తన తండ్రి వర్ధంతి సందర్భంగా, తిరు మూర్తి అసాధారణమైన నైవేద్యాన్ని సమర్పించాడు: పది రకాల సబ్బులు, అనేక రకాల కొబ్బరి నూనె,  అతని ఉత్పత్తులన్నింటిలో గొప్పదైన: పసుపు పొడి. ఇవిగాక, ఎర్ర అరటిపండ్లు, పువ్వులు, కొబ్బరికాయల తో పాటు, వెలిగించిన కర్పూరాన్ని సుందరమూర్తి చిత్రపటం ముందు పెట్టాడు.

"అప్పాకి ఇంతకంటే మంచి నివాళి ఏముంటుంది?" అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రశ్నించాడు. అతని తండ్రి మంజల్ (పసుపు) వ్యవసాయాన్ని మానేశాడు. అందరూ వద్దని చెప్పినా తిరు ఆ పనినే తిరిగి మొదలుపెట్టాడు. “పూల వల్ల రోజువారీ ఆదాయం వస్తుంది కాబట్టి మల్లి (మల్లెపూవు తోట)ని పెంచమని చెప్పారు. నేను మంజల్ నాటినప్పుడు వారు నన్ను చూసి నవ్వారు,” అని అతను నవ్వాడు. వారు చెప్పినది తప్పని తిరు నిరూపించాడు. అతని కథ అరుదైనది: ఇది పసుపుతో సాధించిన  విజయం.

నలభై మూడేళ్ళ తిరు మూర్తి, తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని భవానీసాగర్ బ్లాక్‌లోని ఉప్పుపాళం కుగ్రామంలో తన అన్నయ్యతో కలిసి ఉమ్మడిగా కలిగి ఉన్న 12 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. అతను మూడు పంటలు పండిస్తాడు - పసుపు, అరటి, కొబ్బరి. కాని అతను వాటిని హోల్‌సేల్‌గా విక్రయించడు. ధరలపై తనకు నియంత్రణ లేనప్పుడు అది అర్థరహితమని అతను చెప్పాడు. ఈ రేట్లను - స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా- పెద్ద వ్యాపారులు, కార్పొరేట్లు, ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.

అభివృద్ధి చెందుతున్న పసుపు మార్కెట్‌లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాత్ర వహిస్తుంది. 2019లో మన దేశం చేసిన ఎగుమతులు $190 మిలియన్లకు చేరుకున్నాయి - ఇది ప్రపంచ వాణిజ్యంలో 62.6 శాతం. అయితే ఇక్కడ విషయమేమిటంటే: దిగుమతులలో కూడా భారతదేశం రెండవ స్థానంలో ఉంది, అంటే 11.3 శాతం వరకు పసుపును మన దేశం దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులలో సాగుతున్న ఈ భారీ పెరుగుదల, భారతీయ పసుపు సాగుదారుల ప్రయోజనాలను దెబ్బతీసింది.

దేశీయ మార్కెట్లు - ఈరోడ్‌లోని మండీ లు - ఇప్పటికే వారిని పిండుతున్నాయి. పెద్ద వ్యాపారులు, కొనుగోలుదారులు విలువను నిర్ణయిస్తారు. సేంద్రీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ధర లేదు, అంతేకాకుండా, ప్రతి ఏడాదికి అస్థిరత పెరిగిపోతోంది. 2011లో క్వింటాల్‌ పంటకు రూ. 17,000 ధర పలికితే, మరుసటి సంవత్సరం, అది ఆ ధరలో దాదాపు నాల్గవ వంతుకు పడిపోయింది. 2021 సగటు ధర, క్వింటాలుకు దాదాపు రూ. 7,000.

చాతుర్యం, పట్టుదల, సోషల్ మీడియా సహాయంతో, తిరు సరళమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు: విలువ జోడింపు. అతని ప్రయత్నం వేరే ప్రదేశాలలో పెద్దగా ప్రయత్నించనప్పటికీ, ఇక్కడ మాత్రం విజయవంతమైంది. “పొలం వద్ద 10 రూపాయలు పలికే ఒక్క కొబ్బరికాయ, నాకు మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది. కొబ్బరితో నేను నూనెను, సబ్బును తయారుచేస్తాను. పసుపుతోనూ ఇదే కథ’’ అని ఆయన వివరించారు. “నేను దానిని 1.5 ఎకరాల్లో పెంచుతాను. నేను మండిలో 3,000 కిలోల సేంద్రియ పసుపును అమ్మవలసి వస్తే, నాకు దాదాపు 50 రూపాయల నష్టం వస్తుంది.”

Two types of turmeric grow in Thiru Murthy's fields at the foothills of the Sathyamangalam hills in Erode.
PHOTO • M. Palani Kumar
Thiru at home with his children and a relative’s son
PHOTO • M. Palani Kumar

ఎడమ: ఈరోడ్‌లోని సత్యమంగళం కొండల దిగువన ఉన్న తిరు మూర్తి పొలాల్లో రెండు రకాల పసుపు పండుతుంది. కుడి: తిరు తన పిల్లలు, బంధువుల కొడుకుతో ఇంట్లో ఉన్నాడు

సేంద్రీయ వ్యవసాయం అంటే అతని ఉత్పత్తి వ్యయం, రసాయన ఆధారిత వ్యవసాయం కన్నా చాలా ఎక్కువ. అయినప్పటికీ, అతను మిగిలినవారి కంటే చాలా బాగా సంపాదించగలుగుతున్నాడు.

ఈరోడ్‌లోని సత్యమంగళం పర్వత శ్రేణుల పాదాల వద్ద, పచ్చిక బయళ్లకు నిర్వచనంలా  ఉన్న అతని వ్యవసాయ క్షేత్రం వెనుక: ఊదారంగు కొండల వరుసపై, ఒక్కొక్కటి వర్షపు మేఘాల టోపీని ధరించి, పచ్చ పొలాల వెనుక నుండి ముసురుతున్నాయి. అతని పసుపు మొక్కలు పొడవుగా ఉన్నాయి, వాటి విశాలమైన ఆకులు తేలికపాటి వర్షంలో తడిచి, అక్టోబర్ ఎండలో మెరుస్తున్నాయి. పొలంలో ఉన్న కొబ్బరి చెట్లపై దర్జీ పక్షులు గూడు కట్టుకుని ఉన్నాయి; అవి బిగ్గరగా కిచకిచమంటూ  కొబ్బరాకుల మధ్య నుండి ఎగురుతున్నాయి. ఈ మనోహర దృశ్యం, రైతుగా అతను పడిన కష్టం మీద నుండి  దృష్టి మళ్లించింది.  తరువాత, అతను నెమ్మదిగా, జాగ్రత్తగా చెప్పాడు. తన గులాబీ గోడల ఇంట్లో, బూడిద రంగు సిమెంటు నేలపై కూర్చుని, తన ఒడిలో తన నాలుగేళ్ల కూతురిని కూర్చోబెట్టుకుని, ఆమె కాలి వెండి మువ్వలు ఘల్లు ఘల్లుమంటుండగా…

“నేను నా కస్టమర్‌లకు అర కిలో లేదా ఒక కిలో ప్యాకెట్‌లుగా విక్రయిస్తేనే నాకు లాభం వస్తుంది. అదీగాక సబ్బులు, నూనెలు, పాల పానీయాలుగా అమ్మితే కూడా లాభం వస్తుంది." మరో మాటలో చెప్పాలంటే, అతను ఉత్పత్తి చేసే ప్రతిదానికీ విలువను పెంచుతాడు. ప్రతి పసుపు రైతులాగే, అతను చాలా కష్టపడి తన పంటను ఉడకబెట్టి, ఎండబెట్టి, పాలిష్ చేస్తాడు. కానీ వారు దానిని నిల్వ చేసుకుంటూ - మంచి ధర కోసం వేచి ఉండడమో- లేక మండి లో విక్రయించడమో చేస్తున్నప్పుడు, తిరు తన పంటను మాత్రం స్వంత గోడౌన్‌కు తెచ్చుకుంటాడు.

తరువాత, అతను పసుపు ‘దుంపలను’, 'వేళ్ళను' చిన్న చిన్న వాయిలలో పొడి చేస్తాడు. మరికొంత నూతన ఆలోచనతో  అతను దానిని – సౌందర్య ఉత్పత్తులగా, పానీయాలుగా మార్చి కిలో పసుపు ధరకు అదనంగా మరో రూ.150 సంపాదిస్తాడు.

"కానీ నేను మొత్తం డబ్బును నా దగ్గరే ఉంచేసుకోను," అని అతను చెప్పాడు. అతను మళ్ళీ దానిని తనకు ఇష్టమైన భూమి కోసమే ఖర్చుపెడతాడు. అతని పొలం అతని కుటుంబాన్ని పోషించడమే కాకుండా, ఆ ప్రాంతంలో ఉపాధిని కూడా సృష్టించింది. “పని మంచి ఊపులో ఉన్నప్ప్పుడు  నా పొలంలో రోజూ ఐదుగురు మగవారికి, ముగ్గురు ఆడవారికి పని ఉంటుంది. మగవారి జీతం రూ. 400, ఆడవారికి జీతం రూ. 300, ఇవిగాక టీ, బోండా [ఒక రుచికరమైన చిరుతిండి] ఇస్తాము. వార్షిక పసుపు కోతకు ఇప్పుడు ఎకరానికి వచ్చే 40,000 రూపాయలలో పదోవంతు ధర మాత్రమే లభించిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కూలీలను అడిగితే పెట్రోల్‌ లీటరు 100 రూపాయిలు అయితే, ఒక క్వార్టర్(180మి.లి) బాటిల్ మద్యం ధర 140రూపాయిలు అంటారు,” అని  చెప్పి నవ్వాడు. “కానీ ఇవేమి పసుపు విలువను పెంచేవి కావు.”

*****

చిరుధాన్య గింజలను ఊకుతున్న స్త్రీల పాటలతో పాటు,
కంద, పసుపు పంటలకు కాపలా కాస్తున్న రైతులు
మేతకు వచ్చే అడవి పందులను తరిమడానికి,
డప్పుల దరువు మోగించారు
ఈ శబ్దాలు పర్వతాల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయి

సంగం కాలం నాటి మలైపాడు కదం అనే పద్యం నుండి

Trays with the lots of turmeric fingers and bulbs displayed at an auction in the regulated market in Perundurai, near Erode
PHOTO • M. Palani Kumar
Trays with the lots of turmeric fingers and bulbs displayed at an auction in the regulated market in Perundurai, near Erode
PHOTO • M. Palani Kumar

ఈరోడ్ సమీపంలోని పెరుందురైలోని నియంత్రిత మార్కెట్‌లో వేలంలో ప్రదర్శించబడిన పసుపు వేళ్ళు, దుంపలతో నిండిన ట్రేలు

తమిళనాడుకు పసుపుకు 2,000 సంవత్సరాల క్రితం నుండే అనుబంధం ఉందని, పై పంక్తులను తన బ్లాగ్, OldTamilPoetry.com లో అనువదించిన రచయిత చెంథిల్ నాథన్ చెప్పారు. మలైపాడు కదం , "సంగం కానన్‌లోని 10 దీర్ఘ కవితలలో ఒకటి" అని ఆయన చెప్పారు.

భారతీయ వంటగదికి నాయకుడు పసుపు ( కర్కుమా లాంగా ). దీనికి అల్లంతో చాలా దగ్గరి సంబంధం ఉంది. భూగర్భ కాండం(రైజోమ్)లో మధ్యగా ఉన్న దుంప, శాఖలుగా ఉండే 'వేళ్లు' వాణిజ్యపరంగా ఉపయోగించబడతాయి. దుంపలు, వేళ్లు పంట సమయంలో వేరు చేసి బాగుచేస్తారు. వాటిని విక్రయించే ముందు ఉడకబెట్టి, ఎండబెట్టి, శుభ్రం చేసి పాలిష్ చేస్తారు. వేలంలో వేళ్లు ఎక్కువ ధర పలుకుతాయి.

పసుపు బహుశా మన దేశానికే చెందినదై ఉంటుంది, అని ఆహార చరిత్రకారుడు కె.టి. అచ్చయ ఇండియన్ ఫుడ్: ఎ హిస్టారికల్ కంపానియన్, అనే తన పుస్తకంలో వ్యక్తపరిచారు. "దాని అద్భుతమైన రంగు, అద్దక సామర్థ్యం హరిద్ర కు [దాని సంస్కృత పేరు] మాయాజాలంలోనూ, కర్మలలోనూ ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాయి" అని ఆయన చెప్పారు. రోజువారీ వంట దినుసు అయిన ఈ మంజల్ ను భారతదేశం అంతటా వంటకాలలో, సంస్కృతులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. చిటికెడు పసుపు పొడి ఆహారానికి చక్కని రంగునిస్తుంది, రుచిని  పెంచుతుంది, పైగా రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. కుర్కుమిన్, ఈ ప్రకాశవంతమైన పసుపు వర్ణద్రవ్యాన్ని, దాని ఔషధ లక్షణాల వలన కూడా వాడతారు. ఇది మంచి యాంటీఆక్సిడెంట్ గానూ, యాంటీ ఇన్ఫ్లమేటరీగాను పనిచేస్తుంది .

శాస్త్రవేత్తల కన్నా చాలా కాలం ముందుగానే  అమ్మమ్మలు ఇది ఎలా పని చేస్తుందో కనుగొన్నారు. వారు పసుపు, మిరియాలను కలిపి వేడి చేసేవారు - దీని వలన కర్కుమిన్ జీవ లభ్యతను మెరుగుపడుతుంది - దీనిని కుటుంబంలోని ఎవరైనా గట్టిగా తుమ్మినా చీదినా వారికి పాలతో కలిపి ఇచ్చేవారు. స్టార్‌బక్స్ ఇప్పుడు 'గోల్డెన్ టర్మరిక్ లాటె' అనే ఒక పానీయాన్ని అందిస్తున్నారు, దానిని మా అమ్మమ్మ ఆమోదీస్తుందో లేదో మరి. ఇందులో వోట్ పాలలో వనిల్లా కూడా కలిపి, మెషిన్లో వచ్చే నురుగును ఈ పానీయం పై ఫ్యాన్సీగా వేసి ఇస్తారు.

పసుపును శుభప్రదంగా భావిస్తారు. దక్షిణాదిలోని వివాహిత స్త్రీలు తమ మెడలో పసుపు పూసిన దారాన్ని ధరిస్తారు. మంజల్ నీరతు విజా (‘పసుపు స్నానం వేడుక’) అనేది యుక్తవయస్సులో జరిగే ఆచారం, ఇది ఒక యువతి మొదటి ఋతుస్రావం గుర్తుగా జరుపుకుంటారు (కొన్నిసార్లు పెద్ద ఫ్లెక్స్ బోర్డులు కూడా పెడతారు, ఈ వేడుకకు చాలామంది వస్తారు). మంజల్ కూడా ఒక ప్రసిద్ధ క్రిమినాశకంగా పనిచేస్తుంది, దీనిని పుండ్లపై,  చర్మ గాయాలపై లేపనంగా పూస్తారు. ఈ కారణంగానే పెట్ కేర్ బ్రాండ్‌ లు తమ ఉత్పత్తులలో దీనిని ఉపయోగిస్తాయి.

US పరిశోధకులు పసుపు పై ​​పేటెంట్ పొందినప్పుడు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) 1997లో $15,000కి ఒక న్యాయవాదిని నియమించుకుని, దేశంలో శతాబ్దాలుగా గాయాలను నయం చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారు కాబట్టి, దానికి ‘నూతన  ప్రమాణం’ ఏమి లేదని వాదించింది. చివరికి CSIR, " పసుపు పై ​​వివాదాస్పద పేటెంట్"ను యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ మరియు ట్రేడ్‌మార్క్ కార్యాలయం ఉపసంహరించుకునేలా చేసింది.

శివాజీ గణేశన్ ఆమోదించే ఉండేవారు. ఈ ప్రసిద్ధ నటుడు 1959లో వీరపాండియ కట్టబొమ్మన్ అనే చలనచిత్రంలో వలసవాదాన్ని వ్యతిరేకించే హీరో పాత్ర(శీర్షిక పాత్ర)ను పోషించాడు - ఇది ఉత్తమ చిత్రంగా, ఆయన ఉత్తమ నటుడిగా- అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. వారికి పన్నులు చెల్లించాలన్న బ్రిటీష్‌ ఆదేశాన్ని తిరస్కరించిన కట్టబొమ్మన్‌ మాటలు ఆ రోజులలో ప్రసిద్ధమైనాయి: “ఎందుకు? నా సమాజంలోని స్త్రీలకు పసుపు నూరి సేవ చేశావా?”

*****

"నేను మా నాన్నగారి కష్టఫలాలను అందుకుంటున్నాను."
తిరు మూర్తి, ఈరోడ్‌లో పసుపు పండించే వ్యక్తి

Thiru inspecting the turmeric plants in his farm, in Uppupallam hamlet of Erode's Bhavanisagar block
PHOTO • M. Palani Kumar

ఈరోడ్‌లోని భవానీసాగర్ బ్లాక్‌లోని ఉప్పుపల్లం గ్రామంలోని తన పొలంలో పసుపు మొక్కలను పరిశీలిస్తున్న తిరు

తనకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండి, వ్యవసాయం చేశాడని, 2021 అక్టోబర్‌లో సత్యమంగళానికి మేము రెండవ సారి వెళ్ళినప్పుడు అతను PARIకి చెప్పాడు.  అదే సంవత్సరం మార్చిలో పసుపు కోత సమయంలో మేము మొదటిసారి వెళ్ళాము.  ఊగుతున్న పసుపు మొక్కల మధ్య నడుస్తూ, చేతిలో తెల్లటి ధోతీ కొనను పట్టుకుని, అతను తను చేసిన ప్రయాణాన్ని గురించి మాట్లాడాడు.

“అప్పా ఉప్పుపాళ్యంకి మారారు - ఇది అమ్మ స్వస్థలం - 70 లలో ఎకరం పది లేదా ఇరవై వేల రూపాయలకు భూమి కొన్నాడు. ఇప్పుడు అదే 40 లక్షలు. ఈ కాలంలో ఒకేసారి 10 ఎకరాలు కొనలేము!” పదవ తరగతి మానేసిన తిరు 2009లో పూర్తి సేంద్రీయ రైతు అయ్యాడు. అప్పటికి అతని వయసు 31.

అయితే ఇది అతను వెంటనే ఎంచుకున్న ఉపాధి కాదు. అతను చాలా ఉద్యోగాలు ప్రయత్నించాడు. మొదట అతను ఇంట్లో మాలిగై కడై , కిరాణా కొట్టుని పెట్టుకున్నాడు. అందులో ఎలంద వడ (తీపి, పులుపు కలిసిన జుజుబీ పండుతో చేసిన వడ), థిన్‌పండం (చిరుతిళ్లు), బియ్యం, సిగరెట్లు, బీడీ లు, ఇంకా దీపావళి సమయంలో పటాకులు అమ్మేవాడు. వ్యాపారం పట్ల ఉత్సాహం అతన్ని చాలా మంది వద్దకు చేర్చింది. అతను కేబుల్ టీవీ సర్వీస్ ప్రొవైడర్ గా కూడా పనిచేశాడు, పాలు అమ్మాడు. తన అక్క నివసించే బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ ద్విచక్రవాహనాల సర్వీస్‌ స్టేషన్‌ నడిపి, చిన్నపాటి ఫైనాన్స్‌ కంపెనీలో అప్పులు చేసి, చివరకు కార్లు కొని అమ్మే పని కూడా చేశాడు. “నేను 14 ఏళ్లలో ఆరు ఉద్యోగాలు ప్రయత్నించాను. చాలా కష్టపడ్డాను, విపరీతంగా ఇబ్బందిపడి నా వేళ్ళు కాల్చుకున్నాను.”

అతను బెంగుళూరు కాలాన్ని కుక్కల రోజులు అని పిలుస్తాడు, " నాయి పదద పాడు ". ఆ రోజులను కుక్కలు పడే కష్టాలతో పోల్చాడు. అతను కొంచెం సంపాదించి, స్నేహితుడితో కలిసి 6 x 10 అడుగుల గదిలో ఉండేవాడు. ఆ ఇరుకు స్థలానికి రూ. 2,500 అద్దె చెల్లించేవాడు.

"మార్చి 2009లో నేను సత్యమంగళానికి తిరిగి వచ్చినప్పుడు, నాకు వ్యవసాయం పిచ్చి పట్టింది." అతను తన తండ్రి  వేసిన చెరకు పంటను కొనసాగించి పండించాడు. ఈ పంటతో పాటుగా టపియోకా, ఉల్లిపాయల ప్లాట్లు కూడా కలిపాడు.

“నేను తప్పులు చేసాను, ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నాను. 2010లో కిలో ఉల్లి 80 రూపాయలు. పంట చేతికొచ్చే సమయంలో 11 రూపాయలకు పడిపోయింది. మరణా అది [చావు దెబ్బ],” అని నిట్టూర్చాడు. వేరే పంటలు కూడా వేయడం వలన అతను తన నష్టాన్ని పూడ్చుకోగలిగాడు. 2014లో - అతని తండ్రి మరణించిన రెండు సంవత్సరాలకు, తన్న కుటుంబం పసుపు పంట వేయడం నిలిపివేసిన తొమ్మిది సంవత్సరాల తరువాత - అతను మళ్ళీ మంజల్ నాటాడు.

*****

పసుపుతో ఎవరో డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఆ సంపాదించేవాడు రైతు కాదు...
ఈ రోడ్‌లో పసుపు సాగు చేసేవారు

In his banana field, Thiru has planted the red variety this time.
PHOTO • M. Palani Kumar
The wooden chekku in which coconut oil is cold-pressed to make fragrant hair oils
PHOTO • M. Palani Kumar

ఎడమ: తన అరటి పొలంలో తిరు ఈసారి ఎర్రరకాన్ని వేశాడు. కుడి: సువాసనగల కొబ్బరినూనెను తయారు చేసేందుకు గానుగ నూనె వాడతారు. ఆ నూనెను తయారు చేసే గానుగ

తమిళనాడు అంతటా 51,000 ఎకరాలకు పైగా పసుపు సాగులో ఉంది. మొత్తం 86,000 టన్నులకు పైనే ఉత్పత్తి చేస్తూ, దేశంలో నాల్గవ స్థానంలో ఉంది. ఈరోడ్ జిల్లా 12,570 ఎకరాల మంజల్‌ తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది.

ఇంతటి పసుపు సముద్రంలో, తిరు 1.5 ఎకరాలు ఒక బిందువు మాత్రమే. అతను జూన్ 2014లో ఒక చిన్న అర ఎకరం స్థలంలో మాంజల్‌ ను పండించడం ప్రారంభించాడు. మిగిలిన వ్యవసాయ భూమిలో కొబ్బరి, అరటి సాగుచేయడం మొదలుపెట్టాడు. అతను ఒక టన్ను పసుపు పంటను త్వరగా విక్రయించగలిగినప్పుడు ఉత్సాహపడ్డాడు. ఆ ఒక్క టన్నులో దాదాపు మూడవ వంతు - అంటే 300 కిలోల పసుపును - కేవలం 10 రోజులలో అతని Facebook పరిచయాల ద్వారా పొడిగా  మార్చి రిటైల్ ధరకు అమ్మాడు. అతను తన వెంచర్‌కు ' యెర్ మునై ' అని పేరు పెట్టాడు, అంటే ‘నాగలి కర్రు’, "ఎందుకంటే ఈ పనిముట్టుకు ఎదురు లేదు." అతని  బ్రాండుకి లోగో కూడా ఒక అద్భుత చిత్రం: ఒక మనిషి, ఒక నాగలి. అది విజయవంతమైంది.

ఈ ప్రోత్సాహంతో, అతను మరుసటి సంవత్సరం రెండున్నర ఎకరాలలో మంజల్‌ ను ఉత్సాహంగా సాగు చేశాడు, ఐదు వేల కిలోలు పండించాడు తరవాత నెలల తరబడి అందులో ఐదుకు నాలుగువంతులు ఉత్పత్తితో సతమతమయ్యాడు. ఎంత ప్రయత్నించినా అతను పండించే పసుపుకు ఆర్గానిక్ సర్టిఫికేట్ పొందలేకపోయాడు - ఈ సర్టిఫికెట్ పొందే ప్రక్రియ ఒక శిక్షవంటిది. ఇది ఖరీదైనదేకాదు, ఆందోళన, ఉద్రేకం కలిగించేది - చివరికి అతను తన పంటను ఈరోడ్‌లోని ఒక పెద్ద మసాలా కంపెనీకి విక్రయించాడు. వారు అతనికి ఒక తుండు చీటు , అంటే లెక్కలతో కూడిన చిన్న చీటీ మాత్రమే ఇచ్చారు: క్వింటాల్‌కు రూ. 8,100, ఒక వారం తర్వాత, 15 రోజులకు తర్వాత పోస్ట్-డేట్ చేయబడిన రాష్ట్రేతర(Out of state) చెక్ ను అందుకున్నాడు.

ఈ చెక్ మార్చి డబ్బును తెచ్చుకోవడానికి తిరుకు వారాలు పట్టింది - పైగా అది పెద్ద నోట్లు రద్దైన సంవత్సరం. "2017 నుండి," అతను చెప్పాడు, "నేను జాగ్రత్తగా ఉన్నాను. ఒకటి లేదా ఒకటిన్నర ఎకరాల్లో మాత్రమే పసుపు సాగు చేస్తాను. ప్రతి రెండో సంవత్సరం, భూమికి 'విశ్రాంతి' ఇవ్వడానికి నేను దానిని సాగు చేయకుండా వదిలేస్తాను.”

జనవరిలో, అతను పంటలకు భూమిని సిద్ధం చేయడం ప్రారంభిస్తాడు - రెండు రౌండ్ల మిల్లెట్లు - ఒక్కొక్కటి 45 రోజులు. వీటిని భూమిలోని నత్రజని,  పోషకాలను సరిచేయడానికి, తిరిగి మట్టిలోకి దున్నుతారు. దీనంతటికి రూ. 15,000 ఖర్చవుతుందని అతను వివరించాడు. తరువాత, అతను బిందు సేద్యం వేస్తాడు, పసుపు కోసం భూమిని సిద్ధం చేస్తాడు- ఈ పనికి మరో రూ.15,000 ఖర్చు అవుతుంది. ఇక ఎకరానికి 800 కిలోల దుంపలు కావాలి – దానికి కిలో రూ. 40 చొప్పున రూ. 24,000 ఖర్చవుతుంది. కూలీలకు ఎకరానికి రూ.5,000 ఖర్చవుతుంది. ఒక నెల తరువాత, విత్తనాలు మొలకెత్తినప్పుడు, అతను రెండు టన్నుల మేకపెంట ఎరువును వేస్తాడు - ఈ పంటకు ఆవు పేడ కంటే మేక పెంట మెరుగ్గా పనిచేస్తుందని అతను ఖచ్చితంగా చెబుతాడు, దానికి రూ.14,000 ఖర్చుపెడతాడు.

తర్వాత సుమారు ఆరు రౌండ్ల కలుపుతీత, ఒక్కొక్క రౌండ్ కు రూ. 10,000 (అంటే ఎకరానికి 30 లేదా 35 మంది మహిళలకు రోజుకు రూ. 300 చెల్లిస్తారు). మార్చిలో కోతకు సుమారు రూ. 40,000 ఖర్చు, ఇది ఒక “స్థిర ఒప్పందం. సాధారణంగా, దాదాపు 20 మంది మగవారు, 50 మంది ఆడవారు ఒక బృందంగా వస్తారు. అవి ఒక రోజులో పూర్తవుతాయి. ముఖ్యంగా పంట బాగా పండితే మరో 5,000 ఇవ్వాలని అడుగుతారు.”

Fresh turmeric fingers, which are processed by Thiru Murthy to make beauty products and malted drinks.
PHOTO • Aparna Karthikeyan
The purpose-built pit for boiling the turmeric
PHOTO • Aparna Karthikeyan

ఎడమవైపు: సౌందర్య ఉత్పత్తులు, మాల్టెడ్ పానీయాలుచేయడానికి తిరు మూర్తిచే ప్రాసెస్ చేయబడిన తాజా పసుపు వేళ్లు. కుడివైపు: పసుపును ఉడకబెట్టడం కోసం చేసిన గొయ్యి

చివరగా, తాజా పసుపును ఉడకబెట్టి, ఎండబెట్టి, పాలిష్ చేస్తారు. రాయడానికి ఇది ఒక వాక్యంలో సరిపోయినా, వ్యవసాయంలో ఇది చాలా రోజుల పాటు భారీ నైపుణ్యంతో చేయవలసిన పని, దీనికి అదనంగా మరో రూ. 65,000 ఉత్పత్తి ఖర్చు. ఈ ఖర్చుల పట్టిక పెరుగుతూనే ఉండగా, పసుపు బరువు దాదాపు సగానికి తగ్గుతుంది.

పది నెలలు గడిచి, 2,38,000 రూపాయలు ఖర్చుపెట్టాక , అతని వద్ద దాదాపు 2,000 కిలోల ఎండిన పసుపు (ఎకరం పంట) అమ్మకానికి ఉంది. దీనిలో ఉత్పత్తి ఖర్చు కిలో 119 రూపాయలు. (కొడుమూడికి చెందిన కె.ఎన్. సెల్లముత్తు వంటి ఇతర రైతులు కూడా సేంద్రీయ సాగులో, తక్కువ సమయం, ఎక్కువ నైపుణ్యంతో కూడిన పద్ధతులతో అధిక దిగుబడి రకాలను పండించడం ద్వారా, వారి ఉత్పత్తి ఖర్చు కిలో రూ. 80 వరకు మాత్రమే ఉంటుందని అంచనా వేశారు).

తిరు తన పసుపు పొడి ధరను వ్యూహాత్మకంగా రచిస్తాడు. అతను కిలోపొడికి రూ. 40 ఖర్చుపెడతాడు, ప్యాకేజింగ్, కొరియర్ ఛార్జీలకు మరో 40 ఖర్చవుతాయి.

పెద్దమొత్తంలో అంటే 20 కిలోలు వరకు కొనే దుకాణాల్లో కిలో 300 రూపాయలకే లభిస్తోంది. పొలం వద్ద, ఇది 400 రూపాయలకు వెళుతుంది, అదే భారతదేశంలో రవాణా చేయవలసి వస్తే దాని ఖరీదు 500 రూపాయిలు అవుతుంది. ఇతర బ్రాండ్‌లు తమ ఆర్గానిక్ మంజల్‌ ను కిలో రూ. 375 నుండి కిలో రూ. 1,000 వరకు అమ్ముతాయి. ఈరోడ్ మండి లో, ఒక కిలో ఎండిన పసుపును - పొడి చేసినప్పుడు 950 గ్రాములు అవుతుంది - వ్యాపారులు దానిని రూ. 70 తీసుకుంటారు. లేదా దీనికి మూడు రెట్లు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు.

*****

"కొడవలి, తుపాకీ లేదా లాఠీ లేకుండా, కార్పొరేట్లు రైతులను ఓడించారు."
పి.కె. దేవశిగమణి, భారత పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు

"నేను ప్రయత్నించాను, పోరాడాను, కానీ పసుపుకు సరైన ధరను నిర్ణయించలేకపోయాను" అని TFAI ప్రెసిడెంట్ దైవసిగమణి చెప్పారు. ఒక వర్షం కురుస్తున్న అక్టోబరు సాయంత్రం ఈరోడ్ సమీపంలోని అతని ఇంట్లో, PARI అతనిని కలిసింది. “ప్రభుత్వాలు కార్పొరేట్ల వైపు పయనిస్తున్నాయి, కార్పొరేట్లు ప్రభుత్వాలను తయారు చేస్తున్నాయి. అది మారనంత వరకు రైతులకు - చిన్న రైతులు, పసుపు రైతులనే కాదు - అందరు రైతులకు భవిష్యత్తు లేదు... అమెరికాలోనూ అంతే. వ్యవసాయం లాభసాటి ఉపాధి కాదు. అదే విషయాన్ని వాళ్ళు అక్కడ ఇంగ్లీషులో చెప్తారు, ఇక్కడ మనం తమిళంలో చెబుతాం,” అని ఆయన అన్నారు .

Inside the storage yard of the Perundurai regulated market.
PHOTO • M. Palani Kumar
Buyers at the auction inspect the turmeric lots
PHOTO • M. Palani Kumar

ఎడమ: యార్డు లోపల పెరుందురై నియంత్రిత మార్కెట్ నిల్వ. కుడి: వేలం వద్ద కొనుగోలుదారులు పసుపు కుప్పలను తనిఖీ చేస్తారు

“భూస్వామ్య వ్యవస్థ స్థానంలో కార్పొరేట్లు వచ్చాయి, వారే కొత్త పెద్ద భూస్వాములుగా మారారు. వారికున్న స్థాయి, పరిమాణంతో, వారు వందల టన్నులను ప్రాసెస్ చేయగలరు. కొన్ని టన్నులు మాత్రమే ఉన్న చిన్న రైతు వారి ధరతో ఎలా పోటీపడగలుగుతాడు?”

ఈరోడ్ సమీపంలోని పెరుందురై రెగ్యులేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్‌లో, రోజువారీ వేలం పసుపు రైతుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పసుపుతో మాత్రమే పనిచేసే ఈ మార్కెట్, అనేక స్టాకింగ్ యార్డులను కలిగి ఉంది - ఇది పదివేల బస్తాలను నిల్వ చేయగలదు - అదే గాక దీనికొక వేలం షెడ్ కూడా ఉంది. అక్టోబర్ 11న, PARI వేలానికి హాజరైనప్పుడు, క్వింటాల్ పసుపు వేళ్ళ‘టాప్ రేటు’ రూ. 7,449, దుంప పసుపుకు రూ. 6,669 పలికింది. వ్యాపారులు ఎప్పుడూ ధరను '9' అంకెతో ముగిస్తారు. అంకెశాస్త్రం(Numerology)పై వారికి ఉన్న నమ్మకమే అందుకు కారణమని మార్కెట్ సూపర్‌వైజర్ అరవింద్ పళనిసామి వివరించారు.

50 లాట్ల పసుపు నమూనాలు ప్లాస్టిక్ ట్రేలలో ప్రదర్శిస్తారు. వ్యాపారులు ప్రతి ట్రేని జల్లెడ పట్టి, నేలపై నమూనాలను పగలగొట్టి, వాసన చూస్తారు! చేతిలో బరువును చూసి, వేళ్ల మధ్య నుండి అవి జారిపడేలా చేస్తారు. వారి గమనికలు రాసుకుంటారు. ఆ తరవాత వారు వేలానికి వస్తారు. ఒక ప్రధాన మసాలా కంపెనీ కొనుగోలు విభాగానికి చెందిన సి. ఆనందకుమార్, తాను "ఫస్ట్ క్వాలిటీ" మాత్రమే తీసుకుంటానని వివరించాడు. ఈరోజు, అతను ఈ నమూనాలో ఉన్న 459 సంచులలో 23 సంచులని తీసుకున్నాడు.

మార్కెట్ వార్షిక టర్నోవర్ రూ. 40 కోట్లు, అని అరవింద్ మండి పక్కనే ఉన్న తన ఆఫీసులో కూర్చుని, నాకు చెప్పాడు. కొడుమూడికి చెందిన ఎల్.రసీనా షెడ్డుకు వెళ్లే సిమెంట్ మెట్లపై కూర్చుంది. ఆమెకు కేవలం క్వింటాలు రూ.5,489 ధర పలికింది. ఆమె 30 క్వింటాళ్లను వెంట తెచ్చుకుంది.

సొంతంగా నిల్వ సౌకర్యం లేకపోవడంతో, ఆమె తన పంటను ప్రభుత్వ గోడౌన్‌కు తీసుకువస్తుంది, అక్కడ నిల్వ చేయడానికి రోజుకు క్వింటాల్‌కు 20 పైసలు ఖర్చు అవుతుంది. కొంత మంది రైతులు గిట్టుబాటు ధర కోసం నాలుగేళ్లగా ఎదురు చూస్తున్నారు. ఏడు నెలల్లో,  ఐదు సార్లు తిరిగిన తర్వాత, ఇక రసీనా తన పసుపును నష్టానికే అమ్మేయడానికి నిర్ణయించుకుంది.

కొంగు బెల్ట్‌లోని - ఈరోడ్, కోయంబత్తూర్, సేలం జిల్లాలతో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని అదనపు వృత్తిగా పరిగణిస్తారు, అని దైవసిగమణి చెప్పారు. "వారు దాని పైన మాత్రమే ఆధారపడినట్లయితే, చాలా కష్టపడవలసి  వస్తుంది."

P.K. Deivasigamani, president of the turmeric farmers' association.
PHOTO • M. Palani Kumar
Labels on the samples exhibited at the turmeric auction
PHOTO • M. Palani Kumar
Labels on the samples exhibited at the turmeric auction
PHOTO • M. Palani Kumar

ఎడమ: పి.కె. పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవసిగమణి. మధ్యవైపు, కుడివైపు: పసుపు వేలంలో ప్రదర్శించబడిన నమూనాలపై లేబుల్‌లు

తమిళనాడులో ధరను బట్టి పసుపును పండించే రైతులు 25,000 నుండి 50,000 వరకు ఉంటారని ఆయన అంచనా. ఒక్క క్వింటాల్‌ రూ. 17,000 కు విక్రయిస్తే (ఒకప్పుడు ఉన్నట్లుగా), "5 కోట్ల పసుపు రైతులు ఉంటారు," అతను నవ్వాడు. "ఒకవేళ అది క్వింటాల్‌కు 5,000కి పడిపోతే, కేవలం 10,000 మంది రైతులు మాత్రమే ఉంటారు."

దైవసిగమణికి ఒక సూచన చేశారు: వైవిధ్యపరచడం. "ఇంత భారీ పరిమాణంలో పసుపును పెంచడం ఆపాలి" అని ఆయన చెప్పారు. "తక్కువ ఉత్పత్తి ఉంటే, మంచి ధర పొందవచ్చు."

*****

"పెద్ద దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్‌లకు బదులు - స్థానిక రకాలకు వెళ్లండి."
తిరు మూర్తి, ఈరోడ్‌లోని పసుపు రైతు

గత సంవత్సరం మార్చిలో, అతను తన రెండు టన్నుల పంటను పండించాడు - ఒక గోధుమ రంగు కొండ వాడిపోతున్న పసుపు ఆకులతో కప్పబడిపోయి, తనను ఉడకబెట్టి ఆరబెట్టే బృందం కోసం వేచి ఉంది. తిరు ఆధునికతకు విముఖత చూపలేదు: అతను సౌర శక్తిని ఉపయోగిస్తాడు, దానిని సమర్థిస్తాడు. అతను వారసత్వ రకాలను కూడా నమ్ముతాడు. ' ఈరోడ్ లోకల్ ' రకం పసుపుకు జియోగ్రాఫిక్  ఇండికేషన్ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాడు.

దిగుబడుల గురించి మాత్రమే చింతిస్తున్న పరిశోధనా సంస్థలను ఆయన విమర్శించారు. పెద్ద పంటపై దృష్టి కేంద్రీకరించడం వల్ల రసాయన ఎరువులపై ఖర్చు పెరుగుతుంది. "మా ఉత్పత్తులను సరసమైన ధరకు విక్రయించడానికి ప్రభుత్వం మాకు ఎందుకు సహాయం చేయదు?" విధాన నిర్ణేతలకు ప్రత్యక్ష జ్ఞానం అవసరం, అని అతను వాదించాడు. అతని భార్య, వ్యాపార భాగస్వామి గోమతి కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుంది. "వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థులను మా పొలంలో పని చేయనివ్వండి" అని వారిద్దరూ సూచించారు. "వాస్తవ ప్రపంచ సమస్యలను వారు అర్థం చేసుకోలేకపోతే, వారు హైబ్రిడ్లను కనిపెట్టే పని మాత్రమే చేస్తారు." వారి ఆవేశాన్ని అర్థం చేసుకోగలం. కంటికి పెద్దగా కనిపిస్తూ మెరిసే రకం హైబ్రిడ్‌లు క్వింటాల్‌కు రూ. 200 ధర పలుకుతాయి - కానీ వీటిని చాలా రసాయనాలు వాడి పెంచుతారు.

అతను వ్యవసాయం ప్రారంభించినప్పుడు, డబ్బు రావడం చాలా కష్టంగా ఉండేది. పసుపు వంటి వార్షిక పంటలపై రాబడి మరుసటి ఏడాదికి పెరుగుతుంది. తిరుకు బ్యాంకులో రుణం లభించదు; చనిపోయిన అతని తండ్రి, తిరుని పూచీకత్తుగా పెట్టి భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. అతను ఇప్పటికీ ఆ రూ. 14 లక్షలు చెల్లిస్తూనే ఉన్నాడు. దీన్ని చెల్లించడానికి, అతను అనధికారిక మూలం నుండి, " రెండు రూపా వట్టి " అప్పుగా తీసుకున్నాడు (వందకు రెండు రూపాయల వడ్డీ - నెలకు). లేదా ఏటా 24 శాతం.

The harvested turmeric is covered with dried leaves, waiting to be boiled, dried and polished.
PHOTO • Aparna Karthikeyan
Thiru uses solar power and champions it
PHOTO • M. Palani Kumar

ఎడమ: ఉడకబెట్టడం, ఎండబెట్టడం, పాలిష్ చేయడం కోసం ఎండిన ఆకులతో కప్పబడిన  పసుపు పంట, . కుడి: తిరు సౌర శక్తిని ఉపయోగిస్తాడు, దానిని బాగా వాడుకోవడం వచ్చు

“కొందరు ఫేస్‌బుక్ స్నేహితులు కూడా నాకు వడ్డీ లేకుండా ఆరు నెలల పాటు డబ్బు అప్పుగా ఇచ్చారు. కాబట్టి, నేను ఇకపై రుణం తీసుకోవలసిన అవసరం లేదు. నేను నా స్నేహితులకు తిరిగి చెల్లించాను. కానీ నేను ఇప్పటికీ మా నాన్నగారి బ్యాంకు రుణాన్ని చెల్లిస్తునే ఉన్నాను.” అతను ఇప్పుడు నెలకు రూ. 50,000 సంపాదిస్తాడు, దీని కోసం ముగ్గురు పెద్దలు (తిరు, అతని తల్లి, గోమతి) రోజుకు 12 గంటల వరకు పని చేస్తారు - కాని వారి శ్రమను ఖర్చులో భాగంగా చూడరు.

మంజల్ పొడి చేసే గదిలో, తిరు కొన్ని దుంపలను చేతిలోకి తీసుకున్నాడు. అవి ప్రకాశవంతమైన నారింజ-పసుపు రంగులో రాతిలాగా గట్టిగా ఉన్నాయి. గ్రైండింగ్ మెషీన్‌లో వేసే ముందు వాటిని చేతి గ్రానైట్ రోకలితో, చాలా కష్టంగా అనిపించినా బద్దలుకొట్టాలి. లేకపోతే, అవి గ్రైండర్ మెటల్ బ్లేడ్‌ను విరగగొడతాయి.

గదిలోకి రాగానే ఒక్కసారిగా వచ్చే, తాజాగా రుబ్బిన పసుపు ఆహ్లాదకరమైన వాసన హాయినిస్తుంది. ఈ బంగారపు పొట్టు ప్రతివస్తువు పైనా పడుతుంది: ఎలక్ట్రిక్ గ్రౌండింగ్ మిల్లు, స్విచ్ బోర్డ్; సాలెపురుగులు కూడా పసుపు దుమ్ముతో కూడిన చిన్నచిన్న హారాలు ధరిస్తాయి.

పెద్ద వృత్తంలో మరుధని (గోరింటాకు), దాని చుట్టూ చిన్న చుక్కలు, తిరు నారింజ రంగు అరచేతిలో ఉంటాయి. అతని ముంజేతులు కఠినమైన, శారీరక శ్రమతో కూడిన అతని కథను తెలియజేస్తాయి. తన పంటకు విలువను జోడించడానికి అతని చేసిన అసాధారణ ప్రయత్నాలు, విఫలమైన కొన్ని ఖరీదైన ప్రయోగాలు మనకు కనిపించవు. పోయిన ఏడాది అల్లం పంట వలన ఇలాగే నష్టపోయాడు. కానీ అతను కోల్పోయిన 40,000 రూపాయిలను అతను "ఒక పాఠం "గా చూస్తాడు. గోమతి మాకు వేడి వేడి బజ్జీలు, టీలు చేస్తున్నప్పుడు అతను నాకు ఈ నష్టాన్ని గురించి చెప్పాడు.

*****

“పసుపు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈరోడ్ జిల్లా భవానీసాగర్‌లో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో పసుపు కోసం కొత్త పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది.”
ఎం.ఆర్.కె. పనీర్‌సెల్వం, వ్యవసాయ శాఖ మంత్రి, తమిళనాడు

భారతదేశం తన అత్యుత్తమ నాణ్యత గల పసుపును రూ. రూ. 93.5 కిలో కి ఎగుమతి చేసి, మరల 86 రూపాయలకు దిగుమతి చేస్తే రైతు ఎలా విజయవంతమవుతాడు? ఈ దిగుమతి నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నదాని కంటే రెండింతలు పెరిగింది. ఈ  7-రూపాయల వ్యత్యాసం భారతీయ రైతును కుంగదీయడమే కాదు, వేగంగా పెరిగే ఈ దిగుమతుల పరంపర, భవిష్యత్తులో సరసమైన ధరకు ఉన్న హామీని తొలగిస్తుంది.

A small batch of turmeric waiting to be cleaned
PHOTO • M. Palani Kumar
Thiru Murthy and T. Gomathy with their electric grinding mill
PHOTO • M. Palani Kumar

ఎడమ: శుభ్రం చేయడానికి వేచి ఉన్న పసుపు వాయి. కుడి: వారి ఎలక్ట్రిక్ గ్రైండింగ్ మిల్లుతో తిరు మూర్తి, టి. గోమతి

తమిళనాడు ప్రభుత్వం దీనిని అధికారికంగా అంగీకరించింది : భారతదేశం పసుపును అత్యధికంగా ఉత్పత్తి చేస్తుండగానే, " కర్కుమిన్ అధికంగా ఉన్న రకాలు కావాలంటూ" ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుందని వ్యవసాయ మంత్రి పనీర్‌సెల్వం చెప్పారు.

గత ఆగస్టులో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, పసుపు కోసం కొత్త పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని పన్నీర్‌సెల్వం ప్రకటించారు , దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు నియమించింది. "రైతులు తమ సాగును మరో పంటకు మార్చకుండా ఉండేందుకు" మెరుగైన రకాలు, విలువ జోడింపు, ప్రయోగాత్మక శిక్షణను అందిస్తామని రాష్ట్రం సమర్థవంతంగా హామీ ఇచ్చింది.

తిరు మూర్తి సరళమైన తత్వాన్ని అలవరచుకున్నాడు: కస్టమర్‌కు గొప్ప ఉత్పత్తిని అందించండి. “నా ఉత్పత్తి బాగుంటే, 300 మంది కొనుగోలు చేస్తారు, మరో 3,000 మందికి చెబుతారు. కానీ అది నాసిరకం వస్తువు అయితే, అదే 300 మంది మరో 30,000 మందికి  అది చెడ్డదని చెబుతారు. సోషల్ మీడియాను, మౌత్ పబ్లిసిటీని ఉపయోగించి - అతను 3-టన్నుల మంజాల్ పంటను 10 నెలల్లో విక్రయిస్తాడు, అంటే నెలకు సగటున 300 కిలోలు. ఇవేగాక అతను కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాడు. ఒకటి, ఆర్గానిక్ పసుపుకు హోల్‌సేల్ మార్కెట్‌లో ప్రాధాన్యతనిచ్చి చెల్లించడం లేదు. రెండవది, ఒక రైతు నేరుగా అమ్మితే తప్ప, అతను లేదా ఆమె, తమ ఉత్పత్తికి మంచి ధరను అందుకోలేరు.

తిరు పసుపును రెండు పద్దతులలో ప్రాసెస్ చేస్తాడు. ఒకటి దానిని ఉడకబెట్టడం, ఎండబెట్టడం, పొడి చేయడం- ఇది సాంప్రదాయ పద్ధతి. అతను నాకు ల్యాబ్ ఫలితాలను చూపిస్తాడు - ఈ పద్ధతిలో కర్కుమిన్ 3.6 శాతం వస్తుంది. రెండవ పద్ధతి అసాధారణమైనది, ఇక్కడ దానిని ముక్కలుగా చేసి, ఎండలో ఎండబెట్టి పొడి చేస్తారు. ఇది కర్కుమిన్‌ను 8.6 శాతంగా నమోదు చేస్తుంది. అతను అధిక కర్కుమిన్ కంటెంట్ కోసం పడే గొడవ అర్థంలేనిదని చెబుతున్నాడు. "ఇది ఫార్మా పరిశ్రమ కోసం అయితే, అర్థవంతమైనదే," అని అతను వాదించాడు. “కాని ఆహారానికి ఈ అధిక శాతంతో పనేమిటి?”

పంట కోసిన వెంటనే తాజా పసుపును కూడా అతను అమ్ముతాడు. దీని ధర రూ. కిలో 40 రూపాయలు (ప్యాకేజింగ్, తపాలాతో 70 రూపాయిలు). ఇది కాకుండా, అతను, గోమతి ప్రతి నెలా 3,000 సబ్బుల కేక్‌లను తయారుచేస్తారు. వారు అనేక మూలికలను సంపాదించి, వాటిని జల్లెడ పట్టి, తొమ్మిది రకాల సబ్బులను తయారు చేస్తారు. ఇందులో రెండు రకాల పసుపు, కలబంద, వట్టివేరు, కుప్పమేని , అరపు , శీకాయ, వేప ఉన్నాయి.

అతని భార్య అతనిని ఆటపట్టిస్తుంది: "పదార్ధాల జాబితాను ఇవ్వవద్దని అందరూ అంటారు, కానీ అతను పద్దతితో సహా ప్రతిదీ చెప్పేస్తాడు." తిరు ఫేస్‌బుక్‌లో పసుపు హెయిర్ డై తయారు చేసే విధానాన్ని కూడా పోస్ట్ చేశారు. అతను ప్రక్రియను బయటపెట్టడం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. "మిగిలిన వారిని కూడా  ప్రయత్నించనివ్వండి, లేదంటే ప్రారంభ ఉత్సాహం చప్పబడిపోతుంది. దీనిని కొనసాగించడం కష్టం!" అని అతను అన్నాడు.

*****

“ఒక రైతు ఎప్పుడూ  తన ఉత్తమ ఉత్పత్తులను తినడు. అమ్మబడనిదే వాడతాడు. మా ఉత్పత్తులతోనూ ఇలాగే జరుగుతుంది. మేము చితికిపోయిన అరటిపండ్లను తింటాము; విరిగిన సబ్బులను వాడతాము..."
టి.గోమతి, ఈరోడ్‌లోని పసుపు రైతు

Thiru and Gomathy with their children in the workshop, behind their living room.
PHOTO • M. Palani Kumar
Gomathy and her daughter shelving soaps in the workshop
PHOTO • M. Palani Kumar

ఎడమ: వారి గది వెనుక ఉన్న వర్క్‌షాప్‌లో పిల్లలతో కలిసి ఉన్న తిరు, గోమతి. కుడి: గోమతి, ఆమె కుమార్తె వర్క్‌షాప్‌లో సబ్బులను సర్దుతున్నారు

తిరు మూర్తి, గోమతి 2011లో పెద్దవారు నిశ్చయించిన వివాహం చేసుకున్నారు. అతను అప్పటికే సేంద్రీయ రైతు - విలువ జోడింపు గురించి కూడా అప్పటికి ఇంకా తెలియదు. 2013లో ఫేస్‌బుక్‌లోకి ప్రవేశించాడు. ఒకసారి అతను పెట్టిన పోస్టు,  సోషల్ మీడియా సామర్ధ్యాన్ని, గ్రామీణ-పట్టణ జీవనంలో లోపించిన సంబంధాలని ఇలా మరెన్నో విషయాలను గురించి ఆలోచించేలా చేసింది.

ఈ ఆలోచనలను ప్రేరేపించినది, అతని అల్పాహారం ఫోటో. అతను చాలా మామూలు ఆహారంగా చూసే- రాగి కలి (రాగి ముద్ద)ను ప్రజలు మెచ్చుకున్నారు అతనికి వచ్చిన లైక్‌లు, వ్యాఖ్యలను చూసి ఉత్సాహపడ్డాడు. ఇక అతను పొలంలో వివరాలను క్రమం తప్పకుండా పోస్ట్ చేయడం ప్రారంభించాడు. ప్రతిదీ ఆన్‌లైన్‌లో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు: కలుపు మొక్కలను తొలగించడం, సేంద్రీయ ఎరువులు వేయడం, మొదలైనవి.

అతను తన మొదటి పసుపు పంటను పండించినప్పుడు, అతను దానిని ఆన్‌లైన్‌లో విక్రయించాడు. గోమతి వెంటనే అతని పనిని పంచుకోవడం ప్రారంభించింది. "వాట్సాప్‌లో నా ఫోన్‌కు సబ్బులు, నూనెలు, పౌడర్‌ల కోసం ఆర్డర్‌లు వస్తాయి. నేను ఆ వివరాలు ఆమెకు పంపుతాను." ఇంటి పనిని,  వారి పదేళ్ల కొడుకు నీతులన్,  నాలుగేళ్ల కూతురు నిగజిని చూసుకుంటూనే, గోమతి మొత్తం ప్యాకింగ్, షిప్పింగ్‌ విభాగాన్ని నిర్వహిస్తుంది.

కోవిడ్ లాక్‌డౌన్‌లు, ఆమె కొడుకు కోసం ఆన్‌లైన్ తరగతులు జీవితాన్ని కష్టతరం చేశాయి. మేము ఒకసారి వెళ్లినప్పుడు  పిల్లలు గాజు సీసాలలో ఉన్న కప్పలతో ఆడుతుండగా, వారి కుక్క వాటిని ఆసక్తిగా చూస్తోంది. మరొక సారి, వారు ఒక ఉక్కు పైపు పైకి ఎక్కుతున్నారు. "ఇలా స్థంబాలు ఎక్కడమే, వారి నేర్చుకున్నది," అని నిట్టూర్చింది గోమతి.

ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ ఒకామె, గోమతికి సహాయకురారిగా పనిచేస్తుంది.“మా కేటలాగ్ లో ఉన్న 22 ఉత్పత్తులలో మా కస్టమర్‌లు ఏ వస్తువునైనా అడగవచ్చు. కాని ఇది సులభం కాదు, ”అని గోమతి చెప్పింది. ఆమె ఇంటిని నడుపుతుంది; ఈ పనిని ముందుకు తీసుకెళుతుంది. ఆమె మాట్లాడే దానికన్నా ఎక్కువగా నవ్వుతుంది.

తిరు రోజంతా, కనీసం 10 మంది వినియోగదారులకు,  స్థానిక మార్కెట్‌లో సాధారణంగా లభించే ధర కంటే తన పసుపు పొడిని రెట్టింపు ధరకు ఎందుకు విక్రయిస్తాడో వివరించి ఒప్పించడానికి సరిపోతుంది. "సేంద్రీయ వ్యవసాయం, కల్తీ పురుగుమందుల ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి నేను రోజుకు కనీసం రెండు గంటలు పనిచేస్తాను," అని అన్నాడు. అతను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు - అక్కడ అతనికి 30,000 మంది ఫాలోవర్లు ఉన్నారు - దాదాపు 1,000 మంది దానిని 'లైక్' చేస్తారు, మరో 200 మంది వ్యక్తులు కామెంట్ చేస్తారు. వారు ప్రశ్నలు అడుగుతారు. "నేను వారికి సమాధానం చెప్పకపోతే, నేను వారి దృష్టిలో 'నకిలీ రైతును' అవుతాను." అన్నాడు తిరు.

Weighed and packed turmeric powder, which Thiru sells directly through social media.
PHOTO • M. Palani Kumar
Soaps and bottles of hair oil, ready to be sold
PHOTO • M. Palani Kumar
Soaps and bottles of hair oil, ready to be sold
PHOTO • M. Palani Kumar

ఎడమవైపు: తూకం వేసి ప్యాక్ చేసిన పసుపు పొడి, దీనిని తిరు నేరుగా సోషల్ మీడియా ద్వారా విక్రయిస్తాడు. మధ్యవైపు, కుడివైపు: విక్రయించడానికి సిద్ధంగా ఉన్న సబ్బులు, తలా నూనె సీసాలు

పొలంలో అతని పని, అతని ఇ-బిజినెస్ ("గత నెల వరకు దీనిని ఇ-బిజినెస్ అని పిలుస్తారని నాకు తెలియదు!") చాలా హడావిడిగా ఉంది, అతను సెలవుపై ఎక్కడికైనా వెళ్లి ఐదు సంవత్సరాలు అయ్యింది. "ఇంకా ఎక్కువ కాలమే అయి ఉండవచ్చు," అని గోమతి నవ్వింది. "అతను ఆరు గంటల కన్నా ఎక్కువ సమయం బయట ఉండడం సాధ్యం కాదు, ఇంటికి తిరిగి రావాలి, తన ఆవులు, పంట, గానుగ ఇవన్నీ చూసుకోవాలి.”

బంధువుల ఇళ్లలో కార్యాలకు, అతని తల్లి హాజరవుతుంది, అతని అన్నయ్య తన  కారులో ఆమెను తీసుకు వెళతాడు. తిరు హాజరు కావడానికి వీలు అవదు. "COVID-19 తర్వాత, మేము కొంత డబ్బు ఆదా చేశాము," అని అతను చమత్కారంగా అన్నాడు. “సాధారణంగా, మేము ఫంక్షన్ల కోసం కోయంబత్తూర్ వరకు డ్రైవ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మేము ఆ 1,000 రూపాయల ఇంధనాన్ని ఆదా చేస్తున్నాము. ఫంక్షన్‌లు జరగడం లేదు కదా.” అని నవ్వాడు.

కూలీలు పొలానికి వచ్చినప్పుడు, “అమ్మ వారితో పనిచేయిస్తుంది. ఈ పైపై పనిలోనే నా సమయం గడిచిపోతుంది.” నేను వచ్చిన రెండుసార్లు,  గోమతి కిచెన్‌లో లేదా వారి వర్క్‌షాప్‌లో హడావిడిగా ఉంది. ఈ వర్క్ షాప్ వారున్న గది వెనుక,  ఎత్తైన పైకప్పుతో విశాలమైన స్థలంలో ఉంది.  అనేక రకాల సబ్బులతో నిండిన అలమరలు, తేదీల ప్రకారం చక్కగా లేబుల్ చేయబడ్డాయి. తిరు, గోమతి ఉదయం 5:30 నుండి మొదలుపెట్టి, రోజుకు కనీసం 12 గంటల పాటు పని చేస్తారు.

వారికి మూలికలు, వాటి లక్షణాల గురించి లోతైన జ్ఞానం ఉంది. ఆ పేర్లను తమిళంలో అనర్గళంగా చెబుతారు. గోమతి సువాసనగల జుట్టు నూనెలను కూడా తయారు చేస్తుంది, గానుగ కొబ్బరి నూనెలో పువ్వులను, మూలికలను నానబెట్టి, ఎండలో వేడి చేస్తుంది. " ప్రతి ఉత్పత్తిని కస్టమర్‌లకు పంపే ముందు పరీక్షిస్తాము" అని ఆమె నాకు చెప్పింది.

ప్రస్తుతం కుటుంబం మొత్తం ఈ వ్యాపారంలో పాల్గొంటున్నదని తిరు చెప్పారు. ఇది వారి ఉత్పత్తుల ధరను తగ్గించడానికి వారు చెల్లించే శ్రమ. ఈ శ్రమకు వారు డబ్బు తీసుకోరు కాబట్టి, దీనిని వారు వ్యయంగా లెక్కించరు.

*****

“అమూల్ పాల ఉత్పత్తిదారులు వినియోగదారుల కొనుగోలు ధరలో 80 శాతానికి దగ్గరగా లాభాన్ని చూస్తారు. ప్రపంచంలో ఆ మోడల్‌కు సమానమైనది మరొకటి లేదు.”
బాలసుబ్రమణ్యం ముత్తుసామి, కాలమిస్ట్

Thiru spends at least two hours a day educating others about organic farming.
PHOTO • Aparna Karthikeyan
Gomathy and Thiru with an award they received for organic farming
PHOTO • Aparna Karthikeyan

భూమిని లీజుకు తీసుకున్న లేదా కొద్దిగానే భూమి ఉన్న (సాధారణంగా రెండు ఎకరాలలోపు) సగటు చిన్న రైతుకు తిరు నమూనాను అనుసరించడం కష్టంగా ఉంటుంది. అతనిలా వారు అంతటి విజయాన్ని సాధించే  అవకాశం లేదు. ఈరోడ్ జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన, ఆన్‌లైన్ తమిళ వార్తా ప్లాట్‌ఫారమ్ అరుంచోల్‌లో కాలమిస్ట్ అయిన బాలసుబ్రమణ్యం ముత్తుసామి, సహకార నమూనా మాత్రమే ఇటువంటి సమస్యకు ఆచరణీయమైన పరిష్కారమని నమ్ముతారు.

రైతుకు చివరగా అందే ధర, ఉత్పత్తికి అంతిమ వినియోగదారుడు చెల్లించే ధరలో శాతంగా ఈయన చూస్తారు. ఇందులో పాల ఉత్పత్తులకు అధిక లాభం ఉంటుంది. కో-ఆప్ మోడల్ కూడా అలాగే ఉంటుందని చెబుతూ ఆయన అమూల్ నమూనాను ఉటంకించారు. వినియోగదారుడు కిలోకు రూ. 240 చెల్లిస్తే, అందులో పసుపు రైతులకు 29 శాతం అందుతుంది. అదే అమూల్ పాల నమూనాలో,  దాదాపు 80 శాతం రైతుకు అందుతుందని ఆయన చెప్పారు.

రైతులను పెద్ద ఎత్తున నిర్వహించడమే విజయానికి కీలకమని బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. "వ్యాపార సరఫరా గొలుసును స్వంతం చేసుకోవడం, మధ్యవర్తులను తొలగించడం” వలన లాభాలు చేకూరుతాయని చెప్పారు. సహకార సంఘాలు, రైతు సంఘాలలో సమస్యలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. "వారిని మెరుగ్గా నిర్వహించగలగాలి, దానివల్లనే ముందుకు సాగగలుగుతాం." అని అన్నారు.

పసుపును పండించడం ద్వారా మంచి లాభం పొందడం సాధ్యమవుతుంది  కానీ దానికి విలువను జోడించాలని తిరు నొక్కిచెప్పాడు. గత ఏడు సంవత్సరాలలో, అతను 4,300 కిలోల పసుపు పొడిని, కొబ్బరి నూనె, అరటిపండు పొడి, కుంకుమ్ (పసుపు నుండి), సబ్బులను విక్రయించాడు. తనకు భూమి లేకపోతే ఇదంతా అసాధ్యమని అతను అన్నాడు. (అతని నమూనా చిన్న రైతులచే ఎందుకు పునరావృతం కాలేదో దీని ద్వారా అర్థమవుతుంది.)“పది ఎకరాలకు నాలుగు కోట్లు ఖర్చవుతుంది! దానికి ఎవరు నిధులు ఇస్తారు?" అతని వ్యాపారం మొత్తం ఆన్‌లైన్‌లో ఉంది. అతను GST నంబర్‌ని కలిగి ఉన్నాడు, Gpay, Phone Pe, Paytm, BHIM ఇంకా బ్యాంకు అకౌంట్ ల ద్వారా కొనుగోలుదారుల నుండి డబ్బులు తీసుకుంటాడు.

2020లో, నటుడు కార్తీక్ శివకుమార్ కు చెందిన ఉజవన్ ఫౌండేషన్, ఒక అవార్డుతో పాటు లక్ష రూపాయిల బహుమతిని అతని సేంద్రీయ వ్యవసాయానికి అందించింది. అంతేగాక తిరు ఆ పంటకు విలువను జోడించడం, వినియోగదారునికి నేరుగా విక్రయిస్తున్నందుకు కూడా. కొంగు ప్రాంతానికి చెందిన తమిళ నటుడు సత్యరాజ్‌ ఈ బహుమతిని తిరుకు అందజేశారు.

ప్రతి సంవత్సరం, ప్రతి చిన్న విజయం, తిరును మరింత దృఢంగా చేస్తుంది. అతను ఓడిపోలేడు. "నేను రైతు నుండి 'నష్టం' అనే పదాన్ని వినాలనుకోవడం లేదు," అని తిరు చెప్పాడు, "నేను అందుకోసమే పని చేయాలి."

ఈ కథనాన్ని నివేదించేటప్పుడు అందించిన సహాయాన్ని, ఆతిధ్యాన్ని అందించిన కృషి జనని వ్యవస్థాపకులు, CEO అయిన ఉషాదేవి వెంకటాచలంకి రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

ఈ పరిశోధన అధ్యయనానికి, అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం, దాని పరిశోధన నిధుల కార్యక్రమం 2020లో భాగంగా నిధులు సమకూరుస్తుంది.

ముఖచిత్రం: ఎం. పళని కుమార్

అనువాదం : అపర్ణ తోట

Aparna Karthikeyan

अपर्णा कार्तिकेयन एक स्वतंत्र पत्रकार, लेखक, और पारी की सीनियर फ़ेलो हैं. उनकी नॉन-फिक्शन श्रेणी की किताब 'नाइन रुपीज़ एन आवर', तमिलनाडु में लुप्त होती आजीविकाओं का दस्तावेज़ है. उन्होंने बच्चों के लिए पांच किताबें लिखी हैं. अपर्णा, चेन्नई में परिवार और अपने कुत्तों के साथ रहती हैं.

की अन्य स्टोरी अपर्णा कार्तिकेयन
Photographs : M. Palani Kumar

एम. पलनी कुमार पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया के स्टाफ़ फोटोग्राफर हैं. वह अपनी फ़ोटोग्राफ़ी के माध्यम से मेहनतकश महिलाओं और शोषित समुदायों के जीवन को रेखांकित करने में दिलचस्पी रखते हैं. पलनी को साल 2021 का एम्प्लीफ़ाई ग्रांट और 2020 का सम्यक दृष्टि तथा फ़ोटो साउथ एशिया ग्रांट मिल चुका है. साल 2022 में उन्हें पहले दयानिता सिंह-पारी डॉक्यूमेंट्री फ़ोटोग्राफी पुरस्कार से नवाज़ा गया था. पलनी फ़िल्म-निर्माता दिव्य भारती की तमिल डॉक्यूमेंट्री ‘ककूस (शौचालय)' के सिनेमेटोग्राफ़र भी थे. यह डॉक्यूमेंट्री तमिलनाडु में हाथ से मैला साफ़ करने की प्रथा को उजागर करने के उद्देश्य से बनाई गई थी.

की अन्य स्टोरी M. Palani Kumar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

की अन्य स्टोरी Aparna Thota