ద్రౌపది సబర్ కన్నీళ్ళను ఆపుకోలేక, చీరకొంగుతో తన కళ్ళను ఒత్తుకుంటూనే ఉన్నారు. ఒడిశాలోని గుడ్‌భేలీ గ్రామంలోని ఆమె ఇంటి బయట ఆమె మునిమనవళ్లు మూడేళ్ల గిరీశ్, తొమ్మిది నెలల విరాజ్ ఆమెకు సమీపంలోనే నిశ్శబ్దంగా ఆడుకుంటున్నారు. తన మనవరాలు తుల్సా చనిపోయిందని రోదిస్తున్న ఆ 65 ఏళ్ల వృద్ధురాలిని ఓదార్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
"ఇప్పుడెవరిని 'నా బిడ్డా' అని పిలిచేది?", ఆమె ప్రత్యేకించి ఎవరినీ అడుగుతున్నట్టులేరు.
నువాపాడా జిల్లాలోని ఖరియార్ బ్లాక్‌లో సగం కట్టిన తమ ఇటుక ఇంటి ముందు ప్లాస్టిక్ చాపపై సబర్ ఆదివాసీ వర్గానికి చెందిన తుల్సా కుటుంబసభ్యులు కూర్చొని ఉన్నారు. తుల్సా ఆకస్మిక మరణ దుఃఖం నుంచి బయటపడేందుకు ఈ కుటుంబం ప్రయత్నిస్తోంది. తుల్సా తల్లితండ్రులు - తల్లి పద్మిని, తండ్రి దేబానంద్ - పసివాళ్ళైన తమ కుమార్తె పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. అందులోనూ విరాజ్, తల్లి చనిపోయేనాటికి ఇంకా పాలు మరవని చంటిబిడ్డ. "నా కోడలు పద్మిని, నేనూ ఈ పిల్లలను చూసుకుంటున్నాము" అని ద్రౌపది చెప్పారు.
ఆ పసిపిల్లల తండ్రి, తుల్సా భర్త అయిన 27 ఏళ్ల భోసింధు ఇంటిదగ్గర లేరు. అతను అక్కడికి 500 కిలోమీటర్ల దక్షిణాన ఉన్న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని రంగాపూర్ అనే గ్రామంలో ఒక ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. అతను 2021 డిసెంబర్‌లో తన తల్లి, తుల్సా చెల్లెలు దీపాంజలితో కలిసి ఆరు నెలలపాటు ఇటుక బట్టీలో పని చేయడానికి అక్కడికి వెళ్లారు. వీరు రోజుకు దాదాపు రూ. 200 సంపాదించాలి.
జనవరి 24, 2022 రాత్రి, 25 ఏళ్ల తుల్సా సబర్ గుడ్‌భేలీలోని తల్లిదండ్రుల ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చనట్‌మాల్ గ్రామంలోని తన ఇంట్లో ఉన్నారు. రాత్రి 8 గంటల సమయంలో కడుపునొప్పి తీవ్రంగా ఉందని ఆమె చెప్పారు. "నేనామెను ఖరియార్ [పట్టణం]లోని సబ్-డివిజనల్ ఆసుపత్రికి తీసుకెళ్లాను" అని ఆమె మామ, 57 ఏళ్ల దస్మూ సబర్ చెప్పారు. “అక్కడి వైద్యుడు పరిస్థితి తీవ్రంగా ఉందని, నువాపాడాలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లమని అన్నారు. కానీ మేము అక్కడికి చేరుకునే సమయానికే, తుల్సా చనిపోయింది."
ప్రజారోగ్య వ్యవస్థ అయిన ఆసుపత్రికి చేరాలంటే చాలా దూరం ప్రయాణించాలి - ఖరియార్‌కు 20 కిలోమీటర్లు, అక్కడినుండి నువాపాడాకు మరో 50 కిలోమీటర్లు - ఒడిశాలోని ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు ఇది అసాధారణమైన విషయమేమీ కాదు. గ్రామీణ ఒడిశాలోని ఈ ప్రాంతాల్లో ఉన్న 134 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (CHC) నిపుణులైన డాక్టర్ల కొరత కారణంగా, అత్యవసర సమయాలలో ప్రజలు బ్లాక్ లేదా జిల్లా ప్రధాన కార్యాలయానికి వెళ్లవలసి వస్తుంది.
రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2019-20 ప్రకారం, ఒడిశాలోని ఆదివాసీ ప్రాంతాల్లోని సిఎచ్‌సిలలో కనీసం 536 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు - ఫిజిషియన్లు, సర్జన్లు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు - అవసరం. కానీ ఆ సంఖ్యకు ఇంకా 461 మంది తక్కువగానే ఉన్నారు. మూడంచెల గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల వ్యవస్థలోని అత్యున్నత ఆరోగ్య సౌకర్యం అయిన సిఎచ్‌సి, సగటున లక్ష మందిలోపు ప్రజలకు మాత్రమే సేవలు అందిస్తోంది.
తుల్సా మరణించే సమయానికి ఆమె భర్త ఎక్కదో దూరంగా తెలంగాణలో ఉండటం, ఆమె కుటుంబ సభ్యుల దుఃఖాన్ని మరింత ఎక్కువ చేసింది.
27 ఏళ్ల భోసింధు తన భార్య అంత్యక్రియలు చేయడానికి రాలేకపోయారు. "అతని భార్య మరణం గురించి నేను నా కొడుకుతో చెప్పాను. అతను యజమానిని సెలవు కోసం అడిగాడు, కానీ యజమాని అనుమతించ లేదు" అని దస్మూ చెప్పారు. పెద్దపల్లి నుండి తన కుటుంబం తిరిగి వచ్చే ఏర్పాటు చేయాలని స్థానిక లేబర్ కాంట్రాక్టర్ (లేదా సర్దార్ )కు అతను చేసిన విజ్ఞప్తులు ఫలించలేదు.
భోసింధుతో సహా గ్రామానికి చెందిన సుమారు 60 మందిని తెలంగాణలోని ఇటుక బట్టీలలో పనిచేయడానికి పంపిన సర్దార్ , భోసింధు కుటుంబానికి అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ. 111,000 తిరిగి చెల్లించమని అడిగాడు. ఇటుక బట్టీ యజమాని అడుగుతాడని సాకులు చెప్పాడు.
*****
భోసింధు లాగానే, నువాపాడాకు చెందిన సబర్ (శబర్ అని కూడా పిలుస్తారు) కమ్యూనిటీ నుండి చాలామంది ఆదివాసులు పని కోసం వలసపోతారు. తక్కువకాలానికో లేదా ఎక్కువ కాలనికో, లేదా కాలానుగుణంగా- ప్రత్యేకించి వారికి పెద్ద ఖర్చుల కోసం డబ్బులు అవసరమైనప్పుడు ఇలా వలసపోతుంటారు. జిల్లాలో దాదాపు సగభాగం అడవులతో కప్పబడి ఉంది. సంప్రదాయకంగా ఇక్కడి ఆదివాసీ సమాజాలు ఇప్ప (మహువా) పువ్వులు, చార్ (చిరోంజి) గింజలు వంటి కలపేతర అటవీ ఉత్పత్తులను (NTFP- non timber forest produce) విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉన్నాయి. వారు వర్షాధార పంటల వ్యవసాయాన్ని కూడా చేస్తారు. అయినప్పటికీ కరవు, తగినంత వర్షపాతం లేని కారణంగా అటవీ ఉత్పత్తులు ఆదాయాన్నివ్వటంలేదు, వర్షాధార వ్యవసాయం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. జిల్లాలో సాగునీరు దాదాపుగా లేదు.
" ఖరీఫ్ సీజన్ తర్వాత సాధారణ వ్యవసాయ పనులు అందుబాటులో లేనప్పుడు, మా ఏకైక ఆశ ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ (MGNREGA). కానీ వారి చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో ఇతర అవకాశాల కోసం వెతకవలసి వస్తుంది" అని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం కింద తన కుటుంబ అనుభవం గురించి దస్మూ చెప్పారు. “నా కొడుకు, నా భార్య రోడ్డు అభివృద్ధి ప్రాజెక్ట్‌లో పనిచేశారు. కానీ వారి వేతనాలు ఇంతవరకూ చెల్లించలేదు. మొత్తం బకాయి దాదాపు 4,000 రూపాయలు ఉంది,” అని ఆయన చెప్పారు.
ఖరీఫ్ సీజన్‌లో కూడా ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని దస్మూ పొరుగున ఉండే రవీంద్ర సాగరియా చెప్పారు. "అందుకే ఈ ప్రాంతం యువకులు ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుండి వలసలుపోతారు" అని ఆయన చెప్పారు. ఈసారి గ్రామం నుంచి పనికి వెళ్లిన 60 మందిలో దాదాపు 20 మంది యువకులేనని ఆయన చెప్పారు.
నువాపాడాలోని సబర్ ఆదివాసులలో కేవలం 53 శాతం మాత్రమే అక్షరాస్యులు.ఇది గ్రామీణ ప్రాంత ఒడిశా సగటు 70 శాతం కంటే చాలా తక్కువ. కొంత పాఠశాల విద్య ఉన్నవారు పనుల కోసం ముంబై దారి పడతారు. కానీ, మిగతావారు రోజువారీ కూలీని సంపాదించడానికి ఇటుక బట్టీలకు కుటుంబ ఉమ్మడి శ్రమను తాకట్టు పెడతారు. ఈ బట్టీలలో వారు అమానవీయ పరిస్థితుల్లో రోజుకు 12 గంటల పాటు వేడి ఇటుకలను తలపై మోస్తారు.
స్థానిక సర్దార్ లు నైపుణ్యం లేని కార్మికులకు ఇటుక బట్టీలలో సుమారు ఆరు నెలల నిర్ణీత కాలానికి ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తారు. వారికి మొత్తం రావలసిన వేతనంలో కొంత భాగాన్ని ముందుగానే చెల్లిస్తారు. భోసింధు కుటుంబానికి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి డబ్బు అవసరం. కాబట్టి వారు ఈ ఉద్యోగం కోసం నమోదు చేసుకున్నారు.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద తమకు ఇల్లు కేటాయించారని, “అయితే మంజూరైన 1.3 లక్షల రూపాయలు ఇల్లు పూర్తి చేయడానికి సరిపోలేదని,” దస్మూ చెప్పారు. ఈ కుటుంబం జూన్ 2020 వరకు ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ కింద పనిచేసి రూ. 19,752 పొదుపుచేసుకున్నారు. కానీ ఇంకా వారికి లక్ష రూపాయలు అవసరం. "మేము అప్పు తీసుకున్నాం. దానిని తిరిగి చెల్లించడానికి మాకు సర్దార్ నుండి డబ్బు అవసరమయింది" అని అతను చెప్పారు.
2021 సంవత్సరంలో ఈ కుటుంబానికి ఇదే మొదటి అప్పు కాదు. గర్భం దాల్చడంవల్ల తుల్సా అనారోగ్యం పాలయ్యారు. విరాజ్ నెలలు నిండకుండానే పుట్టాడు. పుట్టిన తర్వాత మొదటి మూడు నెలల్లో, తల్లీబిడ్డలు రెండు ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఒకటి, నువాపాడాలోని జిల్లా ప్రధాన ఆసుపత్రి; రెండోది 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంబల్‌పూర్‌లోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్.
"వైద్య ఖర్చుల కోసం మేము మాకున్న ఒకటిన్నర ఎకరాల భూమిని 35,000 రూపాయలకు తాకట్టు పెట్టాము. తుల్సా తన స్వయం సహాయక బృందం (SHG) ద్వారా 30,000 రూపాయల బ్యాంక్ లోన్ తీసుకుంది" అని దస్మూ చెప్పారు. ఈ అప్పులు తీర్చేందుకే ఆ కుటుంబం గతేడాది డిసెంబర్‌లో కాంట్రాక్టర్ నుంచి అడ్వాన్స్ తీసుకుని తెలంగాణకు వెళ్లిపోయింది.
ఒడిశాలోని అతిపేద జిల్లాల్లో నువాపాడ ఒకటి. ఇక్కడి నుండీ, రాష్ట్రంలోని ఇతర దక్షిణ, పశ్చిమ జిల్లాల నుండీ కూడా ప్రజలు పనుల కోసం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్నాటకలకు వలస వెళుతున్నారని భారతదేశంలో అంతర్గత వలసలపై జరిగిన ఒక అధ్యయనం తెలిపింది. ఒడిశా నుండి దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు వలస పోతున్నారు. వారిలో రెండు లక్షల మంది బలంగీర్, నువాపాడా, కలహండి, బౌధ్, సుబర్ణపూర్, బర్‌గఢ్ జిల్లాల నుండి వలస వస్తున్నారని ఒక స్థానిక ఎన్జిఓ సేకరించిన డేటాను ఉటంకిస్తూ, ఈ అధ్యయనం తెలియజేస్తోంది.
సంబల్పూర్ నగరంలో ఉన్న వాటర్ ఇనిషియేటివ్ ఒడిశా వ్యవస్థాపకుడు, ప్రముఖ కార్యకర్త రంజన్ పాండా వలస కార్మికుల సమస్యలను నిశితంగా పరిశీలించారు. "ఈ ప్రాంత ప్రజలు పరస్పరం సంబంధం ఉన్నఅనేక కారకాల వల్ల - ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల - ప్రమాదాలనూ, అసహాయ పరిస్థితులనూ ఎదుర్కొంటున్నారు. సహజ వనరులు నిరంతరం క్షీణించిపోవడం, స్థానిక ఉపాధి పథకాల వైఫల్యం కూడా ఉంది." అని ఆయన చెప్పారు.
*****
“మీరు ఆమెను చూసే ఉంటారు. అందంగా ఉండేది” అని ద్రౌపది మనవరాలి గురించి కన్నీళ్లు పెట్టుకున్నారు.
చనిపోవడానికి ముందు తుల్సా, రాష్ట్రంలో (ఫిబ్రవరి 16 నుండి 24 వరకు) జరిగిన 2022 పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ అరడా గ్రామ పంచాయితీ లోని గ్రామ గ్రామానికీ తిరిగారు. ఆదివాసీలు అధికంగా ఉండే గ్రామమైన చనట్‌మాల్, అరడా పంచాయతీ పరిధిలోకి వస్తుంది. తుల్సా సమితి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సీటు షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళా అభ్యర్థికి రిజర్వ్ చేయబడింది. తుల్సా తన గ్రామంలో పాఠశాల విద్య పూర్తిచేసిన ఏకైక ఆదివాసీ మహిళ. స్వయం సహాయక బృందానికి కూడా నాయకత్వం వహిస్తున్నందున ఆమెకు ప్రజాదరణ ఉంది. "మా బంధువులు ఆమెను పోటీ చేయమని ప్రోత్సహించారు" అని దస్మూ చెప్పారు.
ఎన్నికలలో పోటీ చేయవద్దని తుల్సాకు ద్రౌపది సలహా ఇచ్చారు. "ఆమె ఆరు నెలల క్రితమే తన అనారోగ్యం నుంచి కోలుకుంది, అందుకని నేను వ్యతిరేకించాను" అని బాధలో ఉన్న అమ్మమ్మ చెప్పారు. "ఆమె దాని కారణంగానే మరణించింది."
వలసల ప్రభావం ఎన్నికలపై కూడా పడుతుందని ఖరియార్ బ్లాక్‌లోని బర్‌గాఁవ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసిన స్థానిక నాయకుడు సంజయ్ తివారీ అన్నారు. ముఖ్యంగా పేద వర్గాల ఓటర్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెప్పారు. నువాపాడా జిల్లాలో లక్ష మందికి పైగా వలసదారులు ఓటు వేయలేకపోయారని, వారిలో 300 మంది బర్‌గాఁవ్‌కు చెందినవారని ఆయన అంచనా వేశారు.
"మన దేశంలో ఎన్నికలను పండుగల్లాగా జరుపుకుంటామని మనం చెప్పుకుంటుంటాం. కాని తమ ప్రియమైన దగ్గరివారి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఇంటికి తిరిగి వచ్చేందుకు కూడా అనుమతి దొరకని భోసింధు, అతని తల్లి వంటి వలసదారులకు, ఇదేమీ కాదు" అని తివారీ అన్నారు.
జిల్లాలో ఉపాధి అవకాశాలను తగ్గించిన కోవిడ్-19 లాక్‌డౌన్‌లు తనను వలస వెళ్లేలా చేశాయని భోసింధు పొరుగువారైన సుభాష్ బెహెరా నమ్ముతున్నారు. "ఇక్కడ ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండుంటే, ఎన్నికల్లో పోరాడటానికి తన భార్యను ఒంటరిగా వదిలి అతను పనికోసం బట్టీలకు వెళ్ళుండేవాడు కాదు," అని ఆయన అన్నారు.
"ఎక్కడికెళ్ళిపోయావు నా చిట్టితల్లీ? ఎందుకు మమ్మల్ని వదిలేసిపోయావు?"
తుల్సా కోసం ద్రౌపది చేస్తున్న ఆర్తనాదాలు ఒక పెద్ద సమాజపు దుఃఖాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి.
*****
పోస్ట్‌స్క్రిప్ట్: తుల్సా మరణించిన ఒక వారం తర్వాత, జర్నలిస్ట్ అజిత్ పాండా ఒడిశా ముఖ్యమంత్రి, నువాపాడా జిల్లా కలెక్టర్, రామగుండం పోలీసు కమిషనర్‌ల అధికారిక హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేస్తూ తుల్సా కుటుంబ పరిస్థితి గురించి ట్వీట్ చేశారు. పోలీసులు భోసింధు, అతని తల్లి, దీపాంజలి ఎక్కడ ఉన్నారో 24 గంటల్లో గుర్తించి, వారిని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు పంపమని ఇటుక బట్టీ యజమానికి చెప్పారు. మిగిలిన ఇద్దరూ తిరిగి వస్తారని నిర్ధారించుకోవడానికి దీపాంజలి అక్కడే ఉండాలని బట్టీ యజమాని పట్టుబట్టాడు కానీ, చివరకు అధికారిక ఒత్తిడికి లొంగి వారిని విడిచిపెట్టాడు.
తుల్సా కుటుంబసభ్యులు ముగ్గురినీ వారిని పనికి పంపించిన సర్దార్ రాయ్ పూర్ లో కలిశాడు . అక్కడి నుండి వారిని చనట్ మాల్ లోని వారి ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని బలంగీర్ జిల్లాలోని కాంటాబంజి స్టేషన్ కు రైలులో తీసుకువచ్చాడు . అడ్వాన్సుగా చెల్లించిన డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి , అదే ఇటుక బట్టీలో తిరిగి పనికి వస్తామని అంగీకరిస్తూ , ఖాళీ కాగితంపై సంతకం చేయమని రైల్వేస్టేషన్ లో తమను అడిగారని దస్మూ చెప్పారు .
అనువాదం: సుధామయి సత్తెనపల్లి