ఎవరో ఒకరు ఏదో ఒకరోజున ఆ పాటలను విని తన ప్రతిభను మెచ్చుకుంటారన్న ఆశతో సన్తో తన పాటలను సోషల్ మీడియాలో పెడుతుంటాడు.
“ఏదో ఒకరోజున నేను నా పాటల ఆల్బమ్‌ను విడుదల చేస్తాను,” అంటాడు 24 ఏళ్ళ సన్తో తాఁతి. సన్తో అస్సామ్‌లోని జోర్హాట్ జిల్లా, సికోటా తేయాకు ఎస్టేట్‌లోని ఢేకియాజులి విభాగానికి చెందినవాడు.
సన్తో గాయకుడిగా మారాలని కలలు కంటూ పెరిగాడు. కానీ వాస్తవ జీవితం అందుకు భిన్నంగా ఉంది. అతను తన తండ్రికి చెందిన ఒక సైకిళ్ళు మరమ్మత్తు చేసే దుకాణంలో సహాయకుడిగా పనిచేస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు.
సన్తో తాఁతి ఒక ఆదివాసి - కానీ అతన్ని ఒక వర్గానికి మాత్రమే చెందినవాడని అనలేం. ఇంచుమించు ఒకటిన్నర శతాబ్దంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ల నుండి వలస వచ్చిన ఆదివాసీలు అస్సామ్ తేయాకు తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ సమూహాలకు చెందిన అనేకమంది వారసులు అక్కడి ఆదివాసీ తెగలతోనూ, ఇతర సామాజిక సమూహాలతోనూ కలిసిపోయారు. మొత్తం ఈ సమూహాలను తరచుగా 'తేయాకు తెగలు (టీ ట్రైబ్స్)' అని పిలుస్తుంటారు
వీరిలో దగ్గరదగ్గరగా 60 లక్లలమంది అస్సామ్‌లో నివసిస్తున్నారు. వీరిని వారివారి మూలరాష్ట్రాలలో షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించినప్పటికీ, ఇక్కడ వారికి ఆ హోదాను ఇవ్వటంలేదు. వీరిలో 12 లక్షల మంది రాష్ట్రంలోని 1000కి పైగా ఉన్న తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు.
వారి రోజువారీ జీవితాలలోని కష్టాలు, తీవ్రమైన శ్రమ వారిలో చాలామంది ఆకాంక్షలను తరచుగా అణిచివేస్తుంటాయి, కానీ సన్తో ఆశలను మాత్రం కాదు. అతను తన చుట్టూ ఉన్నవారి యాతనలను గురించే తాను పాడే ఝూమూర్ పాటలలో తెలియజేస్తుంటాడు. మనం తాగే ఒక కప్పు తాజా తేనీటి వెనుక ఉండే- తేయాకు తోటలలో ఎండకు ఎండి, వానకు తడిచి శ్రమించే వ్యక్తుల - కష్టాన్ని గుర్తుచేస్తాడు.
ఈ ఝూమూర్ గీతాలను సాదరీ భాషలో పాడతారు. ఇవి ఒక తరం నుండి మరొక తరం అందిపుచ్చుకుంటూ వస్తున్న పెన్నిధి. సన్తో పాడే పాటలు అతని తండ్రి లేదా మావయ్య కూర్చినవో, లేదా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, తరాల తరబడి ప్రయాణించి వినవచ్చిన పాటలనుంచి అందిపుచ్చుకున్నవో అయివుంటాయి. ఈ పాటలలో దేశంలోని రకరకాల ప్రాంతాల నుండి అస్సామ్ తేయాకు తోటలకు వలస వచ్చిన ఆదివాసీ తెగల కథలను గురించి ఉంటుంది. పాత ఇంటిని మరిచిపోయి కొత్త గూడు నిర్మించుకోవడం చేసిన ప్రయాణం గురించి ఉంటుంది. చిక్కని అడవులను, అదనుగా లేని నేలను బాగుచేసి వాటిని తేయాకు తోటలుగా మార్చిన కథలుంటాయి.
సంగీతంతో సన్తోకి ఉన్న అమితమైన అనుబంధాన్ని గురించి గ్రామస్తులు అతనిని అవమానపరుస్తుంటారు. అతని ఆకాంక్షలు ఎలాంటివైనా, చివరికి అతను తేయాకు తోటలలో ఆకులు ఏరుకుంటూ బతకవలసిందే అంటారు. అలాంటి మాటలు అతనిని కొంతమేరకు కుంగదీస్తాయి గానీ ఎక్కువకాలం నిలవవు. పెద్ద పెద్ద కలలను కనకుండా అతన్ని అవి ఆపలేవు. అదేవిధంగా సోషల్ మీడియాలో అమిత ఆశతో తన పాటలను నిరంతం అప్లోడ్ చేయడాన్ని కూడా ఆపలేవు.
అనువాదం: అపర్ణ తోట