"మేం దస్రా నాచ్ (దసరా నృత్యం)ని ప్రదర్శించబోతున్నాం," అన్నారు ఇత్వారి రామ్ మచ్చియా బైగా.
"ఈ నృత్యం దసరాతో మొదలై మూడు నాలుగు నెలలు - అంటే ఫిబ్రవరి, మార్చ్ నెలలవరకూ - కొనసాగుతుంది. దసరా పండుగను జరుపుకున్న తర్వాత మా సాటి బైగా గ్రామాలను సందర్శించి, రాత్రంతా నాట్యం చేస్తాం," అని ఈ ఛత్తీస్‌గఢ్ బైగా సమాజ్ అధ్యక్షుడు అన్నారు.
నర్తకుడూ, రైతు కూడా అయిన అరవయ్యేళ్ళ వయసు దాటిన ఈయన కబీర్ధామ్ జిల్లా, పండ్రియా బ్లాక్‌లోని అమానియా గ్రామంలో నివసిస్తారు. రాయపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న దేశీయ ఆదివాసీ నృత్యోత్సవాలలో పాల్గొనేందుకు ఇత్వారీజీ తన నాట్య బృందంలోని ఇతర కళాకారులతో కలిసి రాయపూర్ వచ్చారు.
బైగా సముదాయం ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు సమూహాలలో ఒకటైన ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహం (Particularly Vulnerable Tribal Group - PVTG)కు చెందినది. వీరు మధ్యప్రదేశ్‌లో కూడా నివసిస్తున్నారు
దస్రా నాచ్ (దసరా నృత్యం)లో సాధారణంగా 30 మంది - స్త్రీలూ పురుషులూ కలిసి - పాల్గొంటారు. గ్రామాల్లోనైతే ఈ నాట్యం చేసేవారి సంఖ్య వందలు దాటుతుంది," అంటారు ఇత్వారీజీ. అందరూ పురుషులతో ఉన్న బృందం ఏదైనా ఊరికి వెళ్ళినపుడు అక్కడున్న స్త్రీ బృందంతో నాట్యం చేస్తారనీ, అందుకు బదులుగా ఆ ఊరికి చెందిన పురుషుల బృందం తమకు అతిథులుగా వచ్చిన పురుష బృందం గ్రామానికి వెళ్ళి అక్కడి స్త్రీ బృందంతో కలిసి నాట్యం చేస్తారనీ ఆయన చెప్పారు.
"మేమెప్పుడూ పాడటాన్నీ, ఆడటాన్నీ ఆనందిస్తాం," అదే జిల్లాలోని కవర్ధా బ్లాక్ నుంచి వచ్చిన అనితా పండ్రియా అంటోంది. ఇత్వారీజీ బృందానికే చెందిన ఈమె కూడా ఆ నృత్యోత్సవంలో పాల్గొనటానికి వచ్చింది.
ఈ నృత్యం పాటలోనే ప్రశ్నలడిగి, పాటలోనే జవాబు చెప్పటంగా సంవాద రూపంలో ఉంటుంది.
బైగా నృత్యం బైగా గ్రామాలలో కనిపించే ఒక పాత సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రముఖ పర్యాటక స్థలాలో విఐపిలను అలరించడానికి ఈ బృందాలను తరచుగా పిలుస్తుంటారు. అయితే తమ ప్రదర్శనలకు తగినంత పారితోషికం ఇవ్వరని ఈ సముదాయం చెబుతోంది.
ముఖచిత్రం: గోపీకృష్ణా సోనీ
అనువాదం: సుధామయి సత్తెనపల్లి