శివపూజన్ పాండేకి వేరే ట్యాక్సీడ్రైవర్ నుండి ఫోన్ వచ్చిన వెంటనే తత్కాల్ లో టిక్కెట్ కొని, జూలై 4న ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్ స్టేషన్లో రైలు ఎక్కారు.
మరుసటి రోజు ముంబై చేరుకొని, ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నప్పటికీ, 63 ఏళ్ల శివపూజన్ తన ట్యాక్సీని కాపాడుకోలేకపోయారు.
కొరోనా లాక్‌డౌన్‌ల కారణంగా, నగరంలోని విమానాశ్రయంలో చాలా నెలలుగా పట్టించుకోకుండా పడి ఉన్న 42 క్యాబ్‌లను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ వేలం వేసింది. వాటిలో శివపూజన్ ట్యాక్సీ కూడా ఉంది.
అలా అతను తన జీవనోపాధిని కోల్పోయారు. శివపూజన్ 1987 నుండి ట్యాక్సీని నడుపుతున్నారు; 2009లో తన సొంత నలుపు-పసుపు మారుతీ ఓమ్నీని ఋణం తీసుకొని మరీ కొనుగోలు చేశారు.
“ఇలా వేలం వేసి వాళ్ళేం సాధించారు? నేను నా జీవితమంతా క్యాబ్ డ్రైవర్ గానే పని చేశాను. ఇప్పుడు వాళ్ళు అది కూడా లేకుండా చేశారు. ఇలాంటి సమయంలో ఇంత నష్టాన్ని మేం ఎలా తట్టుకోగలం?” అని ఒక రోజు మధ్యాహ్నం సహార్ విమానాశ్రయం దగ్గర ఫుట్‌పాత్ మీద నిలబడి అతను కోపంగా ప్రశ్నించారు.
ఇటీవల, సంజయ్ మాలి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మార్చ్ 2020 నుండి, ఉత్తర ముంబై మరోల్ ప్రాంతం అన్నావాడిలోని ఒక ఖాళీ స్థలంలో అతని వ్యాగన్-ఆర్ 'కూల్ క్యాబ్' పార్క్ చేసి ఉంది. ఇది సహార్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ఉంది
2021, జూన్ 29 రాత్రివేళ అతని క్యాబ్‌ను ఆ పార్కింగ్ స్థలం నుండి తరలించారు. మరుసటి రోజు, ఒక స్నేహితుడి నుండి ఈ సమాచారం తెలుసుకున్న 42 ఏళ్ల సంజయ్, “అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు,” అని నిర్ఘాంతపోయారు.
మార్చ్ 2020లో, లాక్‌డౌన్ విధించే సమయానికి, దాదాపు 1,000 క్యాబ్‌లు ఆ స్థలంలో పార్క్ చేసివున్నాయని సంజయ్, ఇతర ట్యాక్సీ డ్రైవర్లు అంచనా వేశారు. “మేము పని వేళల్లో టాక్సీ నడిపి, పని పూర్తయిన తర్వాత వాటిని తిరిగి ఇక్కడే పార్క్ చేసేవాళ్ళం,” అని సంజయ్ చెప్పారు. కొన్నాళ్లుగా అతను తన క్యాబ్‌ని ఆ స్థలంలోనే పార్క్ చేస్తున్నారు. పార్కింగ్ స్థలాలు వారి యూనియన్ల ద్వారా నిర్ణయించబడ్డాయని డ్రైవర్లు చెబుతున్నారు – ఇందుకుగాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ వీరి వద్ద ఎలాంటి రుసుము తీసుకోదు కానీ, విమానాశ్రయం దగ్గర ప్రయాణీకులను ఎక్కించుకున్న ప్రతిసారీ రూ.70 ఛార్జీ వసూలు చేసేది.
మార్చ్ 2020 ప్రారంభంలో సంజయ్, ఎలక్ట్రీషియన్ అయిన తన తమ్ముడితో కలిసి యూపీలోని స్వగ్రామంలో తమ సోదరి వివాహానికి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళారు. అది భదోహి జిల్లా ఔరాయీ తాలూకా లోని ఔరంగాబాద్ లో ఉంది. అక్కడికి చేరుకున్న కొద్దిరోజులకే లాక్‌డౌన్ విధించడంతో, వారిరువురు ముంబైకి తిరిగి రాలేకపోయారు.
ఈ కారణంగా, అతని ట్యాక్సీ అన్నావాడి పార్కింగ్ స్థలంలోనే ఉండిపోయింది. అది అక్కడ సురక్షితంగా ఉంటుందని అతను భావించారు. “అది లాక్‌డౌన్ సమయం కావడంతో, నేను ఇతర విషయాల గురించి ఆలోచించాను కానీ, ఇలాంటిదొకటి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు,” అని సంజయ్ వాపోయారు.
జనవరి 2020లో, తన ట్యాక్సీని సెక్యూరిటీగా పెట్టి, సోదరి పెళ్ళి కోసం రూ.1 లక్ష ఋణం తీసుకున్నారు సంజయ్. లాక్‌డౌన్ సమయంలో, వారి కుటుంబం తాము పొదుపు చేసుకున్న డబ్బులపై, తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పండించిన వరి, గోధుమ పంటలపై ఆధారపడింది; అవసరానికి అప్పులు కూడా చేశారు.
కానీ, సోదరి వివాహం డిసెంబర్ 2020 వరకు వాయిదా పడడంతో, అతను అక్కడే ఉండిపోయారు. అదే సమయానికి కోవిడ్ రెండవ తరంగం ముంచుకురావడంతో, మార్చి 2021 వరకు ముంబైకి తిరిగి రావాలని అనుకున్నారు. అయితే, వారి కుటుంబం 2021 మే చివరి వరకు ముంబైకి తిరిగి రాలేకపోయింది.
అతను జూన్ 4న తన క్యాబ్‌ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, అన్నావాడి పార్కింగ్ గేట్ మూసివేసి ఉంది. గేటు తెరవడానికి ఎయిర్‌పోర్టు అధికారుల నుండి అనుమతి తీసుకోవాలని అక్కడున్న గార్డులు చెప్పారు. మరుసటి రోజు, అంటే జూన్ 5న, సంజయ్ విమానాశ్రయం టెర్మినల్‌లోని కార్యాలయంలో సమర్పించిన ఒక లేఖలో, తను ముంబైలో ఉండకపోవడానికి కారణాలను వివరించి, తన ట్యాక్సీని పార్కింగ్ స్థలం నుండి బయటకు తెచ్చుకునేందుకు అనుమతి ఇమ్మని కోరారు. అయితే, ఆ లేఖ తాలూకు ఫోటోకాపీని కూడా సంజయ్ తీసుకోలేదు – తన ట్యాక్సీని పోగొట్టుకుంటానని అతనప్పుడు ఊహించలేదు మరి!
అతను విమానాశ్రయ కార్యాలయానికి, పార్కింగ్ స్థలానికి 3-4 సార్లు వెళ్ళాడు. అందుకోసం లోకల్ ట్రైన్ లో (లాక్‌డౌన్ షరతుల కారణంగా) కాకుండా, బస్సులో ప్రయాణించవలసి వచ్చింది – ఆ సమయంలో అందుబాటులో ఉన్న అతి తక్కువ బస్సు సర్వీసుల వల్ల ప్రయాణానికి చాలా సమయం పట్టేది. వెళ్ళిన ప్రతిసారీ అతనిని తర్వాత రమ్మని అక్కడి అధికారులు చెప్పేవారు. ఆపై ఎటువంటి హెచ్చరిక లేకుండా, తన ట్యాక్సీ వేలం వేయబడిందని సంజయ్ బాధపడ్డారు.
జూన్ 30న సంజయ్, మరో క్యాబ్ డ్రైవర్‌తో కలిసి సహార్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళారు. “ఆ వేలం చట్టబద్ధంగానే జరిగిందని, నోటీసు పంపినప్పుడు మేము మా వాహనాన్ని తొలగించి ఉండాల్సిందని పోలీసులు మాతో వాదించారు. కానీ, నాకు ఎలాంటి నోటీసులు అందలేదు. నా ఇరుగు పొరుగు వారిని (ముంబైలో) కూడా అడిగాను. నోటీసు గురించి తెలిస్తే, నా ట్యాక్సీని తీసుకెళ్ళకుండా ఉంటానా? ఈ విపరీతమైన చర్య తీసుకునే ముందు, ఎయిర్‌పోర్ట్ అధికారులు లాక్‌డౌన్ పరిస్థితులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?”
“మా నాన్న తన కష్టార్జితంతో కొన్న వాహనం అది. అతను సంవత్సరాల తరబడి ఈఎంఐలు చెల్లించారు,” అని అతను గుర్తుచేసుకున్నారు. మెకానిక్‌గా పనిచేసే సంజయ్ 2014లో, తన తండ్రి వృద్ధాప్యం కారణంగా, చేస్తున్న పని వదిలేసి ట్యాక్సీ నడపడం మొదలుపెట్టారు.
సంజయ్, శివపూజన్‌లు వేలం వేయడానికి ముందు తమ ట్యాక్సీలను కంట చూడలేదు. యూపీ నుండి ముంబై తిరిగి రావడానికి శివపూజన్‌కు సహాయపడిన కృష్ణకాంత్ పాండే, అతని ట్యాక్సీని అధికారులు తీసుకెళ్ళడం చూశారు. 2008లో, శివపూజన్ తన ఇండిగో కూల్ క్యాబ్‌ని రూ.4 లక్షలు పెట్టి కొన్నారు; 54 నెలల పాటు ఈఎంఐలు కట్టి ఋణం చెల్లించారు.
“నేను ఆ రాత్రి అక్కడే ఉన్నాను; మా ట్యాక్సీలను ఒక్కొక్కటిగా తీసుకెళ్ళడం చూశాను. చూస్తూ నిలబడిపోయాను కానీ ఏమీ చేయలేకపోయాను,” అని 52 ఏళ్ల కృష్ణకాంత్ జూన్ 29 రాత్రిని ప్రస్తావిస్తూ చెప్పారు. నేను ఆ డ్రైవర్లతో అన్నావాడి పార్కింగ్ స్థలం వెలుపల నిలబడి మాట్లాడుతున్నాను. అక్కడ గేటుపై ఒక పెద్ద బోర్డు తగిలించి ఉంది: “ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ భూమిని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చింది.అతిక్రమించిన వారిపై విచారణ చేపడతాం.”
అక్రమంగా తన క్యాబ్‌ని తీసుకెళ్ళారని ఫిర్యాదు చేయడానికి సహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, పోలీసులెవరూ తనను పట్టించుకోలేదని కృష్ణకాంత్ చెప్పారు. మార్చ్ 2021లో, యూపీ, జౌన్‌పుర్ జిల్లాలోని తన గ్రామమైన లౌహ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, పార్కింగ్ స్థలంలో ఉన్న తన ట్యాక్సీ ఇంజిన్‌ను మరమ్మతుల కోసం బయటకు తీసుకువచ్చారు కృష్ణకాంత్. “నడపకుండా అలాగే ఉంచడం చేత, అది పని చేయలేదు. కానీ ఇంజిన్ రిపేర్ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు. దాని కోసం నేను పొదుపు చేయాల్సి వచ్చింది. పైగా ఒక సంవత్సరంగా ప్రయాణికులు కూడా లేరు.”
మార్చ్ నుండి అక్టోబర్ 2020 వరకు కృష్ణకాంత్ ముంబైలోనే ఉన్నారు. గత ఏడాది జూలై-ఆగస్ట్ లో పని మొదలెడదామని ప్రయత్నించినా, విమానాశ్రయ ప్రాంతంలో విధించబడ్డ ఆంక్షల వల్ల అది సాధ్యపడలేదు. నవంబర్‌లో అతను లౌహ్‌కి వెళ్ళి, ఈ ఏడాది మార్చ్‌లో ముంబైకి తిరిగివచ్చారు. వెంటనే రెండవ లాక్‌డౌన్ ప్రారంభమవడంతో, అతను పని చేయలేకపోయారు. దాంతో అతని ట్యాక్సీ అన్నావాడి పార్కింగ్ స్థలంలోనే ఉండిపోయింది.
*****
అయితే, వేలం అనివార్యమని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (MIAL) పేర్కొంది. “విమానాశ్రయం ఒక సున్నితమైన ప్రదేశం కనుక, భద్రతా కోణం దృష్ట్యా ఈ చర్య (వేలం వేయడం) చేపట్టవలసి వచ్చింది. ట్యాక్సీలను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పట్టించుకోకుండా ఉండకూడదు. అందునా, ఈ ప్రభుత్వ భూమిని విమానాశ్రయం లీజుకు తీసుకుంది. ఇక్కడి భద్రత మా బాధ్యత కూడా,” అని MIAL కార్పొరేట్ రిలేషన్స్ అసిస్టెంట్ వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రణ్‌ధీర్ లాంబా చెప్పారు.
చాలాకాలంగా ట్యాక్సీలు పార్క్ చేసివుంచిన 216 మంది డ్రైవర్లకు మూడుసార్లు నోటీసులు పంపామని లాంబా అన్నారు. రెండు నోటీసులు ముంబైలో నమోదైవున్నవారి చిరునామాలకు పంపబడ్డాయి – ఒకటి డిసెంబర్ 2020లో, మరొకటి ఫిబ్రవరి 2021లో. “ట్యాక్సీ యజమానుల చిరునామాలను తెలుసుకోవడానికి మేము ఆర్టీఓని (ప్రాంతీయ రవాణా కార్యాలయం) సంప్రదించాము. వార్తాపత్రికలలో పబ్లిక్ నోటీసు కూడా ఇచ్చాము.”
“ఆర్టీఓ, పోలీసు, ట్యాక్సీ యూనియన్లు అన్నింటికీ సమాచారం అందించాం. మేం ప్రతి ఒక్కరినీ సంప్రదించాం; అన్ని ఆదేశాలను, విధానాలను అనుసరించాం,” అని డాక్టర్ లాంబా నొక్కి వక్కాణించారు.
మరైతే సంజయ్ పంపిన లేఖ ఏమైంది? “చివరి నిమిషంలో కూడా మా వద్దకు వచ్చిన డ్రైవర్లందరికీ మేము మార్గనిర్దేశం చేశాం; వారి ట్యాక్సీలను తిరిగి ఇచ్చాం. బహుశా ఈ డ్రైవర్ తప్పు వ్యక్తిని సంప్రదించి ఉండవచ్చు. అతని లేఖ మాకు అసలు అందనేలేదు,” అని లాంబా సమాధానమిచ్చారు.
*****
'జీవితంలో ఇప్పుడే అన్నీ నెమ్మదిగా మెరుగుపడుతున్నాయి. విష్ణుకు ఉద్యోగం ఉండటం వలన, 2018లో, నాలాసోపారాలో చిన్న ఫ్లాట్ కొనుక్కోగలిగాము. అప్పుడు తనని చూసి చాలా గర్వపడ్డాను. కానీ, ఆ తర్వాత, నా కొడుకును పోగొట్టుకున్నాను. ఇప్పుడేమో ఇది – నా ట్యాక్సీ వేలం వేయబడింది'
మార్చ్ 2020లో, లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు, శివపూజన్ పాండే యూపీలోని సంత్ రవిదాస్ నగర్ (భదోహి) జిల్లా, ఔరాయీ తాలూకా లో తన గ్రామమైన భవానీపుర్ ఉపర్వార్‌కు వెళ్ళారు. అతనితో పాటు గృహిణి అయిన భార్య పుష్ప, వారి చిన్న కుమారుడు విశాల్ కూడా వెళ్ళారు. కానీ వారి 32 ఏళ్ల పెద్ద కుమారుడు విష్ణు, అతని భార్య, నాలుగేళ్ళ కుమార్తె మాత్రం ఉత్తర ముంబై నాలాసోపారాలోని తమ సొంత ఇంటిలోనే ఉండిపోయారు. అతను ఫార్మా కంపెనీలో పని చేసేవారు; కానీ కొరొనా కారణంగా ఆ ఉద్యోగం పోయింది.
జూలై 2020 చివరిలో అకస్మాత్తుగా వణుకుతూ, మూర్ఛపోయిన విష్ణుకి మెదడులో రక్తస్రావం అయినట్లు నిర్ధారణ అయింది. “అతను చాలా ఒత్తిడికి లోనయ్యాడని వైద్యులు చెప్పారు. నేను గ్రామంలో ఉండడంతో అక్కడేం జరుగుతుందో తెలిసేది కాదు. ఫోన్ చేసి మాట్లాడినప్పుడు తను బాగానే ఉన్నట్టనిపించేది. అయినా మేము వెంటనే ముంబైకి వచ్చేశాం,” అని శివపూజన్ గుర్తు చేసుకున్నారు. ఆస్పత్రి బిల్లు (రూ.3-4 లక్షలు) కట్టడానికి, శివపూజన్ స్థానికంగా అప్పు చేశారు; తన ఐదు బీఘాల వ్యవసాయ భూమిలో మూడు బీఘాలు తాకట్టు పెట్టారు.
కానీ, గతేడాది ఆగస్టు 1న విష్ణు కన్నుమూశారు!
“మా ఊరికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమనీ, ఇంటి బాధ్యత తాను తీసుకుంటానని విష్ణు నాతో ఎప్పుడూ అనేవాడు. కానీ విశాల్‌కి కూడా ఉద్యోగం వస్తే నేను విశ్రాంతి తీసుకోవచ్చని అనుకున్నాను,”అన్నారు శివపూజన్. 25 ఏళ్ళ విశాల్, ఎంకామ్ డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. విష్ణు మరణం తర్వాత మాకు ముంబైకి తిరిగి రావాలని అనిపించలేదు. నాకంటే ముందు నా కొడుకు చనిపోవడం అత్యంత దారుణం. నా భార్య ఇంకా షాక్‌లోనే ఉంది,” అని శివపూజన్ కంటతడి పెట్టుకున్నారు.
విష్ణు అంత్యక్రియల నిమిత్తం, శివపూజన్ తన కుటుంబ సమేతంగా స్వగ్రామానికి వెళ్ళారు. జూలై 2021లో తన ట్యాక్సీ వేలం గురించి కృష్ణకాంత్ చెప్పినప్పుడు ముంబైకి తిరిగి వచ్చారు.
“జీవితంలో ఇప్పుడే అన్నీ నెమ్మదిగా మెరుగుపడుతున్నాయి. విష్ణుకి ఉద్యోగం ఉన్నందువలన 2018లో నాలాసోపారాలో చిన్న ఫ్లాట్ కొనుక్కోగలిగాము. అప్పుడు తనని చూసి చాలా గర్వపడ్డాను. కానీ ఆ తర్వాత, నా కొడుకును పోగొట్టుకున్నాను. ఇప్పుడేమో ఇది – నా ట్యాక్సీ వేలం వేయబడింది."
లాక్‌డౌన్‌కి ముందు, రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 వరకు అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణికులను తన ట్యాక్సీలో వారి వారి గమ్య స్థానాలకు చేర్చుతూ, శివపూజన్ నెలకు రూ.10,000-12,000 సంపాదించేవారు. ఆ తర్వాత, క్యాబ్ పార్క్ చేసి రైలులో ఇంటికి చేరుకునేవారు. లాక్‌డౌన్ మొదలయ్యాక, అతను ముంబైలో పని చేయలేదు; గత నెల – వేలం గురించి తెలిసిన వెంటనే మహానగరానికి వచ్చిన తర్వాత – మళ్ళీ తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు.
ఇక సంజయ్ మాలి విషయానికొస్తే, లాక్‌డౌన్‌కు ముందు వరకూ, అతను రోజూ దాదాపు రూ.600-800 వరకూ సంపాదించేవారు. వేలంలో తన క్యాబ్‌ని కోల్పోయాక, జూలై 2021లో కోవిడ్ రెండవ తరంగం నడుస్తున్నపుడు, అతను వారానికి రూ.1,800 కట్టి, ఒక అద్దె ట్యాక్సీ నడపడం మొదలుపెట్టారు. తను తీసుకున్న ఋణమెలా తీర్చాలని ఇప్పుడతనికి ఆందోళనగా ఉంది – సోదరి పెళ్ళి కోసం తీసుకున్న రూ.1 లక్షలో సగం మాత్రమే తిరిగి చెల్లించారు; పిల్లల స్కూల్ ఫీజులు కూడా ఉన్నాయి. “నేను పొదుపు చేసిన డబ్బంతా అయిపోయింది. ఏదో ఒక పని వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది,” అని సంజయ్ వాపోయారు.
ఉత్తర ముంబై, పోయ్‌సర్ ప్రాంతంలోని స్లమ్ కాలనీలో నివసించే అతని ఇంటికి నేను వెళ్ళినపుడు, దాదాపు మధ్యాహ్నం 2 గంటలకు సంజయ్ ఇంటికి చేరుకున్నారు. అద్దెకు తీసుకున్న ట్యాక్సీని మూడు రోజులు నడిపితే, కేవలం రూ.850 మాత్రమే సంపాదించగలిగారు. సాయంత్రం అతను మళ్లీ పనికి వెళ్ళాలి.
“మళ్ళీ పని చేయడం ప్రారంభించాక, అతను ప్రశాంతంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు,” అని సంజయ్ పక్కన కూర్చున్న అతని భార్య సాధన మాలి ఆందోళన పడుతూ అన్నారు. “అతనికి షుగర్ (డయాబెటిస్) ఉంది; కొన్ని సంవత్సరాల క్రితం, గుండెకు శస్త్రచికిత్స కూడా జరిగింది. తన మందుల ఖర్చు తగ్గించుకునేందుకు వాటిని వేసుకోవడం మానేయడమో, లేదా రోజుకు ఒక సారి మాత్రమే వేసుకోవడమో చేస్తున్నాడు. క్యాబ్ పోగొట్టుకున్న టెన్షన్ వల్ల అతను చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు.”
వారి కుమార్తె తమన్నా 9వ తరగతి, కుమారుడు ఆకాశ్ 6వ తరగతి చదువుతున్నారు; లాక్‌డౌన్ సమయంలో వారు తమ గ్రామం నుండే ఆన్‌లైన్ క్లాసులు కొనసాగించారు. కానీ, పోయ్‌సర్‌లో వారు చదివే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మాత్రం, గత ఏడాదికీ, ప్రస్తుత విద్యా సంవత్సరానికీ చెల్లించాల్సిన ఫీజులను (కొంత రాయితీ ఇచ్చిన తర్వాత) వెంటనే కట్టమని కోరింది. తమన్నాది గత ఏడాది ఫీజు మాత్రమే మాలి కుటుంబం చెల్లించగలిగింది. “ 6వ తరగతి ఫీజు చెల్లించలేకపోవడంతో, ఆకాశ్ (ఈ విద్యా సంవత్సరం) పాఠశాల మానేయాల్సి వచ్చింది. ఒక సంవత్సరం చదువు ఆగిపోతే కష్టమని అతను వాదిస్తున్నాడు. అది మాకు కూడా ఇష్టం లేదు,” అని సంజయ్ నిట్టూర్చారు.
గత ఏడాది తమన్నా ఫీజును మాత్రమే మాలి కుటుంబం చెల్లించగలిగింది. '6వ తరగతి ఫీజు చెల్లించలేకపోవడంతో, ఆకాశ్ (ఈ విద్యా సంవత్సరం) పాఠశాల మానేయాల్సి వచ్చింది. ఒక సంవత్సరం చదువు ఆగిపోతే కష్టమని అతను వాదిస్తున్నాడు'
ఉత్తర ముంబై, మరోల్ స్లమ్ కాలనీలో నివసిస్తున్న కృష్ణకాంత్ కొన్ని నెలలుగా తన గది అద్దె, నెలకు రూ.4,000లో కొంచం కొంచం మొత్తాన్ని మాత్రమే చెల్లించగలిగారు. అతని కుటుంబ సభ్యులలో చాలామంది వారి గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. మే, 2021లో మరణించిన తన తమ్ముడి ట్యాక్సీని – పాత కాలీ-పీలీ (నలుపు-పసుపు రంగు) వాహనం – అతను నడపడం ప్రారంభించారు. “నేను రోజుకు రూ.200-300 వరకు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను.” అన్నారు కృష్ణకాంత్
ట్యాక్సీ వేలం వేయబడడం వల్ల తనకు కలిగిన నష్టాన్ని సవాలు చేయాలని అతను నిర్ణయించుకున్నారు.
భారతీయ ట్యాక్సీ చాలక్ సంఘ్ అనే ట్యాక్సీ డ్రైవర్ల యూనియన్ అతనికి న్యాయవాదిని సమకూర్చడంలో సహాయం చేసింది. భద్రతా ప్రయోజనాల కోసం వేలం నిర్వహించడం సబబే అయినా, ఆ వేలాన్ని చేపట్టిన సమయం తప్పు- అని యూనియన్ వైస్-ప్రెసిడెంట్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
“కొన్ని నెలల క్రితం వరకు (మార్చి 2021 వరకు) మాకు కూడా నోటీసుల గురించి తెలియదు. మా ఆఫీసులు కూడా మూతపడ్డాయి. ఇది మా దృష్టికి వచ్చినప్పుడు, మేము పార్క్ చేయడానికి వేరే చోటును ఇవ్వాలని విమానాశ్రయ అధికారులను కోరాము. లాక్‌డౌన్‌లో డ్రైవర్లు తమ క్యాబ్‌లను ఎక్కడ పార్క్ చేయాలి? ఇంతవరకూ అధికారులనుంచి స్పందన లేదు. నోటీసుల గురించి తెలిశాక, నేను సదరు డ్రైవర్లను సంప్రదించడానికి ప్రయత్నించాను. అధికారులు డ్రైవర్ల ముంబై చిరునామాలకు మాత్రమే నోటీసులు పంపారు. ఇవి (నోటీసులు) గ్రామాలలో ఉన్నవారికి ఎలా చేరతాయి? ముంబైలో ఉన్నవారు మాత్రం తమ ట్యాక్సీలను పార్కింగ్ స్థలం నుండి తరలించారు.”
“కోర్టులో కేసు వేయడానికి వారికి సర్వ హక్కులు ఉన్నాయి. వేలం వేసిన ట్యాక్సీలను పార్క్ చేసిన ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని ప్రస్తుతం ఉపయోగించడం లేదు కానీ, అంత పెద్ద స్థలాన్ని ట్యాక్సీల కోసం కేటాయించడం సమంజసం కాదు. ఇప్పుడు ప్రయాణీకులు ఓలా, ఉబర్లను ఇష్టపడుతుండడంతో, (నలుపు-పసుపు) ట్యాక్సీలకు డిమాండ్ తగ్గింది. అయినా విమానాశ్రయం సమీపంలో ట్యాక్సీల కోసం చిన్న పార్కింగ్ స్థలం (ఇప్పటికీ పనిచేస్తోంది) అందుబాటులో ఉంది,” అని డాక్టర్ లాంబా తెలిపారు.
వేలం వేయబడిన 42 క్యాబ్‌ల యజమానులను సంప్రదించడానికి కృష్ణకాంత్ ప్రయత్నిస్తున్నారు (ఈ పనిలో సంజయ్ మాలి అతనికి సహాయం చేస్తున్నారు). “కొందరు ఇప్పటికీ తమ గ్రామాలలోనే ఉన్నారు; దాంతో వేలం గురించి వారికి తెలియదు. నాకు వాళ్ళందరూ తెలియకపోయినా వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. వేలం గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ, మరి వారికెవరు చెప్పాలి? ముంబై వచ్చేందుకు రైలు టిక్కెట్లు కొనడానికి కూడా కొంతమంది దగ్గర డబ్బు లేదు!”
ఒక న్యాయవాది తయారు చేసిన (ఫిర్యాదు) లేఖపై అతను కొంతమంది ట్యాక్సీ డ్రైవర్ల సంతకాలు సేకరించారు. జూలై 19వ తేదీ వేసివున్నఆ ఫిర్యాదును సహార్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చారు. “ అబ్ క్యా కరే (ఇప్పుడేం చేద్దాం)? నేను 12వ తరగతి పాస్ అయ్యాను కాబట్టి ఈ (చట్టపరమైన) పని చేస్తున్నాను. చలో (పోనీలే) నా చదువు ఇలా అయినా కొంత ఉపయోగపడుతోంది. నాకు వేరే దారి లేదు. నాకు న్యాయం తెలియకపోవచ్చు కానీ, వారు మా పొట్టకూటిని దెబ్బకొట్టారని మాత్రం తెలుసు. అది కేవలం ఒక ట్యాక్సీ కాదు, వాళ్ళు నా జీవనోపాధినే తీసుకుపోయారు,” అని రాత్రిపూట పాత ట్యాక్సీ నడుపుతున్న కృష్ణకాంత్ కన్నీళ్ళ పర్యంతం అయ్యారు.
పరిహారం కోసం, చట్టపరమైన చర్యల కోసం కృష్ణకాంత్, ఇతర డ్రైవర్లు ఎదురు చూస్తున్నారు. “రెండు నెలలుగా తిరుగుతున్నాను కానీ ఏం చేయాలో నాకు తెలియడం లేదు – కేసు వదిలేసుకోవాలా? అసలు ఫలితం దక్కుతుందా? నేను నిశ్శబ్దంగా మాత్రం ఉండిపోదలచుకోలేదు. కానీ, నాలో ఆశ చచ్చిపోతోంది!” అని కృష్ణకాంత్ అన్నారు.
అనువాదం: వై క్రిష్ణ జ్యోతి