, హడావుడి కాస్త తగ్గిన సమయంలో పండగలు, టోర్నమెంట్లు జరిగినప్పుడు ఈ క్రీడ ప్రధానంగా జీవం పుంజుకుంటుంది. సిక్కిం భారతదేశంలోకి చేరక ముందు నుండే ఇక్కడివారికి ఇది జాతీయ క్రీడగా ప్రసిద్ధి చెందింది.

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లలో రెండు సార్లు, ఆసియా క్రీడలలో రెండు సార్లు పతకాలు గెలవడమే కాక ఒలింపిక్ క్రీడలలో మూడు పర్యాయాలు- ఏథెన్స్ 2004, లండన్ 2012, టోక్యో 2021 - భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తరుణ్‌దీప్ రాయ్ సిక్కింకు చెందిన వారే. పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన రాయ్ గౌరవార్థం తరుణ్‌దీప్ రాయ్ ఆర్చరీ అకాడెమీని స్థాపించనున్నట్టు సిక్కిం ముఖ్య మంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్-గోలే గత సంవత్సరం ప్రకటించారు .

గంగ్‌టోక్‌లోని రాయల్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లోనే కాక ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగే ప్రసిద్ధ టోర్నమెంట్లలో పాల్గొనడానికి పశ్చిమ బెంగాల్, నేపాల్, భూటాన్‌ల నుండి ఆర్చరీ జట్లు తరచుగా సిక్కింకు వస్తూ ఉంటాయి. ఆధునిక క్రీడగా పరిణామం చెందిన ఆర్చరీలో వాడే విల్లు - అత్యాధునిక సాంకేతికత కలిగి ఉన్న ఒక సంక్లిష్టమైన సాధనం. అయినప్పటికీ ఆధునిక ఆర్చరీతో పోలిస్తే, సాదా ఆర్చరీతో ఆడే దేశవాళీ ఆటలనే సిక్కిం ప్రజలు ఎక్కువ ఆదరించడం కొనసాగిస్తున్నారనేది ఒక ఆసక్తికర విషయం.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఎడమ : తన తండ్రి చేసిన ఒక ఆధునిక విల్లుతో సాంగే శేరింగ్; కుడి : బాణాన్ని వదిలేటప్పుడు చేతిని ఎలా ఉంచాలో చూపిస్తున్నారు

గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఈ చుట్టుపక్కల్లోని షాపులు ఏవీ ఈ దేశవాళీ విల్లును విక్రయించవని భూటియా కుటుంబీకులు మాకు తెలిపారు. బాణాలను మాత్రం కొన్ని స్థానిక దుకాణాలలో కొనవచ్చు, కానీ విల్లును కొనలేము. “కొనుగోలుదారులు కొన్ని స్థానిక దుకాణాల నుండి, ఆర్చర్ల నుండి మా గురించి తెలుసుకుని మా ఇంటికి వస్తారు. మా ఊరు చిన్నదే కాబట్టి మా ఇంటికి దారి తెలుసుకోవడం అంత కష్టం కాదు. ఇక్కడ అందరికీ అందరూ సుపరిచితులే,” అని ఎనభయ్యోవడిలో ఉన్న భూటియా చెప్పారు.

సిక్కింలోని వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలతో పాటు చివరికి భూటాన్ నుండి కూడా విల్లులు కొనుగోలుదారులు తరలి వస్తారు. “వాళ్లు గంగ్‌టోక్ నుండో కార్తోక్ నుండో వస్తారు, లేదా ఆ ఊళ్ల మీదుగా ప్రయాణించి వస్తారు” అని శేరింగ్ నేపాలీ భాషలో చెప్పారు. రాష్ట్రంలోని ఎందరో ప్రజల లాగానే ఆయన కుటుంబం కూడా ఆ నేపాలీలోనే మాట్లాడతారు.

విల్లులను ఎలా తయారుచేస్తారు, వాటి తయారీని శేరింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు, ఎప్పుడు చేయటం మొదలుపెట్టారు అనే విషయాలను మేము మాట్లాడుతున్నప్పుడు, ఆయన మౌనంగా లోపలికి వెళ్లి ఏదో వెతకసాగారు. దాదాపు మూడు నిమిషాల తర్వాత, చిరునవ్వుతో ఉత్సాహంగా బయటకు వచ్చారు. తాను దశాబ్దాల క్రితం తయారు చేసిన కొన్ని విల్లులు, బాణాలతో పాటు విల్లు తయారీకి ఉపయోగించిన పనిముట్ల ( ఔజార్ )ను తీసుకువచ్చారు.

“ఇవన్నీ నేను 40 ఏళ్ల క్రితం లేదా అంతకంటే ముందు తయారు చేసినవి. వీటిలో కొన్ని చాలా చాలా పాతవి. నాకంటే కాస్తంత వయసు తక్కువ అంతే,” అని ఆయన చిరునవ్వుతో చెప్పారు. “విద్యుత్తుతో పనిచేసే పరికరాలు, పనిముట్లు ఏవీ వాడకుండానే నేను వీటిని తయారు చేశాను. అన్నీ చక్కగా చేత్తో చేసినవే.”

“ఇప్పుడు మేము వాడే బాణాలు, పాత వాటికి మార్పులు చేసి రూపొందించినవి,” అని సాంగే శేరింగ్ చెప్పారు. “నాకు గుర్తుంది, నా చిన్నతనంలో బాణాల తోక వేరే విధంగా ఉండేది. అప్పట్లో బాతు ఈకలను ఈ బాణాలకు తోకగా అమర్చేవారు. ఇప్పుడు వాడే లేటెస్ట్ బాణాలన్నీ ప్రధానంగా భూటాన్ నుండి వస్తాయి.” సాంగే ఆ బాణాలను నా చేతికందించి తిరిగి ఇంటి లోపలికి వెళ్లి ఒక ఆధునికమైన, మెషిన్‌తో చేసిన ఒక విల్లును తీసుకువచ్చారు.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఎడమ : దాదాపు 40 ఏళ్ల క్రితం శేరింగ్ తన హస్తకళా నైపుణ్యంతో తయారుచేసిన బాణాలు. కుడి : విల్లులను, బాణాలను చేత్తో తయారు చేయడానికి ఆయన ఉపయోగించే పనిముట్లు

“బరువు తక్కువగా ఉండి తక్కువ ఖరీదు ఉండే విల్లు కావాలని మమ్మల్ని అడిగే వాళ్ల కోసం మేము ఎక్కువగా సానపెట్టని, మెరుగుపెట్టని ఒక సుమారైన విల్లును 400 రూపాయలకు విక్రయిస్తాము,” అని సాంగే చెప్పారు. “వెదురులోని పైభాగంలో బలం ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలాంటి తక్కువ ఖరీదు విల్లుల కోసం తప్ప సాధారణంగా ఆ భాగాన్ని ఉపయోగించము. అయితే, మూడు పొరలుగా మెరుగుపెట్టిన నాణ్యమైన విల్లు ఒక్కొక్కటి 600-700 రూపాయల ధర పలుకుతుంది. దీన్ని తయారు చేయడానికి, వెదురులోని బలమైన దిగువ భాగాన్ని ఉపయోగిస్తాం.

“ ఒక చక్కని విల్లును తయారు చేయడానికి 150 రూపాయల వెదురుతో పాటు 60 రూపాయల దారం లేదా తీగె అవసరం అవుతుంది, అయితే పాలిష్ ఖర్చును అంచనా వేయడం కష్టం,” అని సాంగే నవ్వారు.

ఎందుకలా?

“ఈ పాలిష్‌ను మేము ఇంట్లోనే తయారు చేస్తాం. సాధారణంగా దషాయిన్ [దసరా పండగ] సమయంలో చమడా ను (మేక తోలు) కొనుగోలు చేసి, దాన్లోని మైనాన్ని వెలికితీసి పాలిషింగ్ కోసం వాడతాం. విల్లును తయారు చేసిన తర్వాత, ఈ పాలిష్‌ను దాని మీద వేస్తాము. మొదటి పొర ఎండిన తర్వాత మరో పొర వేస్తాము, ఇలా మూడు పొరలు అయ్యే దాకా వేస్తాము. ఆ మేక తోలు ఒక్కో చదరపు అడుగుకు 150 రూపాయల ఖర్చు అవుతుంది,” అని సాంగే చెప్పారు. వాళ్లు ఆ మేక తోలును ఉపయోగించే పద్ధతి వల్ల, ఈ పాలిషింగ్ ప్రక్రియకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయడం కష్టమవుతుంది.

“మరో విషయం, విల్లుకు వెన్నెముక అనేది ప్రధాన భాగం,” అని ఆయన కొనసాగారు, “అందుకు వాడే వెదురు ముక్క ఒక్కో దానికి 300 రూపాయలు ఖర్చవుతుంది. ఒక పెద్ద వెదురు ముక్కతో ఐదు విల్లులను సులువుగా తయారు చేయవచ్చు.”

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఎడమ : కొన్ని దేశవాళీ విల్లులను శేరింగ్ చేతబట్టి ఉన్నారు, ఆయన కుమారుడి చేతిలో ఉన్నది ఆధునిక విల్లు. కుడి : చెక్క పాలిష్ వేసిన విల్లుకు, మేక తోలు మైనాన్ని పూసిన విల్లుకు మధ్య వ్యత్యాసాన్ని సాంగే చూపుతున్నారు

సాంగే ఇంటి లోపలికి వెళ్లి ఒక పెద్ద ఆర్చరీ కిట్ బ్యాగ్ తీసుకుని వచ్చి, అందులో నుండి చాలా పెద్దదైన, బరువైన ఒక విల్లును బయటకు తీసి “ఇదిగోండి, ఇది తాజా డిజైన్ విల్లు” అని చెప్పారు. “కానీ దీనిని మా స్థానిక టోర్నమెంట్లలో ఉపయోగించడానికి అనుమతి ఇవ్వరు. దీనితో ప్రాక్టీసు చేయవచ్చు కానీ మ్యాచ్‌లో పాల్గొనాలంటే మాత్రం చేత్తో చేసిన దేశవాళీ విల్లును ఉపయోగించడం తప్పనిసరి. నేను, నా తమ్ముడు కూడా మా నాన్నగారు చేసిన విల్లులను ఉపయోగించి ఈ టోర్నమెంట్లలో పాల్గొన్నాము. ఈసారి నా తమ్ముడు ఢిల్లీ నుండి ఏదో కొత్త రకం చెక్క పాలిష్ తీసుకొచ్చి దాన్ని తన విల్లుకు పూశాడు. నా విల్లు మీద దశాబ్దాలుగా నాన్నగారు వాడే సంప్రదాయ పాలిష్‌నే వాడారు.”

సంవత్సరాలు గడిచే కొద్దీ విల్లుల అమ్మకాలు సన్నగిల్లాయని భూటియా కుటుంబీకులు బాధతో చెప్పారు. భూటియా తెగ వారు జరుపుకునే సిక్కిం నూతన సంవత్సర వేడుక, బౌద్ధ మత పండగ అయిన లోసుంగ్ సమయంలోనే ఆ విల్లులు అధికంగా అమ్ముడవుతాయి. పంట కోతకాలం తర్వాత జరిగే ఈ పండగ డిసెంబర్ నెల పొడవునా సాగుతుంది, దీనిలో భాగంగా ఆర్చరీ టోర్నమెంట్లను నిర్వహిస్తారు. “ఆ సమయంలో చాలా మంది ప్రజలు బౌద్ధారామానికి వచ్చినప్పుడు మా వద్ద కొనుగోలు చేస్తారు. ఇటీవలి సంవత్సరాలలో ఒక ఏడాదికి 4-5 విల్లులను కూడా మేము అమ్మలేకపోయాం. కృత్రిమ విల్లులే ఇప్పుడు మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వాటిని జపాన్‌లో తయారు చేస్తారనుకుంటా. దాదాపు 6-7 ఏళ్ల కిందటి వరకు, ఒక్కో ఏడాదికి 10 విల్లులను అమ్మగలిగేవాడిని,” అని శేరింగ్ దోర్జీ PARIతో చెప్పారు.

ఒక ఏడాదికి 10 విల్లులను అమ్మినా కూడా అందువల్ల ఆయనకు పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఒక వడ్రంగిగా  ఫర్నీచర్ తయారీ, మరమ్మతులతో పాటు ఇతర చిన్నపాటి చెక్క పనుల వల్ల వచ్చే ఆదాయం మీదే ఈ కుటుంబం నెగ్గుకొచ్చింది. ఈ వృత్తిలో పూర్తి స్థాయిలో పని చేస్తున్నప్పుడు, అంటే ఒక దశాబ్దపు కాలం కంటే ముందు తన ఆదాయం మీదే కుటుంబం మొత్తం ఆధారపడి ఉన్నప్పుడు, నెలకు రూ. 10 వేలు సంపాదించగలిగేవాణ్ణని శేరింగ్ చెప్పారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ఆసక్తిని చూరగొనింది విల్లులు మాత్రమే, వడ్రంగం కాదు.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Tashi Dorma Sherpa

ఏళ్లు గడిచే కొద్దీ విల్లుల అమ్మకాలు సన్నగిల్లాయని భూటియా కుటుంబీకులు చెప్పారు. శేరింగ్ కంటి చూపు క్షీణించడంతో ఆయన వాటిని అధిక సంఖ్యలో తయారు చేయడం లేదు

భూటియా కుటుంబం విల్లులను తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన వెదురును ఉపయోగిస్తారు, దాన్ని భూటాన్ వెదురుగా పిలుస్తారు. “నాన్నగారు చేసే విల్లులన్నీ భూటాన్ వెదురుతో చేసినవే, ఈ వెదురు గతంలో భారతదేశంలో దొరికేది కాదు,” అని సాంగే చెప్పారు. “ఇక్కడి నుండి 70 కిలోమీటర్ల దూరంలోఉండే పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్‌లో గతంలో రైతులు ఈ చెట్టు విత్తనాలు నాటారు. అవి ఇప్పుడు పెరిగి వృక్షాలై, వాటి వెదురు మాకు సరఫరా అవుతోంది. నేను స్వయంగా అక్కడికి వెళ్లి ఒకేసారి రెండేళ్లకు సరిపడా సరుకును కొని తెచ్చి, ఇక్కడ కార్తోక్ ఇంట్లో నిల్వచేస్తాము.”

“అన్నింటి కంటే ముందు ఒక గురువు ఉండాలి. గురువు లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు,” అని శేరింగ్ చెప్పారు. “ప్రారంభంలో, నేను కేవలం ఒక వడ్రంగిని మాత్రమే. కానీ ఆ తర్వాత, విల్లును తయారుచేయడం మా నాన్నగారి వద్ద నేర్చుకున్నాను. నా స్నేహితులు ఆడుకునే ప్రత్యేకమైన విల్లులలో ఉండే డిజైన్లను చూసి సొంతంగా తయారు చేయడానికి ప్రయత్నించసాగాను. నెమ్మదిగా ఒక మోస్తరుగా చేయగలిగాను. ఎవరైనా వాటిని కొనడానికి నా వద్దకు వస్తే, అన్నిటికంటే ముందు దానిని ఎలా ఉపయోగించాలో నేను వాళ్లకు చూపించేవాడిని!”

విల్లు తయారీ పనిలో తాను గడిపిన తొలి రోజులను 83 ఏళ్ల శేరింగ్ గుర్తు చేసుకున్నారు. “విల్లుల తయారీ వల్ల ఇప్పుడు నాకు పెద్దగా ఆదాయం రావడం లేదు, అయితే పదేళ్ల ముందు ఇంకాస్త ఎక్కువ ఆదాయం వచ్చేది. దాదాపు ఒక దశాబ్ద కాలంగా నా ఇంటిని, ఈ ఇంటిని నా పిల్లలే నడుపుతున్నారు. ఇప్పుడు నేను విల్లులను తయారు చేసినా అది ఆదాయం కోసం కాదు, కేవలం ఆ పనిపట్ల నాకున్న ప్రేమవల్లనే.”

“నాన్నగారు వాటిని ఇప్పుడు ఎక్కువగా చేయడం లేదు - ఆయన కంటి చూపు మందగించింది. అయినా కొద్ది కొద్దిగా తయారుచేస్తూ ఉంటారు,” అని సాంగే శేరింగ్ బాధతో చెప్పారు.

“ఆయన తర్వాత ఈ కళను ఎవరు కొనసాగిస్తారో మాకు అస్సలు తెలియదు.”

అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి

Jigyasa Mishra

जिज्ञासा मिश्रा, उत्तर प्रदेश के चित्रकूट ज़िले की एक स्वतंत्र पत्रकार हैं.

की अन्य स्टोरी Jigyasa Mishra
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

की अन्य स्टोरी Sri Raghunath Joshi