పాదాల కింద పచ్చటి గడ్డి, పైన వెల్లడిగా ఉన్న ఆకాశం, చుట్టూ ఆకుపచ్చని చెట్లు, అడవుల గుండా ప్రశాంతంగా ప్రవహించే నీటి ప్రవాహం - ఇలాంటి ప్రదేశం గ్రామీణ మహారాష్ట్రలో ఎక్కడైనా ఉండవచ్చు.
ఒక్క నిముషం, గీత ఏదో చెప్తున్నారు... ప్రవాహాన్ని చూపిస్తూ ఆమె ఇలా చెప్పారు: “మేం స్త్రీలం ఎడమవైపుకు, పురుషులు కుడివైపుకు వెళ్తాం.” కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆమె వస్తీ (బస్తీ) వాసులు చేసుకున్న ఏర్పాటది.
"వర్షాలు కురుస్తున్నప్పుడు గొడుగు పట్టుకొని చీలమండల లోతున ఉన్న నీటిలో కూర్చోవాలి. ఇక (నా) బహిష్టు సమయంలో పరిస్థితి ఎలా వుంటుందో ఏం చెప్పగలను?" 40 ఏళ్ళ గీత చెప్పారు
పుణే జిల్లా, శిరూర్ తాలూకా లోని కురుళీ గ్రామ శివారులో ఆమె నివసించే బస్తీలో 50 ఇళ్ళున్నాయి. ఇది భీల్, పార్ధీ కుటుంబాలు నివాసముండే బస్తీ. మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరించబడిన ఈ రెండు ఆదివాసీ తెగలు రాష్ట్రంలోని అత్యంత పేద, అత్యంత వెనుకబడిన సమూహాలలో భాగంగా ఉన్నాయి.
భీల్ తెగకు చెందిన గీత, ఇలా బహిరంగ ప్రదేశంలో మరుగుదొడ్డికి వెళ్లడం వల్ల తనకు ఎదురయ్యే అసౌకర్యం గురించి నిక్కచ్చిగా చెప్తున్నారు, "కూర్చున్న చోట గడ్డి గుచ్చుకుంటుంది, దోమలు కుడతాయి... ఇక ఎల్లవేళలా పాము కాటు భయం ఉండనే ఉంటుంది."
ఈ బస్తీలో నివసించేవారు అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటుంటారు - ముఖ్యంగా మహిళలు, అడవుల్లోకి వెళ్లే మార్గంలో ఎవరైనా దాడి చేస్తారేమోననే భయంతో ఉంటారు.
"మేం పొద్దున్నే నాలుగు గంటలకే లేచి గుంపులుగా వెళ్తుంటాము. కానీ ఎవరైనా వస్తే (దాడిచేస్తే) ఎలాగా అనే ఆలోచన..." భీల్ ఆదివాసీ, 22 ఏళ్ళ స్వాతి అంటుంది
గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే వారి బస్తీ, కురుళీ గ్రామ పంచాయత్ క్రిందకు వస్తుంది. స్థానిక సంస్థలకు ఎన్నిసార్లు విన్నవించినా, ఈ బస్తీకి ఇప్పటికీ విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు లేవు. "వారు ( పంచాయితీ ) ఎప్పుడూ మా బాధలను గురించి వినరు, పట్టించుకోరు" అంటారు దాదాపు 70 ఏళ్ల వయస్సున్న విఠాబాయి.
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన 39 శాతం మంది ఆదివాసులకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు; ఊరికి దూరంగా ఈ బస్తీలో నివాసముండేవారు సైతం ఇందులో భాగమే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ( NFHS- 5 ) ప్రకారం, గ్రామీణ మహారాష్ట్రలో 23 శాతం కుటుంబాలు “ఏ పారిశుద్ధ్య సౌకర్యాన్ని ఉపయోగించవు; వారు బహిరంగ ప్రదేశాలనో లేదా పొలాలనో ఉపయోగిస్తారు."
కానీ, "గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించడం అనే అసాధ్యమైన పనిని ఎస్‌బిఎమ్ (జి) 100 శాతం సాధించింది. మొదటి దశ (2014-2019) సమయంలోనే భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చింది." అని స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) నాటకీయంగా ప్రకటించింది .
విఠాబాయి తన జీవితంలో ఎక్కువ భాగం కురుళీ గ్రామం పొలిమేరలో ఉన్న ఈ బస్తీలోనే గడిపారు. ఆమె మాకు ఒక చెట్టును చూపిస్తూ, “ఈ మొక్కను నాటింది నేనే. ఇప్పుడిది చెట్టయింది, దీన్నిబట్టి మీరు నా వయస్సును లెక్కేయండి. మల విసర్జన కోసం అక్కడికి (అడవికి) ఎన్ని సంవత్సరాలుగా వెళ్తున్నానో కూడా లెక్కించండి," అన్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి