"అవసరమైన కార్యకలాపాలు మినహా వ్యక్తుల కదలికలు రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ‘ఖచ్చితంగా నిషేధించబడతాయి'."
- హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ (ఇండియా టుడే, మే 17 నివేదించిన ప్రకారం)
సర్క్యులర్ లో 'ప్రయాణీకుల వాహనాలు మరియు అంతరాష్ట్ర బస్సుల కదలికను అనుమతించడం ద్వారా వలస కార్మికులకు ఉపశమనం' (రెండు పొరుగు రాష్ట్రాలు అంగీకరిస్తేనే) అని ఉండే. కానీ హైవేలపై లక్షలాది మంది నడక బాట పడ్తారని ఎక్కడా లేదు.
ఆ కర్ఫ్యూ నియమాలు వారిని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య నడిచేలా శాసించాయి. కాబట్టి వారి యాత్ర వేసవిలో అత్యంత వేడిగా ఉండే దశలో, 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలవద్ద జరిగింది.
ఒక నెల ముందు, తెలంగాణ మిరప పొలాల్లో పని చేసే జామ్లో మద్కం అనే 12 ఏళ్ల ఆదివాసి అమ్మాయి, లాక్డౌన్లో పని, ఆదాయం నిలిపివేసిన తరువాత ఛత్తీస్‌గఢ్‌లోని తన ఇంటికి చేరుకోవడానికి కాలినడకన బయలుదేరింది. ఈ అమ్మాయి మూడు రోజుల్లో 140 కిలోమీటర్లు నడిచి, తర్వాత ఆమె ఇంటికి 60 కిలోమీటర్ల దూరంలో అలసట వలన, శరీరం లో నీరు తగ్గిపోవడం(డీహైడ్రేషన్), కండరాల అలసట వలన చనిపోయింది. ఇలాంటి కర్ఫ్యూ ఉత్తర్వుల వలన ఇంకా ఎంత మంది జమ్లోలు ఉద్భావించాలి?
మొదటగా, ప్రధాన మంత్రి మార్చి 24 ప్రకటన 1.3 బిలియన్ మనుషులలో భయాందోళనలను రేకెత్తించింది. నాలుగు గంటలలో దేశం మూతపడబోతుంది అని తెలసి, ప్రతిచోటా వలస కార్మికులు కాలినడకన ఇంటికి వెళ్ళడం ప్రారంభించారు. తరువాత, పోలీసులు ఎవరినైతే లాఠీలతో కొట్టి సిటీ లోపలికి పంపలేకపోయరో, వారిని రాష్ట్ర సరిహద్దుల వద్ద అడ్డుకున్నారు. తరువాత ప్రజలపై క్రిమిసంహారక మందును పిచికారీ చేశారు. చాలామందిని 'రిలీఫ్ క్యాంప్'ల్లోకి పంపారు. ఇది ఎవరికి రిలీఫో చెప్పడం కష్టం.
ముంబై-నాసిక్ హైవే సాధారణ సమయాల్లో కంటే లాక్‌డౌన్‌లో రద్దీగా అనిపించింది. ప్రజలు ఏ ఎలా వీలయితే అలా ప్రయాణించారు. సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలును కోల్పోయిన బిమలేష్ జైస్వాల్ తన భార్య మరియు మూడేళ్ల కుమార్తెతో పాటు గేర్‌లెస్ స్కూటర్ పైన మహారాష్ట్రలోని పన్వెల్ నుండి మధ్యప్రదేశ్‌లోని రేవా వరకు 1,200 కిలోమీటర్లు ప్రయాణించాడు. "నాలుగు గంటల నోటీసుతో దేశాన్ని ఎవరు మూసివేస్తారు?" అని అతను అడుగుతాడు బిమలేష్, దానికి సమాధానం మీకు తెలుసుగా.
ఇంతలో, మేము ఇలా అన్నాము: "ప్రజలారా, మేము ప్రతి ప్రదేశానికి రైళ్లను నిర్వహిస్తాము, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము." ఆకలితో, నిరాశకు గురైన వ్యక్తుల నుండి కనికరం లేకుండా పూర్తి ఛార్జీలను మనము డిమాండ్ చేసాము. బిల్డర్‌లు మరియు ఇతర లాబీలు చేసేవారికి బందీ కార్మికులను పారిపోకుండా ఆపవలసిన అవసరం ఉన్నందున మేము ఆ రైళ్లలో కొన్నింటిని రద్దు చేసాము. అంతేగాక ఇతర వివాదాలు పెద్ద ఎత్తున రైలు సేవలను ప్రారంభించడాన్ని ప్రమాదకరంగా ఆలస్యం చేశాయి. మే 1 న శ్రామిక్ స్పెషల్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుండి 9.1 మిలియన్ల మంది కార్మికులు తమ స్వస్థలాలకు తరలించబడ్డారని మే 28 న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. రవాణా ఖర్చులు, కొన్ని సందర్భాల్లో ప్రయాణం మొదలయిన రాష్ట్రం భరిస్తే, కొన్నిసార్లు స్వీకరించే రాష్ట్రం భరించింది. (కేంద్రం నుండి ఇక్కడ సహకారం లేదు.)
ఇది మీకు ఒక చిన్న కోణాన్ని మాత్రమే ఇస్తుంది, ఏమి జరుగుతుందో దాని గురించి ఒక సంగ్రహావలోకనం మాత్రమే. ఆ రైళ్లలో ప్రయాణానికి నమోదు చేయడానికి ఇంకా ఎన్ని మిలియన్ల మంది ప్రయత్నిస్తున్నారో మాకు తెలియదు. హైవేలలో ఎన్ని మిలియన్ల మంది ఉన్నారో మాకు తెలియదు. వారు ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నారని మాత్రమే మాకు తెలుసు. దీనిని వ్యతిరేకించే శక్తివంతమైన లాబీలు ఉన్నాయని మాకు తెలుసు. వాస్తవానికి ఆ శ్రమను అరికట్టడం, క్రమశిక్షణ చేయాల్సిన అవసరం ఉంది అని వాళ్ళ భావన. అనేక రాష్ట్రాలు పని వేళలను 12 గంటలకు పొడిగించాయి, ఇందులో బిజెపి పాలిత ప్రాంతాలు మూడు అదనపు గంటలను ‘అదనపు సమయంగా’ నమోదు చేయలేదు. కొన్ని రాష్ట్రాలు కార్మిక చట్టాలను మూడేళ్లపాటు నిలిపివేశాయి.
ఏప్రిల్ 12 నాటికి, భారతదేశం అంతటా 1.4 మిలియన్ ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారని ప్రభుత్వం మనకు చెప్పింది. మార్చి 31 న అలాంటి శిబిరాలలో ఆ సంఖ్య రెట్టింపు అయింది. 'ఫుడ్ క్యాంప్‌లు', కమ్యూనిటీ కిచెన్‌లు, NGO ప్రయత్నాలు, వంటివి కలిపి ఏప్రిల్ 12 నాటికి 13 మిలియన్లు. అంటే మార్చి 31 కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఈ సంఖ్యలన్నీ కలిపినా కానీ విపత్తు యొక్క పూర్తి స్థాయిలో ఒక భాగం మాత్రమే అవుతాయి. ఈ రోజు నాటికి, సాధారణ ప్రజలు, వ్యక్తులు, సంఘాలు, పొరుగు ప్రాంతాలు, కార్యకర్త సమూహాలు, లాభాపేక్షలేని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వలసదారులు, ఈ సంక్షోభంపై పోరాడటానికి, కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వారిది ఖచ్చితంగా మరింత నిజాయితీయైన ఆందోళన.
మార్చి 19 మరియు మే 12 మధ్య, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టెలివిజన్‌లో ఐదుసార్లు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా 'ఫ్రంట్‌లైన్ యోధులను' గౌరవించడానికి గిన్నెలు మరియు పళ్లేలు కొట్టమని, దీపాలు వెలిగించమని, పూల రెక్కలు వెదజల్లమని ఆయన మనకు పిలుపునిచ్చారు. ఐదవ ప్రసంగంలో మాత్రమే ఆయన కార్మికుల గురించి ప్రస్తావించారు. 'వలస కూలీల' గురించి కేవలం ఒక్కసారి మాత్రమే. కావాలంటే వెళ్లి కనుక్కోండి.
వలసదారులు తిరిగి వస్తారా?
సంపాదనకు వేరే దారి లేకపోవడంతో చాలామంది కాలక్రమేణా తిరిగి వస్తారు. మనము ఎంచుకున్న అభివృద్ధి పథంలో దాదాపు మూడు దశాబ్దాలలో, మనము లక్షలాది జీవనోపాధులను కొల్లగొట్టాము, ఇప్పటికీ కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోబంలో 3,15,000 మంది రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు.
అన్ని విధాలుగా 'రివర్స్ మైగ్రేషన్స్' గురించి చర్చించండి. అయితే, మొదట వారు ఎందుకు తమ గ్రామాలను విడిచిపెట్టారు అని అడగండి.
1993 లో, మహబూబ్ నగర్ (ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా) నుండి ముంబైకి వారానికి ఒక బస్సు సర్వీసు ఉండేది. మే 2003 లో, నేను ఆ రద్దీగా ఉండే బస్సు ఎక్కినప్పుడు, ఆ మార్గంలో వారానికి 34 మంది ప్రయాణించేవారు. నెలాఖరు నాటికి ఆ సంఖ్య 45 కి పెరిగింది. నా తోటి ప్రయాణికులు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పతనంతో సతమతమవుతున్నారు. వారిలో, 15 ఎకరాల భూస్వామి, తన పొలంతో పని ఇక అయిపోయిందని, అతను ముంబైలో పని చేయాల్సిన అవసరం ఉందని నాకు చెప్పాడు. అదే బస్సులో అతని పక్కన కూర్చొని అతని వద్ద పనిచేసిన వెట్టి కార్మికుడు, అదే ప్రయాణం చేస్తున్నాడు.
అప్పుడు నాకు తట్టింది: మేమంతా ఒకే బస్సులో ఉన్నాం.
1994 లో, కేరళ రాష్ట్ర రవాణా కార్పొరేషన్ బస్సులు వయనాడ్ జిల్లాలోని మానంతవాడి నుండి కర్ణాటకలోని కుట్ట పట్టణం మధ్య చాల తక్కువగా నడుస్తుండే. వ్యవసాయ సంక్షోభం సంభవించే వరకు, నగదు పంట అధికంగా ఉండే వయనాడ్ వలసల జిల్లాగా ఉండేది. 2004 నాటికి, KSRTC కుట్టాకు ప్రతిరోజూ 24 ట్రిప్పులు నడుపుతోంది. వయనాడ్‌లో వ్యవసాయంతో పాటే పని కూడా ఎండిపోయింది.
ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. కానీ మనము మన వృద్ధి సంఖ్యలను చూపిస్తూ కాలయాపన చేశాము. ఇక్కడ నాకు ఎడ్వర్డ్ అబ్బే యొక్క ప్రసిద్ధ పంక్తి గుర్తువస్తోంది: 'పెరుగుదల కొరకు పెరుగుదల అనేది క్యాన్సర్ కణం యొక్క భావజాలం'. అయితే, మనము వేడుకలు చేసుకుంటూ ఉన్నపుడు,పెరుగుతున్న గ్రామీణ బాధలను సూచించే వారు ఎగతాళి చేయబడ్డారు.
చాలా మంది ఎడిటర్లు మరియు యాంకర్లు ఇప్పటికీ అర్ధం చేసుకోలేదు (వారి యంగ్ రిపోర్టర్లు అర్థం చేసుకుంటున్నట్లుగా తరచుగా అనిపించినప్పటికీ): వ్యవసాయ సంక్షోభం అంటే వ్యవసాయం గురించి మాత్రమే కాదు. అనుబంధ వృత్తుల్లోని మిలియన్ల మంది వ్యవసాయేతర జీవనాధారాలు-నేత కార్మికులు, కుమ్మరులు, వడ్రంగులు, లోతట్టు మత్స్యకారులు, ఇతరుల వృత్తులు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నప్పుడు-వ్యవసాయ సమాజం మొత్తం సంక్షోభంలోకి ప్రవేశిస్తుంది.
ఈ రోజు, గత 30 ఏళ్లలో మనం ఆర్పివేసిన జీవనోపాధి వైపు తిరిగి మరలాడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు.
మునుపటి 10 సంవత్సరాలలో గణనీయమైన స్థాయిలో వలసలు వచ్చినట్లు 2011 జనాభా లెక్కలు మనకు చెప్పినప్పుడు మీడియా తక్కువ ఆసక్తిని కనబరిచింది. 1921 తర్వాత మొదటిసారిగా, గ్రామీణ భారతదేశం కంటే పట్టణ భారతదేశం తన సంఖ్యకు ఎక్కువ మందిని జోడించిందని మనము తెలుసుకున్నాము. 1991 లో కంటే దేశంలో 15 మిలియన్ల మంది రైతులు (‘ప్రధాన’ సాగుదారులు) తక్కువగా ఉన్నారని మనము తెలుసుకున్నాము. సగటున: 1991 నుండి ప్రతిరోజూ 2,000 మంది రైతులు ప్రధాన సాగు హోదాను కోల్పోయారు.
సార్లగా చెప్పాలంటే భారీ విపత్తు వలసలు పెరుగుతూనే ఉన్నాయి. చాలా మంది వ్యవసాయం వదిలేసినా వారు పెద్ద నగరాలకు వెళ్లలేదు, వారు వ్యవసాయలో దిగువ తరగతిలోకి పడిపోయారు. జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయ కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వారందరూ వలస వచ్చిన మిలియన్ల మందితో చేరారు. వ్యవసాయంపై ఈ కొత్త ఒత్తిడి ఫలితం ఎలా ఉంటుంది? మీకు సమాధానం తెలుసు.
అయినా వారు ఎవరు?
పెద్ద నగరం కోసం ప్రతిఒక్కరూ ఒక చిన్న గ్రామాన్ని విడిచిపెట్టరు. ఖచ్చితంగా గ్రామాల నుండి పట్టణాలకు వెళ్ళే వలసదారులు చాలా మంది ఉన్నారు. కానీ గ్రామాల నుండి గ్రామాలకు వెళ్ళే వలసదారుల ప్రవాహం కూడా భారీగానే ఉంది. ఈ మార్చి-ఏప్రిల్‌లో, రబీ పంట పని కోసం ఇతర గ్రామాలు, జిల్లాలు మరియు రాష్ట్రాలకు వెళ్లే చాలా మంది వెళ్లలేకపోయారు. వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.
అప్పుడు పట్టణం నుండి పట్టణం వలసలు కూడా తీవ్రమైన సంఖ్యలో ఉన్నాయి. అయితే పట్టణం నుండి గ్రామీణ వలసదారుల సంఖ్య సాపేక్షంగా తక్కువ.
వారందరినీ మనం, మరీ ముఖ్యంగా 'ఫుట్‌లూస్ వలసదారులను' పరిగణించాలి. సెన్సస్ ఈ ప్రక్రియను పట్టుకోలేకపోతుంది. పని కోసం నిరాశగా వెతుకుతూ, ఎటువంటి స్పష్టమైన గమ్యం లేకుండా పేద ప్రజలు అనేక దిశల్లో నడుస్తున్నారు. బహుశా వారు రాయపూర్‌లో కొన్ని రోజులు రిక్షాలు లాగడానికి కలహండిని విడిచిపెట్టారేమో. బహుశా వారికి ముంబైలోని నిర్మాణ స్థలంలో 40 రోజుల పని పొందవచ్చేమో. సమీపంలోని జిల్లాలో పంట కోత కోసం వారు కొన్ని రోజులు పని చేస్తారేమో. బహుశా.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర సరిహద్దులను దాటిన వారి సంఖ్యలో, 54 మిలియన్ల వలసదారులు ఉన్నారు. కానీ అది చాలా తక్కువ అంచనా. జనగణన వలసలను ‘వన్-స్టాప్’ ప్రక్రియగా అర్థం చేసుకుంటుంది. వలసదారుడు పాయింట్ B కోసం పాయింట్ A ని వదిలిపెట్టి, కనీసం ఆరు నెలలు గణనలో ఉండాలి. ఉదాహరణకు ఆ వ్యక్తి ముంబైకి చేరుకునే ముందు, కొన్నేళ్లుగా తిరుగుతూ ఉండవచ్చు. ఆ ప్రయాణాల చిత్రం ఎన్నడూ నమోదుకాబడలేదు. సెన్సస్ లేదా జాతీయ నమూనా సర్వే, స్వల్పకాలిక లేదా దశల వారీ కదలికలను రికార్డ్ చేయడానికి సిద్ధంగా లేవు.
వలసదారులను కవర్ చేయడంలో మీడియా ఆధారాలు లేక, మార్చి 26 న మాత్రమే వారిని కనిపెట్టి గుర్తిస్తే, అది వారు ఇంతకాలం పట్టించుకోలేదు కాబట్టి అలా జరిగింది. వారికి ఈ విభాగం పై ఎలాంటి అవగాహనా లేదు. దీర్ఘకాలిక లేదా కాలానుగుణ, స్వల్పకాలిక లేదా వృత్తాకార, లేదా కాలినడక వలసదారుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేరు. డబ్బు సంపాదించడానికి డబ్బు లేని విభాగం పై శ్రద్ధ ఎందుకు పెట్టాలి?
*****
ఒకరి కంటే ఎక్కువమంది మంచి మనసున్న వ్యక్తులు నాకు చెప్పారు: వలస కార్మికుల పరిస్థితి భయంకరమైనది. మనము వారికి సహాయం చేయాలి. వీళ్ళు అన్ని కష్టాలలోనూ ఉంటూ, కష్టపడి పనిచేసే వ్యక్తులు. వీళ్ళు ఆ ఫ్యాక్టరీ కార్మికులు, వారి యూనియన్‌ల వలె ఎల్లప్పుడూ ఇబ్బందులను తెచ్చే వాళ్ళు కాదు. ఈ వ్యక్తులు మన సానుభూతికి అర్హులు, అని.
ఖచ్చితంగా. మనకు వీలైనప్పుడు కరుణ చూపడం సరైనదే. కానీ వలస కూలీలకు మన సానుభూతి, ఆందోళన లేదా కరుణ అవసరం లేదు. వారికి న్యాయం కావాలి. వారి హక్కులు నిజమైనవి, గౌరవించబడవలసినవి. అవి అమలు చేయబడటం అవసరం. ఆ భయంకరమైన ఫ్యాక్టరీ కార్మికులలో కొంతమందికి ఏవైనా హక్కులు ఉంటే, అది వారు వ్యవస్థీకృతం కావడం, కొంత సమిష్టి బలం ఉండడం, బేరసారాల శక్తిని కలిగి ఉండటం వలన మాత్రమే. ఎల్లపుడు ప్రతిఘటించే ఆ సంఘాలకు ధన్యవాదాలు. 'వలస కార్మికుల' పట్ల మీ సానుభూతి కరుణ, సౌందర్యం మరియు షరతులకు మించి ఉంటే, న్యాయం కోసం, వారి హక్కుల కోసం భారతదేశంలోని కార్మికులందరి పోరాటాలకు మద్దతు ఇవ్వండి.
వలసదారులు, ఇతర కార్మికుల మధ్య వ్యత్యాసం చాలా విచిత్రమైనది. 'వలస కార్మికుడు' అనే పదంలోని కార్యాచరణ పదం 'కార్మికుడు'. ఇన్ఫోసిస్ CEO తన బెంగళూరు ప్రధాన కార్యాలయాన్ని వదిలిపెట్టి, మంచి అవకాశాల కోసం ఢిల్లీకి వెళితే, అతను వలసదారుడు, కానీ కార్మికుడు కాదు. కులం, తరగతి, సామాజిక మూలధనం, పరిచయాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం జాలిని కురిపించే వలస కూలీలకు, వలస వచ్చిన ఉద్యోగస్థుడికి తేడా ఉంటుంది. మనల్నిచిరాకుపెట్టే ఇతర భయంకరమైన కార్మికులు, మనతో ఎదురుతిరిగి మాట్లాడేవారు, మొహమాటం లేకుండా వారి హక్కులను డిమాండ్ చేసేవారు- వీరంతా మునుపటి తరాల వలసదారులు.
ముంబైలోని మిల్లు కార్మికులు, తొలినాళ్లలో ఎక్కువగా కొంకణ్ మరియు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చే వారు. తరువాత, దేశంలోని ఇతర ప్రాంతాల రావడం మొదలైంది. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో డాక్టర్ రవి దుగ్గల్ అసాధారణమైన అవగాహన వ్యాసంలో ఎత్తి చూపినట్లుగా, 1896-97 బుబోనిక్ ప్లేగు సంభవించినప్పుడు కూడా, కార్మికులు ఒకసారి ముంబై నుండి పారిపోయారు. మొదటి ఆరు నెలల్లో ముంబైలో 10,000 మందికి పైగా మరణించారు. 1914 నాటికి, ప్లేగు వ్యాధి భారతదేశం అంతటా ఎనిమిది మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంది.
"నగరంలోని 850,000 మొత్తం జనాభాలో, మిల్లు కార్మికులు 80,000 మంది ఉన్నారు" అని దుగ్గల్ రాశాడు. "ప్లేగు నియంత్రణ చర్యల కింద వేధింపులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇందులో శానిటైజేషన్, క్వారంటైన్, అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులను నిస్సహాయ పరిస్థితులలో వేరు చేయడం, వారి నివాసాలను నాశనం చేయడం వంటివి కూడా ఉన్నాయి. వారు 1897 ప్రారంభంలో అనేక సార్లు సమ్మెకు దిగారు. ప్లేగు ప్రారంభమైన మూడు నాలుగు నెలల్లో, అనేక మంది, మిల్లు కార్మికులతో సహా 400,000 మంది ప్రజలు బొంబాయి నుండి తమ గ్రామాలకు పారిపోతూ నగరాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు.”
తరువాత చాలామందిని ఏ కారణం వలన తిరిగి వచ్చారు? "చాలా మంది మిల్లు యజమానులు గృహనిర్మాణం, మెరుగైన పని మరియు జీవన పరిస్థితులు (సర్కార్ 2014) ద్వారా యజమాని మరియు ఉపాధి మధ్య బంధాన్ని నిర్మించడానికి నౌరోస్జీ వాడియా సూచించిన వ్యూహాన్ని అనుసరించారు. ప్లేగు అంటువ్యాధిగా మారినప్పటికీ, ఈ ఒప్పందం కార్మికులను తిరిగి బొంబాయికి తీసుకువచ్చింది. ఈ ప్లేగు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నపుడు మాత్రమే అంతం అయింది.
పార్లమెంట్ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని బొంబాయి ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్‌ను సృష్టించింది. మునిసిపల్ కార్పొరేషన్ మరియు ప్రభుత్వం, ఖాళీగా ఉన్న అన్ని భూములను ఈ ట్రస్ట్‌కు అప్పగించారు. తర్వాత ఈ ట్రస్ట్ నగరంలోని పారిశుధ్యాన్ని, జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రయత్నించింది. కాని ఆ ప్రయత్నాలు కూడా అంత ప్రకాశవంతంగా ఏమి లేవు: ఇది కొన్ని నివాసాలను సృష్టించింది కానీ అవి నిర్మించిన వాటికంటే ఎక్కువగా ధ్వంసం చేసినవే ఎక్కువ. కానీ కనీసం మెరుగుదల చేద్దాం అనే ఆలోచన ఉండే. అయితే అప్పుడు ఆ ఆలోచన 'నగరం' మరియు దాని ఇమేజ్ మెరుగుదల అన్నట్టుగా మారింది. అసలు శ్రమ పడిన పేద మరియు అట్టడుగు వర్గాల వాస్తవ జీవితాలు, వారి పరిస్థితుల గురించి మాత్రం కాదు.
ప్లేగు తగ్గుముఖం పట్టడంతో పేదల పట్ల కరుణ నశించింది. అది ఈ రోజుల్లో కూడా జరుగుతోంది. ఈ మార్చిలో అకస్మాత్తుగా వారి సేవలను కోల్పోయాము కాబట్టి వలసదారుల దయనీయ పరిస్థితులను మనము చూడగలిగాము. కానీ సౌకర్యం తిరిగి వచ్చినప్పుడు మనలో ఆ సానుభూతి ఆవిరైపోవడానికి కూడా అలవాటు పడ్డాము.
1994 లో సూరత్‌లో ప్లేగు వ్యాధి 54 మందిని బలిగొనింది. ఆ కాలంలో డయేరియా వల్ల ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ భారతీయ శిశువులు, క్షయవ్యాధి వలన 450,000 మనుషులు జబ్బు పడేవారు. కానీ సూరత్‌లో చికిత్స నయం చేయగల ఈ రెండు సమస్యల కంటే ప్లేగు, మీడియా దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది.
ఆ ప్లేగు త్వరగా కనుమరుగైపోయాక, మనము ప్రధానంగా పేదలను చంపే వ్యాధులను నిర్లక్ష్యం చేశాము. దానితో పాటే వారి జీవన పరిస్థితులు బట్టి , మనకన్నా వారు వ్యాధులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న వాస్తవం కుడా మర్చిపోయినాము.
కోవిడ్ -19 కి ముందు కాలంలో కూడా, మన ‘సమ్మిళిత’ అభివృద్ధి, 'స్మార్ట్ సిటీల' దృష్టిని కలిగి ఉండే. ఈ దృష్టి ప్రస్తుత జనాభాలో 3 నుండి 5 శాతం వారికి మాత్రమే సేవలందించి, మిగిలిన వారిని హీనస్థితికి తీసుకెళ్ళి అనారోగ్యంలోకి వదిలివేస్తుంది.
గ్రామాల నుండి వలస వచ్చినవారు, నగరంలో మెరుగైన వేతనాలు పొందవచ్చు, కానీ వారి జీవన స్థితి మరియు ఆరోగ్య పరిస్థితులు, ముఖ్యంగా మహిళల, పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
వీటన్నింటి గురించి మనం ఏదైనా చేయగలమా? పుష్కలంగా. అయితే ముందుగా మనం యధావిధిగా వ్యాపారానికి తిరిగి వెళ్లాలనే భావనను వీడాలి. మన గడిచిన 30 సంవత్సరాల మార్కెట్ వేదాంతశాస్త్ర మూఢనమ్మకాలను, వాటి శిబిరాలను పారద్రోరాలి. భారత రాజ్యాంగం నిర్దేశించిన స్థితిని నిర్మించాలి. అక్కడ పౌరులందరికీ సరి అయిన తులమనంలో "న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ" హక్కులు ఉంటాయి.
ముఖచిత్రం: సుదర్శన్ సఖార్కర్
ఈ వ్యాసం మొదటగా ఇండియా టుడేలో మే 30, 2020 న ప్రచురించబడింది.
అనువాదం: జి. విష్ణు వర్ధన్