లక్షలాది మనుషులకు నీటిపై, విద్యుత్తుపై కత్తెర వేయడం, అలా చేయడం ద్వారా వారిని తీవ్రమైన అనారోగ్యానికి గురి చేయడం, పోలీసులను పారా మిలటరీలను కట్-ఆఫ్ జోన్లలోకి తీసుకురావడం, అర్ధంలేని విపరీతమైన ఆంక్షలు విధించడం, జర్నలిస్టులు నిరసనకారులను చేరుకోవడం దాదాపుగా అసాధ్యమయేట్లు చేయడం, గత రెండు నెలల్లో తమలో ఇప్పటికే 200 మంది(అందులో ఎక్కువమంది శీతోష్ణ స్థితి వలన చనిపిపోయిన వారే) చావుని దగ్గరగా చూసిన రైతులను శిక్షించడం- ప్రపంచంలో ఎక్కడైనా ఇది మానవ హక్కుల పై సాగే అనాగరికమైన దాడిగా కనిపిస్తుంది.
కానీ మనలను పాలించే మన ప్రభుత్వం దీని కన్నా ముఖ్యమైన వ్యవహారాల గురించి ఊపిరి సలపనంత పనిలో ఉంది. భూమిపై ఉన్న ఒక గొప్ప దేశాన్ని కించపరిచిన, అవమానించిన భయంకరమైన ప్రపంచ ఉగ్రవాదులైన రిహన్న, గ్రెటా థన్‌బెర్గ్ యొక్క కుట్రను ఎలా ఛేదించాలి అనే ముఖ్యమైన ఆందోళనలలో మనం, మన ప్రభుత్వం మరియు పాలకవర్గం మునిగిపోయాము.
ఇదంతా గనక కథ అయ్యుంటే చాలా హాస్యాస్పదంగా అనిపించేదేమో. కానీ వాస్తవానికి, ఇది కేవలం పిచ్చి.
అయితే ఇవన్నీ దిగ్భ్రాంతి కలిగించేవిగా తోచవచ్చు గాని ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికేమి లేదు. "కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన" అనే నినాదాన్ని నమ్మిన వారు కూడా ఈ పాటికి ఈ విషయాన్ని అర్ధం చేసుకునే ఉంటారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి అంతా - వారి మహా బలాన్ని చూపించడానికి వారు చేసే నేలబారు నెత్తుటి పాలన. కానీ బాధపడవల్సిన విషయం ఏమిటంటే, ఇటువంటి పరిస్థితులలో కూడా చాలా మంది వ్యూహాత్మకంగా పాటిస్తున్న మౌనం. వారిలో కొందరు అటువంటి చట్టాలని సమర్ధించి ప్రస్తుత ప్రభుత్వం తరఫున తమ వంతు యుద్ధాన్ని కూడా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మీరెమో ఇటువంటివారు ప్రజాస్వామ్యాన్ని ఇలా కాలరాయడాన్ని అంగీకరించరని అనుకుంటారు.
కొనసాగుతున్న రైతుల నిరసనలకు సమాధానం ఇచ్చే మార్గంలో నిజంగా ఏమి ఉందో కేంద్ర క్యాబినెట్‌లోని ప్రతి ఒక్క సభ్యుడికి తెలుసు .
మూడు చట్టాలపై రైతులతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని వారికి తెలుసు – ఇవి ఆర్డినెన్స్‌లుగా ప్రకటించబడుతున్నాయని తెలిసిన రోజు నుండే రైతులు దీనిని గురించి తెలుపమని అడుగుతున్నారు.
రాజ్యాంగంలో వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ ఈ చట్టాల తయారీలో రాష్ట్రాలతో ఎప్పుడూ సంప్రదింపులు జరపలేదు. ప్రతిపక్ష పార్టీలూ లేవు, అసలు పార్లమెంటులోనే ఎవరూ లేరు.
బిజెపి నాయకులు మరియు కేంద్ర క్యాబినెట్ సభ్యులకు ఏ సంప్రదింపులు జరగలేదని తెలుసు - ఎందుకంటే వారు తమలో తామే ఎప్పుడూ సంప్రదించుకున్నవారు కాదు. దీనిపై గానీ, ఇతర క్లిష్టమైన సమస్యలపై గాని వారి నాయకుడు ఆదేశించినప్పుడు ఎగసిన ఆవేశాలను వెనుతిప్పటమే వీరి పని.
అయితే ఇప్పటిదాకా, ఈ ఆవేశపు అలలు ఇక్కడి సభికుల కంటే మెరుగ్గా పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఉత్తర ప్రదేశ్‌లో భారీ నిరసనలు జరుగుతున్నాయి. పశ్చిమ యూపీ రైతు నాయకుడు రాకేశ్ టికైట్ని గతంలో ప్రభుత్వం అతనిని పడగొట్టడానికి ప్రయత్నించినప్పటికంటే, ఇప్పుడు చాలా శక్తిమంతుడైన వ్యక్తి అయ్యాడు. జనవరి 25 న మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున రైతుల నిరసన జరిగింది. రాజస్థాన్‌లో, కర్ణాటకలో కూడా ముఖ్యమైన నిరసన ప్రదర్శనలు జరిగాయి - ఇక్కడ ట్రాక్టర్ ర్యాలీలు బెంగళూరు - ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాలలో ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి. హర్యానాలో, ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగులకి రాలేక పోవడం వలన ప్రభుత్వం అతికష్టంగా పనిచేస్తోంది.
పంజాబ్ లో, దాదాపు ప్రతి ఇంటివారు నిరసనకారులని తమరిలో ఒకరనే అనుకుంటారు. చాలామందికి వారితో చేరాలని ఉంది, చేరుతున్నారు కూడా. ఫిబ్రవరి 14 న జరగబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థులను కనిపెట్టడానికి చాలా కష్టపడింది. ఉన్న అభ్యర్థులు వారి స్వంత పార్టీ చిహ్నాన్ని ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత సంబంధాన్ని ఏర్పరుచుకోలేనంతగా దూరమైంది. దీనివలన భవిష్యత్తు చాలా చిక్కుల్లో పడనుంది.
ఈ ప్రభుత్వం సాధించిన ఆశ్చర్యకరమైన విజయం మరొకటుంది. రైతులు, మార్కెట్ ను నడిపే కమీషన్ ఏజంట్లు వంటి సంప్రదాయ విరోధులు కూడా ఏకమయ్యారు. ఇదివరకైతే ఇది అసలు సాధ్యమయ్యే విషయం కాదు. ఇంతేగాక ఈ ప్రభుత్వం హిందువులు, ముస్లింలు, సిక్కులు, జాట్లు, జాట్లేతరులు, చివరికి ఖాప్ లను, ఖాన్ మార్కెట్ గుంపును కూడా ఏకం చేసేసింది. మెచ్చుకోదగ్గ వ్యవహారమే.
కానీ ఇప్పుడు నిశ్శబ్దమైన గొంతులు అప్పట్లో "పంజాబ్ మరియు హర్యానా గురించి మాత్రమే" అంటూ మనకు భరోసా ఇవ్వడానికి రెండు నెలలు గడిపాయి. నిజమే, మరెవ్వరు ప్రభావితం కాలేదు. ఇది నిజంగా పట్టించుకోవలసిన విషయం కాదు.
హహ. సుప్రీంకోర్టు ‘నియమించని’ కమిటీ పంజాబ్ మరియు హర్యానా రెండూ ఇండియన్ యూనియన్‌లో ఒక భాగం అని ధృవీకరించినప్పుడు, ఆ రాష్ట్రాల్లో జరిగేది మనందరికీ ముఖ్యమేనని మరి మీరు అనుకోవచ్చు.
ఒకప్పుడు గొప్పగా మాట్లాడిన గొంతులు వీరంతా సంస్కరణలను నిరోధించే "ధనిక రైతులు" అనే మాట కూడా మనకు చెప్పాయి. నిజానికి ఇప్పుడు కూడా కాస్త గొంతు తగ్గించినా అవే మాటలు చెప్తున్నాయి.
భలే ఉంది. గత ఎన్ఎస్ఎస్ సర్వే ప్రకారం పంజాబ్‌లోని ఒక వ్యవసాయ కుటుంబపు సగటు నెలసరి ఆదాయం రూ. 18,059. ప్రతి వ్యవసాయ గృహానికి సగటున 5.24 మంది ఉన్నారు. కాబట్టి నెలవారీ తలసరి ఆదాయం సుమారు రూ. 3,450. అంటే ఈ ఆదాయం వ్యవస్థీకృత రంగంలో అతి తక్కువ జీతం తీసుకునే ఉద్యోగి కంటే తక్కువ.
అబ్బా! అలాంటి సంపద. సగం మాకు చెప్పనేలేదు. హర్యానా (వ్యవసాయ గృహ పరిమాణం 5.9 వ్యక్తులు) కు సంబంధించిన గణాంకాలు- రూ. 14,434 సగటు నెలసరి ఆదాయం, సుమారు రూ. 2,450 తలసరి ఆదాయం. ఐతే ఇంతటి అసంబద్ధమైన సంఖ్యలు ఇప్పటికీ ఇతర రాష్ట్ర భారతీయ రైతుల కంటే ముందు ఉన్నాయి. ఉదాహరణకు, గుజరాత్ లో ఉన్న వ్యవసాయ గృహాల సగటు నెలసరి ఆదాయం రూ. 7,926. వ్యవసాయ గృహానికి సగటున 5.2 మంది వ్యక్తులతో, అది నెలకు తలసరి రూ. 1,524 అవుతుంది.
అఖిల భారత సగటు వ్యవసాయ కుటుంబపు నెలవారీ ఆదాయం రూ. 6,426 (తలసరి సుమారు రూ. 1,300). అయితే ఈ సగటు నెలవారీ గణాంకాలలో అన్ని వనరుల నుండి వచ్చే ఆదాయం ఉంటుంది. వ్యవసాయం నుండి మాత్రమే కాదు, పశువుల నుండి, వ్యవసాయేతర వ్యాపారాలు, వేతనాలు, జీతాల నుండి వచ్చే ఆదాయాన్ని కలిపితే ఇంత అవుతుంది.
నేషనల్ శాంపిల్ సర్వే 70 వ రౌండ్ ‘భారతదేశంలో వ్యవసాయ గృహాల పరిస్థితి యొక్క ముఖ్య సూచికలు’ (2013) లో నమోదు చేసిన భారత రైతు పరిస్థితి ఇది. రాబోయే 12 నెలల్లో - 2022 నాటికి ఆ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిందని గుర్తుంచుకోండి. ఇది ఒక కఠినతరమైన పని. ఇక రిహన్నాలు మరియు థన్‌బెర్గ్‌ల యొక్క జోక్యం వలన జరిగే అంతరాయం దీన్ని మరింత కష్టతరం చేస్తుంది.
అన్నట్టు, ఢిల్లీ సరిహద్దుల్లోని ధనిక రైతులు, 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలలో మెటల్ ట్రాలీలలో నిద్రిస్తారు, 5-6 డిగ్రీలలో బహిరంగంగా స్నానం చేస్తారు - వారు ఖచ్చితంగా భారతీయ ధనికుల పట్ల నా అభిప్రాయాన్ని మెరుగుపరిచారు. వారి దృఢత్వం మనం ఊహించుకున్నదానికన్నా ఎక్కువ.
కానీ రైతులతో మాట్లాడటానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో ఉన్నవారికే సరైన సంభాషణ సాగుతున్నట్లు లేదు. ఆ కమిటీ లో ఉన్న నలుగురు సభ్యులలో ఒకరు మొదటి సమావేశానికి ముందే నిష్క్రమించారు. ఇక నిరసనకారులతో మాట్లాడడం అనేది ఇంతవరకు జరగనేలేదు.
మార్చి 12 న, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన రెండు నెలల ఆదేశ సమయం (రెండు నెలలు- వ్యవసాయానికి చాలా కీలకమైన కీటకాల పరాగ సంపర్కాలు జరిగెందుకు పట్టే సమయం) అయిపోతుంది. ఇహ ఈ కమిటీ అప్పటికి ‘వారు మాట్లాడని వ్యక్తుల’ యొక్క సుదీర్ఘ జాబితాను మరియు ‘వారితో మాట్లాడని వ్యక్తుల’ జాబితాను తయారు చేసుకుంటుంది. ఇదేగాక వారు ‘ఎప్పుడూ మాట్లాడకుండా ఉండవలసిన వారి’ యొక్క చిన్న జాబితా కూడా ఉండే ఉంటుంది.
నిరసన తెలిపిన రైతులను బెదిరించడానికి చేసే ప్రతి ప్రయత్నం, వారి సంఖ్యను పెంచుతూ పోతోంది. మీడియా లో వారి ప్రతీ చర్యని ఖండించడానికి చేసిన ప్రయత్నాలు, మలుపు తిరిగి వాస్తవం లో వారి బలమైంది. కానీ భయపెట్టే విషయం ఏమిటంటే, ఈ నిరసన ఎంత బలంగా తయారైనా ఆ బలం ప్రభుత్వపు తీవ్రమైన అధికార క్రూరత్వాన్ని ఏ విధంగానూ ఆపలేదు.
వ్యక్తిగత అహమే ఈ వివాదంలో అధిగమించలేని అడ్డంకి అని కార్పొరేట్ మీడియాలో చాలా మందికి తెలుసు. ఇది ప్రభుత్వ విధానం కోసం కాదు, ధనిక సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలు (అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీరుతాయి) గురించి కూడా కాదు. చట్టాల పవిత్రత కాదు (ఇది ప్రభుత్వం సొంతంగా చాలా సవరణలతో చేయగలదు). విషయం ఇదే. రాజు ఎటువంటి తప్పు చేయడు. ఇక పొరపాటును అంగీకరించడం లేక వెనక్కి తగ్గడం మరీ అధ్వానం. అటువంటిది అసలు ఊహించలేము. కాబట్టి, దేశం లోని ప్రతి రైతు ఇబ్బంది పడినా పట్టించుకోనక్కర్లేదు. నాయకుడు తప్పు చేయడు, తప్పు ఒప్పుకోడు. ఈ విషయాన్ని కనీసం గుంభనంగా చెప్పే ఒక్క చిన్న సంపాదకీయాన్ని కూడా నేను ఇప్పటిదాకా చదవలేదు. కానీ వారికి నిజాలు తెలుసు.
ఈ గందరగోళంలో అహం ఎంత ముఖ్యమైనది?ఒక సాధారణ ట్వీట్‌కు ప్రతిస్పందన ఎలా సాగుతుందో పరిగణించండి. "మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు?" అనే చర్చ కన్నా ఎక్కువగా ‘ఆహా-రిహన్న కన్నా ట్విట్టర్లో మోడీకి ఎక్కువ మంది అనుచరులు ఉన్నారు ’, అన్నప్పుడే మనము ఓడిపోయాము. వాస్తవానికి, ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కామికేజ్ ఉగ్రవాద నిరోధక వీరోచితాలకు నాయకత్వం వహించినప్పుడు, దేశభక్తిగల ప్రముఖుల సేనాదళాల్ని సైబర్ నేరాలకు ప్రేరేపించినప్పుడే మనం ఓడిపోయాము. (సైబర్ ప్రపంచంలో ట్వీట్లతో అరుస్తూ, మన చుట్టూ పేరుకుపోతున్న చీకటిని గుర్తించకుండా, మన గొయ్యి మనమే తవ్వుకుని అందులోనే కూరుకుపోతున్నాము.)
చట్టాలను బహిరంగంగా ప్రశంసించిన IMF యొక్క ముఖ్య ఆర్థికవేత్త మరియు కమ్యూనికేషన్ డైరెక్టర్ నుండి వచ్చిన ప్రకటనల మాదిరిగా కాకుండా (వీరు ఆ చట్టాలకు భద్రతలు, హెచ్చరికలు జోడించాలన్నారు. సిగిరెట్ పాకెట్ మీద వేసినట్లు చట్టాలపై కూడా హెచ్చరికలు అవసరం మరి), సదరు ఆక్షేపణీయ ట్వీట్ లో ‘మనం ఎందుకు మాట్లాడటం లేదు ?’ అని ఉంది కానీ ఈ చట్టాలపైన ఒక స్పష్టమైన వైఖరి లేదు.
అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్ & బి ఆర్టిస్ట్, పద్దెనిమిదేళ్ల టీనేజ్ క్లైమేట్ అక్టివిస్ట్ మాత్రమే ప్రమాదకారులు. వారికి ఏ మాత్రం రాజీ పడకుండా గట్టిగా సమాధానం చెప్పాలి. ఢిల్లీ పోలీసులు ఈ పని మీదే ఉన్నారని తెలియడం ఒక రకంగా ఎంతో ధైర్యాన్నిస్తోంది. ఒకవేళ వారు ప్రపంచ కుట్రలను దాటి గ్రహాంతరాల కుట్ర గురించి తెలుసుకుంటే- ఈ రోజు భూమి, రేపు గెలాక్సీ- నేనైతే వీరిని వెక్కిరించే వారిలో ఉండను గాక ఉండను. నాకిష్టమైన ఒక వాక్యం ఇంటర్నెట్లో నడుస్తోంది- భూమి పై మనుషులను ఒంటరిగా వదిలేయడమే మనకు తెలియని గ్రహాంతర మేధకు సాక్ష్యం-.”
ఈ వ్యాసం మొదట ‘ది వైర్’ లో ప్రచురించబడింది.
కవర్ ఇలస్ట్రేషన్: పశ్చిమ బెంగాల్ యొక్క నాడియా జిల్లాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన లాబాని జంగి, కోల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో బెంగాలీ కార్మిక వలసలపై పిహెచ్డి డిగ్రీ కోసం కృషి చేస్తున్నారు. ప్రయాణం చేయడానికి ఇష్టపడే ఈమె స్వంతంగా చిత్రకళను అభ్యసించారు.
అనువాదం: అపర్ణ తోట