ఎనభైరెండేళ్లకి అరిఫా అంతా చూసేసింది. ఆమె ఆధార్ కార్డులో ఆమె జన్మదినం జనవరి 1, 1938 అని ఉంది. అది ఖచ్చిమైన తేదీనో కాదో ఆమెకు తెలియదు, కాని ఆమెకు 16 యేళ్లున్నప్పుడు, ఇరవయ్యేళ్లు పైబడ్డ రిజ్వాన్ ఖాన్ కు రెండవ భార్యగా హర్యాణా నూహ్ జిల్లాలో బివాన్ గ్రామానికి వచ్చింది. “మా అక్క, (రిజవాన్ మొదటి భార్య), ఆమె ఆరుగురు పిల్లలు దేశం విడిపోయేటప్పుడు జరిగిన తొక్కిసలాటలో చనిపోయాక, మా అమ్మ నన్ను రిజ్వాన్ కి ఇచ్చి పెళ్లిచేసింది,” అంటూ గుర్తుకు తెచ్చుకుంది అరీఫా.

ఆమెకు మహాత్మా గాంధీ మేవత్ లోని ఒక గ్రామానికి వచ్చి ముస్లిం వర్గాలను దేశం నుండి వెళ్లిపోవద్దని చెప్పటం లీలగా జ్ఞాపకముంది. ప్రతి డిసెంబర్ 19న, హర్యాణాలోని మియో ముస్లింలు నూహ్ జిల్లాలో ఘసేర గ్రామంలో గాంధీ తమ  గ్రామానికి వచ్చిన రోజును మేవత్ దివస్ గా జరుపుకుంటుంటారు. (నూహ్ ని మేవత్ అని 2006 వరకు పిలిచేవారు)

అరఫాకి, తన తల్లి తనను కూర్చుండబెట్టుకుని రిజ్వాన్ ని ఎందుకు పెళ్లిచేసుకోవాలో వివరించడం ఇంకా స్పష్టంగా గుర్తుంది. “అతనికి మరేమి మిగలలేదు, అని మా అమ్మ చెప్పింది. మేరీ మా ముఝే ఉసే దియా ఫిర్ (మా అమ్మ నన్ను అతనికి ఇచ్చింది)”, అన్నది అరఫా, బివాన్ తన గ్రామంగా ఎలా మారిందో చెబుతూ. ఈ గ్రామం ఆమె పెరిగిన  రేతోరా గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు గ్రామాలు ఒకే జిల్లాలో ఉన్నాయి. మన దేశంలో అతితక్కువ అభివృద్ధి సూచికలు ఉన్న జిల్లాలలో ఇది ఒకటి.

దేశ రాజధాని నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీవాన్, ఫెరోజేపుర్ ఝిర్ఖ  బ్లాక్ లో ఆరావళి కొండల మొదలులో, హర్యాణా, రాజస్థాన్ సరిహద్దులలో ఉంది. ఢిల్లీ నుండి నుహ్‌కు వెళ్లే రహదారి ,దక్షిణ హర్యాణాలోని గురుగ్రామ్ నుండి వెళుతుంది, ఇది భారతదేశంలో మూడవ అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం. కాని దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల  జాబితాలో ఇది 44వ స్థానంలో ఉంది. అరిఫాలాగా, ఇక్కడ ఉండే వారి జీవితాలలో పచ్చని పొలాలు, ఎండిపోయిన కొండలు, పేలవమైన మౌలిక సదుపాయాలు, నీటి కొరత ఉంటాయి.

మియో ముస్లిం సమాజం, ఎక్కువ భాగం హర్యాణాలో, అలానే పొరుగున ఉన్న రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లా జనాభాలో 79.2 శాతం మంది ముస్లింలు ఉన్నారు ( సెన్సస్ 2011 ).

1970వ దశకంలో, ఆరిఫా భర్త రిజ్వాన్, బివాన్ నుండి నడక దూరంలో ఉన్న ఇసుక, రాయి, సిలికా గనులలో పని చేయడం ప్రారంభించాడు. ఆరిఫా ప్రపంచం అంతా కొండల చుట్టూనే ఉండేది. ఆమెకున్నప్రధానమైన పనులలో మొదటిది, నీటిని తీసుకురావడం. 22 సంవత్సరాల క్రితం, రిజ్వాన్ చనిపోయాక, అరిఫా తనను, తన ఎనిమిది మంది పిల్లలను పోషించుకోవడానికి పొలాల్లో పనిచేసేది. అప్పట్లో రోజుకు 10 నుండి 20 రూపాయిలు వచ్చేవి. "మావాళ్లు, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనగలిగితే, అల్లానే వారిని చూసుకుంటాడు అంటారు," అని ఆమె చెప్పింది.

Aarifa: 'Using a contraceptive is considered a crime'; she had sprained her hand when we met. Right: The one-room house where she lives alone in Biwan
PHOTO • Sanskriti Talwar
Aarifa: 'Using a contraceptive is considered a crime'; she had sprained her hand when we met. Right: The one-room house where she lives alone in Biwan
PHOTO • Sanskriti Talwar

ఆరిఫా: 'గర్భనిరోధకాన్ని ఉపయోగించడం నేరంగా చూస్తారు’; మేము కలిసినప్పుడు ఆమె చేయి బెణికి ఉంది. కుడి: బివాన్‌లో ఆమె ఒంటరిగా నివసించే ఒక గది ఇల్లు

ఆమె నలుగురు కూతుర్లకు పెళ్లయి వేరే గ్రామాలలో ఉంటున్నారు. ఆమె నలుగురు కొడుకులు అదే గ్రామంలో వారి వారి కుటుంబాలతో దగ్గరలోనే ఉంటున్నారు. అందులో ముగ్గురు రైతులు, నాలుగోవారు ఒక ప్రైవేట్  కంపెనిలో పనిచేస్తున్నారు. అరిఫా తన ఒక గది ఇంట్లో ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంది. ఆమె పెద్ద కొడుకుకు 12 మంది పిల్లలున్నారు. అరిఫా తనలానే తన కోడళ్లు కూడా గర్భనిరోధక సాధనమేది వాడరని చెప్పింది. “12 మంది పిల్లలు పుట్టాక, దానంతట అదే ఆగిపోతుంది, మా మతంలో గర్భనిరోధకం వాడడం నేరం” అన్నది.

రిజ్వాన్ వృద్దాప్యం వలన చనిపోయినా, మేవత్ లో ఉన్నఎందరో ఆడవారు వారి భర్తలను టిబి వలన కోల్పోయారు. బివాన్ లో ఉన్న 957 నివాసితులలో టిబి వలన చనిపోయిన వారు కొందరున్నారు. అందులో బహార్ భర్త డానిష్ (అసలు పేరు కాదు) కూడా ఉన్నాడు. నలభైఏళ్లుగా ఉంటున్న అదే ఇంట్లో ఉంటున్న బహార్, 2014 నుండి టిబి వలన తన భర్త ఆరోగ్యం క్షీణించడం చూసింది. “అతనికి ఛాతి నొప్పి వచ్చేది, చాలా సార్లు దగ్గుతున్నప్పుడు రక్తం వచ్చేది.” అని ఆమె గుర్తుకు తెచ్చుకుంది. ఇప్పుడు దాదాపుగా 60 యేళ్లున్న బహార్, పక్కపక్క ఇళ్లలో ఉన్న ఆమె ఇద్దరు చెల్లెళ్లూ, ముగ్గురూ తమ భర్తలను అదే ఏడాది కోల్పోయారు. “అందరూ మా రాత అలా ఉండడం వలన వారిని పోగొట్టుకున్నామంటారు. కాని మాకు కొండల వలెనే ఇలా జరిగింది అనిపిస్తుంది. ఇవి మమ్మల్ని నాశనం చేశాయి.” అన్నది బహార్.

(2002లో, ఫరీదాబాద్, ఇంకా ఆ పొరుగు ప్రాంతాలలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిన తరువాత, సుప్రీం కోర్ట్ హర్యాణాలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధించింది. SC నిషేధ ఉత్తర్వు పర్యావరణ నష్టానికి మాత్రమే. ఇందులో TB గురించి ప్రస్తావించలేదు. కేవలం వృత్తాంత ఖాతాలు, కొన్ని నివేదికలు మాత్రమే ఈ రెండింటినీ అనుసంధానిస్తున్నాయి.)

బివాన్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూహ్ జిల్లా హెడ్ క్వార్టర్లోని  PHCలో, అక్కడ పనిచేసే పవన్ కుమార్, మాకు, 2019లో టిబి వలన చనిపోయిన 45 ఏళ్ళ వాయిజ్ పేరు నమోదు చేయబడి ఉండడానికి చూపించాడు. రికార్డులను బట్టి, బివాన్ లో ఇంకో ఏడుగురు టిబి తో బాధపడుతున్నారు. “ఇంకా చాలామంది ఉండవచ్చు, కానీ వారు ఇక్కడికి వచ్చి చూపించుకోరు,” అన్నాడు పవన్ కుమార్.

వాయిజ్ కు 40 ఏళ్ళ ఫైజాతో పెళ్లయింది(అసలు పేర్లు కావు). “నౌగాన్వాలో పని దొరకలేదు.” అని ఆమె రాజస్థాన్ లో భారతపూర్ జిల్లాలోని తన ఊరి గురించి చెప్పింది. “నా భర్తకు బివాన్ లో ఉన్న మైన్ల పని గురించి తెలిసి వచ్చాడు. ఆ తరవాత ఏడాది నేను కూడా వచ్చేశాను. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము.” ఫైజా 12 మంది పిల్లలను ప్రసవించింది. అందులో నలుగురు, నెలలు నిండక ముందే పుట్టి చనిపోయారు. “ఒకడికి కూర్చునే వయసు వచ్చేసరికి, ఇంకొకడు పుట్టేవాడు,” అన్నదామె.

ఆమె, అరిఫా, ఇద్దరూ నెలకు వచ్చే, 1800 రూపాయిల విధవల పింఛను మీదే ఆధారపడి ఉన్నారు. వారికి పని చాలా తక్కువసార్లు దొరుకుతుంది. “పని కావాలని అడిగితే, మేము చాలా బలహీనంగా ఉన్నామని చెబుతారు. ఇది 40 కిలోలుంది, కైసే ఉఠాయియెగి యే ?(దీనిని ఎలా ఎత్తగలవు)”, అని వారు తరచూ పడే మాటలను అనుకరిస్తూ అన్నది హదియా. కాబట్టి వారికొచ్చే ప్రతి రూపాయి దాచుకుంటారు. నూహ్ లో ఉన్న PHC వరకు చేరడానికి ఆటో రిక్షాకు 10 రూపాయిలు ఖర్చవుతాయి. ఆ పది రూపాయిలు వారి వేరే అవసరాలకు ఉపయోగపడొచ్చు. అందుకని వారు అంత దూరం నడుస్తారు. “మేము డాక్టర్ని కలవాలన్నా అందరు ముసలివాళ్లను ఒకచోటకు చేర్చి, కలిసి నడుస్తాం. దారిలో చాలాసార్లు ఆగి కూర్చుని కాస్త స్థిమిత పడి మళ్లీ నడుస్తాము. రోజంతా  ఇలానే గడుస్తుంది,” అన్నది హదియా.

Bahar (left): 'People say it happened because it was our destiny. But we blame the hills'. Faaiza (right) 'One [child] barely learnt to sit, and I had another'
PHOTO • Sanskriti Talwar
Bahar (left): 'People say it happened because it was our destiny. But we blame the hills'. Faaiza (right) 'One [child] barely learnt to sit, and I had another'
PHOTO • Sanskriti Talwar

బహార్ (ఎడమ): 'మా రాత ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగిందని ప్రజలు అంటున్నారు. కానీ మేము కొండల వలెనే ఇలా అయ్యాము.’ ఫైజా (కుడి) 'ఒక [పిల్లవాడు] కూర్చోవడం నేర్చుకున్నాడో లేదో, నాకు మరొకడు పుట్టేవాడు’

చిన్నపిల్లగా ఉన్నప్పుడు హదియా ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. హర్యాణాలోని సోనిపట్ లో వాళ్ల అమ్మ పని చేసే  పొలాలే ఆమెకు అన్నీ నేర్పాయి, అంటుంది ఆమె. ఆమెకు పదిహేనేళ్ల వయసులో ఉన్నప్పుడు  ఫాహిద్ తో  పెళ్లిచేశారు. ఫాహిద్ అరావళి కొండల్లో మైనింగ్ పనికి వెళ్లినప్పుడు, హదియా అత్తగారు, హదియాకు ఖుర్ప (కత్తిరించే పరికరం) ఇచ్చి పొలాల్లో కలుపు తీయమని  చెప్పింది.

2005 లో ఫాహిద్ చనిపోయాక, హదియా జీవితమంతా పొలాలలో కష్టపడడం, అప్పు తీసుకోవడం, తీర్చడం వీటితోనే  సరిపోయింది. “నేను పగళ్లు పొలాల్లో పని చేసి వచ్చి, రాత్రుళ్లు పిల్లలను చూసుకునేదాన్ని. ఫకిమీ జేసి హాలాత్ హోగయి థీ (నాది ఫకీర్ వంటి జీవితం అయిపొయింది)”, అన్నది

“పెళ్ళయిన ఒక ఏడాదికే నాకు ఒక కూతురు పుట్టింది. ఆ తరవాత మిగిలిన వారు 2-3 ఏళ్లకు ఒకసారి పుట్టారు. పెహెలె కా శుద్ధ్ జమానా థా (ఇదివరకు అంతా పవిత్రంగా ఉండేది)”, నలుగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్న హదియా, గతంలో పునరుత్పత్తి, ప్రసవాల పై ఆడవారికి ఏ అవగాహన లేకపోవడం గురించి అన్నది.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC) వద్దనున్న సీనియర్ మెడికల్ ఆఫీసర్, గోవింద్ శరన్ కూడా ఆ సమయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ముప్ఫయేళ్ల క్రితం ఆయన ఈ PHCలో పనిచేయడం ప్రారంభించారు. ఇదివరకు కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడడానికి ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పూర్తిగా అలా లేదు. “ఇదివరకు కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడితే కుటుంబాలకి కోపం వచ్చేది. ఇప్పుడు మియో వర్గాలలో, కాపర్ టి వాడాలో వద్దో ఆ జంట నిర్ణయించుకుంటారు. కాని ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా జాగ్రత్తపడతారు. చాలాసార్లు ఆడవారు, ఈ  విషయాన్ని వారి అత్తగార్లకు చెప్పవద్దని బతిమాలతారు,” అన్నారు శరన్.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16) ప్రకారం, ప్రస్తుతం 15-49 సంవత్సరాల వయస్సు గల వివాహిత మహిళల్లో కేవలం 13.5 శాతం మంది మాత్రమే నుహ్ జిల్లాలో (గ్రామీణ) కుటుంబ నియంత్రణ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. నూహ్ జిల్లాలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) హర్యాణా రాష్ట్రంలోని 2.1 తో పోలిస్తే ఎక్కువగా, 4.9 (సెన్సస్ 2011) ఉంది. నుహ్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో, 15-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 33.6 శాతం మాత్రమే అక్షరాస్యులు, దాదాపు 20-24 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో ఇంచుమించుగా 40 శాతం మంది 18 సంవత్సరాల కంటే ముందే వివాహం చేసుకున్నారు. ఇందులో 36.7 శాతం మందికి మాత్రమే సంస్థగత ప్రసవాలు జరిగాయి.

నూహ్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో కాపర్-టి వంటి గర్భాశయం పరికరాలను 1.2 శాతం కన్నా ఎక్కువమంది  వాడలేదు. ఇందుకు ఒక కారణం- శరీరంలో ఇమిడ్చే కాపర్ టి ని పరాయి వస్తువుగా చూడడం. “అటువంటి  ఏదైనా వస్తువుని శరీరంలోకి చొప్పించడం వారి మతంలో  తప్పుగా చూస్తారని తరచుగా చెబుతారు,” అన్నది సునీతా దేవి. ఈమె నూహ్ PHCలో ఆక్సిల్లరీ  మిడ్ వైఫ్ నర్స్(ANM)గా పనిచేస్తుంది.

Hadiyah (left) at her one-room house: 'We gather all the old women who wish to see a doctor. Then we walk along'. The PHC at Nuh (right), seven kilometres from Biwan
PHOTO • Sanskriti Talwar
Hadiyah (left) at her one-room house: 'We gather all the old women who wish to see a doctor. Then we walk along'. The PHC at Nuh (right), seven kilometres from Biwan
PHOTO • Sanskriti Talwar

హదియా (ఎడమ) ఆమె ఒక గది ఇంట్లో: 'డాక్టర్‌ని చూడాలనుకునే వృద్ధులందరినీ ఒక చోట చేర్చి, అప్పుడు అందరము కలిసి నడుస్తాము.’ బివాన్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో నుహ్ (కుడి) వద్ద ఉన్న PHC

అయినాగాని NFHS -4 చెప్పినట్లుగా, కుటుంబ నియంత్రణ లేకపోవడం వలన, 29. 4 శాతం ఆడవారు గర్భనిరోధకాలు వాడకపోయినా, తర్వాత కలిగే గర్భాన్నిమాత్రం వీలైనంత వాయిదా వేయడానికి లేక పిల్లలు కనకుండా ఉండడానికి సుముఖంగా ఉన్నారు.

“సామాజిక ఆర్ధిక కారణాల వలన, నూహ్ లో ముస్లింలు ఎక్కువగా ఉండడం వలన, కుటుంబ నియంత్రణ వైపు అక్కడున్న ప్రజలు అంతగా మొగ్గుచూపడం లేదు. అందుకే అక్కడ ఎక్కువగా అవసరం ఉన్నా నియంత్రణ జరగడం లేదు. సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. బచ్చే తో అల్లాహ్ కె దేన్ హై (దేవుడు పిల్లలను ఇస్తాడు) అని వారు అంటారు,” అన్నారు డా. రుచి. ఈమె కుటుంబ సంక్షేమంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు(ఆమె తన ఇంటి పేరుని వాడరు). “భార్య భర్త వెళ్లి తనకోసం పిల్ తెస్తే తప్ప దానిని వాడదు.  కాపర్ టి పెట్టుకుంటే దారం వేలాడుతుంది(అనుకుంటారు).  కానీ ఇప్పుడు అంతరా ఇంజక్షన్ వచ్చాక, పరిస్థితి మెరుగుపడింది. ఏ మహిళ అయినా దగ్గరలో ఆరోగ్య కేంద్రానికి వెళ్లి డోసు తీసుకోవచ్చు.”

అంతర అనేది ఇంజెక్షన్  ద్వారా ఇచ్చే గర్భనిరోధకం, దీని ఒక డోసు మూడు నెలల పాటు  గర్బం రాకుండా నిరోధిస్తుంది. హర్యాణాలో ఈ గర్భనిరోధకానికి చాలా ఆదరణ ఉంది. 2017లో, ఇంజక్షన్ ద్వారా గర్భనిరోధకాన్ని అందుకున్న మొదటి రాష్ట్రం హర్యాణానే. అప్పటి నుండి, 16,000 మంది ఆడవారు దీనిని ఉపయోగించారని ఒక వార్తాకథనం చెబుతోంది. ఇది 2018-19 లో ఆ విభాగం పెట్టుకున్న 18,000 టార్గెట్ లో 92.3 శాతం.

మైనారిటీ వర్గాలలో, కుటుంబ నియంత్రణ పై ఉన్న మతపరమైన నిషేధాలతో పాటుగా ఉన్నవేరే ఇతర కారణాలకు పరిష్కారంగా ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల ఉదాసీన వైఖరి, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం దీర్ఘంగా వేచి ఉండవలసి రావడం కూడా స్త్రీలు గర్భనిరోధకంపై చురుకుగా సలహాలు తీసుకోకుండా నిరోధిస్తున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

2013 అధ్యయనం లో CEHAT (సెంటర్ ఫర్ ఎంక్వైరీ ఇన్ హెల్త్ అండ్ అలైడ్ థీమ్స్, ముంబైలో ఉంది) ఆరోగ్య సౌకర్యాలలో మతం ఆధారిత వివక్షను అన్వేషించడానికి వివిధ వర్గాలకు చెందిన ఆడవారి అభిప్రాయాలను సేకరించారు. ఈ అధ్యయనం ద్వారా ఆర్ధిక తరగతి ఆధారంగా మహిళలందరి పైన వివక్ష ఉన్నప్పటికి, ముస్లిం మహిళల కుటుంబ నియంత్రణ పద్ధతులు, వారి వర్గం పై ప్రతికూల వ్యాఖ్యలు, లేబర్‌రూమ్‌లలో అమర్యాదపూర్వక ప్రవర్తనను ఎక్కువగా అనుభవిస్తారని తెలిసింది.

Biwan village (left) in Nuh district: The total fertility rate (TFR) in Nuh is a high 4.9. Most of the men in the village worked in the mines in the nearby Aravalli ranges (right)
PHOTO • Sanskriti Talwar
Biwan village (left) in Nuh district: The total fertility rate (TFR) in Nuh is a high 4.9. Most of the men in the village worked in the mines in the nearby Aravalli ranges (right)
PHOTO • Sanskriti Talwar

నుహ్ జిల్లాలోని బివాన్ గ్రామం (ఎడమవైపు): నుహ్‌లో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) అత్యధికంగా, 4.9 ఉంది. బివాన్‌లోని చాలా మంది పురుషులు సమీపంలోని ఆరావళి శ్రేణులలో (కుడివైపు) గనులలో పనిచేశారు

CEHAT కోఆర్డినేటర్ సంగీతా రేగే మాట్లాడుతూ, "ప్రభుత్వ కార్యక్రమాలు గర్భనిరోధక విధానాలను ఎంచుకోవడానికి చాలా  సాధనాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, సాధారణంగా ఆరోగ్య కార్యకర్తలే మహిళలందరి తరుఫున ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముస్లిం కమ్యూనిటీకి చెందిన మహిళలు ఎదుర్కునే ఇబ్బందులను అర్ధం చేసుకుని, వారికి తగిన గర్భనిరోధక సాధనాలను ఎంచుకునేందుకు వారితో చర్చించడం చాలా అవసరం,” అన్నారు.

నూహ్ లో కుటుంబ నియంత్రణ పెద్దగా పాటించకపోయినా, NFHS-4(2015-16) ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో అసలు గర్భనిరోధకాలు వాడని 7. 3 శాతం ఆడవారికి, కుటుంబ నియంత్రణ గురించి తెలియపరచడానికి ఏ ఆరోగ్య కార్యకర్త వీరి వద్దకు రాలేదు.

28 ఏళ్ళ ఆశ వర్కర్ సుమన్ గత పదేళ్లుగా బీవన్ లో పనిచేస్తోంది. ఆమె తరచుగా గర్భనియంత్రణ గురించిన నిర్ణయం ఆడవారికే వదిలేస్తానని, వారు తన వద్దకి వచ్చి ఏది అడిగితే అదే చేస్తానని చెప్పింది. అక్కడ ఆరోగ్య సదుపాయాలూ కూడా దుర్భరంగా ఉన్నాయి, అందువలన ఆరోగ్య సేవ కూడా అందుబాటులో లేదు, అన్నది సుమన్. ఇది అందరు ఆడవారి మీద, అందులోనూ వృద్ధులైన ఆడవారి మీద, బాగా ప్రభావం చూపిస్తుంది.

“నూహ్ లో ఉన్న PHC కి వెళ్ళడానికి మూడుచక్రాల వాహనం కోసం గంటల తరబడి వేచి ఉండాలి,” అన్నది సుమన్. “కుటుంబ నియంత్రణ వరకు ఎందుకు? ఆరోగ్య సమస్య ఉన్న  వారిని ఒప్పించి ఆసుపత్రికి తీసుకురావడమే చాలా కష్టమైన పని. వాళ్లకు నడవడానికి అలసటగా ఉంటుంది. నేను నిస్సహాయురాలిని.” అన్నది.

దశాబ్దాలుగా ఇక్కడ ఇలానే ఉంది. ఈ నలభయేళ్లపైగా ఆమె ఇక్కడ ఉన్న సమయంలో ఏమి మారలేదు, అన్నది బహార్. ఆమె పిల్లల్లో ఏడుగురు నెలలు నిండక ముందే పుట్టడం వలన చనిపోయారు. ఆ తర్వాత పుట్టిన ఆరుగురు బతికారు. “ఆ సమయంలో ఇక్కడ ఆసుపత్రులు ఉండేవి కావు, మా గ్రామంలో అప్పటికి ఇంకా ఆరోగ్య కేంద్రం పెట్టలేదు.” అన్నదామె.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా?  ఐయితే  [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected] కి కాపీ చేయండి.

అనువాదం: అపర్ణ తోట

Anubha Bhonsle

अनुभा भोंसले एक स्वतंत्र पत्रकार हैं, और साल 2015 की पारी फ़ेलो रह चुकी हैं. वह आईसीएफ़जे नाइट फ़ेलो भी रही हैं, और मणिपुर के इतिहास और आफ़्स्पा के असर के बारे में बात करने वाली किताब ‘मदर, व्हेयर्स माई कंट्री’ की लेखक हैं.

की अन्य स्टोरी Anubha Bhonsle
Sanskriti Talwar

संस्कृति तलवार, नई दिल्ली स्थित स्वतंत्र पत्रकार हैं और साल 2023 की पारी एमएमएफ़ फेलो हैं.

की अन्य स्टोरी Sanskriti Talwar
Illustration : Priyanka Borar

प्रियंका बोरार न्यू मीडिया की कलाकार हैं, जो अर्थ और अभिव्यक्ति के नए रूपों की खोज करने के लिए तकनीक के साथ प्रयोग कर रही हैं. वह सीखने और खेलने के लिए, अनुभवों को डिज़ाइन करती हैं. साथ ही, इंटरैक्टिव मीडिया के साथ अपना हाथ आज़माती हैं, और क़लम तथा कागज़ के पारंपरिक माध्यम के साथ भी सहज महसूस करती हैं व अपनी कला दिखाती हैं.

की अन्य स्टोरी Priyanka Borar
Series Editor : Sharmila Joshi

शर्मिला जोशी, पूर्व में पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया के लिए बतौर कार्यकारी संपादक काम कर चुकी हैं. वह एक लेखक व रिसर्चर हैं और कई दफ़ा शिक्षक की भूमिका में भी होती हैं.

की अन्य स्टोरी शर्मिला जोशी
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

की अन्य स्टोरी Aparna Thota